డా. దేవరాజు మహారాజు
ఎం.కె. ఇందిర ఓ మామూలు గృహిణి. గ్రామీణ మహిళల సాధక బాధకాలు తెలిసిన మహిళ. ఈ అనుభవమే ఆమెను ఓ రచయిత్రిగా మలచింది.
అసలు ఆమె రచయిత్రి అవుతుందని ఎవరూ అనుకోలేదు. నలభై ఐదేళ్ల వయసు వరకు ఆమె రచనలు చేయలేదు. ఆ తరువాత కాలంలోనే తాను గమనించిన గ్రామీణ మహిళల జీవితాలతో ఆమె ‘తుంగభద్ర’ నవల అపుర్వ విజయాన్ని చవి చూసింది. 1963లో రాష్ట్ర సాహిత్య అవాడెమీ పురస్కారానికి ఎంపికైంది. అంతేకాదు, 1964-76 మధ్య కాలంలో ఈ రచయిత్రి నాలుగుసార్లు కర్నాటక సాహిత్య అకాడమీ అవార్డుల్ని గెలుచుకున్నారు. ఒక రకంగా ఇదొక రికార్డు. ‘తుంగభద్ర’, ‘ఫణియమ్మ’, ‘సదానంద’, ‘నవరత్న’ అనే శీర్షికలతో వెలువడ్డ నవలలకు ఈ అవార్డులు లభించాయి. నిరాఘాటంగా నలభై ఏళ్ళ పాటు రచనలు చేసిన ఈ రచయిత్రి ఇతర సాహిత్య ప్రక్రియలపై దృష్టి సారించలేదు.
ఇందిర సృష్టించిన ‘ఫణియమ్మ’ పాత్ర ఎంత ప్రాచుర్యం పొందిందంటే, రచయిత్రి పేరును అడుగున పడేసి అది మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఫణియమ్మ పాత్ర పూర్తిగా కల్పన కాదు, పూర్తిగా వాస్తవమూ కాదు. రచయిత్రి బంధువు ఒకావిడ ఆ పాత్రకు మూలం! ఆమె బాల్యంలోనే వైధవ్యం పొందింది. సమాజపు కట్టుబాట్లకు లొంగుతూనే, విభేదిస్తూ జీవించింది. శుద్ధ ఛాందసంలో పుట్టి పెరిగిన ఆ విధవరాలి జీవితకాల పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఓ విన్నూత పాత్రను సృష్టించారు రచయిత్రి ఇందిర. అదే కన్నడ సాహిత్య రంగంలో వేళ్లూనుకుని నిలిచిన పాత్ర- ‘ఫణియమ్మ’. కొంత చరిత్ర, కొంత సృజనల మేలు కలయికే ఈ పాత్ర. కన్నడ సమాంతర సినిమా దర్శకురాలు ప్రేమా కారంత్ దర్శకత్వంలో ‘ఫణియమ్మ’ నవల చలనచిత్రంగా కూడా రూపొందింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అవార్డులు అందుకుంది. 1976లో ఈ రచయిత్రి ఫణియమ్మ నవలకు కర్నాటక సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు.
‘ఫణియమ్మ’ నవలలాగే ‘గజ్జెపూజ’ అనే నవల కూడా వెండితెర మీద అపూర్వ విజయాన్ని చవిచూసింది. ఇది ఒక వేశ్య జీవిత చరిత్ర. చదువుకుని పెళ్ళి చేసుకుని, మామూలు కుంటుంబ జీవితం గడపాలనుకున్న యువతిపై ఆమె నేపథ్యం, చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులు ఎలా ఒత్తిడి తెస్తాయో, ఆమెను మళ్ళీ వేశ్యా వృత్తిలోకి ఎలా నెడుతాయో చర్చించింది ఈ నవల.
ఫణియమ్మ నవల పందొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలో భారతీయ స్త్రీల పరిస్థితుల్ని చాలా స్పష్టంగా చిత్రించింది. చాదస్తాలతో, సంప్రదాయాల్లో పుట్టి పెరిగినదైన ఫణియమ్మ తన అభ్యుదయ ఆలోచనా ధోరణితో సమాజాన్ని ముందుకు నడిపింది. నవల ముగిసే సమయానికి ఫణియమ్మ పాత్రకు దాదాపు ఎనభై ఏళ్లు దాటుతాయి. ఉపవాసాలు ఉంటూ, కాశీ వంటి పుణ్య తీర్థాలు సందర్శిస్తూ సహాయమడిగిన వారికి కాదనకుండా సహాయపడుతూ ఉంటుంది. అట్టడుగు కులం వారింటికి వెళ్లడమే పెద్ద తప్పుగా భావించబడే రోజుల్లో, ఫణియమ్మ వారిళ్లల్లోకి వెళ్లి, పురుళ్ళు పోస్తుంది. ఒక హిందూ సంప్రదాయ కుటుంబంలోని విధవరాలు అట్టడుగు కులస్తుల ఇంటికి వెళ్ళి, ఒక ముస్లిం మంత్రసానితో కలసి కాన్పు చేయడం ఆ రోజుల్లో ఊహించుకోవడానికే వీలుకాని విషయం. వైద్యశాస్త్రం సామాన్యులకు అందుబాటులోకి రాని రోజుల్లో, విరివిగా ఆసుపత్రులు లేని రోజుల్లో, ఒక వృద్ధ విధవరాలు సమాజం లోని కట్టుబాట్లను పక్కన పెట్టి, ప్రగతిశీల భావాలతో ముందుకు నడవడమన్నది చాలా గొప్ప విషయం. రచయిత్రి ఎం.కె. ఇందిర తన భావజాలాన్ని నూటికి నూరుపాళ్లు ఫణియమ్మ పాత్రలో జొప్పించి రచించిన నవల-‘ఫణియమ్మ’.
రచయిత్రి ఇందిర కర్నాటకలోని తీర్థహళ్లి అనే చిన్న పట్టణంలో 1917లో జన్మించారు. పెళ్లికి ముందు కేవలం ఏడేళ్లు స్కూల్లో చదువుకున్నారు. హైస్కూలు చదువు కూడా పూర్తి చేయని ఒక గృహిణి పట్టుదలతో సాహిత్య శిఖరాల్ని అధిరోహించడమంటే సామాన్య విషయం కాదు. ఈ తరం వారూ రానున్న తరాలవారూ ఈ విషయమై ఇందిర నుంచి స్ఫూర్తి పొందాల్సి ఉంది. టీవిల ముందు కూలబడి గంటల కొద్దీ సమయం వృధా చేసే ఈ తరం జనమంతా తమకై తాము ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకోవడం, తమకు అభిరుచి ఉన్న రంగంలో కృషి చేయడం మంచిది. అందుకు వయసు ఒక అడ్డంకి కానే కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. కన్నడ రచయిత్రి ఎం.కె. ఇందిర జీవితం అందుకు ఒక మంచి ఉదాహరణ.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags