వేములపల్లి సత్యవతి
దుశ్శాసనుల పర్వానికి తెరలేచిన రాత్రి. రాక్షసత్వం పరవళ్లు తొక్కిన రాత్రి. మానవత్వం మంటగలసిన కాళరాత్రి అదే 9 – జులై – 2012 సోమవారం రాత్రి. అసోం రాజధాని గుహవటిలో పదకొండవ తరగతి చదువుతున్న 16 ఏండ్ల మైనర్ బాలిక పుట్టినరోజు వేడుకలో స్నేహితులతో కలసి పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుంది.
దారిలో 20 మంది జులాయి వెధవల కళ్లు ఒంటరిగా వెళుతున్న బాలికపై పడినవి. ఆమెను వెంబడించి వెనుకనుంచి అసభ్యకరమైన బూతులు, కారు కూతలు కూయసాగారు. అవి విని సహించలేక ఆ బాలిక ఎదురు తిరిగింది. అదే ఆ అమ్మాయి పాలిట శాపమయింది. పద్మవ్యూహంలో అభిమన్యుని చుట్టిముట్టినట్లుగా ఆ ఇరవైమంది ముష్కరులు ఆ బాలికను చుట్టుముట్టారు. జుట్టుపట్టి ఈడ్చుకొచ్చారు. ఎత్తి నడిరోడ్డుమీద పడేశారు. బంతిని తన్నినట్టు కాళ్లతో తన్నారు. ఆ పోకిరీ వెధవలు ఆ బాలిక నడుం చుట్టూ చేతులు వేసి వికృత చేష్టలకు పాలుపడ్డారు. ఆ పాపాత్ముల చేతులు ఆ బాలిక వంటిని తాకరాని చోటుల్లో తడిమిలాడాయి. వంటిమీద బట్టలను చించివేశారు. ఆ బాలిక రెండు చేతులు ఎత్తి దండాలు పెట్టింది. రక్షించమని ప్రాధేయపడింది. కామాంధులకు కనికరం కలుగలేదు. ఏలాగోలాగా తప్పించుకొని రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది. వెంటబడి ట్రాఫిక్‌ను కూడా ఆపుజేసి వెనక్కి గుంజుకొచ్చారు. బహిరంగంగా అత్యాచారానికి పూనుకొన్నారు. అది అర్థరాత్రి కాదు. అటూ-ఇటూ పదుల కొలది ప్రజలు నడుస్తూనే వున్నారు. ప్రేక్షకులను కూడా కాపాడమని వేడుకుంది. 50 మంది దాకా జనం పోగయ్యారు. గారడీ ఆటను చూస్తున్నట్లుగా చూస్తూ వుండిపోయారు. వారిలో మున్ముందు తాము కన్న ఆడపిల్లలో, అక్క చెల్లెళ్లో ఈలాంటి దురాగతానికి గురవుతారేమోనన్న ఆలోచన కలుగలేదు. ఒక్క కాకి చస్తే వంద కాకులు చేరి కావు-కావు మని గోలగోలగా అరుస్తవి. ఆ విధంగా చనిపోయిన కాకి ఎడల తమ సానుభూతిని తెలియబరుస్తాయి. కాకులకున్నపాటి సంస్కారం కూడ మనుష్యుల్లో కరువయింది. అన్ని రంగాలకు మూల విరాటయిన రాజకీయం బ్రష్టుపట్టి పోయింది. దానితోపాటు సామాజిక నైతిక విలువలు కూడా మట్టిలో కలసిపోయాయి.
‘పురుషలందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్లు ఆ గుంపులో ఒక పత్రికా విలేఖరి, ఒక ఫోటోగ్రాఫర్ వున్నారు. ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఆ దుర్ఘటనలు చిత్రీకరించటం వలన ఆ ముష్కరులను గుర్తు పట్టటానికి వీలయింది. విలేఖరి కూతవేటు దూరంలోవున్న పోలీసు స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆ కిరాతకులు ఆ బాలికను వేధించటం ఆ విలేఖరికి ఆశ్చర్యం కలిగించింది. ఇంతమంది జనం పోగయి ఇంత గొడవ జరుగుతుంటే పోలీసులు వెంటనే అక్కడకు ఎందుకు చేరలేక పోయారని పత్రికా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ”పోలీసులు ఏ.టి.ఎం మిషన్‌లాంటి వారుకారని, కార్డు పెట్టగానే డబ్బులు వచ్చి పడినట్లు నేరం జరిగిన తక్షణమే పోలీసులు అక్కడకు చేరలేరని” డిజిపి బదులిచ్చాడు. ఈలాంటి అధికారుల వలన ఆ బాలికకు సత్వరమే న్యాయం జరుగుతుందని, ఆ ముష్కరులను సకాలంలో పట్టుకొని తగిన దండన విధిస్తారని ఆశించటం పగటికలే అవుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గొగోయ్ పత్రిక విలేఖరి, పత్రికాధిపతి మీద విరుచుకు పడటం విడ్డూరంగా వుంది. వారి వల్లనే ఆలశ్యంగానైనా ఆ దుశ్శాసన పర్వం వెలుగులోని కొచ్చింది. వాస్తవానికి వారిని ప్రశంసించాలి. ప్రభుత్వం వారి నిర్వాకం వలన పత్రికా విలేఖరి, పత్రికాధిపతి తమ పదవులకు రాజీనామా చేశారు. జాతీయ మహిళా కమీషన్ కమిటి సభ్యులు ఆ బాలిక ఇంటికి వెళ్లారు. ఆ బాలిక శరీరంపై సిగరెట్లతో కాల్చిన వాతలు కనిపించిన వని చెప్పారు. ఇంతకు పూర్వం కూడా ఆసోం రాజధాని గువాహటిలో ఒక మహిళను నడి బజారులో వివస్త్రను చేసి కొట్టటం జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో సుటియా గ్రామంలో పన్నెండు సంవత్సరాల క్రితం ఒకే రోజున 33 మంది మహిళలు వరుసగా సామాజిక అత్యాచారాలకు గురయ్యారు. సుశాంత్ చౌదరి అనే రౌడీ 70 మంది గుండాలకు నాయకుడు. ఆ గ్యాంగ్ కన్నతండ్రి ఎదుట కూతురును, భర్త ఎదుట భార్యను, కడుపున పుట్టిన బిడ్డల ఎదుట తల్లిని రేప్ చేసింది. ఒక తండ్రి కూతురును తన కళ్లముందే అత్యాచారం చేయటం సహించలేక పోయాడు. ఎదురు తిరిగాడు. అతని నోటిలో తుపాకి పెట్టి ఒకరి తర్వాత ఒకరు రెండు గంటలు ఆ యువతిపై అఘాయిత్యం జరిపారు. నరక యాతననుభవించి చివరకు స్పృహ కోల్పోయింది. వాళ్ల దురాగతాలకు అడ్డుకట్ట వేయటానికి 28 సంవత్సరాల యువక ఉపాధ్యాయుడు పూనుకొన్నాడు. ‘సుటియాగానో దోర్షన్ ప్రతిపాది మంచ్’ అనే సంస్థను స్థాపించాడు. యువకులను కూడగట్టుకొన్నాడు. ఆ యువకులంతా కాలుకు బలపం కట్టుకొని యింటింటికి తిరిగి ప్రజలలో ధైర్యం, చైతన్యం కల్గించారు. చట్టపరంగానే వారిని ఎదుర్కొన్నారు. బరుణ్ బిశ్వాస్ ఉపాధ్యాయుడు వారిపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోలీసుల చుట్టూ, అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ విధి విరామం లేకుండా తిరిగాడు. చివరకు న్యాయస్థానం తలుపులు తట్టాడు. అతని కృషికి ఫలితం దక్కింది. వారిలో అయిదుగురికి యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. సుటియా గ్రామవాసులు బిశ్వాస్‌కు బ్రహ్మరథం పట్టారు. గుండాల నాయకుడు సుశాంత్ చౌదరి ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నాడు. జైలులోవుండే బరుణ్‌ను అంతమొందించటానికి పథకం పన్నాడు. బయటవున్న తన అనుచరులతో పథకాన్ని అమలు పరచాడు. అతని అనుచరులు విద్యార్థులనే ఎరగా వాడుకున్నారు. 5 – జులై – 2012న ఆ ఉపాధ్యాయుడిని పదకొండవ తరగతి చదువుతున్న సుమంత దేబ్‌నాధ్ అనే విద్యార్థి హంతకునిగా మారి కాల్చి చంపాడు. మహిళల మాన సంరక్షణలో ప్రాణార్పణ చేసిన బరుణ్ బిశ్వాస్‌కు సుటియా గ్రామ మహిళలతోపాటు, గ్రామీణులంతా కన్నీటితో వీడ్కోలు చెప్పి జోహార్‌లర్పించారు. బరుణ్ తల్లి గీతా బిశ్వాన్ ఉబుకివస్తున్న కన్నీరునుంచి ఒక్క చుక్కను కూడ నేలరాలనివ్వలేదు. ”ఊరి ఉద్ధరణకోసం నాబిడ్డ ప్రాణాలొడ్డాడు. కంటి నీటి బిందువు నేలబడితే నా బిడ్డకు అవమానం” అన్నదా మాతృమూర్తి, వీరమాత.
యూపీలో బాఘ్ జిల్లాలో అసరా పేరుగల గ్రామం వుంది. 13-జులై-2012న ఆ గ్రామ కుల పంచాయతి పెద్దలు సమావేశమయ్యారు. కొన్ని కట్టుబాట్లను విధించారు. ప్రేమ పెళ్లి చేసుకున్నవారు ఊరులో వుండకూడదు. ఊరు వదలి వెళ్లి పోవాలి. అంతటితో ఆగలేదు. మరో అడుగు ముందుకేసి మహిళలు ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే ముఖం కనిపించకుండ వస్త్రం కప్పుకోవాలి. 40 సంవత్సరాలలోపు వయసువున్న స్త్రీలు బజారులకు, మార్కెట్లకు, షాపింగులకు వెళ్లకూడదు.
2009 వ సంవత్సరంలో ఒకరోజున శ్రీరామసేన కార్యకర్తలు మంగుళూరులోని ఒక పబ్‌లోనికి ప్రవేశించారు. అందులో కంటికి కనిపించిన మహిళలను, యువతులను చావచితకబాదారు. పురుషులను, యువకులను దండించకపోగా పల్లెత్తుమాట అని మందలించలేదు. క్లబ్‌లకు, పబ్‌లకు, బారులకు వెళ్లి తాగితందనాలడటం, పేకాటలాడటం ముమ్మాటికి తప్పే. అయితే ఆ తప్పు దానికి దండన స్త్రీ-పురుషులకు, యువతీయువకులకు సమానంగా వర్తించాలి. ఈ ఘటనలన్ని చూస్తుంటే తాలిబాన్లను తలపింపజేస్తున్నవి. తప్పులు చేసిన మగమహారాజులు కాలర్లు ఎగరేసుకుంటూ తిరుగుతుంటే, బాధిత మహిళలు, యువతులు తలలు దించుకోవలసి వస్తున్నది. ఈ దేశంలో ఒక మహిళ దేశ ప్రథమ పౌరురాలు అవగలిగింది. మరోమహిళ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకోబడింది.ఏఐసీసీ అధ్యక్ష పదవిలో రెండవసారి కూడా ఒక మహిళ పురోగమించగలిగింది. మరోప్రక్క సునీత విలియం రెండవసారి గగన విహారానికి (చంద్రమండలయాత్ర) తరలి వెళ్లింది. కాని మన సమాజంలో యింకా స్త్రీ-పురుష సమానత్వభార సంస్కారం పెరగలేదు. ఆడపిల్లలకు ఇంటా-బయటా చివరకు తల్లి కడుపులో దాగివుండే రక్షణ కూడ కరువయింది. బహిరంగంగా, మహిళలపై, యువతులపై జరిగే దాడులను, అఘాయిత్యాలను ప్రజలు చూస్తూ వూరుకోకుండా అడ్డుకోవాలి. స్త్రీ-పురుష సమానత్వ భావాలు పెంపొందితేనే, అలాంటి చైతన్యం కల్గుతుంది ప్రజలలో. అందుకు మహిళా సంఘాలతోపాటు, విద్యావంతులు, విలేఖరులు, ప్రగతిశీల శక్తులు, వ్యక్తులు నడుంబిగించాలి. ఇది అందరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags