హింస ఒక వ్యాపారం

మల్లీశ్వరి
అదొక ఇ.ఎన్‌.టి డాక్టర్‌ క్లినిక్‌. ఛాంబర్‌ బైట వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు పేషెంట్లు. తమ వంతు రాగానే లేచారు ఒక యువజంట. అబ్బాయి తలుపు దగ్గరే ఆగి ”మే ఐ కమిన్‌ డాక్టర్‌?” అలవాటయిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనలిజంతో చిన్న నవ్వుని జోడించి పొలయిట్‌గా అడిగాడు. పక్కనున్న అతని భార్య నవ్వుతూ నిలబడింది.
వారి విషెస్‌ అందుకుంటూ రమ్మన్నట్లు చూసింది డాక్టర్‌. పేషెంట్‌ ఎవరన్నట్లు యిద్దరి వైపూ ప్రశ్నార్థకంగా చూడగానే అప్పటివరకూ చున్నీతో ఎడం చెంపని కవర్‌ చేసుకుంటూ ఉన్న అమ్మాయి చున్నీ తీసింది. బూరెలా వాచిపోయిన బుగ్గని చూపించి.. ” చెవి నొప్పి కూడా… చాలా సివియర్‌గా ఉంది..” నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది.
చూడగానే చాలామట్టుకు అర్థమయింది డాక్టర్‌కి.
”దెబ్బేవన్నా తగిలిందా?..” కొంచెం రుకుగానే అడిగింది డాక్టర్‌. సాఫ్ట్‌వేర్‌ యువజంట మొహమొహాలు చూసుకున్నారు. మొహంలోంచి ఎగిరి పోతున్న నవ్వుల్ని బలవంతానా ఆపుకుంటున్నారు.
”దెబ్బ ఏం కాదండీ! మొన్న నేనూ తనూ కబుర్లు చెప్పుకుంటుంటే మాటల మధ్యలో తను వూరికే… సరదాగా… చెంప మీద యిట్లా అనగానే…” సిగ్గుపడుతూ నవ్వబోతూ ఆ అమ్మాయి చెపుతుండగానే డాక్టర్‌ స్కానింగ్‌ తీసి చూపిస్తూ… ఊరికే.. యిట్లా అంటేనే కర్ణబేరి యింత డామేజ్‌ అవుతుందా?” అబ్బాయిని సీరియస్‌గా చూసింది డాక్టర్‌.
మొన్నటి నుంచీ ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు ఈ నొప్పినీ, ఈ అవమానాన్నీ దాచి పెట్టుకుంటూ వచ్చిందో డాక్టర్‌ కనిపెట్టేయగానే మొహం చేతుల్లో దాచుకుని ఒక్కసారిగా బావురుమంది అమ్మాయి. ”వారానికి రెండు మూడు యివే కేసులు… చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు… భార్యని కొట్టడమేంటి?… కొంచెం అటూయిటూ అయి నవరగంత మీద తగిలితే ప్రాణానికే ప్రమాదం యిట్లా అయితే పోలీసు రిపోర్టు యివ్వాల్సి ఉంటుంది.” గట్టిగా చీవాట్లు వేసింది డాక్టర్‌.
అబ్బాయి తలవంచుకున్నాడో  లేదో తెలీదు గానీ కుటుంబాల్లో ఎడతెగకుండా సాగుతున్న హింసకి ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా యింకా స్త్రీలు తలలు వంచుతూనే ఉన్నారు. రాన్రానూ సమాజంలో హింసపట్ల ఉదాసీనత, ఒప్పుదల పెరుగుతూ ఉంది. భౌతిక హింస ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా పిల్లలూ, స్త్రీలూ, దళితులూ, మైనార్టీ వర్గాలూ ముందుగా టార్గెట్‌ అవుతారు. గుర్తించవలసిన యింకో అంశం ఉంది. గృహ హింసకి పాల్పడిన వారిలో ఆపని తప్పనీ, బైటకి తెలిస్తే పెద్దగా చూడబడుతామన్న సామాజిక భయమూ ఉంటుంది. అంత మాత్రానా అది ఉద్వేగాల పరిధిలోని చిన్న నేరమని గానీ సర్దుకుపోవచ్చుననీ చెప్పడం యిక్కడ ఉద్దేశం కాదు. చెంపదెబ్బల నుంచీ ప్రాణాలు తీసేవరకూ కుటుంబాల్లో హింసాపర్వం శతాబ్దాల తరబడీ సాగుతూనే ఉంది. అయితే ఇపుడు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న మరో విషయం సమాజంలో బాహటంగా జరుగుతున్న హింస. దానికి నిశ్శబ్దంగా లభిస్తున్న అంగీకారం… అది గౌహతిలో పదిహేనేళ్ళ పిల్లమీద జరిగిన దాడి కావొచ్చు, లక్ష్మింపేటలో దళితుల్ని ఊచకోత కోయడం కావొచ్చు. ఉద్రేకంతోనో, కుట్రపూరితంగానో సమూహం ఒక వ్యక్తిని గానీ, సమూహం మరొక సమూహాన్ని గానీ హింసకి గురి చేయడం లోని అమానవీయతకి రకరకాల ఆధిపత్యాలు మూలం. కుల, మతాధిక్య, పితృస్వామిక స్వభావం ఉన్న సమాజానికి మంచీ చెడూ చెప్పాల్సిన ప్రభావ వర్గాలదీ అదే తోవ.
పాతిక ముప్పయ్యేళ్ళ కిందట జాతీయ వార్తాపత్రికలు విధిగా ఒక నియమం పాటించేవి. హింసనీ, బీభత్సాన్నీ రేకెత్తించే ఫోటోలను గానీ, వార్తలను గానీ మొదటి పేజీలో వేసేవారు కాదు. తర్వాతి పేజీలలోనైనా సమాచారం విశ్లేషణా ఎంత వరకూ అవసరమో అంతే తప్ప పాఠకులను భయకంపితులను చేసే ధోరణి ఉండేది కాదు.
కానీ యిపుడు ప్రింట్‌ మీడియా కూడా ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభావానికి లోనయింది. హత్య ఎలా జరిగిందో కళ్ళకి కట్టినట్టు చూపించే క్రైమ్‌ వాచ్‌ కార్యక్రమాలు, స్టింగ్‌ ఆపరేషన్ల పేరిట తప్పు చేసిన మనుషుల్ని, ముఖ్యంగా తప్పులు చేసే సామాన్యుల్ని పదిమంది కలిసి చావబాది ప్రాణాలు తీస్తుంటే వీడియో షూట్‌ చేసి బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రచారం చేసే స్థాయికి మీడియా విలువలు పతనమయ్యాయి. మనిషిని వ్యాపార వస్తువు చేసిన ప్రపంచీకరణ దేనినీ వదలలేదు. చివరికి హింసకూడా వ్యాపారంగానే మారిపోయింది.
బలహీనులపై హింస వ్యవస్థీకృత స్థాయికి చేరుతున్న సమాజాల్లో దానిని నిరోధించడం వ్యవస్థల మౌలిక మార్పులలోనుంచే రావాలి. దానికి వ్యక్తుల్లో కొత్త సంస్కారం, సున్నితమయిన, తప్పనిసరిగా పాటించాల్సిన మానవీయ విలువల్ని బోధించే విద్య, వ్యక్తుల్ని ద్వేషించని సాహిత్యం, బాధ్యతగల మీడియా కూడా ఇపుడు చాలా అవసరం.

Share
This entry was posted in లోగిలి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.