రామాయణం – తాటక పాత్ర పరిశీలన

బి. విజయభారతి
రామాయణాన్ని ఒక మతగ్రంథంగా కాక ఒక కావ్యంగా చదివినప్పుడూ, సామాజిక రాజకీయ కోణాలలో చూసినప్పుడూ ‘తాటక’ పాత్ర విశిష్టంగా విశ్లేషించదగినదిగా దర్శనమిస్తుంది. అలా విశ్లేషించిన తర్వాత రాజ్యహింసను ప్రతిఘటించి స్త్రీల శౌర్యానికీ, ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా నిలిచిన పురాణ పాత్రలలో తాటకను మొదటగా పేర్కొనాలని అనిపిస్తుంది. అలాగే పరాయి సంస్కృతిని ప్రతిఘటించే ప్రయత్నంలో అమరులైన వారిలోనూ తాటక పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అనిపిస్తుంది.
ఈ విశ్లేషణ ఇరవైఒకటో శతాబ్దపు నిజనిర్ధారణ కమిటీ రిపోర్టులాగా కనిపించవచ్చు : అయినా రామాయణంలోని కథనానికి ఇది ఎంతమాత్రమూ వక్రీకరణ కాదు.
తాటక రాక్షసిగా దుర్మార్గురాలిగా యజ్ఞవిరోధిగా ప్రచారం కావటం వెనక మత రాజకీయ సాంస్కృతిక కారణాలున్నాయి. రామాయణం కావ్యమైనా మతగ్రంథంగా నిత్యపారాయణ గ్రంథంగా ప్రచారంలో ఉంది. మతగ్రంథాలను ప్రశ్నించటమూ సందేహించటమూ నిషేధాలు అయినప్పటికీ వర్తమాన రాజకీయ సాంస్కృతిక వ్యవస్థను అర్థం చేసుకునే క్రమంలో తాటక గురించి తెలుసుకోవటం సామాజిక అవసరం. ఆ లక్ష్యంతోనే ఈ వ్యాసం రాయటం జరిగింది. రామాయణాన్ని విని తాటకను అర్థం చేసుకోవటానికీ వాల్మీకిని చదివి తాటకను అర్థం చేసుకోవటానికీ చాలా తేడా ఉంటుంది.
తాటక కథ బాలకాండలో 24, 25, 26 సర్గలలో ఉంది. తాడకావనప్రవేశం, తాడకా వృత్తాంతం, తాడక వధ అనేవి శీర్షికలు.
ఇంతకూ తాటక ఎవరు? సంస్కృత రామాయణం ప్రకారం ఆమె పేరు ‘తాడక’. ఆమె ఒక యక్షుని కూతురు. ఒక యక్షుని భార్య. ఇంద్రుని వంటి పరాక్రమం గల ఒక వీరునికి తల్లి.
తాటక బ్రహ్మ వరప్రభావంతో పుట్టింది. రూపవతి. బలశాలిని. తండ్రి రాజ్యానికి వారసురాలు. రామాయణ కవులు ఆమెను గురించి ఎక్కడ ప్రస్తావించినా ‘సహస్ర నాగబల సమన్విత’ అనే చెప్పారు. ‘నాగ’ అనే మాటకు ‘ఏనుగు’ అనే అర్థం తీసుకుని మన పౌరాణికులూ కవులూ, ఆమె శారీరకంగా వెయ్యి ఏనుగుల బలం కలది అని ప్రచారం చేశారు. ‘నాగ’ పదానికి చాలా అర్థాలున్నాయి. నాగము అంటే పాము. పాము నాగజాతి గణ చిహ్నం. ‘నాగ’ పదం జ్ఞానానికి సంకేతం. ఆంధ్రవిశ్వవిద్యాలయపు చిహ్నంలో రెండు పాములు ఒక చెట్టును చుట్టుకుని ఉన్న బొమ్మ ఉంటుంది. భారతదేశ ప్రాచీన జాతులలో నాగజాతి ఒకటి. ఆంధ్రదేశం ఒకప్పుడు నాగుల స్థానం.
చరిత్రపరంగా చూస్తే పూర్వం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులకు గజబలం ఎక్కువగా ఉండేదంటారు. వారి సైన్యాలలో నాగసైనికులు ఎక్కువగా ఉండేవారంటారు. గిరిజన ఆదివాసీ రాజ్యాలలోని చిన్న చిన్న జాతుల సముదాయాలనన్నింటినీ కలిపి ‘నాగులు’గా వ్యవహరించిన కాలమూ ఒకటి ఉండేదని చరిత్ర చెబుతున్నది. ఈ కోణంలో పరిశీలించినప్పుడు తాటక వెయ్యి ఏనుగుల గజబలంగాని, వెయ్యిమంది నాగసైనికులనుగాని కలిగి ఉండేదని అర్థమవుతుంది.
రామాయణంలో తాటక మీద పెద్ద అభియోగం ఏమిటంటే ఆమె మునుల యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నది అని. (బాలకాండ 24-26,27) వేదమతంలో యజ్ఞయాగాది క్రతువులు ఉదృతంగా జరుగుతున్న కాలంలో వాటిపట్ల వ్యతిరేకత కూడా అంత ఉధృతంగానూ వచ్చింది. అలా వ్యతిరేకించినవారిలో స్థానిక జాతులు యక్షులు నాగులు అసురులు ఉన్నారు. వీరిలో తమకు సహకరించనివారిని వైదికమతాలవారు ”రాక్షసులు”గా పిలిచారు.
వైదికమతం క్రతు కర్మకాండకు ప్రాముఖ్యం ఇచ్చింది. స్థానిక జాతులు ధ్యానయోగానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. వైదికమతంలో పిల్లలు పుట్టటానికి పుత్రకామేష్టి, రాజ్యవిస్తరణకు రాజసూయం, మరోదానికి అశ్వమేధం అంటూ రకరకాల క్రతువులుండేవి. హింసాకాండ, ముఖ్యంగా ఆచారాల పేరిట స్త్రీలకు విధించే కర్మకాండ అమానవీయంగా ఉండేది. యజ్ఞాలు చేసేవారు తమను యజమానులుగా ఆర్యులుగా సంభావించుకునేవారు. యజ్ఞసామగ్రి అందించేవారూ, పశువులను సరఫరా చేసేవారూ, హోమం చేసేవారూ, మంత్రాలు వల్లించేవారూ – ఇలా రకరకాల స్థాయీభేదాలకూ ఈ క్రతువులు దారితీశాయి. రామాయణకాలానికి ముందే యజ్ఞాలను నిరసించటం ఆరంభమైంది.
మునులు అరణ్య భూములలో ఆశ్రమాలు నిర్మించుకోవటం – అక్కడి వాతావరణాన్ని యజ్ఞకర్మలతో యుద్ధభూములలాగా మార్చటం స్థానికులకు ఇబ్బందిగా ఉండేది. రక్తంతో తడిసిన నేల, తెగిపడిన అవయవాలు, వెంట్రుకలతో కూడిన యజ్ఞభూమిని యుద్ధరంగంతో పోల్చి చెప్పిన వర్ణన రామాయణంలోనే ఉంది. అనేకానేక కారణాలవల్ల స్థానిక గిరిజన/ఆరణ్యక ప్రజలు యజ్ఞాలకు వ్యతిరేకులయ్యారు. తమ ప్రాంతాలలోకి అన్యమతస్థులు చొరబడటాన్ని ప్రతిఘటించారు, యజ్ఞాలు చేయటాన్ని అడ్డుకున్నారు. ఇది ఒక ఉద్యమం లాగా సాగింది. ఒకప్పుడు నాగరాణి తాటక ఆ ఉద్యమ నాయకురాలు. ఆ ఉద్యమాన్ని అణచటానికి ఆర్యమునులు/రాజులు పూనుకుని ఒక పథకం ప్రకారం తాటకను చంపారు.
తాను ఒక యజ్ఞం తలపెట్టాననీ దానికి రాక్షసులు భంగం కలిగిస్తున్నారనీ యజ్ఞరక్షణ కోసం రాముడిని పంపాలనీ విశ్వామిత్ర ముని అయోధ్య రాజైన దశరథుని దగ్గరకు వచ్చి అడిగాడు. ”ఆ పసివాడు ఎందుకు? నేనే వస్తానన్నా”డు దశరథుడు. విశ్వామిత్రుడు ఒప్పుకోలేదు. కోపగించుకున్నాడు. ”రామునికి అస్త్రవిద్య వచ్చినా రాకపోయినా ఫరవాలేదు ముని అన్నీ చూసుకుంటారు” అంటూ వసిష్టుడు రాజుకు నచ్చచెప్పిన మీదట రామలక్ష్మణులను మునితో పంపాడు.
కొన్ని వర్గాలకు రాజ్యం సహాయం చేయటాన్ని ఇక్కడ గమనించాలి.
విశ్వామిత్రుడు దారిలో రామలక్ష్మణులకు బోలెడు కథలు చెప్పాడు. అన్నీ దేవాసుర యుద్ధాల కథలే. వారికి ముని బల, అతిబల అనే విద్యలూ రకరకాల అస్త్ర శస్త్ర విద్యలూ ఉపదేశించాడు. వారిని నేరుగా తన ఆశ్రమంవైపు తీసుకువెళ్ళకుండా తాటకవనం వైపుకు తీసుకువెళ్ళాడు. ”ఇది తాటక అనే యక్షి వనం” అంటూ ఆమె గురించి చెప్పాడు. ”యజ్ఞ విఘ్నకరీ యక్షీ…” యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నదని చెబుతూ ఆమె ”సహస్ర నాగబల సమన్విత” అని చెప్పాడు. ఆ మాటకు రాముడు ఆశ్చర్యపోయాడట. ”యక్షులు అంత శౌర్యవంతులు కారని వింటూ ఉంటాం. ఒక అబల ఏమిటి; సహస్ర నాగబలం కలిగి ఉండటం ఏమిటి” అని కుతూహలం చూపించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆమె గురించి వివరాలు చెప్పాడు. ”ఆమె సుందుడనే వాని భార్య. రూపయౌవనశాలిని. వారికి మారీచుడనే కొడుకున్నాడు.” సుందుడు అగస్త్యుని శాపంతో హతుడయ్యాడు. ”తాటక ఆగ్రహంతో కొడుకును వెంటబెట్టుకుని అగస్త్యుని దగ్గరకు వెళ్ళింది. అప్పుడాయన వారిద్దర్నీ రాక్షసులుగా అవుతారని శపించాడు. తాటకను వికృతమైన రూపంతో నరమాంసం తింటూ తిరగవలసిందిగా శపించాడు” అని వివరించాడు.
శాపాలంటే శిక్షలే. మునుల శాపాలు అమలు జరగవలసిందే – రాజులూ మునులకు భయపడేలా  మునులు శాంతికాముకులూ, జితేంద్రియులూ సాత్వికాహారప్రియులూ అని ప్రసిద్ధి. అలాంటి ఒక ముని ఒక యక్షస్త్రీని అంత దారుణంగా శపించాడా? ఆమె చేసిన నేరం ఏమిటంటే తన భర్తను ఎందుకు చంపారని నిలదీయటం. మునులు ఏమి చేసినా అడగకూడదు. వారికి విధేయంగా ఉండాలి అనేది రాజ్య/సామాజిక నియమం. ప్రశ్నించటం ఇక్కడ నేరం. అంతవరకు మునులు ఏమి చేసినా ఎవరూ అడిగేవారు కాదు. వారు శప్తిస్తారని భయం. తాటక అలా ఊరుకోలేదు. ”సుందుడిని ఎందుకు చంపార”ని నిలదీసింది. మునులనూ పరోక్షంగా రాజ్యాన్నీ నిలదీసింది. రాజులు మునుల చేతుల్లోని పరికరాలు – పరోక్షంగా నియంత్రణ మునులదే – అంటే పురోహితవర్గానిదే. చతుర్వర్ణ వ్యవస్థలో స్త్రీలది అతి కింది స్థాయి. వారు నోరు విప్పటానికి వీలులేదు.
యక్షులూ సమాజంలో కింది స్థాయివారిని రాజ్యం ఏమైనా చేయవచ్చు. చంపేసి శవాలను మాయం చేయవచ్చు. అడగటానికి లేదు. స్థానికులకు ఆర్యమునులకు ఉన్న వైషమ్యాలకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించే ప్రయత్నం చేసే బదులు ఇప్పటి ఇరవయ్యొకటో శతాబ్దపు గిరిజన ఆదివాసీల పరిస్థితులను అర్థం చేసుకోవటం తాటక పాత్రను అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తుందని అనిపిస్తుంది. తనను ప్రశ్నించిన తాటక సాహసం అగస్త్యుడు భరించలేకపోయాడు. అతడు ఇచ్చిన శాపం – వేషభాషల మీద – ఆహార విహారాల మీద ఆంక్షలు విధించటం అనే రూపంలో ఉంది. ఇది వర్ణవ్యవస్థలోని కింది కులాల పట్ల అగ్రకులాలు అనుసరించే వైఖరికి ఉదాహరణ.
మునులను ప్రశ్నించటం అనేది కింది కులాలకు-స్త్రీలకూ తగని ప్రవర్తన. మనుధర్మశాస్త్రం ఇలాంటివి సహించదు. ఒక యక్షస్త్రీని అంత దారుణంగా శపించటం వర్ణధర్మ పరిరక్షణకే. అయినా తాటక తన ఉద్యమాన్ని ఆపలేదు. ఆ తర్వాత కూడా తాటక మునులకు కంటకంగా మారింది. తాటకను అణచవలసిన అవసరం రాజులకూ ఉన్నది. తాటక మలద కరూశ రాజ్యానికి పాలకురాలు. ఆ ప్రాంతం సంపన్నమైనది. ఓషధులకూ ఖనిజాలకూ కలపకూ నిలయం. అది పవిత్రమైన స్థలం కూడానట. పూర్వం ఇంద్రుడు, శుత్రాసురుని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని ఇక్కడే కడుక్కున్నాడట. అందుకే అది ‘మలద’ రాజ్యంగా పేరుపడింది. బ్రహ్మహత్య తరమటం వల్ల నీరసించిపోయిన ఇంద్రునికి కార్శ్వరోగం (చిక్కిపోయే వ్యాధి) నుండి ఇక్కడే విముక్తి కలిగిందట. అందుకే అది ‘కరూశ’ రాజ్యంగానూ పేరుపడింది. ఈ విధంగా తాటక రాజ్యం ఆర్యగణాలను ఆకర్షించింది. అక్కడి వనరులపై మునులకూ రాజులకూ (వారే ఇప్పటి కార్పొరేట్‌ వర్గాలు) ఆసక్తి ఉంది. వారి లబ్ధికోసం తాటకనూ ఆమె ఉద్యమాన్నీ అణచివేసే ప్రయత్నం జరిగింది. దానికి వీర రౌద్ర రసాలు మేళవించి తాటకను ఉగ్రస్వరూపిణిగా చూపారు. సినిమాలలోనూ టి.వి. సీరియళ్ళలోనూ తాటకను భయంకరంగా చూపుతూ ఉంటారు. ఆమెను చంపటం రాముని కీర్తిని పెంచేదిగానే చిత్రీకరించారు. ”…గోబ్రాహ్మణ హితార్దాయ జహి దుష్టపరాక్రమా…” (బాల. 25-25) అంటూ రాముడిని తాటకవధకు సన్నద్ధం చేశాడు, విశ్వామిత్రుడు.
రాముడు చంపిన అసురులందరూ స్థానిక జాతులవారే. ఆర్యేతర సంస్కృతులవారే కావటం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం. తాటక స్త్రీ కాబట్టి రాముడు మొదట సందేహించాడట. ”దుష్టులయిన స్త్రీలను చంపవలసిందే” అని ముని చెప్పాడు. తాటక దుష్టురాలు అవునో కాదో ఆలోచించే వ్యవధి ఇవ్వనే ఇవ్వకుండా అత్యవసరంగా ఆమెను చంపించారు. తాటక ప్రతిఘటనాశీలం గల మహిళ. అలాంటివారిని పురుష సమాజం అస్సలు సహించదు. వారిని దుష్టులుగానే పరిగణిస్తుంది. అలాంటి స్త్రీలను వధించిన ఉదాహరణలు కొన్ని ఇక్కడ ఇచ్చారు. వారిని గురించి మరోసారి చెప్పుకుందాం.
తాటకను చంపటానికి మరో ముఖ్యకారణం వర్ణధర్మ పరిరక్షణ – గోబ్రాహ్మణ హితమూను. ఈ మాట చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆ ఘట్టాన్ని చదివినవారికే ఈ విషయం తెలుస్తుంది. ”చాతుర్వర్ణ హితార్థాం” ”గోబ్రాహ్మణ హితార్థాయ” అనే పదాలు అర్థవంతమైనవి.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తాటకవనంలోనికి తీసుకువెళ్ళేనాటికి తాటక పాలకురాలిగా ఉన్నదో లేదో గాని తన నివాసంలో ఒంటరిగా ఉన్నది. మునుల శాపాలు పొందినాక కూడా ఆమె తన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంది. శ్రమణురాలిగా జీవితం గడుపుతున్నట్టు కనిపిస్తుంది. తాటక నివాసం ముందు నిలబడి రాముడు వింటినారి మోగించాడు. ఆ ధ్వని దిక్కుల నిండింది; దుర్భరంగా ఉన్నది. తాటకవనం ఉలిక్కిపడింది. జీవులన్నీ భయపడ్డాయి. తాటక కోపంగా విసురుగా బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఏ ఆయుధమూ లేదు. తనకు ఎవరైనా హాని తలపెడతారన్న ఆలోచనే ఆమెకు ఉన్నట్టు లేదు. ఆమె శబ్దం వినవచ్చిన దిక్కుగా నడిచింది. విల్లు పట్టుకుని బాణం వేసే ప్రయత్నంలో ఉన్న రాముడు ఆమెకు కనిపించాడు. ఆమెను చూడగానే రామలక్ష్మణులు ఆమె వికృతరూపం గురించి మాటాడుకున్నారట. తాటక రాముడిని ఆపే ప్రయత్నం చేస్తూ కేకలు వేస్తూ ముందుకు నడిచింది. (ఇంటి ఆవరణలోని పండ్ల చెట్లు ఎక్కి కాయలు కోసుకుపోయే పిల్లలను బెదిరించి తరిమే ధోరణిలో ఉంది, ఆమె. అక్కడి వర్ణన అలానే కనిపిస్తుంది.)
విశ్వామిత్రుడు ఆమెను హుంకారంతో బెదిరించాడు. లక్ష్మణుడు కత్తిదూసి సిద్ధంగా నిలబడ్డాడు. వారిని ఆపే ప్రయత్నం మాని తాటక ఆత్మరక్షణలో పడింది. చేతికి అందిన రాళ్ళు విసిరింది. కింది దుమ్ము/మట్టీ చల్లి ఉంటుంది. దొంగతనాలలో కారం చల్లేలాగా – ఈ చర్యను శిలావర్షంగా చెప్పారు. తాటక శిలావర్షం కురిపించిందని రామాయణకవులు రాశారు. వాల్మీకి – ఇతర కవులూ కూడా.
”సంధ్యాసమయం దాటితే రాక్షసుల బలం రెట్టింపు అవుతుంది. ఆమెను త్వరగా చంపు” అంటూ విశ్వామిత్రుడు తొందరపెట్టాడు. ముని ఆదేశాలు పాటించటానికే తండ్రి తనను పంపాడు కాబట్టి – రాముడు ముని ఆజ్ఞ పాటించాడు, సందేహించలేదు. ”…పితుర్వచన నిర్దేశాత్‌… కరిష్యామి న సందేహస్తాటకా వధముత్తమం” (బాల.సర్గ.25)
”గోబ్రాహ్మణ హితార్షాయ దేశస్యాస్య సుఖాయ చ
తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు ముచ్యతః”  (సర్గ 26-2-5)
రాముడు రాజ ప్రతినిధి. దేశం సుఖంగా ఉండాలంటే ఇలాంటివి చెయ్యాలి. దేశం అంటే ప్రజలందరూ కాదు. కొన్ని వర్గాలవారే. వారి సుఖం కోసమే రాజులు (పాలకవర్గం) ఉన్నారు. అందుకే తాటకవధ ఉత్తమంగా భావించాడు; రాముడు.
తాటకను చంపటాన్ని వర్ణించే ఘట్టాలన్నీ హృదయవిదారకంగానే రామాయణం వర్ణించింది. కావ్యనాయకునికి ధీరోదాత్తత ఆపాదించాలి కాబట్టి ప్రతినాయకుని మరింత దుష్టునిగా వర్ణించే ధోరణి తప్ప అది నమ్మశక్యంగా లేదు. తాటక వెనుతిరిగి పారిపోలేదు. వారిని గెద్దిస్తూనే ఉంది; ఆయుధం లేకుండానే. తాటక విసిరిన రాళ్ళు దుమ్ము రామునిమీద పడ్డాయో లేదోగాని అతడు తాటక మీదికి వచ్చి ఆమె భుజాలు నరికాడు. ఆమె కేకలు వేస్తూ తప్పించుకోవటానికి పెనుగులాడుతూ ఉండగా లక్ష్మణుడు వచ్చి ముక్కు చెవులు కోశాడు. తాటక బాధతో విలవిలలాడుతూ ఉంది; మూలుగుతోంది – ‘ఇంకా ఎందుకు ఆమెపై దయచూపుతావు – త్వరగా చంపు’ అంటున్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు ఆమె గుండెల్లోకి ‘శబ్దవేధి’ బాణం వేశాడట. కనబడని వాటినీ – దూరంగా ఉన్నవాటినీ శబ్దంతో గుర్తించి బాణం వేయటాన్ని ‘శబ్దవేధి’ అంటారు. తాటక మరీ దూరంగా లేదు. భుజాలు నరికేంత, ముక్కు చెవులు కోసేటంత దగ్గరగా ఉంది. అప్పటికి ఇంకా అంత చీకటి పడలేదు. అయినా రాముడు ‘శబ్దవేధి’ విద్య ప్రదర్శిస్తూ బాణం వేశాడట. రాముని శౌర్యాన్ని చూపే ప్రయత్నంలోనే రామాయణ వర్ణనలు సాగాయి. తాటక పిడుగులాగా మీద పడబోయిందనీ అప్పుడు రాముడు బాణం వేశాడనీ రామాయణం అంటున్నది. తాటక మూలుగులు వింటూ బాణం వేశాడనేది మనకు అర్థమవుతుంది.
మాయాయుద్ధం చేయగలిగిన, వేయి ఏనుగుల బలం కలిగిన తాటక నిస్సహాయంగా రాకుమారుల బాణాలకు బలి అయింది! తాటకను చంపే కార్యక్రమం అధిష్ఠానం పర్యవేక్షణలోనే జరిగింది. చనిపోయిన తాటకను చూసి దేవగణాలు, మునులు సంతోషించారు. ”ఈ రాముడు ముందుముందు ఎన్నో దేవకార్యాలు చేయవలసి ఉంది అందుకు ఇతడు సమర్ధుడే” అని పొగిడారు.
తాటకను చంపిన స్థలం బక్సర్‌ దగ్గర ఉన్న ఘాజీపూర్‌ ప్రాంతమనీ 1825 నాటికి అక్కడ కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో గులాబీ తోటలున్నాయనీ బిషప్‌ హెబర్‌ దొర రాసినట్టు ఏనుగుల వీరాసామయ్య గారు తమ కాశీయాత్రాచరిత్రలో రాశారు. ఘాజీపురం – గాధిపురం – విశ్వామిత్రుడు ఆక్రమించుకొన్న ప్రాంతం అనీ ఊహించారు.
గిరిజనుల జనస్థానాలలో ప్రవేశించి తమ ఆసక్తుల కోసం వాళ్ళని బోధిస్తూ మాట వినని వారిని కాల్చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తూ సాగిన వ్యవస్థ ఈనాడూ కొనసాగుతున్నది. దండకారణ్యం మహిళలపై అత్యాచారాలనూ హత్యలనూ ఎన్నింటినో చూసింది. ఇప్పుడిప్పుడే వాటిపై నోరువిప్పగలుగుతున్నది. దంతెవాడ గానీ, వాకపల్లి గానీ, బాసగుడ గానీ అన్నీ అమానవీయతను నిలదీసినవే.
తాటకను చంపినందుకు అప్పట్లో నాగులు తిరుగుబాట్లు చేసే ఉంటారు. తమ నిరసన వ్యక్తి పరిచే ఉంటారు. అవేవీ గ్రంథస్థం కాలేదు. రాజ్యం వారిని దమననీతితో అణచివేసే ఉంటుంది. నాగుల తిరుగుబాట్ల గురించి చరిత్ర ప్రస్తావిస్తూనే ఉంటుంది, గాని వివరంగా చెప్పదు.
శత్రువుల ముక్కుచెవులు కోయటం అనేది తాలిబన్లను గుర్తుకు తెస్తుంది. స్త్రీల ముక్కుచెవులు నరికి వారిని వికృతపరచటం – స్త్రీల స్వాతంత్య్రాన్నీ స్వేచ్ఛనూ అరికట్టే పద్ధతి. ఇది పూర్వం కొన్ని రాజ్యాలలో ఉండేది. ”న స్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని మనువు చెప్పినదానికి ఇది ఆచరణ. ఒక కాలంలో బుద్ధవిగ్రహాలకూ ముక్కులు తెగగొట్టారు – ఇలాంటి వికృతచేష్టలకు హత్యలకూ ఎందరు తాటకలు బలి అయ్యారో. ‘సాహిత్యం సమాజానికి అద్దం పడుతుంది’ అనే మాట ప్రకారం తాటకపాత్రను అర్థం చేసుకుంటే సమాజాన్నీ రాజ్యాన్నీ ప్రశ్నించిన చైతన్యమూర్తులు అప్పుడూ ఉన్నారని తెలుసుకోవటం ఒక స్ఫూర్తి. తాటకవధ చాతుర్వర్ణ వ్యవస్థను కాపాడటానికీ దేశం సుఖం కోసమూ గోబ్రాహ్మణ హితం కోసమూ జరిగిందని రామాయణం చెబుతోంది. అది సమర్థనీయమేనా? అనీ ప్రశ్నించుకోవాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to రామాయణం – తాటక పాత్ర పరిశీలన

  1. cherry says:

    మాంచి మాటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో