పసుపులేటి గీత
‘మీరు ఎప్పుడైతే అత్యాచారాలు చేస్తారో, కొడతారో, నోరునొక్కేస్తారో, అంగాంగాల్ని నరికేస్తారో, తగలబెట్టి, పూడ్చిపెట్టి ఆడవాళ్ళను భయభ్రాంతుల్ని చేస్తారో…, అప్పుడే ఈ గ్రహం మీద అత్యంతావశ్యకమైన జీవశక్తిని మీరు ధ్వంసం చేస్తున్నారన్న మాట.’
చట్టపరమైన పరిభాషలో తప్ప అత్యాచారాన్ని ఒక శారీరక, మానసిక దాష్టీకంగా అనుభూతించలేని ఈ అవిటి ప్రపంచాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక నిప్పుల ఉప్పెన గొంతు విప్పింది. ఆ ఉప్పెన పేరు ఈవ్ ఎన్‌స్లర్. స్వయంగా బాల్యంలో కన్నతండ్రి చేతిలోనే అత్యాచారానికి గురైన ఆమె తన వేదనను విశ్వజనీనానుభూతిలోకి అనువదించింది. అత్యాచారం వల్ల శరీరానికి, మనస్సుకు, వ్యక్తికీ మధ్య అనుసంధానం చెదిరిపోయే పరిస్థితి నుంచి బయటపడి, తాను ఏ విధంగా ఆ అనుసంధానాన్ని పునరుజ్జీవింప చేసుకున్నదో ఈవ్ ఎన్‌స్లర్ మాటల్లోనే విందాం :
‘చాలా రోజుల క్రితం నేనూ…, నాకొక శరీరమూ ఉండేది. నేను నేనంతా భవిష్యత్తుకు సంబంధించిన కథనాలు, కోరికలు, ఆతృతలతో నిండిపోయి ఉండేదాన్ని. నేను నా దుర్మార్గపు గతానికి చిహ్నంగా మిగిలిపోవాలని కోరుకోలేదు. నాకూ, నా శరీరానికి మధ్య వేర్పాటు అన్నది ఒక కాదనలేని, స్పష్టమైన ఫలితంగా మిగిలిపోయింది. అన్ని వేళలా నేను ఫలానాగా మారాలని, ఏదో ఒకటిగా తయారవ్వాలని తపించేదాన్ని. ఆ ప్రయత్నమే నా ఉనికిగా మారింది. నా శరీరానిది కూడా అదే దారి.
దేహంతో అనుసంధానాన్ని కోల్పోయిన తరువాత, నేనంటే ఒక ప్రవహించే శిరస్సును మాత్రమే. సంవత్సరాల పర్యంతం నేను కేవలం టోపీలను మాత్రమే ధరించాను. నా తలతో నన్ను నేను అతికించుకునే మార్గమదే. నా ఉనికిని నేను వెదుక్కునే మార్గమదే. ఒకవేళ నేను కనుక నా టోపిని తీసి వేస్తే ఇక ఇక్కడ నా ఉనికి శూన్యమే అవుతుందని కూడా నేను భయపడుతుంటాను. ‘ఈవ్, నువ్వు నా దగ్గరికి రెండేళ్ళుగా వస్తున్నావు. నిజాయితీగా చెప్పాలంటే, నీకొక శరీరం ఉందన్న భావన కూడా నాకు కలగడం లేదు’ అని చెప్పింది నా డాక్టర్. ఇంతకాలం నేను నగరంలోనే జీవించాను. నిజాయితీగా చెప్పాలంటే నాకు చెట్లంటే తగని భయం. తలలకు పిల్లలు పుట్టరు కాబట్టి నాకు పిల్లలు లేరు. పిల్లలు నోట్లోంచి ఊడిపడరు కదా.
నా శరీరం గురించి చెప్పుకోదగినది ఏదీ లేదు కదా, అందుకే తమ శరీరాల గురించి, ముఖ్యంగా తమ యోనుల గురించి చెప్పమని నేను ఇతర స్త్రీలను అడగడం మొదలు పెట్టాను. ఈ అలవాటే నా చేత ‘వజైనా మోనోలాగ్స్’ని రాయించింది. ఎక్కడికి వెళ్ళినా యోని గురించి మాట్లాడడమే ఒక వ్యసనంగా మారిపోయింది. పూర్తిగా అపరిచితులతో కూడా నేను యోని గురించి మాట్లాడాను. ఒకానొక రాత్రి నేను నా యోనిలోకి ప్రవేశించాను. అదొక అద్భుత అనుభవం. అది నన్ను భయపెట్టింది. అది నాకు శక్తినిచ్చింది. అటు తరువాత నేనొక ప్రేరణతో ముందుకు కదిలాను. నన్ను ఆసాంతం యోని ఆవహించింది.
నేను నా శరీరాన్ని ఒక వస్తువులా చూశాను. ఆ వస్తువు నన్ను వేగంగా కదిలిస్తుంది. ఆ వస్తువు ఇతర వస్తువుల్ని సాధిస్తుంది. ఒకేసారి చాలా వస్తువుల్ని అది సాధించుకుంటుంది. నా శరీరాన్ని ఒక ఐపాడ్‌లాగానో లేదా ఒక కారులాగానో చూడడాన్ని మొదలెట్టాను. నేను దాన్ని తొందర పెట్టాను. దాన్నుంచి ఎంతగానో ఆశించాను. నా ఆశలకు అంతే లేకుండా పోయింది. నా ఆశపోతుతనం అంతూపొంతూ లేకుండా ఉంది. మనిషి భూమిని పిండేస్తున్నట్టు నేను కూడా నా శరీరాన్ని పిండేస్తున్నాను. దాని మాటను వినిపించుకునే పరిస్థితిలో నేను లేను. దాన్ని నిర్దేశిస్తున్నాను. దాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నాను. నా శరీరం కోసం నాలో ఏ కాస్త సహనమూ మిగిలి లేదు. నేను మహా ఆశపోతుగా మారిపోయాను. నా శరీరం నాకు ఇవ్వదగిన దాని కన్నా ఎక్కువగానే నేను దాని నుంచి పొందాను. ఒకవేళ నేను అలసిపోతే, మరిన్ని కాఫీలు తాగాను. ఒకవేళ నాకు భయమేస్తే నేను మరింత ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళాను.
నేను నా శరీరాన్ని కొంత కనికరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దుర్మార్గుడైన తండ్రి కొన్నిసార్లు తన బిడ్డ మీద కనికరించినట్టు నేను నా శరీరాన్ని కనికరించాను. ఉదాహరణకు, నా తండ్రి నా పదహారో పుట్టినరోజున నన్ను కనికరించినట్టన్నమాట. చాలా మంది గుసగుసలు పోతున్నారు. నేను నా శరీరాన్ని మరింతగా ప్రేమించి ఉండాల్సిందని వాళ్ళు అంటున్నారు. నేను శాఖాహారిని. చాలా నెమ్మదస్తురాల్ని, నేను పొగతాగను. ఇదంతా నేను నా శరీరాన్ని మరింతగా దోచుకోవడానికే ఉపకరించింది. మళ్ళీ నేను, నా శరీరమూ వేరయ్యాం.
నేను యోని గురించి ఎక్కువగా మాట్లాడడం ఎక్కడికి దారితీసిందంటే, చాలా మంది స్త్రీలు తమ గురించి నాకు చెప్పడం ప్రారంభించారు. తమ శరీరాల గురించి నాకు కథలు, కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రపంచం నలుమూలల నుంచి వినిపించిన ఈ కథలు నన్ను కదిలించాయి. నేను అరవైకి పైగా దేశాల్లో పర్యటించాను. వేలాది కథల్ని విన్నాను. నేనిక్కడ మీకు ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పాలి. నాతో తమ కథల్ని పంచుకున్న మహిళలందరూ తాము తమ శరీరాల నుంచి విడిపోయిన తరువాతే నాతో మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి వచ్చేసిన తరువాతే నాతో మాట్లాడారు. పడక మీద, బురఖాల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో, వంటిళ్ళలో వాళ్ళు అత్యాచారాలకు గురయ్యారు. యాసిడ్ వారి వంటిళ్ళలో పొంగి పొర్లింది. కొంతమంది మహిళలు మౌనంగా, అదృశ్యులయ్యారు. మరికొంత మంది పిచ్చివాళ్ళయ్యారు. ఇంకొంత మంది నాలాగానే పరుగులు తీసే యంత్రాలయ్యారు.
ఇలా పర్యటిస్తూ ఉండగానే నాకు నలభై ఏళ్ళు నిండాయి. నేను నా శరీరాన్ని ద్వేషించడం ప్రారంభించాను. ద్వేషించడానికైనా నా శరీరం ఇంకా మిగిలే ఉందన్న మాట. సరే, ఇక నా కడుపు – నేను దాన్ని చాలా అసహ్యించుకుంటాను. కార్పొరేట్ ప్రపంచం నిర్దేశించిన కొలతల్లో నేను లేనని, నాకు వయసు మళ్ళిపోతోందని అది చెబుతుంది. నేను విఫలమయ్యాననడానికి నా కడుపే ఒక గుర్తుగా మిగిలింది. అదే నన్ను విఫలం చేసింది. నిజానికి కడుపును వదిలించుకోవాలన్న నా ఆతృత నా చేత ఒక నాటకాన్ని కూడా రాయించింది. నేను దాని గురించి ఎంత మాట్లాడుతున్నానో, అంతగానూ అది నాలో బలపడుతూంది. నా శరీరాన్ని ఛిద్రం చేస్తోంది. అదొక కొత్త రకం వినోదమైంది. అమ్మకానికి పెట్టడానికి నాకు అదొక కొత్త వస్తువైంది.
తరువాత నేను ఒక చోటికి వెళ్ళాను. నేను కాంగో ప్రజాస్వామిక రిపబ్లిక్‌కు వెళ్ళాను. అక్కడ నేను విన్న కథలు, నేనింత వరకు విన్న కథల్ని ముక్కచెక్కలు చేశాయి. ఆ కథలు నా దేహంలోకి చొచ్చుకు వెళ్ళాయి. ఒక చిన్న పిల్ల గురించి విన్నాను, ఆ పిల్ల మూత్ర విసర్జనను తనంత తానుగా నియంత్రించుకోలేదట. ఎందుకంటే, బాగా బలిసిన సైనికులు లెక్కకు మిక్కిలిగా ఆమెలోకి చొచ్చుకువెళ్ళారు. మరో ఎనభై ఏళ్ళ వృద్ధురాలి గురించిన కథనాన్ని కూడా విన్నాను. ఆమె కాళ్ళను విరగ్గొట్టారు. కీళ్ళని విరిచి, కాళ్లని తల మీదుగా మడిచి, సైనికులు ఆమె మీద అత్యాచారం చేశారు. ఇలాంటివే వేలాది కథల్ని విన్నాను. స్త్రీల శరీరాల్లో రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు, భగందరాలు – అవి యుద్ధ దురంతాలకు చిహ్నాలుగా ఉంటాయి. ఆ స్త్రీల మనసుల్లో ఆ రంధ్రాలు ఉండిపోతాయి. ఈ కథలన్నీ నా అణువణువునూ, నరనరాన్నీ పీల్చి పిప్పిచేశాయి. మూడేళ్ళ పాటు నేను నిద్రకు దూరమయ్యాను.
ఆ కథలన్నీ రక్తాన్ని స్రవిస్తూనే ఉన్నాయి. భూమిని చెరపట్టడం, ఖనిజాల్ని వెలికి తీయడం, యోనుల్ని ఛిద్రం చేయడం – వీటిలో ఏ ఒక్కటి కూడా మీకూ, నాకూ సంబంధించినది కాకుండా పోదు. సైనికులు ఆరు నెలల పసిగుడ్డు మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఎందుకంటే దేశాలు, ప్రభుత్వాలు తమ ఐఫోన్లు, కంప్యూటర్ల కోసం అవసరమైన బంగారమూ, ఇతర ఖనిజాల కోసం అర్రులు చాస్తున్నాయి కాబట్టే. ఇప్పుడు నా శరీరం ఒక అన్వేషణా యంత్రంగా మారింది. అది నన్ను మాత్రమే కాదు, వేలాది స్త్రీల శరీరాల్ని కూడా పిచ్చి, పిచ్చిగా అన్వేషిస్తోంది.
హఠాత్తుగా నాకు కాన్సర్ సోకింది. వేగంగా వచ్చి కిటికీ ఊచలకి గుద్దుకుని చచ్చిపోయే పిచ్చుకలా అది దూసుకు వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి నాకొక శరీరం వచ్చింది. ఆ శరీరం రకరకాలుగా ఛిద్రమవుతోంది. ఆ శరీరాన్ని అడ్డంగా కోసేస్తున్నారు. ఆ శరీరం నుంచి అంగాల్ని వేరు చేస్తున్నారు. కొత్తవాటిని అమరుస్తున్నారు. ఆ శరీరాన్ని స్కాన్ చేస్తున్నారు, దానికి ఏవేవో గొట్టాల్ని తగిలిస్తున్నారు. ఆ శరీరం రసాయనాలతో తగలబడి పోతోంది. శరీరానికి, నాకూ మధ్య ఉన్న అగాథంలోకి కాన్సర్ ఒక విస్ఫోటనంలా ప్రవేశించింది. నా శరీరంలో సలుపుతున్న సమస్య, ఈ ప్రపంచాన్ని సలుపుతున్న సమస్య ఒక్కటేనని నాకు హఠాత్తుగా అర్థమైంది. అది ఎప్పుడో జరిగిందీ, జరిగేదీ కాదు, ఇప్పుడే జరుగుతోంది.
హఠాత్తుగా, అన్ని చోట్లా నాకు కాన్సర్ కనిపించింది. క్రూరత్వపు కాన్సర్, లోభత్వపు కాన్సర్, రసాయన కర్మాగారపు వీధుల్లో నడయాడే జనంలోకి చొచ్చుకొస్తున్న కాన్సర్…! ఆ జనమంతా సహజంగానో, అసహజంగానో పేదవాళ్ళే. బొగ్గుగని కార్మికుని శ్వాసకోశాల్లో కాన్సర్, ఆశించినంత గొప్పదాన్ని సాధించలేకపోయిన ఒత్తిడిలోంచి కాన్సర్, అణచుకున్న వేదనల కాన్సర్, కోళ్ళ పెంపకంలో, చేపల పెంపకంలో కాన్సర్, అత్యాచారాలకు బలైన ఆడవాళ్ళ గర్భాశయాల్లో కాన్సర్, మన నిర్లక్ష్యమంతటిలోనూ కాన్సరే! ఈ కాన్సర్లన్నీ సోకక ముందు ప్రపంచం మరో విధంగా ఉండేది.
నేనేదో ఒక గడ్డకట్టిన సరస్సులో ఉన్నట్టు, ఆ ఘనీభవించిన సరస్సును కాన్సర్ ఒక బాంబులా బద్దలు కొట్టి, నన్ను ఒక పెద్ద సముద్రం నుంచి వేరు చేసినట్టు ఉంది. నేనిప్పుడు ఆ సరస్సులో ఈదులాడుతున్నాను. నేనిప్పుడు గడ్డిమైదానం మీద దొర్లుతున్నట్టు ఉంది. నా కాళ్ళకి, పాదాలకి అంటిన బురదను నేను ప్రేమిస్తున్నాను. నేనిప్పుడు ప్రతిరోజూ సీయోన్‌కి సమీపంలోని ఒక దుఃఖిత పూలతీగ దగ్గరికి నిత్యం తీర్థయాత్ర చేస్తున్నాను. బకావూ ఆరుబయళ్ళలో పచ్చదనాల కోసం నేను ఆకలిగొన్నాను.
ప్రతిదీ పరస్పర సంబంధం కలిగినదేనని నాకు తెలుసు. నా మొండెమంతటా వ్యాపించిన ఒక గాయపు మచ్చ భూకంపం పుట్టిస్తోంది. పోర్టావు ప్రిన్స్ వీధుల్లోని మూడు మిలియన్ల మందిలో నేనూ ఒకదాన్ని. కీమో థెరపీ నాలో రగిలిస్తున్న నిప్పు, ప్రపంచంలోని అడవుల్నీ రగిలిస్తోందని నాకు తెలుసు. నా వ్రణం చుట్టూ చేరిన చీము గల్ఫ్‌మెక్సికోను కలుషితం చేస్తున్న కాలుష్యమే. చమురు తెట్టుల్లో మునిగిన సముద్రపు పక్షులు, ఆ కాలుష్యానికి చనిపోయన చేపలు నాలో తేలుతున్నాయి.
నాకు రెండోసారి కీమోథెరపీ జరిగింది. అప్పుడే మా అమ్మకు బాగా జబ్బు చేసింది. ఆమెను చూడడం కోసం నేను వెళ్ళాను. ఆమె తనను మెక్సికోకి తీసుకువెళ్ళమని కోరింది. ఆమె కోరికను తీర్చాం. తాను కోరుకున్న ప్రదేశంలో ఆమె ప్రశాంతంగా కన్ను మూసింది.
కొన్ని వారాల అనంతరం నేను న్యూ ఓర్లియాన్స్‌కి చేరుకున్నాను. ఈ మంచి నేస్తం నాకు స్వాస్థ్యాన్ని చేకూర్చుతానని చెప్పింది. నాకోసం పువ్వులు, తేనె కలిపిన ఔషధాన్ని నా నేస్తం తయారు చేసింది. తనువంతా పాటైన ఆమె నాకు తలంటింది. మిగిలిన స్త్రీలంతా అక్కడికి వచ్చారు. నాకోసం, మా అమ్మకోసం ప్రార్థనలు జరిపారు.
నా జబ్బు క్రమంగా నెమ్మదించింది. నా మెక్సికో గల్ఫ్ నా కోసం కన్నీరు కార్చింది. చివరికి నేను నా సొంత ప్రదేశాన్ని కనుగొన్నాను. ఈ అనుసంధానం నాకు పెద్ద బాధ్యతని తెచ్చిపెట్టింది. కాంగోలో, ప్రపంచమంతటా నిరంతరాయంగా జరుగుతున్న యుద్ధమే నాలో ప్రతిఫలించింది. కాంగో మహిళలు ఇప్పుడు మేలుకొన్నారు. నా తల్లి నన్ను విడిచిపోతున్నప్పుడే నేను పుట్టాను. మన తల్లి, ఈ భూమాత నాలాగే చనిపోతోందని నాకనిపించింది.
మనలో ప్రతిఒక్కరికీ లభించాల్సిన వనరులు లభించి తీరాలి. నా సోదరీమణులు, తెలివైన డాక్టర్లు, సర్జన్లు, నర్సులు, తమ చేతులతో ఏం చేయాలో తెలిసిన వాళ్లందరూ నన్ను మళ్ళీ బతికించారు. ఈ పునర్జన్మ ఒక శక్తి, ప్రేమ సంతోషానికి నెలవు. ఇవన్నీ ఈ ప్రపంచంలోను, నా శరీరంలోను అంతర్లీనంగా ఉన్నాయి.’
న్యూయార్క్‌లో ఒక సాధారణ ఉద్యోగికి, గృహిణికి జన్మించిన ఈవ్ ఎన్‌స్లర్ జీవితం అరాచకంతో మొదలైంది. బాల్యంలో తండ్రే ఆమె మీద మానసిక, శారీరక అత్యాచారానికి సమకట్టాడు. ఆ దుర్మార్గం నుంచి బయట పడిన ఈవ్ 1975 లో మిడిల్‌బరీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. ఆమె 1978లో రిచర్డ్ మెక్‌డెర్మోట్‌ను వివాహం చేసుకుంది. పదేళ్ళ తరువాత వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆమె తన 23వ యేట 15 ఏళ్ళ డిలన్ మెక్‌డెర్మోట్ అనే హాలివుడ్ నటుణ్ణి దత్తత తీసుకుంది. ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఈవ్ ‘వజైన్ మోనోలాగ్స్’ అనే ప్రపంచ ప్రఖ్యాత నాటకాన్ని రచించింది. ఈ నాటకంలో జేన్ ఫోండా, ఊఫీి గోల్డ్‌బర్గ్, ఓప్రా విన్‌ఫ్రే తదితర హాలివుడ్ హేమాహేమీలందరూ నటించారు.
మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈవ్ ‘వి-డే’ అనే సంస్థను స్థాపించింది. ఆమె పలు చలన చిత్రాలు, డాక్యుమెంటరీల కోసం కూడా పనిచేసింది. ఈవ్‌కు 1997లో వజైన్ మోనోలాగ్స్‌కు ‘ఒబి అవార్డు’, నాటక రచనలో బెర్రిలా కెర్ అవార్డు, మ్యాట్రిక్స్ అవార్డు, ఇజబెల్ టోనీ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలెన్నో లభించాయి. ‘తిరిగి వెనక్కి రావాలన్న భయం మటుమాయం అయ్యేంత వరకు ఎంత దూరానికైనా ప్రయాణించు’ అంటున్న ఈవ్ ఎన్‌స్లర్ తనతోపాటు పదాల్ని, పాదాల్ని కలిపి కదంతొక్కేందుకు ప్రపంచ మహిళలందర్నీ ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూనే ఉంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags