రాము సురవజ్జల (ఆంద్రప్రదేశ్ మీడియా కబుర్లు)
చిట్టితల్లీ..మలాలా.. స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్ మతఛాందసులు గత మంగళవారం (అక్టోబరు 9) పేల్చిన తూటా మా అందరి గుండెలను గాయపరిచింది. అచేతన స్థితిలో రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నువ్వు తప్పక కోలుకోవాలని మేమంతా రోజూ ప్రార్థనలు చేస్తున్నాం. నీపై దాడి గురించి తెలిసి దు:ఖం ఆపుకోవడం నా వల్ల కాలేదు. నీకు ఎలాంటి అపాయం కలగకూడదని శుక్రవారం నేనూ ఉపవాసం ఉన్నాను. అల్లాను ప్రార్థించాను. నీకేమీ కాదు. నువ్వు పువ్వులా నవ్వుతూ బైటికి వస్తావు. మా ప్రార్థనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు, దీవెనలు వృధా పోవు. నీ పోరాటం వ్యర్థం కాదు.
ఈ రోజు ‘డాన్’ పత్రికలో వచ్చిన చిన్న వార్త నన్ను ఎంతగానో ఆనందపరిచింది. మొట్టమొదటిసారి ఒక కాలు, చేయి కదిలించావని డాక్టర్ చెప్పారు. జర్మనీలో వున్న ఒక అమెరికన్ ఆసుపత్రికి నిన్ను తరలించి మెరుగైన వైద్యం చేస్తారని అంటున్నారు. అంతా సవ్యంగా జరిగి నువ్వు తొందరగా కోలుకుంటావు. తల్లీ…మతం, కులం బురదల్లో పొర్లుతున్న మా అందరికీ నిజానికి నువ్వు ఒక గుణపాఠం. తాలిబన్లు చెప్పి చేస్తున్నారు. ఆడపిల్లలను వద్దనుకోవడం, స్త్రీలను రకరకాలుగా కించపరచడం అన్ని మతాలలో ఉన్న తాలిబన్లు నిత్యం చేస్తున్న పనే. మంచి మాట చెబితే, మంచిని మానవత్వాన్ని గౌరవిద్దామని అడిగితే…నీ కులాన్ని, మతాన్ని, అభిమానాన్ని ఎత్తి చూపి నోరు మూయడం ఇక్కడ మామూలయ్యింది. మతం, కలం, వ్యక్తిగత లబ్దికోసం వీరికి అద్భుత సాధనాలు. మనిషిని మనిషిగా చూస్తూ..లౌకిక భావనలతో బతకడం ఇక్కడ చేతకాదు. తాలిబాన్లను ఘాటుగా విమర్శిస్తున్నావని తెలిసి తెలిసి ఈ న్యూయార్క్ టైమ్స్, బి.బి.సి నీ కథనాలు ఎందుకు ప్రసారం చేసాయో తెలియడం లేదు. నీ ముఖాన్నైనా కవర్ చేయకుండా…ముష్కర మూకలపై నీ మాటల అస్త్రాలను ఆ జర్నలిస్ట్‌లు ఎలా ప్రసారం చేస్తారు? అలా చేయడానికి ఒక వేళ కుటుంబం అనుమతించినా…జర్నలిస్ట్‌ల నీతి నియమాలు ఏమయ్యాయి? నీ ఇంటర్వ్యూ చూసిన నాకు అప్పుడే అనిపిసించింది..మతిలేని తాలిబన్ నీకెేమైనా హాని చేస్తుందేమో అని. నిజంగా అదే జరిగేసరికి తట్టుకోవడం కష్టంగా ఉంది. బాలికల విద్య కోసం, హాయిగా బతికే హక్కు కోసం నువ్వు చేస్తున్న పోరాటం, ఒక రాజకీయవేత్తగా దేశానికి సేవ చేయాలన్న నీ సంకల్పం ఎంతో గొప్పవి. పద్నాలుగేళ్ళ చిన్న వయసులోనే నీకున్న అభ్యుదయ భావాలు ఎంతో అబ్బురపరుస్తున్నాయి.