పసుపులేటి గీత
1994…..,
ఇక్బాల్ మాసి….,
ఒక బక్కపలచని చిన్న పిల్లడు. తన రెండు చేతుల్నీ పైకెత్తి ‘ఉయ్ ఆర్….’ అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆ కంఠస్వరం ఎంత బలహీనంగా ఉందో, ఆ నినాదం అంత శక్తిమంతంగా ఉంది. అతను అలా కేక పెట్టగానే, రెండు వేల గొంతులు ‘ఫ్రీ…’ అంటూ నినదించాయి.
ఆ రెండు వేల గొంతులు బానిస పిల్లలవే!‘ఉయ్ ఆర్ ఫ్రీ’….
‘పాకిస్తాన్‌లో వెట్టిచాకిరిలో మగ్గుతున్న కోట్లాదిమంది పిల్లల్లో నేనూ ఒకణ్ణి. కానీ నేను అదృష్టవంతుణ్ణి. వెట్టి చాకిరీ విముక్తి సంస్థ (బిఎల్‌ఎల్‌ఎఫ్) నాకోసం ఎంతో చేసింది, ఆ సంస్థ ప్రయత్నాల వల్లే నేనిప్పుడు మీ ముందు నిలుచుని ఉన్నాను. నాకు విముక్తి లభించిన తరువాత ఇప్పుడు నేను బిఎల్‌ఎల్‌ఎఫ్ పాఠశాలలో చేరి చదువుకోవడం మొదలుపెట్టాను. అమెరికాలో బానిసల విముక్తికి అబ్రహాం లింకన్ ఏం చేశాడో, బిఎల్‌ఎల్‌ఎఫ్, ఎహ్సాన్ ఉల్లా ఖాన్ కూడా మనలాంటి బానిస పిల్లలకు అదే చేశారు. అందుకే ఇవాళ నేనూ, మీరూ స్వేచ్ఛను పొందాం. దురదృష్టమేమిటంటే, నేను పనిచేసిన కార్పెట్ మిల్లు యజమాని ఏమన్నాడంటే, అమెరికా వల్లనే తాము మనలాంటి బానిస పిల్లల చేత పనిచేయిస్తున్నారట. ఎందుకంటే అమెరికన్లకు పాకిస్తాన్‌లో తయారయ్యే చవకబారు దుప్పట్లు, తువ్వాళ్ళు, ఊలు తివాచీలంటే చాలా ఇష్టం కాబట్టి పరోక్షంగా మన బానిసత్వానికి అమెరికానే కారణం అని అతను చెబుతున్నాడు. కానీ అలాంటి యజమానులందరినీ నేను ఒక్కటే వేడుకుంటున్నాను. పిల్లలు చదువుకోవడానికి పుట్టారే తప్ప, మీ మిల్లు ఉపకరణాల్లా వాడడానికి కాదు. వాళ్లని వెట్టిచాకిరీకి బలి చేయకండి.
పిల్లలు దీంతో పని చేస్తారు (ఇక్బాల్ కార్పెట్ మిల్లులో ఉపయోగించే ఒక ఉపకరణాన్ని పైకెత్తి చూపాడు). ఒకవేళ చేస్తున్న పనిలో ఏదైనా తప్పు దొర్లితే, దీంతోనే వాళ్ళని కొడతారు, అలా కొడుతున్నప్పుడు పిల్లలు గాయపడితే వాళ్లని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళరు. (తరువాత అతను ఒక పెన్నును పైకి చూపెడుతూ…) పిల్లలకు ఇప్పుడు ఇది కావాలి. దురదృష్టవశాత్తు చాలా మంది పిల్లలు ఇప్పుడు దీన్ని ఉపయోగించడం లేదు. అందుకే మీరంతా బిఎల్‌ఎల్‌ఎఫ్ కి సహాయపడాలి. ఆ సంస్థ మనకు సహాయపడినట్టుగానే మనం కూడా పిల్లల బానిస సంకెళ్ళని తెంచడంలో బిఎల్‌ఎల్‌ఎఫ్‌కి సహాయ పడాలి. అప్పుడే బిఎల్‌ఎల్‌ఎఫ్ దీన్ని (పెన్నును) మరింతమంది పిల్లలకు అందించగలదు.
పాకిస్తాన్‌లో తయారైన తివాచీల్ని నేను అమెరికన్ దుకాణాల్లో చూశాను. ఆ తివాచీలన్నీ పాక్ పిల్లల వెట్టి చాకిరీ నుంచి తయారైనవేనన్న చేదు నిజాన్ని నేను ఎన్నటికీ మరవలేను. పిల్లల్ని బానిసలుగా, కార్మికులుగా వాడుకుంటున్న దేశాల మీద ఆంక్షలు విధించాలని నేను అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ను కోరాను. బానిసత్వం నుంచి విముక్తి పొందిన తరువాత మనం పాఠశాలల్లో ఒక నినాదాన్ని ఎలుగెత్తి చాటుదాం. ‘ఉయ్ ఆర్ ఫ్రీ’ (మేం స్వేచ్ఛను పొందాం). ఆ నినాదాన్ని చాటడంలో మీరు కూడా నాతో సహకరించండి. ఇప్పుడు నేను ‘ఉయ్ ఆర్….’ అంటాను. మీరంతా ‘ఫ్రీ’ అంటూ గట్టిగా నినదించండి. ఆ పిల్లాడు అలా గట్టిగా కేక పెట్టగానే అక్కడున్న రెండువేలమంది పిల్లలూ అతనితో గొంతు కలిపి గర్జించారు.
ఇక్బాల్ మాసి, పాకిస్తాన్‌లోని ఒక పేద కుటుంబంలో జన్మించిన పిల్లవాడు. పన్నెండేళ్ళ వయసులోనే అతను జీవితంలోని ఎగుడుదిగుళ్ళంటినీ చూసేశాడు. అయినా ఇంకా ఎంతో చూడవలసి ఉండగానే, కార్పెట్ మాఫియా చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు.
ఇక్బాల్ పాకిస్తాన్‌లోని లాహోరు నగర శివార్లలో ఉన్న మరుద్కే అనే ఒక చిన్న పల్లెటూళ్ళో జన్మించాడు. ఇక్బాల్ పుట్టగానే అతని తండ్రి కుటుంబాన్ని గాలికి వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. తల్లి ఇనాయత్ ఇళ్ళలో పాచిపని చేసేది. ఆమె సంపాదన కుటుంబ పోషణకు ఎంతమాత్రం సరిపోయేది కాదు. కానీ ఈ కష్టనష్టాల గురించి తెలియని ఇక్బాల్ అందరి పిల్లల్లాగానే పొలాల్లో ఆడుకుంటూ ఆనందంగా గడిపేవాడు. అతనికి నాలుగేళ్ళ వయసు వచ్చిన తరువాత జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఇంట్లో పెద్దన్నయ్యకు పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళి ఖర్చులకు చాలినంత డబ్బు చేతిలో లేని ఇనాయత్ స్థానిక షావుకారు దగ్గర అప్పు చేసింది.
పాకిస్తాన్‌లో ఇప్పటికీ పేష్గీ (వెట్టిచాకిరీ హామీ పై అప్పులివ్వడం) పద్ధతి గ్రామాల్లో అక్రమంగా అమల్లో ఉంది. ఆ పద్ధతి ప్రకారం కోరిన డబ్బును షావుకారు ఇస్తాడు. కానీ అప్పు చేసిన వారి కుటుంబంలో చిన్నపిల్లల్ని ఒక ఏడాది పాటు జీతంభత్యం లేని చాకిరీకి అతని దగ్గర వదిలేయాలి. అప్పు తీరిన తరువాతే ఆ పిల్లలకు విముక్తి. కానీ ఆ అప్పు వడ్డీల మీద చక్రవడ్డీలుగా పెరిగి ఏనాటికీ తీరదు. నాలుగేళ్ళ ఇక్బాల్‌ను ఫణంగా పెట్టి ఇనాయత్ ఊరి షావుకారు దగ్గర పేష్గీగా ఆరువందల రూపాయలు అప్పు చేసింది. ఇక్బాల్ షావుకారు దగ్గర తివాచీ నేతలో పనివాడుగా బలవంతంగా చేరిపోయాడు. పిల్లల చేత వెట్టిచాకిరీ చేయించుకునే ఈ వ్యవస్థలో పిల్లలు పనిచేస్తున్నపుడు జరిగే నష్టాల్ని కూడా రుణంగా తీసుకున్న మొత్తానికి జమచేస్తారు.
ఇక్బాల్ అలాంటి సవాలక్ష తప్పులు చేస్తూ, దెబ్బలు తింటూ పదేళ్ళ పాటు పని చేసినా, అతను తీర్చాల్సిన బాకీ 13 వేల రూపా యలకు పెరిగిందే తప్ప, తరగలేదు. పిల్లలు రోజుకు పద్నాలుగు గంటల పాటు గొంతుకూర్చుని, దారాల్ని, వాటి ముడుల్ని ఎంపిక చేస్తూ, కలుపుతూ పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. ఒకవేళ పరధ్యానంగా పనిచేస్తే, పక్కనే ఉన్న ఒక రౌడీ వాళ్ళని చితకబాదుతాడు. లేదా పనిలో ఉపయోగించే ప్రమాదకరమైన వస్తువులు వాళ్ళని తీవ్రంగా గాయపరుస్తాయి. పని తరువాత వాళ్ళని ఒక చీకటి కొట్టులో పడేస్తారు. చాలినంత తిండి పెట్టరు. రోగమొస్తే అదేదో వాళ్ళ అపరాధమైనట్టు ఆ పిల్లల్ని ఘోరంగా హింసిస్తారు.
ఇలాంటి నరకంలో పదేళ్ళు గడిపిన ఇక్బాల్‌కు ఒకరోజు పిల్లల వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న బిఎల్‌ఎల్‌ఎఫ్ గురించి తెలిసింది. అతను ఎలాగోలా తప్పించుకుని వాళ్ళని కలిశాడు. పాకిస్తాన్‌లో పేష్గీ వ్యవస్థ 1992లోనే రద్దయిందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ కుర్రవాడు ఆశ్చర్యపోయాడు. దాంతోపాటు అలా తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందని తెలుసుకున్నాడు. అతను వెంటనే బిఎల్‌ఎల్‌ఎఫ్ అధ్యక్షుడు ఎహ్సాన్ ఉల్లాఖాన్‌ను కలిసి, తన పరిస్థితిని వివరించాడు. దాంతో అతను తనకు మాత్రమే కాక, తనతోపాటు పనిచేస్తున్న పిల్లలకు కూడా స్వేచ్ఛను సాధించాడు. ఇక్బాల్ బిఎల్‌ఎల్‌ఎఫ్ నిర్వహిస్తున్న పాఠశాలలో చేరాడు. నాలుగేళ్ళలో చదవాల్సిన చదువును అతను రెండేళ్లలో పూర్తి చేశాడు. తనకు విముక్తి కల్పించిన సంస్థకు సహకరిస్తూ, అతను పిల్లల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న లాహోరులోని అనేక కార్పెట్ సంస్థల్ని మూయించాడు. ఆ సంస్థ సమావేశాల్లో ప్రసంగించే వాడు. అతని గురించి అంతర్జాతీయ మీడియాకు తెలిసింది. అతనికి రీబక్ హ్యూమన్‌రైట్స్ అవార్డు కూడా లభించింది.
అంత చిన్న పిల్లవాడి మనుగడకు ముప్పుతెస్తామంటూ ఎన్నెన్నో బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ వాటిని ఇక్బాల్ లక్ష్యపెట్టలేదు.
అయితే 16, ఏప్రిల్, 1995న ఇక్బాల్ తన కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకుంటుండగా, ఎవరో ఆగంతకులు అతని మీద తుపాకీ కాల్పులు జరిపారు. ఆ పిల్లవాడు అక్కడికక్కడే కన్నుమూశాడు. వెట్టిచాకిరీ నుంచి పిల్లలకు విముక్తి కల్పించేందుకు ఉద్యమించిన ఈ బాలవీరుడి సంకల్పబలానికి భయపడిన కార్పెట్ మాఫియానే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని ప్రపంచం భావించింది. ఇప్పుడు ఇక్బాల్ లేడు. కానీ పాకిస్తాన్, భారతదేశాల్లోని మట్టి ఇటుకలు, కార్పెట్లు, బీడీలు, తదితర వస్తువుల్ని తయారు చేసే కర్మాగారాల్లో నేటికీ వెట్టి చాకిరీలో మగ్గుతున్న కోట్లాది మంది పిల్లల కళ్ళలో అతను ఎప్పటికప్పుడు ఒక ఆశాజ్యోతిగానే వెలుగుతుంటాడు. వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థకు మన సమాజం నుంచి లభించాల్సిన దీటైన జవాబు కోసం అతను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు.