పరుచూరి జమున
”నన్ను ఒక ఏడాదంతా గదిలో బంధించారు. బయట ముఖం చూడలేదు. రోజుకి కనీసం 30 మంది మగవాళ్ళని నా దగ్గరకు పంపేవారు. వాళ్ళు చెప్పినట్టే నేను చేయకపోతే నన్ను చితకబాదేవారు. నా వొళ్ళంతా వాళ్ళు పెట్టిన కత్తి గాట్లు అట్టాగే ఉన్నాయి.”
”ఇరవై ముఫ్ఫె మంది ఆడవాళ్ళను ఒకే గదిలో పెట్టి కస్టమర్లని పంపేవాళ్ళు. వాళ్ళెంత వికృతమైన సెక్సు కోరికలు కోరినా మేం తీర్చవలసిందే. కస్టమర్లు చాలా హింస పెట్టేవాళ్ళు. ఎదురు తిరిగామో చావు దెబ్బలతో ఒళ్ళు హూనమే ఆ రోజు. చాలా సార్లు తిండి కూడా పెట్టరు.”
”25 వేలిచ్చి కొనుక్కొంది. ఏడాది అని చెప్పారు. నేను చదువుకోలేదు. అయిదేళ్ళుగా మార్చి రాసేసుకున్నారు కాంట్రాక్ట్‌ను”.
”రోజుకి 24గంటలే. కానీ నేను మాత్రం వందమంది మగవాళ్ళను సంతృప్తి పరచి పంపాల్సి వచ్చేది. వ్యభిచారగృహాన్ని నడిపే ఆమె అడిగినంత సంపాదించి ఇవ్వకపోతే అన్నం, పచ్చిమంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు” (నవోదయం రిపోర్టరు)
ఆంధ్రప్రదేశ్‌లో రోజుకి 22 మంది మహిళలు, పిల్లలు అదృశ్యమవుతున్నారు. గత నాలుగేళ్ళలో 40 వేలకు పైగా పిల్లలు, మహిళలు మాయమయ్యారు” ( టైమ్స్ ఆఫ్ ఇండియా)
ప్రతిరోజూ భారతదేశంలో 200 మంది స్త్రీలు ఇలాంటి భయంకరమైన వ్యభిచార వృత్తిలో ప్రవేశిస్తున్నారని వారిలో 20 % మంది 15 సంవత్సరాలలోపు వారేనని ఒక అంచనా. భారతదేశంలో40 వేల కోట్లు మేర సెక్సు వ్యాపారం సాగుతుందని అందులో 11 వేల కోట్లకు పిల్లలను లైంగికంగా దోపిడి చేయడంద్వారా సంపాదిస్తున్నారని అంటున్నారు (గుప్తా.2003) 15 వేలనుంచి 40 వేల రూపాయలకు ఒక ఆడపిల్ల చొప్పున వ్యభిచార గృహాలవాళ్ళు కొనుక్కుంటున్నారు.
మహిళలకు, ఆడపిల్లలకు సంబంధించిన అన్ని రకాల మానవ హక్కులను ఉల్లంఘిస్తూ శతాబ్దాలుగా సాగిస్తున్న ఈ అమ్మకాలు కొనుగోళ్ళు మనిషి బుద్ధిని, సమాజనాగరికతను అవహేళన చేస్తున్నాయి. ఆడవారిని సరుకులుగా మార్చి సాగిస్తున్న ఈ వ్యాపారం ‘ఆధునిక బానిసత్వానికి అద్దం పడుతున్నది. వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కల్గిస్తోంది. వారి గౌరవాన్ని, భద్రతను హరిస్తోంది.
వ్యభిచారంలోకి మహిళలను, ఆడపిల్లలను బలవంతంగా తరలించడాన్ని అక్రమ రవాణా అంటారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం అక్రమ రవాణా అంటే :బెదిరించడం, బలప్రయోగం, అపహరించడం, మోసగించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, వ్యక్తి బలహీనమైన పరిస్థితులను ఆసరా చేసుకోవడంద్వారా ఒక మహిళను/బాలికను లైంగికంగా, ఆర్థికంగా దోపిడీ నిమిత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడాన్ని అక్రమ రవాణా అంటారు. బానిసత్వం తరహా బానిస పద్ధతుల్లోకి నెట్టేయడం, అవయవాలు తీసేయడం, బలవంతపు చాకిరీ చేయించుకోవడం, వేధించి లైంగిక సేవలు పొందడం అన్ని దొపిడీ క్రిందకు వస్తాయి.
మానవ వనరుల అక్రమ రవాణా ముఖ్యంగా మహిళా, పిల్లల అక్రమ రవాణా అనేక రకాలుగా భిన్న ప్రయోజనంతో సాగుతున్నది. పెళ్ళికోసం, పనికోసం, దత్తతకోసం, యుద్ధాల్లో పనిచేసినవారి సేవల నిమిత్తం, వ్యభిచార వృత్తిలోకి దించేందుకు, డ్రగ్స్, ఆయుధాల చేరివేతకు, అవయవాల తీసుకోడానికి, మెడికల్ ప్రయోగాలకోసం ఇలా ఎన్నో రకాల కారణాలతో ఇది సాగుతుంది.
బ్రతుకు తెరువుకోసం వలస వెళ్ళడం నేటి ఆర్థిక విధానంలో ఒక ప్రజాస్వామిక హక్కు. అలా అని చట్టబద్ధమైన వలసలన్ని సక్రమమైన ప్రయోజనాలనే నేరవేస్తున్నాయన్నడానికి వీలులేదు. అదే విధంగా చట్టవిరుద్ధమైన వలసనన్నంటిన్నీ వ్యభిచారంకోసం సాగే అక్రమరవాణాగానే అనుకోనక్కరలేదు. మనం ఈ వ్యాసంలో చర్చిస్తున్న అక్రమ రవాణా అంతా మహిళలను వేశ్యవృత్తికోసం అక్రమంగా తరలించడం గురించే.
కొందరు వ్యభిచార వృత్తిలోనే అక్రమ రవాణా అనుకుంటారు. మరికొందరు చట్టవిరుద్ధమైన వలసలన్ని అక్రమ రవాణా అనుకొంటారు. వీటన్నింటి మధ్య అవినావసంబంధం ఉందనేది వాస్తవం. అక్రమరవాణా చేయబడిన వారంతా ఏ రకంగా వలస వెళ్ళినా చివరికి వ్యభిచార వృత్తిలోకే దించబడుతున్నారు కాబట్టి అ వ్యవహారన్నంతటినీ ట్రాఫికింగ్‌గానే పరిగణించాలి. స్త్రీల హక్కులకు, వారి మానవహక్కులకు తీవ్రభంగం కలిస్తున్నట్టుగానే చూడాలి.
చాలామంది మహిళలకు పని ఇప్పిస్తామని తీసుకెళ్ళి వ్యభిచార గృహాల్లో వదిలేస్తారు. ఈ ప్రదేశాలకు చేరుకునే వరకూ వారికి తెలియనే తెలియదు. అలాగే దొంగపెళ్ళిళ్ళు చేసుకుని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. చాలా మందికి అమ్మేసిన తరువాతగానీ అర్థం గావడం లేదు. అది పెళ్ళా కాదా, ఆ పెళ్ళిళ్ళు ఏ చట్టం క్రిందకు వస్తాయనేది పెద్ద ప్రశ్న.
కొందరు సెక్సు వర్కు చేస్తున్నామని చెబుతున్నారు. దానిని ఒక పనిగా చెప్పడమే గాక, తాముండే ప్రాంతంలో రక్షణ కల్పించాలని, పనికి లైసెన్సులు ఇవ్వాలని అంటున్నారు. ఆరోగ్యం, ఇల్లు, కరెంటు కనెక్షన్, మంచినీటి సదుపాయం, రేషన్ కార్డు, ఓటరుకార్డు మొదలైనవన్ని ఇవ్వలసిందిగా డిమాండు చేస్తున్నారు. బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇది ఉద్యమంగా కూడా కొనసాగింది.
2012 ఆగస్టు నెలలో అనంతపురంలోని కదిరి, నల్లచెరువు, గాండ్లపెంట, తలుపుల, నల్లమడి మండలాలు వెళ్ళడం జరిగింది. కరువు, వ్యవసాయం పనులు లేకపోవడంకారణంగా, ప్రత్యామ్నాయ జీవనోపాధులు కొరత వలన ఆ మండలాల్లో చాలా అధిక సంఖ్యలో మహిళలు ‘ట్రాఫికింగ్’ కి గురవుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ జండర్ విభాగం ఈ సమస్యపై అక్కడ వారం రోజులపాటు పర్యటించి, ప్రాథమికంగా ఒక జండర్ ఎంక్వరీ నిర్వహించింది.
అక్రమ రవాణాకి గురైన 61 మంది మహిళలను కలిసి వారి స్థితిగతుపై చర్చించడం జరిగింది. ఈ 61 మందిలో 37 మంది షెడ్యూల్డు కులాలకు, జాతులకు చెందిన వారుకాగా 18 మంది బి.సి కులాలకు చెందినవారున్నారు. ఇద్దరు మాత్రమే ఒ.సి లుగా ఉన్నారు. అందరూ 24-45 సంవత్సరాల మధ్య వయస్సువారే. వీరంతా బెంగూళూరు, ఢిల్లీ, బొంబాయి,పూనా వెళ్ళి వచ్చినవారు. వీరందరూ పెళ్ళి అయినవారే కావడం మరో విశేషం.
చిన్నతనంలో పెళ్ళి కావడం, భర్త నుంచి విడపోవడం, గృహహింస, వరకట్నం వేధింపులకు గురైనవారు, భర్త చనిపోవడం వలన దిక్కు లేక పిల్లలను పెంచుకోవడానికి ఈ వృత్తిలోకి దిగినవారు వీరిలో ప్రధానంగా ఉన్నారు. ఈ వృత్తి వద్దనుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
ఎక్కువమంది ఆడపిల్లలున్న కుటుంబం ట్రాఫికింగ్‌కి, వరకట్న సమస్యలకు, బాలకార్మిక సమస్యకు చాలా తొందరగా గురవుతున్నది. భర్తలు విపరీతమైన మద్యపానానికి అలవాటు పడి చాలా చిన్న వయస్సులోని మహిళలు వితంతువులుగా మారిపోతున్నారు. వితంతువులైన సందర్భంలో వారు ఆర్థికంగా ఏమిలేని బలహీనస్థితిలో ఉంటున్నారు. దీనికి తోడు పిల్లల పోషణ భారం కూడా వారి మీదనే పడుతున్నది. ఏమైనా చిన్నగా ఆస్థిపాస్తులున్నా అవి భర్త చివరిదశలో అతని ఆరోగ్యాన్ని కాపాడాటానికి అమ్మేసి అప్పులు కూడా చేసిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. ఇటువంటి స్థితిగతుల్లో ఉన్న మహిళ ఏ రకమైన అండదొరక్క, విధిలేని స్థితిలో, ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది. నిజంగానే పని దొరుకుతుందనే ఆశతో వేరే ప్రాంతాలకు ప్రయాణం కడుతున్నది. చివరికి వ్యభిచార గృహంలో తేలేసరికి నిట్టనిలువుగా కృంగిపోతున్నది. ఈ సంటకస్థితి నుంచి రక్షించడానికి ఒంటరి మహిళల కుటుంబాలను ఆదుకోవడంద్వారా ట్రాఫికింగ్‌ను కొంతవరకూ నివారించవచ్చని చెప్పారు.
వీరిలో 70 శాతం మంది పూర్తిగా నిరక్షరాస్యులు. ఇద్దరు మాత్రమే హైస్కూల్ చదువు పూర్తి చేశారు. వాళ్ళిద్దరూ ఒక ఎన్‌జిఓ వద్ద పనిచేస్తున్నారు. చదువు లేకపోవడంవల్ల కూడా ప్రత్యామ్నాయం దొరకని స్థితి ఏర్పడుతున్నది.
సోషల్ యాక్షన్ కమిటీల వారు పునరావాసంకోసం వారిలో 45 మందిని స్వయంసహాయక సంఘాల్లో చేర్పించారు. కానీ స్పందించగలిగిన సిబ్బంది లేకపోవడంవలన వారికి జీవనోపాధులు కల్పించలేకపోయినారు. బ్యాంకులకు తీసుకెళ్ళి, బ్యాంకువారిని ఒప్పించి రుణాన్ని మంజూరు చేయించలేకపోయినారు. పోలీసులు రెస్క్యూ చేసిన వారందరికీ 10 వేల రూపాయలను తక్షణ సహాయంగా అందించారు. కానీ దాని వలన ఎటువంటి ఫలితం లేకపోయింది.
సంఘాల్లోని ఇతర మహిళలు కూడా వారిని తొలిదశలో భిన్నంగా చూసేవారు. కానీ ఇపుడు వారిపట్ల దృక్పథం మారింది. ఫలితంగా వ్యవసాయ కూలీలుగా వారిని పనిలోకి పిలవడం జరుగుతున్నది. అంతేగాక వారికి కుట్టుమిషన్లు ఇవ్వడం జరిగింది. అందరూ వారిదగ్గరకి వెళ్ళి కుట్టు పనులు చేయించుకొంటున్నారు. 36 మంది దగ్గర ప్రస్తుతం ఉపాధి హామీ పథకం క్రింద జాబ్‌కార్డు ఉంది. మరో 30 మందికి జాబ్‌కార్డ్డే లేదు.
ఈ 67 మంది మహిళల్లో 12 మందికి పిల్లలు లేరు. మిగిలిన 55 మందికి మొత్తం 88 మంది పిల్లలు ఉన్నారు. వారిని పోషించడమే గగనంగా ఉందని, వారి చదువు సంధ్యలు చూడడం మరింత భారంగా ఉంటుందని ఆ మహిళలు చెప్పారు. వారిలో కొందరు స్థానిక ఎన్‌జిఓ వద్ద ఎపిసాక్స్ సహాయంతో హెచ్‌ఐవి, ఎయిడ్స్ మీద గ్రామాల్లో మహిళలను చైతన్యవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వివిధ రకాలుగా వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్న 5000 మంది మహిళలను గుర్తించారు. వారికి కాండోమ్‌లను సరఫరా చేస్తున్నారు. తమ వద్దకు వచ్చే పురుషులను తప్పని సరిగా కాండోమ్ వాడవలసిందిగా డిమాండు చేయాలని ప్రచారం చేస్తున్నారు. అలా చేయడంద్వారా హెచ్‌ఐవి,ఎయిడ్స్‌లకు గురికాకుండా తమని తాము కాపాడుకోవడమేగాక, తమ వద్దకు వచ్చే పురుషులను, వారి కుటుంబాలను కూడా రక్షించినట్లేనని వారంటున్నారు. ఇందుకోసం స్థానిక ఎన్‌జిఓ సహాయం తీసుకుంటున్నారు.
ఈ సమాజం తమపై ఒక ముద్ర వేసి అదే దృష్టితోనే ఎప్పటికీ చూస్తుంటుందని, అది సరికాదని చెప్పారు. వారిలో ఒకరు ఇలా ప్రశ్నించారు. ”మమ్మల్ని వ్యభిచారులంటారు. మా దగ్గరకు వచ్చే పురుషులందరికీ కుటుంబాలు ఉంటాయి. మరి ఆ పురుషులంతా కూడా వ్యభిచారులే గదా! వారినెందుకు ఈ సమాజం గౌరవిస్తుంది? మాకెందుకు ముద్రలు వేసి అవమానిస్తుంది?” చాలామంది భర్తలే తమ ఇళ్ళలోనే వ్యభిచారం చేయిస్తున్నారు. కొందరు వీధుల్లో నిలబడుతున్నారు. మరికొందరు దిక్కులేక, తమంతటతామే ఇక్కడ స్థానికంగా వ్యభిచారానికి పేరుపడిన వాడల్లోకి వచ్చి కొద్ది రోజులుండి వెనక్కి వెళుతుంటారు. వీళ్ళంతా కూడా మాలాంటివాళ్ళే. నిజానికి వీళ్ళందరి కంటే మేమే ఎక్కువ కష్టాలు పడ్డాం. మాకు తెలియకుండానే మోసబోయి, పనులు ఇప్పిస్తారని చెబితే వలస అనుకొని వెళ్ళి ఈ కూపంలో చిక్కుకుపోయాం. పోలీసులు వచ్చి దాడులు నిర్వహించి మమ్మల్ని బయటకు తెచ్చేదాకా బందీలు లాగానే బ్రతికాం. మేం సంపాదించిన దానిమీద కూడా మాకు హక్కు లేకపోయింది.
” మమ్మల్ని ఈ స్థితిలోకి నెట్టిన సమాజమే సిగ్గు పడాలి.” అంది మరొకామె ఆవేశంగా. అయితే కొందరు తమంతతామే ఎన్నో ప్రయత్నాలు చేసి తోటి మహిళల సహాయంతో, చాలా సాహసోపేతంగా బయటపడినవారున్నారు.
బాల్‌పల్లి తండాలో మల్లేశ్వరి, నూర్జహాన్, పార్వతి, సాలెమ్మ, జయమ్మ మొదలైనవాళ్ళంతా సంఘాల్లో చేరారు. సంఘాల ద్వారా 35000 రూపాయలు అప్పు తీసుకొని గొర్రెలను కొన్నారు. వాటిని జాగ్రత్తగా చూసుకున్నారు. ఏటా పుట్టిన పిల్లలను ఉంచుకొంటూ పెద్దవాటిని అమ్ముకుంటూ ఆదాయం పొందుతున్నారు. పిల్లలను చదివించుకొంటున్నారు. ఇందిరమ్మ గృహాలను పొందారు. చాలా సంతోషంగా ఉన్నారు. సోషల్ యాక్షన్ కమిటీలద్వారా నలుగురిలో కలిసి పోగలిగారు. ఇపుడు పాలప్రగతి కేంద్రాలను నెలకొల్పు కొంటున్నారు. నిజమైన అండ దొరికినపుడు కష్టాల నదిని దాటడం సులభమేనంటున్నారు.
బాలేపల్లితాండా మహిళలు ఇచ్చిన ధైర్యంతో ఇపుడు అనంత పురం, చిత్తూరు, కడప జిల్లా లోని సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు ఈ ప్రాంతంలో ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పనద్వారా పెద్ద ఎత్తున ట్రాఫికింగ్‌ను ఆపేయడానికి వ్యూహారచన చేస్తున్నారు.