డా. సూరి సువర్ణలక్ష్మి
”దేశమని మెడుదొడ్డ వృక్షము
ప్రేమలనియడి పూలెత్తలెనోయ్”
అని విశ్వజనీనతని వికసింపచేసిన గురజాడ అప్పారావుగారి నూట యాభయ్యవ జయంతి ఉత్సవాల సందర్భంగా మిసెస్ ఏ.వి.యన్. కళాశాల, తెలుగు శాఖ, ఉమెన్ ఇండియన్ అసోసియేషన్, విశాఖపట్నం సంయుక్తంగా నిర్వహించిన ”గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం” జాతీయ సదస్సు నవంబరు 9 వ తేదీన విశాఖపట్నంలోని ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ వారి ఆడిటోరియంలో నాలుగు సమావేశాలుగా జరిగింది.
ఈ సదస్సు ఆరంభ సభకి ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు తాళ్ళూరి సుగుణ అధ్యక్షత వహించగా ప్రముఖ రచచయిత్రి చాగంటి తులసి ముఖ్య అతిధిగా, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి , దిగుమర్తి సరస్వతీదేవి పాల్గొన్నారు. సత్యవతి కీలకోపన్యాసం చేశారు.
పితృస్వామ్య వ్యవస్థలోని స్త్రీల స్థితిగతులని వెలుగులోనికి తెచ్చిన గురజాడ స్ఫూర్తితో మరింత ముందుకెళ్ళి సాహిత్యంలో స్త్రీ పాత్రల అభివ్యక్తీకరణ విధానాన్ని వివరించడమే సదస్సు ముఖ్య లక్ష్యమని ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, ఏ.వి.యన్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు అయిన డా. అయ్యగారి సీతారత్నం వివరించారు. స్త్రీలు చదువుకుని విజ్ఞానవంతులై నచ్చినప్పుడు వివాహం చేసుకుంటారని సౌజన్యారావు మాటలద్వారా గురజాడ స్త్రీల స్వేచ్ఛని కాంక్షించారని చాగంటి తులసి వివరించారు. పురుషాధిపత్య వ్యవస్థలోని స్త్రీల సమస్యల్ని వివరించి చైతన్యవంతమైన స్త్రీ పాత్రల ద్వారా స్త్రీల అభ్యుదయాన్ని గురజాడ కాంక్షించారని ఆ స్ఫూర్తి అందుకుని నేటి స్త్రీవాద సాహిత్యం మరింత ముందుకు సాగుతోందని భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి కీలకోపన్యాసంలో వివరించారు.
ఈ సదస్సు తొలి సమావేశానికి జగద్ధాత్రి అధ్యక్షత వహించగా ప్రముఖ రచయిత్రి డా. వాడ్రేపు వరలక్ష్మి ”మధురవాణి పాత్రనీ నళినీ జమీల (కేరళలోని ఒక వేశ్య ఆత్మకథ) పాత్రనీ తులనాత్మక పరిశీలన చేసి పరిశోధన పత్రాన్ని సమర్పించారు. డా. కాండూరి సీతారామచంద్రమూర్తి ”ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది గురజాడ ఉద్ధేశాలు” అనే అంశంపై పత్ర సమర్పణ చేయగా ”కొండ భట్టీయంలో మంజువాణి పాత్ర పరిశీలన” పత్రాన్ని డా. పేరి సూర్యనారాయణ, లెక్చరర్, ఏ.వి.యన్.కళాశాల చదివారు. భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గురజాడ రాసిన ”మీ పేరేమిటి” కథలో నాంచారమ్మ పాత్రని విశ్లేషించారు. మూఢ భక్తి విశ్వాసాలని ధైర్యంగా నిరసించిన నాంచారమ్మ తెగువని వివరించారు.
రెండవ సమావేశానికి డా. కాండూరి సీతారామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా డా. సూరి సువర్ణలక్ష్మి ”కన్యాశుల్కంలో తల్లి పాత్ర అనే పత్రంలో వెంకమ్మ సంప్రదాయాల సంకెళ్ళలోనించే పిల్లలని తప్పించాలని తపన పడుతుందని వివరించారు. డా. జనార్ధనగారు ‘గురజాడ సాహిత్యం మహిళాభ్యుదయం’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయగా ప్రముఖ కవి, రచయిత శ్రీ రామతీర్ధ గురజాడ ఇంగ్లీషు సాహిత్యం గురించి సవిరంగా చర్చించి గురజాడ ద్విభాషా కవి అని విద్యార్థులు గురజాడ ఇంగ్లీషు రచనలు చదవాలని యువతకి గురజాడ సాహితీ సృజనపట్ల అవగాహన కలిగించేవిధంగా వివరించారు. ప్రముఖ రచయిత జగద్ధాత్రి గురజాడ స్త్రీ పాత్రలు నాటి ప్రపంచ స్త్రీ పాత్రలు” అనే అంశంలో ”ఇచ్చిన్” రచించిన ‘ఎడాల్స్‌హౌస్’ వో ‘నోరా’ అనే పాత్ర ద్వారా వివాహవ్యవస్థలోని భ్రమల్ని వివరించారు. అనంతరం భోజన విరామం మూడవ సమావేశంలో డా. వాడ్రేపు వీరలక్ష్మి అధ్యక్షత వహించగా డా. ఎస్. రమాసుందరి ”ముత్యాల సరాలు నాటి స్త్రీల సామాజిక విలువలు”, డా. సగిలి సుధారాణి, మద్రాస్ విశ్వవిద్యాలయం” కన్యక కన్నీటిగాధ-గురజాడ తాత్వికత” అనే అంశాలపై పత్రాలు చదివి గురజాడ స్త్రీల కష్టాలపట్ల వున్న ఆర్తిని వివరించారు. డా. సి.హెచ్.ఎమ్.ఎస్. కుమారి, లెక్చరర్, ఏ.వి.యన్ కళాశాల ”కమలిని-మెటిల్డా పాత్రల పరిశీలన” అనే అంశంలో గురజాడ నుంచి నేటివరకు స్త్రీ ప్రస్థానం వివరించారు.
నాల్గవ సమావేశంలో ఆచార్య యోహన్‌బాబు, తెలుగు శాఖాధ్యక్షులు,ఆంధ్రవిశ్వవిద్యాలయం, అధ్యక్షత వహించగా శ్రీ మల్లాప్రగడ రామారావు, ”గురజాడ-మనజాడ” అనే అంశంలో గురజాడ అభ్యుదయ మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. శ్రీ బి. విజయేశ్వర్రావు, ప్రభుత్వ కళాశాల లెక్చరర్, విజయనగరం – ”గురజాడ సంస్కరించిన వేశ్యపాత్రలు” అనే అంశంపై పత్రసమర్పణ చేశారు. ప్రముఖ రచయిత్రి, ఏ.వి.యన్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డా. అయ్యగారి సీతారత్నం ”గురజాడ సాహ్యింలో స్త్రీల చట్టాలు- ప్రస్తావన మరియు ప్రస్థానం” అనే అంశంలో కన్యాశుల్కం కాలం నుంచీ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలకి కొంత పరిష్కారంగా ఊరటగా శారదాబిల్లువంటి చట్టాలు వచ్చాయని, కుటుంబ వ్యవస్థలోని గృహహింసకి వ్యతిరేకంగా 498 చట్టం వంటివి వచ్చాయని అయినా మానసిక పరివర్తన ద్వారా స్త్రీల స్థితిగతులు మారాలని తెలియచేశారు. అది సాహిత్యం ద్వారా తెచ్చే ప్రయత్నం జరుగుతుందనీ, జరగాలనీ ఆమె సవిరంగా చర్చించారు. తెలుగులో మొదటి కథ రాసింది గురజాడే అంటూ అన్ని సమావేశాల్లోను పదే పదే మాట్లాడుతున్న ఈ సమావేశంలో మాత్రం ఎవ్వరూ ఆప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం.
సదస్సు ముగింపు సమావేశానికి తాళ్ళూరి సుగుణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వీనర్ డా. రజనీ, విశిష్ట అతిధిగా ఇంద్రాణి జగ్గారావు, కరస్పాండెంట్, ఛైర్ పర్సన్, ఏ.వి.యన్ కళాశాల సదస్సులో పాల్గొన్నారు. చాగంటి తులసి, కొండవీటి సత్యవతిలు ముగింపు సభలో సత్కరించారు. ఏ.వి.యన్ కళాశాల కరస్పాండెంట్ ఇంద్రాణి జగ్గారావు పత్ర సమర్పకులకీ, విద్యార్థులకీ సర్టిఫికెట్‌లు అందచేశారు. డా. అయ్యగారి సీతారత్నం సదస్సుని సమీక్షించగా డా. పేరి సూర్యనారాయణ వందన సమర్పణ చేశారు.
ఈ సదస్సుకి విశాఖనగరంలోని ప్రముఖులు పెద్దలతో పాటు వివిధ కళాశాలల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థినీ, విద్యార్థులు హాజరు అవడం ఈ జాతీయ సదస్సు ప్రత్యేకంగా చెప్పవచ్చు.