నా సరి నీవని…నీ సరి నేనని..

అమృతలత

అమ్మ కడుపులో… వెచ్చగా… నిశ్చింతగా – తన ఆకృతి రూపుదిద్దు కుంటోన్న ఓ చిన్ని ఆకారం-

”ఛట్‌! మళ్ళీ ఆడపిల్లేనా? ఒద్దు!” తండ్రి కసాయి మాటలకి ఉలిక్కి పడింది!

తూట్లు తూట్లు కానున్న తన చిరు దేహాన్ని తలచుకుని – చిగురుటాకులా కంపించి పోయింది. తనకిక ‘ఉదర సమాధి’ తప్పదన్నమాట!’ తప్పించుకునే తరుణోపాయం కోసం దిక్కులు చూసింది.

అంతలో మళ్ళీ ఏవో మాటలు, చెవులు రిక్కించింది.

”ఆడపిల్లైనా సరే! నాకు కావాలి!” అమ్మ వేడుకోలు.

”ఎలా కంటావో చూస్తాను!” నాన్న బెదిరింపులు.

నాటు వైద్యం పనిచేయలేదు!

‘బ్రతుకు జీవుడా!’ అనుకుంటూ ఆ చిన్ని ఆకారం భూమ్మీద పడింది!

అలా అమ్మ గెలిచింది. నాన్న ఓడిపోయాడు.

కానీ ఆ తృప్తి ఎంతోసేపు నిలువ లేదు!

‘ఇది – నా గుండెలమీద కుంపటి! నాకొద్దు!’ తల్లి కళ్ళుగప్పి – విసురుగా దాన్ని మురిక్కాలువలో విసిరేసి చరచరా వెళ్ళిపోయాడు తండ్రి.

ఆ ఆకారానికి – భూమ్మీద ఇంకా నూకలున్నాయేమో – తన కొన ఊపిరితో – పిల్లల్లేని దంపతులకి చిక్కింది!

అలా చిక్కిన ఆ ఆకారానికి – పురాణాల్లో తనకిష్టమైన ‘సత్యభామ’ పేరెట్టుకుని – అల్లారు ముద్దుగా పెంచు కోవడం మొదలెట్టింది ఆ పెంపుడు తల్లి.

తర్వాత కొన్నాళ్ళకి ఆ దంపతులకి ‘కొడుకు’ పుట్టాడు. అది తమకి దేవుడిచ్చిన మరో ప్రసాదంగా తలపోసి – కొడుక్కి ‘వరప్రసాద్‌’ అని పేరెట్టుకున్నారు!

పిల్లలిద్దరికీ అప్పుడప్పుడే రెక్కలొ స్తున్నాయి. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి – ఇంట్లో చేయాల్సిన పనులు పంచింది వాళ్ళమ్మ.

డైనింగ్‌ టేబుల్‌ మీంచి ప్లేట్లు తీసి – టేబుల్‌ శుభ్రం చేసేపని కొడుకు ప్రసాద్‌దీ… ప్లేట్లు కడిగేపని కూతురు సత్యదీ…. లేదంటే వైస్‌ వర్సా.

ఒకరోజు ఏమనుకున్నాడో –

”ఈ ఆడంగి పనులు నేనేం చేయను! నేను మగమహారాజుని! నువ్వే చేసుకో-ఫో!” అంటూ చల్లగా బయటికి జారుకున్నాడు కొడుకు.

రాత్రి భోజనాల దగ్గర –

డైనింగ్‌ టేబుల్‌ మీద కొడుక్కి – ప్లేటు బదులుగా న్యూస్‌పేపర్‌ పరిచింది వాళ్ళమ్మ.

”పొద్దున నువ్వు తిన్న ప్లేట్‌ ఎండి పోయి-అదిగో ఆ సింక్‌లో పడివుంది! నీ ప్లేట్‌ నువ్వు తోముకుని వస్తే సరి! లేదంటావా -ఇదిగో ఈ న్యూస్‌ పేపర్లో అన్నం పెడ్తా తిను! ఇదైతే తోమే పనిలేకుండా – తిన్నాక -ఎంచక్కా డస్ట్‌బిన్‌లో వేయొచ్చు!”అంది తల్లి.

అంతే – కొడుకు కిక్కురుమనకుండా వెళ్ళి ప్లేటు కడుక్కొచ్చాడు!

ఆ రోజుకిక ఆ పాఠం చాలనుకుంది వాళ్ళమ్మ.

మర్నాడు… లేస్తూనే కొడుకుని పిలిచి :”ఏరా – నిన్న అక్కతో ఏమన్నావ్‌? ఏదీ మళ్ళీ చెప్పు!” అడిగింది.

”ఈ… ఆడంగి పనులు… నేనేం చేయను-నేను…మగమహారాజుని… అన్నాను”చెప్పాడు కొడుకు భయం భయంగా.

”అసలు నీకు ‘ఆడంగి’ అంటే అర్థం తెలుసా?”

తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపాడు.

”తెలీకుండా అలాంటి మాటలు వాడొచ్చా? నువ్వలా వంట పనుల్లో, ఇంటి పనుల్లో షేర్‌ చేసుకుంటే నిన్ను ‘ఆడంగి’ అనరు! నీ జాతి లక్షణాలకి విరుద్ధంగా నువ్వు ఆడపిల్లల్లా సిగ్గుపడ్తేనో…. నడిస్తేనో… .” అమ్మ చెప్తూనే వుంది…

”అమ్మా! నాదో డౌట్‌?” ఆమె మాటలకి అడ్డొస్తూ అడిగాడు కొడుకు.

ఏమిటన్నట్టుగా చూసింది తల్లి.

”అక్కయ్య దేనికీ సిగ్గుపడదు! అలాంటప్పుడు సిగ్గుపడటం ఆడపిల్లల లక్షణం ఎలా అవుతుందమ్మా?” సందేహమం వెలిబుచ్చాడు కొడుకు.

”చూడూ – ఏడ్వటం, సిగ్గుపడటం ఆడపిల్లలకి స్వభావరీత్యా పుట్టుకతో వచ్చిన సహజాతాలే అయినప్పటికినీ – అల్పవిషయాలకి ఏడ్వటం, అనవసరంగా సిగ్గుపడటం…. తదితర లక్షణాలు…. దుర్బల మనస్తత్వానికి ప్రతీకలు! అలాంటి వాటికి ఆడపిల్లలైనా – మగ పిల్లలైనా దూరంగా ఉండాలి. అయినా – ‘సిగ్గుపడే పనులు’ చేస్తే – సిగ్గుపడాలి గానీ… ‘పనులు చేయ డానికి’ సిగ్గుపడొద్దు! పైగా – అవి ఆడపిల్లల పనులూ – మగ పిల్లల పనులూ అంటూ ఉండవు! ప్రతి పనీ ఇద్దరూ షేర్‌ చేసుకోవాలి!” విడమరిచింది తల్లి.

”అమ్మా – నాకొకటి అర్థం కాదు… పక్కింటి అంకుల్‌ ఎందుకలా ఇంట్లోనే కూర్చుంటాడు? పొద్దస్తమానం టీవీ చూడ్డం తప్ప – బయట పనేం చేయడు! స్కూటర్‌ వున్నా – బయటికి వెళ్ళి సరకులు తేడు! చివరికి చికెన్‌ షాపుక్కూడా ఆంటీనే పంపిస్తూ ఉంటాడు! నాకు పాపం ఆంటీని చూస్తే జాలేస్తుందమ్మా! ఇంతకీ ఆయన జబ్బేమిటీ?” అడిగింది కూతురు.

”ఓ అదా!? అది ‘మగ మహారాజు’ల లక్షణం లేమ్మా!” అంది తల్లి నవ్వేస్తూ.

”అయ్యో! – ‘మగ మహారాజు’ అంటే ఇదా అర్థం!? ఛ! నేనింకా అదేదో గొప్ప మాటనుకుని అక్కతో గర్వంగా పోట్లాడాను. అలాంటి చెడ్డమాట ఇంకోసారి అనను! తప్పయింది! లెంపలేసుకుంటున్నాను” అంటూ రెండు గుంజీలు కూడా తీసేసి – బయటికి తుర్రుమన్నాడు కొడుకు.

సత్యా వరప్రసాదులు కాలేజీలో చేరారు.

ఒక రోజు…..

”మా ఫ్రెండ్‌ మాధవి లేదూ – అది ఈ రోజు సూసైడ్‌ చేసుకుంది!” బాధపడ్తూ చెప్పింది సత్య.

”అయ్యో! ఏమైందమ్మా?” అడిగాడు వరప్రసాద్‌.

”ఆ మధ్య కాలేజీ కారిడార్‌లో ఓ పోకిరీ కుర్రాడు అనూహ్యంగా పరిగెత్తుకొచ్చి – దాని బుగ్గ మీద ముద్దెట్టి – అది తేరుకునేలోపే – ఆ దృశ్యాన్ని తన ఫ్రెండ్‌ సెల్‌ఫోన్తో క్లిక్‌మనిపించాడు. అది చాలదని – అసభ్యకరమైన ఫోటోలేవో సంపాదించి – వాటి తలలకి దీని తలతో కంప్యూటర్లో మార్ఫింగ్‌ చేసి – దాన్ని తన ఫ్రెండ్సందరికీ యస్‌.యం.యస్‌ చేస్తున్నాడు! ఆ చిన్ని గుండె తట్టుకోలేక పోయింది!” చెప్పింది సత్య.

”ఛ! ఈ విషయంలో ‘ఉపేక్ష’ మంచిదికాదు సత్యా! మీ ఆడపిల్లలందరూ కెమెరా సెల్‌ ఫోన్లని నిషేధించాలని – టీవీ, ప్రెస్‌మీట్‌లు పెట్టి – మీ నిరసన తెలియ జేయాలి!” సలహా ఇచ్చాడు వరప్రసాద్‌.

”అరే – వెర్రి తండ్రీ! ఆడపిల్లల బాత్‌రూం దృశ్యాల్ని పబ్లిగ్గా ప్రసారం చేస్తూ – టీవీ ఛానళ్లే…. పరోక్షంగా ‘ఈవ్‌టీజింగ్‌’కి పాల్పడ్తూంటే… మమ్మల్ని పోయి పోయి వాళ్ళకే మొరపెట్టుకోమంటావేమిటీ?” కస్సుమంది సత్య ఉక్రోషం – ఆక్రోశం ముప్పిరిగొని.

తల్లి మనసులో –

జనం బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ – ‘అక్రమార్కుల పై కొరడా’ ముసుగులో – ‘జంధ్యాలేసుకున్న నక్కలు’ మెదిలాయి!

‘లావొక్కింతయు లేదు – ధైర్యం విలోలంబయ్యే’… అని గిజగిజ లాడ్తోన్న గజేంద్రుని కళ్ళకి – ‘సుదర్శన చక్రం’ కన్పించినట్టుగా – ఆమె కంటికి – నక్కల జంధ్యాన్ని తొలిగించి – న్యాయం చేకూర్చే అపన్న హస్తంలా – ‘న్యాయదేవత’ కన్పించింది.

‘ఫర్వాలేదు! అన్నిదారులూ మూసుకు పోయినపుడు – ఆడపిల్లలకి న్యాయస్థానాలు న్నాయి! అధైర్యపడి ఆత్మహత్యలకి పాల్పడ కూడదు!’ అనుకుంది.

అదే విషయం కూతురికీ చెప్పింది.

చదువులై పోయి – సత్యా, వరప్రసాదులు పెళ్ళీడుకొచ్చారు!

కొడుక్కి లక్షల కట్నం కుమ్మరిస్తా మంటూ ముందుకొచ్చారు ఆడపిల్లల తలిదండ్రులు.

తండ్రి మొగ్గుజూపాడు!

”విధిలేని పరిస్థితుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ‘విదిల్చే’ బిచ్చమే – మగపిల్లల తలిదండ్రులు ‘అడుక్కునే’ కట్నం! నా కది ఇష్టం లేదురా” అంది తల్లి.

”ఇప్పుడు చెప్పండి నాన్నా…. జోలె పట్టుకోమంటారా నన్ను?” అడిగాడు కొడుకు.

‘శభాష్‌’ అనుకుంది తల్లి.

”మన అవయవాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా! మనం సంపాదించుకోలేమని అనుమానమా?” కొడుకు పొడిగించాడు.

తండ్రి ముఖం ఎర్ర బారింది.

”ఒకరి కష్టార్జితాన్ని అప్పనంగా తీసుకోవాలనుకోవడం నామోషీ కాదా నాన్నా?”

కొడుకు మాటలకి తల్లి పొంగి పోయింది, తండ్రి సిగ్గుపడ్డాడు.

అంతే! వాళ్ళు కొడుక్కి కట్నం తీసుకోలేదు – కూతురుకీ ఇవ్వలేదు!

”మీకిది తెలుసా గోపాల్‌? నా ఫ్రెండ్‌ లలిత లేదూ – అది ప్రతినెలా తన సంపాద నంతా తెచ్చి భర్త చేతుల్లోపెట్టి – బొట్టు బిళ్ళలక్కూడా మొగుణ్ణి బిచ్చం అడుక్కుం టోంది!” చెప్పింది సత్య.

”ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి బంగారు గుడ్లుపెట్టే బాతులు! ఎంతకీ ఆ గుడ్లు ఆబగా తినేయాలన్న ధ్యాసే తప్ప -ఆ బాతులకీ ఆకలి వుంటుంది- వాటిక్కూడా మేత అవసరమన్న ఇంగితజ్ఞానం అలాంటి వాళ్ళకుండదు!” బాధ పడిపోయాడు గోపాల్‌.

”పైగా అతడెంత అనుమానప్పి శాచమంటే – పెళ్ళాం ఉద్యోగం చేయాలీ- కానీ మగాళ్లెవర్తో మాట్లాడొద్దు! అవి చాలదని దాని వేరబౌట్స్‌ తెలుసుకోవడానికి ఓ సెల్‌ ఇచ్చాడు! లంచ్‌ టైంలో ఫోన్లు చేస్తాడు! టైం కి ఎత్తకపోతే ‘ఎవర్తో మాట్లాడ్తున్నావ్‌? ఫోన్‌ ఎత్తడం లేదు!’ అంటాడు! ఒకవేళ ఎత్తితే – ‘ఇంత తొందరగా ఫోన్‌ ఎత్తావ్‌! ఎవడనుకుని ఎత్తావ్‌?” అంటాడు.” చెప్పింది సత్య.

గోపాల్‌ ఆశ్చర్యంగా వింటున్నాడు.

”ఇంకో సంగతి చెప్పనా? అది ఆఫీసు నుంచి రాగానే – ఇది ఎవరికి ఫోన్‌ చేసిందో – ఎవరు దీనికి ఫోన్‌ చేసారో చూద్దామని – సెల్‌ లాక్కొని ‘రిసీవ్‌డ్‌ కాల్స్‌’, ‘డయల్డ్‌ కాల్స్‌’ చూస్తాడు! అతడి విషయం తెలిసిన కొందరు – ఆమె సెల్‌కి – ఉత్తినే అతణ్ణి ఏడిపంచడానికి – కాయిన్‌ బాక్స్‌ల్లోంచి ‘మిస్‌డ్‌ కాల్స్‌’ ఇచ్చి వదిలేస్తారు! అది చూసి రెచ్చిపోయి – ఆ ఫోన్‌ నెంబర్స్‌ ఎవరివని ఎంక్వైరీల్తో కాల్చుకు తింటాడు!” బాధపడ్తూ చెప్పింది సత్య.

”ఇంత అనుమానప్పిశాచులు మరి ఉద్యోగం మాన్పించవచ్చు కదా – ఇలా వేధించే బదులు?” అన్నాడు గోపాల్‌.

”అబ్బే! ఎలా మాన్పిస్తారు!? అలాంటి వాళ్ళకి పెళ్ళాం కావాలీ – పెళ్ళాం సంపాదించే డబ్బూ కావాలీ – కానీ పెళ్ళాం మనసుతో, ఆమె వ్యక్తిత్వంతో పనిలేదు!” చెప్పింది సత్య.

”మీ ఫ్రెండ్‌ చదువుకుందీ – ఉద్యోగం చేస్తోంది! చదువూ – ఉద్యోగం లేని అమ్మాయిలే తిరగబడ్తున్నారు! మీ ఫ్రెండ్‌ అతడికి ‘గుడ్‌బై’ కొట్టక ఎందుకు భరిస్తోంది!?” అడిగాడు గోపాల్‌.

”ఒకసారి విరక్తిపుట్టి అలాగే పుట్టింటి కి వెళ్ళింది. లోకులకి జడిసి వాళ్ళ నాన్న దాన్ని తిట్టి – తిరిగి వెనక్కి పంపించాడు. అది అలుసుగా తీసుకుని అతడు మరింత పెట్రేగి పోయాడు. ‘ఉద్యోగముందని డైవర్స్‌ తీసుకుందామనుకుంటున్నావేమో – నిన్ను చంపనైనా చంపుతాను గానీ చచ్చినా నీకు డైవర్స్‌ ఇవ్వను!’ అని వేపుకు తింటున్నాడు!”

”అతడిచ్చేదేమిటి సత్యా!? మీ ఫ్రెండ్‌నే అతడికి విడాకుల నోటీస్‌ పంపించమను! ప్రాణ భయం ఉందని పోలీస్‌ రిపోర్ట్‌ ఇస్తే తోక ముడుస్తాడు! కొన్ని కుక్కలంతే! భయ’పడితే’ – భయ’పెడ్తాయి’! బెదిరించే కుక్కలని ఎదరించాలే తప్ప – భయపడ్తూ కూర్చోకూడదు! ఆమెకు మీరంతా పిరికి మందు నూరిపోయకండి! ధైర్యం చెప్పి ప్రతిఘటించడం నేర్పండి!” సలహా ఇచ్చాడు గోపాల్‌.

”అరుణా! ఏమైంది డాళ్లింగ్‌? ఎందుకలా దిగులుగా కూర్చున్నావ్‌?” అడిగాడు వరప్రసాద్‌ భార్య అరుణని.

భర్త మాటలకి ఆమె కళ్ళలో నీళ్ళు పెల్లుబికి వచ్చాయి!

”మా ఇంట్లో – నిన్ను ఎవరైనా – ఏమైనా అన్నారా?”

”ఛఛ! అదికాదు…. అత్తయ్య గారి మంచితనం చూస్తూంటే నాకు మా అక్క గుర్తొచ్చి కన్నీళ్లొస్తున్నాయి!” అంది అరుణ కళ్ళు తుడ్చుకుంటూ.

”అసలైమైందో చెప్పు అరుణా?” అడిగాడు వరప్రసాద్‌ లాలనగా.

”మీ వాళ్ళు నా పెళ్ళికి కట్నం తీసుకోలేదు! కానీ – మా నాన్న అప్పుచేసి కట్నమిచ్చి మా అక్కయ్య పెళ్ళిచేశాడు! ఇంతచేసీ ఆమెకి – అత్తింట్లో ఆరళ్ళు తప్ప ట్లేవు… అదే నా బాధ!”

”ఆరళ్ళా… అంటే!?” అడిగాడు వరప్రసాద్‌.

అంత బాధలోనూ భర్త అమాయ కత్వానికి నవ్వొచ్చింది అరుణకి.

”మీరెప్పుడైనా ‘గృహ హింస’ అన్న పేరు విన్నారా?”

ఏదో జీవహింస – జంతుహింస – చిత్రహింస తను ఈ పేర్లే విన్నాడు గానీ – ఈ గృహ హింస ఏమిటో….? వరప్రసాద్‌కి అర్థం కాలేదు.

అరుణని అడిగితే – ‘ఈ మాత్రం తెలీదా?’ అని తాటాకులు కడ్తుందేమో!? – వరప్రసాద్‌ ఆలోచిస్తున్నాడు.

అతడి మనసులోని ఆలోచనలు పసిగట్టిందాన్లా చెప్పింది అరుణ :

”చూడండీ – నాకిక్కడ ఇంత స్వేచ్చ వుందా? మా అక్కయ్యని వాళ్ళత్తగారు మా ఇంటికి ఫోన్‌ చేయనీరు! పోనీ మేము చేద్దామనుకుంటే – మాతో అది ఏమ్మాట్లా డ్తుందో విందామని…. ఫోన్‌ మాట్లాడ్తున్నంత సేపూ – ఆవిడ దాని పక్కనే నించుంటారు! అన్నింటికన్నా ఘోరం – వాళ్ళ ‘అత్తగారు ఇంట్లో లేరు’ అని అక్కతో మాకు ఫోన్‌ చేయించి – వాళ్ళ గురించి మేమేం మాట్లాడ్తామో వినాలనుకోవడం – విని, దాన్ని సాధించాలనుకోవడం!”

”ఉత్త శాడిస్టుల్లా వున్నారే…!” జాలిపడ్డాడు వరప్రసాద్‌.

”పోనీ దాన్ని పుట్టింటికి తీసుకొస్తే నైనా – కొన్నాళ్ళపాటు మా మధ్య నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుందనుకుంటే – ఏడాదికో సారిగానీ పుట్టింటికి పంపించరు! పైగా పంపించేముందు – పుట్టింట్లో వాళ్ళ అత్తవారింటి గురించి ఏమీ చెప్పొద్దంటూ దాని మొగుడిమీద ఒట్టేయించుకొని మరీ పంపిస్తారు! వాళ్ళు గీచిన గీటు దాటదు అక్క!” చెప్పింది అరుణ.

”ఒట్టుకి కట్టుబడే వెర్రిబాగుల్ది కాబట్టి మీ అక్కనలా ఆడిస్తున్నట్లున్నారు అరుణా!” అన్నాడు వరప్రసాద్‌.

”ఇంటికి ఎవరొచ్చినా అక్కే కాఫీలూ – టిఫిన్లూ అందించాలి! వాళ్ళతో నవ్వ కూడదు! మాట్లాడకూడదు! పైగా వాళ్ళున్నంత సేపూ అది నిలబడే ఉండాలి! ఒక్క మాటలో చెప్పాలంటే – అత్తవారింట్లో ఆమె – జీతం భత్యంలేని పనిమనిషి – అంతే!”

”బొత్తిగా వెన్నెముకలేని మనిషమ్మా మీ బావ! అలాంటి ‘తల్లి కూచులు’ పెళ్ళి చేసుకోకపోవడమే ఉత్తమం!” అంది అప్పుడే అటువేపు వచ్చిన వరప్రసాద్‌ తల్లి.

”అదేంటమ్మా! నువ్వు తల్లివై వుండీ – తల్లి కూచులంటూ కొడుకుల్ని దుయ్యబడ్తూ కోడళ్ళ పక్షాన నించున్నావ్‌? రేపు ఒకవేళ నీకూ నీ కోడలికి గొడవలొస్తే…!?” తల్లి చూడకుండా అరుణ వంక కన్నుగీటి – తల్లిని అడిగాడు వరప్రసాద్‌.

”అప్పుడు – నిన్ను నా కోడలి కొంగుచ్చుకోమంటారు! అంతేగానీ పెళ్ళయ్యాక్కూడా – నువ్వు తల్లి చాటు బిడ్డవి కావటం నాకిష్టముండదురా! ఒకవేళ కోడలికీ నాకూ అంతగా పొసగకపోతే – మీరో ఇంట్లో… నేనో ఇంట్లో వుంటాం – అంతే!” అంది తల్లి నవ్వుతూ.

”ఆ… నాకు తెలుసులేమ్మా! ఆ వంకతో ఎంచక్కా నాన్నగారూ, మీరు ఇద్దరే.. చిలకాగోరింకల్లే.. ఉందామని మీ ఎత్తు!” అన్నాడు కొడుకు.

”బహుశా: ఆ ఎత్తు మీదై ఉంటుంది! అలాంటి ఆశలేవీ పెట్టుకోకండి! ఆ ఛాన్స్‌ నేను మీకిస్తే కదా అసలు!?” అంది అరుణ వరప్రసాద్‌ని ఆట పట్టిస్తూ.

”చూశావా? మనిద్దరి ఎత్తుల్ని చిత్తు చేసే కోడలు నాకెలా దొరికిందో?” కోడల్ని చూస్తూ – మురిపెంగా చెప్పింది తల్లి కొడుకుతో.

”నా సరి నీవని – నీ సరి నేనని ‘ఎపుడో’ తెలిసెనులే” …. కూని రాగం తీస్తూ ఇంట్లో అడుగెట్టాడు గోపాల్‌.

”ఏమిటో శ్రీవారు మాంచి హుషారు లో వున్నారు! పాట కూడా ఏదో పాడ్తున్నట్టు న్నారు. ఏదీ మళ్ళీ పాడండి!” అడిగింది సత్య.

సత్య అడిగింది కదా అని రెండోసారి పాటెత్తుకున్నాడు గోపాల్‌ ఉత్సాహంగా.

”మీ సరి నేను కావొచ్చునేమోగానీ – నా సరి మీరేమిటీ…. చోద్యం కాకపోతే!?” ఆశ్చర్యం నటించింది సత్య.

”ఎందుకు? నేను ఎందులో నీకు నీ ‘సరి’ కానో చెప్పు!?” ఉడుక్కున్నాడు గోపాల్‌.

”మీ ప్రశ్నకి సమాధానం నేను తర్వాత చెప్తాను గానీ – నేనోటి అడుగుతాను చెప్తారా?” అడిగింది సత్య.

”అడుగు!” దిలాసాగా అన్నాడు గోపాల్‌.

”మనిద్దర్లో ఎవరికి ఎక్కువ బలం ఉందంటారూ? మీకా – నాకా?” అడిగింది సత్య.

”ఇదేం ప్రశ్న సత్యా నిస్సందేహంగా నాకే!” హుషారుగా సమాధానం చెప్పాడు గోపాల్‌.

”ఇంకో ప్రశ్న అడగనా!?”

సత్యకేమైంది ఇవాళ – అన్నీ తిక్క ప్రశ్నలడుగుతోంది అనుకుంటూ;

”వైనాట్‌? ష్యూర్‌!” అన్నాడు గోపాల్‌

”మనిద్దర్లో ఇంతకీ ఎవరు సుకుమారులో చెప్పండి!”

గోపాల్‌ హుషారు ఆవిరైపోయింది.

”అదేమిటి సత్యా? నీకెందుకు డౌట్‌? అయినా ఇదేం ప్రశ్న? చచ్చు ప్రశ్న!” అంటూ – తనెప్పుడైనా సత్యని మోటుగా ఉన్నావని అన్నాడా కొంపదీసి – ఆలోచిస్తున్నాడు గోపాల్‌.

”చెప్పరేం?” రెట్టించింది.

”నువ్వేకదా సుకుమారివి! ఈ మాత్రం నాకు తెలీదా సత్యా?” బదులిచ్చాడు గోపాల్‌ నీరసంగా.

”మీ రెండు సమాధానాలూ తప్పు!” తేల్చి చెప్పింది సత్య.

‘అదెలా?’ తెల్లబోయాడు గోపాల్‌.

”బయటిపనీ – ఇంటిపనీ – రెంటినీ – ఒంటిచేత్తో – చేసుకునే – నేనేమిటీ ‘సుకుమారి’ని! బయటి పనే తప్ప – మరోపని ముట్టని – మీరేమిటీ ‘బలశాలీ’ – బడాయిగానీ….!” నవ్వింది సత్య.

గోపాల్‌కేమీ అర్థంగాక బుర్ర గోక్కున్నాడు.

”ఇప్పుడు చెప్పండి… నా ‘సరి’ నిజంగా మీరేనా? పైగా…. ఇంకా… మీకది… ‘ఎపుడో తెలిసిందా?” ఉడికించింది సత్య.

”నిజమేనమ్మా! అర క్వింటాల్‌ బరువు అవలీలగా ఎత్తగలిగే ఈ మగధీరుడు – వంటింట్లో కాఫీ కప్పైనా కడుక్కోలేని సుకుమారుడు! వాడెలా నీతో సరితూగగలడు చెప్పు? ఎంతైనా నీకు సరి నువ్వేనమ్మా!” తూచి చెప్పాడు మామ.

గోపాల్‌కేదో అర్థమైనట్లయింది.

ఆ మర్నాడు… ఆఫీస్‌నుండి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చి అంట్ల గిన్నెలు ముందేసుకున్న సత్యకి – ‘నీ అందాల చేతులు కందేను పాపం – ఎందుకు ఈ బెడదా? సాయం వలదా – ఓ చెయ్‌ వేసేదా?’ అంటూ అక్కినేని స్టైల్లో వేడి వేడి కాఫీ కప్పునందించాడు గోపాల్‌.

సంబరపడిపోయిన సత్య గోపాల్‌ని చూసి ”నా సరి నీవని – నీ సరి నేనని – ‘ఇపుడే’ తెలిసెనులే!” మురిపెంగా పాడుతూంటే – కోడలి గడుసుతనానికి ముసిముసిగా నవ్వుకుంది అత్త.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.