అనురాధ, అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్
ఈ ప్రపంచంలోని ఏడు బిలియన్ల ప్రజలలో సగంమంది మహిళలున్నారు.వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవిత కాలంలో దెబ్బలు తింటున్నారు లేదా రేప్‌కు గురవుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో నివసిస్తున్న వందకోట్ల మందికిపైగా స్త్రీలు తమ రోజు జీవితాలలో అనివార్యంగా హింసననుభవిస్తున్నారు.
అందుకే ప్రముఖ సామాజిక కార్యకర్త కమలాభసీన్ ఈ హింస గురించి మాట్లాడుతూ- ”మన ఇళ్ళల్లో, మన సమాజాల్లో మన మధ్యనే తిష్ట వేసుకున్న ఈ హింసను రూపుమాపడానికి, ఒక సామాజిక సునామీ ఏర్పడాల్సిన అవసరమైంతేనా వుంది. వన్ బిలియన్ రైజింగ్ ఈ హింసను తుడిచి పెట్టడానికి ఆ సామాజిక సునామీ రూపంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా రాబోతుంది” అన్నారు.
వన్ బిలియన్ రైజింగ్- స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక ప్రపంచ వ్యాప్త ఉద్యమం. ప్రముఖ రంగస్థల నటి రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త ‘ఈవ్ ఎన్‌స్లర్’ న్యూయార్క్ నగరంలో వి-డే అనే తమ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు బాలికలపై జరుగుతున్న హింసలు తప్పనిసరిగా ఆగాలి అనే లక్ష్యంతో పని చేస్తున్నారు. తమ సంస్థ వ్యవస్థాపక దినోత్సవమైన ఫిబ్రవరి 14నాడు వన్ బిలియన్ రైజింగ్ అనే ప్రపంచ వ్యాప్త ఉద్యమం చేపట్టాలని ‘ఈవ్ ఎన్‌స్లర్’ తలపెట్టారు. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది ఒక పోరాటం ఒక ఉద్యమం. ఈ క్యాంపెయిన్ అందరికోసం అందరిని కలుపుకుంటూ సాగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 14, 2013 నాడు ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల మంది ప్రజలు – స్త్రీలు పురుషులు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ రోజువారీ కార్యకలాపాలు ఆఫీసులు, ఇళ్ళు వదిలి వీధుల్లోకి వచ్చి, స్త్రీలపై హింసకు ఇకపై చోటు లేదని తమ గొంతులు విన్పిస్తూ ఈ హింసను అంతమొందించాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని ఈవ్ ఎన్‌స్లర్ పిలుపునిచ్చారు. దక్షణాసియాలో ఈ కార్యక్రమానికి ‘సంగట్’ సంస్థ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అస్మిత ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఫిబ్రవరి 14 నాడు వన్ బిలియన్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
అస్మిత ప్రతి యేడు నవంబరు 25-డిసెంబర్ 10 వరకు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపడ్తుంది. ఈ సంవత్సరం ఈ పదహారు రోజుల కార్యాచరణలో భాగంగా ఈ వన్ బిలియన్ రైజింగ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళింది.
అలాగే ఈ క్యాంపెయిన్‌లో భాగంగా వన్ బిలియన్ రైజింగ్ కాంఫ్షన్‌తో కూడిన 1000 టీ షర్టులు, పోస్టర్‌లు, కరపత్రాలు ముద్రించి రాష్ట్రంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులకు అందించి-వాళ్ళందరూ ఇందులో ఒక ఉత్సాహం, ఉత్తేజంతో భాగస్వామ్యలైయ్యేలా చొరవ తీసుకుంది.
నవంబరు 25న నెక్లెస్ రోడ్‌లో 10 కె రన్ కార్యక్రమంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించటంద్వారా ఈ వన్ బిలియన్ రైజింగ్ కార్యక్రమానికి అస్మిత స్వీకారం చుట్టింది.
”స్త్రీలపై హింసను నిర్మూలించాలి. హింస లేని జీవితం స్త్రీల హక్కు” అనే సందేశం యువతకు చేర్చడానికి అలాగే స్త్రీలపై హింసను అరికట్టడంలో యువత బాధ్యతను పెంచడానికి నవంబర్ 26-డిసెంబర్ 7 వరకు జంటనగరాలలోని వివిధ కాలేజీ స్కూళ్ళకు చెందిన 800 మంది విద్యార్థులకు స్త్రీల సమస్యలపై వివిధ డాక్యుమెంటరీల ప్రదర్శన పోస్టర్ ఎగ్జిబిషన్‌లు, మీటింగ్‌లు నిర్వహించింది.
జండర్ ఆధారిత హింసపై- అస్మిత నిర్వహించిన వ్యాసరచన పోటీలు, పోస్టర్ మేకింగ్ కాంపిటేషన్‌లో వివిధ కాలేజీ, స్కూలు విద్యార్థులు ఎంతో చురుకుగా ఆసక్తిగా పాల్గొన్నారు. స్త్రీలపై హింస గురించి అభివృద్ధి నమూనా స్త్రీల జీవితాలను ధ్వంసం చేయటం, స్త్రీల మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఎంతో లోతైన అవగాహనతో ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ వ్యాసాలు రాశారు. అలాగే పోస్టర్ మేకింగ్ కాంపిటేషన్‌లో స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసలు, వివక్ష అసమానత్వంపై ఎంతో సృజనాత్మకతతో చక్కటి పోస్టర్స్ చేశారు. తమ పోస్టర్స్ ద్వారా స్త్రీల మానవ హక్కుల ఉల్లంఘనను ఎత్తి చూపుతూ, ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తూ, స్త్రీలు సంఘటితంగా పోరాడితేనే స్త్రీల హక్కులు సాధించుకోగల్గుతారనే సందేశం విన్పించాయి (వివిధ కాలేజీలు స్కూళ్ళ నుంచి 187 వ్యాసాలు, 74 పోస్టర్స్ అందాయి.)
నవంబర్ 30న సౌత్ ఆసియా విమెన్స్ డే సందర్భంగా ఈస్ట్ మారేడ్‌పల్లి లోని అడ్డగుట్ట సంఘం మహిళలతో అస్మిత – క్యాండిల్ లైట్ ర్యాలీ మీటింగ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలందరూ- దక్షిణాసియా ప్రాంత వాసులు- ఒక ఐక్యతతో, బలంతో ఒక త్రాటి మీద నడిచి- స్త్రీలపై హింసను ఎదుర్కొని శాంతి ప్రజాస్వామ్యం మానవ హక్కులు నెలకొనేలా పని చేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 22 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 30 మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆయా జిల్లాలోని స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులు సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ అధికారాలు స్థానిక ప్రజలతో ఓబిఆర్ క్రింద అస్మిత వివిధ కర్యాక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలద్వారా సుమారు 15000 మంది ప్రజలకు ఓబిఆర్ ప్రాముఖ్యతను, పౌరులుగా స్త్రీలపై హింసను సంఘటితంగా ప్రతిఘటించి పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
ఈ పదహారు రోజుల కార్యచరణద్వారా ఒక హింసా రహిత, సమానత్వంతో కూడిన సమాజ స్థాపనకు వ్యక్తులుగా, పౌరులుగా మనందరం పోరాడాల్సి వుందనే అవగాహనను, అస్మిత ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులకు చేరవేసింది.
10 డిసెంబర్ అంతర్జాతీయ మానవహక్కుల దినం స్టేట్ లెవల్ మీటింగ్ ఆన్ వన్ బిలియన్ రైజింగ్
డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంనాడు అస్మిత వన్ బిలియన్ రైజింగ్‌పై రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేసి – స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా చేపట్టిన పదహారు రోజుల కార్చారనణ ముగింపు ఉత్సవాలను నిర్వహించింది. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యావేత్తలు, మేధావులు, రచయితలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాలేజీ విద్యార్థులు, ఆధ్యాపకులు సుమారు 250 మంది ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో హాజరైనారు. స్త్రీలపై పెరుగుతున్న హిస గురించి తీవ్ర నిరసన తెలియజేశారు.
మొదట అస్మిత ప్రెసిడెంట్, ప్రముఖ,ఉర్దూ రచయిత్రి పద్మశ్రీ జిలానీబాను మాట్లాడుతూ ‘ఈ రోజు ఎక్కడ చూసిన స్త్రీలపై హింస విపరీతంగా పెరిగిపోతుంది. సమాజం మొత్తం కలిసికట్టుగా పోరాడినపుడే హింసను నిర్మూలించగలుతాం’ అన్నారు. అస్మిత వ్యవస్థాపక సభ్యులు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వసంత్ కన్నాభిరన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎప్పటినుంచో హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే సమాజం ఈ హింసను చాలా సహజమైన విషయంగా చూస్తు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు యువత ముందుకొచ్చి ఈ హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఉద్యమం చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు.
గ్రామ్యా రిసోర్స్ సెంటర్ వ్యవస్థాపక సభ్యులు డా. రుక్మిణిరావు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. అయితే వాటికి లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ జిల్లాలో 1000 మంది ఆడపిల్లలకు 921 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. చట్టాలు ఎన్ని వున్నప్పటికీ ఆడపిల్లల్ని భారంగా బరువుగా చూసే సమాజం కుటుంబ దృక్పధం మారినపుడే పరిస్థితి మారుతుంది. అన్నారు.
భూమిక ఎడిటర్ కె. సత్యవతి గారు మాట్లాడుతూ ”ఈ రోజు 16 రోజుల ఉద్యమం 365 రోజుల ఉద్యమం కావాలి. ప్రస్తుతం స్త్రీలు ఒక స్ట్రాటజీ ద్వారా ఈ హింసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నిర్వహించాలన్నారు”.
మహాత్మాగాంధీ రిటైర్డ్ రిజిస్ట్రార్- డా. ముత్యం రెడ్డి ”స్త్రీలపై హింసను నిర్మూలించటానికి చట్టాలు సక్రమంగా అమలు కావాలి. అందుకు నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరముందాన్నారు”.
ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి- ”ఈ హింసను స్త్రీలు సామూహికంగా, ధైర్యంగా నిలబడి ఎదురించాలి. హింసలేని, హక్కులు సమాన విలువలతో కూడిన సమాజం కోసం పోరాడాలి ” అన్నారు.
ప్రముఖ రచయిత్రి విజయభారతి మాట్లాడుతూ” మతం స్త్రీలపై హింసను పెంచటంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మతంలో స్త్రీల పట్ల వివక్షతో కూడిన అంశాలు మార్చుకోవాలి” అన్నారు.
ప్రముక మానవహక్కుల కార్యకర్త శ్రీ కేశవ్‌రావు జాదవ్ మాట్లాడుతూ స్త్రీలు కుల మత సాయుధ ఘర్షణల్లో హింసను ఎదుర్కొంటున్నారు. అన్ని స్థాయిల్లో పురుషులు స్త్రీలకు అండగా ఉండాలని అంటారు కాని స్త్రీలు, స్వేచ్ఛ, స్వాతంత్య్రంలో వుండాలని ఎక్కడా ఎవరూ చెప్పరు. సమాజంలో స్త్రీలకు గౌరవం, సమానత్వం వుండాలి’ అని చెప్పారు.
ఆంధ్రమహిళా సభ ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జి.ఎల్.కె. దుర్గ మాట్లాడుతూ ”స్త్రీ పురుషులు సమానం అన్న భావన పిల్లల్లో విద్యార్థి దశనుంచే రావాలి. కుటుంబ హింసను వ్యక్తిగత సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూస్తూ అందరూ సంఘటితంగా పోరాడాలి ” అన్నారు.
లైఫ్ హెల్త్ రీ ఇన్‌ఫోర్స్‌మెంట్ సంస్థకు చెందిన ప్రముఖ వైద్యులు మరియు సామాజిక కార్యకర్తలు డా. ప్రకాశ్ వింజమూరి, డా. కామేశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలోని దేశాల్లో స్త్రీలకు రక్షణలేని దేశాలను చూసినట్లయితే ఇండియా నాలుగవ స్థానంలో వుంది.
ప్రభుత్వం స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. గర్భసంచీ తీసేస్తే అన్ని సమస్యలు పోతాయని నిజానికి అవసరం లేకపోయినా ఎపిలో లక్షల మంది స్త్రీలకు గర్భసంచీ తీసేశారు. గర్భసంచీ తీసేశాకా ఆ స్త్రీలు రోగాల కార్ఖానాగా మారుతున్నారు” అన్నారు. స్త్రీల పునురుత్పత్తి ఆరోగ్యం గురించి ప్రభుత్వం తప్పనిసరిగా పట్టించుకోవాలని డిమాండు చేశారు.
ఉదయం జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త డా. మాధవి ”సమాజంలో స్త్రీలపై హింసను చాలా మాములు విషయంగా, సహజమైన విషయంగా చూస్తూ ఒక నిరాశ, నిస్పృహ, నిరాసక్తతలకు అలవాటు పడుతున్నారు. హింసను ఎదురించే చైతన్యం ఇప్పుడు యువత నుంచి రావాలి” అన్నారు. మధ్యాహ్న కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. బీనాగారు ”మనం, ఆవేశం, ఆవేదన కసితో హక్కులు సాధించుకున్నాం. అయితే హింసలేని సమాజం వచ్చేటంత వరకు మనం పనిచెయ్యాలి ” అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాహిన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జమీలా నిషాత్ ”క్వాబ్ చున్నీకి క్వాయిష్” అనే డాక్యుమెంటరీ రిలీజ్ చేసి తర్వాత ప్రదర్శించారు స్త్రీలపై ప్రపంచీకరణ దుష్పలితాలు, ఫలితంగా హింస పెరిగిపోవటం గురించి ఈ డాక్యుమెంటరీలో చూపారు. ఈ డాక్యుమెంటరీ చూసిన వారందరి మనసులు దు:ఖభారంతో నిండిపోయాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసించిన వక్తలు తమ ప్రసంగాలద్వారా జండర్ ఆధారిత హింస నిర్మూలనా అవసరాన్ని గురించి విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.
తర్వాత అస్మిత రూపొందించిన వన్ బిలియన్ రైజింగ్ వీడియో ప్రదర్శనాంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేయటంతో ఈ సదస్సు ముగిసింది.