నెమ్మికంటి సంధ్యారాణి
ఉనికి ప్రశ్నార్థకం అయిన ప్రతిసారి అస్తిత్వ పోరాటాలు తప్పనిసరి. ఆది మానవుడి నుండి ఆధునిక సమాజం దాకా ఈ ఉనికి పోరు మనం చరిత్రలో చూస్తూనే వున్నాము. అయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే మళ్లీ ఆదిమ సమాజపు అనాగరిక పోరాటమే నేటి తరం స్త్రీలు చేయాల్సి వస్తుందేమో అన్న సందేహం కలుగుతుంది. చదువు, ఉద్యోగాలు తప్పనిసరి అయిన నేటి వ్యవస్థలో ఆర్థిక అవసరాల కోసమే బయటికి వచ్చిన స్త్రీ తను ఉద్యోగాల కోసం ప్రయత్నించాలా? లేక ఈ వేటగాళ్ళ బారిన పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేయాలా అర్థం కావట్లేదు.
సంస్కారం నేర్పించకపోతున్న చదువులు, స్త్రీలను గౌరవించడం అనేది రాతలకే పరిమితం చేస్తున్నాయి. ప్రకృతి అంటే స్త్రీ పురుషుల సహజ సమ సంబంధాలు. అంతేకాని ఎవరిది పై చేయి కాదు. ఢిల్లీ సంఘటన తరువాత కొంతమంది బాధ్యత గల ప్రజా ప్రతినిధులు కూడా ఆడపిల్లల వేషధారణ తప్పుగా వుందనో, అర్థరాత్రి 9 గంటలకు బయటికి వెళ్ళొద్దు అనో అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒకటి సూటిగా ప్రశ్నించుకోవాలి, మనం ఆధునిక సమాజంలో వున్నామా? అనాగరిక సమాజంలో వున్నామా? అని.
ఎంతసేపు ఆడపిల్లల తప్పులెంచే బదులు మగ పిల్లలకు చిన్నప్పటి నుంచే కనీస సంస్కారము, స్త్రీల పట్ల గౌరవం నేర్పించాలి కదా. సమానత్వ సాధన దిశగా చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే సమానత్వం వైపు ప్రయాణం చేస్తుంటే, చదువుల్లో, ఉద్యోగాల్లో రాణిస్తుంటే ఈ మృగాల వేటలో మళ్ళీ భయపడి ఇంట్లోకే పరిమితమయ్యే దశ వస్తుందా? అని భయమేస్తుంది.
ఆడనా? మగనా? అని కాదు ప్రాథమికంగా మనం మనుషులం. ఆ విషయం మర్చిపోవద్దు. మనిషి తన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి కొన్ని నియమ నిబంధనలకు లోనై ప్రవర్తిస్తాడు. అలాగే ప్రవర్తించాలి కూడా. ఆకలి అయితుంటే అన్నం వండుకుని తింటాడు లేదా కొనుక్కొని తింటాడు. అంతేకాని బలవంతంగా పశువుల్లాగా ఎదుటి వ్యక్తి దగ్గర లాక్కొని తినడు. ఇది కనీస జ్ఞానం, సంస్కారం. అది కూడా లేని మద పశువులు వుంటే, స్త్రీలంతా మరో అస్తిత్వ పోరు చేయాల్సిందే. సమానత్వం అనేది చదువు, ఉద్యోగాలకే కాని, బ్రతకడానికి కాదని మరోసారి ఋజువు అయ్యింది. అది కూడా దేశ రాజధానిలో కాబట్టి, ఈ సమాజంలో స్త్రీలకు ఏపాటి భద్రత వుందో మరొక్కసారి పునరాలోచించుకోవాలి. అయితే ఈసారి భద్రత కోసం మనం ఎవర్ని అడ్డుకోవద్దు. మనల్ని మనమే రాటుదేల్చుకొని మన దగ్గరే సశస్త్రాలు వుండెట్టుగా తయారుకావాలి. ఇన్ని సంవత్సరాల మన ఉద్యమాలు కేవలం సమానత్వం కోసమే సాగాయి. కానీ ప్రస్తుతం మనం ఉనికి కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. కనీసం మనకు బ్రతికే హక్కు కూడా లేకుండా చేస్తున్న పశువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మళ్ళీ యుద్ధమే చేయాల్సి వస్తుంది.
ఈ చట్టాలు న్యాయస్థానాలు స్త్రీకి హక్కులను కల్పిస్తున్నాయే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దోషులను వెంటనే శిక్షించే విధంగా చట్టాలు లేనందుకు మనమంతా సిగ్గుపడాలి. ఇలాంటి వారికి ఉరి శిక్షల లాంటి చిన్న చిన్న శిక్షలు సరిపోవు. వాళ్లకి నరకమంటే ఏమిటో చూపించి బ్రతికినంత కాలం శిక్ష అనుభవించేట్టుగా చేయాలి. ఇంకెవ్వరూ కూడా అలాంటి పని చేయడానికి భయపడేట్టుగా శిక్షలు వుండాలి.
అలాగే స్త్రీలు కూడా స్వేచ్ఛా స్వతంత్రాల పేరిట అనవసరపు పంకిలాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడాలి.
ఆ సంఘటనను మరిచి పోకముందే జరిగిన మరో సంఘటన విశ్వవిద్యాలయ విద్యార్థినిది. ఇలాంటి సంఘటనల్లో 50% తప్పు స్త్రీలదే వుంటుంది. ఎందుకంటే ఎవరితో ఎలా మెలగాలో ప్రకృతి సిద్ధంగా స్త్రీకి తెలుస్తుంది. అయినా కూడా మనం మేక కసాయి వాణ్ణి నమ్మినట్టుగా మళ్ళీ వేటగాళ్ళను, కసాయిలను నమ్మితే జరిగే సంఘటనలకు నిదర్శనమే ఈ ఘటన.
ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్ధుల పట్ల సమాజంలో ఒక గుర్తింపు గౌరవం వుండేవి. ఉన్నత చదువులు చదువుకునేవారని, ఉన్నత ప్రమాణాలను పాటించేవారని, అక్కడి దాకా వెళ్ళినా కూడా ఇంకా జీవితం పట్ల భ్రమలు తొలగకపోతే మనం చదువుకోవడం దండగ.
మనం ఎవర్ని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి అనేది మన సంస్కారానికి సంబంధించిన విషయం. మనం మనల్ని దిగజార్చుకునే విలువల వైపు ఎప్పుడు పయనించకూడదు. మనం ఎటు అడుగులు వేస్తున్నామో పూర్తిగా స్పృహలో వుండి వేయాలి. ఎప్పుడు తప్పు అడుగులు వేయకూడదు. ప్రాథమికంగా ఎవర్ని కూడా మనల్ని మనం కోల్పోయేంతగా నమ్మకూడదు అనేది కనీస జ్ఞానం. మన అస్తిత్వ పోరాటాలు, బతుకు పోరాటాలు అవుతున్న సమయంలో మనల్ని మరొకరు ప్రశ్నించే స్థితిలో మన ప్రవర్తన ఉండకూడదు.
ప్రస్తుతం జీవ వైవిధ్య దశలో అంతరించిపోతున్న ప్రమాదకర స్థితిలో వున్న కొన్ని జీవ రాశుల చిట్టాలో స్త్రీ జాతి కూడా చేరుతుందో ఏమో అని భయమేస్తుంది. కాబట్టి మనమందరం కలసికట్టుగా మన ఉనికి కోసం ఐక్యంగా బతుకు పోరు కొనసాగిద్దాం. మనల్ని శిక్షించే వాళ్ళను శిక్షించే హక్కును కూడా మనమే తీసుకుందాం.
ధైర్యంగా తలెత్తుకు జీవించే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. ఎవరి దయాదాక్షిణ్యాలో ఎవరి అండదండలో మనకు అక్కర్లేదు. మన చదువు, మన జ్ఞానం మనకు ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్యంతోనే సమస్యల్ని ఎదుర్కొందాం. శిక్షలు వేగవంతంగా అమలయ్యే విధంగా చట్టాలు తేవాలని, మద పశువులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. సమాజంలో తిరగడానికి ఇలాంటి పశువులు అనర్హులు కాని మనం కాదని, మనం బయట తిరగాలా? లేదా? అని కాదు చర్చ! మద పశువులు బయట తిరుగుతుంటె ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయనేదే చర్చ. ఇలాంటి అనాగరిక సమాజాన్ని చూసి మనుషులైన వాళ్ళందరూ సిగ్గు పడాలి, బాధపడాలి. మేధావులు ఆలోచించాలి. ఇలాంటి సమాజాన్ని ఆధునికం అని ఎలా అంటున్నామో, ఆధునికం అంటే నాగరిక ఉచ్ఛ దశలో వున్న స్థితి అంటే, సంపూర్ణ, సమగ్ర అభివృద్ధి వుంటే అది ఆధునిక సమాజపు లక్షణం. కానీ నేడు మనం చూస్తుంది పాశవిక ప్రవృత్తి వున్న మనుషులను కాబట్టి ఇది అనాగరిక సమాజం.
అనాగరికం నుండి అత్యాధునికం వైపు అడుగులు వేయించే దిశగా స్త్రీలుగా మనం ఆ బాధ్యతను తీసుకుందాం. మనం మన పిల్లల్ని నాగరికులుగా పెంచుదాం. మనం కన్న బిడ్డలే రాక్షసులుగా మారుతున్నారు కాబట్టి, మనమే మనుషులుగా తీర్చిదిద్దే బాధ్యత చేపట్టి, ఒక తల్లి బిడ్డలకు ఏ విధమైన బుద్ధులు నేర్పుతుందో బుద్ధి లేని సమాజానికి కూడా మనం అలాగే బుద్ధి చెబుతాం. మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకుందాం.