‘అత్యాచార’ భారతం

 టి. రమాదేవి, డైరెక్టర్‌, వనితటీవీ (ఎన్టీవీ గ్రూప్‌)

2012, డిసెంబర్‌ 16.. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో ఒక దుర్దినం. బస్సులో ప్రయాణిస్తున్న 23 సంవత్సరాల పారామెడికల్‌ స్టూడెంట్‌పై ఆరుగురు నిందితుల అఘాయిత్యం జరిపి, బాధితురాలి కడుపులోని పేగులు కూడా కమిలిపోయేలా ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ దుశ్చర్యంపై నిరసన వ్యక్తమయింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతికి బాసటగా నిలుస్తూ, ఆ ఘటనను నిరసిస్తూ మరుసటి రోజే ఢిల్లీలో విద్యార్థులు, ఉద్యోగినులు, సాధారణపౌరుల నినాదాలతో రాష్ట్రపతి భవన్‌ కంపించింది. పోలీసుల లాఠీలు, జలఫిరంగులు యువతరాన్ని, నవతరం అమ్మాయిలను ఒక్క అడుగు కూడా వెనకకు వేయించ లేకపోయాయి. వారి ఆగ్రాహావేశాలను చల్లార్చలేక పోతున్నాయి.

ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనపై ఇంతగా స్పందన రావడం ఆహ్వానించదగిన పరిణామం. దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంటే, అరకొరగా కనిపించే నిరసన ఈరోజు సమగ్ర రూపం తీసుకుంది. ఢిల్లీ పెద్దల పీఠాలను కదలిస్తోంది. ఈ కదలిక మహిళల్లో, యువతలో పెరుగుతున్న చైతన్యానికి, ఆలోచనా స్రవంతికి, సాధికారతకు ఒక ప్రతీక.

దేశ రాజధాని అంటే నిత్యం విఐపీలతో రద్దీగా ఉంటుంది. వారి కోసం చుట్టూ అంగరక్షకులు కాపలా ఉంటారు. నిత్యం అన్ని కూడళ్లలో శల్యపరీక్షలు చేస్తారు. ఎక్కడ ఎటువంటి దుశ్చర్యలూ జరగకుండా ఓ కన్నేసి ఉంచుతారు. అయినా ఆ రోజు ఓ యువతి ఆక్రందన ఎవరికీ వినిపించలేదు. ఆ కీచకపర్వం ఎవరికీ కనిపించలేదు. ఎందుకంటే, భద్రత విఐపిలకే కానీ, సామాన్యులకు కాదుగా. అక్కడ భద్రత విఐపిల చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల సామాన్య పౌరులను, సమాజ శాంతి భద్రతలను కాపాడేందుకు తగినంత ఫోర్స్‌ అందుబాటులో ఉండటం లేదు. ఢిల్లీలో ప్రతి 761 మంది జనాభాకు ఒక పోలీస్‌ భద్రత కల్పిస్తుంటే, ఒక్క విఐపికి ముగ్గురు పోలీసుల భద్రత లభిస్తోంది. దాంతో అడ్డూ అదుపులేకుండా నేరాలు పెరిగిపోతున్నాయి.

ఢిల్లీ అంటే అత్యాచారాలకు రాజధానిగా మారిపోయింది. సగటున 16 గంటలకు ఒక అత్యాచారం జరుగుతోంది. 2010లో 414, 2011లో 568, 2012లో నవంబరు వరకే దాదాపు 600 పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 1.6 అత్యాచారాలు జరుగుతున్నాయని అధికార లెక్కలే చెప్పుతున్నాయి. ప్రతి 25 నిమిషాలకు ఒకటి చొప్పున మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఢిల్లీలో 80 శాతం మహిళలు భయం మధ్యే బతుకుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులను ఎదుర్కుంటున్నారు.

వర్కింగ్‌ ఉమెన్‌లో మెజార్టీ శాతం విధులకు వెళ్లి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని అసోచామ్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలతో పాటు ముంబై, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌లోని పెద్ద సంస్థలతో పాటు, మధ్యస్థ చిన్నతరహా కంపెనీల్లో పనిచేస్తున్న 5 వేల మందిని ఈ సంస్థగా సర్వే చేయగా, ఏకంగా 92 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌరవిమానయానం, నర్సింగ్‌ హోమ్స్‌లో పనిచేస్తున్న మహిళలు తమకు తగిన రక్షణ లేదని చెబుతున్నారు. అందుకే విఐపిలకే కాదు సామాన్యులకూ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా జస్టిస్‌ సుధామిశ్రా ప్రభుత్వాన్ని కోరడం మనం గమనించాలి.

మన ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళల పరిస్థితి అధ్వానంగా ఉందని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏడాదికాలంలో మహిళలపై నేరాలు 2,28,680 నమోదు కాగా, 28,246 కేసులతో మన రాష్ట్రం, దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 2010లో అత్యాచార కేసులు 1308 కేసులు నమోదుకాగా 2011లో 1387 నమోదయ్యాయి. 2012 జూన్‌ వరకు నమోదైన అత్యాచార ఘటనలు 754గా రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇంకా రికార్డులకెక్కని ఉదంతాలెన్నో. దేశవ్యాప్తంగా 40 ఏళ్ల కాలంలో అత్యాచార కేసులు 800 శాతం పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో ఈ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం దురదృష్టకరం.

అత్యాచార గణాంకాలు

నగరం 2010 2011 2012

ఢిల్లీ 414 450 600 (సుమారు)

ముంబై 194 221

బెంగుళూరు 65 97

చెన్నై 47 76

హైదరాబాద్‌ 47 59

కోల్‌కత్తా 32 46

మార్పు ఎక్కడ నుండి జరగాలనీ, ఏ వేదిక నుండి మొదలవ్వాలని కోరుకుంటున్నామో అక్కడే స్తబ్దత కనిపిస్తోంది. ఆ పెద్దల సభలోనే, ఆ శాసనకర్తలే నిందితులుగా రికార్డులకెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల తరపున ఎన్నికైన 369 మంది ఎంపిలు, ఎమ్‌ఎల్‌ఎలపై అత్యాచార కేసులు నమోదైనట్టు ఎన్నికల అఫిడవిట్‌లో ఉందనే నిజాన్ని ప్రజాస్వామ్య హక్కుల సంస్థ వెల్లడించింది. దేశంలోని మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే గౌరవం ఎలాంటిదో దీనిబట్టే అర్థం చేసుకోవాలి. రక్షణ కల్పించాల్సిన పాలకుల స్థానంలో భక్షించే కీచకులున్నారని మరోసారి తేటతెల్లమైంది. అత్యాచార కేసుల్లో నిందితులుగా పరిగణించి, కోర్టు విచారిస్తున్న ఆరుగురు ప్రముఖులకు వివిధ పార్టీలకు టికెట్లు ఇచ్చాయి. వారంతా ప్రస్తుతం శాసన సభల్లో కొనసాగుతున్నారు. 2009లో లోక్‌సభలో ఆరుగురు ఎమ్‌పిలు సైతం అత్యాచార కేసుల్లో చిక్కుకున్నవారే. వీరే కాదు మరో 34 మంది ఎమ్‌పిలు సైతం మహిళా వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇదీ మన పాలన దుస్థితి.

దేశమంతా ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌పై గగ్గోలు పెడుతోంది. మహిళలపై అత్యాచార పర్వానికి అడ్డుకట్ట వేయాలని ముక్తకంఠంతో నినదిస్తుంది. కానీ, చట్టాలు రూపొందించాల్సిన పాలకుల్లోనే అనేకమంది అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉంటుంటే, ఇలాంటి పాలకుల నుంచి ఎలాంటి న్యాయాన్ని ఆశించగలం. ఎలాంటి చట్టాల కోసం ఎదురుచూడగలం…?

మనదేశంలో చట్టాలున్నా ఈ దుశ్శాసన పర్వం కొనసాగుతూనే ఉందంటే అందుకు కారణం, చట్టాల్లోని లొసుగులు. నిందితులు భేషరతుగా కేసుల నుండి తప్పించుకు తిరిగేందుకు ఉన్న వెసులుబాట్లు. మొత్తంగా మన చట్టాల్లో ఉన్న డొల్లతనం. అందుకే, మన చట్టాలు మరింత కఠినంగా ఉండాలి. ఆ చట్టాలు బాధితురాలికి న్యాయం చేసే రీతిగా రూపొందించాలి.

అత్యాచారం కేవలం మహిళల సమస్యకాదు. సమాజంలోని మానసిక రుగ్మతకు చిహ్నం. అడుగంటుతున్న మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం. రాజ్యాలకోసం యుద్ధాలు జరిగినా, దేశ విభజనలు జరిగినా, సామాజిక సమస్యలపై పోరాటాలు జరిగినా, కులమతాల కుమ్ములాటలు జరిగినా మొదటి బాధితులు మహిళలే అవుతున్నారు. చివరికి వినిమయ సంస్కృతిలో ఒక మారకపు వస్తువుగా మార్చేస్తున్నారు. ఫలితంగా అమ్మకడుపులోనే అంతం చేసేందుకు కూడా సాహసిస్తున్నారు. ఇలా పుట్టుక నుండి చావుదాకా అడుగడుగునా ఆంక్షలతో, అభద్రతతో జీవించాల్సిన స్థితికి నెట్టబడుతున్నారు.

అందుకే ఇటువంటి రుగ్మతను, సాంఘిక దురాచారాలను సమాజంలో లేకుండా చేయాలంటే, ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. అత్యాచార కేసులను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. కేసుల నమోదు తర్వాత విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందో గుర్తించాలి. నేర పరిశోధనా సంస్థలకు సహకరించే ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ను ప్రతి జిల్లాలలో ఏర్పాటు చేయాలి. డిఎన్‌ఎ టెస్ట్‌ రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలి.

అరబ్‌ దేశాల్లో అత్యాచార యత్నం చేసిన వారికి బహిరంగ శిక్షలు ఉంటాయి. అవి కూడా అత్యంత కఠినంగా ఉంటాయి. సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వాలు విశ్వసిస్తాయి. అందుకే పిల్లల ప్రవర్తనా సరళిని చెడుతోవలో ప్రభావితం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాయి. మన దేశంలోనూ చిన్న వయసునుంచే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడం, స్త్రీ, పురుషుల మధ్య లైంగిక సంబంధాలపై అవగాహన కల్పించడం వంటి మౌలిక చర్యలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేయాలి. పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేసి, న్యాయ వ్యవస్థలో అత్యాచారం, అత్యాచార యత్నాలను హత్యా నేరంగా పరిగణించి కఠిన శిక్షలు అమలు చేయాలి. ప్రత్యేకించి ఈ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి శిక్షలు విధించగలిగితే సమాజంలో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం పెరుగుతుంది. నేరాల స్థాయి కొంత వరకైనా తగ్గుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.