పుణ్య భూమి, కళ్ళు, తెరువు…..!

డా. జి లచ్చయ్య

ఈ పుణ్య భూమిలో పుట్టడం మనతప్పా –

ఆవేశమాపుకోని అమ్మానాన్నదీ తప్పా….. అంటూ ఆకలిరాజ్యం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇప్పటికీ మనను ఆవేశానికి గురిచేస్తూనే ఉంటుంది. ఈ పుణ్యభూమిలో మహిళలపై అత్యాచారాలు కొత్తవేమీ కావు. ఢిల్లీ వైద్య విద్యార్థిని (నిర్భయ, దామిని, అమానిత…. మన మీడియా పెట్టిన పేర్లు) ఘటన ఆరంభమూ కాదు – అంతమూ కాదు. అత్యాచారాల పరంపరలో అదో మలుపు తిప్పిన సంఘటన. మహిళలు ఒంటరివారు కారని దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికే చాటి చెప్పిన ఘటన! ఈ ఘటన జరిగి (వ్యాసం రాస్తున్న నాటికి) నెల దాటినా, సంఘటన చుట్టూ వేయికాదు లక్షలాది ఆలోచనలు సంఘర్షిస్తున్నాయి. పరిష్కారం కోసం పాకులాడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు అచ్చుకెక్కినవే లెక్కెంతో తెలియదు. అచ్చుకెక్కనివి ఎన్నో లెక్కించలేము. ఢిల్లీ సంఘటన మన బుర్రల్లో సుడులు తిరుగుతుంటే అత్యాచారాల పర్వాలు దేశవ్యాపితంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనం కీచకుని వారసులం (కీచకుడు కూడా సిగ్గుపడతాడు), దుశ్శాసునిని సోదరులం కాబట్టి!

ఢిల్లీ ఘటనకు ముందు, సందర్భంగా, తర్వాత ఢిల్లీ ఘటన కన్నా దారుణమైన సంఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటికి ఆరంభమే కాని అంతం ఉండదు. ఉండకపోవడానికి మన వ్యవస్థీకృత విధానాలతో పాటుగా, మన రాజకీయాలు, నాయకులు మన సంప్రదాయాలు, మన మతాలు, ఈ మతాల రక్షకులుగా పనిచేస్తున్న బాబాలు ఈ దేశాన్ని, పౌరుల్ని ముఖ్యంగా మహిళల్ని నియంత్రిస్తూ శాసిస్తూనే ఉన్నారు. అత్యాచారం జరిపే వ్యక్తిని ‘అన్న’ అని వేడుకుంటే అత్యాచారం జరగదని ఓ ఆశారాంబాబా అంటాడు. ఎందుకంటే మన పడతులు ద్రౌపది వారసులని, మగవారంతా శ్రీకృష్ణులని ఆయన భావన కావచ్చు! బాబా ఉవాచ ప్రకారం అమ్మాయిలంతా తమ బ్యాగుల్లో విధిగా రాఖీలు (అమెరికాలో అమ్మాయిలు బ్యాగుల్లో పిస్టోళ్ళు పెట్టుకున్నట్లు) పెట్టుకోవాలి. అత్యాచారపర్వం మొదలుకాగానే, తమాయించుకోని, బతిమిలాడి, తన బ్యాగును వెతికి అడిగి రాఖీ తీసి కట్టాలి. ఆ నిందితుడు, ఛ ఛ, ఆయన అన్నయ్యగా మారిపోతాడు. ఇంత చక్కని పరిష్కారం ఉండగా, దేశవ్యాప్తంగా ఇంతగా చర్చలు జరపడం అనవసరం కాదా? ఈ 73 సంవత్సరాల బాబాపై కూడా అఘాయిత్యాలు, హత్యలు, దాడులు, భూఆక్రమణ లాంటి తదితర కేసులు ఉన్న విషయం మరిచిపోయాడు.

ఇక మరో పెద్దమనిషి, స్వయంగా హిందూ మత ప్రచారాన్ని, ముఖ్యంగా హిందువుల ధర్మ రక్షకుడిగా పిలవబడుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ ముఖ్యుడైన మోహన్‌ భగవత్‌ దేశాన్ని రెండు దేశాలుగా మార్చివేశాడు. అత్యాచారాలు జరిగే ఇండియా ఒకటైతే, అత్యాచారాలు జరగని భారత్‌ రెండోది. ఇలా జరగడానికి ఆధునిక పోకడలే కాని మరోటి కాదని తేల్చిపడేసాడు. ఇంకా నయం అత్యాచారాలకు ఎదుటి మతస్తులే కారణమని వ్యాఖ్యానించనందుకు నిజంగా ఆయన్ని అభినందించాల్సిందే! ఇక పాండిచేరి ప్రభుత్వం అమ్మాయిలు నిండైన కోటు వేసుకోవాలంటూ ఓ కొత్త సూత్రీకరణను చేసింది. పశ్చిమబెంగాల్‌ వామపక్షపార్టీని మట్టి కరిపించిన ‘దీది’ రాసుకుంటూ-పూసుకుంటూ తిరిగితే అఘాయిత్యాలు జరగవా అని యువతులకు ఎదురుప్రశ్న వేసింది. పైగా 24 పరగణాల జిల్లాలో, కోల్‌కత్తాలోని పార్క్‌ స్ట్రీట్‌ అత్యాచార సంఘటనలు అభూత కల్పనలని, సిపిఎం పార్టీవారు చేపట్టిన దుష్ప్రచార కార్యక్రమాలని తేల్చి చెప్పింది. సీనియర్‌ పార్లమెంటేరియన్‌ సుష్మాస్వరాజ్‌కు మొన్ననే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన జయబాదురీలకు ఢిల్లీ సంఘటనతో కంటనీరే ఆగలేదు. పార్లమెంటేరియన్స్‌గా వారు విన్నది, చూసింది ఈ పవిత్ర దేశంలో మొదటిది కాబోలు! జయబాదురిగారు ఇంకా ‘గుడ్డి’ సిన్మాలో నటిస్తున్నట్లుగా అనుకుంటున్నదేమో! ఇక మన మన్‌మోహన్‌జీ మౌనంగానే రోదించాడు. ఎందుకంటే ఆయనకు ముగ్గురు ఆడపిల్లలున్నారు కాబట్టి. అమెరికాలో స్కూలు పిల్లలు మారణకాండకు గురైతే అగ్రరాజ్యాధినేత కంటనీరు పెట్టినప్పుడు తాను పెట్టకపోతే బాగుండదు కదా! మన సోనియాజీ సింగపూర్‌నుంచి వచ్చిన శవపేటికనే అందుకుంటే, ఇంకా మన మహిళలకు కష్టాలుంటాయని, కడగండ్లుంటాయని, అత్యాచారాలకు, అన్యాయాలకు తావుంటుందని ఇంకా భావిద్దామా! జరుగుతున్నాయిగా అంటే, అందుకే ‘చింతన్‌ బైఠక్‌’ సమావేశం చేసారుగా!

ఇక ఉత్తర భారతదేశంలో గ్రామాలకు గ్రామాల్నే తమ గుప్పిట్లో పెట్టుకొని సమాజాన్ని, రాజకీయాల్ని కూడా శాసిస్తున్న ‘కాప్‌’ పంచాయత్‌ ఓ కొత్త సూత్రీకరణ చేస్తూ, 16 సంవత్సరాలకే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలని హూకుం జారీచేశారు.

ఇదో సువిశాల దేశం. భిన్న మతస్తులే కాదు, భిన్న మనస్తత్వాలవారు ఉంటారు. భిన్న ప్రాంతాలవారుంటారు. ఎవరి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది. అత్యాచారం చేసేవారు ముందే చెప్పరుగా! చెప్పి చేస్తే అత్యాచారం ఎలా అవుతుంది? జరిగిందే అనుకుందాం! టాం టాం చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, చేస్తే వారు ఎఫ్‌.ఐ.ఆర్‌. రాయడం చెయ్యాలా! అయినా పోలీసులకు మహిళా సమస్యలు తప్ప మరేమీ లేదా? అత్యాచారం ఏదో వింతైన అంశమా? కొత్తగా జరుగుతున్నదేంది? మన ఇంద్రుడు, చంద్రుడు చేస్తున్న పనులేగా! ‘అర్ధరాత్రి ఒంటరిగా స్త్రీ నడయాడిన నాడే….” అని గాంధీజీ అంటే గుడ్డిగా నమ్ముతే ఎలా? భర్త పక్కనుంటేనే భరోసాలేని వ్యవస్థ అని, బయటనే కాదు, ఇంట్లో ఉన్నా దిక్కూ మొక్కు లేని దౌర్భాగ్యపు వ్యవస్థ అని తెలుసుకోలేక పోతే ఎలా? వాడు మామ కావచ్చు, మరిది కావచ్చు! తాత కావచ్చు, తండ్రి కావచ్చు! బావా కావచ్చు, బయటివాడూ కావచ్చు! పోలీసు కావచ్చు, పొలిటీషియన్‌ కావచ్చు! అధికారి కావచ్చు, అటెండరు కావచ్చు! గుండా కావచ్చు, గుర్తులేనోడు కావచ్చు! పాలవాడు, పూలవాడు, ఇంటి కాపాలావాడు, పక్కింటివాడు, ఎదురింటివాడు ఎవరైనా కావచ్చు! వాడో మగాడు. తల్లి, చెల్లి, అక్క, వదిన ఎవరైతేనేం? వావి వరుస, వయస్సు ఒళ్ళుకు అవసరమా! అనుభవించడానికి, చిదిమివేయడానికి ఆడదైతే చాలు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం | చెరిపేద్దాం బస్సుల్లో! అమ్మాయిల్ని, మహిళల్ని, మాతల్ని చెరపడమే మన వారసత్వం – రాసేద్దామరి!

అయినా మనకుకూడా ఎంత ఓపికుంటుంది. ఎన్ని సంఘటనలను ఎదుర్కోగలం? ఒకటా, రెండా? ఉద్యమం చేయాలంటే, జీవితాలు ఉద్యమాలకే సరిపోతాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అభ్యుదయ ఆలోచనతో ఉన్న సంఘాలతోపాటు, వామపక్ష భావజాలంతో ఉన్న మహిళాసంఘాలు, వివిధ బూర్జువా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న మహిళా సంఘాలున్నాయి. ఇలా జాతీయ స్థాయిలోనే ఏడు సంఘాలున్నాయి. వీటిని ఏడుగురు అక్కచెల్లెండు (ఐలిఖీలిదీ ఐరిరీశిలిజీరీ) అని కూడా పిలుస్తారు. మహిళలకు జరుగుతున్న అన్ని రకాల అన్యాయాలకు వ్యక్తిగతంగా, సంఘటితంగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ మహిళా సంఘాలకుంది. 1978లో మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలోని దేశాయిగంజ్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో 16 సంవత్సరాల గిరిజిన అమ్మాయి మధురపై ఇద్దరు పోలీసులు జరిపిన అత్యాచారాన్ని వెలుగులోకి తెచ్చి, న్యాయంకోసం పోరాడినవి ఈ మహిళా సంఘాలే! అలాగే ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లో నాటి రియర్‌ అడ్మిరల్‌ ఎం.ఎం. చోప్రా ఇద్దరు పిల్లలైన గీతా, సంజయ్‌ అపహరణ, అత్యాచారం కేసును వెలుగులోకి తెచ్చింది ఈ మహిళా సంఘాలే! ఆగస్టు 26, 1978న జరిగిన ఈ సంఘటనలో గీతా అత్యాచారానికి కూడా గురై హత్యగావింపబడింది. నిందితులిద్దరు ఢిల్లీలో పేరుమోసిన గూండాలైన బిల్లా (జస్బీర్‌సింగ్‌) రంగా (కుల్జీత్‌సింగ్‌)లు. వీరిద్దరికీ నాలుగు సంవత్సరాల విచారణ తర్వాత ఉరిశిక్ష పడింది. కాని మధుర కేసులో శిక్షపడిన ఇద్దరి పోలీసుల్ని వదిలివేయడం జరిగింది. అంతకుముందే 1975లో హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌ పోలీసు స్టేషన్లో రమేజాబిపై అత్యాచారం సంఘటనను వీరోచితంగా ఎదుర్కొన్నది విద్యార్థి, మహిళా సంఘాలే! ఇలా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు తమ గొంతును విప్పుతూనే ఉన్నాయి. అయితే ఈ గొంతు అన్ని సందర్భాలలో వినిపించకపోవడం గమనార్హం. ఆయా సంఘటనలకు సంబంధించిన రాజకీయ స్వభావాన్ని బట్టి ఉద్యమాలు జరగడం గమనార్హం. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు జరిపిన అత్యాచారాలపై దాదాపుగా తక్కువ స్పందన ఉండగా, పౌరులు జరిపిన అత్యాచారాలపై పెద్ద ఎత్తున నిరసనలు కనపడుతున్నాయి. ఒక్క మణిపూర్‌లోని మహిళలు తప్ప, మిగితా ప్రాంతాల్లో వీరికి వ్యతిరేకంగా ఉద్యమాల్ని లేవదీయలేకపోతున్నాయి. దీనికి కాశ్మీరులోని సోఫియానా, ఛత్తీస్‌గఢ్‌లోని సోనిసోరి సంఘటన, 2007లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వాకపల్లి గిరిజన మహిళా సంఘటనలను, మొన్నటి ఢిల్లీ సంఘటననే ప్రత్యక్షంగా ఉదహరించవచ్చు!

దాదాపు ఢిల్లీ సంఘటన నిరసనకు ఏ రాజకీయ పార్టీగాని, మహిళా సంఘం, స్వచ్ఛంద సంస్థగాని, విద్యార్థి సంఘంగాని నాయకత్వం వహించక పోవడం ఆలోచించాల్సిన అంశం. అయినా జనం కదిలారు. యువకులు, యువతులు, పెద్దలు, చిన్నలు చలిని కూడా లెక్క చేయకుండా, రాత్రి పగలు లేకుండా నిరసన చేపట్టారు. మొత్తం దేశాన్ని ఓ కుదుపు కుదిపారు. అత్యాచారాలపై ఓ చర్చకు నాందీ ప్రస్తావన కావించారు. ఇదో మంచి పరిణామం! కట్టలు తెంచుకునే ఆవేశంతో, ఆక్రోశంతో ఈ దేశ యువత, ప్రజానీకం ఉందని ఈ ఘటన రుజువు చేసింది. బాధాకరమైన విషయమేంటంటే, దీన్ని ఏ రాజకీయ పార్టీ, మహిళా సంఘం, విద్యార్థి సంఘం నాయకత్వం వహించి నడపలేని స్థితి. ఒకవేళ వీరెవరైనా నాయకత్వం వహిస్తే కూడా ఇంత స్పందన ఉండేది కాదేమో! ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అంశమేంటంటే, ఈ దేశ యువతకు దశదిశను నిర్దేశించే ఓ రాజకీయ పార్టీ అత్యవసరంగా ఉందనేది! ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీకి ఆ అర్హత లేదని! కొత్తగా ఏర్పడిన కేజ్రీవాల్‌ ఆమ్‌ఆద్మి పార్టీకూడా ఈ దిశగా ఆలోచించలేక పోయింది. దీనికి విద్యాలయాలపరంగా, కళాశాల పరంగా, యూనివర్సిటీల పరంగా చర్చ జరగాలి. దీనికి మణిపూర్‌ మణిపూస ఇరోంచ షర్మిలను, అక్కడి విద్యార్థినులను, మహిళా సంఘాల్ని (ఆర్మి అత్యాచారాలకు వ్యతిరేకంగా, 2004లో జరిగిన ఘటనను నిరసిస్తూ 12మంది మహిళలు |దీఖిరిబిదీ జుజీళీగి ష్ట్రబిచీలి ఏఐ అనే బ్యానర్‌ను పట్టుకోని నగ్నంగా నిరసన తెలిపారు) ఆదర్శంగా తీసుకోవాలి.

ఇలా సామాజికంగా జరిగే సంఘటనల్నీ ఎదుర్కోలేని స్థితిలో, రాజకీయంగా జరుగుతున్న అత్యాచారాల్ని, హత్యల్ని ఎదుర్కొనడం అంటే హిమాలయాల్ని ఢీకొనడమే! అనురాధ బాలి, గీతాశర్మ, బన్వారీదేవి, మధుమిత శుక్లా, నైనాశాని (తందూరి పొయ్యి హత్యకేసు) ఈ కోవలోకి చెందినవే! ఇక సమాచార హక్కుల కార్యకర్త షీలామసూద్‌ తదితరుల హత్యకేసులకు దిక్కూ మొక్కు లేదు.

బతుకుతెరువే భారంగా మారిన ఈ దేశంలో, సంప్రదాయాలు ఉన్నవారికి ఆనందాన్నిస్తే, లేనివారికి సంకెళ్ళుగా మారుతున్నాయి. ఈ సంప్రదాయాలు మొత్తంగా మహిళలకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. వీటిని చేధించే మాట అలా ఉంచుదాం. ఇవి రోజురోజుకు మరింత బలోపేతమౌతూ, మహిళల్ని మరింతగా బానిసల్ని చేస్తున్నాయి. వీటిని చేధించకుండా, మహిళా సాధికారిత అన్ని రంగాల్లో అసాధ్యం. ఆర్థిక స్వాతంత్య్రం ఒక్కటే మహిళల్ని తలెత్తుకునేలా చేయదు. ఆలోచనా పరంగా, భావజాల పరంగా కూడా మార్పు రావాలి. దీనికోసం మహిళా సంఘాలేకాదు, మానవీయ కోణంలో ఆలోచించే మగవారు కదలాలి.

ఎవరో వస్తారని, ఏదో చేస్తారనే భ్రమల నుంచి బయటపడాలి. ఢిల్లీ సంఘటన నేపథ్యంలో పెద్ద చర్చ జరుగుతున్నది. తోచినవారు తోచినవిధంగా సలహాలు, సూచనల్ని ఇస్తున్నారు. ప్రభుత్వం వర్మ కమిటీని వేసింది. సలహాల్ని, సూచనల్ని ఇవ్వమని కోరుతున్నది. ఇచ్చేవారు ఇస్తూనే ఉన్నారు. సమాంతరంగా, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత మరో ఘట్టం. తిరిగి ఆందోళనలు. చర్చలు. కంటితుడుపు చర్యలు. ఉద్యమకారులు అలసిపోవడం షరా మామూలే! గత అనుభవాలు ఉన్నాయి. అందరు వేలెత్తి చూపుతున్నది పోలీసుల్నే. ఈ దేశ పోలీసులు రాజకీయ నాయకులకు, ఉన్నవారికి సేవలందించడానికే గాని, పౌరులకు కాదని విజిలెన్స్‌ కమీషనర్‌ ఆర్‌. శ్రీకుమార్‌ అన్నమాటల్ని గమనంలోకి తీసుకోవాలి. పోలీసు శాఖలో నిజాయితీ పనికిరాదని, పనికిరాని శాఖకు బదిలీ చేస్తారని మాజీ రాజస్థాన్‌ డి.జి.పి. పి.కె.తివారి అన్న మాటలు అక్షర సత్యాలు. పోలీసు శాఖ గూర్చి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు! కావల్సింది పోలీసు శాఖలో గుణాత్మకమైన మార్పులు. అధికారంకు దాసోహం అవకుండా పౌరులకు రక్షణ కల్పించే భావజాలం కావాలి. నిష్పక్షపాత పని విధానం లోపించి చట్టాల్ని నిజాయితీతో అమలు చేయకపోవడం, పోలీసు శాఖ పాలకుల రక్షణకే పనిచేయడం, ప్రస్తుత దుస్థితికి కారణం. దీన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది.

అయితే, ఈ దిశగా చర్యలు జరగలేదని కాదు. 1975నుంచి 2003 దాకా పోలీసు శాఖ ప్రక్షాళనపై అయిదు కమిటీలు వేయబడ్డాయి. ఒక కమిటీ సూచించిన సూచనల అమలుకై మరో కమిటీ కూడా వేయబడింది. ఏ కమిటీ కూడా ఆచరణకు నోచుకోలేదు. చివరికి 2006లో అస్సాం, బీహారు మాజీ డి.జి.పి సరిహద్దు భద్రతాదళాల అధికారి ప్రకాశ్‌సింగ్‌ ఈ విషయంగా సుప్రీంకోర్టు లో ఓ ఆర్జీని కూడా వేయడం, ఆర్జిని పరిశీలించిన సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌ సోలి సోరబ్‌జీని ఓ ముసాయిదాను తయారుచేయమని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆరు సూత్రీకరణలను కూడా చేసింది. ఆరు సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క రాష్ట్రం ఈ విషయంగా ఆలోచించలేదు. పట్టించుకోలేదు. ఒక్క కేరళ మాత్రం ఈ విషయంగా కొంత కృషి జరపగా, మొన్నటి ఢిల్లీ సంఘటన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత 13 అంశాలతో కూడిన చార్టర్‌ను రూపొందించింది. అందులో ముఖ్యమైనవి – 24 గంటలు పనిచేసే మహిళా సహాయ కేంద్రాలు, అత్యాచార కేసుల్ని విచారించడానికి మహిళల్ని జడ్జీలుగా నియమించడం, గూండా చట్టంకింద అరెస్టు అయిన వారికి బెయిలు మంజూరు చేయకపోవడం.

మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలోనే ప్రత్యేక మహిళా పోలీసు శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ ఆహ్వానించతగ్గ అంశాలే! కాని ఆచరణ పరంగానే అనేక అనుమానాలు. అత్యాచారాలు చట్టాలు లేక జరుగుతున్నాయా, వాటి అమలు లోపంతో జరుగుతున్నాయా అనేది ఆలోచించాలి. నిజాయితితో అమలు చేస్తే, రాజకీయ ప్రమేయాన్ని కాదంటే, ఉన్న చట్టం చాలు. కొత్త చట్టాల ఆలోచన కాలయాపనకు, సమస్యల్ని పక్కదారి పట్టించడానికే! అదనం అవసరమని భావిస్తే, అవి కూడా రాజకీయ పలుకుబడికి తలొగ్గితే మన మహిళలకు దిక్కేంటి….? సమాధానాలు కావాలి! పాలకులు సమాధానాలు చెప్పాలి!!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.