డి. నటరాజ్
ప్రపంచం అంతా ఆర్థిక సంబంధా లతో ముడిపడి వుంది. ఆర్థిక సంబంధాలకు మూలకారణమైన శ్రమశక్తి మూలంగానే మానవ నాగరికతలూ, విభిన్న సమాజాలూ ఉద్భవించాయి అంటాడు కారల్ మార్క్స్. మిగులు ధనాన్ని దానం చేయడం ద్వారా వ్యక్తి పరిశుద్ధుడౌతాడు అంటుంది ఇస్లాం. డబ్బుని ఒక ప్రణాళిక పెట్టుకుని ఖర్చు చేయకపోయినా, మంచి పనులు చేయకపోయినా ఆ సంఘానికి అభివృద్ధి వుండదని అంటాడు గౌతమ బుద్ధుడు.
డబ్బు లేకపోతే మనిషికి డచ్చుకి (చిల్లపెంకుకి)
పనికిరాడు అనేది మన తెలుగు సామెత. రూకలు లేకపోతే నూకలు ఉండవు అన్నది మనందరికీ తెలిసిన విషయమే.
అయినా డబ్బుకి సంబంధించిన అనేక విషయాలు సరిగా ఎవరికీ తెలియవు. ‘డబ్బున్నోడిదే లోకం, డబ్బుకి లోకం దాసోహం’ అన్నదే మనకు తెలుసు. ఆ డబ్బుని మనకు కావలసినంత మనం వశం చేసుకోవడం మన హక్కు అన్నది మాత్రం నూటికి ఎనభై మందికి తెలియదు. తెలుసుకునే ఇచ్ఛకూడా వారికి లేదు. ఈ అజ్ఞానమే ధనవంతులకీ, పాలకులకీ వరం కాగా, భారత ప్రజలు నూటికి 80మంది దారిద్య్రంలో మగ్గడానికి ఆస్కారమేర్పడుతున్నది.
ఈ కీలకమైన సంబంధాలను గూర్చి, అందరికీ ధనమూ అన్ని సౌకర్యాలూ అందేలాగ ఆర్థికమంత్రులు, మేధావులు అమర్త్యసేన్ లాంటివారు ఎన్నో సలహాలు ఇచ్చినారు. మనకు ఆయన పేరొక్కటే తెలుసు. ఆర్థికరంగం దేశానికే ప్రాణవాయువు. అయినా ఈ రంగం గురించి మనకు అంతగా తెలియదు. బాగా చదువుకున్న వారిలో కూడా ఈ అంశం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. ధనికులు పేద ప్రజల జీవితాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికీ దేశాన్ని పీల్చి పిప్పి చేయడానికీ ఇదొక ముఖ్య కారణం.
ఆర్థిక శాఖకు సంబంధించిన అనేక విషయాలూ, గ్రంథాలూ అన్నీ ఇంగ్లీషు భాషలోనే ఉన్నాయి. ఆర్థిక విషయాల గురించి పత్రికలు ఇచ్చే సమాచారం అంతా ధనవంతుల, వ్యాపారస్థుల, దేశవిదేశీ వాణిజ్య విషయాల లావాదేవీల సమాచారం గా వుంటుంది తప్పితే ప్రజలకు సంబంధిం చినదిగా, ప్రజల వికాసం కోసం వుండదు.
ఇప్పడు ఆ కొరతను తీర్చడానికీ, విధ్యార్ధుల, మేధావుల, వివిధ పార్టీ కార్యకర్తల, ఆర్ధిక, సాంఘిక విప్లవకారులందరికీ నిత్యహస్త భూషణం కాగల అనేక ఆర్ధిక రంగ సమాచారాలతో, భారత దేశం యొక్క ఆర్ధిక వ్యవహారాలు మాత్రమే కాదు. ప్రపంచం యొక్క ఆర్ధిక వ్యవహారాలు, అవి ఆయాదేశాల్లో తీసుకొస్తున్న మార్పులూ, దుష్పరిణామాలూ, రాజకీయమార్పులూ ….. వీటితో కూడిన సమాచారంతో స్వచ్ఛమైన, అందమైన తెలుగులో, కారుచీకటిలో కాంతి రేఖలా దూసుకువచ్చిందో పుస్తకం. దానిపేరే ”ప్రపంచ ఆర్ధిక విహాంగ వీక్షణం” రచయిత విశ్వవిఖాత ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఆర్ధిక శాఖ బోధనలో విశేష ప్రావీణ్యం కల ప్రొఫెసర్ చుంచు సుబ్రహ్మణ్యం. అనేక సామాజిక ఆర్ధిక మార్పులకు కారణం అయ్యే విషయాలు ప్రజల ముందు పెట్టి వాటితో మనకున్న వాస్తవ సంబంధాలు చూపి, వారిలో వికాసం కల్గించి, వారిని యోధులుగా తీర్చి దిద్దకపోతే దేశానికి భవిష్యత్ వుండదన్న వేదన ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తాయి. ఆ విధంగా ఆర్ధిక రంగంలో ఇది వన్నె చిన్నెల పెట్టుబడి దారీ గ్రంధంకాక, అచ్చమైన దేశభక్తి గ్రంధం.
విశ్వమాతకు అంకితం చేసిన ఈ మహత్‌గ్రంథంలో మతరహిత దైవపూజ పెంచు ప్రపంచ ఐక్యత అంటూ నినదించిన ఈ గ్రంథంలో దేశవిదేశాల ఆర్ధిక చారిత్రక నేపథ్య వ్యాసాలు సామాజికరాజకీయ నేపథ్యవ్యాసాలు, కేవలం ఆర్ధిక నేపధ్య వ్యాసాలు మొత్తం ముప్పయి ఉన్నాయి.
ఈ వాసాల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రపంచం యొక్క గుండెనాడిని పట్టుకుని దానికి మానవతా పూర్వకమైన చికిత్స చేయడం. మనుషుల్ని పీడించేరోగాలు ఎన్నివున్నాయో, దేశాన్ని పీడించే రాజకీయ జబ్బులు కూడా అన్ని వున్నాయి. వాటికి నివారణోపాయాలు సూచించడం మామూలు విషయం కాదు. అసలు రోగాన్ని గుర్తించడమే పెద్ద సమస్య. సమస్యని గుర్తిస్తే, సమస్యకి గల కారణాలు అన్వేషించ కలుగుతాము. కారణాలు రూఢి అవుతున్న కొద్దీ నివారణా ఆలోచనలు అనేక అనుభవాలతో పరిష్కారం వైపుకు కదులుతాయి. ఇదంతా ఆయా దేశాల విద్వత్తు మీద ఆధారపడి వుంటుది.
వార్తా పత్రికల్లో కానవచ్చే ఆర్ధికమాంద్యం, ఐక్యరాజ్యసమితి, భద్రతాసమితి, బ్రిక్స్ దేశాలు, ఐరోపా సమాఖ్య, జి.20 దేశాలు, అణువిధ్యుత్, సూక్ష్మఋణాలు, డెమోగ్రాఫ్‌క్ డివిడెండ్, ఆహార అభద్రత…. మొదలైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకి వెళ్ళే విద్యార్ధులకి మాత్రమే పనికివచ్చే విషయాలను, ఎంతో అందమైన, ఇవి మనకు మన జీవితాలకు సంబందించినవి అన్నప్రామాణిక సమాచారంతో ఆయన అందించిన తీరు అత్యంత ప్రశంసనీయం. సామాన్యుడు కూడా యీ వ్యాసాలను చదివితే ఎంతో మనోవికాసం చెందగలడు.
ఈ వ్యాసాల్లో ‘ అంతర్జితీయ ద్రవ్యనిధి’ యొక్క లోగుట్టు ఏమిటో, అది అప్పులిచ్చి ఎలా నిబంధనలు విధించి, పెద్ద పెద్ద దేశాల్నికూడా ఎలా పిండి పిప్పి చేస్తుందో మొదటి వ్యాసవలోనే చూపిస్తారు. మన కాబూలీ వడ్డీలు, ఆ ద్రవ్యనిధి వడ్డీల ముందు దిగదుడుపు. బ్యాంకులకి వేల బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చి, వాటి ద్వారా గృహనిర్మాణాలకు ఎడాపెడా అప్పులిప్పించి అవి తీర్చబడక అమెరికా ఆర్ధిక రంగం ఎలా కుప్పకూలిందో టెన్త్‌క్లాస్ చదివేకుర్రాడికి అర్ధమయ్యేలా విశదంగా చెప్పారు. ఇదే సబ్జెక్టుతో కూడిన మరో వ్యాసం – బంగ్లాదేశ్‌లో నోబుల్‌ప్రైజ్‌కి కారణం అయిన స్వయం సహాయక బృందాల ఆర్ధిక వ్యవస్థ, భారత దేశానికి వచ్చేసరికి ఎలా ప్రజల్ని పీడించే సూక్ష్మ రుణాల వ్యవస్థగా రూపొందింది, ఎన్నికుటుంబాలు సర్వనాశనం అయ్యాయో, పాలకుల అవినీతికి ఇందులో ఎంత భాగస్వామ్యం వుందో నిరూపించారు 14వ వ్యాసంలో.
తాను స్వయంగా వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చి వుండటంతో, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుభవం కూడా ఆయనకు వుండటంతో, ఆ రంగానికి సంబంధించిన అనేక అన్యాయాలను, రహస్యాలను ఎంతో కారుణ్య హృదయంతో చాకచక్యంగా మన ముందుంచుతారాయన. నీటి ప్రాజెక్టుల విషయంలో కె.ఎల్.రావుగారిని తలపించే అతి తక్కువ మంది మేధావులలో ఒకరుగా అనిపిస్తారాయన. వ్యవసాయాన్ని నాశనం చేసి, సోకాల్డ్ సోషలిస్టు రష్యా పైకి చెప్పుకోలేని, కష్టంతో ఎంత కుదేలయ్యిందీ, తాను బద్దశత్రువుగా భావించే అమెరికానుండి ఎలా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొని క్షీణించిందో కళ్ళకు చూపించారు. మన దేశానికంటే మూడింతలు తక్కువ వ్యవసాయ భూమికల చైనా దేశంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాముఖ్యత వల్ల అది పెట్టుబడిగా పెట్టి, చైనా వాళ్ళు ప్రపంచపటంలో రెండవ అగ్రశ్రేణి దేశంగా ఎలా ఎదిగిందో ఆయన ఆధార సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంటే, మన దేశపు స్థితి మనకు తలపుకు వచ్చి, ముఖాలు చిన్నబోవడం మనవంతు అవుతుంది. గత 20 ఏళ్ళలో దేశవ్యాప్తంగా 3 లక్షలమంది వ్యవసాయ రంగపు నష్టాలవల్ల, దోపిడీ పీడనల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారన్న వాస్తవం తెలుస్తుంటే, అవమానంతో తలలు ఎక్కడ పెట్టుకోవాలో మనకే ఆర్థం కాదు. అంతలా వ్యవసాయ రంగాన్ని నాశనం చేశాయి మన ప్రభుత్వాలు. రైతుల ఆత్మహత్యలు ఇంకా నిత్యం పేపర్లలో చూస్తూనే వున్నాం. మన రైతాంగం కంటనీరు తుడిచేదెప్పుడో? ఈ దిక్కుమాలిన సెజ్‌లు అంతరించేదెప్పుడో తెలియదు. పట్టణాలకు కల్పించే సౌకర్యాలన్నీ పల్లెలకు కూడా కల్పించినప్పుడే దేశం బాగుపడుతుందన్న డా|| అబ్దుల్‌కలామ్ భావనలు విజయవంతం అయ్యేదెప్పుడో తెలియదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధిపరచి అధికశాతం ప్రజలకు లాభసాటి ఉద్యోగాలు కల్పించేదెప్పుడో తెలియక సామాన్య మానవుడు ఖిన్నుడవుతున్నాడు.
అరబ్బు దేశాల లోగుట్లు, వారి షియాసున్నీల తేడాలు, వారి బలా, బలహీనతలు, చైతన్య ఉద్యమాలు, ఇజ్రాయేలు ఏర్పాటు వెనుక వున్న రాజకీయాలు, పాలస్థీనా ప్రజల కష్టాలు ఇంకేమిటి అరబ్బు దేశాల సాంఘిక, ఆర్థిక విషయాల నన్నింటినీ అవపోశన పట్టిన వ్యాసాలు, ఎంతో చక్కగా సామాన్యుడికి కూడా చక్కగా అర్థం అయ్యేలా చక్కని ప్రజాహిత శైలితో కూడిన ఈ వ్యాసాల్ని అందరూ తప్పనిసరిగా చదవాలి. ఫిలిప్పీన్, ఇండోనేషియా, మలేసియా దేశాలలో వలె మిగిలిన అరబ్బు దేశాలు కూడా ప్రజాస్వామ్యదేశాలుగా రూపొందుతూ ఉండడం, ప్రపంచ పటంలో హర్షించదగిన పరిణామం అంటారాయన. అందుకు దోహదం చేయాలంటారాయన.
గాంధీగిరి భారతదేశ పునరుజ్జీవనం అన్న వ్యాసంలో, లౌకిక సామాజిక ఉద్యమాలవల్ల పేదరిక నిర్మూలన పథకాలకు రూపకల్పన జరిగితే, వాటివల్ల లబ్దిపొందిన ప్రజానీకం ఆ గొప్పతనాన్నంతా పాలక పార్టీలకు ఆపాదించడం ఎలా జరుగుతుందో చక్కగా వివరించారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెట్టే ఖర్చులో రూపాయికి 15 పైసలు కూడా వారికి చేరడం లేదన్న విషయం, మధ్య దళారులే దానిని మింగేస్తున్నారన్న చేదు నిజం మన వ్యవస్థలో వున్న సోమరితనాన్ని, ఉదాసీన వైఖరినీ బట్టబయలు చేసి, మనలో ఆత్మ గౌరవాన్ని, రోషాన్ని రేకెత్తిస్తుంది. భారతదేశంలో లంచగొండితనం విశృంఖలత్వానికి ఇంగ్లీషువాళ్ళు ఎలా బీజంవేశారో ఆయన ఈ వ్యాసంలో చక్కగా వివరించారు. భారతదేశంలో ఎన్నికల ద్వారా జరిగే పరోక్ష ప్రజా ప్రభుత్వం వల్ల ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయో, ఒకవిధంగా పార్టీలెస్ డెమాక్రసీ ఎంత అవసరమో ఈ వ్యాసంలో ముచ్చటిస్తారాయన.
ఇంకా చైనాను ఫ్యాక్టరీ ఆఫ్ వరల్డ్‌గా ఎందుకు భావిస్తారో, ఇండియాను ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్‌గా ఎందుకు భావిస్తారో, భారతదేశంలోని నేటి పేదరికం వల్ల రేపు పారిశ్రామిక వస్తువులకీ గిరాకీ లేని పరిస్థితి ఎలా రాబోతుందో, ఐరోపా సమాఖ్యవల్ల ఇండియాకి గల ప్రయోజనాలు ఏమిటో, దక్షిణాసియా ప్రాంతీయ సహకారమండలిలో చైనాకి సభ్యత్వం ఇవ్వడంవల్ల వచ్చే లాభాలేమిటో, నష్టాలేమిటో, అణువిద్యుత్ లోపాలు, అన్ని ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తులు కూడా మనకు ఎంత అవసరమో చక్కగా వివరించారు. ఏ దేశంలోనైనా ఉద్యోగాల కల్పన ఎంత త్వరగా ఆయా దేశాల్ని అభివృద్ధి పథంలోకి నడుపుతాయో, ఇండియాలో లింగ నిర్ధారణ పరీక్షల వల్ల ఆడ శిశువులకి భద్రత ఎలా లేకుండాపోయిందో పట్టికలతో సహా ఇచ్చిన వివరాలు ఎంతో ఆశ్చర్యం కలిగించే ఈ పుస్తకాన్ని చదవడమే కాదు. అధ్యయనం చేయాలి. ప్రభుత్వాల ముందుకు లేఖల ద్వారా తీసుకెళ్ళాలి. ఉద్యమాల ద్వారా నిద్రపోతున్న ప్రభుత్వాల్ని మేల్కొల్పాలి. అందుకు కావలసిన మేలైన సమాచారం అంతా తన వ్యాసాల్లో పొందుపర్చిన ఆచార్య సుబ్రహ్మణ్యంగారు ఎంతైనా అభినందనీయులు. ఈ పుస్తకం నాటి తరిమెల నాగిరెడ్డిగారి తాకట్టులో భారతదేశంను జ్ఞాపకం తెస్తుందనడంలో సందేహం లేదు.