గండవరపు సామాన్య
నిర్భయ ఘటనకంటే దాదాపు ఆరునెలల ముందు ముంబయ్‌లోని ‘పల్లవి పుర్కాయస్త’ అనే యువతిపై ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ అత్యాచార యత్నం చేసి, హత్య చేశాడు. ఆమె ఉన్నత విద్యావంతురాలు, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన చక్కటి అమ్మాయి.
ఈ రెండు సంఘటనలు మిగిల్చిన విషాదాన్నుండి కొంత తెరిపిన పడ్డాక నాలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ ఈ ఇద్దరమ్మాయిలు ‘ఆ’ సమయంలో ఏం దుస్తులు ధరించి ఉన్నారు? ఇప్పుడు ఆడపిల్లలు గల తల్లిదండ్రులం ఏం చేయాలి? మన అభ్యుదయ భావజాలానికి తగ్గట్లుగా మగపిల్లల్తో సమానంగా విద్యాబుద్ధులు చెప్పించి ఆడపిల్లల్ని పెంచుకోవాలా లేక, బిడ్డ బ్రతికి వుంటే చాలని ఇళ్ళు కదలనీకుండా వుంచుకోవాలా అని నాకు ఖచ్చితమైన సమాధానం దొరకని ఈ ప్రశ్నలకి మీతో పంచుకుంటున్నాను.
ఎందుకని సమాధానం దొరకలేదు అంటే మనమూ, మన ఆడపిల్లలూ విద్యావంతులం కాకుంటే తులసీ రామయణం ”తప్పెట వెర్రిబాగులవాడు, శూద్రులు, జంతువులు, స్త్రీ – ఇవన్నీ కొట్టదగ్గవి” అన్నట్లు కొట్టదగిన వారిలో ఒకరుగా మిగిలిపోతాం. ఖురాన్ ”స్త్రీ పోషణకు, పురుషుడు తన సంపదను ఖర్చు పెడుతున్నందు వల్ల స్త్రీలపై పురుషులకు అధికారం ఉంది” అన్నట్లు ఒకరి అధికారానికి లోబడే వుంటాం. బైబిల్ ”భర్తే స్త్రీ శరీర పరిరక్షకుడు” అన్నట్లు మనో వాక్కాయ కర్మలా పరాన్న జీవులుగా మిగిలిపోతాం. ఎంతోమంది మంచివారు ఎంతో శ్రమించి స్త్రీలని ఇంత దూరం తీసుకు వచ్చారు. ఇంతదూరమూ వచ్చాక పునరాలోచన ఇక కుదరని పని.
మరైతే ఈ స్థితిలో స్త్రీ నిర్భయమైన మనుగడను ఎలా సాధించగలదు? ఎంత వద్దనుకున్నా నాకు ఈ పురుష స్వామ్య సమాజం కీకారణ్యంలానే మనసులోకి వస్తుంది. తాము ఏ క్షణమైనా పులివాత పడొచ్చని తెలిసినా జింకలు వేరేదారి లేక అక్కడే జీవిస్తూ వుంటాయి. మరణం పులి రూపంలో తమను వెదుక్కుంటూ వచ్చినప్పుడు నిస్సహాయంగా పులివాత పడి మరణిస్తాయి. పోలిక అతి పాతదైనప్పటికీ నేటికీ స్త్రీ జీవితం అంతేననేది సత్యం.
మన చట్టాలన్నీ మగ చట్టాలు. ఆ చట్టాలు స్త్రీ సంబంధ విషయాలపై నిర్ణయం తీసుకోవాలంటే అనేకసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆడదాన్ని రేప్ చేయడమనే స్వల్ప విషయానికి ఉరిశిక్ష అవసరమేనా అని ఒకటికి వందసార్లు న్యాయవ్యవస్థ ఆలోచిస్తుంది. ఒక్కోసారి సరేలే పోనీ ఆ మగాళ్ళ అంగాలకి మందుపెట్టి పనిచేయకుండా చేద్దామనే విచిత్రమైన ఆలోచనలూ దానికి వస్తాయి. మరి అంగస్తంభన అసలే ఉండని ముసలివాళ్ళు తమ ఇళ్లలోని పసి ఆడపిల్లల చిన్ని స్తనాలని వత్తి మర్మాంగాలని తడిమి ఆనందపడతారని మన చట్టాలకు తెలియదా?
నిజానికి మందు పెట్టాల్సింది మనసుకి కదా. స్త్రీల అంగాంగాలను అశ్లీలంగా చూపిస్తూ 24 గంటల చానెళ్ళ పేరిట ఇంటి నడిమధ్యకు తెచ్చి నిర్లజ్జగా ప్రదర్శిస్తున్న పెట్టుబడిదారి సంస్కృతికి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు కదా మందుపెట్టాలి. దాన్ని వదిలిపెట్టి స్త్రీ ఆధునిక దుస్తులు ధరిస్తుందనో, సహజీవనం ఏమిటనో వికట ప్రశ్నలు వేస్తే సరిపోతుందా, నలుగురు మగవాళ్ళ అంగాలకి మందుపెడితే మిగిలిన పురుషాంగాల మాటేమిటి అనేది అసలు ప్రశ్న.
నిజానికి మన మతాలు, చట్టాలు, సామ్రాజ్య వాదాలు అన్నీ స్త్రీని వస్తువుగా, వాడదగినదిగా చూస్తున్నాయి. ప్రధానంగా మార్పు రావలసింది ఆ దృష్టి కోణంలోనే. చూసే చూపు సక్రమంగా వుంటే ఎదుటి దృశ్యం ఎత్తు పల్లాలు లేకుండా కనిపిస్తుందనేది నిరూపిత సత్యం.
ఇదంతా ఆలోచిస్తుంటే నాకు ‘మలేనా’ జ్ఞాపకమొచ్చింది. ఈ ఇటాలియన్ చిత్రం రెండవ ప్రపంచ యుద్ధం (1940) నేపథ్యంతో మొదలవుతుంది. మలేనా భర్త యుద్ధంలో మరణించాడని వార్త వస్తుంది. అప్పటినుండి ఆ ఊరి మగవాళ్ళు మొత్తం ఆమెతో శారీరక సంబంధం కోసం వెంపర్లాడుతారు. వారిలో పన్నెండేళ్ళ పిల్లవాడు కూడా ఉంటాడు. కానీ మలేనాకి ధ్యాసంతా ఆమె భర్తే. సినిమా అనేక మలుపులు తిరిగి కడుపుకి తిండిలేని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా మారుతుంది. యుద్ధం అంతమయిన సందర్భంలో తమ మగవాళ్ళకి వలవేసి సంసారాలు కూల్చివేసే మహిళగా ఆమెను భావించి ఆ ఊరి స్త్రీలు ఆమెను తీవ్రంగా కొట్టి జుట్టు కత్తిరిస్తారు. మలేన ఊరు విడుస్తుంది. అప్పుడు మరణించాడని అందరూ భావించిన ఆమె భర్త అవిటివాడై తిరిగి వస్తాడు. ఆమె జాడ తెలుసుకుని తిరిగి ఊరికి తీసుకువస్తారు. అందరి దృష్టిలో ముఖ్యంగా మహిళల దృష్టిలో విపరీతమైన మార్పు వస్తుంది. దూషించిన నోటితోనే భర్తచాటు భార్యగా ఆమెని శ్రీమతి మలేనా అని గుర్తించి గౌరవిస్తారు. పురుష ప్రపంచపు నీచ మనస్తత్వా న్ని, క్రౌర్యాన్ని, నిర్లజ్జనీ కనీస మర్యాదకైనా ముసుగువేసి చూపించలేదు ఈ సినిమా. అందుకు దర్శకుడు స్త్రతిరిరీలిచీచీలి ఊళిజీదీబిశిళిజీలి ఎంచుకున్న అత్యుత్తమ ప్రతినిధి పన్నెండేళ్ళ పిల్లవాడు. అట్లాగే సమాజం ఒంటరి మహిళని ఎలా వెంటబడి వేధిస్తుందో, కుంటివాడైనా, గుడ్డివాడైనా అసలు ఎందుకూ పనికిరాని వాడైనా స్త్రీ పురుషుడి చాటున వుంటే ఎలా గౌరవిస్తుందో ప్రతీకాత్మకంగా చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నమే మలేనా భర్త కుంటివాడై రావడం.
ఈ చిత్రం ‘నేచురలిజం’ విభాగానికి వెళ్ళినా, పరిష్కారాన్ని చూపించకపోయినా సమస్యను అద్భుతంగా చూపించి నా ఇన్ని ఆలోచనలకి కారణమై ఫలితాన్ని సాధించడం చేత ఈ సినిమాని మంచి సినిమాగా నేను గుర్తిస్తాను.