శ్వాస ఆగిపొదు

– డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి

అర్ధరాత్రి ఆడది

ఒంటరిగా నగర వీధుల్లో

నడవగలిగే, స్వతంత్య్ర

స్త్రీ మూర్తికి, మహాత్ముడు

పెట్టిన పేరు ‘నిర్భయ’

అదే ‘నిర్భయ’, అర్ధరాత్రి

అత్యాచారానికి గురై

రేపిస్టు రాక్షస కృత్యానికి

దుర్మార్గపు, దారుణ, నికృష్ట

పైశాచికానికి పేగులు పగిలి

మృత్యువుతో పోరాడి శ్వాస విడిచిన

‘నిర్భయ’

ప్రపంచ సభ్య సమాజం ఒక్కటిగా

సంఘటితమై, నినదించిన

పతాక శీర్షికల ప్రతీక

‘నిర్భయ’

పేగులు పగిలి పరమపదిస్తే

పేగులు చించుకున్న కూతురు

పేగులు కాలిన వాసన చితిమంటల్లో

ఆరని శోకంగా, ఎగిసి పడుతూంది

‘చచ్చేం సాధిస్తారంటారు పెద్దలు

కాదు..కాదు…. నిజంకాదు… నిర్భయ

చచ్చి, శాసించి, నినదించిన

శ్వాస ఆగిపోదు… ఆగిపోదు..

ఆ మారణ హోమం.. ఆగిపోదు… ఆగిపోదు,

రగిలి రగిలి మహిళల కోపాగ్ని

జ్వాలల్లో ‘నిర్భయ’ జ్వలిస్తూనే వుంది

లక్షలాది నిర్భయలను

నిర్భయ శక్తులుగా నిలబెట్టి

ఆ ఆర్గురు కిరాతకుల్ని

బహిరంగంగా ఉరి తీసేవరకు

ఊరుకోదు.. ఊరుకోదు

ఇది నిజం.. నిజం

మా పిడికిళ్ళను బిగించి

మా కలాలను సంధించి

మా శ్వాసల ఊపిరిలోంచి

ప్రకటిస్తున్న ‘పచ్చి నిజం’

చట్ట సభలను ముట్టడించి

చట్టాలను సంస్కరించి

శాసనాలను చేయిస్తాం

మళ్ళీ అరాచకాలు తలెత్తకుండా

తగిన శాస్తి చేయిస్తాం… సాధిస్తాం

వేనవేల నిర్భయల సంతకాలతో……

 

 

 

వెన్నెల నడత

– తంగెళ్ళపల్లి కనకాచారి

ధిక్కారం వెన్నెల నడకై సాగింది

మిడ్‌నైట్‌ మార్చ్‌ మహిళా చైతన్య వెల్లువ

ఇది స్వేచ్ఛ ఆకాశంలో రెక్కలు విచ్చుకున్న వికాసం

ఆధిపత్య భావజాలాన్ని తగలేసి తలెత్తుకుని నిల్చిన శక్తి స్వరూపానికి ప్రతీక

రగిలే సూర్యుని వెంట మేఘాలుంటూనే వుంటాయి ముసుగులు వేసేందుకు…

ఓ ఆలోచన సామూహాల కదలికై ఉరుకులు పెట్టించినపుడు విమర్శించేవారుంటూనే వుంటారు

ఈ విజయానికి పేటెంట్‌ దక్కేది ఎవరికైనా ఈ ఫలితం మహిళలకే అంకితం!

ఈ పరిమళం దిగులు దేహాలకు ఊపిరై, ఆయుధమై

చీకటిని చించుకుంటూ స్వప్నాల సాకారానికి ఉద్దీపనయి నిలవాలి!

చెరగని ముద్రల్ని నగరం ఎదపై చిత్రిస్తూ సాగిన మిడ్‌నైట్‌ మార్చ్‌

ఆలంబనయి నిల్చిన పాట….

మరిన్ని కిటికీలు తెరచేందుకు కదలిన చేయూత!!

 మహిళా దినోత్సవం

– ఆర్‌. శారదాదేవి

నేడో రేపో మహిళా దినోత్సవమట…. ఎందుకు తల్లీ నీకు ఉత్సవం. మీటింగులెట్టి తీర్మానాలు చేస్తే నీకు జరిగిన అన్యాయాలకు న్యాయమొస్తదా!

సావనీర్లు విడుదల చేసి సానుభూతి పరంపరలు ఏకధాటిగా కురిపిస్తే నీకు భద్రత వస్తుందా!

దినదిన గండంగా సాగుతున్న నీ బ్రతుక్కొక ఉత్సవం కూడానా!

ఆ రోజున కూడా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో!…

అడవి మృగాలక్కూడా నీతి ఉంటుందే..

శృతి మించిన నాగరికతలో త్రాగిన మత్తులో నీతి తప్పి

వావి వరసలు మరచి కామాంధులు చేసే అకృత్యాలు ఎలా భరిస్తునావు తల్లీ!

ఆడదానిపై అకృత్యాలు రాసుకుంటే రామాయణమూ వింటే భారతమంత

నిత్య శంకితులు నిత్య పెళ్ళికొడుకులకు కొదవలేదీ దేశంలో

ప్రతిక్షణం అవమాన అనుమాన అగ్నులలో దహించుకుపోతూ

శీలపరీక్షలు, శల్య పరీక్షలూ చేయించుకుంటున్న పతివ్రతలకు నిలయం మనదేశం.

కామాంధుల అకృత్యాలకు ప్రతీకలైన అనాధలు అభాగ్యులైన కుంతీ పుత్రులు ఎందరో…

ఎందుకిలా….

స్త్రీ అభ్యుదయ పథంలో పయనించి విశ్వవ్యాప్తమై వామనుడిలా విజృంభిస్తే

ఈ మగమహారాజులను పాతాళానికి తోసేస్తామనే భయం కాబోలు

మరి మహిళలే మహారాజులుగా అలనాడు వెలుగొందారట

ఈ అరాచకాలు ఇలాగే కొనసాగకూడదంటే

మహిళల్లో విప్లవాగ్ని రగలాలి…

ఆత్మరక్షణ దిశగా ప్రాథమిక స్థాయినుండి విద్యాబోధన మారాలి

పురుషాధిక్యతకు కాలం చెల్లేరోజు మరెంతో దూరం లేదు

మహిళా సాధికారతకు చేయీ చేయీ కలుపుదాం

స్త్రీ మూర్తిని గౌరవించే సమ సమాజం కోసం ఉద్యమిద్దాం

కలకంఠి కంట కన్నీరొలకకుండా, నిర్భయలు భయం లేకుండా

జీవించినపుడే మనకు నిజమైన మహిళా దినోత్సవం.

 ప్రమాదంలేని పెంపుడు జంతువు

నేను

తొలిసారి ఊపిరి పీల్చినప్పుడు

నువ్వు మా నాన్నకు చెప్పావ్‌

”పొదుపు మొదలుపెట్టు, ఆడపిల్ల కదా”

నా ఐదో ఏట నాకు చెప్పావ్‌

”చదవటం, రాయటం నేర్చుకో

నీకోసం మంచి వరుడొస్తాడు”

నా పదో ఏట నాతో అన్నావ్‌

”ఆడపిల్లవి కదా! నిన్ను నువ్వు రక్షించుకో”

నా పదిహేనో ఏట నువ్వు అన్నావ్‌

”ఇంటిపట్టునే ఉండు, కడగటం, వండటం నేర్చుకో

నోరెత్తకు, విధేయంగా ఉండు”

నా ఇరవయ్యో ఏట నాతో అన్నావ్‌

”ఇక ఇప్పుడిది నీ జీవితం

మా కోసం వెనక్కి రాకు”

ఏళ్ళు గడిచి పోయాయ్‌

నా మాట నిలబెట్టుకున్నాను

నా మీద ఎప్పుడూ ఎవరికీ

ఏ ఫిర్యాదూ లేదు

నేను ప్రమాద రహిత

విశ్వాసభరిత పెంపుడు జంతువుని

మానవుడి చరిత్రలో

ఇంతకు మునుపెన్నడూ

ఇట్లాంటి జంతువే లేదు.

మూలం: స్మిత బిపిన్

తెలుగు: సీతారం

హిందూ పత్రిక సౌజన్యంతొ

 దేవేరి

ఒరియా మూలం: ప్రవాసినీ మహాకుడ్‌

 

నన్ను దేవత అని అనకండి

సంవత్సరానికోసారి దేవీ అని పిలవకండి

మొక్కుబడిగా కొలవకండి

ఒక సగటు ఆడదాని ఆంతరంగిక

రంగుల అభిలాషలతో నన్నుండనివ్వండి

ఎవరు చేశారీ సింహాసనాన్ని?

ఎవరు సమకూర్చారీ విశాలమైన సామ్రాజ్యాన్ని?

నా కంటికి కనిపించనంత మేర

ఈ సామ్రాజ్యం నా కోసమే ప్రత్యేకమా?

దేవి, దేవేరీ అని సంభోదించినంత మాత్రాన

ఎవరైనా దేవత కాగలరా చెప్పండి?

 

స్త్రీ ఎప్పుడూ స్త్రీగానే ఉంటుంది

తనే సృష్టిస్తుంది తనే సృష్టింపబడుతుంది

స్త్రీ ఎప్పుడూ స్త్రీగానే ఉంటుంది

నా భావోద్వేగాల్ని, వాంఛల్ని, కోరికల్ని

భద్రంగా ఉండనీయండి

నీ స్వప్నాలపై స్వారి చేస్తూ ఏ దేవతా కాదు

నీ జీవితపు రంగుల కేళిలో

తనెప్పుడూ మైమరచిపోదు

దేవత అస్థిత్వమెప్పుడూ

కాలాన్ని అధిగమించే ఉంటుంది

రహస్య వాడ భూమికల్లో

కథల్లో, కావ్యాల్లో సాహిత్య గుబాళింపుతుంది

 

దేవతనై పూలను పాదాలతో స్వీకరించను

పూలు ఇటివ్వండి, నా చేతికివ్వండి

నాకేశాలు అలంకరించుకో నివ్వండి

అనురాగపు నీలి అపరాజిత

అభిమానపు స్వేత పద్మం

ప్రేమ కురిసే మందారం అన్నీ ఇవ్వండి!

 

దయచేసి నాకు సోమరసం సమర్పించొద్దు-

నేను దేవతను కాదు తాగడానికి!

వద్దు! సుగంధ పుష్పాలు వేసిన కొబ్బరి నీళ్ళు

ఇవ్వ గలిగితే ఓ కప్పు వేడివేడి టీ ఇవ్వండి చాలు!

 

నీళ్ళు లేని చెరువులో దయచేసి

నన్ను నిమజ్జనం చేయకండి

మీ నగరంలో ఉండాలన్న ఉత్సాహం నాకు లేదు

భక్తితో మెలికలు తిరిగిపోతున్న

మీ ముఖాలు చూడాలని నాకు లేదు

దేవత కావాలన్న కోరిక నాకు అసలే లేదు

దేవతగా మారడమంటే

దేహబంధాల్ని తెంచుకోవడమే

 

ఏమిటీ విరోధ భావన?

నేను అదే మామూలు సగటు స్త్రీని

కన్నోళ్ళ రంగుతో కనిపిస్తున్నా దాన్ని

దాహాలు, వాంఛలు, వెచ్చదనపు ఆరాటాలు

అన్నీ సమతులమైన స్వాభావికాలు

ఒక వేళ నా ప్రేమలో నీ పునర్జన్మ ఉందనుకుంటే

నన్ను దేవీ అనో, దేవేరీ అనో సంభోదించకు!

నాకు అత్యంత ప్రియతముడిగా

ఎప్పుడువుతావో తెలుసా?

స్త్రీని రక్తమాంసాలున్న స్త్రీగా గుర్తించినపుడు

ప్రియా అని పిలిచినపుడు

అమ్మాయి అని ప్రేమించినపుడు మాత్రమే-

నువ్వు నాకు ప్రియతముడ వవుతావు

ప్రేమ మాత్రమే ఆద్యంత రహితమైంది-

స్త్రీ ఆద్యంత రహితమైంది కాదు!

నీ మనసులోని మార్మికతను స్త్రీకి ఆపాదించకు!

స్త్రీని తోటి మనిషిగా ప్రేమించు, గౌరవించు – అంతే!!

 

నన్ను కవిత్వాన్ని చెయ్యకు – కల్పనల్లో

నన్ను రంగస్ధలం మీద ఉంచెయ్యకు

నేను దేవతను కానే కాదు

ఇప్పుడు నా జీవితాన్ని నేనందుకున్నాను

ఇక, నా సంతోషాలు నాక్కావాలి!

సున్నిత సమయాలు, సుందర నందనాలు

జీవితంలోని అన్ని క్షణాలు…అవును

జీవితంలోని అన్ని క్షణాలూ నాక్కావాలి!

కావాలి! నా జీవితం పూర్తిగా నాక్కావాలి!

కావాలి! నా జీవితం పూర్తిగా-

నాక్కావాలి!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.