మరో జలియన్‌వాలాబాగ్ – ఇంద్రవెల్లి
-ఎన్. హేమలలిత
స్వతంత్య్ర భారతావనిలో జలియన్‌వాలాబాగ్ ఏమిటి అంటున్నారా! అవును! మన ప్రజాస్వామ్య చరిత్రలో రక్తమోడిన సంఘటనలు ఎన్నో! కొన్ని మాత్రమే ప్రపంచానికి తెలిసాయి. మరెన్నో భూస్థాపితం చేయబడ్డాయి. ఏ భూమి కోసం పోరాడుతున్నారో ఆ భూమి పొరలలోనే హక్కుల స్పృహ, ఉద్యమ వారసత్వాన్ని కప్పేయడానికి ప్రయత్నాలు పైశాచికంగా జరిగాయి. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు అని ఎంతో ఉన్నతంగా ఆశించుకున్న రాజ్యాంగ పరిధిలో రాజ్యం చేత జరిగిన సంఘటనే ఇంద్రవెల్లి.
అది 1981 ఏప్రిల్ 20వ తారీఖు, … అటవీ ఉత్పిత్తులను అమ్ముకునే సంతరోజు. ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు తాలుకా యింద్రవెల్లిలో గోండు, కోల, మరధానం తెగల ఆదివాసీలు నీరు, అడవి, భూమి మాదే అని ఎలుగెత్తి ప్రపంచానికి ముఖ్యంగా పాలక వర్గాలకు ప్రకటిద్దామనుకున్న రోజు. ఖానాపూర్, సైదాపూర్, జమైకుంట, పోశం, హత్తిగుట్ట, ఖండాల, ఉట్నూరు మొదలగు ప్రాంతాల నుంచి సంఘటితమై వేలాదిగా (సుమారు 10వేల నుంచి 15 వేలు) తమ నాయకుడైన కొమరంభీం ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు.
అంతకు ముందే సభ నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేసింది 144 సెక్షను విధించి వారి కనీస ప్రజాస్వామిక వాంఛకు అడ్డుకట్ట వేశారు. అంతకు ముందే 6 నుంచి 10 ప్లాటూన్ల సాయుధ పోలీసుల క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. 19వ తేరీఖునే 19 ప్లాటూనట్ల ఇంద్రవెల్లి చేరుకున్నాయి. దుకాణాలు బంద్ చేసారు. కాని ఆదివాసేతరలను వారి స్థానిక నాయకులను ఇంద్రవెల్లిలోకి అనుమతించారు. కాని సామూహికంగా బ్రతికే గిరిపుత్రికలు ప్రభుత్వం అంటే అడవితల్లిలా కాచి కాపాడేదేనని అనుకున్నారు. అందుకే గిరిజన రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరాయుధంగా కదిలారు. సభకు వస్తున్న, వచ్చిన ఆదివాసీలు న్యాయమైన డిమాండ్లు వినడానికి కూడా ఇష్టపడని పాలకవర్గాలు అచ్చు వలసవాద బ్రిటిషు కాలంలో జలియన్ వాలాబాగ్‌లో లాగా చెట్లెక్కి వాముల పొదల వెనుక నుంచి దొంగచాటుగా కాల్చారు. బెదిరిపోయి అయోమయస్థితిలో ఎక్కడ బులెట్లు దిగుతున్నాయో కూడా చూసుకొలేని పరిస్థితులలో ప్రజలు పరుగుతీస్తుంటే మనదేశ పోలీసులే రేసుకుక్కల్లా వేటాడి వేటాడి పాయింట్ బ్లాంకు రేంజిలో కాల్చారు. వారి శవాలు ట్యాంకులు, పొదల వెనుక నుంచి … ఒక వారం తర్వాత కూడా కనుక్కున్నారు. గొండు మహిళ మంకుబాయి నడుంలో తూటాలు దిగాయి. ఎంతోమంది ఆమె కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇస్రుబాయి కాళ్ళలో కాల్చి లాక్కుపోయారు. కాళ్ళు తీసేసారు. ఇలాఎందరో! ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది. కాని చనిపోయిన వారు కొన్ని పదులలో వున్నారు. చాలా శవాలు ఆదిలాబాదులో రహస్యంగా పోలీసులు దహనం చేసారు. జీపులలో గుట్టలగా పోసి ఆస్పత్రికి కొంతమంది క్షతగాత్రులను తరలించారు. కాలు కోల్పోయినా శరీర భాగాలు విడవడినా, ఆసుప్రతిలో కూడా మానవ హక్కులకు వ్యతిరేకంగా గొలుసులు కట్టి ఉంచారు. పోలీసు జులుంకు భయపడి పారిపోయిన వారికి వైద్య సహాయం అందలేదు. వారిలో ఎంతమందిచనిపోయారో ఖచ్చితమైన లెక్కలు లేవు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఆదివాసీలు పోలీసు భయం వలన కొన్ని వారాలపాటు తమ స్వస్థలానికి వెళ్ళలేకపోయారు. వందలాది మంది ఆదిలాబాదు, దగ్గర జైళ్లలో మ్రగ్గిపోయారు. బయట నుంచి వచ్చిన ఉద్యమ సానుభూతిపరులు నిర్భందించబడ్డారు. ఇంద్రవెల్లికి అన్ని దారులు మూతపడ్డాయి. ప్రజస్వామిక సమూహాలు నివ్వెరపోయాయి. కాదు ఉలిక్కిపడ్డాయి.
నిజానికి ఆదివాసీలు కోరుకున్న దేమిటి? ఏమి జరిగింది? ప్రత్తి వ్యాపారానికి అటవీ ఉత్పత్తులకు కేంద్రమైన ఇంద్రవెల్లి సంఘటన అప్పటికప్పుడు జరిగింది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర వుంది. 1940లలో నైజాం అధికార్ల పెత్తనానికి ఆదిపత్య కులాల దోపిడికి వ్యతిరేకంగా గోండు నాయకుడు కొమరం భీం న్యాయకత్వాన భూపోరాటం చేసారు. పిడికిలెత్తిన వారిని ఎరచూసి కాల్చారు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం హెమన్ జర్ర అనే ఆంత్రోపాలజిస్టుని పరిస్థితుల పై అథ్యయనానికి నియమించండి. ఇది ఆదివాసీల భూమిని నోటిపై చేయడానికి అధికారాన్ని కల్పించింది. ఈ ఏరియా చట్టం – రెవెన్యూ అథారిటి నుంచి మినహాయించింది.కలెక్టరు ప్రభుత్వ ఏజెంటుగా వుండేవాడు. అధికారిక బలం కొందర్నీ అందలం ఎక్కించింది.
అదే 1940వ దశాబ్దపు కాలంలో తెలంగాణా సాయిధ పోరాటం కిన్నత రాజురా తాలూకాల్ని తాకింది. ఆ ఉద్యుమ విరమణ వలన అన్నిచోట్ల స్థబ్ధత ఏర్పడినట్టె ఇక్కడా జరిగింది. ఎమర్జీన్సీకి ముందు సంఘటితం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో. కాని ఎమర్జెన్సీ తరువాత అణిచివేత మీద తిరగబడ్డ నిప్పురవ్వలు అడవి పుత్రుల్ని అక్కున చేర్చుకున్నారు. గ్రామాలకు తరలండి అన్న నినాద స్ఫూర్తితో ఉత్తేజితులైన యువతతో గిరిజన రైతు కూలి సంఘం ఏర్పడింది. అన్యాయంగా ఆదివాసీల భూములు ఆక్రమణ దారులను ఒక్కోసారి 100% వడ్డీతో, అక్రమ పత్రాలతో వారి జీవితాల్ని ముట్టుడిస్తున్న వడ్డి వ్యాపారస్తులను ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి. ఫలితంగా ప్రభుత్వం గొండుల్ని వీరి సానుభూతి పరుల్ని , చిత్ర హింసల పాలు చేసి కక్ష తీర్చుకొంది. ఈ కాలంలోనే రాజేశ్వరి రేప్‌కేసు, ఓ కార్మికుని భర్త యాజమాని వద్ద బంధించి .. ఊరి తీయబడటం, జౌళి, పేపరు మిల్లుల కార్మికులపై పోలీసులు అణిచివేత జరిగింది.ఈ రైతుకూలీ సంఘం ఏర్పడక ముందె గొండులు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడ్డారు. తమదైన రితీలో పోరాటం చేసారు. ఈ గిరిజన రైతు కూలీ ఏర్పడిన తర్వాత సంఘటితమైన అన్ని సంఘాలు మూకుమ్మడిగా జత, జహిక్త,జంగిత అని నినదించారు. నేరమే అధికారమై ప్రజల్నే నేరస్తులుగా చిత్రీకరిస్తే కట్టలు తెగిన ఆగ్రహన్ని ఇంద్రవెల్లి తిరుగుబాటుగా రూపుదిద్దుకొంది. చరిత్ర పుటలు ఎర్రబడ్డాయి.
అప్పటికి 14,278 ఎకరాల భూమికి 1509 కేసులు ఉట్నూరు పరిధిలో నమోదు చేయబడ్డాయి. 1/3 వంతు ఆదివాసి భూములను ఆదివాసేతరులు ఆక్రమించుకున్నారనడానికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ తెగలపై 1973లో ప్రభుత్వం ఇతర పాలక వర్గాలు జరిపిన దాడులు 6186 కాగా 1977 వాటికి 8872కు పెరిగాయి. (ఎం. రత్నమాల- నూతన పత్రిక సంపాదకీయం నుంచి) సంపదల్ని సృష్టించే చేతులు ఆ సంపదను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అటవీ అధికారుల జులం నశించాలని వారి ఉత్పత్తులకు న్యాయమైన ధరకావాలనే డిమాండుకు మద్దతు ఇచ్చినందుకు ఉద్యమకారులు దోపిడి దొంగలుగా ఆదివాసేతరలను దోచుకునే వారిగా పాలకవర్గాలు ప్రచారం చేసాయి. ఆదివాసీల అభివృద్ధిని, పధకాలను సహించలేక ఉద్యమకారులే హింసను ప్రేరేపించారని ఇక ముందు ఉద్యమిస్తే ఇదేగతి పడుతుందని హెచ్చరించింది ప్రభుత్వం.
ఇంద్రవెల్లి మారణహోమం తర్వాత రెండవ తరానికి కూడా ఎలాంటి ఫలాలు అందలేదు. బాధితులకు నష్టపరిహారం అందలేదు. హామీ పత్ర బాండులు వున్నాయిగాని కొంత మందికి పట్టాలు లేవు. రుణాలు లేవు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ దళారులకు నెలవయింది. వందల వేల కోట్లు అభివృద్ధి పేరుతో గిరిజనుల పేరు చెప్పి దోచుకుంటున్నారు. పిల్లల స్కూల్, వసతి గృహాల్లో వసతులు, మంచి ఆహారమే కరువైంది. విషజ్వరాల పాలైనా వైద్య సహాయం అంతంత మాత్రమే. గిరిజనుల కోసం ఏర్పడ్డ చట్టాలు అడవిపై వారికి హక్కులు కల్పించలేదు రాజ్యాంగం షెడ్యూల్డ్ 5, 6లో ఇచ్చిన హక్కులు అమలుకావు. గుడిసె, బట్ట, బ్రతుకు మారలేదు. అధికారుల ఆగడాలకు అంతం లేదు. యిదే యిప్పటికి ‘ఇంద్రవెల్లి చిత్రపటం’.
పోడు వ్యవసాయం చేసుకుని బ్రతికే ఆదివాసీలకు ఒక నమ్మకం, సంప్రదాయం వుంటుంది.ఏ ప్రదేశంలో చనిపోతే వారు ఎ్కడకు వెళ్ళినా వ్యవసాయం కోసం అదే ప్రదేశానికి వచ్చి తమ వారికి నివాళులు అర్పిస్తారు. కొన్ని దశాబ్దాల పాటు అందుకు అనుమతించలేదు. అమర వీరులకోసం కట్టిన స్థూపం పోలీసులు కూల్చివేసారు. 1987లో మళ్ళీ ఓట్ల కోసం ఎన్.టి.ఆర్ హయాంలో ఆదివాసీల ఒత్తిడితో సమగ్ర గిరిజానభివృద్ధి సంస్థ నిర్మించింది. ఆ స్థూపం మీద ఇంగ్లీషు, హిందీలో ఇలారాసువుంటుంది. ”పర్వతాలు ఎరుపు, పూలు ఎరుపు వారి మరణం ఎరుపు మా నివాళి ఎరుపు (అరిందం దత్తు ట్రావెలోగ్) సుబ్బారావు పాణిగ్రాహి అన్నట్టు ఎరుపంటే కొందరికి భయం, మరింత భయం. గోండులు తమ నాయకుడైన కోమరం భీం చనిపోయిన తర్వాత తమ చనిపోయిన వారికి నివాళులు అర్పించటం రివాజు. పున్నాన దసరా పండగ (పున్నమి తర్వాత వచ్చె సంపద) న నివాళులు అర్పిస్తారు. సనకైరా జెండా లేక …. సంభాలు మద్యలో పెద్ద పెట్టి ఎగరేస్తారు. ఆ నివాళి తర్వాత యిస్తారుల్ని భూమి కింద పట్టేస్తారు. ఇది నిజాం కాలం నుంచి జరుగుతుంది. నిజాం పాలన వర్గాలకు భయపడి ప్రజలు రాత్రి చేసుకునే వారు కాని ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు ఇంద్రవెల్లిని ముంచెత్తారు.
అడవుంటే బ్రతుకుంటుందనినమ్మే అడవి బిడ్డను అభివృద్ధిపేరిట జరిగే విధ్వంసాన్ని గమనించినప్పుడల్లా పుడమి తల్లి తన వారిని హక్కుల సాధనకు సంసిద్ధపరచి దండుగా కదిలిస్తూనే వుంది. ఇంద్రవెల్లి ముందు తర్వాత కూడా దోపిడికి వ్యతిరేకంగా దండు కదలుతూనే వుంది. ప్రపంచీకరణ నేపధ్యంలో సామ్రాజ్యవాద పెట్టుబడి వర్గానికి దాసోహమని ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, మైనింగ్‌ల పేరిట భూముల్ని, అడవిని, నీటిని అర్పిస్తున్న పాలకులపై దండు పిడికిలెత్తుతూనే వుంది. కొమరం భీంలు పుట్టుకొస్తూనే వున్నారు. జాక్ లండన్ (రచయిత) అన్నట్టు ‘ఈసారి మేము వెనక్కి తగ్గుతాం. కాని ఎప్పటికీ కాదు. మేము చాలా నేర్చుకున్నాం. ఇనుమడించిన పోరాట చతురతతో రెట్టింపు క్రమశిక్షణతో మరింత బలవంతమై ఉద్యమ లక్ష్యం వైపు నిరాఘంటంగా సాగుతాం. అవును. దోపిడికి గురైన బాధితులు ఇంద్రవెల్లి నుంచి వాకపల్లి దాకా కదులుతూనే వున్నారు. వాళ్ళ నగారా శబ్దం మన రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్ తదితర రాష్ట్రాలలో మోగుతున్నది.
అదిగో! ఆపిలుపు నందుకొని మంకుబాయి, ఇస్రుబాయి లాంటి స్థానిక మహిళలే కాక వారికి మద్దతుగా మేమున్నామంటూ నాటి పంచాది నిర్మల నుంచి నేటి సాధన, అనురాధాగాంధి, చంద్రశ్రీ వరకు వారితో పదం, పాదం కలిపారు. వామపక్ష, ప్రజాస్వామిక మహిళా సంఘాలు అండగా నిలబడ్డాయి. ఇక్కడ ఈ విషయం పంచుకోకపోతే వ్యాసానికి కొరతే వుంటుంది. కా|| పార్వతి (శివసాగర్ సహచరి) తనను అంతిమంగా ఇంద్రవెల్లిలో చేర్చాలని కోరుకొని ఆ అమరుల మట్టిలో తాను భాగమై నిలిచిపోయింది. ఇంతగా స్త్రీలను దోపిడికి వ్యతిరేకంగా దండుగా ముందుకు సాగించటానికి కారణమైన సామాజిక, రాజకీయ, ఆర్ధిక కోణాల్ని, కారణాల్ని ఆ పోరాటాల ఫలితంగా వచ్చిన చట్టాలు, వీటి అమలు వచ్చే సంచికలులో పంచుకుంటాను.
(ఎంతో విలువైన సమాచారాన్ని, ఇంద్రవెల్లిపై నూతన సంపాదకీయాన్ని (మే, 1981) అందించిన రత్నమాల సహకారం ఈ వ్యాసానికి పునాది. ఆమెకు కృతజ్ఞతలు. ఎన్నో వ్యాసాల వెబ్‌సైట్ రిఫరెన్స్‌లు స్థలాభావం రిత్యా ఇవ్వలేకపోతున్నాను).