? ”

-అబ్బూరి ఛాయాదేవి

వి.యస్‌. రమాదేవి గారు భూమికకు అత్యంత ఆప్తులు. వారికి నివాళిగా ఛాయాదేవి గారు ఇంతకు ముందు రాసిన వ్యాసంతోపాటు రమాదేవిగారు రాసిన కథను కూడా పునర్ముద్రిస్తున్నాం. 

– ఎడిటర్‌

భర్త, భార్య, మరో స్త్రీ – వీరి కథ అసామాన్యమైనదేం కాదు, ప్రతి స్త్రీ తన భర్త తనకొక్కర్తెకే చెందాలని కోరుకోవడం సహజం. అటువంటిది, ఏ స్త్రీ అయినా వివాహితుణ్ణి ఎందుకు ప్రేమిస్తుంది? వివాహితుడని తెలియక ప్రేమించవచ్చు. తెలిశాక కూడా ప్రేమిస్తుంది! పర్యవసానం మరో స్త్రీకి అన్యాయం చెయ్యడమే కాకుండా తనకు తాను అన్యాయం చేసుకుంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఎందుకు కొనసాగుతుంది? భార్యాభర్తల మధ్య ప్రవేశించిన ‘మరో స్త్రీ’ మనసులో సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది? ‘రాజీ’ ఒక ఉదాహరణ.

”అతనితో మాట్లాడినంత సేపూ అతను చెప్పేది నిజమనీ, అతను కల్మషంలేని మనిషనీ అనిపిస్తుంది. అతను తన పైఅధికారి అని కూడా గుర్తుండదు. అతను మాట్లాడే తీరు గుర్తురానీయదా సంగతి. తనని ఫోనుమీద కూడా మాటలలో కవ్వించి బెరుకుని పోగొట్టడానికి ప్రయత్నించినట్టు కనబడుతుంది… కానీ.. మగవాళ్ళని, ముఖ్యంగా మంచిగా కనబడే మగవాళ్ళని అంత త్వరగా నమ్మేయడం మంచిది కాదేమో!…. తెలివిగా తన వివరాలన్నీ రెండు ప్రశ్నలతో రాబట్టేవాడు మొదటి పరిచయంలోనే. ఇంతలో అతని భార్య అక్కడకి రావడంతో తననావిడకు పరిచయం చేశాడు….”

ఇలా అన్నీ తెలిసే ప్రేమలో పడింది రాజీ – ‘రాజీ’ నవలలో కథానాయిక. ఈ నవల రాసినది ‘నిశ’. (1979 ప్రచురణ). ‘నిశ’ అనే కలం పేరుతో రాసినది ఎవరో మనకు తెలియవలసిన అవసరం కన్నా ‘రాజీ’ పాత్ర తన జీవితానుభవాలతో స్త్రీ పురుష సంబంధాల గురించీ, ప్రేమ, వివాహ బంధాల గురించీ, రాజకీయాల గురించీ, వీటన్నిటి మధ్యానలిగే మనుషుల మనస్సుల గురించీ చెప్పిన జీవిత సత్యాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.ఇలా అన్నీ తెలిసే ప్రేమలో పడింది రాజీ – ‘రాజీ’ నవలలో కథానాయిక. ఈ నవల రాసినది ‘నిశ’. (1979 ప్రచురణ). ‘నిశ’ అనే కలం పేరుతో రాసినది ఎవరో మనకు తెలియవలసిన అవసరం కన్నా ‘రాజీ’ పాత్ర తన జీవితానుభవాలతో స్త్రీ పురుష సంబంధాల గురించీ, ప్రేమ, వివాహ బంధాల గురించీ, రాజకీయాల గురించీ, వీటన్నిటి మధ్యానలిగే మనుషుల మనస్సుల గురించీ చెప్పిన జీవిత సత్యాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

”….. మంచి తనంతో తనని మోసగించుదామని ఉద్దేశం కాబోలు!

ఒక అరగంట వ్యవధి ఉంటే అరగంట, గంట వ్యవధి ఉంటే గంట తన దగ్గరకు వచ్చి కులాసాగా గడిపివెళదామని కాబోలు! తానిక్కడ ఉద్యోగం చెయ్యడాని కొచ్చింది. గాని బడా బాస్‌గారి కులాసా కాలక్షేపం కోసం కాదు. అయినా అతనికెంత ధైర్యం అలా తన ఇంటికి నదురూ, బెదురూలేకుండా వచ్చేయడానికి! ఒక వేళ ఆ టైముకి ఆఫీసువాళ్ళెవరయినా వస్తే ఎన్ని అపవాదులు మొదలవుతాయి…. ఎందుకయినా మంచిది, మొదట్లోనే తుంచేయడం శ్రేయస్కరం… అతనికింద పని చేస్తోందీ కనుక తాను చచ్చినట్టు పడుంటుందనుకుంటున్నాడా ఏమిటి? అందరూ అభ్యుదయ భావాలు కలవాళ్ళే… ఇతర ఆడవాళ్లు తమ దగ్గర విచ్చలవిడిగా ఉండాలి…. అంతవరకే వారి అభ్యుదయం…”

ఇలా తనలో తాను ఎంతో గింజుకుంటూనే రాజీ బాస్‌ ‘అనంత్‌’ పట్ల ఆకర్షితురాలైంది. ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు అతడు చూపించిన సానుభూతికి కరిగిపోయింది, ”ఇంత ఆప్యాంగా నన్నెవరూ చూడలేదింతవరూ” అంటూ.

అలా మొదలయిన వారి స్నేహం బలంగా అల్లుకుపోసాగింది. అప్పటి కింకా ‘ఒకరి జీవితం మరొకరికి తెలియదు. ఒకరి మనసు లొకరికి తప్పితే’.

”మీరు దగ్గరున్నంత సేపూ మీ మీద నమ్మకమే. దగ్గరలేనప్పుడు మాత్రం రకరకాల ఆలోచనలొస్తాయి” అనేది రాజీ. అంతకు ముందు అతనికి ఇంకెందరు స్త్రీలతో స్నేహమోనన్న సందేహం, అతని భార్యని తలచుకున్నప్పుడు తను తప్పు చేస్తున్నాన్న సంకోచం అన్నీ అతని ముందు వ్యక్తపరచేది.

వాటికి అతని సమాధానం ”నీవింకా మన సమాజంలో అందరూ సామాన్యంగా అనుకునే మంచి చెడుల ఆంక్షల్ని అధిగ మించలేకుండా ఉన్నావ్‌…. నీతో స్నేహం అయ్యాక, మా ఆవిడమీద నాకు మరింత ఆర్ధ్రత పెరిగింది. ఆవిడ అసూయకు, సంకుచిత తత్త్వానికి అప్పుడప్పుడు చిరాకనిపించినా, నిజానికి ఆవిడమీద నాకెప్పుడూ కోపం లేదు. జాలి తప్పితే. ఒకర్ని ప్రేమిస్తే మరొకర్ని ద్వేషించాలని లేదుగా! ఎన్నో ఏళ్ళుగా ఆవిడతో కలిసి బ్రతుకుతున్నాను… ఆవిడ బాగోగుల్ని చూడటం నా విధి కదా!… కాని ఆవిడకి నా ఆలోచనల్లో పాలుపంచుకునే శక్తిలేదు… నా అన్వేషణలో తోడివ్వలేదు…”

భార్య బాధపడుతోందని తెలిసి కూడా రాజీతో ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు అనంత్‌. భార్య ఉండగా పర స్త్రీతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న అతను రాజీతో మరో పురుషుడు స్నేహ పూర్వకంగా మాట్లాడటం చూసి సహించలేకపోతాడు! రాజీ తనకు తప్ప మరొకరికి చెందకూడాదన్న ఆవేశంతో ”నువ్వు నాకు కావాలి… నువ్వంతా నాకు కావాలి…. ముఖ్యంగా నీ శరీరం కావాలి… నీ తలవెంట్రుకల నుంచి నీ కాలిగోరు వరకూ కావాలి” అంటాడు. ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ”నీ తెలివి, నీ పాట, అన్నీ నీ దగ్గరే పెట్టుకో… ఈ గుండెల్లో నేనున్నా లేకపోయినా నాకు ఖాతరు లేదు… నీ ప్రతి అణువూ నాకు కావాలి” అంటాడు.

అన్నీ తెలిసీ, అతను ‘తనవాడు’ కాలేడని తెలిసీ అతనితో సంబంధాన్ని కొనసాగించకుండా ఉండలేకపోతుంది రాజీ. అతని సిద్దాంతం వేరు! ”ఆ ఉధృతం ఎల్లకాలం అలానే నిలిచిపోతుందనుకోవడం పొరపాటు. నిలిచి పోలేదని బాధపడటం అంతకంటే పొరపాటు” అని చెబుతాడు.

రాజీతో సంబంధం ఏర్పడటానికి ముందు అతనికి మరో స్త్రీ సాన్నిహిత్యం ఉండేది. ఆవిడతో ఇంకా కొంత అనుబంధం ఉంది. ”నాకావిడ మీద ప్రేమకంటే జాలేక్కువేమో. ఆవిడ నన్ను ప్రేమించినం తగా నేనామెను ప్రేమించలేకపోయానను కుంటాను…” అని చెబుతాడు రాజీతో.

రాజీకి యువకుడైన ఒక ‘తీవ్రవాది’తో పరిచయం అవుతుంది. అతను అప్పుడప్పుడు మరో స్నేహితుడితో కలిసి రాజీ ఇంటికి వచ్చి కాస్సేపు ఇవీ అవీ ముచ్చటించి వెడుతుంటాడు. ముగ్గురూ కలిసి రాజకీయాల గురించీ, దేశపరిస్థితుల గురించీ చర్చించు కుంటూంటారు.

రాజీ పారిస్‌ వెడుతుంది, ఒక సాంస్కృతిక బృందంతో కలిసి. తీవ్రమైన అస్వస్థతతో స్వదేశానికి తిరిగి వచ్చేసరికి దేశంలో ”ఎమర్జన్సీ’ అమలులో ఉంది. రాజీ ఇంటికి అప్పుడప్పుడొచ్చే ‘తీవ్రవాది’ ఆమెకు చికిత్స చేస్తాడు. వీరిద్దరికీ గాఢమైన అనుబంధం ఉండి ఉంటుందన్న అనుమానంతో, తప్పించుకు తిరుగుతున్న ఆ తీవ్రవాది గురించి సమాచారాన్నంతా రాజీ నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తారు పోలీసులు. సర్వోదయ కార్యక్రమాన్ని చేపట్టిన రాజీ మేనమామ గురించి కూడా అనుమానించి, రాజీకి కూడా అందులో జోక్యం ఉందని భావించి ఆమెని జైల్లో పెడతారు.

జైలులో రకరకాల నేరాలు చేసిన స్త్రీలతో పరిచయమవుతుంది. రాజీకి నేరాలు చేసి వచ్చిన స్త్రీలలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనపడదు ఆమెకి. ఆ స్త్రీలను జైలు అధికారులు కుక్కలకన్నా హీనంగా చూస్తారు. రాజీని మాత్రం శారీరకంగా హింసించక పోయినా, ఇతర యువతీ యువకుల్ని హింసించే గదుల దగ్గరగా తీసుకుపోయి రాజీని ప్రశ్నలడిగే వారు. ”వారి కేకలు, యమబాధతో పెడుతున్న పెడబొబ్బలు” వింటుంటే ఆమెకి కడుపులో పేగులు ఉండలు చుట్టుకుపోయేవి. అదే తనకు కేటాయించిన శిక్ష అని అర్థం చేసుకుంటుంది.

అది ‘ఎమర్జెన్సీ’ ప్రభావం! అమాయకులు బలైపోతున్నారు. నాలుగు నెల్లకి రాజీని విడుదల చేశారు. ఆమె మీద నిఘామాత్రం ఉంది. ఇల్లూ, ఫోనూ అన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఆమె నిరాధారంగా మిగిలింది. ఆమె బాస్‌ (ప్రియుడు) ఊళ్ళోలేడు. అతను వస్తేగాని ఆమె ఉద్యోగం సంగతి తేలదు.

ఈలోగా ఆమె స్నేహితుడి ద్వారా ఒక ‘స్వామీజీ’తో పరిచయమవుతుంది. స్వామీజీ ఆలోచనలు రాజీని బాగా ప్రభావితం చేస్తాయి. స్వామీజీతో ‘ఎమర్జన్సీ’ గురించి చర్చించి ఎన్నో విషయాలు తెలుసు కుంటుంది.

తరవాత ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అయినా, మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకోదు రాజీ. స్వామీజీ ఆశ్రమంలో ఉండి గిరిజనులకు సేవచెయ్య డానికి డెహ్రాడూన్‌ వెళ్ళిపోవాలను కుంటుంటుంది. ఆ సమయంలో అనంత్‌ ఊరి నుంచి వచ్చి, రాజీని కలుసుకోవడానికి వస్తున్నానని చెప్పి, మళ్ళీ తన ‘పాత స్నేహితురాలు’ రావడం వల్ల రాజీని కలుసుకోవడానికి రాలేకపోతాడు. రాజీకి తీవ్ర ఆశాభంగం కలుగుతుంది. ”తన అవసరానికి, తన కోర్కెకనుగుణంగా ఏదీ సాగదు. అతనికి వీలైనప్పుడు అతని కోర్కె అనుసారమే ఏది జరిగినా, అయినా తానేమీ చేయలేదు. నిస్సహాయంగా ఒంటరిగా బాధపడటం మినహాయించి. తన ఒంటరి తనంలో, తన నిస్సహాయతలో పాలు పంచుకునే వీలు అతనికి లేదు” అని గ్రహిస్తుంది.

”ఇలా జీవితం అంతా అతని కోసం వేచి ఉండడం, తపిస్తూ ఉండడమే. ఇదే నా జీవితం… అతనిని మరిచిపోగలిగితే, అతని నుంచి దూరంగా వెళ్ళిపోగలిగితే….” అని ఆలోచిస్తుంది. ఒక నిశ్చయానికొచ్చి, తాత్కాలికంగా నైనా స్వామీజీ ఆశ్రమానికి డెహ్రాడూన్‌ వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అనంత్‌కి ఉత్తరం రాస్తుంది. ”… నాకెవ్వరూ లేరనిపించింది… మీరు నాకు కావాలి. అహర్నిశలూ నాతో ఉండాలి…. మీరు నిజంగా నా దగ్గర కొచ్చిన కొద్ది క్షణాలు కూడా, ఎవరైనా వస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న శంక నన్ను క్రుంగదీస్తుంది. నాకలాంటి దొంగ బ్రతుకు గిట్టదు… మీతో బాహాటంగా బ్రతికే వీలు లేదు. బూటకపు బ్రతుకు బ్రతకలేను….” అని.

దానికి సమాధానంగా….. ”జీవితంలో ఎవరికెంత వరకు ఏది ప్రాప్తమో అంతవరకు పొంది తృప్తి చెందడం మంచిది. ఆపైన ఆరాటపడటం, బాధపడటం అనవసరం… నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ మంచే కోరుతాను” అని రాస్తాడు అనంత్‌.

రాజీ మళ్లీ సమాధానం రాస్తుంది. అందులో ‘మీకు బంధాలు బంధాలుగా కనపడవు. వాటిని జీవితంలో గొప్ప అవకాశాలుగా తీసుకుంటారు. ఆ అవకాశాలతో, అనుభవాలతో జీవితాన్ని విస్తృతపరచుకుంటారు. ఆ ప్రయత్నంలో ఏరాయో, రప్పో అడ్డువస్తే దానిని మెలకువగా తప్పించుకుని ముందుకు సాగిపోతారు… మీరు జీవితాన్ని అనుభవిస్తారు, ఆనందిస్తారు, నేను ఊహిస్తాను, బోల్తాపడుతూ ఉంటాను. మీలాగా…. జీవితంలో కొద్దో గొప్పో రాజీపడితేనే గాని ఏ వ్యక్తి సుఖంగా బ్రతకలేదేమో!” అని రాస్తుంది.

రాజీ ఉత్తరంలో రాసిన విషయం ఒక్క ‘అనంత్‌’ లక్షణమే అనిపించదు. సామాన్యంగా చాలామంది పురుషుల స్వభావమే అంత అనితోస్తుంది. అందుకే కొందరు ఆడవాళ్లు ప్రేమించి మోసపోతూ ఉంటారు. కొందరు బోర్లాపడుతూ ఉంటారు.

(ఉదయం నవతరం వారపత్రిక, 29.6.1990)

(ఈ నవల రాసేనాటికి వి.ఎస్‌. రమాదేవి గారు ఉద్యోగంలో వుండడం వల్ల ‘నిశ’ అనే కలం పేరుతో రాసారు.)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.