– వి. ప్రతిమ
ఆధునిక ఉర్దూ సాహిత్యం అనుకోగానే మనకి చప్పున గుర్తొచ్చే స్త్రీ రచయిత ఇస్మత్ చూగ్తాయ్..
స్త్రీలు కవిత్వం రాయడాన్ని తిరుగుబోతుతనంగా భావించే రోజుల్లో సాహసం, ధిక్కారం అన్న రెండు ఆయుధాల తో పాత సాంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జండా ఎగురవేసి నిర్భయంగా నిలబడిందామె. సాహిత్యంతో పాటు సమాజంలో కూడ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెవి.
”నేనెప్పుడూ చదవడాన్ని ఎంత ఇష్టపడతానో రాయడాన్నికూడా అంతే ఇష్టపడతాను. నా జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన సమయాలనూ, క్లిష్ట సమయాలనూ కూడా భరించే శక్తి నాకిచ్చింది నా రచనా వ్యాసంగమే. ఎన్నో బరువులను దింపుకునేలా చేసింది, ఎన్నెన్నో వదిలించుకునేలా తోడ్పడింది… ఈ నా కలం నాకొక జీవితానిచ్చింది. ఒంటరి సమయాల్లో స్నేహాన్ని పంచింది. నా రచనా పుష్పక విమానంలోకి నేనెవరినయినా ఆహ్వానిం చగలను, వచ్చిన వారిని నేనేమయినా అనగలను, ఏడ్పించగలను, నవ్వించగలను లేదా భస్మం చేయగలను. ముక్కలు ముక్కలు చేసి నాశనం చెయ్యగలను. ఒక తోలు బొమ్మలా ఆడించగలను. నేనొక సృష్టికర్త, లయకారిని కూడా ”
అని స్వయంగా చెప్పుకునే ఇస్మత్ కథలన్నీ కూడా స్త్రీల జీవితాల్లోని దుఃఖాలూ, విషాదాలూ, అయితే వాటిని ఆమె చెప్పే పదునైన ధోరణి పాఠకులకి గొప్ప చెంపపెట్టయి అపరాధ భావానికి గురి చేస్తాయి. స్త్రీలు తమకు తెలీకుండానే తాము కోల్పోతున్న జీవన సంతోషాలను, చిన్న చిన్న సుఖాలను గురించీ ఆలోచనలో పడేలా చేస్తాయామె కథలు
అరవై ఏళ్ల ముందు ”లీహాఫ్” వంటి కథ రాయడం అందులో ఒక స్త్రీ రాయడం చిన్న విషయమేమీ కాదు. చెప్పాలంటే ఈనాటికీ కూడా వైవాహిక జీవితంలో స్త్రీల లైంగిక అసంతృప్తుల మీద మాట్లాడ్డానికి స్త్రీలు వెరుస్తూనే వున్నారు… అటువంటిది వివాహంలో తీవ్ర ఆశాభంగానికి గురయిన బేగం జాన్ తన పరిచారికతో లైంగికంగా, ఉద్వేగపరంగానూ ఉపశమనాన్ని పొందడా న్ని గురించి ఆనాడే చెప్పడం సాహసమే. అదీ ఒక చిన్న పిల్ల జ్ఞాపకాల రూపంలో కథ చెప్పిన తీరు మనకి విస్మయానికి గురిచేస్తుంది. ఆ విధంగా శిల్పం, శైలి విషయంలో కూడా అత్యంత పరిణతి చెందిన రచయిత్రి ఇస్మత్ చూగ్తాయ్.
ఆనాడు లీహాఫ్ కథ చాలా విమర్శలకు గురయింది…. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అశ్లీలత కింద లాహోర్ కోర్టులో కేసు కూడాపెట్టింది… కానీ కోర్టు వారికి ఆ కథలో ఎటువంటి అశ్లీల పదాలూ దొరకనందున కేసు కొట్టివేశారు.
తనకి బాగా తెలియని, అవగాహన లేని విషయాలు గురించి రాయడం ఆమెకి అలవాటు లేదు… తమ కుటుంబాలలోని స్త్రీలు, వారి మనస్తత్వాలు, వారికి చెందిన కొన్ని అనుభూతులు, వారి బంధువులు, ఇరుగు పొరుగులు, నౌకర్లు యింకా వివాహానికీ ముందూ తర్వాత కూడా స్త్రీల మీద అమలు చేసే తీవ్రమయిన అదుపులూ యిలా వివిధ రకాల వస్తువులు వివిధ కోణాలలోనుండి కళాత్మకతను సంతరించు కుని కథలుగా రూపు కడ్తాయి.. ఆమె కలం నుండి.
”ఉపమ, రూపకాలంకారాలను, ఉర్దూ నుడికారాన్నీ సమయోచితంగా వాడు కోడంలో, భావ చిత్రాలను చొప్పించే సౌలభ్యంలో, స్పస్టతలో, భాషా నాణ్యతలో ఇస్మత్ తమ సమకాలీన రచయితలను అధిగమించింది” అంటారు ఈ పుస్తకాని పరిచయం రాసిన తామిరా నఖ్వి (మరోఉర్దూ రచయిత్రి, విమర్శకురాలు, అనువాద కురాలు)
ఒక స్త్రీ శరీరపు రంగుని గురించి చెప్పడం కోసం ఇస్మత్ ఏమంటుందో చూడండి.
‘మేలిమి బంగారంలో కంసాలి మోసంతో కొంత వెండి కలిపినట్లుగా వుందామె” అంటుంది… ఆమె వాడిన ఇతర ఉపమానాలు కూడా రోజువారీ జీవిత చరణాల్లో నుండి పట్టుకోవడం అత్యంత సహజంగా అమరింది.
ఇందులో ఒక ప్రేమ కథ కూడ వుంది…తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఎందుకింత బాధపెడ్తరు పిల్లలు. చెప్పి చేసుకుంటే కాదనరు గదా అన్పిస్తుంది… రెండు వేరు వేరు మతాలకు చెందిన తల్లిదండ్రులు తమ మత ఛాందసాలకు అంటి పెట్టుకుని పిల్లల్ని ఎట్లా కోతుల్లా ఆడించాలని ప్రయత్నం చేస్తారో… ఆ ప్రయత్నాన్ని ఒక ఆహ్లాదకరమైన కార్యంలా సరదా సరదాగా తీసుకుని రాత్రికి రాత్రి ఇరువైపుల తల్లిదండ్రులకీ అర్ధమయ్యేలా మతాతీతంగా ఆ జంట (ఆ పిల్లలు) ఎంత పెద్దరికంగా ప్రవర్తిస్తారో చదవినపుడు ముచ్చటేస్తుంది…
సీరియస్ కథలే కాకుండా అని సమాజ సందర్భాలకు సంబంధించిన కథలూ ఆహ్లాదంగానూ, వ్యంగ్యంగానూ, సరళంగానూ, వేగంగానూ చెప్పుకుంటూ పోవడం ఇస్మత్ రచనా చతురత…
”నేను ముస్లింని. విగ్రహరాధన మాకు పాపం, కానీ పురాణాలనేవి ఈ దేశపు వారసత్వ సంపద. యుగాల సంస్కృతీ, తత్త్వమూ అందులో యిమిడి వున్నాయి… మతం వేరు, జాతి సంస్కృతి వేరు. ఈ దేశపు గడ్డలో, గాలిలో, నీడలో, సూర్యరశ్మిలో నాకు సమాన భాగమున్నట్లే ఈ సంస్కృతిలోనూ వుంది.. నేను హోలీకి రంగులు ఆడతాను, దీపావళికి దీపాలు పెడతాను నా మత విశ్వాసాలు భంగమవుతాయని నా విశ్వాసాలూ, వివేకమూ అంత తేలిగ్గా దెబ్బతినేటంత బలహీనమయినవా?” అనే ఇస్మత్ మతాసామరస్యాన్ని గురించి వేరే చెప్పేదేముంది?
ఇస్మత్ జీవితం కలగలిపి ఈ కథలను చదువుతున్నపుడు ఒక గొప్ప కదలిక పాఠకుడిని కుదురుగా వుండని వ్వదు… ఈ కథల్లోని స్త్రీలంతా మనకి యింతకు ముందే ఎప్పుడో పరిచయ మున్నట్లు గానూ, కొంత మంది కొత్తగా పరిచయమవుతున్నట్లుగానూ దిగులూ, దుఃఖం, ఆశ్చర్యం, తెలుసుకోవడం అన్నీ కలగలిపిన భావం ముప్పిరిగొని ఉపిరాడదు.
ఇంత మంచి కథల్ని తెలుగు పాఠకులకందించిన అనువాదకురాలు పి.సత్యవతి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. చాలా చోట్ల ఆంగ్లంలో నుండి కాకుండా నేరుగా ఉర్దూ భాషలో నుండి అనువదించారా అన్నంత సహజంగా ఫీలవుతారు పాఠకుడులు ఉర్దూ భాషలోని ఆ నుడికారపు సౌందర్యాన్ని, పరిమళాన్నీ పట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం అడుగడుగునా కన్పిస్తుంది. తెలుగు పాఠకులు సత్యవతి గారికి ఋణపడి వున్నారు…
ఇంకా ఎన్నెన్నో నవలలూ, కథలూ, వ్యాసాలూ, నాటకాలూ రాసిన చుగ్తాయ్ ని తెలుగులోకి మరికొంతయినా తెచ్చుకోగలిగితే బాగుంటుందన్పిస్తుంది. పుస్తకం పూర్తయ్యే టప్పటికి… ఇటువంటి మంచి పనులు చేస్తోన్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌ని అభినందించాలి.