– పుష్పాంజలి

పద్మ వయసు నలభైరెండు: బేగంపేట స్టేటు బ్యాంకులో ఉద్యోగిని. తెలియని వాళ్లు ”అబ్బే! ఆమె కంత వయసెక్కడిదీ?” అంటారు గాని నలభై రెండే నిజం.

పెళ్లీ పిల్లలు ఉండుంటే ఆమెకి బోలెడన్ని టెన్షలుండేవేమో గాని, ఇప్పుడవేవీ లేకపోవడం వల్ల చాలా యంగ్‌గా కనపిస్తుంటుంది.

పెళ్లిలో ఇరుక్కుపోయిన ఏ స్త్రీ కూడా పెళ్లి గురించి మంచిగా మాట్లాడడం పద్మ వినలేదు. అదే ఆమెకాశ్చర్యం ఆమె కొలీగ్‌ సరోజిని” వెలుపలికి అందమైన తోటలా ఉంటుందిగాని, అదో పెద్ద కంపపద్మా” అంటూ వుంటుంది.

పద్మ అమ్మా, నాన్న మటుకు, ఆమెకు పెళ్లి కాకపోవడానికి కనేక కారణాలు చెబుతుంటారు ”తల్లి” దాని ఆరోగ్యం బాగోలేదులెండి”, అంటే, తండ్రి ”అబ్బే ఆమె తన జీవితాన్ని కృష్ణయ్యకి అంకితం చేసేసిందండీ” అంటాడు. ఇద్దరూ ఒకర్తో ఒక్కరు పొంతనలేని సమాధానాలు చెబుతారు.

పెళ్లి చేసుకోడానికి కారణమే ముంటుంది? అది ఒక సహజమైన సమాజ రీతి. అయితే పెళ్లికాకపోవడానికి మటుకు సవాలక్ష కారణాలుంటాయి.

ఇవన్నీ ఆలోచించడానికి పద్మకు అసలు టైముండదు. ఉదయం సాయంత్రం ఇంట్లోపని, పగలంతా బ్యాంకు ఆదివారాలోస్తే తమ ఇంటికొచ్చే తముళ్ల చెల్లెళ్ల కుటుంబాలకి సేవలు – ఇలా గడిచిపోతుంది ఆమె జీవితం.

తల్లి చెపుతున్నట్టు తనకు ఆరోగ్యం బాగలేదన్న అనుమానం ఆమెకి రాకపోలేదు. అయితే డాక్టర్లు చెప్పినట్లు తనకి జబ్బులేవీ లేవు. ఉంటే దాని తాలుకూ లక్షణాలు కనపడాలిగా పోతే తండ్రి చెప్తున్నట్టు తను కృష్ణ భక్తురాలయ్యే అవకాశ మేమన్నా వుందా. తనమనసులో భక్తేమీ తన్నుకు రావడం లేదే? ఒక్క దేవుడి పట్లా తనకు మంచభిప్రాయం కూడా లేకపోయె!

నాన్న మంచంలో పడుకొనో వాలుకుర్సీలో కూచోనో టీవీ చూస్తాడు. ఆయనకేదైనా జబ్బుంటూ ఉంటే ఎక్కువ తిన్నప్పుడు అసిడిటీయే! అమ్మేమో ఇరుగు పొరుగులో నిర్విరామంగా కాలక్షేపం చేస్తుంటుంది. ఈ వాతావరణం మంతా ఇన్నేళ్లు భరించినా, ఇటీవల కాలంలో విసుగు ప్రారంభమైంది.

మనిషెప్పుడూ ఒకే స్థితిలో ఉండడానికి ఇష్టపడడు. చలనం జీవన గమన సూత్రం! అందుకే మనిషి చేపలా నీళ్లల్లో ఈదడం, పక్షిలా ఆకాశంలో విమాన రూపేణా ఎగరడం చేస్తుంటాడు. భూమ్మీద విసుగేసి ఇతర గ్రహాలకూడా వెళ్తూన్నాడు మనిషి. అంటే అతను దృష్టి ధర్మమైన చలన సూత్రాన్ని పాటిస్తున్నాడు. పద్మకి, తను ఒంటరిగా ఉన్నానని అనిపిస్తోంది, మనసులో నిజంగా ఎలాంటి భావజాలం ఉప్పొగ్గుతూవుందో తెలియదుగాని ”మాట్లాడుకోను మంచి స్నేహితులంటే బావుణ్ణు’, అనిపిస్తోందీ మధ్య!

చూట్టానికి లక్షణంగా ఉన్నా హృదయాన్ని తాకే సంఘటనలేవీ ఆమె కింతవరకు జరగలేదు, కొందరు పోకిరీ రాయుళ్లతో చెదురు మదురు సంఘటనలు తప్ప, హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి లేదు.

అలాంటిది ఇప్పుడు కొత్తగా తమ బ్రాంచిలో జాయినైన ”ఉత్తమ్‌’ని చూస్తుంటే ఆమెకు ఇటువంటి సరదా స్నేహితుడుంటే బావుణ్ణు! అనిపించసాగింది.

అతని పూర్తి పేరు సర్వోత్తమ రావు, చలాకీగా, సరదాగా తమాషాగా అందరితో మసులుతుంటాడు, జోకులు పేలుస్తాడు, కస్టమర్లకు సహాయం చేస్తుంటారు.

పద్మను సికింద్రాబాదు నుంచి ఒకసారి నల్గొండకు మరోసారి కరీంనగరుకూ మార్చారు. ఆమె అక్కడ కూడా ఒంటరిగా లేదు. వాళ్లమ్మా నాన్నలు ఆమెతోటే ఉండేవాళ్లు. కాబట్టి ఆమె ఎప్పుడూ ”ఆకుపైడ్‌ గానే ఉండేది. ఆమె ”వితాడ్రాయింగ్‌ టైపు” అవడం వలన ఎవరితోను ఎక్కువ మాట్లాడేది కాదు. ఇతరులలో స్నేహం లేకపోవడం, ఎప్పుడూ ”ఇల్లే స్వర్గ” మవడంతో ఆమెకు జీవితం స్తబ్ద మనిపించసాగింది.

ఎప్పుడూ నవ్వని పద్మని నవ్వించడం ఉత్తమ్‌కు ఒక ఛాలెంజ్‌ అయిపోయింది, సర్వోత్తమార్గావు, సర్వాంతర్యామిలా బ్యాంకంతా తీరుగుతూ అందర్నీ కడుపుబ్బ, నవ్విస్తుంటాడు. దాంతో ఎవరికీ తలనొప్పులు, కడుపు నొప్పులు రావడం లేదు.

ఆవాళ బ్యాంకులో నుంచి వెలుపలికి రాగానే బస్సు వెక్కిరిస్తూ వెళ్లిపోయింది. తరువాతి బస్సుకింకా ఒకటిన్నర గంటటైముంది. పక్కనే ఉన్న పార్కులో కూచుంది పద్మ. ఉత్తమ్‌ అక్కడకొచ్చి, ఆమెతో మాట్లాడసాగాడు. ‘అమ్మో! ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? ఈ ఊరంతా ఇటువంటి వార్తలు మోసే, తన పనికి రాని చుట్టూల్తో నిండివుంటె! లేటయితే తల్లి చీవాట్లకు తను ఎర కావాలి! నలభై రెండోచ్చినా చివాట్లు తింటూనే ఉంది తను.

అంతేమరి! తనకేం కావాలో తెలియని వ్యక్తులకూ తెలిసి కూడా దాన్ని పోరాటంచేసి పొందలేని వాళ్లకూ, చివరకి మిగిలేది అదేమరి!

ఏదో సాకు చెప్పి వెలుపలకొచ్చి ఒక మాల్‌లో దూరి విండో షాపింగ్‌ మొదలెట్టింది.

మరోనాడు పద్మ అలాపార్కులో కూర్చోని ఉండగా అతను తన ఫ్యామిలీతో ఊడిపడ్డాడు. తనని చూడగానే పరుగు పరుగునొచ్చి ”ఇవాళ నా అదృష్టం బాగుండి మీరు కలిశారు పద్మగారూ! ఈవిడ నా భార్య, వనజ విళ్లిద్దరు నా పిల్లలు. కోమల్‌, శ్యామల్‌ అంటూ తన సహజ ధోరణిలో సంభాషణ సాగించాడు.

చాలా మంది ఇంటి భార్యలు (హౌస్‌వైప్స్‌) మీవారేం చేస్తుంటారు? పిల్లలెందరు? లాంటి ప్రశ్నలతో ఆమెకు చికాకు కలిగిస్తుంటారు. ఇంక పెళ్లికాలేదండీ అంటే ”అయ్యో?” అన్న మగనాయాలు, కూడా లేకపోలేదు. తమకు పెళ్లిళ్లై పిల్లలుండడం ఒక అడిషనల్‌, క్వాలిఫికేషన్‌లాగా భావించడమే అందుకు కారణమని పద్మకు తెలుసు. ఇప్పుడే వనజ అన్న మగువ కూడా అందుకు భిన్నమైదేమీ కాదు. ఒక్కోసారి ”మీ వారేం చేస్తుంటారు”? అన్న ప్రశ్నకు ”ఏమీ చేయరు” అని ఒక గడుసు సమాధానమిచ్చి, ఆ తికమక ముఖాలను చూసి నవ్వుకునే దామె.

ఒకసారామె బ్యాంకు దగ్గర్లో ఉన్న మార్కెట్లులో వంకాయలు కొంటుండగా ”ఏమండీ పద్మగారూ. వంకాయకూర మీకేనా?” అని ప్రత్యక్షమయాడు ఉత్తమ్‌. పద్మ గుండెలో దడపుట్టింది. అతను పలకరించి ఊరుకోలేదు. వెలుపలి వరకూ నడిచొచ్చాడు. తమ మూక, ఎవరైనా చూస్తే? తన తల్లి వాళ్ల మాటలు వినడానికి ఎప్పుడూ సిద్దమే! వస్తానండీ! మా నాన్నగారు తొందరగా భోంచేస్తారు” అంటూ దడిగా బైట పడ్డది.

తనతో పార్కుకి మార్కెట్టుకి, ఒక కప్పు కాఫీకీ ఒక మంచి నాటకం రవీంద్రభారతిలో చూట్టానికి ఒక మంచి కామెడీ ఫిల్ములో నవ్వుకోడానికి మంచికీ…. చెడుకూ… ఛ.. ఛ… చెడుకేమిటి అసయంగా.. మంచికే , ఒక స్నేహితుడుండ కూడదా”… అనే కోరిక ఆమెలో బలపడ్డది.

”ఎందుకుండ కూడదూ” అన్నట్టు సరోత్తమరావు తను కోరుకునే ఆ స్నేహితుడి స్థానంలో నిలుచున్నాడు.

ఆవాళ బ్యాంకు నుంచి బస్టాండు చేరిన పద్మకు బస్టాపంతా నిర్మానుష్యంగా కనిపించింది. తనకోసమే నిలుచున్నట్టు ఒక ముసలాయన” నీకు తెల్వదా బిడ్డా? మురిక్కాలవల మాల్వా ద్రిసాబ్‌ను ఫాక్షనిస్టులు ఏసేసిన్రు బడాబంద్‌ హోరాహోరీ , ఆటోనై, రిక్షానై, బస్సునై, జల్దీల ఇంటికి బో బిడ్డా” , అన్నాడు.

ఆమె గుటకలు మింగుతూ దేవుడి మీద భారం వేసి అక్కడే నించుంది. ”అంత భారం నేనొక్కణ్ణే మొయ్యలేను. నువ్వూ కాస్త మొయ్యు” అన్నట్టు ఆ దేవుడు సర్వోత్తమ రావుని అటుగా పంపాడు.

ఆ సమయంలో అతణ్ణి చూడగానే ప్రాణం లేచొచ్చిందామెకు. తప్పనసరి పరిస్థితుల్లో తప్పు కాదనుకుంటూ అతని వెనక కూచుంది. అతనూ ఏ.ఎస్‌.రావు నగరం వేపే వెళ్తున్నాడు. తనింకా ఇవతలే దిగాలి.

అతను కూనిరాగాలు తీసుకుంటూ, బండితోల్తున్నాడు. ఆమె ఆలోచిస్తోంది ”తనుత్త పాత కాలం మనిషి కాదు. తన ఇంటి వాళ్లు పాత కాల పోళ్లు! వాళ్ల వాళ్ల విషయాల్లో ఆధునికంగా, తన విషయంలో మాత్రం చాలా పాతతరం వాళ్లలాగా, ఆలోచిస్తారెందుకో?

ఆమెని ఇంటి దగ్గర డ్రాప్‌ చేశాడతను. ఆమె ఇంట్లో అతనికొక కప్పు కాఫీ కూడా ముట్టింది.

అప్పటి దాకా అతని మాటలకు నవ్వుతూ వున్నతల్లి, అతను వెళ్లగానే ”ఏం పద్మా! నీకొక ఆటో దొరక్కపోయిందా?” అంది.

ఆమెకు (పద్మకు) తల కొట్టేసినట్లయింది. ‘తన బతుకును బతుకు అంటారా? తనది బతుకు కాదు తనొక జీవచ్ఛవం’.

”జీవచ్ఛవం” ఏసంధి, అని తెలుగు గ్రామరు బాగా తెలిసిన పద్మ ఆలోచించింది. గుర్తుకురాలేదు. ‘తన మెదడు మొద్దుబారింది. తను అన్ని మర్చిపోయిందా అనుకుంది నిరాశగా. ఆమెకతని జోకులు తాము దార్లో టీ తాగడం అన్నీ జ్ఞాపకం వొచ్చి ‘ఈ సాయంత్రం బాగా గడిచింది’, అనుకుంది.

ఆ తర్వాత ఆమెలో ఏదో తెగింపు వచ్చింది ఆమె బడీచౌడీకెళ్లి ”పద్మావతి”లో ఒక పది మంచి చీరలుకొంది. పార్లర్‌ కెళ్లి జుట్టు షేప్‌ చేసుకుంది. పెడిక్యూర్‌, మానిక్యూర్‌ అయి ఫ్రెష్‌గా తయారైంది.

అలా అందంగా, అత్మ విశ్వాసంతో బ్యాంకులో అడుగెట్టిన ఆమెని గుర్తుపట్టలేక, సహాద్యోగులు రెండోసారి తలెత్తి చూశారు.ఎంతో ఎలివేటెడ్‌గా ఫీలయిన పద్మ ఇంట్లో తల్లి చూసిన చూపులు తలచుకుని కుంగిపోయింది.

సాయంత్రం బస్టాపులో ”నా బస్‌ వెల్లిపోయింది. రండి అలా పార్కులో కూచుందాం”. అంది అటుగావచ్చిన ఉత్తమ్‌తో..

ఏ తీరానికో – పుష్పాంజలి పార్క్‌లో శనక్కాయలు తింటూ మాట్లాడుకుంటున్నారు. తను ఇటీవల చూసిన సినిమా ఏదో ఆమెకు చెపుతున్నాడతను. అతను చెప్పే సినిమా లేవీ ఆమె చూడలేదు. టి.వి. దగ్గర నాన్న కూచొని ఉంటాడు. ఈ కాలపు సినిమాలేవీ తల్లిదండ్రులతో కలిసి చూసేవి కాకపోయెవి.

మరునాడు ”ఏమండి పద్మగారూ! మా చెల్లి వచ్చింది. ఆమె కొక చీర కొనాలి. తనీవాళ రాత్రికి వెళ్తూవుంది. మా ఆవిడ నన్నే కొనుక్కు రమ్మంది, మీరు కాస్తసాయం చేయ కూడదూ”, అన్నాడు.

షాపింగ్‌ చేసి హోటల్లో అతన్తోపాటు టిఫిను, కాఫీ ముగించి వాళ్లింటికెళ్లింది. వచ్చాక తల్లితో అంటే ”మనకెందుకమ్మాయి అటువంటి పరిచయాలు? మీ తమ్ముళ్లకి తెలిస్తే బావుండదు” అందావిడ.

తల్లి మాటలు ఆమెలో అలజడి రేపాయి. ఆమెలో ఆ తిరుగుబాటు ధోరణి పెరిగింది.

తనేం పాపం చేసింది? తనకి స్నేమితులెవరూ ఉండగూడదా? చిన్నతనంలోనే చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరి, తమ్ముళ్ల చదువులకు చెల్లెళ్ల పెళ్ళిళ్ళకు సాయపడ్డది. అనారోగ్యంతో నాన్న పదవీ వివరణ చేస్తే ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకుంది. ఆడవాళ్లతో స్నేహం చేసినా తల్లికి నచ్చదెందుకో తనకెవరూ స్నేహితులుండగూడదా? తనకు జీవితానందం పొందే అర్హత ఎంత మాత్రమూ లేదా? ! అని బాధపడుతూ రాత్రంతా నిద్రపోలేకపోయిందామె.

మరునాడు బ్యాంకులో తలనొప్పితో తలరుద్దుకుంటుండగా ఉత్తమ్‌ వచ్చి ”తలనొప్పి! అయితే వేసుకోండి ఆస్ప్రిన్‌” అంటూ నాటక పక్కీలో ఆమె చేతిలో రెండు మాత్రలుంచి వెళ్లిపోయాడు.

ఇటీవల పద్మమీద ఆమె తల్లి నిఘా మరీ ఎక్కువైంది. ఆమె ఇదివరకటిలా రోజూ తలకింత నూనె రాసుకోవడం లేదు. జుట్టు పొడి పొడిగానే ఉంచుకుంటుంది. తల్లి నూనె సీసా పట్టుకొచ్చి ”నూనెరాసుకెళ్లు పద్మా, చూడు ఎండిపోగల్దు” అన్నది ‘పోతే పోయిందిలే’ అనుకుంది పద్మ.

‘జీవితమే ఎండిపోయింది! అనుకుంది ఆఫీసుకుపోతూ ఆమె ఇప్పుడు బ్యూటీషియన్‌ సలహా ప్రకారం’ సన్‌ బ్లాకు నైటు క్రీములు, మాయిశ్చరైజర్సు వాడుతోంది చర్మ సౌందర్యం కోసం. అవన్నీ చూసి తల్లి భయపడుతోంది. ఆమె నిర్లక్ష్య ధోరణి తల్లిని మరీ భయపెడుతోంది.

పద్మకీ మధ్య ‘తను ఉత్తమ్‌ గారికి దగ్గరవుతున్నానేమో’ అన్న అనుమానం తలెత్తింది. ఆ పాటి చనువును దగ్గరవడం అంటారా? అతన్తో తన పరిచయం కేవలం స్నేహమే! ఎవరితోనైనా కలవడానికి తనకు మనసంటూ ఉంటేగా! తనమనసొక బీడు భూమి. అక్కడ ప్రేమ బీజాలు నాటితే మలమలమాడి చస్తాయే గాని మెలకలెత్తి వృక్షాలు కావు. కాబట్టి ఆ ద్వారాలు పూర్తిగా మూసేసి, స్నేహపు చిరుజల్లుల కోసం ఎదురుచూస్తోంది తను. ఒక మనిషిగా తనకా అర్హత లేదా? తప్పేంటి? అనుకుంది.

ఆదివారం అమ్మ తమ్ముడింటికి వెళ్లింది. ‘నాన్న భోంచేసి పడుకుంటే ఆరుకు గాని లేవడు. తను ఎంచక్కా మాట్నీకి వెళ్లిరావచ్చు! ‘ అనుకుని ఆపని చేసింది. అనుకోకుండా ఉత్తమ్‌ కలిశాడక్కడ. ”ఆదివారమని అంతా మనపై దాడి చేస్తారుగాని, ఆఒక్క సెలవు కోసం మన మెంత అర్రులు చాస్తామో తెలియదు వాళ్లకు. నాకూ ఒక టికెట్‌ తెచ్చి పెట్టండి” అంటూ డబ్బు లివ్వబోయాడు.

”భలేవారే” అంటూ తనే రెండు టిక్కట్లు కొని, ఒకటి అతని చేతిలో పెట్టింది. ఇద్దరి సీట్లు పక్క పక్కనే వచ్చాయి. అది పాత సినిమా మిస్సమ్మ” కామెడీ సీన్లు వచ్చినపుడంతా అతను పద్మ పైకి వంగి ఏదో చెప్తూ మనసారా పడీ పడీ నవ్వుతున్నాడు. ఇది పద్మకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెనకసీట్లో పక్కింటామె వుందేమో! పక్క సీట్లో ఎదురింటామె ఉందేమో! అన్న అనుమానాలతో, ఆమె సరీగా ఆ సినీమా చూడలేకపోయింది.

తను ఏ మగవాడితో కూడా అంత క్లోజ్‌గా మూవ్‌ కాలేనని ఆమెకర్ధమైంది ”డ్రాప్‌ చేస్తాపదండి” అని అతడంటే, ”లేదండీ! పక్కనే పని వుంది”అని రిజెక్ట్‌ చేసింది.

ఆమెకొక విషయం అర్థమైంది. స్నేహం తప్పు కాకపోవచ్చు. కాని తను ఆడది. అతను మగాడు. తమిద్దరి మధ్యా ఒక డేంజరస్‌ షార్ప్‌ లైనుంది’

కాని ఆమెకు అర్ధంకానిదింకొకటుంది. అది ఒక స్త్రీ మగాడితో స్నేహం చెయ్యెచ్చు. కాని భుజాలు భుజాలు రాసుకుంటూ తిరగడం మాత్రం తేనెతుట్టెలో చెయ్యి పెట్టినట్టేనన్నది.

కాని ఆ సినిమా ఇన్సిడెంటుతో ఉత్తమ్‌లో రావలసిన మార్పురానే వచ్చింది. ”పాపం పద్మ! ఇంట్లో వాళ్ళామెను బందిఖానాలో ఉంచాలనుకునే మనస్తత్వం కలవాళ్లు. పద్మ చూపులకు బాగానే ఉంటుంది. తనంటే ఎంత అభిమానమో! తనీ మధ్య ఆమెను గురించే ఆలోచిస్తున్నాడు. తను పద్మకి ఇంకాస్త దగ్గరయితే తప్పేముంది?’

ఈ ఆలోచనొచ్చాక అతను పద్మ బాధ్యతంతా తనదే అయినట్టు ప్రవరిస్తూ మధ్యాన్నం ఆమెతో భోజనం, రెండుసార్లు ఆమెతో కాఫీటీ అప్పుడప్పుడూ ఆమెను ఇంటివద్ద వదలడం బాధ్యతగా చేస్తున్నాడు.

పద్మకు అతని పనులు కొన్ని నచ్చవు. కాని చెయ్యకూడదని చెప్పడం ఎట్లా? కాని అలవాటులో పొరపాటులా ఆమె ఒంటరిగా భోంచేయలేకపోతోంది. కాంటిన్‌కు, బస్టాఫ్‌కు అతన్ని తోడు తీసుకునే వెళుతోంది.

వీటితో బాటు పద్మ మరో పొరపాటు చేసింది. పార్క్‌లో కూచున్నపుడు తన జీవితం గురించి, తనవారి ప్రవర్తన గురించి, అతనికి చెప్పేది. అప్పుడప్పుడూ కన్నీళ్లు కార్చేది.

మనిషికి ఎమోషన్‌ ఔట్‌బ్రేక్‌ అవసరమైనా దానివల్ల లాభాలకన్నా ఒక్కోసారి నష్టాలే ఎక్కువ వస్తాయి.

ఆవాళ పద్మకోసం ఎవరో యువకుడు రావడం, ఆమె హడావుడిగా మేనేజరు పర్మిషను తీసుకుని అతన్తో స్కూటర్లో వెళ్లిపోవడం గమనించి విస్తుపోయాడు ఉత్తమ్‌. తనతో మాట మాత్రమైన చెప్పకుండా ఆమె అలా వెళ్లడం అతనికి కోపం, ఉక్రోషం తెప్పించాయి. రెండోరోజు, మూడోరోజు కూడా అలాగే జరిగింది. అతనికోపం మిన్నంటింది.

ఆ మరుసటి దినం ఆమె బ్యాంకులో ఉండగా అతను వెల్లి ”రండి పద్మగారూ. అలా క్యాంటిన్లో కాఫీ తాగొద్దాం” అంటూ తీసుకెళ్లాడు. కాఫీ తాగుతుండగా ”ఎవరండీ అతను? క్రమం తప్పకుండా – వచ్చి మిమ్మల్ని తీసుకెళుతున్నాడు”? అన్నాడు.

పద్మ నిర్ఘాంతపోయింది.

కాస్త తమాయించుకుని ”మాకు కావలసిన వారు” అంది

”అదేమిటండీ? మీకు దగ్గర వారూ, కావలసిన వారు ఎవరూ లేరని ఆవాళ పార్కులో అంత వాపోతిరే? మరి ఇతనెక్కణ్ణించి ఊడిపడ్డాడు?” అన్నాడు.

పద్మ బిత్తరపోయింది! ఇతనేమిటి? ఈ ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఏ అధికారంతో? అనుకుంది ”అతనూ… ” అని ఆగిపోయింది.

”ఆఁ అతను? కొత్తబాయ్‌ ఫ్రెండా? ఇన్నాళ్లూ పార్క్‌ల వెంట తిప్పటానికి, లిఫ్టివ్వడానికి నన్ను వాడుకున్నావు. ఇప్పుడు… వాడా,” అన్నాడు ఉక్రోషం ఉట్టిపడగా.

అతని జ్ఞాన నేత్రం మూసుక పోయింది, అహం పురి విప్పింది.

పద్మ ఆశ్చర్యంతో స్థాణువై రెండు మూడు నిముషాలు మాట్లాడలేకపోయింది తర్వాత,

”సర్వోత్తమ రావుగారూ, మీ ధోరణి మీ సంస్కారానికి చిహ్నం. మీ మాటలో ఆంతర్యం గ్రహించలేని మూర్ఖురాల్ని కాను. మీరు మీ లిమిటుదాటిచాలా దూరం వెళ్తున్నారు. మంచి వారని నా కష్టసుఖాలు చెప్పుకున్నాను. మీరందుకు తగరు. అయామ్‌సారి, ప్లీజ్‌ మైండ్‌ యువరోన్‌ బిజినెస్‌”. అంది.

ఈసారి బిత్తర పోవడం అతనివంతయింది.

అతనలా ఆశ్చర్యంలో ఉండగానే ఆ యువకుడు వచ్చి ”పద్మక్కా! ఎక్కడికి వెళ్లారా అని భయంతో వెదికాను. చివరికిక్కడ దొరికారు. నాన్న ఈ వేళ చాలా బాగున్నారు. డాక్టరు రేపు డిస్చార్జి చేస్తామన్నారు.. వీరు…? అంటూ ఉత్తమ్‌ను ప్రశ్నార్ధకంగా చూశాడు.

”ఆయన సర్వోత్తమ రావు గారని నాకొలిగ్‌ సరే.. పద టైమైంది”. అంటూ లేచింది పద్మ

వాళ్లు వెళ్లిపోయారు.

అతను చూస్తుండిపోయాడు.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.