మందా భానుమతి
సాహిత్యం ఎప్పుడూ సమాజానికీ, సాంఘిక స్థితి గతులకీ అద్దంపట్టేట్లు ఉండాలి. ఇతిహాసాల దగ్గర్నుంచీ ఆధునిక సాహిత్యం వరకూ గమనిస్తే ఆ రచనలు వచ్చిననాటి పరిస్థితులు, జీవన విధానం.. సమాజంలో స్త్రీ పురుషుల బాధ్యతలు, విలువలు, వారి నడవడి, స్వభావాలు తెలుస్తూ ఉంటాయి. అల్లూరి గౌరీలక్ష్మి గారి నవల ”అంతర్దానం” నేటి సమాజంలో మధ్యతరగతి స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యల్ని మూడు కోణాల్లో మన ముందుంచుతుంది. పురుషులు తమ అహం తృప్తి పరచుకోవడానికి తమ జీవిత భాగస్వాములని, కన్న తల్లులని కూడా కించపరచడానికి వెనుకాడకపోవడం చూపిస్తుంది. ఈ నవలలోని స్త్రీలు తమ తమ సమస్యలని ఎదుర్కొని తమదైన పద్ధతిలో పరిష్కరించుకునే విధానం, సహజంగా… వారి వారి మానసిక స్థితికి, పరిణతికి అనుగుణంగా ఉన్నాయి.
సుజాత అమాయకురాలైన అత్తమామలకు విధేయురాలైన, భర్తకి అనుకూలంగా నడుచుకునే ఇల్లాలు. సంపాదించేది ఒకరు, అనుభవించేది ఆరుగురు అయితే ఆ సంసారంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు అందరికీ అవగతమే కష్టపడి… భర్త అవహేళనని ఎదుర్కొని పోరాడుతూ, తను అనుకున్నది సాధించి అందరి మన్ననలూ పొంది ఔరా అనిపించుకుంటుంది. ఇది ఇంటి పట్టున ఉండే ఇల్లాలి కథ భావన ఉద్యోగస్థురాలైన మధ్యతరగతి యువతి. తనతో సమానంగా సంపాదిస్తున్నా భార్య ఖర్చుపెట్టే ప్రతీ పైసాకీ తన అనుమతి కావాలనుకునే హరి ఆమె భర్త.. అవసరమైన ఖర్చుల్ని కూడా పొదుపు అంటూ తల్లినీ, ఇల్లాలినీ మానసికంగా చికాకు పెట్టి, చివరికి కొన్ని పరిస్థితులలో రాజీకి వచ్చి అత్తగారితో సహా అందర్నీ క్షమాపణ అడిగి ప్రక్షాళనం పొందుతాడు హరి.
అక్కచెల్లెళ్లయిన సుజాత, భావనల స్నేహితురాలు ప్రియ. సంసారాన్ని వ్యావహారికంగా, వ్యాపారంగా భావించే భర్తతో ఇమడలేక, విడిపోయి తన ఉద్యోగం తను చేసుకుంటూ రసహీనంగా సాగిపోతున్న జీవితానికో తోడు కావాలనుకుని వివాహితుడైన సహోద్యోగితో ప్రేమలో పడి మరిన్ని సమస్యలని ఎదుర్కుంటూ మానసిక క్షోభననుభవిస్తూ, స్నేహితురాలి సమక్షంలో సాంత్వన పొందుతుంటుంది. ఈ నవలలో స్త్రీల సమస్యలు, కష్టాలు, వాటినధిగమించడంలో వారు పడే తపన, శ్రమ… మానసిక సంక్షోభం, ఇవన్నీ పాఠకుల కళ్ల ముందుంచడంలో రచయిత్రి కృతకృత్యురాలయ్యారని చెప్పచ్చు. అన్నింటికంటే నాకు నచ్చింది ఇందులో పాత్రల మధ్య ఉండే అనుబంధాలు ఆప్యాయతలు చాలా సహజంగా… ప్రతీ సంసారంలో మనం నిత్యం చూస్తూ ఉండేవే ఒక అత్త మొదట్లో దర్జాగా కోడలి చేత సేవలు చేయించుకున్నా.. ఆ కోడలు పగలూ రాత్రీ కష్టపడుతుంటే నేనున్నానంటూ హస్తం అందిస్తుంది. ఇంకో అత్త, వియ్యపురాలితో స్నేహంగా ఉంటూ… కన్న కొడుకు లోపాలని అంగీకరిస్తూ, అంతా కోడలిదే తప్పని అనకుండా ఇంటి కష్ట సుఖాల్లో సహకరిస్తుంది.
ఇందులో పురుషులు కూడా తమ లోపాల్ని సరిదిద్దుకుని కదల్ని సుఖాంతం చేస్తారు. మధ్యలో చిన్న చిన్న రాళ్లు అడ్డువచ్చిన సెలఏటి మీది నావలా సాగిపోతుండే ఈ నవల, మధ్యతరగతి స్త్రీల అంతరంగ గానం.