డా|| మల్లెమాల వేణుగోపాలరెడ
ఆటో వచ్చి ఇంటిముందు ఆగింది.
గేటు తెరుచుకుని గౌరి పరిగెత్తి లోపలికి వచ్చి ”సార్! సార్… మా నాయ్న గసపోసుకుంటున్నాడు. నోట మాట రావడం లేదు…. ఆటోలో వున్నాడు… మీరు చూడండి సార్” అంది.
గౌరికి పన్నెండేళ్లు. ఆ పిల్ల నాయన శివయ్య. గౌరి కళ్లనిండా నీళ్లు. ఆటోలోనుంచి శివయ్యను దించి ఓ.పీ. లో కూర్చోబెట్టారు గంగమ్మా, గౌరి. ఆటో డ్రైవర్ సహాయం.
చూసాను. అస్థిపంజరానికి తోలుకప్పినట్టున్నాడు. కళ్లలో కాంతి లేదు… ఊపిరి అందడం లేదు… నాకు నమస్కారం పెట్టడానికి చేతులెత్తబోయాడు… చేతుల రాలేదు. దగ్గుతూ… గస. పరీక్షించి చూసాను… గుండె బలహీనంగా వుంది. నాడి అందడం లేదు. వెంటనే రిమ్స్ (మెడికల్ కాలేజి హాస్పిటల్) కు ఎమర్జెన్సీ వార్డుకు ఫోన్ చేసి అడ్మిట్ చేసుకోమని చెప్పాను. శివయ్యను ఆటో ఎక్కించాము.
గంగమ్మ వరలక్ష్మి దగ్గరకొచ్చి ఏడుస్తూంది. ఓదార్చింది వరలక్ష్మి ”అంతా ఖర్మ మేడమ్! ఈ సచ్చినోడు నిన్ననే ఇంటికి దిగబడ్డాడు ఇదిగో… ఇదీ పరిస్థితి” తల బాదుకుంటూ చెప్పింది. ”సరే! సరే! సార్ ఫోన్ చేసారు గదా! వెంటనే రిమ్స్‌కు వెళ్లండి” చెప్పి గంగమ్మనూ, గౌరినీ ఆటో ఎక్కించి పంపాం.
గంగమ్మకు అరవై దాటింది. భర్త చనిపోయాడు. బిడ్డలు లేరు మేనకోడలు మునెమ్మని పెంచుకోండి. మృత్యుంజయకుంటలో బేల్దారి మేస్త్రీవద్ద కూలిపని జేసుకునే శివయ్యకిచ్చి పెళ్లి చేసింది…. సంవత్సరంలోపు… గౌరి…. గౌరీప్రియను పుట్టించాడు… రాను రాను అర్థమైంది.
”వాడొట్టి తాగుబోతు, తిరుగుబోతు… సోమరిపోతు. ఒకరోజు పనిజేస్తే రెండ్రోజులు జల్సా- పైగా ఆంబోతులా…. సానికొంపల్లో ఎక్స్‌ట్రాలు… నేరక వాడికిచ్చి చేసి మునెమ్మ గొంతుకోసాం” గంగమ్మ మాటల్లో శివయ్య.
గంగమ్మ, మునెమ్మను మా యింట్లో పనికి పెట్టింది. వరలక్ష్మికి సాయంగా… మేమిచ్చే జీతం కూడా మునెమ్మను కొట్టి తీసేసుకుంటాడట వాడు.
”మేడమ్! నా మొగుడు చెడిపోయినోడు…. అత్తకు నేనెళ్లని బరువు గౌరిని స్కూల్లోపడేసి కువైట్ పోతున్నా… సారూ, మీరే ఆ పిల్లని సూస్కోండి. గంగమ్మత్తకు గౌరి అంటే ప్రాణం. గౌరికీ దాని జేజి అంటే అంతే ఇష్టం. అది పని పిల్ల. ఐదేల్లే” చెప్పి, గంగమ్మనూ, గౌరినీ మాకప్పగించి కువైట్ వెళ్లిపోయింది.
కువైట్ వెళ్లిన మునెమ్మ ఒకసారి వచ్చి ఓ లక్ష రూపాయలు గౌరిపేరున బ్యాంకులో డిపాజిట్ వేసి తిరిగి వెళ్లిపోయింది. ఎనిమిదేళ్ల గౌరి మునెమ్మను పట్టుకుని ఏడ్చింది.
ఊర్లు తిరుగుతూ, ఆర్నెల్లకొకసారి వచ్చి, నెలనెలా మునెమ్మ పంపే డబ్బుల్ని గంగమ్మను బెదిరించి లాగేస్కుని వెళ్లిపోయే వాళ్లు. అమెరికాలో మా మనవరాలి చుడీదార్లను మా అమ్మాయి పంపితే గౌరికిచ్చేస్తుంది వరలక్ష్మి. గౌరికి తీరిక సమయంలో పాఠాలు చెప్తుంది. గంగమ్మకు సాయంగా ప్రొద్దున్నే మా యింటి పనికివచ్చి ఎనిమిదికల్లా వెళ్లి తయారై స్కూలుకెళ్తుంది గౌరి… బాగా చదువుకుంటుంది- తీరిక సమయాల్లో వరలక్ష్మి గౌరికి పాఠాలు చెపుతుంది. రోజూ ప్రొద్దున ఒక గ్లాసుడు పాలు, టిఫిన్ ఇస్తుంది.
వేసవి సెలవులకి అమెరికానుండి వచ్చిన మా మనవరాలు ”గౌరీ! గౌరీ! అనిపించి చదరంగం ఆడుతుంది. గౌరి ముగ్గులు వేయడం నేర్చుకుంటుంది.
శివయ్య వస్తే ”నాయనా! ఇంక నన్నొదిలి ఎక్కడికెళ్ళపోకే!” అని గట్టిగా వాణ్ణి పట్టుకుని ఏడిస్తే ”ఫోవే… ఫో! మీ జేజి వుందిగా… పట్టుకుని ఏడువు” విదిలించుకుని వెళ్లిపోతాడు.
గంగమ్మకు వాడిమీద జాలి…. బతిమిలాడి, కొంగుపట్టుకుని డబ్బు గుంజుకుంటారు.
మునెమ్మ నెలకోసారి అదివారం మాఫోన్‌కి ఫోన్ చేస్తుంది గౌరితో మాట్లాడిస్తాం.
శివయ్యకు మమ్ముల్ని చూస్తే భయం. వాడి రోగాలు, రొస్టులన్నీ బయట పడిపోతాయని… మాకంటబడడు.
ఏడాది క్రిందట మునెమ్మ కువైట్‌నుండి వచ్చి రెండు లక్షలు గౌరి పేరున బ్యాంకులో వేసి, ఐదు తులాల బంగారం వరలక్ష్మి దగ్గర జాగ్రత్త పెట్టి వెళ్లింది… మృత్యుంజయ కుంటలో దొంగల భయం. పైగా శివయ్య పీడ. ఇప్పుడు శివయ్యకు క్షయ రోగం, కిడ్నీ పనిచేయడంలేదు. హెచ్.ఐ.వీ. పాజిటివ్…. గౌరికి కూడా హెచ్.ఐ.వీ. చెయ్యించాను. నయం. గౌరి నెగెటివ్…. గంగమ్మ గోప్యంగా వుంచమని బతిమిలాడింది… మునెమ్మకు అంతకు మునుపే, మొదటిసారి కువైట్ నుంచి వచ్చినప్పుడే శివయ్యకు ఎయిడ్స్ వుందని తెలుసట. గౌరి భవిష్యత్తుకోసం…. గోప్యత…
గౌరి ఏడుస్తూ వచ్చింది.
”మేడమ్! మా నాయన రిమ్స్‌లో చచ్చిపోయాడు. జేజి అక్కడేవుంది. మా చిన్నాయన వచ్చి తోడున్నాడు… మిమ్మల్ని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పమనింది జేజి.” ఏడుస్తూ మోకాళ్లమీద తలపెట్టుకొని కూర్చుంది గౌరి. వరలక్ష్మి పాలు, టిఫిన్ ఇస్తే… తీసుకోలేదు.
కువైట్‌లో అర్థరాత్రి… అయినా మునెమ్మకు ఫోన్ చేసింది వరలక్ష్మి. వెంటనే రమ్మంది.
”సావనీండి మేడమ్… ముదనష్టపోడు. నాకింకా రెండు నెలలకు గానీ ఇండియాకు వచ్చే వీలులేదు… నేను గంగమ్మత్తతో మాట్లాడుతాను. మనీ పంపుతాను… పూడ్చిపెట్టమనండి…” కఠినంగా జవాబు. ఇదో గౌరితో మాట్లాడు… ఫోన్ ఇచ్చారు.
”అమ్మా! నువ్వు రాయే… నాకు భయంగా వుంది…” ఆ పిల్ల స్వరలలో కొతుకు.. గద్గదికం… మునెమ్మ మాట్లాడుతున్నంతసేపూ… తల వూపుతూ ”ఆఁ! సరే! సరే!” మళ్లీ కాసేపు మౌనం… ఎడమచేత్తో కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. ఫోన్ వరలక్ష్మికి ఇచ్చింది.
నా స్కూటర్ మీద గౌరిని ఎక్కించుకొని రిమ్స్‌కెళ్లాను. డాక్టర్లతో మాట్లాడాను. పోస్ట్‌మార్టమ్ చెయ్యాలన్నారు… ఎయిడ్స్ రోగి కదా! అట్నుంచి అటే దొరల గోరీల కాడ శివయ్య శవాన్ని పూడ్చిపెట్టే ఏర్పాటు చేసాను. గంగమ్మ పదకొండో రోజు పదిమందిని పిల్చి భోజనాలు పెట్టింది.
గౌరికి వేసవి సెలవులు… గంగమ్మకు మోకాళ్ల నొప్పులు. పనిచేయలేక పోతోంది- గౌరీయే పనులన్నీ. ముగ్గులు బాగా నేర్చుకుంది. ఉగాది ముగ్గుల పోటీలో బహుమతి అందుకుంది. టైలరింగ్ నేర్చుకుంటూ వుంది. గౌరి పుష్పవతి అయింది. మునెమ్మకు ఫోన్ చేసింది గంగమ్మ రెండు నెలల తర్వాత మునెమ్మ వచ్చి పుష్పగిరి ఏడ్ల తాళి తెంచి, బొట్టు చెరిపేసి, తలకు పోసుకొని, మృత్యుంజయకుంట శివాలయంలో పూజ చేసి, అభిషేకం చేయించింది. గౌరిని గురుకుల బాలికల హాస్టల్లో చేర్పించింది. ఆ తర్వాత నాలుగు నెలలూ మునేమ్మా మా యింటి పని. గంగమ్మకు కొంత విశ్రాంతి…
”సార్! నేను మళ్లీ కువైట్ వెళ్తున్నాను. ఇంకో ఐదేళ్లు అక్కడ పనిజేస్తే, గౌరిని కాలేజిలో చదివించి, పెళ్లి చేసే వసతి కలుగుతుంది. మేడమ్! గౌరిని మీరే చూడాలి. అప్పుడప్పుడు హాస్టల్ వార్డెన్‌కి ఫోన్ చేసి ఆ పిల్లను గురించి అడుగుతుండండి. ఇంకో నాలుగు రోజుల్లో నా ప్రయాణం… మేడమ్! గంగమ్మత్త మీకెవరైనా మంచిపనిమనిషిని చూస్తానని చెప్పింది. అంతదాకా అత్తనే వచ్చి కొంత సాయం చేస్తుంది.” మునెమ్మ అన్నీ అప్పగింతలూ చేసి ప్రయాణమైంది. సుమోలో ఆమెతోపాటు గంగమ్మా, గౌరి, మా అకౌంటెంటు వెళ్లి చెన్నైలో విమానం ఎక్కించి వచ్చారు.
గంగమ్మకు బి.పీ. ఎక్కువైంది. కాటరాక్ట్ ఆపరేషన్ చెయ్యించుకుంది. మోకాళ్ల నొప్పులు… పనిచేయడం కష్టంగా వుంది.
ఒకరోజు ఓ ఇరవై ఏళ్ల యువతిని వెంటబెట్టుకొచ్చింది గంగమ్మ. వరలక్ష్మితో ”మేడమ్! ఈ యమ్మిని మన ఇంట్లో పనికి పెట్టుకోండి. మా వీధిలోనే వుంటున్నారు వీళ్లు… ఈమె, ఈమె అక్క, అక్క కూతురు, కొడుకు. వీళ్లు హైదరాబాదునుంచి వచ్చి ఆర్నెల్లనాడు మాయింటి ప్రక్కనే ఒక చిన్న పోర్షన్లో ఉంటున్నారు. ఈయమ్మి అక్క బస్టాండు దగ్గర బిర్యానీ సెంటర్లో పనిచేస్తుంది… బీదరికం… మగతోడు లేదు. మీ దగ్గరైతే భద్రంగా వుంటారనుకొని తీసుకొచ్చాను. సార్ కూడా వున్నారా! సరే”
ఆ అమ్మాయిని నేను చూసాను. నీరసంగా కనిపించింది. చెవుల్లో దూది వత్తులు పెట్టుకోమంది…. పంజాబీ డ్రెస్‌లో….
”నీ పేరేమిటమ్మాయి?” వరలక్ష్మి అడిగింది.
”పూజిత… మేడమ్. మా అక్క సుజాత నాకంటే నాలుగేళ్లు పెద్దది”
”చెవిలో దూది ఏమిటి?”
”ఇక్కడే రిమ్స్‌లో మూడు నెలల ముందు సిజేరియన్ ఆపరేషనైంది. చిన్న పాప వుంది. మా అక్కకు బిర్యానీ సెంటర్లో రోజుకు రెండు వందలిస్తారు. ప్రొద్దున ఎనిమిదికెళ్లితే, సాయంత్రం ఐదుకు వదులుతారు… ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమిపెట్టడం… అక్కడే ప్రొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం వచ్చేప్పుడు బిర్యానీ తెస్తుంది. అదే మాకందరికీ రాత్రికి…” చెప్పుకు పోతూంది పూజిత.
”పిల్లల్ని గవర్నెంటు స్కూల్లో చేర్పించారు…. పిల్లకి పదేళ్లు… పిల్లాడికి ఎనిమిదేళ్లు” గంగమ్మ చెప్పింది.
”ఇంకా బాలింతగానే వున్నావు… పనిచేయగలవా?” అడిగింది వరలక్ష్మి.
”ప్రొద్దునే వచ్చి చేసిపోతా మేడమ్! మా అక్క అందాకా పాపను చూసుకుంటుంది. మళ్లీ సాయంత్రం వచ్చిన తర్వాత అక్కకు పాపనిచ్చి నేను వచ్చి మీకు పనిచేసి ఇచ్చిపోతా!” ఆ అమ్మాయి ముఖంలో వేదనాపూర్వక ప్రార్థన.
వరలక్ష్మి నావైపు చూసింది. కళ్లతో నేనా అంగీకారాన్ని తెలిపాను.
”సరే! రేపట్నుంచి పనిలోకి రా! జీతం నీ పనిచూసి ఇస్తాం…”
ఆ అమ్మాయి నమస్కరించింది.
”సరే! పూజా! బాగా పనిచేసుకో. డాక్టరమ్మా, సార్ మంచోళ్లు. నీ ఆరోగ్యం కూడా సక్కబడతాది” గంగమ్మ ఆమె వెన్ను తట్టి చెప్పింది.
మర్నాడే తెల్లవారి ఆరు గంటలకే పూజ వచ్చి పని మొదలెట్టింది. కాంపౌండ్ ఊడ్చి, ఇల్లు శుభ్రం చేసి, పాత్రలు కడిగి ఇచ్చింది. వంట మనిషి వచ్చేదాకా వుండి వెళ్లిపోయింది. పూజకు సాయంగా ఆమె అక్క కూతురు… పదేళ్ళ ‘ఆశ’. ఇద్దరికీ చెరో గ్లాసు పాలు ఇచ్చింది వరలక్ష్మి. రోజూ రొటీన్‌గా పనిచేసుకెళ్తున్నారు. వేసవి సెలవుల కారణంగా ఆశ రోజూ వాళ్ల పిన్నికి సాయంగా వస్తున్నది.
ఒకరోజు ప్రొద్దున ఆశ ఒకతే వచ్చి పొరక పట్టుకుంది…
”మేడమ్! పాప ఏడుస్తూంది. పిన్ని ఆలస్యంగా వస్తుంది. నేను పనిచేసి వెళతా”.
ఆ పిల్ల సన్నగా ఇరవై కేజీలు కూడా వుండదేమో… ఎడమ చెయ్యి వాటం. జింకలా పరగెడుతుంది. ఇంటి ముందు ముగ్గులేస్తే… మోడ్రన్ ఆర్ట్‌లా… పిచ్చి గీతలు. పది నిమిషాలు వొంగి పనిజేస్తే, వొళ్లు విరుచుకుంటుంది.
ఇంకో రోజు ప్రొద్దున ఏడు గంటలకు
”పిన్నీ! పిన్నీ …. పాప గుక్కపట్టింది. పాలకేడుస్తుందంట. అమ్మ చెప్పింది.
ఇదిగో ఆశ తమ్ముడు ‘చందు’ పాపను ఎత్తుకొని వచ్చి పూజితను పిలిచాడు…
”ఆశా! మీ పిన్ని మేడమీద వున్నట్టుంది. పిలువు… పాప ఏడుస్తూంది”
వరలక్ష్మి కేకేసింది. వరలక్ష్మిది జాలిగుండె.
పూజ వచ్చి పాపను ఎత్తుకుని రొమ్ము అందించి పాలు పట్టిందనుకుంటా. ఏడుపు మానేసింది.. పాపను తీసుకుని చందూ, ఆశ వెళ్లిపోయారు. పూజిత కండ్ల నీళ్లు తుడుచుకుంటూ నా కంటపడింది. అదో దీనావస్థ.
”పూజా! పని ముగించి నాతో మాట్లాడిపో!” అన్నాను.
పూజ కుటుంబ వివరాలు అడిగాను.
”మాది విజయవాడ… పటమట… మా నాయన చిన్నప్పుడే చనిపోయాడట. మా అమ్మే మమ్మల్ని సాకింది. నాకు పదేళ్లు, అక్కకు పద్నాలుగేళ్ళ వయసులో మమ్మల్ని తీసుకుని హైదరాబాదొచ్చేసింది. మాకో మేనమామ ఉన్నాడు విజయవాడలో.. మా నాన్న తమ్ముడు చిన్నాన్న… అందరూ అక్కడే… కానీ వాళ్లెవ్వరూ మాకు సహాయం లేదు. అంతా మోసగాళ్లే.
హైదరాబాద్‌లో, బోరుబండ పక్కన పర్వతనగర్‌లో ఒక ఫ్యాక్టరీలో అమ్మ పనికి చేరింది. రోజు కూలీ… నన్ను స్కూల్లో చేర్చింది. ఆ ఫ్యాక్టరీలోనే పనిజేసే శ్రీనివాస్, అదే మా బావతో మా అక్కకు పద్నాలుగేళ్లకే పెళ్లి చేసేసింది. మా బావ ఎలక్ట్రీషియన్… ఆశ, తర్వాత చందూ పుట్టిన సంబరాలు జరుపుకున్నాం. ఆ తర్వాత ఎలక్ట్రిక్ షాక్‌తో బావ చనిపోయాడు… బావ చనిపోయి ఆరేళ్ళైంది. అక్క కూడా పనికి పోయేది. ఫ్యాక్టరీ వాళ్ళిచ్చిన ‘కాంపెన్సేషన్’ పిల్లల పేరున డిపాజిటైంది. నేను పదో తరగతి చదివాను. అమ్మ అనారోగ్యంతో పని మానేసింది. నన్ను చదువు మాన్పించి సిటీలో ఒక హోటల్లో పనికి పెట్టింది అమ్మ… అక్కడే రాజేష్ పరిచయమయ్యాడు. అక్కడే అతను సప్లయర్.
అదో తెలియని… ఏదో తెలియని పిచ్చి… ప్రేమేనేమో… ఆ మత్తులో పడిపోయాం. అమ్మనూ, అక్కనూ ఒప్పించి గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి రాజేష్ అమ్మా, నాన్నలు రాలేదు. ఆర్నెల్ల తర్వాత ఒకరోజు హోటల్ దగ్గరికొచ్చి రాజేష్‌ని లాకెళ్లి పోయారు వాళ్లు”
పూజ తలవంచుకొని ఏడుస్తూంది. వరలక్ష్మి వచ్చి ఓదార్చ జూసింది.
”అంతా నా దురదృష్టం మేడమ్… అప్పటికి నేను మూడు నెలల గర్భవతిని… కఠినంగా నన్నొదిలేసి వెళ్లిపోయాడు. కరీంనగర్ వాళ్ల సొంతూరు… మా అమ్మ బెంగతో అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత కొద్ది కొద్ది రోజులకే చనిపోయింది.” మళ్లీ ఏడుపు.
”మేము అనాధలమై పోయాం… ఆ తర్వాత తెలిసింది రాజేష్‌కి ఇంకో పెళ్లి చేసే ప్రయత్నంలో వున్నారని” ఈసారి ఎక్కిళ్లు తోడయ్యాయి.
”పోలీస్ రిపోర్టియ్యక పోయారా?” అన్నాను.
”పోలీసోళ్లకు లంచమిచ్చి లొంగించుకున్నారు. మాకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత నేను పనిచేసే హోటల్ యజమానిది ఈ ఊరే. ఇక్కడ బిర్యానీ సెంటర్ వాళ్లదే… ఆ ఓనరే మమ్మల్ని ఇక్కడికి పంపాడు… ఆర్నెల్ల గర్భంతో నేనూ, ఆశనీ, చందునీ తీస్కొని అక్కా ఈ ఊరొచ్చేసాం. గంగమ్మవ్వ మాకు కొంత అండ”.
ఆశ వచ్చింది ”పిన్నీ అమ్మ పనిలోకెళ్లాలట… నిన్ను రమ్మంది!!
ఆశతో పాటు పూజను కూడా పంపించేసాం..
ఒకరోజు సాయంత్రం… గుండెలు బాదుకుంటూ గంగమ్మ, తలవంచుకొని ఏడుస్తూ గౌరి… వంటింటి వైపు వచ్చి… ”మేడమ్! సార్! గోరం జరిగి పోయింది. గౌరిని వాళ్ల హాస్టల్ డిప్యూటీ వార్డన్… లంజా కొడుకు, బలాత్కారం చేసాడంట… నాలుగు దెబ్బలేసి, లొంగదీసుకున్నడంట. ఈ పిల్ల తప్పించుకుని ఆటో పట్టుకుని వచ్చింది…” గంగమ్మ కూలబడిపోయింది. గౌరి నేలమీద కూర్చుని మోకాళ్లలో తల దూర్చి బోరును ఏడుస్తూ… గుండెలవిసే దృశ్యం.
”మీరు వెంటనే పోలీస్ రిపోర్టివ్వండి” వరలక్ష్మి చెప్పింది.
”మేడమ్! మునెమ్మకు ఫోన్ చెయ్యండి. దాన్ని వచ్చేయ మనండి.
”నేనింక ఈ పిల్లను సాకలేను” గంగమ్మ వరలక్ష్మి కాళ్ళు పట్టుకొంది. మేము మునెమ్మకు ఫోన్ చేయలేదు.. ఆ రాత్రికి గంగమ్మను, గౌరినీ మా యింటివద్దే ఉంచుకున్నాం. రాత్రి గౌరికి ఆశ తోడుగా పడుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసాను. ఎవరూ ఫోన్ ఎత్తలేదు. నేనే స్వయంగా వెళ్లాను. ఇన్‌స్పెక్టర్ టీబిల్ మీద కాళ్లు చాపుకొని, సిగరెట్ తాగుతూ..
గౌరి విషయం చెప్పాను.
”చూడండి సార్! ఇలాంటి కేసులు రోజూ వస్తుంటాయి. ఎంక్వయిరీ చేస్తాం. మీరు రిపోర్టు రాసిచ్చిపోండి” నిర్లక్ష్యంగా జవాబు. రిపోర్టు రాసిచ్చాను. మర్నాడు గురుకుల హాస్టల్ కెళ్లాను. ప్రిన్సిపాల్‌ని కలిసాను. ”అతను పరారీలో వున్నాడు. మీరు గౌరిని తీసుకొచ్చి వదలి వెళ్లండి. ఇంక అలాంటివి జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాం.”
గౌరి ససేమిరా అంటుంది… ముక్కవారి పల్లె గురుకుల హాస్టల్లో చేర్చాలని తీర్మానించుకున్నాం. అక్కడైనా ఎంత రక్షణ ఉంటుందో…
ఆశ రోజూ సాయంకాలం మా టీవీ ముందు కూర్చుంటుంది. చీకటి పడిందని వరలక్ష్మి లేపి పంపితేగానీ ఇంటికి పోదు.
ఈ రోజు … టీవీలో ”పిల్లలు… పిడుగులు” షో… టీవీలో నవ్వుల్లో కలిసిపోయి ఆశ… విరగబడి నవ్వుతూంది… మధ్య బ్రేక్‌లో ”న్యూస్” ఛానల్లో…
”గుంటూరులో ఎనిమిదేళ్ళ బాలిక మీద సామూహిక అత్యాచారం.. స్కూలునుండి తిరిగి వచ్చేటప్పుడు, ఆటోలో ఎక్కించుకుని, నగర శివారు చెట్లచాటున నలుగురు యువకుల.. సామూహిక మానభంగం. మీడియా వాళ్ల మధ్య ఆ అమ్మాయి. హాస్పిటల్లో… తల్లిదండ్రుల ఆక్రందనల మధ్య… గుండెలు అవిసేలా ఆశ కెవ్వున కేకవేసి, లేచి నన్ను గట్టిగా పట్టుకుంది. గజగజ వొణికి పోతూంది. భయం… భయంతో కళ్లు మూసుకుంది.
కరెంటు ఆగిపోయింది. చీకటి… చీకటి.
నెమ్మదిగా ఆశను, వాచ్‌మేన్ తోడుతో ఇంటికి పంపించాను. వీధిలైట్లు వెలగడం లేదు- అంతా అంధకారం. దట్టమైన చీకటి ఆ చీకట్లో .. కళ్లుమూసుకున్నా … కళ్లక్రిందా చీకటీ… సమస్యల వలయాలు సుడులు తిరుగుతూ… ఆ వలయాలలో మునెమ్మ, గౌరి, సుజాత, పూజిత, ఆశ… అందరూ అభద్రతతో… జనారణ్యంలో మానవ మృగాలను తప్పించుకుని పరిగెత్తుతూ అడవిలోనూ దట్టమైన చీకటి… అడవి దాటి… ఎడారి… జనసంచారం లేదు. అక్కడా చీకటే… చీకటిదారి …. చుట్టూ ఎడారి.