– జూపాక సుభద్ర
నిన్న (7-7-2013) రాత్రి ఆరున్నరనించి తొమ్మిదిన్నరదాకా ఇందిరాపార్కు సమీపంలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఆడిటోరియంలో, మట్టిపూలు రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో బహుముఖ సాంస్కృతిక ప్రజ్ఞాశీలి చంద్రశ్రీ మొదటి వర్ధంతి సందర్భంగా ‘చంద్రశ్రీ యాదిలో…’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కారంచేడు పోరాట నాయకురాలు డాక్టర్ ప్రజ్ఞ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కవయిత్రి జూపాక సుభద్ర అధ్యక్షత వహించిన ఈ సభలో గాయకురాలు, తెలంగాణా ఉద్యమ నాయకురాలు విమల, గేయ రచయిత, గాయకుడు జయరాజ్, రచయిత్రి, పరిశోధకురాలు గోగు శ్యామల, లెల్లె సురేష్, నీలిజెండా పక్షపత్రిక అసోసియేట్ ఎడిటర్ గనుముల జ్ఞానేశ్వర్, ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్, కవి, అనువాదకుడు డాక్టర్ జి.వి. రత్నాకర్, సీనియర్ పాత్రికేయుడు యింద్రవెల్లి రమేష్, కృపాకర్ మాదిగ, రచయిత, పరిశోధకుడు సీతారాం, హారతీ నాగేశన్, ఇంకా చంద్రశ్రీ కుమారుడు గురు, చంద్రశ్రీ అక్క కరుణశ్రీ, చంద్రశ్రీ సన్నిహిత స్నేహితురాలు రేఖ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు, కవి, గాయకుడు సంతోష్, సోషిత్ సమాజ్ నాయకుడు రామలింగం, సెక్రటేరియట్ ఉద్యోగ మహిళా నాయకులు, ఇఫ్లూ విద్యార్థులు, చంద్రశ్రీ అభిమానులు చాలామంది పాల్గొన్నారు. ఉద్వేగభరితంగా చంద్రశ్రీని, ఆమె జీవితాన్ని, సేవలను, స్నేహాన్ని, పోరాటాలను, ప్రతిభాపాటవాలను గుర్తు చేసుకున్నారు.
13 వ్యాసాలు, 6 పాటలు, 3 కవితలు గల ఈ పుస్తకాన్ని ప్రత్యామ్నాయ సంస్కృతులు, అధికారంలో పంపిణీ న్యాయం, సమానత్వాలు గురించి పనిచేసే, ఆలోచించే బహుజనులంతా చదివితే బాగుంటుంది.