– తూము విజయ్‌కుమార

19వ శతాబ్దంలో మన సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ఉత్తర భారతదేశంలో రాజా రామమోహన రాయ్‌, దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌, కేశవచంద్రసేన్‌, ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన ప్రముఖులు సంస్కరణలు చేపట్టారు. ఆనాటి ఈ ఉద్యమాల ప్రభావం కవులు, రచయితల మీద పడింది. అభ్యుదయ భావాలు గల యువరచయితలెందరో స్త్రీ విద్యాభివృద్ధి పట్ల స్పందించి, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ వారిని చైతన్యవంతుల్ని చేసేందుకు రచనలు సాగించారు. అటువంటివారిలో గురజాడ అప్పారావు ప్రముఖుడు.

సామాజిక అభివృద్ధికి స్త్రీ విద్య ముఖ్యమైందని ఈయన భావించారు. స్త్రీ విద్యావంతురాలయితే తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని, స్త్రీలో అజ్ఞానం తొలగిపోయి, ఆర్థికంగా కూడా స్వతంత్రంగా జీవిస్తుందని ఆశించారు. స్త్రీ సమస్యలకు శాశ్వత పరిష్కారమార్గం చూపించుటకోసం ప్రయత్నం చేశారు. నిరక్ష్యరాస్యత ఎక్కువగావున్న తెలుగునేలలో కన్యాశుల్క నాటకం ప్రధానోద్దేశం తెలియజేసి ప్రజలకు కనువిప్పు కల్గిస్తుందని భావించారు. ఈ నాటకంలో బాల్యవివాహాల ప్రోత్సాహం, కన్యాశుల్కం, వేశ్యావృత్తి, కోర్టు కేసులు, పాశ్చాత్య విద్యా వ్యామోహం మొదలైన సమస్యలను పరిశీలిస్తూ నాటకం చివరిలో గిరీశం అనే పాత్రతో బుచ్చమ్మ పెళ్ళి జరిపించడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని తలచి బుచ్చమ్మకు పెళ్ళి జరిపించక విద్యావంతురాలయితే విజ్ఞానవంతురాలై, సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుందని ఆశించారు. అందుకే నాటకం చివరిలో గిరీశంతో సౌజన్యారావు ఇలా అన్నాడు ”బుచ్చమ్మను నీవు ఇప్పుడు పెళ్ళాడడము వీలులేదు. ఆ పిల్లను రామాబాయి గారి విడోస్‌ హోమ్‌కు పంపించి విద్య చెప్పించవలసిందని వీరయ్య పంతులు గారి పేర వ్రాసినాను.

రామాబాయి బెంగాలీని పెళ్ళి చేసుకొని తర్వాత వితంతువయింది. అప్పుడు ఈమె దేశమంతటా పర్యటించి సాంఘిక సంస్కర్తలకు ఆలవాలమైన పూనాలో ఆర్య మహిళా సమాజాన్ని స్థాపించింది. కాని ఆ సంస్థకు సరియైన ఆదరణ లభించక విసిగి వేసారిపోయి క్రిస్టియన్‌గా మారింది. 1889లో పూనాలో ‘శారదా సదన్‌’ అనే విద్యాసంస్థను స్థాపించి పలువురికి సహాయం చేసింది. ఆ రోజుల్లో ఈ శారదా సదన్‌ అనేకమందికి ఆశ్రయాన్ని కల్పించింది. రామాబాయి వికాస్‌ హోమ్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి గురజాడ నాటకంలో బుచ్చమ్మకు విద్య నేర్పిస్తే సరిపోతుందని సూచనగా చెప్పి సరియైన మార్గం చూపించాడని చెప్పవచ్చును.

‘దిద్దుబాటు’ కథానిక ద్వారా కూడా స్త్రీ విద్యను ప్రోత్సహించాడు గురజాడ. ప్రాచీనులు స్త్రీని ఎంత ఉన్నతస్థానంలో ఉంచి గౌరవించారో అదే విధంగా ఇందులో కథానాయకురాలు ‘కమలిని’ పాత్ర అద్వితీయంగా చిత్రీకరించబడింది. ఇదే విషయాన్ని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఇలా ప్రశంసించారు.

”అప్పారావుగారు చిన్న కథలు వ్రాశారు. వాటిలోనొకటి ‘దిద్దుబాటు’. అది ఇప్పటికీ అద్వితీయమే. అది మొట్టమొదట ముట్నూరివారి ‘ఆంధ్రభారతి’ మొదటి సంచికలో పడినపుడు రసికాంధ్రలోకం వూగిపోయింది. ఈ మాటల్ని బట్టి సంస్కరణ కోసం గురజాడ రచించిన చిన్న కథానిక కూడా ఆంధ్ర ప్రజానీకాన్ని ఆలోచింపజేసింది. అంటే స్త్రీ విద్య గురించి ప్రజల దృష్టి కేంద్రీకరించబడిందని చెప్పవచ్చు. ఈ విధంగా సామాజిక స్పృహ కలిగిన ప్రజానీకానికి తన రచనల ద్వారా చైతన్యాన్ని కలిగించేందుకు కృషి చేశాడనడంలో అతిశయోక్తి లేదు.

ఈ కథలో కథానాయకుడు గోపాలరావు సానిమేళం మోజు నుంచి తప్పుకోలేక లోకోపకార ఉద్యమాలకు, మీటింగులకు వెళ్తున్నానని అబద్ధం చెప్పుతుండేవాడు. తర్వాత తన భార్య కమలిని ద్వారా తాను చేసిన తప్పు పనిని తెలుసుకున్నాడు. మనసు మారి పశ్చాత్తాపంతో స్త్రీ విలువ ఎంత ఉన్నతమైందో పనిమనిషి రాముడితో ఈ విధంగా చెప్పాడు. ”భగవంతుడి సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీరత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచి యిచ్చాడ. ఇంగ్లిషువాడు భార్య బెటర్‌ హాఫ్‌ అన్నాడు.” ఇందులో కమలిని విద్యావంతురాలు కాబట్టి సేవకుడు రాముడి సహాయంతో తన భర్తను సక్రమ మార్గంలో పెట్టుకుంది. అదే చదువులేని స్త్రీ అయితే పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులకు భారమయ్యేది. అందుకే ఇందులో కమలిని తన సమస్యకు తానే పరిష్కారం చూసుకుంది.

గురజాడ రచించిన నాటకం ‘బిల్హణీయం’లో రాజకుమారి యామినిదేవికి బిల్హణుడు విద్య నేర్పుటకై నియమింపబడ్డాడు అని తెలిసి పండితుడైన మాధవవర్మ దుర్మార్గుడగుట వలన ఎనలేని అసూయ, ద్వేషాలను పెంచుకున్నాడు. బిల్హణుడు యామినిదేవికి విద్య నేర్పబోవడం సహించలేకపోయాడు. మాధవవర్మలోని రాక్షల లక్షణాల వలన కలిగే నష్టాలు భగవద్గీత 9వ అధ్యాయంలో ఉన్నవని బిల్హణుడు చెప్తాడు. విద్యలో స్పర్థ పెరిగితే విజ్ఞానం పెరుగుతుందని మహారాజుతో అనిపించాడు.

గురువుకన్న శిష్యుడు గొప్పవాడు కావలెనని పట్టుదల ఉన్నప్పుడే అపారమైన విజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుందని అన్నాడు. అందుకే రాజకుమారికి సంగీత సాహిత్యాలలోను, తర్క వ్యాకరణంలోను నేర్చుకొన్న విద్య సరిపోదని భగవద్గీత విజ్ఞాన సాధనమని బోధించారు. వారిద్దరి మధ్య విద్య గురించి తర్కం జరుగుతుంది. స్త్రీ విద్యా విజ్ఞానముల వల్ల తర్కసహితంగా వాదించే స్థాయికి ఎదుగగలదని నిరూపించారు.

స్త్రీలు వెనుకబడి ఉండడానికి కారణం విద్య లేకపోవడమే అని గురజాడ భావించారు. అవిద్య వలన అజ్ఞానం పెరిగి సాంఘిక కట్టుబాట్లకు తలవంచి సమస్యను స్వయంగా పరిష్కరించుకొనే అవకాశం లేదని కాబట్టి స్త్రీకి విద్య ఎంతో అవసరమని గురజాడ గుర్తించారు. అందుకే తన రచనల్లో అక్కడక్కడ స్త్రీవిద్యా ప్రాశస్త్యాన్ని గురించి వివరించారు. ముఖ్యంగా కన్యాశుల్కం నాటకంలో వితంతువైన బుచ్చమ్మకు ఆనాటి సంస్కరణల కారణంగా ఆమెకు పునర్వివాహం జరిపించి ఆ సమస్యకు పరిష్కారం చూపించవలసి ఉండగా, అలా కాకుండా ఆమెను రామాబాయి విడోస్‌ హోమ్‌కు పంపించి విద్యావంతురాలిని చేయించమని చెప్పడం గమనించదగిన విషయం. దీనినిబట్టి గురజాడ స్త్రీ విద్యాభివృద్ధిని ఎంతగా కోరుకున్నాడో, తర్వాత కలిగే సామాజిక చైతన్యాన్ని ఎంతగా అభిలషించాడో తెలుస్తున్నది.

‘మీ పేరేమిటి’ కథానికలో కృష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ విద్యావంతురాలు. మతం పేరుతో మన వాళ్ళయ్య, శరభయ్య చేసే మోసాల్నించి ప్రజల్ని కాపాడి తెలివితో చాకచక్యంగా వారి సమస్యను పరిష్కరించింది. నాంచారమ్మ విద్యావంతురాలు కావడం వల్లనే తన మామ రంగాచార్యుల ప్రాణాల్ని కాపాడి సర్వమత సామరస్యం కోసం కృషి చేసింది.

గురజాడ బాల్యవివాహాలను నిరసించారు. ”కన్యాశుల్కం” నాటకంలో వెంకమ్మ సంప్రదాయంగా పెరిగినప్పటికీ నాటి సమాజంలో బాల్యవివాహం సర్వసాధారణం అని తెలిసి కూడా ధర్మశాస్త్రాన్ని, తన భర్త మూర్ఖత్వాన్ని వ్యతిరేకించింది. కరటక శాస్త్రి ఈ విషయమై అగ్నిహోత్రవధాన్లతో మాట్లాడితే అది విఫలమవుతుందని బాధపడ్డారు. అప్పుడు గిరీశం వెంకమ్మతో కన్యాశుల్కంపై, బాల్యవివాహంపై ఒక గంట లెక్చరిస్తే ఆయన మనసు మారుతుందని ప్రగల్భాలు పలికాడు. ఇంతలో కరటక శాస్త్రి తనలో నీవు ఒక గంట లెక్చరిస్తే నీ వంటి మీద అతను రెండుగంటలు లెక్చరిస్తారు అని అనుకొన్నాడు. ఈ మాటల్ని బట్టి అగ్నిహోత్రావధాన్లు చేయాలనుకున్న పనిని ఎంత పట్టుదలతో చేస్తాడో స్పష్టంగా అర్థమవుతుంది. అగ్నిహోత్రావధాన్లు చదువుకున్నవాడైనప్పటికీ మంచిచెడులను ఆలోచించక కేవలం డబ్బుకోసం కక్కుర్తిపడి ఈ దౌర్భాగ్యపు సంబంధాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అంతకంటే పట్టుదలగా సంప్రదాయ విరుద్ధమైనా కూడా ఈ పెళ్ళి జరగటానికి వెంకమ్మ ఇష్టపడదు. అయితే కరటక శాస్త్రి ఈ సంబంధాన్ని తప్పించడం కోసం శిష్యునికి ఆడవేషం వేసి మధురవాణి సహాయంతో లుబ్దావధాన్లకిచ్చి పెళ్ళి జరిపించి తర్వాత మాయమవుతాడు. కుటుంబంలోని వారికి ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేక మాయోపాయంతో బయటపడే విధానం అపహాస్యంగా వున్నా కూడా ఇటు బాల్యవివాహాలు సమాజ ప్రగతి నిరోధకమని స్పష్టపరిచారు గురజాడ.

‘కన్యక’ గేయంలో కులం కన్నా గుణం మిన్న అనీ, అధికారం కన్ను కాననివ్వదనీ చాటారు. రాచరిక వ్యవస్థ లోపాన్ని, సమాజంలో స్త్రీ దుస్థితిని గురజాడ అద్భుతంగా వర్ణించారు.

”కాసువీసం కలిగివుంటే చాలుననుకొని

వీర్యమెరుగక, విద్యనేర్చక

బుద్ధిమాలినచో

కలగవా యిక్కట్లు” అని మేల్కొని బుద్ధి బలాన్ని పెంచుకోమంటుంది.

”ఆదికాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన, ఆధునికకాలంలో గురజాడ మన తెలుగులో మహాకవులు” అని శ్రీశ్రీచే ప్రశంసించబడిన గురజాడ, కౌసల్యమ్మ, వెంకటరామదాసు దంపతులకి విశాఖ జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరంలో 21-9-1862న జన్మించినారు. సాహిత్యం ద్వారా సాంఘిక సంస్కరణ, దేశభక్తి, మానవతావాదం, హేతువాదం ప్రబోధించిన ‘అమితమైన మితవాది, మితమైన తీవ్రవాది’ గురజాడకు దేవునికంటే మనిషి ముఖ్యం. మతం కంటే సమాజం ప్రధానం. ప్రజలకోసం రచనలు చేసిన గురజాడ ప్రజల భాషలోనే రాశాడు.

దేశమును ప్రేమించమని, మంచి అన్నది పెంచమని ప్రబోధించి అజరామరుడయ్యాడు, గురజాడ. ”గురజాడ రచనలన్నీ నష్టమైపోయి ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలును అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించదగిన మహాకవి అని రుజువు కావడానికి” ఇది శ్రీశ్రీ ప్రశంస. ”శ్రీ కందుకూరి వీరేశలింగం మహాపురుషుడు కాగా, శ్రీ గిడుగు వెంకటరామమూర్తి మహాపండితుడు కాగా, శ్రీ గురజాడ అప్పారావు మహాకవి” అని నార్ల వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు. ”కొత్తతరానికి గురువెవరంటే గురజాడ అని నేనంటాను” అని దాశరథి, ”గురజాడ తెలుగు సారస్వతానికి సరిహద్దు” అని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ప్రశంసించారు.

డాక్టర్‌ ద్వా.నా.శాస్త్రి అన్నట్లుగా గురజాడ అప్పారావు అక్షరాలా ద్రష్ట. స్రష్ట. అచ్చమైన మహాకవి. అసలైన సంఘసంస్కర్త.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.