– మల్లిక్‌ మరియు సమాఖ్య రిపోర్టు కమిటీ సభ్యులు

దక్షిణ భారత ఆదివాసీల ఉమ్మడి సమస్యల పరిష్కారం కొరకు జాతీయ స్థాయిలో ఒక సమష్టి ప్రయత్నం రెండు సంవత్సరాల క్రితం (2011, నవంబరు) ”దక్షిణ భారత ఆదివాసీ సమాఖ్య” పేరుతో ప్రారంభమైంది. దీనిలో భాగంగా గత సంవత్సరం ఏప్రియల్‌ 15, 16 తేదీల్లో నాలుగు రాష్ట్రాల ప్రతినిధులతో, ఒక సదస్సు ఇదే రేఖపల్లిలో నిర్వహించబడింది. దీనిలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలపై ఆ ప్రతినిధులంతా తిరిగి జూలై 13, 14 తేదిల్లో కలసి చర్చించారు. దానికి కొనసాగింపుగా 5వ సదస్సును మళ్ళీ రేఖపల్లిలోని ఎ.యస్‌.డి.యస్‌.లోనే రెండురోజులపాటు ఏర్పాటైంది. ఆరు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కర్నాటక, తమిళనాడు, కేరళ) నుండి 17 సంఘాలకు చెందిన మొత్తం 75 మంది ఆదివాసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రారంభం: సభ్యులందరికీ ఆదివాసీ సంప్రదాయ నృత్య, సంగీతాలతో స్వాగతం పలకడంతో ఆనందోత్సాహాల మధ్య సదస్సు జూలై 13, ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ముందుగా వ్యవసాయ మరియు సాంఘిక అభివృద్ధి సంస్థ (ఎ.యస్‌.డి.యస్‌.) కార్యదర్శి గాంధీబాబు గారు సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, సమాఖ్య అవసరాన్ని, ఇంతవరకు జరిగిన కృషిని, ప్రస్తుతం సదస్సు ముందున్న సవాళ్ళను ప్రస్తావించారు.

సమస్యల తీవ్రత: నేడు గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా అభివృద్ధి విధానాలు, వాటి కింద వస్తున్న పథకాలు కార్యక్రమాలు, న్యాయపరమైన చట్టాలు మొదలైనవన్నీ ఆదివాసీ సుస్థిర జీవనానికి, సమగ్రతకు, ఇంకా చెప్పాలంటే అస్థిత్వానికే ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయి. స్థానికంగా కనిపించే చిన్న చిన్న సమస్యలకు సహితం మూలాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని విధాన నిర్ణయాల్లో దాగి వుంటున్నాయి. నేడు ప్రపంచీకరణ, సరళీకృత వాణిజ్య విధానాలు మారుమూల ఆదివాసీ గ్రామాలను కూడా శాసించే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజవనరులు భూమి, అడవి, గనులు మొదలైనవి దోచుకుపోవాలన్న ఆదివాసేతర పెట్టుబడిదారీ వర్గాల కుట్ర చుట్టూనే ఈ విధానాలన్నీ తిరుగుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రజలందరిపైనా ఒకేవిధమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆదివాసీల అస్థిత్వాన్ని కూకటివేళ్ళతో పెకలించడానికి ప్రయత్నిస్తున్న ఈ శక్తులు చాలా తీవ్రమైనవి. వీటిని ఎవరికివారు వ్యక్తిగతంగా ఎదుర్కోవడం అసాధ్యం, బలమైన ఈ శత్రువును ఎదుర్కొనడానికి ఆదివాసీలంతా సమైక్యం కావడం ఒక్కటే మార్గం. దీన్ని తప్పక గుర్తించాలి.

ప్రభుత్వాల పాత్ర: నేటి ప్రభుత్వాలు బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, రక్షణ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బదులుగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్టు శక్తులకు కొమ్ముకాస్తూ వారికి అనుకూలమైన విధానాలనే ప్రోత్సహిస్తున్నాయి. కిలో బియ్యం రూపాయి వంటి పథకాలు ఎరవేసి, వేల కోట్ల రూపాయల విలువచేసే ఆదివాసీ సంపదను దొడ్డిదారిన దోపిడీ చేస్తున్నాయి. ఆదివాసీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం అంటూనే ఆ పీట వేసుకొనే జాగా కూడా లేకుండా భూమినంతా లాక్కొంటున్నాయి.

మన కర్తవ్యం: ప్రస్తుత అభివృద్ధి విధానంలో గిరిజనుల భాగస్వామ్యం ఎంత? జరిగే మేలెంత? అసలు వుందా? లేకపోతే మనం ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? వనరుల రక్షణకు మనకున్న చట్టాలను ఈ పరిస్థితుల్లో ఎలా కాపాడుకోవాలి? లేని వాటిని ఎలా సాధించాలి. చట్టాల అమలులో మన భాగస్వామ్యం ఏమిటి? అలాంటివి ఎన్నో ఈ వేదిక ముందున్న ప్రధాన సమస్యలు. వీటిపై అక్కడ చర్చ జరిగి, భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయం తీసుకోవాలి.

అయితే గత అనుభవాలు మనకు కొన్ని చేదునిజాలను గుర్తుచేస్తున్నాయి. ఇతర నాయకత్వాలతో పోల్చితే, ఆదివాసీ నాయకత్వంలో సరియైన చిత్తశుద్ధి, పఠిష్టత, ఎదుగుదల కన్పించడం లేదు. ఎక్కడైనా అటువంటి నాయకత్వం ఉన్నా, రాజకీయాలకో, మరో ప్రలోభానికో లొంగిపోవడం, స్వార్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంది. సమాఖ్యల విషయానికి వస్తే, వీటిదంతా ఆరంభశూరత్వమేనన్న ప్రచారం ఒకటి బయట బలంగా వినిపిస్తుంది. మన సమాఖ్య ఈ అపవాదును తొలగించుకొని, ఒక గట్టి పట్టుదలతో నిజమైన లక్ష్యాల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకొని మన సమాఖ్య ముందుకు సాగుతుందని ఆశిస్తున్నానని చెప్పి, గాంధీబాబు కార్యక్రమ నిర్వహణా బాధ్యతను స్థానిక నాట్వాన్‌ సంఘానికి అప్పగించారు. సమాఖ్య కార్యదర్శి మత్తడి (కర్ణాటక), ఇతర సభ్యులు సుమతి (కేరళ), నాగమణి (ఆంధ్రప్రదేశ్‌), బుజ్జమ్మ (ఆంధ్రప్రదేశ్‌) వేదిక నిర్వహణను చేపట్టారు.

ప్రధానవక్త ప్రసంగం: పరిచయాల కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రస్తుత ఆదివాసీ సమస్యలపై ఒక అవగాహనను, సమాఖ్య ద్వారా చేపట్టగలిగిన అంశాలను వివరించడానికి ప్రధాన వక్తగా విచ్చేసిన పల్లా త్రినాథరావు గారు కొన్ని ముఖ్యవిషయాలు వివరించారు. అవి:

”భారతదేశంలో గిరిజన ప్రాంతాలు, అక్కడి పాలనాపరమైన ఏర్పాట్లు, వ్యవస్థలు, ప్రభుత్వపాత్ర, చట్టాలు, పథకాలు, వాటి అమలు దేశమంతా ఒకే విధంగా లేదు. దీన్నిబట్టే సమస్యల్లో కూడా భిన్నత్వం చాలా ఎక్కువగా ఉంది. అయితే భిన్నమైన ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఉమ్మడి పోరాటం అనేది నేడు తప్పనిసరి అవసరం. దాన్ని గురించి దక్షిణ భారత ఆదివాసీలంతా ఇలా ఒక వేదికపైకి రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్ని విభేదాలున్నా… భారతదేశం మొత్తం మీద గిరిజనుల్లో అంతర్లీనంగా ఒక భావ సారూప్యత ఉంది. జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన ప్రవర్తన, పూర్తిగా ప్రకృతి వనరులపైనే ఆధారపడి బతకడం, ఒకే విధమైన సమస్యలను ఎక్కువమంది ఆదివాసీలు ఎదుర్కోవలసిరావడం ఇవన్నీ వీరి మధ్య కన్పిస్తున్న ఉమ్మడి విషయాలు.

పాలనాపరమైన విభేదాలు: భారతదేశంలోని మొత్తం గిరిజన ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు రెండు రకాలైన సమస్యలు ప్రధానంగా కన్పిస్తాయి. ఒకటి రాజ్యాంగపరంగా ఏదో ఒక రకమైన రక్షణల (చట్టాల) ను కలిగిన ఆదివాసీ ప్రాంతాల సమస్యలు. రెండవది అటువంటివి ఏవీ అందుబాటులో లేని మామూలు ఆదివాసీ ప్రాంతాల సమస్యలు. సాధారణ పాలన నుండి పూర్తిగా మరియు పాక్షికంగా మినహాయింపబడిన 6వ మరియు 5వ షెడ్యూల్‌ ప్రాంతాలు మొదటి తరగతికి చెందినవి కాగా, కేరళ, తమిళనాడు, కర్ణాటక మొదలైన రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాంతాలు రెండవ తరగతికి చెందినవి. ఈ రకమైన విభజనకు బ్రిటిష్‌ కాలం నాటి భారత ప్రభుత్వపాలనా చట్టం 1935 మూలం.

స్వాతంత్య్రానంతరం కూడా భారత రాజ్యాంగంలోనూ పరిపాలనా చట్టంలోనూ ఇవే అంశాలు తిరిగి పొందుపరచబడ్డాయి. 6వ షెడ్యూల్‌ ప్రాంతాల్లో పూర్తిగా స్వయంపాలన వుంది, అంటే ఇక్కడ పాలన మొత్తం అత్యధిక శాతం ఆదివాసీలు సభ్యులుగా కలిగిన ప్రాంతీయ, జిల్లా, రాష్ట్రస్థాయి అటానమస్‌ కౌన్సిల్స్‌ ద్వారా జరుగుతుంది. కార్యనిర్వాహక, పరిపాలనా బాధ్యతలతోపాటు, శాసననిర్మాణ, న్యాయపరమైన బాధ్యతలను కూడా ఈ కౌన్సిల్సే నిర్వహిస్తాయి. 5వ షెడ్యూల్‌ ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఆదివాసీల ప్రతినిధులుగా ఆయా రాష్ట్ర గవర్నర్లకు, రాష్ట్రపతికి రాజ్యాంగం కొన్ని విశేషమైన అధికారాలు కల్పించింది. మొత్తం 9 రాష్ట్రాల్లో 92 జిల్లాలో ఈ షెడ్యూల్డ్‌ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి సంబంధించి కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయనిర్వహణాధికారాలు గవర్నరుకు ఉన్నాయి. అవి:

జి రాష్ట్ర అసెంబ్లీ లేక పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్ర గవర్నరు ఒక నోటిఫికేషన్‌ ద్వారా 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించకుండా నిలుపుదల చేయవచ్చు. ఉదాహరణకు 1972లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన సివిల్‌ కోర్టుల చట్టాన్ని ఈ 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించకుండా మినహాయించడం జరిగింది. అందువల్ల కేవలం పాత సి.ఆర్‌.పి.సి. మాత్రమే ఇక్కడ అమలవుతుంది. దీనిలో రెవిన్యూ అధికారులే న్యాయవిధులను కూడా నిర్వర్తిస్తారు. సాధారణ కోర్టులతో పోల్చినపుడు ఈ రెవిన్యూ కోర్టులే ఆదివాసీలకు ఎన్నో విధాల మేలైనవి. (వివరాలకు ”మన్నెంలో” గత రెండు సంచికలు చూడవచ్చు.)

జి 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నరు తానే ఒక రెగ్యులేషన్‌ రూపొందించవచ్చు. ఉదాహరణకు 1/70 రెగ్యులేషన్‌.

జి 5వ షెడ్యూల్లో ఆదివాసీలకు అవసరమైన చట్టాలను కొన్నింటిని గవర్నరు ఆదివాసీ సలహా మండలి సహకారంతో తయారుచేస్తారు. ఈ మండలిలో 20 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 3/4వ వంతు మంది ఆదివాసీలే ఉంటారు. గిరిజన శాఖామంత్రి, గిరిజన ఎం.ఎల్‌.ఎ.లు, ఇతర ప్రజ్ఞావంతులు దీనిలో ఉంటారు. వీరంతా కలసి సంబంధిత అంశంపై చర్చించి, గవర్నరుకు సిఫార్సులు చేస్తారు. ఈ సిఫార్సుల ఆధారంగా గవర్నరు చట్టాన్ని రూపొందిస్తారు. ఈ రకంగా చేసిన చట్టాన్ని రాజ్యాంగ చట్టం (్పుళిదీరీశిరిశితిశిరిళిదీబిజి ఉబిగీ) అంటారు. ఇది సాధారణ చట్టాలకంటే ఎక్కువ శక్తివంతమైనది.

అయితే 5వ షెడ్యూల్‌ ప్రాంత పరిధిలోనికి రాని గిరిజన గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో 850 వరకు ఉన్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో చాలా వున్నాయి. ఒక ప్రాంతాన్ని 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంగా, ఒక తెగను షెడ్యూల్డ్‌ తెగగా గుర్తించే అధికారం రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అయితే ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్‌ ప్రాంతంగా, ఒక తెగని షెడ్యూల్డ్‌ ట్రైబ్‌గా ఎలా గుర్తించాలి? అనే దానికి కచ్ఛితమైన ప్రాతిపదిక/పద్ధతి ఏమి లేదు. ఈ విషయమై 1961వ సం||లో దేబర్‌ కమీషన్‌ (ఎంటో చూద్దాం): 1. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు నివసించడం. 2. వారంతా ప్రత్యేక ఆచార, వ్యవహారాలను కల్గి ఉండడం వంటి కొన్ని ప్రమాణాలను సూచించింది. వీటిని అనుసరించి రాష్ట్రప్రభుత్వం ఒక ప్రాంతాన్ని లేక తెగను షెడ్యూల్డ్‌ ప్రాంతంగా లేక తెగగా ప్రకటించమని ఒక ప్రతిపాదనను రాష్ట్ర గవర్నరుకు, గవర్నర్‌ దానిని రాష్ట్రపతికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆ ప్రతిపాదనను పరిశీలించి, ఆ విధంగా ప్రకటించే అవకాశం వుంది. అయితే ఈ విషయంలో చాలా రాష్ట్రాల్లోని ఆదివాసీలకు ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఈ వేదిక పనిచేయడానికి ఇది ఒక ఉమ్మడి అంశం.

స్వయం పాలన: కేంద్ర ప్రభుత్వం1992 సం||లో 243వ రాజ్యాంగ సవరణ ద్వారా 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఆదివాసులకు స్వయం పాలన కల్పించడానికి పంచాయితీ రాజ్‌ చట్టాన్ని (పెసా) రూపొందించింది. దీన్ని అనుసరించి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పంచాయితీ రాజ్‌ చట్టాలను తయారు చేసుకున్నాయి. దీనివల్ల గిరిజనులను ఎన్నో ప్రయోజనాలు సమకూరే అవకాశం వుంది. కాబట్టి ఈ చట్టాన్ని కర్ణాటక, తమిళనాడు, కేరళతో సహా అన్ని రాష్ట్రాలలోని గిరిజన గ్రామాల్లోనొ అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నాన్‌-షెడ్యూల్డ్‌ గ్రామాలల్లోనూ అమలు పరిస్తే ఆదివాసీలందరికీ ఈ లాభాలు కలుగుతాయి. దీన్ని అమలుపరిచే విధంగా ఆయా ప్రభుత్వాలపై ఈ దక్షిణ భారత గిరిజన సమాఖ్య ఒత్తిడిని తీసుకొని రాగలగాలి. ఇది మరొక ఉమ్మడి అంశం.

అటవీ హక్కుల చట్టం 2006: గిరిజనులు తమ భూమిని కాపాడుకునేందుకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 (ఎఫ్‌.ఆర్‌.ఏ) ఒక అస్త్రం. దీనిలో వ్యక్తిగత క్లైములతోపాటు, ఉమ్మడి ఆస్తులపై సామూహిక హక్కుపత్రాలను పొందడానికి కూడా అవకాశం వుంది. చిన్న తరహా చేపల చెరువులు, పవిత్ర స్థలాలు, దేవతలను కొలిచే ప్రదేశాలు, ఆవాస స్థలాలు, స్మశానాలు మొదలైన వాటి విషయంలో ఈ సామూహిక హక్కులు పొందవచ్చు. ఎఫ్‌.ఆర్‌.ఎ. కింద ఒక కుటుంబం 10 ఎకరాల వరకు పట్టా పొందే అవకాశం వుంది. ఈ పట్టాలను పొందడానికి మూడు అంచెల్లో 3 కమిటీల ఆమోదం కావాలి. వీటిలో మొట్టమొదటిది గ్రామసభ. ఈ గ్రామసభలో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీ ద్వారా పోడు భూమికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రతిపాదన ఆర్‌.డి.ఓ. అధ్యక్షతన గల డివిజనల్‌ కమిటీకి, ఇక్కడి నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన గల జిల్లాస్థాయి కమిటీకి చేరి ఆమోదం పొందుతుంది. అయితే పోడు భూములకు పట్టాలను పొందే క్రమంలో గిరిజనులకు అటవీ అధికారులతోనే ప్రధాన సమస్య. సాధారణంగా మనం ఒక వ్యక్తిగత క్లైమ్‌ చేసినప్పుడు, డిశంబరు 13, 2005కు ముందు ఆ గిరిజనులు అక్కడ పోడును నరకలేదని, వ్యవసాయం చేయలేదని వారు వాదిస్తుంటారు. అయితే చట్టంలో చెప్పిన 15 రకాల సాక్ష్యాలలో ఏ రెండు సాక్ష్యాలను గిరిజనులు చూపించగలిగినా ఆ పోడు భూమిని పొందే అవకాశం వుంటుంది. ఇందుకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సమాఖ్య ఒక కీలకమైన పాత్రను పోషించడానికి అవకాశం వుంది.

భూరియా కమిటీ సిఫార్సులు: ఆదివాసీ ప్రాంతాలలో స్వయంపాలనకు పంచాయితీ రాజ్‌ చట్టం రూపకల్పన నిమిత్తం అవసరమైన సూచనలు చెయ్యడానికి ఏర్పాటైన భూరియా కమిటీ ఎన్నో సిఫార్సులను చేసింది. అవన్నీ చట్టంలో చోటు చేసుకోలేకపోయాయి. గ్రామస్థాయి, బ్లాకు స్థాయిల్లో పూర్తి స్వయంపాలనను సాధించడమే ఈ సిఫార్సుల లక్ష్యం. సిఫార్సుల్లో కీలకమైన అంశాలు అనేకం చట్టంలో విడిచిపెట్టబడ్డాయి. ఉదాహరణకు:

జి ఆదివాసీ గ్రామాలను తిరిగి వర్గీకరించాలి.

జి షెడ్యూల్డ్‌ గ్రామాలలో పోలీసుల జోక్యం అంతగా ఉండరాదు. గ్రామసభల అనుమతి లేకుండా పోలీసులు గ్రామాల్లో ప్రవేశించడానికి కూడా అవకాశం వుండరాదు.

జి ప్రభుత్వం ఇక్కడ ఏ విధమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ముందుగా గ్రామసభ అనుమతి పొందాలి.

జి మద్యం షాపుల ఏర్పాటు, కొనసాగింపు, క్రమబద్ధీకరణ విషయంలో గ్రామసభకు పూర్తి అధికారం వుండాలి.

జి చిన్నతరహా అటవీ ఉత్పత్తుల పైన కూడా పూర్తి అధికారం గ్రామసభకు ఉండాలి.

జి గిరిజన గ్రామాలలో వడ్డీ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించే అధికారం పూర్తిగా గ్రామసభకే వుండాలి.

జి చిన్నతరహా నీటివనరులను నిర్వహించే, పరిరక్షించే పూర్తి అధికారం గ్రామసభకు వుండాలి.

జి చిన్నతరహా ఖనిజ వనరులను వేలం వేసి, అమ్మే అధికారం గ్రామసభకు మాత్రమే వుండాలి.

జి సంతలను నిర్వహించుకొనే అధికారం గ్రామసభలదే.

జి మండలస్థాయి అభివృద్ధి పనులు, బడ్జెట్ల పర్యవేక్షణ, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ చౌకధరల దుకాణాలు, ఐ.సి.డి.యస్‌. తదితర పథకాల పర్యవేక్షణ మొదలైనవన్నీ మండలస్థాయి, పంచాయతీ పాలన కింద వుండాలి.

జి వీటి సాధనకు దేశవ్యాప్తంగా సంఘటిత కృషి చాలా అవసరం. సమాఖ్య భవిష్యత్తులో ఈ అంశాలపై పనిచెయ్యాల్సిన అవసరం తప్పనిసరి.

జి వీటి సాధనతోపాటు గిరిజన చట్టాలను దేశంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు ఖచ్ఛితంగా వర్తింపచేయడం వంటి ముఖ్యమైన అంశాలపై సమాఖ్య ఉమ్మడిగా పనిచేయడానికి చాలా అవకాశం వుందని చెప్పి ముగించారు.

మత్స్యకారుల సమస్యలు: అనంతరం విశాఖ జిల్లాకు చెందిన మత్స్యకారుల సమాఖ్య (కెరటం నెట్‌వర్క్‌) నుండి హాజరైన తెడ్డు శంకరుగారు మాట్లాడుతూ, బడుగు బలహీనవర్గాలకు చెందిన సముదాయాలుగా సముద్ర చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులు సహితం ఆదివాసీల్లాగానే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. గిరిజనులు అడవితో అవినాభావ సంబంధాన్ని కల్గి వున్నట్లే, మత్స్యకారులు సముద్రంతో విడదీయరాని సంబంధాన్ని కలిగి వున్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు కల్పించిన హక్కులు, చట్టాలను తిరిగి తానే కాలరాస్తుంది. నిజానికి మత్స్యకారులకు కొత్తగా చట్టాలు ఏమి తేకపోయినా పర్వాలేదు ఉన్న చట్టాలు, తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి చట్టం, ఎం.ఎఫ్‌.ఆర్‌.ఎ. (ఖ.ఓ.ష్ట్ర.జు.) వంటివి సక్రమంగా అమలుచేస్తే చాలు. నేడు తీర ప్రాంతంలో ప్రతిపాదిస్తున్న పవర్‌ ప్లాంట్లు, ఓడరేవుల నిర్మాణం, కోస్టల్‌ కారిడార్లు, ఇతర పరిశ్రమల ద్వారా మత్స్యకారుల ఉనికికే ప్రమాదం వాటిల్లనుండి. ఏటా 3 వేల కోట్ల రూ||ల ఆదాయం చేపల రవాణా ద్వారా ప్రభుత్వానికి వస్తుంది. దానిని విస్మరించి, నేటి ప్రభుత్వాలు, అభివృద్ధి పేరుతో అగ్రరాజ్యాలకు, బహుళజాతి కంపెనీలకు తీరాన్ని ధారాదత్తం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలుల ద్వారా ప్రజలకు ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి, వారి భూమిని స్వాధీనం చేసుకొని చివరకు వారిని నట్టేట ముంచుతుంది. అలాగే పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గిరిజనులకు అందిస్తామని తెలిపి, తరువాత వీరిని రోడ్లపై నిలబెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం సంఘటితమై మన హక్కుల కోసం కలసి పోరాడితే తప్పా విజయం సాధించలేము. కాబట్టి మనం పరస్పరం సంఘీభావం అందించుకుందామని ఆయన సూచించారు.

రాష్ట్రాలవారిగా కార్యక్రమాలు: సమాఖ్య కార్యక్రమాల్లో భాగంగా గత సంవత్సరం ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాలను వరుసగా ప్రతినిధులు వేదికపై వివరించాము. అటవీ హక్కుల చట్టం అమలుకు గ్రామాల్లో భూములను గుర్తించి, వీటిని గ్రామసభలచే ఆమోదింపచేయడం నుండి పట్టాలను పొందే వరకు ప్రక్రియ మొత్తం కొనసాగేందుకు అవసరమైన సేవను అందించడం, సమస్యల పరిష్కారమునకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు, మధ్యవర్తిత్వం వహించడం, పంచాయితీరాజ్‌ చట్టం (పెసా) అమలుకు కృషి చేయడం, సమాఖ్యను బలోపేతం చేయడానికి ఆయా ప్రాంతాల్లో ప్రచారం, ప్రాంతాలవారీ సమస్యల గుర్తింపు, పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేయడం, ఉపాధి హామి పథకం అమలు, ప్రభుత్వ కమిటీల్లో భాగస్వామ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారం, విద్య, వైద్య కార్యక్రమాల అందుబాటుకు కృషి వంటివి అనేకం ఆయా రాష్ట్రాల్లో చేపట్టినట్లు సభ్యులు తెలియజేసారు.

2వ రోజు సమావేశాన్ని ప్రారంభిస్తూ శ్రీ పి.యస్‌. అజయ్‌కుమార్‌ గారు ముందురోజు త్రినాథ్‌ గారు చెప్పిన 5వ షెడ్యూల్‌ ప్రాంతాలు, వాటి ఆవశ్యకతలను తిరిగి గుర్తుచేసారు. అసలు వీటికున్న ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా అనేక జవాబులు వచ్చాయి.

5వ షెడ్యూల్‌ ఉపయోగాలు

ఓ 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనుల భూముల విషయంలో బదలాయింపులకు వీలు లేకుండా 1/70 చట్టం ద్వారా రక్షణ ఉంది.

ఓ రెవిన్యూ అధికారులే సివిల్‌ తగాదాలను పరిష్కరించే విధానం ఉండడంవల్ల న్యాయం జరిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వీటిలో డాక్యుమెంటుకు కాకుండా వాగ్రూప/ మౌఖిక ఆధారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండడం గిరిజనులకు ఎక్కువ లాభం చేకూర్చుతుంది.

ఓ చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు అధికారం వుంటుంది. మైదాన ప్రాంతాలలోని గిరిజనులకు అలాంటి అవకాశం లేదు.

ఓ గ్రామసభలు బలంగా ఉంటాయి. వాటి తీర్మానాలకు విలువ ఉంటుంది.

ఓ అటవీ హక్కుల చట్టం వర్తిస్తుంది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణపై ప్రత్యేక హక్కులు ఉంటాయి.

ఓ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ నుండి వచ్చే లాభాలన్నింటినీ పొందవచ్చు.

ఓ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజనులకు ఉన్న ప్రత్యేక హక్కులకు అవకాశాలు ఉండవు.

5వ షెడ్యూల్‌ ప్రాంతాల చరిత్ర: ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌, షెడ్యూల్డ్‌ ప్రాంతాల చరిత్ర కొంత వివరించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన భారత ప్రభుత్వ చట్టం 1935లో వారు కొన్ని ప్రాంతాలను 6వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగానూ, మరికొన్ని ప్రాంతాలను 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగానూ నిర్ణయించారు. అయితే వీటిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో తెలియదు. అలాగే కొన్ని రాష్ట్రాల్లోని (కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌…) గిరిజన ప్రాంతాలను పూర్తిగానూ మరియు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఆదివాసీ ప్రాంతాలను ఈ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఎందుకు చేర్చలేదో కూడా మనకు తెలియదు. అయితే ఒక ప్రాంతాన్ని ఆదివాసీ ప్రాంతంగా, లేక ఒక తెగను ఆదివాసీ తెగగా గుర్తించే అధికారాన్ని భారత రాజ్యాంగం రాష్ట్రపతికి అప్పగించిందని చెప్పుకున్నాం కదా! ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత కేంద్రం నుండి ఆయా రాష్ట్రాలకు షెడ్యూల్డ్‌ తెగల, గ్రామాల జాబితా పంపమని ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈ ఉత్తర్వులు అన్ని రాష్ట్రాలకు పంపారా? కొన్నింటికే పంపారా? అలాగే గతంలో వున్న గ్రామాల జాబితానే తిరిగి పంపమన్నారా? కొత్తవి కూడా కలపమన్నారా? ఇవేమీ మనకు అంతుచిక్కని ప్రశ్నలు. అయితే 1935 నుండి 1950 మధ్య ఏ ఒక్క గ్రామం కూడా అదనంగా ఈ జాబితాలో చేర్చబడలేడు. బ్రిటిష్‌ కాలంలో ఏవైతే గ్రామాలు 5వ షెడ్యూల్డ్‌లో ఉన్నాయో, ఆ తరువాత కూడా అవే గ్రామాలు భారతప్రభుత్వ చట్టంలో చేర్చారు. ఎందుకిలా జరిగిందనేది ఒక పెద్ద మిష్టరి. నిజం చెప్పాలంటే దీని నేపధ్యంపైన ఒక పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

ఆ తరువాత 70వ దశకంలో ఆదివాసీ శ్రేయోభిలాషులైన ఐ.ఎ.ఎస్‌. అధికారులు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కొందరు, బ్రిటిష్‌ కాలంలోనూ స్వతంత్ర భారతదేశంలోనూ ఒకే విధమైన ఆదివాసీ పాలనా ప్రాంతాలు ఉండడం ఎంతవరకూ సమంజసం? పూర్వం నుండీ ఎన్నో ఆదివాసీ ప్రాంతాలు షెడ్యూల్డ్‌ ప్రాంతానికి బయటనే ఉండిపోయాయి, వాటికి వేటికీ ఈ రక్షణలు, స్వాతంత్య్ర ఫలాలు అందించకపోవడం ఎంతవరకూ న్యాయం? అనే చర్చను లేవదీసారు. ఫలితంగా రెండవసారి కేంద్రం నుండి కొత్తగా ఆదివాసి గ్రామాలను సిఫార్సు చేయమంటూ రాష్ట్రప్రభుత్వాలకు సర్యులర్స్‌ అందాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను పంపాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ విషయంలో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా ప్రతిపాదిత గ్రామాలు షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ప్రకటించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు మాత్రం ఈనాటి వరకూ ఎందుకు పెండింగ్‌లో వున్నాయి? అలాగే ఈ రెండవసారి కూడా కేరళ, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఎందుకు తమ ప్రతిపాదనలు పంపలేదు? అసలు వాటిని కేంద్రం ప్రతిపాదనలు పంపమని అడగలేదా? అడిగితే ఈ రాష్ట్రాలు పంపలేదా? వీటికి మన వద్ద సమాధానాలు లేవు. ఇది కూడా పరిశోధన చేయదగ్గ అంశం.

ప్రస్తుతం ఉన్న అవకాశం: గతంలో జరిగినదేదో జరిగింది. ఇప్పుడు మనం సమాఖ్య ద్వారా తిరిగి షెడ్యూల్డ్‌ ప్రాంతాల గుర్తింపునకు గట్టిగా కృషి చేయాలి. ఇందుకు ప్రస్తుతం మనకు కొన్ని అవకాశాలు… ముఖ్యంగా రెండు అనుకూలమైన అంశాలు ఉన్నాయి, ఒకటి దిలీప్‌సింగ్‌ భూరియా కమిటీ సిఫార్సులు. ఆదివాసీ ప్రాంతాలన్నిటినీ తిరిగి వర్గీకరించాలని, అన్నింటినీ 5వ షెడ్యూల్‌ పరిధిలోనికి తీసుకొని రావాలని కమిటీ చాలా గట్టిగా చెప్పింది. రెండవది ఎన్‌.ఎ.సి (నేషనల్‌ అడ్వైజరీ కమిటీ) చైర్మన్‌ సోనియా గాంధిచే నియమించబడిన దీపాజోషి కమిటీ సిఫార్సులు. మావోయిస్టు సమస్యల దృష్ట్యా ‘పెసా’ చట్టం అమలు తీరుపై సూచనలు చేయడానికి ఈ కమిటీ నియమించబడింది. ఈ కమిటీ కూడా ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ తప్పక 5వ షెడ్యూల్‌ పరిధిలోనికి తేవాలని సూచించింది.

ఈ రెండు కమిటీలు ఇదే ప్రభుత్వంచే నియమింపబడినవి. పైగా ఈ రెండూ కూడా షెడ్యూల్డ్‌ ప్రాంతాల గుర్తింపును ప్రధాన అంశంగా సిఫార్సు చేసాయి. కాబట్టి వీటిని గుర్తుచేస్తూ మనం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. అన్ని రాష్ట్రాల నుండి నేరుగా రాష్ట్రపతికి, ప్రధానికి, సోనియాగాంధీకి ఉత్తరాలు రాయడం, ఇతర కాంపెయిన్‌ పద్ధతుల ద్వారా సమాఖ్య పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టాలి. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి సంబంధించి చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. అవి:

రెండు రోజుల వర్క్‌షాపు: దేశంలో కొన్నిచోట్ల 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలు ఉన్నాయి, కొన్నిచోట్ల లేవు. ఇవి లేకపోయినా, కొన్నిచోట్ల ఆదివాసీల సంక్షేమంనకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు, జి.ఓ.లు, రెగ్యులేషన్స్‌ లాంటివి అనేకం ఉండవచ్చు. ముందుగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించిన అన్ని అంశాలను, చరిత్రను కూలంకషంగా తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ఇందుకోసం సమాఖ్యలో వున్న ప్రతీ ఒక్క రాష్ట్రమూ ఆయా రాష్ట్రాల స్థాయిలో ఒక రెండు రోజులపాటు సమావేశాన్ని ఏర్పాటుచేసుకొని, ఈ అంశంపై ఆ రాష్ట్రానికి సంబంధించి వున్న అనుకూల, అననుకూల పరిస్థితులపై ఒక సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవడం అనేది సమాఖ్య ప్రథమ కర్తవ్యం కావాలి. రెండవది.

సమాచార సేకరణ: ఆయా రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి, 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తింపబడని రాష్ట్రాల్లో కూడా ఆదివాసీలకు సంబంధించి ఏవో కొన్ని ప్రత్యేక చట్టాలు వచ్చి ఉంటాయనుకున్నాం. అలాగే వివిధ రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (స్త్ర.ంరీ) సర్క్యులర్స్‌, రెగ్యులేషన్స్‌, నోటిఫికేషన్స్‌ మొదలైనవి ఏవో కొన్ని ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. అవన్నీ మన సమాఖ్య దగ్గర ఖచ్ఛితంగా ఉండాలి. ఎక్కడైన ఒక ప్రాంతంలో ఒక మంచి చట్టం లేక ఉత్తర్వు వచ్చివుందని తెలిస్తే, దాన్ని ఇతర అన్ని ఆదివాసీ ప్రాంతాల్లోనూ అమలు జరిగేటట్లు చూడమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఇది పనికివస్తుంది. ఈ రిసోర్స్‌ మెటీరియల్‌ను ఒకదానితో ఒకటి పోల్చుకోవడానికి, రాష్ట్రాలవారీగా మార్పులు, చేర్పుల గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి, రాష్ట్రాల మధ్య సమాచారం పంచుకోవడానికి (క్రాస్‌ లెర్నింగ్‌) ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం చేయబోయే పోరాటానికి ఈ విధమైన రిసోర్స్‌ బ్యాంకు మనకు ఎంతో బలాన్నిస్తుంది.

రిసోర్స్‌ పర్సన్స్‌ గుర్తింపు: ప్రతీ రాష్ట్రంలోనూ ఆదివాసీ సమస్యలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు వారు ఆదివాసీలు కావచ్చు లేక ఆదివాసేతరులు కావచ్చు విశేషమైన కృషిని చేస్తుంటారు. వారు ఈ విషయాల్లో ఎంతో విజ్ఞానాన్ని కలిగి వుంటారు. వారు ఎన్నో కార్యక్రమాలను ఆదివాసీల అభివృద్ధి కొరకు చేపట్టి ఉంటారు. ఇటువంటి రిసోర్స్‌ పర్సన్స్‌ను ప్రతీ రాష్ట్రంలోనూ గుర్తించి, వారితో మన సమాఖ్య సత్సంబంధాలను నెలకొల్పుకోవాలి. మన హక్కుల సాధనకు వారి పూర్తి సహకారాన్ని వినియోగించుకోవాలి. ఈ రకమైన ప్రయత్నం చాలా ముఖ్యం.

ప్రాంతాల గుర్తింపు: అలాగే ఏయే ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించాలి అనే దానిపై ముందుగా మనం ఒక ఎక్సర్‌సైజ్‌ చెయ్యాలి. అందుకు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాలవారిగా గ్రామస్థాయి నుండి చర్చలు జరిపి, జాబితాను తయారుచెయ్యాలి. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే అటువంటి ప్రక్రియ ఇంతకుముందే ఒకటి జరిగింది. దాదాపుగా 800 గ్రామాలు దీని కింద గుర్తించబడ్డాయి. మా ఈ అనుభవాలను అవసరమైతే ఇతర రాష్ట్రాలవారు ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా సమాఖ్య ఒక ప్రణాళికను సంపాదించుకోవాలి.

ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌. (శ్రీష్ట్రజూస్త్రఐ): దేశంలో ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఉమ్మడిగా పనికివచ్చే మరొక కీలకమైన అంశం ఉపాధి హామి పథకం అమలు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆదివాసీలకు ఇది ఎంతో ఉపయోగకరం కూడా. ఎందుకంటే ఇతర గ్రామీణ ప్రాంతాలలలో ఉన్నట్లు ఇక్కడ వేరే పనులు దొరికే అవకాశం తక్కువ. అటవీ ఫసాయం, వ్యవసాయ దిగుబడులు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. బయట ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునే అవకాశం మనకు లేదు. ఆ విధమైన సామర్థ్యాలు కూడా సహజంగా మనకు ఉండవు. కాబట్టి ఇది మనకు ఎంతో ముఖ్యమైనది. నిజానికి ఈ ఉపాధి హామి పథకం అమలు ఒక సమస్య అయితే, ఆదివాసీల దృష్ట్యా చూచినప్పుడు దీనిలో చేయవలసిన మార్పులు, చేర్పులు మరొక సమస్య అవి:

మొదటిది పనిదినాలు. ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు ఎన్నో విధాలుగా వెనుకబడివున్న, పనుల అవసరం ఎక్కువగావున్న ఆదివాసీ ప్రాంతాలకు కూడా 100 రోజులనే కనీస పనిదినాలుగా కేటాయించడం సరియైంది కాదు. దీన్ని 150 లేక 200 దినాలకు పెంచడం అవసరం. రెండవది అన్ని ప్రాంతాలకు ఒకే విధమైన వేతన రేటును అమలుపరచడం. మైదాన ప్రాంతాలతో పాటు, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో కూడా సమానమైన కూలి ఇవ్వడం న్యాయం కాదు. ఉదాహరణకు అన్ని విభాగాల్లోనూ ప్రభుత్వోద్యోగులు ఏజెన్సీ అలవెన్సుల పేరుతో అదనపు వేతనాన్ని పొందుతున్నప్పుడు, ఉపాధి పనులలో ఆదివాసీలకు కూడా ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా అదనపు వేతనాన్ని చెల్లించడం న్యాయం కదా! ఆదివాసీ ప్రాంతాలకు 25 శాతం కూలీ అదనంగా ఇవ్వాలి.

మూడవది నేలల రకాలకు వచ్చినప్పుడు ఈ పథకం కింద మెత్తని నేల, గట్టినేల, రాతినేల అనే మూడురకాల నేలలకు మూడు రకాల వేతనరేట్లను ఇస్తుంది. అయితే ఆదివాసీ ప్రాంతాల్లో చాలాచోట్ల మెత్తని నేల రేట్లను వర్తింపచేస్తున్నారు. ఆదివాసీలు ఉండే కొండల్లో, అటవీ ప్రాంతాల్లో మెత్తని నేలకు అవకాశం ఎక్కడ వుంది? అన్ని నేలలను అయితే గట్టినేల లేక రాతినేలగా పరిగణించి కూలిరేట్లు ఇవ్వాలి. అలాగే ఈ పథకం కింద ఏర్పాటు చేయబడిన అన్నిరకాల పనులు మైదాన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవి. ఆదివాసీ ప్రాంతాలలో ఈ పనులవల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయాలలో సమాఖ్య తనకంటూ ఒక దృక్పథాన్ని ఏర్పరచుకొని, దీనిపై పనిచేయాలి.

పైగా ప్రస్తుతం ఈ పథకం అమలును ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొంటుంది. అలాగే ఉన్నతస్థాయిలో అధికారులు సహితం ఆదివాసీల విషయంలో కొంత సానుభూతి, సహకార ధోరణిని చూపే అవకాశం కన్పిస్తుంది. కాబట్టి ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌. పథకం విషయంలో మన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను వాస్తవిక పరిశీలన ఆధారంగా రూపొందించుకొని, వాటి సాధనకు కృషి చెయ్యాలి.

ఇటువంటి అంశాలను సమాఖ్య గుర్తించి, వాటిపై కాంపెయిన్‌ చెయ్యాలి. ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక రోజు నిర్ణయించుకొని ఈ డిమాండ్లపై పెద్ద ఎత్తున 4 లేక 5 వేల మందితో భారీ ప్రదర్శన నిర్వహించడం లాంటిది చేస్తే అది ఒక మంచి కార్యక్రమం అవుతుంది. స్థానికంగా ఎక్కువమందిని ప్రోగుచేసినా, మిగిలిన రాష్ట్రాల నుండి కనీసం 50-100 మంది అవకాశాన్ని బట్టి పాల్గొనడం చెయ్యవచ్చు. అలాగే పనుల విషయంలో అటవీ అభివృద్ధి, పెంపకం వంటి ప్రాంతీయంగా అనుకూలమైన, ఉపయోగకరమైన పనులను గుర్తించి, వాటి జాబితాను తయారుచేసి, అధికారులకు తెలియజేసి, వాటి అమలుకు ఒత్తిడి తేవడం వంటి పనులు అనేకం మనం చేయవచ్చునని అజయ్‌కుమార్‌ తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

భవిష్యత్తు ప్రణాళిక: అనంతరం సమాఖ్య భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రతినిధులు తమ తమ ఆలోచనలను వివరించారు.

ఓ 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించి సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి రెండురోజుల శిక్షణా శిబిరాన్ని (వర్కుషాపు) నిర్వహించడం, దీనికి సంబంధించి రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిల్లో చర్చలు జరపడం.

ఓ ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణకు సంబంధించి రాష్ట్రంలో జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు, రెగ్యులేషన్స్‌, చట్టాలు మొదలైనవన్నీ సేకరించడం.

ఓ ఆదివాసీ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తులను గుర్తించి, వారితో సంబంధాలను పెంపొందించుకోవడం.

ఓ సమాఖ్య స్థాయిలో ఉమ్మడి కార్యక్రమాలను రూపొందించుకొని, మిగిలిన అన్ని రాష్ట్రాలతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం.

ఓ జాతీయ ఉపాధిహామి పథకం అమలు కొరకు, పనిదినాల పెంపుదల, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు, డిమాండ్లు పంపడం.

ఓ కమ్యూనిటీ సభ్యులతో సంప్రదించి, ఉపాధిహామి పథకానికి సంబంధించి చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను తయారుచేయడంలాంటి అంశాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి.

ముగింపు: సదస్సుకు ముగింపు పలుకుతూ గాంధీబాబుగారు, ఈ రెండురోజుల్లో చాలా క్రొత్త విషయాలను నేర్చుకొన్నందుకు సంతృప్తిని వ్యక్తం చేసారు. ఇక్కడ జరిగిన ఈ చర్చ సమాఖ్య భవిష్యత్తు ప్రణాళికకు, కార్యాచరణకు ఒక మార్గం నిర్దేశించుకోవడానికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నామన్నారు. ఆదివాసీలు ఎక్కడివారైనా, ఎవరివారైనా వారి సమస్యల పరిష్కారమే సమాఖ్య లక్ష్యం కావాలని సూచించారు. ఈ సదస్సుకు హాజరైన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా సమాఖ్య కార్యవర్గం ధన్యవాదాములు తెల్పడంతో సదస్సు ముగిసింది.

– మల్లిక్‌ మరియు సమాఖ్య రిపోర్టు కమిటీ సభ్యులు

మన్యంలో సౌజన్యంతో..

 

 

– మల్లిక్‌ మరియు సమాఖ్య రిపోర్టు కమిటీ సభ్యులు

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.