– ఓల్గా
మాలతీ చందూర్ 30వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమైన అర్థంలోనైనా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం. వ్యక్తికీ వ్యక్తి కోరికలకూ ఆకాంక్షలకూ ప్రాధాన్యత పెరగటం, స్త్రీ పురుషులిద్దరికీ వ్యక్తులుగా గౌరవం, హుందాతనం దొరకాలనే భావాలు యేర్పడటం, స్వేచ్ఛ, స్వతంత్రతల గురించి, హక్కుల గురించి స్పృహ కలగటం, మానవుల బాధలు కేవలం వారి నుదుటి రాతలు, కర్మలే కాదనీ, ఆ బాధలను కొన్ని ప్రక్రియల ద్వారా తొలగించుకునే అవకాశాలున్నాయనే గ్రహింపు, హేతుబద్ధతకు విలువనివ్వటం, విశాలార్థంలో మానవులంతా సమానులనే భావన, ఈ భావనలకు అడ్డువచ్చే సంప్రదాయాలను, ఆచారాలను నిరసించటం, ధిక్కరించటం వీటన్నిటినీ స్థూలంగా ఆధునికతగా చెప్పుకోవచ్చు. ఈ ఆధునికతకు 19వ శతాబ్దిలో మనదేశంలో బీజాలు పడి క్రమంగా బలపడసాగింది. కొన్ని వందల సంవత్సరాల పాటు అమలులో వున్న భూస్వామ్య, పిత్రుస్వామ్య సంస్కృతి 19వ శతాబ్దంలో బీటలు వారటం మొదలైంది. వలస పాలన మీద కూడా వ్యతిరేకత మొదలైంది. అనేకమంది మేధావులు భారతీయ సమాజంలోని అనేక సామాజికాంశాలలో ఆధునికతను కోరుకున్నారు. వలస పాలనలోని భారతదేశంలో సంప్రదాయం, ఆధునికత అనేవి పరస్పరం సంఘర్షించుకుంటూ సహకరించుకుంటూ సాగటంలోనే భారతీయ సామాజికాభివృద్ధి గానీ, చలనం గానీ జరిగింది. సమాజంలో ఆధునికత కోసం మేధోపరంగా జరిగిన సంఘర్షణ, పోరాటం చాలా ముఖ్యమైంది. ఆ సంఘర్షణ సామాన్య ప్రజల జీవితాలలో కూడా ప్రతిఫలించింద.ఇ ఆ ప్రతిఫలనాన్ని మనం ఆధునిక సాహిత్యంలో చూడవచ్చు. సాహిత్యరంగంలో రచయితలు తమ కాలంలోని ఆధునికతను ఎంత వరకు, ఎలా పట్టుకోగలిగారనేది అంచనా వేయటానికి వారి నేపథ్యం కూడా తెలిసి వుండటం అవసరం.
1947వ సంవత్సరం, అంటే భారతదేశం స్వతంత్ర దేశమయ్యే నాటికి ఏలూరులో స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మాలతి 50వ దశాబ్దంలో మద్రాసు వచ్చారు. అప్పటినుంచీ ఆమె సాహిత్య జీవితం ఆరంభమైంది. 50వ దశాబ్దంలో మద్రాసు తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కేంద్రంగా వుంది. మద్రాసులో ఆనాడున్న సాహిత్య వాతావరణం అపూర్వమైనది. దిగ్గజాల వంటి రచయితలు, ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతలందరూ మద్రాసులో ఉన్నారు. ముఖ్యమైన తెలుగు పత్రికలకు కూడా మద్రాసే కేంద్రం. ఆకాశవాణి అక్కడే వుంది. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి కుటుంబరావు, పఠాభి, బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, భమిడిపాటి రాధాకృష్ణ మొదలైన రచయితలంతా అక్కడున్నారు. సినిమా రంగంలో కె.వి. రెడ్డి, బి.యస్.రెడ్డి, చక్రపాణి, నాగయ్య, భానుమతి, పింగళి, మల్లాది మొదలైనవారు కృషి చేస్తున్నారు. ఆ రోజుల్లో మద్రాసులో తెలుగు సాహితీ సాంస్కృతిక రంగం నిరంతర చలనశీలిగా ఉంది. ఆ చైతన్య ప్రవాహంలో చందూర్ గారి జీవిత భాగస్వామిగా మాలతి అడుగుపెట్టారు. చందూర్‌గారు మేధావి, రచయిత, ఆధునిక భావాలున్న వ్యక్తి. ఆనాటి సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోని అనేక పోకడలను అవగాహన చేసుకుని ముందుకు సాగుతున్న యువకుడు. మాలతి ఏలూరు నుంచి వచ్చారు. ఏలూరు చిన్న పట్టణమే గానీ ఆధునిక భావాలలో, రాజకీయ చైతన్యంలో ఆంధ్రలో ముఖ్యమైన ప్రదేశం. నండూరి సుబ్బారావు, చలం వంటి రచయితలు అక్కడ కొంతకాలం నివసించారు. కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతం. మహిళా ఉద్యమం బలపడుతున్న ప్రాంతం. 1946వ సంవత్సరంలో డా|| కొమర్రాజు అచ్చమాంబ ఏలూరు నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున శ్రీమతి అమ్మన్నరాజా పోటీ చేశారు. మహిళలు ఆ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర వహించారు. మాలతి మద్రాసుకు, ఏ మారుమూల ప్రాంతం నుంచో, నిలవనీటి గుంటలాంటి ప్రాంతంనుంచో రాలేదని చెప్పటానికే ఈ వివరాలు. చైతన్యంతో వెలుగుతున్న ఏలూరు నుంచి మరింత విశాల ప్రపంచంలోకి వచ్చారు. ఆ విశాల ప్రపంచం కూడా అప్పుడు సమానత్వ భావాలతో నిండివుంది. 1947లో నెహ్రూ అధ్యక్షుడుగా ఉన్న జాతీయ ప్లానింగ్ కమిటీ ”విమెన్స్ రోల్ ఇన్ ప్లాన్‌డ్ ఎకానమి” అనే అంశం గురించి ఒక రిపోర్టు రాయమని ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ రిపోర్టు స్త్రీల గురించి, చాలా రాడికల్ అవగాహనతో ఉంది. స్త్రీల పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి దేశమంతా ఆలోచిస్తున్న దశాబ్దం 50వ దశాబ్దం.
మాలతి మంచి పాఠకురాలు, పుస్తక పఠనం ఆమెకు వ్యసనం. ఆ వ్యసనం యెంత తారాస్థాయిలో ఆమెకు ఒంట బట్టిందంటే మొత్తం తెలుగువారందరికీ ఆ వ్యసనాన్ని అంటించాలని ప్రయత్నించిందావిడ. తాగండి, తాగండి, ఈ సాహిత్యామృతాన్ని. అనేక జీవితానుభవాలను పిండి, ఫర్మెంట్ చేసి వడగట్టిన జీవనామృతం యిది. ఒక్కసారి తాగితే ఒదిలిపెట్టరు అంటూ ఆ రుచిని పరిచయం చెయ్యటానికి మాలతి నడుంకట్టుకున్నది. ఆ ప్రపంచ సాహిత్య పఠనం ఆమెలోని రచయిత్రికి తొలి పాఠాలు నేర్పింది.
అదలా వుంటే, 50వ దశాబ్దంలో విద్యా, ఉద్యోగ రంగాలలోకి అడుగు పెడుతున్న యువతులకు, యువకులకూ ఎన్నో సందేహాలు. ఇళ్ళుదాటి పాత సంప్రదాయాలు ఒదిలి, కొత్తవాటిని అందుకోవాలంటే భయసంకోచాలతో కంపిస్తూ, జీవితపు కూడలిలో ఎటుపోవాలో, ఏ విలువలు అందుకోవాలో తెలియని అయోమయంలో ఉంది యువతరం. స్వాతంత్య్రం రాకముందు వారికంత అయోమయం లేదు. స్వాతంత్య్ర సాధన గురించి వారికి అస్పష్టత లేదు. కానీ దేశం స్వతంత్రమయ్యాక వారికెన్నో ఆశలు. అభివృద్ధికి, ఆధునికతకూ ఎన్నో నిర్వచనాలు. జీవితాలను మార్చుకోవాలనీ, తీర్చి దిద్దుకోవాలనీ తపనలు. నగరాలలో, కొత్త పరిసరాలలో వచ్చే వైరుధ్యాలను పరిష్కరించుకోవటమెట్లా, తమని తాము కొత్త పద్ధతులలో సంస్కరించుకోవటమెట్లా అని సతమతమయ్యే యువతరానికి ఒక మంచి సలహాదారు, కౌన్సిలరు, తమకు దూరంగా ఉంటూ తమ జీవితాలలోకి కొద్దిగా తొంగిచూచి మంచిమాట చెప్పే పెద్దదిక్కు కావలసి వచ్చింద.ఇ సమష్టి కుటుంబాలలో పెద్దల మాటలూ సలహాలూ క్రమంగా పోతున్నాయి. సమస్యలు, సందేహాలు పెరుగుతున్నాయి. ఎవరితోనైనా పంచుకోకపోతే అవి వాళ్ళను నిలువనివ్వవు. మరీ పరిచయస్తులతో చెప్పుకోటానికి సంకోచం. మనకు ముఖ పరిచయం కూడా లేని వ్యక్తి, మనం కావాలనుకున్నా కలవటం కష్టమైన వ్యక్తి, ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి, మనల్ని వినటానికీ, మన భుజం తట్టటానికీ, మన నెత్తిన మొట్టటానికి వున్నారంటే చాలా రిలీఫ్. అది ఆనాటి సామాజిక అవసరం. అందువల్లనే ‘ప్రమదావనం’ శీర్షిక అంత విజయవంతమయింది. మాలతీచందూర్‌కి అంతకీర్తి వచ్చింది. ఆ రోజుల్లో (యిప్పటికీ) మద్రాసు వెళ్ళినవారికి దర్శనీయ వ్యక్తులలో మాలతీచందూర్ ఒకరు. సినిమా తారలతో సమానమైన గ్లామర్ ఆవిడ సంపాదించటానికి ప్రమదావనం కారణమైంది. మాలతీ చందూర్ ఆంధ్రదేశంలోని అనేక కుటుంబాలలో ఆప్తురాలి స్థానం సంపాదించుకుంది.
ఐతే ఈ పుస్తకం ప్రమదావనం గురించి కాదు. మాలతీ చందూర్ నవలల గురించి, ఐనా ప్రమదావనం గురించి ప్రస్తావించటం దేనికంటే ప్రమదావనంలో ఆమెకు పరిచయమైన లక్షలాది యువతీ యువకులు ఆమెకున్న ప్రపంచాన్ని మరింత విశాలం చేశారు. సమాజంలోని అనేక సమస్యలతో ఆమెకు పరిచయమైంది. రకరకాల మనస్తత్వాలు, జీవన సందర్భాలు ఆమెకర్థమై ఉంటాయి. అవి ఆమె నవలా రచనకు పరోక్షంగా తోడ్పడి ఉంటాయి. ఆంధ్రమహిళా సభ వంటి సంస్థతో సన్నిహిత సంబంధాలుండటం కూడా ఆమెకు భిన్న మహిళా జీవితాలను సన్నిహితంగా తెలుసుకోవటానికి తోడ్పడింది. ప్రపంచ సాహిత్యాన్ని ప్రతినిత్యం కాచి వడపోసిన అనుభవం ఆమె పరిణిత రచయిత్రిగా యెదగటానికి దోహదం చేసింది. ఈ నేపథ్యం క్లుప్తంగానైనా తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే చాలామందికి (రచయితలకు, విమర్శకులకు) రచయిత్రులు ఇంట్లో కూర్చుని కాల్పనిక నవలలు రాస్తారనే అపోహ ఉంటుంది. కొందరి విషయంలో అది నిజం కావచ్చు గానీ ఆ ఒకరిద్దరి ఉదాహరణలతో మొత్తం రచయిత్రులనూ, వారి రచనలను విలువలేకుండా చూసే ధోరణి కొంత కాలం పాటు బలంగాను, ప్రస్తుతం బలహీనంగానూ ప్రచారంలో ఉంది. కొందరు రచయితలు గానీ, రచయిత్రులనూ, వారి రచనలను విలువలేకుండా చూసే ధోరణి కొంతకాలం పాటు బలంగాను, ప్రస్తుతం బలహీనంగానూ ప్రచారంలో ఉంది. కొందరు రచయితలు గానీ రచయిత్రులు గానీ తమ దగ్గరకు వచ్చే పరిమిత వ్యక్తుల అనుభవాలను ఒకే కోణం నుంచి చూసి రాస్తుంటారు. తన జీవితానుభవాలను విశ్లేషించే పని కూడా చేయకుండా, అవే ప్రపంచానికంతా సత్యాలన్నట్టు రాస్తుంటారు. అలాంటి రచనలకూ, నిత్యచలన శీలియైన విస్తృత సమాజంతో సజీవ సంబంధాలుండి రాసిన రచనలకూ, తేడా తప్పకుండా కనపడుతుంది. మాలతీ చందూర్ దృష్టి విశాలమైంది. అనేక జీవితానుభవాలను చూసి, విని, వాటిలో తాను భాగమయ్యారు. అనేక జీవన సమస్యల గురించి తను బాధ్యతతో ఆలోచించాల్సిన అవసరం, ఆలోచించే అవకాశం ఆమెకు ఉండటం నవలా రచయిత్రిగా ఆమెను కలిసి వచ్చింది. ఇక మద్రాసులోని రచయితల స్నేహం, సాహిత్య చర్చలు ఆమె సాహిత్యానికి అంతో యింతో పదును పెట్టి ఉంటాయి. ఇంత సుసంపన్నమైన సారవంతమైన రచనా నేపధ్యం ఆమెకుండటం వల్ల ఆమె రచనలు వాస్తవ జీవిత ప్రతిఫలానలై, పాఠకులను తమవెంట లాక్కెళ్ళి కట్టి పడేసుకుంటాయి.
మాలతీ చందూర్ నవలా సాహిత్యమంతా చదివి ఏమిటీవిడ నవలల సారాంశం? మాలతీ చందూర్ ఈ నవల ద్వారా ఏ సాహిత్య ప్రయోజనాన్ని ఆశించారు? ఏ ముఖ్యాంశాలను చర్చకు పెట్టారు? పాఠకులకు ఎలాంటి చూపును అందించదల్చుకున్నారు అని ప్రశ్నించుకుంటే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఆమె రాసిన నవలలన్నిటిలో వాస్తవ జీవితం, ఆధునిక దృష్టి, పాత సంద్రపాయాల నిరసన, కొత్తదారులలో నడిచేవారి జీవితాలలో వచ్చే సమస్యల పట్ల సానుభూతి, స్త్రీల సమస్యలను ఆధునిక దృష్టితో పరిశీలించటం, కుటుంబ సంబంధాలలో దోపిడి, ఇరుకుతనాలను ప్రశ్నించటం, వివిధ జీవన సందర్భాలలో చిక్కుకున్న పాత్రల మానసిక విశ్లేషణ, ఇలా యెన్నో అంశాలు మన దృష్టికి, మనం పెద్దగా కష్టపడకుండానే కనిపిస్తాయి. ఇంకొంచెం లోతుకు వెళ్ళి చూస్తే ఆమె నలలన్నిటినీ అవరించి ఒక పునాదిగా వుండిన సామాన్యమైన అంశం ఒకటుంది. అది స్త్రీలపై సమాజంలో రకరకాల రూపాలలో జరిగే హింస. రెండు మూడు నవలలు దీనికి మినహాయింపు కావచ్చు గానీ తక్కిన నవలలన్నిటిలో అతి విషాదకరమూ, అనంతమూ అయిన స్త్రీలపై హింసను దాని వాస్తవరూపంలో మనకు చూపించారు మాలతీ చందూర్.
ఈ మాట ఆశ్చర్యకరంగా వుండొచ్చు. కానీ చలం తర్వాత స్త్రీలపై వివిధ రూపాలలో జరిగే హింసను యింత విస్తృతంగా రాసిన రచయితలు తక్కువ. ఎక్కువమంది రచయిత్రులు కుటుంబ హింసను గురించి రాశారు. కుటుంబ హింసలో కూడా భార్యా భర్తల సంబంధంలోని హింసనే ఎక్కువ పట్టించుకున్నారు. మాలతీ చందూర్ స్త్రీలపై జరిగే హింసను అనేక పార్శ్వాల నుంచి చర్చించారు. ఆమె నవలల్లోకి వెళ్ళి పరిశీలించేముందు స్త్రీలపై జరిగే హింస పితృస్వామిక సమాజంలో ఎంత లోతైనదిగా ఉంటుందో, ఆ సమాజ మనుగడకు ఆ హింస యెలా అవసరమవుతుందో, దోహద పడుతుందో చూస్తే మాలతీ చందూర్ నవలల ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది.
కుటుంబ హింస గానీ, లైంగిక హింసగానీ మరే రకమైన హింస అయినా అది కేవలం స్త్రీల మీద చేసే భౌతికమైన దాడి, బలవంతం మాత్రమే కాదు. హింస అనే దానిలో దోపిడి, వివక్ష, అసమాన ఆర్థిక సాంఘిక నిర్మాణాలను కొనసాగించటం ఉటుంది. హింస ఉద్దేశమే అది. స్త్రీలను నిరంతరం భయపెట్టే భయానకమైన వాతావరణాన్ని సృష్టించి, బెదిరించటంతో ఈ హింస సాగుతుంటుంది. ఇంట్లో, వీధిలో, పనిచేసే చోట జరిగే ఈ హింసాత్మక చర్యల వల్ల స్త్రీలు నిత్యం లొంగివుండేలా తయారవుతారు. హింస అనేది స్త్రీలను సాంఘికంగా కంట్రోలు చేసే సాధనం. అది వ్యక్తిగతం, సంస్థాగతం, సంకేతం, సారాంశం కూడా అవుతుంది. స్త్రీలకున్న బానిసత్వపు, హోదాను అలాగే కొనసాగించటానికి హింస ఉపయోగపడుతుంది. స్త్రీలకున్న వ్యక్తిగత సరిహద్దులు హింసవల్ల నిరంతరం కుంచించుకుపోతాయి. లైంగిక హింస ద్వారా స్త్రీలలో ఒక భయాన్ని సృష్టించి స్త్రీలను నిశ్శబ్దంలో పడేసి లొంగదీస్తుంది పిత్రుస్వామ్య సమాజం. లైంగిక హింసను ఒక పద్ధతిలో కొనసాగించటం, ఆ హింస గురించిన భయాన్ని స్త్రీలలో సృష్టించటం ఈ రెండింటివల్లా స్త్రీలు నిరంతరం భయంతో బతుకుతుంటారు. రాజకీయ, మత టెర్రరిజంల గురించి అందరు మాట్లాడతారు. ఆలోచిస్తారు. టెర్రరిజం నివారణకు మార్గాలు వెతుకుతారు. ఐతే స్త్రీలు నిరంతరం టెర్రరిజంలో బతుకుతున్నారని గమనించినవారెంతమంది? తమ మీద ఎప్పుడు ఏ రకమైన దాడి, హింస, హత్య, అత్యాచారం జరుగుతాయోననే భయంతోనే స్త్రీలు జీవితమంతా గడుపుతారనే వాస్తవం ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు? ఈ భయం పిత్రుస్వామ్య సాంఘిక అసమానత్వంలో విడదీయలేని భాగం. కేవలం ‘భౌతిక దాడుల వల్ల మాత్రమే స్త్రీలలో ఆ భయం సృష్టించబడటం లేదు. తప్పు, గౌరవం, పవిత్రత, శీలం, అవినీతి, కన్యాత్వం, మర్యాద యిలాంటి మాటలతో, ఆ మాటల వెనకవున్న సాంస్కృతిక భావజాలంతో ఆ భయం స్త్రీలలో మొదలవుతుంది. భౌతికదాడి, సాంస్కృతిక భావజాల ప్రభావాన్ని దాటిన తర్వాతి దశ అవుతుంది చాలాసార్లు. స్త్రీలను ఎన్నటికీ అసమానత్వంలో వుంచటానికి సాంస్కృతిక సమాజం సృష్టించిన ఆచారాలు, సంప్రదాయాలు చివరకు హింస ద్వారా అమలవుతుంటాయి. స్త్రీల మీద హింస అనేక శతాబ్దాల నుండీ అమలవుతున్నా దాని విశ్వరూపాన్నీ, స్త్రీల అణచివేతతో దానికి గల విడదీయరాని సంబంధాన్నీ అర్థం చేసుకున్నది మాత్రం 20వ శతాబ్దంలోనే. 19వ శతాబ్దంలో స్త్రీల గురించి పనిచేసిన సంస్కర్తలు స్త్రీల సమస్యలను ఏవో కొన్ని దురాచారాలుగా మాత్రమే గుర్తించారు. ఆ దురాచారాలను నిర్మూలిస్తే, వాటిని నిషేదిస్తూ చట్టాలు తెస్తే చాలనుకున్నారు. కానీ స్త్రీల అభివృద్ధి కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా అభివృద్ధి సాధ్యపడటం లేదనే విషయం క్రమంగా తెలిసి వచ్చింది. స్త్రీ పురుష సమానత్వం సాధించనిదే స్త్రీల అభివృద్ధి కోంస ఎన్ని చట్టాలు తెచ్చినా అభివృద్ధి సాధ్యపడటం లేదనే విషయం క్రమంగా తెలిసి వచ్చింది. స్త్రీ పురుష సమానత్వం సాధించనిదే స్త్రీల అభివృద్ధి జరగదు. సమానత్వం సాధించాలంటే సమాజంలో స్త్రీల పట్ల వున్న వివక్షలు నిర్మూలించాలి. వివక్ష పోతేగానీ సమానత్వం రాదు. వివక్ష పోకుండా అడ్డుపడుతున్న యేమిటని ఆలోచించిన వారికి అది హింస అని అర్థమైంది. స్త్రీల మీద యెన్నో రూపాలలో అమలవుతున్న హింస వారి మీద వివక్షను మళ్ళీ మళ్ళీ విధిస్తున్నది. కొత్త కొత్త రూపాలలో ఆ వివక్షను కొనసాగించటానికి హింస ఉపయోగపడుతుంద.ఇ కాబట్టి స్త్రీల అణిచివేతలో హింస పాత్ర కీలకం. ఇది అర్థమైన తర్వాత స్త్రీల ఉద్యమం హింస మీద కేంద్రీకరించి పని చేయటం మొదలు పెట్టింది. 1970 hgh legal substituteవ దశాబ్దంలో యిది మొదలయింది. 70వ దశాబ్దంలో వెలువడిన మాలతీ చందూర్ నవలల్లో ప్రధానాంశం కూడా హింస కావటం యాదృచ్ఛికం కాదనిపిస్తుంది. ఆమె అంతకు ముందు రాసిన నవలలో ఈ విషయం వున్నప్పటికీ 70వ దశాబ్దంలో ఆమె రాసిన జయ-లక్ష్మి, కృష్ణవేణి, ఏది గమ్యం – ఏది మార్గం, చుక్కలు – రెక్కలు, సద్యోగం నవలల్లో నిస్సహాయ స్థితిలో, వుల్‌నెరబుల్ పోజేషన్‌లో వున్న స్త్రీలపై జరిగే హింసే ప్రధాన వస్తువు. భౌతిక పరమైన, మానసికమైన, సాంస్కృతిక భావజాల పరమైన హింసలు, స్త్రీల జీవితాలను ఎలా శిధిలం చేస్తాయో, స్త్రీలు ఈ హింస నుంచి బైటపడి ఊపిరిపీల్చుకోటానికి, యెలా పెనుగులాడతారో మాలతీ చందూర్ నవలలు చదివితే అర్థమవుతుంది. కుటుంబం, వివాహం, వ్యభిచారం, వుద్యోగం, సంపాదన, ప్రేమ, పేదరికం ఈ అన్నింటిలో స్త్రీలు అనుభవించే హింసను ఆమె విపులంగా రాశారు. ఐతే హింస గురించిన ఈ రచనలు స్త్రీలకు శక్తినిస్తాయి. పై వ్యవస్థలన్నిటిలో దాగివున్న హింసా ప్రవృత్తిని అర్థం చేసుకుని ఆ హింసను తప్పించుకుని జీవించగల ధైర్యాన్నిస్తాయి.
జయ-లక్ష్మి, కృష్ణవేణి నవలల గురించి యిక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ రెండు నవలల్లోని పాత్రలు సాహిత్యంలోకి చాలా అరుదుగా ప్రవేశించే పాత్రలు. ఈ నవలల్లో కథ విజలెన్స్ హోమ్‌లోని ఆడపిల్లలకూ, స్త్రీలకూ చెందినది కావటంతో సమాజంలో స్త్రీల మీద జరిగే సమస్త హింసలూ, వాటి విశ్వరూపంతో నగ్నంగా పాఠకుల ముందుకొస్తాయి. ఇవి చిన్న నవలలే గాని చదువుతుంటే ప్రముఖ రష్యన్ నవలాకారుడు కుప్రిన్ రచించిన ‘యామా ది పిట్’ లీలా మాత్రంగా గుర్తు రాకుండా ఉండదు. ‘యామా ది పిట్’లో కథ వ్యభిచార గృహాలలో జరుగుతుంది. మాలతీచందూర్ నవలల్లో వ్యభిచార గృహాల నుంచి వచ్చినవారు, మళ్ళీ వాటికి తిరిగి వెళ్ళాలనుకునేవారు, ఆ నరకం నుంచి తప్పుకోవాలనుకునేవారు, వారికి ఉద్ధరించాలనుకునేవారూ ఉన్నారు. నిస్సహాయ స్థితిలోని స్త్రీలను, ఈ వ్యవస్థ వ్యభిచార కూపంలోకి ఎంత తేలికగా లాగుతుందో ఈ నవలల్లో అర్థమవుతుంది.
విజిలెన్స్ హోమ్ అనగానే అక్కడ యెప్పుడూ బాధ, యేడుపు, డిప్రెషన్‌లే వుండవు. అక్కడి కొచ్చే పిల్లలు జీవన సమరంలో రకరకాల పద్ధతుల్లో, మార్గాలలో ఆరితేరినవారు. వాళ్ళు సజీవంగా చైతన్యంతో వుంటారు. హోమ్‌లో కూడా తమ తమ ప్రత్యేకతలతోనే బతుకుతుంటారు. ఇలాంటి నవలలు రాసేటప్పుడు బాధిత స్త్రీలంతా చాలా మంచి వాళ్ళన్నట్టు, వాళ్ళందరినీ ఒక ఛాయ నుంచే చిత్రించే ప్రమాదంలో రచయితలు పడతారు. మాలతీ చందూర్ మంచి చెడులను కలగలిపి వాస్తవంగా జీవితంలో అనేక ఛాయలతో వుండే మనుషులనే చూపారు. జీవితం అందరికీ మంచివాళ్ళుగా బతికే అవకాశం యివ్వదు. రకరకాల పరిస్థితులలో రాటుదేలిన స్త్రీలను, వారి హింసా పూరిత నేపధ్యాలను చూపుతూ, నేపధ్యం మారినా మారని వారిని, మంచి నేపధ్యంలో మార్పు కోరుకునేవారిని చిత్రించారు.
‘ఆరోగ్యం’ జీవితాన్ని సవతి తండ్రి నాశనం చేస్తాడు. చిన్నపిల్లను లొంగదీసుకుని, ఆ పిల్ల మంచిది కాదని తల్లికి చెప్పి యింటి నుంచి వెల్ళగొట్టించి, తన గుప్పిటిలో పెట్టుకుని డబ్బు సంపాదించాలని చూస్తాడు. ఆరోగ్యం హోమ్‌లోకి వచ్చినా ఈ నేపధ్యం ఆమెనెలా ఒదులుతుంది? వ్యభిచారం చేస్తూ హోమ్‌లోకి వచ్చిన పిల్లగానే అందరూ ఆరోగ్యాన్ని చూస్తారు గానీ ఆ పిల్ల యిష్టాలేమిటి, ప్రత్యేకత లేమిటి అని కనుక్కోరు. ఆరోగ్యం వంటపంతులు చేసే దొంగతనాల్లో సహకరిస్తుంది. అందరూ ఆమెను తిట్టుకుంటారు. చీదరించుకుంటారు. కానీ ఆరోగ్యం ఆ పనులు యెందుకు చేస్తుందో యెందుకు వంటవంతులుతో కలిసిందో తెలిసేసరికి పాఠకులకు కళ్ళనీళ్ళొస్తాయి. వంటపంతులిచ్చే పిప్పరమెంటు బిళ్ళల కోసం ఆశపడుతుంది ఆరోగ్యం. ఆ బిళ్ళలు ఆ పిల్ల జిహ్వచాపల్యం తీర్చుకోటానికి కాదు. ఆరోగ్యానికి చిన్న పిల్లలంటే యిష్టం. వాళ్ళకి పిప్పరమెంట్లిచ్చి స్నేహం కలుపుకోటానికి యిన్నిపాట్లు పండుతుంది. తనకు చిన్న పిల్లలంటే యిష్టమనీ, వారి పనులు చేస్తాననీ హోమ్ సూపర్నెంటుతో చెప్పుకోవచ్చని కూడా ఆరోగ్యానికి తెలియదు. తన యిష్టాలంటే అందరికీ కోపమనీ, అవి చెబితే వచ్చేది తిట్లు. తన్నులేననేది ఆమె గత జీవితానుభవం. దాంతో తన యిష్టాలను రహస్యంగా, దొంగతనంగా తీర్చుకోవటమే చేస్తుంది. అవి యెంత మంచి యిష్టాలైనా సరే. జీవితం కొందరికి యెంత కఠినంగా వుంటుందో ఆరోగ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్యం యిష్టం తెలిశాక ఆమెను చిన్నపిల్లలతో కలిసి పని చేయమని బాధ్యత అప్పగిస్తుంది మేట్రన్ సత్యవతి.
ఆనాధ అయిన జయ హోమ్‌లో పెరిగి, కలవారింట్లో పనిమనిషిగా చేరి, ఆ యింటి కోడలవుతానని కలలు కని చివరికి వ్యభిచార వృత్తినే ఆశ్రయించాల్సిన స్థితిలో పడుతుంది. ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. సినిమాల్లో వేషాలు సంపాదిద్దామని యిల్లు వొదిలి మద్రాసు చేరిన లక్ష్మి వ్యభిచార కూపంలో పడి హోమ్‌కు చేరుతుంది. సూపర్నెంట్ కృష్ణవేణి సహాయంతో తల్లిదండ్రులను కలుసుకుని జీవితానికో మార్గం యేర్పరుచుకుంటుంది.
సుశీలది మరీ విషాదపూరితమైన కథ. గృహ హింస నుంచి బైటపడటానికి ప్రయత్నిస్తూ తన ప్రమేయం యేమీ లేకుండా తన తప్పేమీ లేకుండా హోమ్‌కి తీసుకురాబడుతుంది. ఒక రెడిమేడ్ బట్టల ఫ్యాక్టరీలో చిన్న వుద్యోగం చేసుకుంటూ హాయిగా బతికే సుశీల పెళ్ళి చేసుకుని వుద్యోగం మాని భర్తతో వెళ్లిపోతుంది. మొదటి సంవత్సరం వివాహ జీవితం బాగానే వుంటుంది. చుట్టుపక్కల అడవాళ్ళు భర్తలతో పేచీపడుతూ, తన్నులు తింటూ వుంటే వాళ్ళకు కనీసపు చదువులేక అలా వుంటున్నారనీ తను చాలా తెలివిగా, మంచిగా కాపురం చేస్తున్నాననీ అనుకుంటుంది. ఇల్లు చక్కదిద్దుకోవటం, ఇంటిపనీ యివన్నీ చాలా అర్థవంతమైన పనులుగా కనపడతాయి సుశీలకు, ఐతే త్వరలోనే అదంతా కలలాగా చేజారిపోయి భర్త పేకాటకూ, తాగుడికి అలవాటైతే, యిల్లు గడవక పిల్లల కడుపులు నింపలేక, భర్తతో పేచీలు పడి తన్నులు తినే స్థితికి వస్తుంది. ”మొదట్లో నేను అలానే అనుకునేదాన్ని. నా మొగుడు నేను గీసిన గీటు దాటడు. జీతమంతా తెచ్చి నా చేతుల్లో పోస్తాడు. పిల్లలకి మంచి చదువులు చెప్పించాలి. ఇలా ఎన్నో వెర్రికలలు కన్నాను. చివరికి ఏమయింది. నేనూ అందరిలాగానే అయ్యాను. దెబ్బలు తిన్నాను. ఏడ్చాను. పిల్లలకి పిడికెడు మెతుకులు పెట్టలేకపోయాను…. పెళ్ళి అయేదాక ఉద్యోగం చెయ్యనిచ్చాడు మానాన్న. ఆ రెండేళ్ళు నేను ఎంత సుఖంగా ఉన్నానని – హాయిగా, చీకూ చింతా లేకుండా, పెళ్ళి అయ్యేదాకా ఆడవాళ్ళు యింత కష్టపడతారని, తిండికి కూడా కరువాచాల్సిన స్థితిలో వుంటారని నాకు తెలియదు. పెళ్ళంటే ఇదా.” అంటుంది సుశీల. పుట్టింటికి వచ్చి పూర్వపు వుద్యోగం మళ్లీ సంపాదించుకుని పిల్లల్ని పోషించుకుందామని ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ పాత స్నేహితులు కలుస్తారు. సుశీల ఆ రోజు చాలా ఆనందంగా గడుపుతుంది. ఒంటరిగా కుటుంబ హింసలో మగ్గుతున్న అనేకమంది స్త్రీలకు తెలియదు, ఇళ్ళ నుంచి బైటికి వచ్చి ఒక సామూహిక జీవితంలో యేదో వొక పని చేస్తూ బతికే బతుకే అర్థవంతమని, సుశీల ఆ రాత్రి తోటి వాళ్లతో కలిసి సినిమాకి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆమె పర్సు యెవరో కొట్టేస్తారు. అతన్ని సుశీల పట్టుకుని పోలీసుని పిలిస్తే అతను సుశీలే తనను రమ్మని పిలుస్తోందని, బలవంతం చేస్తోందని చెప్పి వేశ్యగా ముద్రవేస్తాడు. ఆ రాత్రే విజిలెన్స్ హోమ్‌కి తీసివెళ్తారు. రాత్రిపూట బైటికి వెళ్ళిన స్త్రీకి యేమైనా జరగొచ్చు. సుశీల కథ స్త్రీలందరి స్థితికి అద్దం పడుతుంది. ఒక్క నిమిషంలో ఆమె జీవితం తలకిందులయింది. ఏ పిల్లల కోసం వుద్యోగం చేద్దామని యిల్లు కదలి వచ్చిందో ఆ పిల్లలకు దూరమైంది. ఈ ముద్ర పడ్డ సుశీలను వదిలేస్తానని పిల్లల్ని తీసుకుపోతానని సుశీల మొగుడు వేసే వీరంగాలకు భయపడి సుశీల తండ్రి ఆమె చెల్లెల్నిచ్చి పెళ్ళి చెయ్యటానికి సిద్దపడతాడు. పేద స్త్రీల బతుకుల ఒక్క రోజులో మరి కోలుకోలేని విధంగా యెట్లా కుప్పకూలుతాయో ఈ కథ చెబుతుంది. పిల్లలను ఒక్కసారి చూడటం కోసం సుశీల హోమ్‌లో అలమటిస్తుంటుంది. క్రమంగా కృష్ణవేణి చెప్పినట్లు పనిచెయ్యటం, చదువుకోవటం చేస్తుంది.
ప్రత్యేకాంధ్ర వుద్యమంలో పాల్గొని అక్కడ తోటి మగవాళ్ళతో అత్యాచారానికి గురైన సంపన్న కుటుంబానికి చెందిన మంజులది మరో కథ. రాజకీయాలలో స్త్రీకి భద్రత లేదనే విషయాన్ని రుజువుచేస్తుంది.
గీతకు వ్యభిచార జీవితం మీదే ఆకర్షణ. అక్కడి స్త్రీ అదుపులేని జీవిత గమనమే కావాలనుకుంటుంది. హోమ్‌నుంచి తప్పించుకుని పాత జీవితానికే వెళ్ళాలనుకుంటుంది. ఎందుకంటే ఆమె పరదాలలో, కఠినమైన నిర్బంధాలలో బైటి ప్రపంచమంటే యేమిటో తెలియకుండా పెరిగింది. ఆ నిర్భంధాలలో పెరిగిన ఆమెకు ఈ స్వేచ్ఛా జీవితం బాగుందనిపించింది. హోమ్‌లో యానివర్సరీ జరిగినపుడు ముఖ్య అతిథిగా వచ్చిన జడ్జీని గీత తన కస్టమర్‌గా గుర్తుపట్టింది. ఆయన చెప్పిన ఉపన్యాసం గురించి అంబుజంతో ”ఈయన ఇన్ని పెద్ద కబుర్లు చెప్పాడా? మేమున్న ఇంటికి రోజూ వస్తుండేవాడు. అక్కడున్న పదిమంది దగ్గరకూ వస్తుండేవాడు!” అంటుంది.
”ఆరోజు ఆయన వేషం తల్చుకుంటే నాకింకా నవ్వుగానే వుంటుంది. పంచచేతబుచ్చుకుని, పోలీసులు అనగానే దొడ్డిదారిని పరుగోపరుగు. ఒకే పరుగు” విరగబడి నవ్వుతోంది. ఆ నవ్వులో విషాదం గీతకు అర్థంకాకపోయినా మనకు అర్థమవుతుంది. నేరాలు చేసే మగవాళ్ళు జడ్జీలు కాగల అవకాశాలుంటాయి. నేరమేమిటో కానిదేమిటో తెలియని అమాయకపు ఆడపిల్లలకు భయంకరమైన శిక్షలుంటాయి.
దరిద్రంతో, ఆకలితో, రోగాలతో నలిగే స్త్రీల జీవితాలను యింత విపులంగా రాసిన నవలలు అరుదు.
‘క్షణికం’ అనే నవలలో మాలతీచందూర్ చిత్రించిన సంగటన బహుశ యదార్థ సంఘటనే కావచ్చు. రాత్రిపూట భర్తలేని సమయంలో ఒక దొంగ ఆమె గదిలోకి వచ్చినా ఆమెను అనుమానించే కుటుంబసభ్యులు, ఆ అనుమానంతో రాత్రికి రాత్రి ఆమె వీధినపడాల్సి రావటం, ఇక చచ్చిపోవటం తప్ప మరో గత్యంతరం లేకపోవటం యిదే ఆ చిన్న నవల యితి వృత్తం. ఎవరు ఎలాగైనా ఆమె నిస్సహాయత్వాన్ని వాడుకోవచ్చు. ఇందులో ఆమెను అనుమానించటంలో ఆడవాళ్ళు కూడా భాగస్వాములుగా ఉంటారు. ఐతే అధికార సంబంధాల చట్రంలో వాళ్లు పైనున్నారు.
కుటుంబంలోని అనేక అధికార సంబంధాలను వాటిలో అంతర్గతంగా ఉండే హింసనూ మాలతీ చందూర్ తన నవలల్లో విప్పి చూపుతారు. అవి స్త్రీ పురుషుల మధ్యే కాదు. స్త్రీల మధ్య కూడా పని చస్తాయి.
శతాబ్ది సూరీడులో వితంతువులపై ముఖ్యంగా బాల వితంతువులపై జరిగే హింసను గురించి రాశారు. వితంతువు కోరికలనూ, అవసరాలను అణచివేయటం, ఆమె తినే తిండినీ యితర వస్తువుల వాడకాన్ని (తలనూనెతో సహా) తగ్గించి వేయటం, ఆమె ఇంట్లో చేయాల్సిన శ్రమను విపరీతంగా పెంచటం – ఈ క్రమాన్ని శతాబ్ధి సూరీడులో మాలతీ చందూర్ స్పష్టంగా రాశారు. వితంతువు ఒక యింట్లో కాదు అనేక యిళ్ళల్లో పనిచేయటానికి తయారైన ఒక యంత్రం. బంధువుల యిళ్ళల్లో యెక్కడ పని వుంటే అక్కడామె ప్రత్యక్షం కావాలి. పైసా యివ్వకుండా వెట్టి చేయటానికి పుట్టిన అభాగ్యులు వాళ్ళు. కుటుంబ సభ్యులే వాళ్ళపై లైంగిక హింసకు కారకులవుతారు. కుటుంబం లోపలే, కుటుంబపు అండలోనే వున్నట్లు కన్పించే, నిస్సహాయులు నిరాశ్రయులు అయిన బాల వితంతువుల హింసా పూరిత జీవితాలను, శతాబ్ది సూరీడులో మాలతీ చందూర్ కుటుంబపు మాయ తెరలు తీసి చూపించారు.
సామాన్యంగా లోకంలో అందరూ అనుకునేది, నమ్మేది, పాక్షికంగా సత్యమైనది ఒక అభిప్రాయం వుంది. అదేమిటంటే స్త్రీలపై యిన్ని రకాల యింత హింస జరగటానికి కారణం ఆర్థిక పరాధీనతే అనేది. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడకపోతే, ఉద్యోగాలు చేసి సంపాదిస్తుంటే స్త్రీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హింసల పాలు గాకుండా బతకగలరనే అభిప్రాయాన్ని చాలామంది నమ్ముతారు. నిజానికి అలాంటి పరిస్థితికి అవకాశం వుండాలి. ఆర్థికంగా యెవరిమీదా ఆధారపడనపుడు, తనే కుటుంబాన్ని పోషించగలిగినపుడు, యిక యెవరి పెత్తనాన్నయినా, యెవరి అధికారాన్నయినా వాటి భౌతికరూపలైన హింసనైనా యెందుకు భరించాలి, యెందుకు తలవంచాలి? అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఐతే వాస్తవంలో సంపాదనాపరులైన స్త్రీలు ఆ హింసకు తలవంచుతూనే వున్నారు. ఎందుకు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఉద్యోగం, సంపాదన, సామాజిక రంగంలో వచ్చిన మార్పుల వల్ల స్త్రీలకు సమకూరిన వనరులు, కానీ ఆ మార్పులు సాంస్కృతిక జీవితంలో, భావజాలంలో రాలేదు. చాలా నెమ్మదిగా వస్తున్నాయి. సాంస్కృతిక భావజాలం స్త్రీలలో తాము పరాధీనులమనే, అబలలమనే భావనను అనంతవిధాలుగా కలిగిస్తూ వుంటుంది. వాళ్ళ భౌతిక జీవితాలలో యెన్ని మార్పులొచ్చినా కుటుంబం లోపలి, సమాజంలోని అధికార సంబంధాలను ఆమోదించే ఆలోచనా విధానంలో మాత్రం మార్పురాదు. ఆ మార్పు రానంతవరకూ, ఆ మార్పు రాకుండా వుండటం కోసం స్త్రీల మీద హింస మరింత పకడ్బందీగా, కొత్త పద్ధతుల్లో జరుగుతుంటుంది. డబ్బు సంపాదించటం వల్లనే, ఆ కారణంగానే హింసల పాలైన స్త్రీల గురించి మాలతీ చందూర్ మంచి నవలలు రాశారు.
ఆమె తొలి నవలలు ”చంపకం – చెదపురుగులు” ”రేణుకాదేవి ఆత్మకథ” ఈ రెండూ ఆడవాళ్ళు సంపాదిస్తుంటే, కుటుంబాలు – పుట్టింటి వాళ్ళు, భర్తయింటివాళ్ళు కూడా వారి సంపాదనను అనుభవించాలనే కాంక్షతో యెలా హింసిస్తారో చెప్పే నవలలు. ఆడవాళ్ళ సంపాదనకూ, మగవాళ్ళ సంపాదనకూ మధ్య వ్యత్యాసాన్ని మనకు చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశాయి ఈమె నవలలు.
సామాన్యంగా పురుషులు సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తే వాళ్ళంత ప్రయోజకులవుతారు. అధికారాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ వాళ్ళ అధికారాన్ని ఆమెదించి గౌరవించి వారికి లొంగి వుంటారు. సంపాదన పెద్దగా లేకున్నా పురుషులకు కుటుంబంలో అధికారముంటుంది. అదే యెక్కువ సంపాదన వున్నపుడు అతని అధికారం మరింత పెరుగుతుంది. కుటుంబంలోని వారు అతని ప్రేమను, అభిమానాన్ని సంపాదించటానికి పోటీ పడతారు.
ఇక స్త్రీల పని సంపాదన కాదు. వాళ్ళు ఇళ్ళల్లో ఉండి ఇంటి పనులు, కుటుంబానికవసరమైన సేవలూ చెయ్యాలి. 19వ శతాబ్దంలో ఈ పరిస్థితి మారింది. 1920వ దశాబ్దం నుంచీ అక్కడక్కడ స్త్రీలు ఉద్యోగాలు చేయటం, సినిమా, నాటక రంగాలలో ప్రవేశించి సంపాదించటం మొదలు పెట్టారు. ఆ సంపాదనను ఎలా చూడాలి అన్నది మొదట్లో కుటుంబాలకు పెద్ద ప్రశ్నగా ఉండేది. ఆడదాని సంపాదన అనే చిన్న చూపు ఉండేది. వేణ్ణిళ్ళకు చన్నీళ్ళే గానీ ప్రధానాధారంగా చూడకపోవటం ఉండేది. ఐతే ఇదంతా పైనే. లోపలికి వెళ్తే ఆడవాళ్ల సంపాదన అనుభవించటంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ సంపాదన మీద వాళ్ళకు హక్కు లేకపోవటమనేది స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీ సంపాదన మీద పెత్తనం చేయటానికి పెళ్ళి కాకముందు తండ్రులో, అన్నలో, బావలో, తల్లులో, అక్కలో ఉండే పెళ్ళయిన తర్వాత భర్తలూ, మామగార్లు ఉంటారు. సంపాదన ద్వారా పురుషుడికి వచ్చిన అధికారం స్త్రీలకు సామాన్యంగా రాదు. తాను సంపాదిస్తున్నందువల్ల ఎక్కువ గర్వపడకుండా, మిడిసిపడకుండా, అణకువగా వుండే అదనపు బాధ్యత స్త్రీల మీద పడుతుంది. స్త్రీలు సంపాదిస్తే సంపాదిస్తారు గానీ, ఆ సంపాదనను సక్రమంగా ఖర్చు చేయటం, నిర్వహించటం, పెంచటం యివి స్త్రీలకు చేతకావనే ప్రచారం చాలా కాలం పాటు సమాజంలో వుంది. అందువల్ల సంపాదన నిర్వహించే సామర్థ్యం పుట్టుకతోనే వచ్చిందని నమ్మే మగవాళ్ళ చేతుల్లో డబ్బు పోయాలి. ఆ బాధ్యత తీసుకున్న పురుషుడికి జవాబుదారీ తనం ఉండనవసరం లేదు. ఆడది డబ్బు లెక్కలు అడిగితే తిరుగుబాటే – దానికి ఆమెను తిట్టే, కొట్టే హక్కు మగవాడికుంటుంది. ఇలాంటి భావజాలం సమాజంలో యిప్పటికీ వుంది. ముఖ్యంగా అపరిమిత సంపాదనకు అవకాశం ఉన్న సినిమా రంగంలో ఈ భావజాలం యిప్పటికీ ఉండటం మనం చూస్తుంటాం. రేణుకాదేవి ఆత్మకథ ఛాయలు ఆర్తి అగర్వాల్ జీవితంలో కనపడతాయి. మధ్యలో యెందరో నటీమణులు, తమ నటనా సామర్థ్యంతో దేశ ప్రజలను ముగ్ధులను చేసినవారు, తమ సంపాదనను సమర్థించుకోలేక, వేరే వాళ్ళ ఏతికి అప్పగించి చివరికి చిక్కుల్లో పడ్డారు. కొందరి జీవితాలు దయనీయంగా సమాప్తమయ్యాయి. 50వ దశాబ్దంలోనే సినిమారంగంలో స్త్రీల సంపాదన మీద కుటుంబాల చేసే పెత్తనాన్ని వివరంగా చిత్రించిన నవల రేణుకాదేవి ఆత్మకథ. స్వీయ ఆర్జన, సమాజంలో గుర్తింపూ వున్నా, మనశ్శాంతి లేని జీవితాలెలా ముగుస్తాయో చెప్పే నవలిది.
ఐతే స్త్రీలందరూ యిలా వుంటారని, ఉన్నారనీ కాదు. తమ సంపాదనతో కుటుంబంలో ఒక అధికారాన్నీ గౌరవాన్నీ పొందిన పాత్రలు మాలతీ చందూర్ నవలల్లో ఉన్నాయి. ఉదాహరణకు శతాబ్ది సూరీడులో కమల తనకున్న కొద్దిపాటి ఆస్తినీ, టీచర్‌గా తనకొచ్చే జీతాన్ని చాలా తెలివిగా తన కుటుంబాన్ని చక్కదిద్దుకోటానికి వినియోగించింది. చిన్న ఇల్లే అయినా పైన గదులు వేయించి అద్దెకివ్వటం, ఉన్నంతలో పొదుపుగా జీవిస్తూనే తనకిష్టమైన సినిమాలకు ఖర్చు పెట్టుకోగలగటం, ఇద్దరమ్మమ్మల జిహ్వ చాపల్యాన్ని వాటివల్ల వచ్చే అనారోగ్యాన్ని డబ్బు ఖర్చు అనుకోకుండా భరించటం, వీటన్నింటిలో కమల సామర్థ్యము, మానవత్వమూ రెండూ తెలుస్తాయి. కమల ఎస్.ఎస్.ఎల్.సి. మాత్రమే చదివింది. టీచర్ ట్రైనింగ్ చేసింది. కానీ తన జీవితానికి తనే కర్తననుకోవటం వల్లా, కుటుంబ బాధ్యతలన్నీ తనే చూడాల్సి రావటం వల్లా, ముఖ్యంగా కూతురిని బాగా చదివించి ప్రయోజకురాలిని చేయాలనే కర్తవ్యం ఉండటం వల్ల, సంపాదనను చాలా బాధ్యతగా ఖర్చు చేసింది. పెద్దమ్మమ్మ పద్మ చదువకోసం ఇన్యూరెన్స్ పాలనీ తీసుకోవటమనేది చాలా పెద్ద విషయం. పరమచాదస్తురాలు, కమల జీవితం మోడులా మారటానికి కారణమైన పెద్దమ్మమ్మ, ఆడపిల్లలను ఉన్నత విద్య అవసరం గ్రహించి దానికి డబ్బు దాచాలనే ఆలోచన చేసిందంటే, స్త్రీలు తామంత తాము అమాయకులూ మూర్ఖులు కాదనీ, కుటుంబాలు, సామాజిక విలువలూ వాళ్ళనలా చేశాయనీ, ఒకసారి వాళ్ళకు సమస్య అర్థమైతే దానిని చక్కగా పరిష్కరించుకోగలరనీ తెలుస్తుంది. ఐతే దానికొక ప్రీ కండిషన్ వుంది. వాళ్ళమీద పురుషుల పెత్తనం ఉండకూడదు. ఆ పెత్తనం వుంటే వీళ్ల సామర్థ్యం వెలుగులోకి రాదు.
ఐతే చదువుకున్న వాళ్ళంతా తమ సంపాదనను యింత చక్కగా నిర్వహించుకోలేరనీ, దానికి కూడా పురుషులే కారణమనీ చూపే రచనలు కూడా మాలతీ చందూర్ రాశారు. స్త్రీల సంపాదనను ఖర్చు చేసే అధికారాన్ని పురుషులు తమ చేతుల్లోకి తీసుకోవటం, స్త్రీల సంపాదన మీద వారికంటే తమకు యెక్కువ హక్కున్నట్లుగా ప్రవర్తించటం, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయాలన్నీ పురుషులే తీసుకోవటం, తమ నిర్ణయాలతో స్త్రీలు విబేధించినపుడు వారిమీద హింస ప్రయోగించటం వీటన్నిటి వల్లా, కొంతమంది స్త్రీలు యెంత సంపాదించినా ఆ సంపాదనను తమ కోసం, తమ సుఖం కోసం, తమ స్వంత అభిరుచుల కోసం, తనవారి కోసం ఖర్చు పెట్టలేకపోతారు. అవన్నీ పురుషుల దృష్టిలో వృధా ఖర్చులుగా, తెలివి తక్కువ పనులుగా కనపడతాయి. కోప్పడతారు. కొడతారు. ఎగతాళి చేస్తారు. ఏదో ఒక పేరుతో స్త్రీలను డబ్బు నిర్వహణనుంచి తప్పిస్తారు. ప్రేమలేని ఆ భర్తలే కాదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తలు సహితం అదే పని చేస్తారు. ఉదాహరణకు ”ఏది గమ్యం – ఏది మార్గం” నవలలో మేరీ విశ్వంలు యిద్దరూ డాక్టర్లు. ఆధునిక భావాలతో కులమతాలను లక్ష్యపెట్టక వివాహం చేసుకున్నారు. మద్రాసులో మేరీ ఉద్యోగంలో చేరితే విశ్వం ప్రాక్టీసు పెట్టాడు. ఐతే ఎప్పుడూ మేరీ సంపాదనే యెక్కువగా ఉండేది. ఎవరిది ఎక్కువ సంపాదన ఎవరిది తక్కువ అనే ఆలోచన రాకపోయినా విశ్వనాధం తన కోసం వాళ్ళ వాళ్లందరినీ ఒదులుకున్నాడనే కృతజ్ఞత భావంతో (నిజానికి మేరీ కూడా ఒదులుకుంది కానీ, ‘విశ్వనాధం బాహ్మణుడు కాబట్టి, పురుషుడు కాబట్టి, అతని త్యాగం ఎక్కువని అందరితో పాటు మేరీ కూడా నమ్ముతుంది) మేరీ ”అతనికి ఏం తక్కువవుతుందో అనే తాపత్రయంతో కొట్టుకునేది. కొత్త సంపారానికి కావల్సినవి అమర్చటంతో పాటు బీరువాలో ఎల్లప్పుడు రెండు మూడోందలు ఉండేట్లు చూసేది. అందువల్ల విశ్వనాధానాకి డబ్బు సమస్య ఉండేది కాదు”.
ఆడవాళ్ళు సంపాదిస్తున్నపుడు మగవాళ్ళ అవసరాల గురించి వారికి న్యూనతా భావం రాకుండా ఉండటం కోసం ఎంత పట్టించుకుటారో, పట్టించుకోవాల్సి వస్తుందో మనకు మేరీ చేసిన పనిలో అర్థమవుతుంది.
తర్వాత మేరీ విశ్వనాధంలు, విశ్వనాధం స్వంత వూరికి వెళ్ళి ప్రాక్టీసు పెడతారు. అక్కడ మేరీ విపరీతంగా సంపాదిస్తుంది. ఆ సంపాదన విశ్వనాధం తన యిష్టం వచ్చినట్లు ఖర్చు పెడతాడు. మేరీ అభ్యంతరం చెప్పదు. తమ్ముడిని చదివిస్తాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాడు. ఆ పెళ్ళికి మేరీ డబ్బు పనికొచ్చింది గానీ, మేరీకి కనీసం ఆహ్వానం కూడా రాలేదు. ఐనా వెళ్ళి, వాళ్ళు దూరంగా కూచోబెడితే కూచుని, నేరుగా భోజనం చేసి వచ్చింది. ఆ రోజే నా డబ్బు తీసుకుని పెళ్ళి చేసుకుని నన్నిలా అవమానం చేయటమేమిటని మేరీ ప్రశ్నించి వుంటే, ప్రతిఘటించి వుంటే పరిస్థితి వేరుగా ఉండేది. విశ్వనాధం ప్రేమ మీది నమ్మకం ఆమెను అవన్ని భరించేలా చేసింది.
తర్వాత మేరీ సంపాదించటం, విశ్వనాధం క్లబ్బులకూ, పేకాటలకు, తనవాళ్ళకూ, ఎన్నికలలో పోటీ చేయటానికి మేరీ డబ్బుని ఖర్చు చేయటం యిదే సాగుతుంది. ఇదంతా బాగోలేదని, తన సంసారం పాడవుతోందనీ మేరీకి తెలిసినా నా సంపాదన నా యిష్టం లేకుండా నువ్వు ఖర్చు పెట్టకూడదు అని కచ్చితంగా చెప్పలేకపోయింది. ఒకటి రెండు సార్లు అడిగినా ”ఆ మాత్రం మంచీ చెడూ నాకు తెలియదనే అనుకుంటున్నారా?” అని విశ్వం గద్దించటంతో ఆగిపోయింది. మరింత గట్టిగా ”సంపాదన లేదు గాని, వ్యసనాలు అబ్బినాయి” అనేసరికి విశ్వనాధం పెద్ద పుస్తకాన్ని మేరీ మీదకు విసరటం, మేరీ కిందపడటం, టేబుల్ మొన డొక్కలో పొడుచుకోవటం జరిగింది. తర్వాత విశ్వనాథం సేవలు చేసినా హింస అనేది ప్రారంభమయింది.
ఆ హింస పెరిగింది. భౌతిక హింస కంటే మానసిక హింస మరింత పెరిగి అది తట్టుకోలేక మేరీ ఆత్మహత్య చేసుకుంది. విశ్వనాధం మేరీ చేసిన పనికి తట్టుకోలేకపోయాడు – కానీ అసలీ అగాధానికి కారణం ఏమిటి? విశ్వనాధం మేరీ సామర్ధ్యాన్ని, సంపాదనను గుర్తించలేకపోవటం. గుర్తించటానికి అతని అహం అడ్డొచ్చింది. ఆమెకు విపరీతమైన ప్రాక్టిసు. తనకు లేదు. ఇది అతని అంతరాంతరాల్లో బాగా పని చేసింది. ఎన్నికల్లో పోటీ చేసి తన ఘనతను నిరూపించుకోవాలనుకున్నాడు. ఆ అహం వారి మధ్య అగాధాన్ని పెంచింది. అలాగే మేరీ సంపాదనను ఆమె నిర్ణయాల ప్రకారం ఖర్చు చెయ్యాలనే పాటి గౌరవం ఆమె మీద చూపలేకపోయాడు. అట్లా చూపే అవకాశం లేదు. స్త్రీల సంపాదన మీద మొత్తం హక్కులు పురుషుడివే అని సమాజం గట్టిగా చెబుతుంద.ఇ నా సంపాదన మీద నీకు హక్కులేదు. నేను యిష్టపడి యిస్తే తప్ప దానిని నువ్వు ఖర్చు చెయ్యకూడదు అని ఏ స్త్రీ అయినా అంటే ఇక ఆ సంబంధం నిలవదు. ఆ స్త్రీ గయ్యాళిదవుతుంది. ఐతే 90% పురుసుల తను సంపాదన ఎంతో ఎలా ఖర్చు చేస్తున్నారో, తమ భార్యలకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. భర్త సంపాదన మీద భార్య పెత్తనం చేస్తుంటే భర్తను అసమర్ధుడిగా, భార్యను గడుసుదానిగా, మొగరాయుడిగా చెప్పుకుంటారు. ఇద్దరూ లక్షలు గడిస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా భార్య జీతమంతా తనకివ్వాలని భర్త డిమాండ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్లానింగ్ చేసుకుని డబ్బు ఖర్చు చేసే కుటుంబాల సంఖ్య చెప్పుకోదగ్గంతగా పెరగటం లేదు. ‘ఆడ పెత్తనం పంబల దొరతనం’ వంటి సామెతలు పాతబడినా వాటి సారాంశమే అమలవుతుంది. శతాబ్దాల పాటు ఆస్తుల, డబ్బుల నిర్వహణకు దూరంగా వున్న స్త్రీలు కొన్ని తప్పులు చేయొచ్చు. కొన్ని నష్టాలు తేవచ్చు. కానీ వందల సంవత్సరాలుగా ఈ విషయాలు చూస్తున్న పురుషులు నష్టాలు తేవటం లేదా? ఈ విషయాలు లోతుగా ఆలోచించినపుడే చలం ”స్త్రీ సర్వనాశం కావటానికైనా సరే ఆమెకు స్వేచ్ఛ కావాలి” అన్న మాటల్లో అంతర్థాం మనకు అర్థమవుతుంది. కొన్ని జీవితాలు నాశనమైనా స్త్రీలు నేర్చుకోగలుగుతారు. ”మధుర స్మృతులు” నవలలో కూడా డాక్టర్ నాగమణి ప్రేమ వివాహం చేసుకుంటుంది. అతను డాక్టర్ కాదు. ఏ పనీ చెయ్యలేని అసమర్ధుడు. నాగమణి సంపాదన మీద తాను బతకుతున్నానే ఆత్మ న్యూనతా భావంతో ఇల్లు ఒదిలి వెళ్ళిపోతాడు. స్వాతంత్య్రానంతరపు తొలిరోజుల్లో బాగా సంపాదించే ఆడవాళ్ళు తమ సంపాదన వల్ల కుటుంబ జీవితాలలో ఎంత హింస అనుభవించారనే విషయం మాలతీ చందూర్ రాసినంత విస్తృతంగా వాస్తవికంగా మరింకెవరూ రాయలేదని పిస్తుంది. పేద స్త్రీల పరిస్థితి మరింత ఘోరం. వారికి ఉద్యోగాలు దొరకవు. భర్తల సంపాదన మీద వీరికేమీ హక్కుండదు. భర్త సంపాదిచినంతా తగలేసినా ఈస్త్రీలు చేయగలిగింది లేదు.
1947లో నేషనల్ ప్లానింగ్ కమిటీ ”విమెన్స్ రోల్ ఇన్ ప్లాన్‌డ్ ఎకానమీ” గురించి నియమించిన సబ్ కమిటీ తన రిపోర్టులో స్త్రీల ఆర్థిక పరాధీనత గురించి యిలా రాసింది.
”సబ్ కమిటీ అన్ని తరగతుల స్త్రీలు చేసే విలువలేని శ్రమ మీద, స్త్రీల ఆర్థిక పరాధీనత, వనరులు లేకపోవటం అనే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టింది.
శ్రామిక వర్గాలలో పనిచేసి సంపాదించటం ద్వారా మాత్రమే ఆస్తి కలిగి వుండే అవకాశం ఉంటుంది. స్త్రీల ఆర్థిక స్వాతంత్రం ఆమె సంపాదించే డబ్బు మీద ఆమెకి పూర్తి కంట్రోలు వుండటం మీదే ఆధారపడుతుంది. స్త్రీల సంపాదన ఆమె భర్తగానీ కుటుంబంలో యితర పురుషులు మీదే ఆధారపడుతుంది. స్త్రీల సంపాదన ఆమె భర్తగానీ కుటుంబంలో యితర పురుషులు గానీ బలవంతంగా లాక్కోవడమనేది సామాన్యంగా జరిగే వ్యవహారమే. స్త్రీలు సంప్రదాయ నేపధ్యాల వల్ల తమ జీతాలను మొత్తం కుటుంబ సంపాదనలో భాగంగా చూడటానికే అలవాటు పడతారు. వేతనాలు వచ్చే గ్రూపులన్నిటిలో ఇలాగే జరుగుతుంది. ఆశ్చర్యకరంగా ఈ మనస్తత్వమే వృత్తి విద్యా నిపుణుల గ్రూపులలో కూడా కొనసాగుతుంది. స్త్రీ శ్రామికులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. కుటుంబ సంపాదనలో స్త్రీలకు కొంత భాగం చెందేలా ప్రభుత్వానికికున్న ఈ బాధ్యత గురించి చూడాలి” కృష్ణవేణి నవలలో సుశీల ఆవేశంగా అడుగుతుంది. ”అమ్మా గవర్నమెంటు స్త్రీలకి ఏదో చేస్తుందంటారు. ఎవరికి చేశారు, ఎక్కడ చేశారని బిగ్గరగా అరవాలనిపిస్తుంది. కుటుంబాన్ని బీదవికాక ఏమైపోతాయి. ఫ్యాక్టరీల్లో జీతాలు పెంచి ఏం లాభం? ఆ జీతం రాళ్ళు ఇంటికి సవ్యంగా వచ్చే ‘చట్టం’ చేసినపుడు గాని మాలాటి వారు బాగుపడరు.” అంటుంది సుశీల.
1947లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ సబ్‌కమిటీ చేసిన రికమండేషన్లు సుశీల చట్టంగా అడిగింది. వాళ్ళు అధ్యయనం చేసి రాశారు. సుశీల జీవితానుభవంతో అడిగింది. మొత్తానికి స్త్రీల ఆర్థిక పరాధీనత గురించి నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఆలోచించినంత బాధ్యతగా మాలతీ చందూర్ ఆలోచించారు. ఆ పరాధీనతలోని వివిధ కోణాలను, ఆ పరాధీనతవల్ల అనివార్యంగా ఎదురయ్యే హింసలనూ మాలతీచందూర్ తన నవలల్లో విపులంగా రాశారు.
భూమిపుత్రి నవలలో దుర్గపాత్ర ద్వారా స్త్రీల సామర్థ్యం తెలిపారు. మంచితనంతో, వివేకంతో, పొదుపుతో, మానవత్వంతో, సంసార భారాన్ని సులువుగా, ఆనందంతో, ఆడుతూ పాడుతూ సృజనాత్మకంగా మోస్తుంది దుర్గ. దుర్గలాంటి స్త్రీలు బీదవారిలో లక్షల సంఖ్యలో ఉంటారు. రకరకాల కారణాల వల్ల ఒంటరిగా కుటుంబాల భారం నిర్వహిస్తున్న స్త్రీల సంఖ్య మనదేశంలో తక్కువకాదు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు, సహనశక్తి, చొరవ తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటిపాత్రనూ మాలతీచందూర్ సృష్టించారు.
ఆమె నవలలన్నిటిలో దాదాపు స్త్రీలు ఉద్యోగం చేసేవాళ్ళే. లేదా ఏదో చిన్న పని చేసి కుటుంబాన్ని అదుకునే వారే. 20వ శతాబ్దంలో విద్య వల్ల సంపాదనలోకి వచ్చి దాని, తాలూకూ వెలుగు నీడల్ని, బరువు బాధ్యతల్ని అనుభవించే స్త్రీలే మాలతీ చందూర్ కథా నాయికలు. కేవలం గృహిణులుగా వుంటూ భర్త కాస్త మంచిగా చూస్తే చాలనుకునే స్త్రీ పాత్రలు కావు ఆమెవి. అందం, అహంభావం, ప్రేమ తప్ప మరో సమస్యలేని కాల్పనిక పాత్రలూ కావు. అనేక సంక్లిష్టత్వాలతో నిండిన పాత్రలను ఆవిడ సృష్టించారు.
స్త్రీ పురుష సంబంధాలు: 20వ శతాబ్దంలో స్త్రీ పురుష సంబంధాలలో అనేక మార్పులొచ్చాయి. వివాహం గురించి చర్చ జరిగింది. ధర్మబద్ధము, విచ్చేదం చేయటానికి కుదరనిది అని నమ్మే వివాహం గురించి 19వ శతాబ్ది ఉత్తరార్థం నుంచే చర్చలు మొదలైనా, 20వ శతాబ్దంలో వివాహం మతం నుంచి వేరు చేయబడి పౌర సమాజ పరిధిలోకి వచ్చింది. అంటే ధర్మం, సంప్రదాయం, ఆచారం, పవిత్రం, మార్పుకి వీలులేనిది అనే భావజాలం నుంచి సాంఘిక వ్యవస్థగా, మార్పులకు వీలైనదిగా, వ్యక్తి స్వేచ్ఛకు, యిష్టానిష్టాలకూ చోటు వుండేదిగా వివాహాన్ని మార్చాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనేక చర్చలు, ఉద్యమాలూ జరిగాక హిందూకోడ్ బిల్లు కూడా వచ్చింది. ఐతే పౌర సమాజం అంతా దీనిని యధాతధంగా విశ్వసించలేదు. ఆమోదించలేదు. సాంస్కృతిక భావజాల ప్రభావం తగ్గలేదు. వ్యక్తి స్వేచ్ఛకూ సంప్రదాయానికీ మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ తాలూకూ ఫలితాలను స్త్రీ పురుషులిద్దరూ అనుభవించారు. సామాజికంగా స్త్రీలకున్నన్ని ఆంక్షలు, విధి నిషేదాలూ పురుషులకు లేకపోవటం వల్ల పురుషుడు తక్కువ గాయాలతో ఈ ఘర్షణ నుంచి బైటపడ్డాడు. స్త్రీలకు చాలా గాయాలయ్యాయి. చాలాసార్లు జీవితాలే బలయ్యాయి. నిరర్ధకంగా గడిచిపోయాయి. అదే సమయంలో కొందరు స్త్రీ పురుషులు ప్రేమలోని అనందాన్ని అనుభవించగలిగారు.
ఇలాంటి భిన్న దశలలో భిన్న రీతులల్లో వున్న స్త్రీ పురుష సంబంధాలను మాలతీచందూర్ తన కథా వస్తువులుగా స్వీకరించారు. ఆ సంబంధాలను చిత్రించటంలో మాలతీ చందూర్ ఉద్దేశం స్త్రీ పురుషులలో సంస్కార దృష్టి పెరగాలనేదే. సంప్రదాయం, డబ్బు, బలవంతం అనే వాటికి స్త్రీ పురుష సంబంధాలలో విలువ లేకుండా, ప్రేమకు, స్నేహానికి, సమానత్వానికి విలువ యివ్వాలనీ, అట్లా యిచ్చినప్పుడే స్త్రీ పురుషులు శాంతిగా బతకగలుగుతారని మాలతీచందూర్ విశ్వాసం. ఐతే ప్రేమ, స్నేహం, సమానత్వం అనేవి స్త్రీ పురుషులిద్దరూ కష్టపడి సాధించుకోవాల్సినవి తప్ప ఆటోమాటిక్‌గా వచ్చేవి కావు. సమాజంలో యెక్కువ మందికి స్త్రీ పురుష సమానత్వం మీద నమ్మకం లేనపుడు, అత్యధిక భాగం పురుషులు తమ నిత్యావసరాలు తీర్చే మనిషి కోసం, తన వంశాన్ని వృద్ధి చేసే సంతానం కోసం మాత్రమే వివాహం చేసుకుంటున్నపుడు ప్రేమ, స్నేహం సమానత్వాలు మృగ్యమైపోతాయి. స్త్రీలు సమానత్వాన్ని కోరుతూ ప్రేమ, స్నేహాలు వివాహంలో కావాలనుకున్నప్పుడు సమస్య మరింత క్లిష్టమవుతుంది. స్త్రీలు యేదో తమకింత తిండి పెట్టేవాడైతే చాలనుకుని, పురుషులు ప్రేమ కోరుకునే వారైనా సమస్య వస్తుంది. అంటే సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానత ఉన్నపుడు, వివాహం నుంచి వారు ఆశించేది వేరు వేరుగా వున్నపుడు వారి జీవితాలు ఆశాంతి మయమవుతాయి. ఆ అశాంతి నుంచి బైటపడటానికి రకరకాల మార్గాలు వెతుకుతారు. ఆ మార్గాలు సరైనవి కానపుడు మరింత చిక్కుల్లోకి వెళ్తారు. ఆ మార్గాలనూ, చిక్కులను వివరించి స్త్రీ పురుషులను ఆలోచింప జేయటమే మాలతీ చందూర్ తన నవలల ద్వారా చేసిన పని.
”ఆలోచించు” ”కలల వెలుగు” ”చుక్కలు – రెక్కలు” ”ఏమిటీ జీవితాలు,” ”ఎన్ని మెట్లెక్కినా” ”కాంచన మృగం” ”మధుర స్మృతులు” వంటి అనేక నవలల్లో రకరకాల స్థాయిలలో, సంస్కారాలతో, సమస్యలతో వున్న స్త్రీ పురుషులను పాత్రలుగా తీసుకున్నారు. ఆ పాత్రల ద్వారా అనేక విషయాలు చర్చకు పెట్టారు.
(ఈ వ్యాసం పూర్తిగా చదవాలనుకునే వారు ‘అస్మిత’ ప్రచురించిన నవలా మాలతీయం పుస్తకంలో చదవచ్చు.)
(నవలా మాలతీయం నుండి)