వెన్నంపల్లి విజయ్ కుమార్, తాళ్ళపల్లి సంజీవ్
(ఎమ్.ఫిల్/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు
వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్)
”యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అని మనుస్మృతిలో ”ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు సంతోషిస్తారు” అని, స్త్రీలేని ”పురుషుడు అసంపూర్ణుడు” అని మరోచోట స్త్రీని గురించి గౌరవంగా ప్రస్తావించడం జరిగింది. ఇది అక్షరాల సత్యమైనదిగా మనకు నిరూపితమవుతుంది.
క్రీ.పూ. 6000 సంవత్సరాలకు పూర్వం నుండి అనగా సింధూనాగరికత కాలం నుండి భారతీయులు స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీని దేవతగా (అమ్మతల్లి) పూజించేవారు. అలాగే నేడు 1947, ఆగష్టు 15 అనంతర మేర్పడిన స్వతంత్ర భారతదేశాన్ని కూడా ”భారతమాత” గా కొనియాడుత, గౌరవిస్తూ, పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.
”విద్యా సమస్తాస్తవన దేవి భేదాః స్త్రీయః నమస్తాః సకల జగత్సు” అనే దేవీ భాగవతంలోని శ్లోకంలో స్త్రీని మాతృమూర్తిగానే గాక, జగన్మాతృమూర్తిగా వర్ణించారు. అంతర్లీనంగా ఉన్న ఈ జన్మాతృదర్శనాన్ని భారతీయులంతా పూజించేలా చేశారు.
అంతేగాక ఇప్పటికి కూడా భారతదేశంలో స్త్రీని గృహలక్ష్ష్మిగా, మాతృమూర్తిగా, హితైషిగా, దైవస్వరూపిణిగా వర్ణించి, ‘శ్రీ’ అంటూ స్త్రీని మంగళదేవతగా ప్రతి నామవాచకానికి ముందు, ప్రతి శుభకార్యానికి చేర్చి అవగాహన చేసే అత్యున్నత సాంప్రదాయం మనది అని అనేక మంది మహర్షులు మరియు ప్రాచీనులు, ఆధునికులు కూడా దీనిని నొక్కి చెప్పడం జరుగుతుంది.
పురాణాల ఇతిహాసాలలోని స్త్రీని గురించి వేరుగా చెప్పనక్కరలేదు. స్త్రీ మన సంస్కృతికి, ధర్మానికి మూలవిరాట్టు. అందువల్లే ఇక్కడ సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, ఊర్మిళ, పార్వతి, లక్ష్మీ, సత్యభామ మొదలగు ఆదర్శమూర్తుల గురించి ఎన్నో రకాలయిన గాధలు మనకు, ప్రేమ, త్యాగం, కరుణ, ఆత్మార్పణ, సంయమనం, మమత అనురాగాలను అందజేస్తున్నాయి.
హైందవ సంస్కృతి చిహ్నాలపై ఉద్భవించిన బౌద్ధమతం. దీని స్థాపకుడు అయిన ”బుద్ధుడు” సయితం తన సవతితల్లి అయిన ”ప్రజాపతి గౌతమి” పేరున ”గౌతమ బుద్ధుడు” అనే పేరుతో ఖ్యాతి గాంచాడు. తద్వారా అనాదికాలం నుండి ఎంతో గౌరవించబడిన స్త్రీ భారతదేశంలో మధ్యయుగ కాలం నాటికల్లా ఆవిద్య, అజ్ఞాన పరిస్థితుల ప్రాబల్యం వలన, మతచాందస విధానాల వలన, పురుషాధిక్య సమాజం వలన స్త్రీని పరదాపద్ధతిలో, వంటింటికి పరిమితమయి పిల్లల్ని కనిపెట్టే ఒక యంత్రంగా మాత్రమే భావించడం జరుగుతుంది.
ఆకాశంలో సగం, అవనిలో సగం అనుకుంటున్న స్త్రీలు ప్రస్తుతం భారతదేశంలో 49 కోట్లకుపైగా ఉన్నారు. కాని, స్త్రీల ప్రాతినిధ్యం, హక్కులు నేడు ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. ఎందుకంటే 102 కోట్ల జనాభాలో స్త్రీలు సగభాగమయినా వారికి ఉద్యోగాల్లో కాని, విద్యావకాశాల్లో గాని, చట్ట సభల్లో గాని, ఇంతవరకు 50% రిజర్వేషన్ కల్పించాల్సింది. కాని కనీసం 33% రిజర్వేషన్ బిల్లు కూడా ఇంతవరకు ఆమోదింపబడటం లేదు. కారణం వారిలోని సహనం మరియు నిస్సాయత, పురుషాధిక్యత ప్రభావం వలన ముందుకు వెళ్ళలేక పోతున్నారు. దీనిని అధిగమించిన రోజు మాత్రమే గాంధీజి కలలుగన్న స్వాతంత్య్రం మనకు లభిస్తుంది.
19 – 20 శతాబ్ధాల మధ్య సంఘసంస్కరణోద్యమాలు
నూతన జాతి నిర్మాణంలో స్త్రీలకు తగిన పాత్రను కల్పించే సదాశయంతో మొట్టమొదటిసారిగా ”మహాత్మాజ్యోతిరావు ఫూలే” స్త్రీ విద్యను ఒక ఉద్యమ స్పూర్తితో ప్రారంభించి విజయవంతం కావడం జరిగింది. తద్వారా అనేకమంది సంఘసంస్కర్తలు రాజారామ్మోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, టంగుటరి ప్రకాశం, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, దాదాబాయి నౌరోజి వంటి త్యాగధనులు, సంఘసంస్కర్తలు భారతదేశంలో స్త్రీల అభ్యున్నతికి అనేక రకాలయిన ఉద్యమస్పర్తి సంస్కరణలను చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది.
క్రైస్తవ మిషనరీలు
భారతదేశంలో స్త్రీల విద్యాభ్యాసం కోసం ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా పాశ్చాత్య విద్యా విధానానికి అనుగుణంగా, క్రైస్తవ మత వ్యాప్తి ఉద్దేశ్యంతో క్రిష్టియన్ మిషనరీలు స్త్రీ విద్యకు ఎంతోకృషి చేయడం వలన భారత స్వాతంత్య్రోద్యమంలో స్త్రీలు కూడా పాల్గొనడానికి దోహదపడిందిగా చెప్పుకోవచ్చు.
బ్రహ్మసమాజం
భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా స్త్రీల సమస్యలను పరిష్కరించే దృష్టితో ప్రారంభించబడిన ప్రధానమైన సంస్థగా ‘బ్రహ్మసమాజం’ను చెప్పుకోవచ్చు. దీని స్థాపకుడు రాజారామ్మోహన్ రాయ్. ఈయనను ‘ఆధునిక భారతదేశ సంఘసంస్కరణ పితా మహుడుగా’ కొనియడబడుతున్నారు. కారణం ఈయన సమాజంలో స్త్రీల యొక్క సమస్యలయిన బాల్యవివాహాలను రద్దుచేయడం, వితంతు పునర్వివాహాలను చేపట్టడం, సతీసహగమనాన్ని నిషేధించడం మొదలగు సాహసోపేతమయిన సమస్యలను పరిష్కరించడమే కాక భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకావాలని వాదించి దాని అభివృద్ధికి కూడా రాయ్ ఎంతో కృషి చేశారు.
కందుకూరి వీరేశలింగం
‘దక్షిణ భారత విద్యాసాగరుడుగా కీర్తింపబడిన ‘కందుకూరి వీరేశలింగం’ తన యవత్ జీవితాన్ని సంఘసంస్కరణకోసం, మహిళాభ్యుదయం కోసం కృషిచేసారు. స్త్రీ విద్యావిధానం అమలుకు, కన్యాశుల్కం నిర్ములనకు, బాల్యవివాహాల నిర్ములనకు, వితంతు పునర్ వివాహానికి వీరేశలింగం గారు అవిరళంగా కృషి చేయడం జరిగింది. వీరేశలింగం గారు రాజమండ్రిలో వితంతు శరణాలయన్ని, 1880లో ‘భీమవరం’ లో బాలికల పాఠశాలలను స్థాపించారు. ఇలాంటి గొప్ప గొప్ప త్యాగదనుల కృషి ఫలితంగా ఆధునిక భారతదేశంలో స్త్రీల పాత్ర ఎంతో గణనీయంగా అభివృద్ధి చెందిందని మనకు ఋజువవుతుంది. తద్వారా భారతదేశంలో స్త్రీల అభ్యున్నతి ఎంతో మెరుగుపడి వారు కూడా సవజంలో నేడు గుర్తింపును సాధించే స్థితికి చేరువయ్యరు. కావున మనం స్వతంత్ర భారతదేశంలో కొందరు సాహస నారీమణుల పాత్రల గురించి మననం చేసుకుందాం.
సరోజినీనాయుడు
1879వ సంవత్సరంలో హైదరాబాద్ నందు బెంగాలి దంపతులకు జన్మించిన సరోజినీనాయుడు గారు స్వాతంత్య్రోద్యమంలో ఎంతో క్రియశీల పాత్ర వహించి స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నిక కావడం స్త్రీజాతికే ఎంతో గర్వకారణం. నాయుడుగారు తన పాత్రను ఎంతో సమర్ధనీయంగా నిర్వహించి స్వాతంత్రోద్యమంలో గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమయిన శిష్యురాలిగా కూడా తన పాత్రను ఇనుమడింపచేయడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ‘గానకోకిల’గా ఆమెను గాంధీజీ అభివర్ణించడం కూడా జరిగింది. సరోజినినాయుడు 1949 వరకు తన జీవిత కాలాన్నంతా దేశసేవకు అంకితం చేసి చిరస్థాయిగా మనలో స్థానం సంపాదించారు.
ఇందిరాగాంధీ
‘స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా’ శ్రీమతి ఇందిరాగాంధీ సుపరిచితురాలు. ఈమె నిర్ణయలు తీసుకోవడంలో గాని, అమలుచేయడంలో గాని ఆమెను మించిన సమర్ధ నాయకత్వం ఇంతవరకు భారతదేశ రాజకీయలలో కనిపించదు.
ఉదా : 1984లో ఈమె ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా దేశసంక్షేమం కోసం ‘తప్పనిసరి కుటుంబనియంత్రణ’ కార్యక్రమాన్ని అమలుచేసిన కారణంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయన్ని చవిచసిన ప్రధానిగా కూడా చరిత్రలో నిలచిపోయరు.
సుచేత కృపాలాని : మొదటి మహిళా ముఖ్యమంత్రి
స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేత కృపాలాని ఉత్తరప్రదేశ్‌కు ఎన్నిక కావడం, మహిళా ప్రాతినిధ్యంలో ఇది ఒక ముందడుగు. ఎందుకంటే ఈమె పెద్ద రాజకీయ వారసత్వం లేకుండా తన సామర్ధ్యంతో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మహిళా జగతికి ఒక గర్వకారణం.
వి.ఎస్. రమాదేవి : మొదటి మహిళా సెక్రటరి జనరల్ రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వి.యస్. రమాదేవి మొదటి మహిళా ఎలక్షన్ కమీషనర్‌గా, కర్ణాటక గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో కూడా తన సామర్ధ్యాన్ని ప్రపంచదేశాలలో భారతదేశ స్త్రీల గౌరవాన్ని మహోన్నత స్థితికి చేర్చుటలో ఎంతో కృషిచేయడమే గాక రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు.
మాయవతి : మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి
స్వాతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్‌కు ఎన్నిక కావడం స్త్రీజాతికి ఒక గర్వకారణం. సామాన్య మధ్యతరగతికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి నేడు రెండవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై దేశరాజకీయలలో మహిళల ప్రాతినిధ్యాన్ని చాటుతుంది.
కిరణ్‌బేడి : మొదటి మహిళా ఐ.పి.యస్.
పితృస్వామ్య భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఒక జిల్లా పోలీసు నిర్వహణ అధికారి (ఐ.పి.యస్.) ఇండియన్ పోలీస్ సర్వీసును ఇష్టపడి స్వీకరించి మహిళాజాతికే ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి సెక్రటరి జనరల్‌కు ప్రత్యేక భద్రత అధికారిగా కూడా తన పాత్రను నిర్వహించారు.
కల్పనాచావ్లా : అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతసంతతి మహిళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అంతరిక్ష ప్రయణం అనేది ఎంతో సాహసోపేతమైంది. అలాంటి సాహసాన్ని మనదేశ మహిళలయిన కల్పనాచావ్లా, సునీత విలియమ్స్ సాధించారు.
ప్రతిభాపాటిల్ : 60 వసంతాల స్వతంత్ర భారత మొదటి మహిళా రాష్ట్రపతి
భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ 2007, జూలై 5 ప్రమాణస్వీకారం చేసారు. ఈమె 1934, డిశెంబరు 19న మహారాష్ట్రలోని నాద్‌గావ్ గ్రామంలో జన్మించారు. 2004, నవంబర్ 8న రాజస్థాన్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా కూడా నియమింపబడ్డారు. ఇది భారతదేశ మహిళా ప్రాతినిధ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో మహిళా ముందడుగుకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. దేశ అత్యున్నత పదవయిన రాష్ట్రపతి పదవిని చేపట్టడం మహిళా ముందడుగుకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. పై ఉదాహరణలు తీసుకుంటే దేశంలో మహిళా అభ్యున్నతి ఎంతో అత్యున్నత దశలో ఉన్నదని తోస్తుంది. కాని ఇది కొన్ని అభివృద్ధి చెందిన కుటుంబాలకు మరియు అత్యున్నత మేధావులకు మాత్రమే సాధ్యమవుతుందని క్రింది విషయలను బట్టి మనకు అర్ధమవుతుంది.
పైన పేర్కొన్న విషయలే కాకుండా ఇటీవల స్త్రీల పట్ల జరుగుతున్న అమానుషాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మహిళలకు అనేక విషయలలో ఆత్మవంచన, హింస మొదలగునవి కనిపిస్తున్నాయి. ఇటీవలి వార్తాపత్రికల్లోని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు సైతం అదనపు కట్నం కోసం తమ భార్యలను హింసిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా అనేక విషయలలో వారికి సరిఅయిన న్యాయస్థానం లేక వారు తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు.
ఉదా : ముఖ్య ఉదాహరణ ‘గృహహింస చట్టం’. ఇది సరిఅయిన న్యాయస్థానం లేనందున అనేక విషయలలో వెనుకబడి ఉన్నదిగా మనకు ఋజువగు చున్నది.
వీటి నుండి మహిళా జాతి విముక్తిని పొందాలంటే భారతరాజ్యాంగం ద్వారా మహిళలకు కల్పించిన సమాన హొదాను, ప్రాథమిక హక్కులను అందుకునే విధంగా అవకాశాలను కల్పించాలి. తద్వారా స్త్రీల అభ్యున్నతికి వారికి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం చేకూర్చడానికి సరిఅయిన చట్టాలను తేవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
1. భారత రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు స్త్రీలకు పురుషులతో సంపూర్ణ సవనత్వాన్ని ప్రసాదించాయి. కాని వీటిని అమలు చేయల్సిన బాధ్యత సంక్షేమ రాజ్యానిదే.
2. 1956 హింద వారసత్వ చట్టం – హింద కుటుంబంలో కుమారునితోపాటు కుమార్తెను సమాన వారసురాలుగా గుర్తించింది. కాని దీన్ని ప్రజలందరికి తెలియ చేయడంలో, విద్యావంతులు, ప్రభుత్వం ఎంతో కృషిచేయవల్సిన బాధ్యత ఉంది.
3. ‘1961లో వరకట్న నిషేధ చట్టం’ చేయబడింది. ఇది అమలులో వెనుక బడటానికి ప్రధాన కారణం ”స్త్రీకి కుటుంబం లో సమాన వారసత్వ హక్కు అమలుకాక పోవడం వలననే”.
గృహహింసాచట్టం : అక్టోబరు 25, 2006 నుండి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలులోకి వచ్చింది. ఇది మహిళా అణచివేతను నిరోధించే ఆయుధం. కాని దీనికి ప్రత్యేక న్యాయస్థానం, ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే విజయవంతం అవుతుంది. లేకపోతే ఇది కూడా వరకట్న నిషేధంలాగే ఉండిపోతుంది. పై విషయ లను గమనించినపుడు మనకు ఎంతో కొంత స్త్రీల ఘనచరిత్ర కనబడుతుంది కాని అంతటా స్త్రీలయొక్కపాత్ర అంత ఘననీయంగా అభివృద్ధి చెందుటలేదు. ఎందుకంటే స్త్రీలు బాల్యంలో తండ్రిపై, యవ్వనంలో భర్తపై, వృద్ధాప్యంలో కుమారులపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనినుండి స్త్రీలు బయటపడిన రోజే స్త్రీజాతి విముక్తిని సాధిస్తుంది. స్త్రీలు అన్ని రంగాల యందు అభివృద్ధిని సాధించిననాడే దేశం అభివృద్ధిని సాధిస్తుంది లేని యెడల ఆ దేశం వెనుకబడిపోతుంది. ఎందుకంటే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ ఎలాగో, ‘దేశానికి వెలుగు స్త్రీజాతి’ అని గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది.