గుగులోతు దేవోజి, కోట వెంకటేశ్వర్లు
(ఎమ్.ఫిల్/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు
వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్)
మీకు పుట్టే హక్కు ఉందా?
పురుషులైతే ఉంటుంది
స్త్రీలయితే…………..
ఏమో చెప్పలేం! ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఆకాశంలో సగం, అవనిలో సగం అనుకుంటున్న ఆడవారి జనాభా ప్రశ్నార్ధకం కాబోయే రోజువచ్చింది. ఆడపిల్ల వద్దు, మగపిల్లాడు ముద్దు అంట నేటి నాగరిక కుటుంబ గణితంలో పిల్లలకు ఎప్పుడో సంకేతాలను స్థిరపరిచారు. భారతదేశ సామాజిక వ్యవస్థలోని అవలక్షణాలు ఎందరో స్త్రీలను బలితీసుకుంటున్నాయి. స్త్రీజన్మే శాపమై పసికందులుగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారెందరో. ”అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది” అన్నమాటని పక్కనపెట్టి అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు అని పుట్టుకకు ముందే హత్యకు గురౌతున్న ఆడశిశువుల సంఖ్య ఇటీవలకాలంలో బాగా పెరిగింది. ఆధునిక ఆలంబన చేసుకోవటం దురదృష్టకరం.
గర్భస్తశిశువు ఆరోగ్యపరీక్షకు కొన్ని పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా పుట్టబోయేది ఆడ, మగ అన్నది తెలుసుకొనే వీలుండటం ఆడపిల్ల వద్దనుకొనేవారికి సాధారణంగా పుట్టబోయే ఆడబిడ్డపాలిట మరణాయుధంగా పరిణమిస్తున్నది. స్త్రీ అంతస్తుని పెంచేందుకు చట్టాలు చేస్తున్నా స్త్రీ శిశు హత్యలను అరికట్టడంలో విఫలం కావడం బాధాకరం. ఈ ఘోరాన్ని అరికట్టేందుకు భారతప్రభుత్వం గర్భస్త పిండపరీక్ష ప్రక్రియ నియంత్రణ దురుపయెగ నివారణచట్టం 1994 తెచ్చింది. ఇది 1996 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. కానీ ఈ చట్టం అమలులో విఫలమైంది. చట్టం ప్రకారం గర్భిణీస్త్రీ వయస్సు 35 సం||లు మించి ఉన్నపుడు, రెండు లేదా అంతకుమించి గర్భస్రావం జరిగినపుడు ఆమె కుటుంబంలో ఎవరైనా మానసిక వికలాంగులు, జన్యుసంబంధమైన వ్యాధులు కలవారు ఉన్నపుడు గర్భస్తపిండ పరీక్షలు చట్టసమ్మతం. ఒకవేళ పరీక్షలు నిర్వహించినప్పటికి నిర్ధేశిత ఆమోదపత్రం మీద గర్భిణీస్త్రీనుంచి లిఖితపూర్వకంగా ఆమోదం పొందాలి. ఆ పత్రం నకలు ఆమెకు ఇవ్వాలి. పరీక్షల ద్వారా పుట్టబోయేది బాలికా, బాలుడా అనేది ఆ స్త్రీకి గాని ఆమె కుటుంబంలో సభ్యులకు గాని ఏ విధంగాను తెలియజేయకూడదు. ఆరోగ్యవిషయమై జననపూర్వ పరీక్షలు జరపాలి. లింగనిర్ధారణ పరీక్షల గురించి ఏ విధంగానైనసరే ప్రచారం చేయటం నిషిద్ధం.
ఈ నియమాలను ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్ష తప్పదు. మొదటి తప్పుకు మూడు సంవత్సరాల జైలుశిక్ష 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు. తిరిగి తప్పుచేస్తే 5 సం||ల జైలుశిక్ష 50 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారికి, చేయించుకొనేవారికే కాక పరీక్షలు చేయించుకోమని ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు కూడా జైలు మరియు జరిమానా తప్పదు. చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించు వైద్యులపేర్లను రాష్ట్రవైద్యమండలి జాబితానుండి రెండు సంవత్సరములపాటు తొలగిస్తారు. తిరిగి తప్పుచేస్తే శాశ్వతంగా తొలగిస్తారు. ఈ నేరాలు బెయిల్ లేని నేరాలు.
అయినా ప్రస్తుతం ఇప్పటివరకూ ఎంతోమంది స్త్రీల జన్మే శాపమై పసికందులుగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్త్రీ శిశుహత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నా ఎవర పట్టిచ్చుకోవడంలేదు. నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటున్నారు. అయినా ఇప్పటివరకూ ఎన్ని కేసులు అయినవో ఎంతమందికి శిక్ష విధించారో ”ప్రశ్నార్ధకం”. చట్టంచేస్తే చాలా? చాలదు ఈ విషయంలో ప్రజలలో చైతన్యం తేవడం అతిముఖ్యం. అది ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. మానవ హక్కులను గౌరవించే ప్రసారసాధనాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ప్రతి ఒక్కరి బాధ్యత. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా తనవంతు కర్తవ్యంగా ప్రభుత్వ పాత్ర పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి. పిండం స్త్రీగా లేదా పురుషునిగా వృద్ధిచెందడానికి పూర్తిగా తండ్రిలోని జన్యువులే కారణమని ఇందులో తల్లి ప్రమేయం ఏమీ ఉండదని ప్రజలకు తెలియజేయలి. ఇప్పటికీ కొన్ని గ్రామలలో, పట్టణాలలో స్త్రీని ఆడపిల్లకు జన్మనిచ్చావని ఇంట్లో అత్తమామలు మరియు భర్త ఆమెను హింసించటం మరియు అప్పుడే పుట్టిన అభంశుభం తెలియని ఆ పసికందును కూడా చంపేస్తున్నారు. కొంతమంది అయితే పిల్లలు పుట్టటంలేదని పూర్తితప్పంతా స్త్రీపైనే వేసి భార్య ఉండగా మరోపెళ్ళి చేసుకున్నవారు మరెందరో ఉన్నారు. ఆడపిల్ల పుడితే ఆనందించేవారు లేకపోవడానికి ఈ సమాజం అనేక కారణాలను చపుతుంది. ఆడబిడ్డని పెంచటం ఒక ఎత్తయితే విద్యాబుద్ధులు చెప్పించటం మరో ఎత్తు. కట్నకానుకలు ఇచ్చి పెళ్ళిచేయడం ఇంక మరో సమస్య. కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అయినా ఆడబిడ్డ అత్తవారింటికి పోతుందని అదే మగబిడ్డ అయితే వంశంపేరు నిలబెడతాడని, ఆస్తికి వారసుడు అవుతాడని వృద్ధాప్యంలో పోషిస్తాడని చనిపోతే దహనసంస్కారాలు జరుపుతాడని నమ్మకం ప్రజలలో నెలకొని ఉంది. ఈ నీచమైన ఆలోచనలతో కొంతమంది కడుపులో ఆడబిడ్డ ఉండగానే కొరివిపెడుతున్నారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీ దౌర్భాగ్యస్థితికి వీళ్ళ ధోరణి అద్దంపడుతుంది. మహిళాదినోత్సవాలు ఏటేటా జరుపుకుంటున్నా, రాజకీయరంగంలో సైతం స్త్రీలు రాణిస్తున్నా ఇంకా వనితలపట్ల నిర్లక్ష్యం వరలేదు.
భారతదేశంలో 1961 నుండి బాలబాలికల నిష్పత్తి పట్టిక
క్ర.సం. సం|| బాలురు బాలికలు బాలబాలికల నిష్పత్తి
1. 1961 1000 976 1000 : 976
2. 1971 1000 964 1000 : 964
3. 1981 1000 962 1000 : 962
4. 1991 1000 945 1000 : 945
5. 2001 1000 927 1000 : 927
పై పట్టిక ఆధారంగా చస్తే 1961వ సం||లో 1000 మంది పురుషులకుగాను 976 మంది స్త్రీలు ఉండేవారు. అదికాస్తా 2001 సం|| వచ్చేసరికి వ్యత్యాసం మరీ పెరుగుత 1000 మంది పురుషులకుగాను 927 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అన్ని రంగాలలో స్త్రీలు ఎదుగుతున్నా కానీ స్త్రీలపట్ల ఆడ శిశు హత్యలు పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు.
2003 సం||లో రాష్ట్రాలవారీగా స్త్రీపురుషుల నిష్పత్తి పట్టిక
క్ర.సం. రాష్ట్రం పేరు బాలురు బాలికలు బాలబాలికల నిష్పత్తి
1. పంజాబ్ 1000 776 1000 : 776
2. హిమాచల్‌ప్రదేశ్ 1000 803 1000 : 803
3. హర్యానా 1000 807 1000 : 807
4. ఉత్తరప్రదేశ్ 1000 853 1000 : 853
5. రాజస్తాన్ 1000 855 1000 : 855
6. బీహార్ 1000 861 1000 : 861
7. గుజరాత్ 1000 862 1000 : 862
8. తమిళనాడు 1000 953 1000 : 953
9. కర్నాటక 1000 943 1000 : 943
పై పట్టికలో 2003 సంవత్సరంలో చస్తే తమిళనాడులో ప్రతి 1000 మంది పురుషులకు 953 మంది స్త్రీలు ఉండగా అదే పంజాబ్ రాష్ట్రంలో గమనించినట్లయితే 1000 మంది పురుషులకు 776 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. అంటే తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల మధ్య స్త్రీ పురుషుల వ్యత్యాస నిష్పత్తి ఎంతో కనబడుతుంది. ఈ విధంగా కొన్ని రాష్ట్రాలమధ్య వ్యత్యాసం ఎక్కువగాను, కొన్ని రాష్ట్రాలలో తక్కువగాను కనబడుతుంది.
కేరళ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలలోన స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. దక్షిణ భారతదేశంలో శిశుమరణాల రేటును పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. ఇది 0-6 ఏళ్ళ మధ్యవయస్సున్న పిల్లలలో….. బాలబాలికల నిష్పత్తి 1000 : 961గా నమోదయింది. అంటే బాలురు 1000 మంది ఉంటే బాలికలు తక్కువగా 961 మాత్రమే ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ గర్భస్త ఆడశిశువుల హత్యలకు కేంద్రంగా మారింది. రాష్ట్రంలో జిల్లాలతో పోల్చితే హైద్రాబాద్‌లో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. అది 1000 : 943 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. దీన్నిబట్టి సామాజిక దౌష్ట్యానికి స్త్రీలు ఎలా బలవుతున్నారో అర్ధమవుతుంది. గర్భస్త పిండంగా ఆమెకు చట్టం రక్షణ కల్పిస్తుంది. అది సరిగా అమలు కావడం ప్రజల సహకారం మీదనే ఆధారపడి ఉంటుంది. నేరస్థుల్ని చట్టానికి పట్టివ్వడం పౌరధర్మం. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించి ప్రభుత్వ అధికారులకు సహకరిస్తే వాటిని అరికట్టవచ్చు.
అలాగే బాల్యవివాహాలు, వరకట్నాలు, అత్యాచారాలు మరియు ఇతర పరిస్థితులకు బలౌతున్న వారెందరో మహిళలు ఉన్నారు. కొన్ని చట్టాలు పేపర్‌కే పరిమితం కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల మహిళల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు 18 సంవత్సరములు నిండకుండానే తల్లులు అవుతున్నారు. మన సమాజంలో గర్భస్త శిశువు ఆడ అని తెలియగానే గర్భస్రావానికి పాల్పడి ప్రాణాలు పోగొట్టుకొనే మహిళలు ఎందరో ఉన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నాటువైద్యులవద్ద గర్భస్రావాలు చేయించుకోవడం ఎంత ప్రమాదమో ప్రజలకు తెలియచెప్పాలి.
గ్రామ సభల ద్వారా పంచాయితీలు గర్భస్థపిండ లింగ పరీక్షలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయలి. డ్వాక్రా తదితర మహిళా స్వయం సహాయక బృందాలు మహిళా మండలాలు ఈ విషయంలో సాటి మహిళలను జాగృతం చేయలి.
బాల్యవివాహాల నిషేధిత చట్టం ప్రజల మద్దతును కూడగట్టుకోవలేకపోవడం వలనే బాల్యవివాహాలు ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రుల మాటలకు లొంగి చదువుకు దూరమై బాల్యవివాహాల గుండంలో బలయిన ఆడబిడ్డలు ఎందరో ఉన్నారు. దీనిని ప్రజల సహకారంతోనే రూపుమాపగలం. ఈ ఆధునికయుగంలో ఈ హేయమైన పద్ధతికి స్వస్తిపలకాలి. సమాజంలో స్త్రీల సంఖ్య తగ్గిపోవటం వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది ఎంతైనా ఆందోళనకరమైన అంశం. దీనికితోడు ఆడ పసిపిల్లలను అమ్ముకొనే మరియు ఇతర ప్రాంతాలకు అమ్మాయిలను తరలించే దురాచారం దేశానికి తీరని కళంకాన్ని తెచ్చిపెడుతుంది అనుటలో సందేహం లేదు.
స్త్రీ పురుష సమానత్వాన్ని పాటించి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అప్పుడే ఆడశిశువు భ్రూణహత్యలను పూర్తిగా నిర్మలించవచ్చు. లింగ నిర్ధారణ పరీక్ష విషయంలో చరిత్రను పునరావృతం కానివ్వరాదు. ”భువిని దివిగా మార్చగల శక్తియే మహిళ. ఈ మహిళను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిది.”
ఉపయుక్త గ్రంథాలు : వార్త దినపత్రికలు, యోజన మరియు తదితర బుక్స్