– కూకట్ల హనుమంతరావు
”అనుకూలాం విమలాంగీం కులజాం కుశలాం సుశీల సంపన్నాం
పంచ లకారం భార్యాం పురుషః పుణ్యోదయాల్లభతే” – మనుస్మృతి
”కార్యేశుదాసీ, మాతృదేవోభవ, అమృతం సద్గుణా భార్య, యత్రనార్యస్తు పూజ్యంతే ఇలా మనస్మృతిలోనూ ఇతర గ్రంథాలలోనూ అనేక సందర్భాలలో స్త్రీమూర్తిని వేనోళ్ళ కొనియాడారు అణువుతో నిండినదిగా ఈ బ్రహ్మాండాన్ని గుర్తించినట్లే – ఆడదే ఆధారం. మన కథ అడనే అరంభం. అడదే సంతోషం, మనకిక ఆడదే సంతాపం” అని కూడా గుర్తించారు. అందుకు పితారక్షత కౌమారే, భర్తా రక్షతి యవ్వనే… నస్త్రీ స్వాతంత్య్రమనర్హత అని మను ధర్మం చెప్పినా కందుకూరి వంటి మమానుభావులు ”మాతా రక్షతి కౌమారే… తీ రక్షతి యవ్వనే… న పరుషః స్వతంత్య్ర మనర్హతి” అని తిరగరాసారు. అయితే, ఇంత మర్యాద, ఇంత గౌరవం స్త్రీ జాతి పట్ల అంత సులభంగా ఏమీ ఏర్పడలేదు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అనేక సందర్భాలలో స్త్రీలు తాము అబలలం కామని, సబలలమని అవసరమైతే మీ దురహాంకారంపై తబలా వాయించగలమని పురుషజాతిని హెచ్చరిస్తూనే ఉన్నారు. అన్ని రంగాలలోనూ తమదైన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును నిలుపుకుంటూ సమలోకపు నారికి ఎక్కుపెట్టిన బాణంలా దూసుకుపోతున్నారు. నేడు వారు సాధించిన ప్రతీది చెప్పుకోవడానికి పేజీలు, పుస్తకాలు చాలవు. వ్యాపారాలు, రాజకీయం, లలితకళలు, ఇతరవృత్తుల్లో వంటి అన్నీ మార్గాల్లో స్త్రీలు పౌరుష సింహాలై జుట్టుముడి కట్టి ముందుకు సాగారు. అయితే సమాజపు నిలువుటద్దమైన సాహిత్యంలోనూ సుమారు ఒక అర్ధ శతాబ్దకాలం నుండి ఎందరో స్త్రీ రత్నాలు రచనావ్యాసంగాన్ని కొనసా గిస్తున్నారు. సాహిత్య లోకపు స్త్రీ రచయితలకు మూల మాత తాళ్ళపాక తిమ్మక్క. సమాజానికి, కాలానికి అనుగుణంగా, ఆలోచనా ధోరణులను, దృక్పధాలను మార్చుకుంటూ సమాజాన్ని చైతన్య పూరితం చేస్తూ ఎన్నో రచనలను వెలువరించారు. స్త్రీ తమకై తాము ఏర్పరుచుకున్న స్త్రీవాదం ద్వారా సమాజంలోనూ కుటుంబంలోనే తమకు కల్పించబడ్డ స్థానాన్ని చాలా బలంగా ప్రశ్నిస్తున్నారు. అడవాళ్ళు ”ఆడవాళ్ళే” అన్న అపహాస్య భావనలు నరనరాన అల్లుకున్న పితృస్వామ్య సమాజాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ సమన్యాయభావనలతో నిలదీస్తూ వ్యక్తి స్వేచ్ఛను ప్రకటిస్తూ తమ వాదాన్ని వినిపిస్తున్నారు. ప్రాచీన, మధ్య యుగపు కవయిత్రులు కాలధర్మానికి అనుగుణంగా శృంగారం, ఆధ్యాత్మిక, భక్తి మార్గాలలో రచనలు చేసినా నేటి రచయిత్రులు అధునిక సమాజ దృక్పథంతో అన్ని కోణాలలోనూ రచనలు వెలువరిస్తున్నారు.
”నువ్వూ, నేనూ గ్రహలోకాలు విశ్వం జల్లిన బీజాలే
మొలచినచోట్లే తేడాలు” – అసలు సంతకం
బాల్యంలోనే కలంపట్టి కవికోకిలగా గుర్తింపు పొందని సరోజినీదేవి స్త్రీ రచయితలకు స్ఫూర్తిప్రదాత, స్త్రీ జనోద్దరణ సేవా చైతన్యమూర్తి మల్లాది సుబ్బమ్మ అభ్యుదయ భావాలు కలిగిన రచయిత్రిగా, పత్రికా సంపాదకురాలిగా, అఖిలభారత మహిళా రచయితల సదస్సుకు కన్వీనర్‌గా తెలుగు యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీల వి.సిగా తెలుగు సాహిత్య పరిశోధనలో అగ్రభాగాన్ని చూపిన విద్యామణి ఆచార్య నాయని కృష్ణకుమారి గారు. అభ్యుదయవాది, మహిళా సమస్యలే నేపథ్యంగా రచనా వ్యాసంగం చేపట్టిన మహిళా రచయిత్రి అబ్బూరి ఛాయదేవి, 1954లో చిన్న కథలు రాయటం ప్రారంభించి పద్మశ్రీ అవార్డు, ప్రముఖ మహిళాపురస్కారం, అలిండియా కవామీ హలీ అవార్డు మహారాష్ట్ర ఉర్దూ అకాడమీ అవార్డు వంటి అనేక రకాల అవార్డులు అందుకుని ఉర్దూ సాహిత్యంలో తనదైన స్థానం చాటిన వారు శ్రీమతి జిలానోబానో గారు కన్నీళ్లతో కాలక్షేపం, మనసు ఎదగని మనుషులు వంటి కథలు, కూలీ వంటి ఉత్తమ కవితలు రాసి ఆదర్శ వనిత అవార్డు, డోమెన్ అవార్డు వంటి అవార్డులను పొంది అనేక కాలేజీలను, పాఠశాలలను స్థాపించి దిబెస్ట్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డును అందుకున్నవారు శ్రీమతి అమృతలత, సహజ, స్వేచ్ఛ, కన్నీటికెరటాలు, భిన్న సందర్భాలు, అతడు- ఆమె-మనం వంటి అనేక సంకలనాలు రచించి భూమి పుత్రిక, సామాన్యుల సాహసం, పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం వంటి అనువాదాలు చేసిన ఫెమినిస్ట్ అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్”కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినవారు శ్రీమతి ఓల్గా. ఇంగ్లీషు, సంస్కృతం వంటి విభిన్న భాషల్లో, ప్రావీణ్యం సంపాదించి గంగాదేవి గారి మధుర విజయాన్ని ”మధురా విజయ మాధురి” గా తెనిగించారు రచయిత్రి, వక్త, శ్రీమతి అరుణా వ్యాస్. ఈమెచే ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదింపబడిన మరొక కావ్యం ”మన భవితవ్యం” వస్తువులో గొప్ప ఆర్ద్రతను, నిరాడంబరతతో కూడుకున్న సూటిదనాన్ని నింపుకున్న రచనలు చేసిన గొప్ప సాహితీవేత్త ”మహాశ్వేతాదేవి”. ఒకవైపు రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్టుగా తమదైన శైలితో ముందుకు సాగిపోతూనే మరోవైపు స్త్రీ జనోద్దరణకు నడుం కట్టిన మహిళగా కొండవీటి సత్యవతి. ఇలా ఎందరో మన చరిత్రను కాపాడే దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు.
దాదాపు పాతిక సంవత్సరాలుగా తెలుగునాట స్త్రీవాదపు ఆలోచనలు విస్తృతంగా చర్చింపబడుతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక శ్రేయస్సు వంటి భావనలు ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. తెలుగుతల్లి, భరతమాత, జననీ జన్మభూమిశ్చ వంటి పదాల ద్వారా స్త్రీ జాతికి ఇచ్చిన గౌరవానికి నేటి సమాజం గొడ్డలి పెట్టుగా తయారవుతోంది