అచ్చమాంబ (వరంగల్‌) – మనకు తెలియని మన చరిత్ర

నా పేరు సుశీల ఇంటి పేరు రేగళ్ళ. జగ్గారెడ్డి గారు తండ్రిపేరు. మా ఊరు గొల్లచెర్ల. మానుకోట తాలూకా. వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాది కూడా చాలా బీద కుటుంబం. ఇగప్పుడు నైజం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం వచ్చింది. అందులో స్త్రీలంతా ఏదో సంతోషపూర్వకంగా ఉయ్యాల పాటలు – అదీ ఇదీ అనుకుంట వస్తుండేది. ఇగ అదే ఉత్సాహం ఇగట్లనే జరిగిపోయిందనుకోరాదు! నాకప్పటికి పద్నాలుగేళ్ళు¦న్నయి. అప్పట్నుంచే ఈ ఉత్సాహంలో పడిపోయిన.

మా నాన్నకు చదువురాదు. మా తమ్ముడు చిన్నోడు. మేం ముగ్గురం ఆడోళ్ళం. అయిదుగురు మొగోళ్ళు పెద్ద కుటుంబం. మాదంత కష్టపడే కుటుంబం. ‘అందరికీ చదువులున్నయి. మన పిల్లలకి చదువుల్లేకపోతే బాగోదని, ఎవర్నన్న తీసుకొచ్చి ఇంట్లోపెట్టి చదివిస్తే, పిలగాండ్లు కాస్త తెలివిగల్లోళ్ళయితరని, మా నాన్న ఒక సాతానిపంతుల్ని తీసుకొచ్చి ఇంట్లనే ఒకపక్క వాళ్ళకిచ్చేసి అండ్లనే చదివిస్తుండేది. మా నాన్నతోపాటు మేమందరం పిల్లలం కూడా వ్యవసాయప్పనులు తెల్లందాక చేస్తుండేది. ఏదో కొంచెం భూమి ఉండేది. పొద్దుమీకి అందరు చదువుతుంటె నేనేం చేసేది! ఎంతపని చేసొచ్చినా కూడా వాళ్ళతోపాటు జంటకిపోయి అ, ఆ, ఇ, ఈ, లన్నీ రాసుకుంటా కూర్చుండేది. ఇట్ల, ఇట్ల, ఇట్ల మూడో తరగతి వరకి చదివిన ఇది చదివేద న్కా కూడా మా నాన్నకి తెల్వనేతెల్వదు.

నాకు పదేండ్లుండొచ్చు. పెళ్ళయింది. అయిన తర్వాత ఆయన నేను – ఇగందరం కల్సివచ్చినం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇగాయన పట్టుబడయ్యిండు. పట్టుబడయ్యిన తర్వాత ఇగ నేనొక్కదాన్నయిపోయిన ఎట్ల కావాలప్పుడు? అప్పుడు చిర్రావూరి లక్ష్మీ నరసయ్యగారని ఖమ్మం ఆయన, తీగల సత్యనారాయణ గారని మానుకోటాయన ఉండె, మేమందరం కలిసి ఉండె. వాళ్ళ న్నరు. ‘ఏం భయపడాల్సిన అవసరంలే దమ్మా, మేం అందరంలేమా!’ సరేే అని చెప్పని ఇగ వాళ్ళ సహకారంవల్ల నేను వారితోపాటే ఉంటూ వచ్చిన. ఇగ ఈయన పట్టుబడయ్యిన తర్వాత ఇగొస్తరగొస్తరని చాలరోజులదన్క చూసినరాలే!

నాతోపాటు ఏడెనిమిదిమంది వచ్చేసిన్రు. మా ఊర్లనుంచే ప్రక్క ఊరు నుంచి ఇద్దరొచ్చిన్రు. మధ్యలోనే పోయిన్రు. కొంతమందిని జైల్ల ఏసిన్రు ఒకామెని జైల్లనే చంపేసిన్రు. బుచ్చమ్మ అని ఉండేది. ఆమెది మా ఊరి ప్రక్క పిండిప్రోలని ఖమ్మం తాలుకాలోది. జైల్లనే చంపేసిన్రామిని. జైల్లకూడ పోరాటం చేస్తాపోయింది. ఈమె ఉంటే ఒక చీడపురుగు ప్రమాదం అని ఆమెనాడనే చంపేసిన్రు. అంటే అసలు వాళ్ళు ఏం చేసిన్రు అనేది కాదు. అప్పటికి మేం చెట్లల్నే ఉంటిమి. ఇగా ఫలాన ఆమెని పట్టుకున్నరు. గిట్లగిట్ల చంపేసిన్రని తెలిసింది. ఆ తర్వాత మెల్లిగ తుపాకులు పట్టుకోవడం అంత నేర్చుకున్నం. అప్పుడొక డాక్టరొచ్చిండు. వచ్చి ట్రైనింగిచ్చిండు. ఆయనపేరేదో రామదాసుండె, ఆ ట్రైనింగ్‌లో నాతోపాటు స్వరాజ్యం, లలిత, లక్ష్మి ఉండె, కట్లు కట్టటం, ఇంజక్షన్‌ లివ్వటం, గాయాలు శుభ్రం చేయటం నేర్చుకున్నం మొత్తం డాక్టరు బాధ్యతంత ఇంక నాకే ఇచ్చేసిన్రు. ఇగ వాళ్ళకంత ఒకామె ఏరియాకమిటీ ఆమె, ఒకామె సభ్యురాలు. ఒకామె సమకార్యదర్శి ఇట్ల ఒక్కొక్కటిచ్చిన్రు. ఇగ పోరాటమప్పుడు నేను ప్రత్యేకంగా సంచిని సంకనేసుకుడు, మొత్తం మందులన్ని నా దగ్గర ఉండుడూ. దళాలకు దళాలకు తిరగడం ఇంజిక్షనులివ్వటం, కట్టు కట్టటం ఇవన్నీ నేను. మరి నా దగ్గర ఒక్క ఆయుధం కూడ లేదప్పుడు. ఏవైనా నాకిద్దరు కొరియ ర్సుండేది. నేనెటుపోతే వాళ్ళటొస్తుండేది. వాళ్ళకన్నీ శుభ్రం చేసి కట్టుకట్టి ఇంజిక్షన్‌ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఆడినుంచి మళ్ళి తీసుకొస్తుండేది. తీసుకొచ్చి మళ్ళి సెంట్రల్‌ కమిటీలోనే నన్ను వాళ్ళుంచుకుంటుండేది. ఎందుకంటే ఇటువంటి మనిషిపోతే వాళ్ళకి ప్రమాదం కదా. మనిషి దొరకడం కష్టం కదా. ‘అనుభవం ఉన్నటువంటి మనిషి. అన్నీ చేస్తుంటది ఓపికతోని’ అని చెప్పి నాకెప్పటికీ ఇద్దరు మనుషులనిస్తుండేది.

ఇగ దళంల ఉంటంగద అంతా మొగోళ్ళ యిరి. మనమంత కలిసి మెలిసి ఉంటుంటం గద. అప్పుడిగ పరిస్థితులెట్లుంటయి తెల్సా! ఎవరి కన్నెటు వంటిదో ఏ రోజెటువంటిదో, ఎవరిస్థితెటువంటిదో తెల్వదు. దళంల నేను చాలా పనిచేసేది. బట్టలుతికేది, రొట్టెలు చేసేది. ఏ మనిషికి ఏరకంగ పెట్టాల్నని అన్నీ పెడుతుండేది వాళ్ళకి. అందరికి ఒక్కతీరుగ పెట్టాల్నంటె మరియు ఈయనకి రొట్టెలుచేసి పెడ్తిని. ఇంకొకాయనకు ఉప్మా చేసిపెడ్తిని. వాళిద్దరికది పెట్టినపుడు మరి నాకు రొట్టెలెందుకియ్యవు అని గిట్ల వచ్చిందన్న మాట పంచాయితి. అంటే ఈయన పరిస్థితి చూసి ఈయనకన్నంపెడ్తిని. ఆయనకు రొట్టెపెడ్తిని. నాకు అన్నమెగావాలె అని గిట్ల కొట్లాటలు పెడ్తెఎట్ల? ఇగా గటువంటి పంచాయితిలన్ని వచ్చేసినయి. అయినా పరువాలేదని తట్టుకోగలిగిన, తట్టుకున్న, బైటపడ్డ. అబ్బ, భలే చరిత్రండీ అది చెప్పుకుంటె.

అప్పుడు మోహన్రావుగారు దళ నాయకుడుండె. మాకు కొన్ని రోజులయిన తర్వాత మాపార్టీలో మాకీ గల్లంతులైతుండె. విషయాలన్ని ఎవరికివాళ్ళే కడుపుల పెట్టుకోవాలె అని ఎవరికి వాళ్ళే కడుపుల పెట్టుకుంటుంటిమి. లేకపోతే లాభంలేదసలు. నీ దగ్గరివి నా దగ్గర నా దగ్గరివి నీ దగ్గర అన్ని కొండలంత తయారయితయి. అదే బయటపడతయనే ఉద్దేశంతోటి అట్లే కడుపుల పెట్టుకునేది. ఒకసారి స్వరాజ్యం గూడ ఉండె ఏరియాకమిటీ సభ్యురాలిగ ఈమె నామీద గూడ ఒక పెద్ద ఇదిజేసిన్రు. ఇగ ఫలానాయనతోటి, అలవాటనిచెప్పి పెట్టుకొచ్చిన్రు. చీనేనసలట్ల చెయ్యలేదు. నా ప్రాణం పోయినా మంచిదే నేనట్లచేసే మనిషిని కాను అనని చెప్పి నేను, చేసినవని వాళ్ళు. చేసేటట్లుగ వుంటె నేనిట్లనే నిలబడత, కాల్చేయండని చెప్పి నేను. ఋజువు చెయ్యండి, ఆ మనిషి చేతగూడ రుజువు చేయించండి. అయ్యో నేనివ్వాళ చచ్చిపోతని నాకేం భయంలేదు. చచ్చిపోతమని భయముంటే ఇండ్లకి రాకనే పోదుం అనని చెప్పి నేనన్న, వాళ్ళేం చేసిన్రా? కొన్ని రోజులయిన తర్వాత సరే ఈమెని పరీక్షిద్దామని వేరే దళంకి పంపించి ఉంచిన్రు. ఆ దళంలోవుంది ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతుంటి. మలేరియా ఇంజెక్షన్‌ లిచ్చేటందుకు, కలరా ఇంజెక్షన్‌ లిచ్చేటందుకు దళదళానికి నన్ను తోలుతుంటిరి. ఇంజక్షన్‌ లిస్తుండేది. పనిచేస్తనే ఉండేది. అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పొప్పుకొమ్మనంటుండేది. చెయ్యనిపతప్పు ఒప్పకోనని నేననేవరకల్ల ‘మీరెడ్డికులమండీ బద్మాష్‌ కులం. మీరస్సలు ఒప్పుకోరు’ అంటడాయన. ఆయన పేరేదోవుండె… తిరుమలరావు. బ్రహ్మణ కులం ఆయన. బద్మాష్‌ కులమైనా ఏ కులమైన తప్పుచేసినదాన్నయితే ఏం అన్పించదు. చెయ్యనిదాన్ని చేసినవంటె ఛస్తే ఒప్పుకోను అనన్న. తర్వాత ‘నిన్ను పార్టీ సభ్యత్వనుంచి తీసిపారేస్తున్నం’ అనన్నడు. అప్పుడు ఏరియా కమిటీ సభ్యుల్లో ఆయనుండె. స్వరాజ్యంకూడుండె. అయితే తీసేసిన్రు. నాపేరు అచ్చమాంబని ఉండె. ఇగ రాసిన్రు, అచ్చమాంబనిగిట్ల తీసేస్తు న్నం, దళంల నుంచి పార్టీ సభ్యత్వం నుంచి తీసేస్తున్నం, ఈమెని వెళ్లగొట్టేస్తున్నం అని చెప్పి కరపత్రం తీసిన్రు. ఏందిది చెయ్యని తప్పు నామీద పెడుతున్నారు వీళ్ళని అన్పించింది. సరే జరిగిందేదో జరగనీ. ఇవాళ గాకపోతే రేపన్న తెలుస్తదిగదా అని ఊర్కున్న. ఇగ నేను పోతుంటె బట్టలు గిట్టలు, సంచులు, గించులు అన్నీ చెక్‌ చేసుకున్నారు.

ఈ స్వరాజ్యమే బట్టలుగూడ ఇడిపించి చెక్‌ చేసింది. ఆమె ఒక కాయితం రాసిపెట్టింది. ‘ఇట్ల అచ్చమాంబను పార్టీ సభ్యత్వంనుంచి తీసేస్త్నుం’ అని. ఆ కాయితం తీసుకున్న, చూసుకున్న చూసేవరకల్ల స్వరాజ్యం సట్టన ఉర్కొచ్చింది. కాయితం లాక్కుంది. సరే అయితెమానెలే అనుకున్న, పోతన్న అనిచెప్పి ఎలొచ్చిన కొంతదూరం ఎల్లొచ్చిన తర్వాత బ్రహ్మాండమైన వర్సం, వాగు, నన్నక్కడ ఇంకొక సెంటర్లో ఉంచిన్రు. ఉంచి రేపు తీస్కపోతం, ఎల్లండి తీస్కపోతం అనంటుండె. సరేలే అని ఊర్కున్న. స్వరాజ్యం భర్త సుబ్బారావుగూడ అదే సెంటర్లో వుండె. అయనకిగూడ పార్టీ సభ్యత్వం నుంచి తీసేసిన్రు. ఆయనడిగిండు. చెల్లెమ్మా! ఎక్కడి నుండి, ఏమిటి సంగతని. గిట్లగిట్ల జరిగిందని నా జీవితకథంత చెప్పిన. తర్వాత నువ్వేడవోతవు! ఎట్ల బతుకతవు! నిన్నెవరు బతకనిస్తరు! అనన్నడు. ఎట్లనో బతుకుత అన్న తర్వాత ఆయనేం చేసిండు, నువు రైలుకుపోవాలన్న, బస్సుకు పోవాలన్న, తల్లిగారింటికి పోవాలన్న ఉంటదనిచెప్పి ఒకొందరూపాయలు నాచేతికిచ్చిండు. నా చేతులొక్కపైస లేదప్పుడు మరి పార్టీ వాళ్ళయిన ఒకపైస లేకుండె. ఈమెట్లపోత దని ఏమన్న అనుకున్నరా! ఇంత చేసినగద. ఒక వారం రోజులున్నక్కడ. ఇంతోకి చిర్రావూరి లక్ష్మీనర్సయ్య గారక్కడికొచ్చిన్రు. ఏందమ్మ. ఇక్కడికెట్లొచ్చినవు. ఎందుకొచ్చి నవు ఏంది సంగతన్నడు. గిట్లగిట్ల సంగతి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి ఇసొంటొస్తరా అనన్న. వచ్చి కూర్చున్నంక మొదట్నుంచి చరిత్రంత చెప్పుకొచ్చిన. ‘ఎల్లిపొమ్మన్నరు. పోతనని వస్తున్న’అనన్నను. ‘అట్ల ఎల్లిపోతరా!’ అన్నడు. ఇంకేంటిమరి! పార్టీ పొమ్మన్నప్పుడు పోవాలె, ఉండమన్నప్పుడు వుండాలె. అంతేకాని వాళ్ళొద్దన్నప్పుడు నేనుండాల్ననుకొంటె వాళ్ళ అయిష్టతకు ఇంకెన్ని అధాండాలేస్తరోమరి. అందుకని నేనుండదల్చుకోలేదు. ఆయన ‘అసలు సంగతేందో నేను దెల్సుకుంట’ అని నన్నుంచిండు. తర్వాత కమిటీకి ఉత్తరంరాసి మనిషిని పంపిండు.

ఆమె లేకపోతే ఇంటికిపొండి ఎర్రె పోయినట్టు. ఆమెపోతే ఎవరీకట్లు కడతరు! ఎవరీ ఇంజక్షనిస్తరు, ఎవరిగ ఏం చెయ్యగల్గుతరు? ఆమెనెందు కొద్దన్నరు? కాకపోతే ఆమెమీద కాపలాలుంచండి. ఎటుపోతున్నది. ఏం చేస్తున్నది చూడండి. కాని మనిషిని చూడబోతె అటువంటిదికాదు. మీరేదో లేనిపోనివన్నీ పెడ్తున్నరామెమీద. అట్లాంటి మనిషిపోతె మరి మనకి జన్మలో దొరకదు. సంగతేందో నేనక్కడికొచ్చినపుడు మాట్లాడుకుందాం గాని అర్జంటుగ ఈమెనక్కడికి పిలిపించుకోండి’ అని రాసి పంపిండు. దాని తర్వాత వాళ్ళొచ్చి నన్ను తీస్కపోయిన్రు. పదిహేను రోజులో నెలరోజులో అయిన తర్వాత మళ్ళీ పార్టీ సభ్యురాలిగ తీసుకున్నరు. అప్పుడే ఒక దళానికి ఇంజెక్షన్‌ ఇచ్చేయటానికి పొమ్మన్నరు నన్ను. దళాలల్ల అందరి గుణాలొక్క తీరుగుంటయా అండ్ల ఒక ముండకొడుకు ఏం జేసిండుగదంటె – ఈమె నాకల వాటేనంటడు వాడు. ‘ఎహె! లండీ కొడుక నీ మొహం నేనెందుకు చూసిన?’ అని అనేటట్టున్నదా అసలు, ఇగెవ్వరు పక్కవాళ్ళు నమ్ముతలేరు. ఈడేమొ ఆ మాటంటడు. నాకు బాధయ్యింది. వాడక్కడే వున్నడు ఆ దళంలో. అక్కడే ఇంజక్షనిచ్చి రమ్మంటరు వీళ్ళు. మొహనరావుగారొచ్చిన్రు. లేదమ్మా! నువు తప్పనిసరిగా పోవాలె. నవున్న ఝాన్సీరాణివి నువ్వదట్ల, నువ్విదిట్ల అని పొగ లెక్కిస్తున్నడాయిన. నాకీపదవి అక్కరలేదు, నేనుపోను. ఆ దళానికి ఇంజెక్ష నివ్వను. దబ్బునేదైనగాని, పట్టిలాగినాగాని ఏం చేస్తం? మంటకోర్వం. అటు వంటప్పుడు ఎవరెవర్ని నమ్మేటట్టున్నది? సరే ఖచ్చితంగపోనని అంటంటె ఎందుకు బలవంతం చేస్తరని మోహన్రావు వాళ్ళకు చెప్పిండు.

కొన్ని రోజులయిన తర్వాత వేరే బాటపట్టినం. తిమ్మాపురమని నర్సంపేట తాలూకా. అల్లినగర్‌, తిమ్మాపురం అనంటరే… అక్కడ పెద్ద పోరాటమయింది. ఒకసారి మేమంత ఇక్కడ పడుకున్నం. చుట్టు గిరాయించుకున్నరు. రాత్రి పూటనే. ఇగ మాకెటు పోదామన్నా ఎటు వీలుకాకుండయి పోయిందడివిల. మాతోపాటు రెండు దళాలున్నయి. వాళ్ళు మమ్ముల చీల్చి దెబ్బకొట్టగలిగేది. ఎందుకో పోలీసులకాబుద్ధి పుట్టలేదు. కాని వాళ్ళేంచేసిన్రంటే కొంచెం గండిపడిన్రు. ఆ గండిల నుంచి మేం ఎల్లొచ్చినం. ఎవ్వరం చచ్చిపోలేదాసారి. ఇగ మళ్ళీ రెండోసారి మేమంతకల్సి దళాలన్ని చీలిపోవడం కొరకు, ఇగ నువ్వెటుపోతవు నేనెటుపోతనని ప్రయత్నం చేయటం కొరకు మీటింగ్‌ పెట్టుకున్నం. ఆ మీటింగప్పుడే ఈ మోహన్రావుగార్కి బ్రహ్మాండమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో ఈయన్నెక్కడ అర్సుకోవాలె, మీటింగులెట్ల కూర్చోవాల్నని చెప్పి అయన్నక్కడ పడుకోబెట్టి నేనొచ్చి మిటింగుల కూర్చొన్న, కూర్చొని మాట్లాడు తున్నం. ఒకతన్ని ఊళ్ళోకి పంపించనం. ఊళ్ళోకి పంపించినం. ఊళ్ళో వార్తలేంటి ఏం సంగతి అని తెలుసుకోవటానికి. అతనేం చేసిండుగదంటె, పోయిండు, సక్కగ పోలీసుల దగ్గరికేపోయిండు. మాకేమెరుక, పంపించినంగదా అని జెప్పి సెంట్రీ పెట్టుకో కుండ మేం కూర్చున్నం. వాడు సక్కగ పోలీసుల్ని మెమున్నకాడికే తీసుకొచ్చిండు. ఇగ మాకెటు తోచలేదు. ఆట్లనే కూర్చున్నం అందరం. ఎవ్వరాయుధాలు వాళ్ళ దగ్గర్నే ఉన్నయి. ఎవ్వరెటు చప్పుడు చేస్తలేరు. అంతా అయోమయం అయిపోయింది. వాడు గబా గబా ఉరికొచ్చినడిమిల్నేగభాల్న దుని కేసిండు. ఆ రోజు పండుగ చేసుకుందామని ఇగెట్లయినా చీలిపోతున్నం గదా, బతికేటోడెవరో, సచ్చెటోడెవరో. అందరం కల్సి ఒక ఏటపిల్లని తీస్కొచ్చి, కోసుకొని జల్సా మాదిరి చేసుకుంటాన్నం. నేనేం చేసిన అంతదూరాన చెట్టుకింద వంటబెట్టిన, కూర్చునేచోట వంటబెట్టకపోయేది. పొగనిబట్టి వాల్ళొస్తరని. నేను వంటకాడ దించొస్తననిబోయిన అప్పుడే వాడొచ్చిండు. ఇగ నేనున్నకాడికి ఎదురు వెట్టేసిండు వాడు. పెట్టేవరకు రయ్యిన గుండొచ్చింది. ఈ చెవ్వెంబట్నే దూస్కపోయింది. నాకిప్పటికి ఇనరాదు ఇదొక్కటే చెవ్వు. కొద్దిగటవుతె చచ్చిపోయుందు. ఎక్కడ ఇవాళ్ళక్కడ చెల్లా చెదురైపోయిన్రు. నేను కొంత దూరం ఉరికొచ్చిన. నాది పచ్చనీరుండె. వాడు నాయెంబడే పడిండు. వాడికి నాకు ఇరవయ్యడుగులుండొచ్చు దూరం. మనిషిని దొరుకబట్టాల్నని వాడు దెబ్బకొడతలేడు. నేను దొరుకుతలేను. ప్రాణం పోయినాసరే కాని వాడిచేతికి దొరకొద్దన్న ఉద్దేశంతో నేనురుకుతున్న, వాడురుక, నేనురుక, వాడురుక, నేనురుక. కొంత దూరం పోయిన తర్వాత ఇగ ఆశ చాలించుకున్నడు. పోలీసుల గుంపుల పడిపోయిండు. మోహన్రావుగా రెక్కడ పాయెనని చూసెటప్పటికి ఆ ప్రక్కనుంచొస్తున్న డాయన. నేనిటుతిరిగి ఆయనను చూసి, ఆయనను అమాంతం బుజం మీద ఏసుకున్న, బస్తలాగ. ఏసుకొని ఈడినుంచి కొంతదూరం తీస్కపోయిన, పోయినంక పెద్ద గుచ్చింది. ఆయనకి బాగ జ్వరముండె. కాని దెబ్బలేం తగల్లే. ఆ గుట్ట దగ్గరదించి ‘కాస్సేపు రెస్టు తీసుకో తర్వాత చూద్దామని’ చెప్పి కూర్చున్న. మంచి నీళ్ళు కావాలనె. యాడున్నయి!’ దాడి జరిగినచోటికి పోతేనే మంచి నీళ్ళు. కొంచెం సేపు కూర్చోపెట్టి మెల్లె మెల్లెగ, మెల్లె మెల్లగ గుట్టెక్కిచ్చిన, పోలీసులకానంగనే బాట. ఆడనే మామనిసి ఒకాయన పొట్టల గొలిబడ్డది. దానితో అమ్మ, అయ్య అంటున్నడు. పోలీసులే బట్కపోతున్నరేమొ,

అందుకే ఈయన అట్లంటున్నడని భయమేసింది మా ఇద్దరికీ, గబ గబా పోయినం. అక్కడ గడ్డుంట దడివిల. గడ్డిలో మళ్ళీ గడ్డికప్పుకొని పడుకున్నం. ఒక గంటన్నర ఆట్లనే ఉన్నం. అప్పటికి సాయంత్రం ఎనిమిదయింద. ఈ దాడి జరిగింది నాలుగుగంట్లకి. ఒక చెట్టు దగ్గర కూర్చున్నం. ఈయనకి బాగా జ్వరం ఎక్కువయింది. మంచినీళ్ళు దొరుకుతలేవు. అక్కడన్నీ పులులు, గుడ్డేలుగులు గాండ్రు గాండ్రుమంటున్నయి. అవతలపక్క దెబ్బల అదురుకు అన్నీ ఇవుతలకొచ్చేసినయి. ఇగ మామీదేడబడతయ్యొనని మాభయం. చేతుల ఏంలేదు. ఒక్క కట్టు బట్టలతోటే ఉన్నం అన్నీ పోయినయి. ఆయన దగ్గర సంచొక్కటుండె. అంత నోడ్సు చేసి పెట్టుకుంటరుగద. అది మాత్రం ఉండె. నా సంచి బరువుపాడయ్యె, అన్ని మందులాయె. ఎక్కడ రాలిపోయిందో పోయ్యింది. మొత్తం చీరంత చిరిగిపోయింది. అదేంటో అసలా లీల అనేటిది అట్లొస్తదను కుంట నేను. ఒక చెట్టెక్కి గబగబా ఉసిరికా యలన్ని తెంపుకొచ్చి, దిగి బండమీదేసి దంచి పిట్ట పిల్లలకి పెట్టినట్టుగ ఆయనకి నోట్లో పెడతాపోయిన. అట్లనే తెల్లారింది. తెల్లారినంక ఎటుపోవాలి ఎవరులేరని చెప్పి ఆలోచించి కూర్చొని, అప్పటికప్పుడు ఒక కాయితం తీసుకొని ఒక మాపుదించిన, ఇప్పుడింక ఎడమచెయి వైపేపోతే దాడి జరిగిన చోటికేపోతం అనిచెప్పి కుడిచేయి వైపు నుంచి కొంత దూరం పోయినం. అక్కడేదో చప్పుడైనట్ట నిపించింది. మీరెనక ఉండండి, నేను ముందుంట, ఒకరంపో యినా ఒకరం ఉంటంగద అని చెప్పి ఎనిమిది తొమ్మిది గజాల ముందు నేను ఎనక ఆయన పోతావున్నం. పోంగపోంగ ఈ పొట్టలో గోలిపడ్డాయన ఉన్నడుగద. ఆయన ఒక పొదలనక్కి ఉన్నడు. అంతకు ముందే మయిందంటె దళంకాడ ఎవరెవరు చచ్చిన్రని చూసుకునేదానికి పోలీసులొచ్చి న్రు. ఒకతను చచ్చిపోయుండె. ఆ కట్టెలన్ని అక్కడపడేసి, ఆయన్ను కట్టెల్ల కాల్చేసిన్రను. ఈ చేతికి గడియారం ఉన్నదట్లనేవుండె. పొట్టలో గోలిపడ్డాయన, ఏడబట్కపోతరో అని చప్పుడ్జేయకట్లనే ఊర్కున్నడు. అప్పుడు మావాళ్ళొచ్చిన్రు. ఓ అన్నలారో, పోతన్నరే నన్ను తీస్కపోండే అని అనేవరకల్ల ఒకపంచగట్టి అందులో ఆయన్నేసుకొని తీస్కపోయిన్రు. అప్పుడే నేను మొహన్రాపు గార టొచ్చినం. ఈయనేమొ డ్రెస్‌మీదుండే వరకల్ల పోలీసులను తీసుకొస్తున్నడనుకున్న మా వాళ్ళంత బైగ్గంపాడైపోయిన్రు. ఈ పొట్టలో గోలిపడ్డాయన్నక్కడే యిడిసిపెట్టిన్రు, ఎల్లిపోయిన్రు. అరె! వీళ్ళు పోతున్నరుగదా అనిజెప్పి నేను దబదబ చెట్టెక్కి, ‘ఒక్కదాన్నే వున్న మీరు పోకండి’ అన్న. అప్పడాగిపో యిన్రను. నేను వాళ్ళదగ్గరపోయిన సంగత లంతజెప్పి వాళ్ళను తీసుకోని మోహన్రావు గారి దగ్గరికొచ్చిన. పొట్టలో గోలిపడ్డాయన దగ్గరికిపోయేవరకల్ల ఆయనేడుస్తున్నడు. పొట్టంత దొడ్డయ్యింది.

మందులేమొ లేవాయె. సరేపోదాం పాండని ఆయన్ని నేనే వీపుకేసుకున్న. మంచనీళ్ళని ఏడవటం మొదలుపెట్టిండు. ఆయాసం ఎక్కువయింది. నేను పట్టుకుంట మీరెల్లి నీళ్ళు తీస్కరాండని పంపించిన. ఎక్కడనో గింతంత చిప్పల నీళ్ళు తీసుకొచ్చిన్రు. ఆ నీళ్ళు పోస్తనే ఉన్నారు. ఇట్లనే ప్రాణం పోయింది. నాకు తెల్వలేదు. అట్లనే మొస్తుంటె బరువెక్కుతుంది. అయ్యో ఓ వీరయ్యా! బరువవుతుంది, ఉన్న మనిషున్నట్టు బరువవుతుందని అంటే మోహన్రనావుగారొచ్చి చేయిపట్టిచూసి ప్రాణం పోయింది. పడుకోబెట్టమన్నారు… ఇట్లనే పోయినోల్లని పోయినట్టుగ పారేసుకుంట పోవాల్సిందే ఎద్దుకు దుక్క జీవితంలాగ అని, పక్కకు పడుకోబెట్టి అందరం కలిసి ఆ కట్టె ఈ కట్టె తీసుకొచ్చి కాల్చేసిపోయినం. అయిదుగురం ఉండె. అంతా ఎండుగడ్డి, ముళ్ళు. ఆ ముళ్ళల్ల గడ్డిల పోతాంటే తొడలంతా రక్తమండలం. మొత్తంరక్తంతోటి చీరంత ఇట్ల పిండితే కారేటట్లయిపోయింది. నడువలేక పోతున్నం. మోహన్రావుగార్కి జ్వరం. నన్నుగూడ ఇక్కడ్నే వదిలిపెట్టిపోండి అంటడాయన. ఇదెక్కడి పాపం! ఆయనంటె చచ్చిపోయిండు. బతికున్న మనిషి నెట్ల వదిలిపెట్టి పోవాల య్యా! ఫరవాలేదు. ఇట్లనే ఒక చెట్టుకిందొక రోజు, ఒక చెట్టుకిందొక రోజు ఉంటా పోదామని చెప్పిన. కొంతదూరం పోయిన తర్వాత ఒకచోట కూర్చొని ఆ ముళ్ళన్నితీస్తే ఏం ఉన్నదనలు! చీరంత చిరిగిపోయింది. ముడిపెట్టుకుంట నెల పదిహేను రోజులున్న. ఆ ముడిపెట్టుకోవటానికి కూడ దారమా ఏమన్ననా! కుట్టుకోవడానికి పోగులేకుంట చిరిగిపోయింది. ఇగ బహిష్టయినపుడు చూడాలి. ఆ అవస్థ బ్రహ్మదేవుడికెరుక. గొడ్లకాడికి పోరగాళ్ళొస్తరు, వాళ్ళదగ్గరపోయి అడిగేది. తమ్ముడూ, ఇంత గుడ్డియ్యరా అంటే వాళ్ళెందుకనేది. ఏంలేదు చీరంత చిరిగిపో యింది కుట్టుకుంటా అనేది. ఇగ వాళ్ళింత పీలికిస్తే ఆపీలికనే బుజంమీదేసుకొని ఇంత మానం కాపాడుకున్నట్టుగ ఏసుకునేది. ఇట్ల ఇట్ల ఇట్ల కాలం గడుస్తావుంది. కాని మాకు పార్టీ వాళ్ళు కలుస్తలేదు. మేం వాళ్ళకోసం వెతుకుతున్నం. వాళ్ళు మా కోసం చూస్తున్న రు. అంతా చింగం భంగం అయిపోందిగద! అపుడు లాస్ట్‌కి ఒక నెల రోజులయిన తర్వాత మళ్ళీ ఏరియాకమిటీకి కలుసుకున్నం. ఈ కోయోళ్ళున్నరుగా కోయోళ్ళ ద్వారా కలుసుకున్నం. ఆ ఊళ్ళె కళ్ళం అవుతా వుంది.

ఆ కళ్ళంకాడికి పోయినంపోయే వరకు ఒక ముసలమ్మ వుంది. ఆ ముసలమ్మ భయపడతావుంది మమ్ముల చూసి. భయపడకమ్మా నేనెర్రక్కను నాపేరెర్రక్కని పెట్టుకున్నరు – అని చెప్పి ఆమెని సంజాయించిన, ఆమె దగ్గర కొద్దిసేపు కూర్చొని. ఆమ్మా! ఆకలయింతాంది ఇంత అన్నం పెట్తవా అన్న. ఎక్కడిది బిడ్డా అన్నం నాకు? అని నువ్వక్కడ కూర్చో నేనన్నం తీసుకొస్తా అంది, కల్లకాడికి పోలీసొస్తరేమో నేను ఫలాన చెట్టుకిందంటా, నువురా అనేటప్పటికి పాపం ఆ పెద్ద మనిషి చాటెడన్నం పట్టుకొనొచ్చింది. ఎట్లా తెచ్చిందో ఏమో దొంగతనంగా ఆ చాటనిండ అన్నం తీసుకొచ్చింది. కాని కారం లేదు ఏంలేదు. గింతంత కారం తీసుకొచ్చింది పదిహేను రోజులయిందేమో అన్నంలేక, మనిషింత మనిషింత మేం అన్నం తినేటప్పటికి ఇగ కడుపుల ఇట్లే నొప్పిలేచింది. ఇగ నీళ్ళు తాగినం. తాగికూర్చొని కూర్చొని నొప్పి తగ్గిపోయింది. తర్వాత చీకటితోటేలేచి అమ్మ ఇగపోతం అని చెప్పినం. ఇదేందే బిడ్డా! నీకీకష్టం ఏందే! అని ఆ ముసలమ్మ ఒకటే ఏడుపు, మధ్యాహ్న మయ్యేవరకు కమిటీ వాళ్ళతో కలిసనం. ఏం చెయ్యాలి ఏం సంగతని వాళ్ళ నడిగి మళ్ళీ మాకొక కమిటీవేస్తె వేరేచోటికి కదిలిపో యినం. టేకులగూడెం, మిరియాలగూడెం అటుపక్కపోయినం. అక్కడ జనం అంత ఎర్రక్క ఎర్రక్క అని నాచుట్టూ తిరుగుతుం డేది. నేను మందులిస్తుండేది వాళ్ళకి. కోయ్యోళ్ళకివో పాడైన పుండ్లుంటయ్యండి, ఇంతింత పుండ్లు, వాటికి మందులిచ్చి మాన్పించేది. అప్పుడు పెన్సిలిన్‌ ఇంజక్షన్‌ అంటే బేఫికర్‌ గుండె. ఆ ఇంజక్షన్‌ ఇచ్చుడు ఆయింటుమెంటిచ్చుడు. శుభ్రంగుంచడం ఇవన్ని చేసేది. వాళ్ళకి నేనంటే బాగా అభిమానం, వాళ్ళిళ్ళకు పోయినానంటే ఎంతో ఎంతో సంబరం. ఒకరోజు నా దగ్గరకొచ్చిన్రు కాన్పుచెయ్యటానికి రమ్మం టరు. మా వాళ్ళేమో తోలిచ్చం అని. నేనేమో పోవాలని, ఆపతయినపుడు చెయ్యకుంటే మనం చేసేదేంది? జనం కొరకేకద! ఏట్లైనా చచ్చిపోయేటోళ్ళమే మరామె నిన్నట్నించీ ఆపతిపడతాందే! పోకుంటే యెట్లని పోయిన. ఆమె మూడురోజుల పట్టి ఆపతిపడతాంది. డాక్టరుగారు చెప్పిన ఇంజక్షన్‌ ఇచ్చి, గోలీలేసి అప్పటికప్పుడు నీళ్ళుకాగబెట్తె స్నానం చేయించిన, పోయిన రెండు గంటలకి నీళ్ళాడింది. ఇగ వాళ్ళ సంతోషం చెప్పాలె ఇగవాళ్ళు కదలనియ్యరునన్ను. స్నానం చేయుస్తరు. బట్టలు పిండుతుంటరు. పాలు తీస్తరు, పాలు కాగపెడతరు. పాలు తాగమం టరు. పోవద్దంటరు కోడితీసుకొస్తరు. వంటచేస్తమంటరు. ఏమో చేస్తుంటరు అయ్యేవరకు మాదళపోళ్ళు రానేవచ్చిరి. ఈమెటుపాయె ఏమాయె ఏం సంగతి, ఈమెపాయెనా అంటే మనకెంతనష్టం, అని ఇద్దరొచ్చిన్రు. రమ్మంటరు మేం రానియ్యమని వీళ్ళంటరు. వద్దయ్యో తెల్లారే సరికి మళ్ళీ పోలీసులొస్తరు తీస్కపోతరని చెప్పిన్రు. ఇగసరేననిచెప్పి అప్పుడు మళ్ళీ వంటచే యించి, అన్నం పెట్టించి వాళ్ళొక పదిమంది నాతోటివచ్చి మావాళ్ళ దగ్గర కలిసి వెళ్ళొచ్చిన్రు.

నేను టేకులగూడెం వచ్చినపుడు మిర్యాలగూడలో ఒక కోయోళ్ళ ఇంట్లో దాక్కున్న. ఆకోయోళ్ళే దాచిపెట్టిన్రునన్ను. అప్పుడే పోలీసోలు వచ్చిన్రు వాళ్ళింటికి. గంపలు, చాటలన్ని అల్లుతారు వాళ్ళు. అల్లి అన్నీ ఒక పెద్ద గుమ్మిలో పెట్తరన్నమాట. ఆ గుమ్మిలో నన్ను పడేసి గంపలన్ని ఏసిన్రు నామీద. ఇగ వాళ్ళొచ్చి ఇల్లంత చూసుకు న్నారు. చూసుకుంటె నేను దొరకలేదుగా! ఇల్లంత చూసుకొని ఎల్లిపోయిన్రు, తర్వాత నన్నింకొక ఊరికి తీస్కపోయిన్రు. అక్కడికి గూడ పోలీసులొచ్చిన్రు. ఏం వేషమేస్తె ఏందాగుతం? వాళ్ళ వేషమేస్తే మాత్రం దాగగలుగుతమా దాగలేంగా. అక్కరేం చేసిన్రు, గుమ్మికింద వడ్లుపోసుకోవటం కోసం పొక్కలు చేసుకుంటరు. ఆ పొక్కలో కూర్చుండబెట్టిన్రు నన్ను. మనిషి పట్టేంత ఉన్నదది, అందులో కూర్చోపెట్టి వడ్లు ఎండలోపోసుకునే ఎండుగ తట్టలని ఉంటయి, అవి తీసుకొచ్చి మీదపడేసిన్రు. ఆ రోజట్లయింది. అదే ఊళ్ళె నన్ను దాసిపెట్టిన్రని చెప్పినలుగురు మనుషులను ఏళ్ళాడదీసి కాల్చేసిన్రు. ఇగ ఏం చేయ్యాలి? ఎర్రక్క ఇక్కడ నువ్వుంటే బతకవు! ఎటైనా దూరం పొమ్మని చెప్పి వేరేచోటికి తీస్కపోతే అదినుంచి తిరిగి మళ్ళి నేను మానుకోట తాలూకా రాజోలుకొచ్చి, రాజోలునుంచి కే సముద్రం వచ్చి అక్కడి నుంచి నాగారం వచ్చిన. రాత్రంత నడకే అక్కడున్న పోలీ సోల్లు. అక్కడకొచ్చి అనేకం ఆగమాగం జేసిన్రు. ఊళ్ళోవాళ్ళు భయపడుతున్నరు, అనేముందే వాళ్ళెల్లి పోయిన్రు. పోలీసోల్లు ఊరినిండ ఉన్నరు.. నేనేటు పోయేట్టులేదు. ఎటుతోచక ఇంటెనక ఒక గుడిశె ఉన్నది ఎడ్లకొట్టం. ఆ కొట్టంమీదికెక్కి కూర్చున్న. పోనక అంటరు చూడండి కంకులు గిట్ల పోసుకొనేది ఆ పోనకలో కూర్చున్న, ఊరంత కాలపెట్టిన్రు, కాలిపోతే అందులోనె పోతంలే అని అట్లనేకూర్చున్న. ఆటుపక్క ఇటు పక్క అన్ని కాలిపోతనే ఉన్నయి. సంగతిట్లున్నదా అంటే ఆ గుడిశలో ఒక తాచుపాము అటు ఇటు తిరుగుతా ఉన్నది. ఎటు కదలేటట్టు లేదు, ఎటు మెదిలెటట్లు లేదు. ఊళ్ళ మనషులు లేరు కదిలే ఏంచేస్తదోనని భయం. ఆట్లనే కూర్చున్న తిరిగింది తిరిగింది తిరిగిం ది చుట్టు తిరిగింది. పక్క నించెళ్ళిపోయింది. పొద్దుగూకింది చీకటయిన తర్వాత ఇగ ఊరంత చేరిన్రు జీతగాండ్లొచ్చిన్రు. గడ్డి గుంజుతున్నరు. గడ్డి గుంజుతుంటె దయ్య మోతుగ నేనండ్ల ఉన్న. ‘ఏంది ఎంకటయ్యా’ అంటె. ఓర్ని నోట్లమన్ను వొయ్య నువ్వెక్కడ పాడైతివి అనుకుంటున్నం మేము నువ్విండ్లనే ఉన్నవ, దిగుదిగు ఇంకన్నడు, తర్వాత ఇగక్కడుంటె లాభంలేదని చెప్పి కేసముద్రం కెళ్ళిపోయి దశలతో కలిసిన.

ఇగ మళ్ళీ ఒకసారి మేముందరం కలిసి ఒకచోట వంటచేసుకోవాలనుకున్నం. మేం అన్నడంపు (కావల్సినవన్నీ ఒకచోట పెట్టుకోవటం) చేసుకునేదిగా … అడంపు తీసుకొస్తమని మగ వాళ్ళు ముగ్గురెళ్ళిన్రు. పొయ్యేవరకు ఒక పెద్దపులి. అప్పుడే ముగ్గురు పిల్లల్ని ఈనింది. వాటిని పెట్టుకొని కూర్చుంది. వీళ్ళు బియ్యం తీసుకొస్తమని పొయ్యే వరకు అది గాండ్రుమని నీళ్ళమీదికి లేచింది. లేచేవరకు ఒకాయన ఏం చేసిం డంటే బుజం మీది తువాలుంటదిగా అది దానిమీదికిసిరేసిండు. అది దాన్నందుకోని అట్లే పురికింది. ఆదక్కడ పారేసి మళ్ళీ వురికొచ్చింది. వచ్చేవరకు మేం ముగ్గురం ఆడోళ్ళం గబగబ చెట్లుపాకినం, ఆది కదలడంలేదు. మగవాళ్ళెన కొచ్చిన్రు, వచ్చేవరకల్ల ఆది గబగబవచ్చి వాళ్ళ ముందునే నిలబడింది. ఎనకకి అడుగు లేస్తుంటే మీద పడతదట. కానీ నిలబడితే ఏం చెయ్యదట పులి. కొంచెం సేపు నిలబడి ఇగ ఆశచాలించుకొని ఎల్లిపోయింది. ఇగ జరపండి – అన్నీ సర్ధండి ఇక్కడుంటే లాభంలేదు మనకి దగ్గరే పోలీస్‌ కాంపున్నది – అని సామానంత సదురుకొని ఇగ పోతనే వున్నం. మేమెంత దూరమైతె పోయినమో అంతదూరం ఆ బాట పట్టుకోని వచ్చిన్రు పులి అరుపుకి. మేం ఒక పక్కకు పోక పొయ్యేది. ఎప్పుడు ఒక్కపక్కపోతే బాటపడుతుందిగా! గానంగ ఒకలు గీనం గొకలు గట్లోకలు గిట్లోకలు గొడ్లమాదిరిగ నడిచిపోతుండె. అప్పుడే ఇంకొక చోటికి పోయి వంటచేసుకొని, అన్నంతిని పండు కొని మళ్ళీ తెల్లారిలేచేళ్ళినం.

ఒకసారి ఒకామెకి నేను కాన్పు చేసేదా నికి పోయిన. రెండురోజులు వాళ్ళు నన్నక్కడనే దాచిపెట్టిన్రు. అప్పుడే తీగల సత్యనారాయణరావు గారు నా చరిత్రంత బోధించిన్రట మోహనరావుగారికి, నన్నెందు కు పార్టీ సభ్యత్వంనించి తీసేసిన్రని ఆయనడిగితే గిట్లగిట్ల సంగతని బోధించిన్రనుకోరాదు. మహా కచ్చమనిషి ఆమె. ఆట్లచేసేదికాదని చెప్పిన్రట. అట్లే సత్యనారాయణరావు గారు అమ్మా నువ్వు పెళ్ళిచేసుకోకపోతే బాగుండదసలు. ఎవర్నయినా ఒకర్ని పెళ్ళి చేఏసుకోవాలె లేకపోతే బాగుండదని చెప్పిండు. అంతవరకయితే నాకసలు అయిడియా రాలేదు. ఇట్లనే ఏదో ఉంటనని వుండేది. అప్పుడే మనలోన అబ్బాయివున్నడు నువ్వుచేసుకో అని మోహనరావుగారి గురించి చెప్పిండు. సరే మీ ఇష్టం అనన్న. అప్పుడిహ ఈ వివాహం జరిగిపోయింది. అప్పటికి పదహారేళ్ళుంటయి. తర్వాతెప్పుడో జైలునించి విడుదలయిన తర్వాత మొదటాయన శేషయ్య మా నాన్నను తీసికొనివచ్చిండు. నన్ను తీస్కపోత అని. నేను ఇగ తప్పుచెయ్యనే వద్దు – ఒకసారి చేసిన తర్వాత ఇగపోవద్దని పోలే, ఆయనెళ్ళిఫోయి మళ్ళీ పెళ్ళిచేసుకున్నడు – ఇద్దరు బిడ్డలు.

వంట నేనే చేసేది, ఎంత మందుంటే అంతమందికి నేనేచేసేది. తిండి దొరక్కపోతే ఒక్కొక్క టైములో ఏంచేసేది తెల్సా! మొక్క జొన్నలు తీసుకొచ్చేది. అవి పేలాలు పేల్చుకునేది. మనిషికిన్నన్ని తీసుకొని సంచిలో పోసుకొనేది. తినుకుంట ఇట్ల కాలం గడుపుతుండేది. ఒకసారి తినడానికేం లేకుండె ఊళ్ళోకి పోదామంటే ఊళ్ళల్ల ఎవరులేరు. అంతా బెగ్గంపాడైపోయింది. పొలాలనించి పచ్చొడ్లు దూసుకొచ్చుకున్నం. బట్ట నాలగుపొరలేసి కట్టెపట్టుకొని దంచుతాపొయినం. దంచి ఊదుకుంట దోసెడు బియ్యం చేసిన. అవి వండి మనిషికింతంత అన్నం తిన్నం. ఇగ ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. నీళ్ళల్ల అల్లి గడ్డంలని ఉంటయి. అవి తెచ్చుకుందామని చెరువుకాడికి పోయినం. వండిగిడ్డలు తీస్తున్నం. పెద్దపులి నీళ్ళు తాగడానికి గాండ్రు గాండ్రుమనుకుంటొచ్చింది. అందరంపోయి తూములో జొరబడ్డం. అదొచ్చిచక్కగా నీల్లుతాగి ఎల్లిపోయింది. తర్వాత ఇగ వండుకుందామన్నా కుండ దొరకదు. ఇగ జనమెల్లిపోయిన గుడిశల్ల కెల్లి పగిలిపోయిన చిప్పలటువంటివి తెచ్చుకోని వండుకోని ఒకరోజింతింత తినేది, ఇగ ఒకరోజు తెల్లచెన్నగడ్డంటరు. తెల్ల చెన్న గడ్డ, నల్లచెన్నగడ్డ లని ఉంటయి, కోళ్ళెక్కువ తింటయవి. ఆ తెల్లగడ్డలు చెక్కలు చెక్కలుగకోసం జల్లిగంపల్ల ఏసి వాటిని నీళ్ళల్ల పెట్టి వంటజేస్తరు. దాన్నేదో బుర్రంబలి అంటరు. అందులో ఇంతింత తోకపురుగులుండేవి. మరాకలి బాధ. తినాలికదా. వాళ్ళిచ్చింది తినకపోతే ఇంకొకసారి పెట్టరు. ఎనిమిది రోజులకొకసారి చేసి పెట్టుకుంటరు. మనం పోయిన తర్వాత కొంచెం మారిన్రు కానీ మొదలు వాళ్ళు మారలే. వాళ్ళేమైనా గొడ్డుమాంసం, కొండగొర్లు, పందులు, కొండెంగలు, ఉడుములు ఇటువంటివి తినేదన్నమాట. కొర్రలు, సామలు, గట్కలు, సజ్జలుతినేది. వడ్లు పండేది తక్కువ. అక్కడ వరికి పొదల్లో పరికి పళ్ళని ఉంటయి. అవి తెచ్చుకొని తినేది. ఆకలికాగలేక పరికిపండ్లు, తునికిపండ్లు, బెట్టరేగి పండ్లు, కొండ మామిడి పండ్లు, తూమడికి పండ్లు అని అన్నీ తినేది. అన్నం మనిషికింత అని గిన్నెకొలత ఉండేది. ఒకళ్ళకెక్కువ ఒకళ్ళకి తక్కువయిందంటే కష్టం. ఎక్కడి నించయినా దూరంనించి వచ్చినోళ్ళకి ఎక్కువ పెట్టేది. వంటచేసేది నేనేకద. దళాలకి వడ్డించేకాడ నన్నే ఉంచేది. సమానంగ పెట్టుకొస్తనని. తర్వాత మాటే మన్నొస్తుందేమోనని నేను వాళ్ళనే పెట్టుకొమ్మనేది. ఫరవాలేదులే పెట్టు అనేది వాళ్ళు. మాంసమెక్కువ, అన్నం తక్కువ. దొగ్గరికూర, చామకూర, ఆకు కూరలు చేసుకునేది. అడవి పందులు, కొండగొర్లు, దుప్పులు, మనుబోతులు ఇలాటివన్నీ తినేటోళ్ళం. మోహనరావు తినకపోయేది. గింతన్నం మాత్రం తినేది. గింత మాత్రనికెందుకొచ్చినవయ్యా పార్టీలకి అనేది మిగతావాళ్ళు. తినాలె తప్పని సరిగ, తిను అనేది. ఒకసారి బలవంతంగ తిని వాంతి చేసుకున్నడు. తర్వాత మెల్లగ కోడిగుడ్డ, కోడిమాంసం అలవాటయింది. అయినా చాలారోజులు మాంసం జోలికి పోకపొయ్యేది. ముక్కలు చూస్తే ఏసుకోక పోయేది. ఇంతింత పులుసుతో తినేది. అప్పుడాయనకు, నాకు పరిచయం లేదు కొత్త మాదగ్గరికొచ్చి పద్నాలుగు, పదిహేను రోజులయింది ఒక విస్తరి కుట్టుకోరాదు. మా అందరికి సర్వీసే ఇగీయన ఇంతింత అన్న తింటే ఏమయితదని ఆలోచించి మాంసం నేను తింట అని నా అన్నం ఆయనకు పెడతాపోయేది. వీళ్ళందరికి అనుమానం పట్టింది. నాకసలు అయిడియానే లేకుండె. అండ్ల పెద్ద మనుషులు ఎవరున్నారు కనుక, అంత పడుసోళ్ళయిరి.

ఒకసారి ఒకతనికి పెద్దపులికొట్టింది నెత్తిమీద. అందరంపడుకోని ఉన్నం ఒకరిపక్కన ఒకరు. భయంకదా నిద్రలో కొంతమంది గుర్రుకొడతరు చూసిన్రా ఆగుర్రొస్తే పులి పరిగెత్తుకొచ్చి కొట్టుద్దట. అతను నిద్రపోయి గుర్రుకొడుతున్నడు.

పులోచ్చి ఇట్ల నెత్తిమీద చరిచిపోయింది. గోళ్ళట్ల దిగపోయినయి. అప్పుడు నన్ను పిలిస్తే నేను పోయి జుట్టు క్షవరం చేయించి, అంత శుభ్రం చేసి, మందుపెట్టి, ఇంజక్షన్‌ ఇచ్చి, ఆ గాయాలన్నీ మాన్పించిన. ఇక్కడికొచ్చిన తర్వాత కూనూరు కొచ్చిన తర్వాత కూడా ఒక కాన్పు చేసిన నేను. ఇక్కడ ఒకదొరోరి అమ్మాయికి కడుపులో పిండం చచ్చిపో యింది. చచ్చిపోతే ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఆ ఇంజక్షన్‌ గుర్తుపెట్టుకోని ఆ ఇంజక్షన్‌ తీసుకొచ్చి ఆమెకిచ్చి నీళ్ళాడించిన. ‘కడుపులో పిండం పోయినప్పటికైనా నా బిడ్డను బతికించి నావమ్మా’ అని వాళ్ళు ఒక్కటే సంతోషమ యిన్రు. అప్పుడు కోయెళ్ళల్ల తిరిగేటప్పుడు కూడా అందర్ని మందలించటం, నీ ఆరోగ్యం బాగున్నదా నీ ఆరోగ్యం బాగున్నదా అని ఇల్లిల్లు తిరగటం. పిల్లలందర్ని ఎత్తుకోవ టం చేసేది. నాకాలు నొస్తున్నదనో, నా చేయి నొస్తున్నదనో, నాకు తలనొస్తున్నదనో చెప్తుం టే ఇగ అందరికి. మనిషికి రెండు మనిషికి రెండు గోలిలివ్వడం ఈ విధంగా చేసేది. అందుకనే ఎర్రక్క ఎర్రక్క అని పిలుస్తుండేది నన్ను, ఒక గూడెంలోకి పోయిన్నంటే అందరు గుమిగూడి వచ్చేది. కాని చాలా ఉత్సాహం మనుషులు వాళ్ళంత. వాళ్ళ రక్షణ లేకపోతే మాత్రం బతికె టోళ్ళంకాము.

మా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళెవ్వరు రాలేదిండ్ల కాని మానాన్నను బాగ యిబ్బంది పెట్టిన్రు. నా గురించి జైల్లోపెట్టిన్రు ఏడాదన్న. మా అన్నయ్యను కొట్టిన్రు. మా అమ్మను కొట్టిన్రు. ఇల్లుదోపిడిచేసి అందర్ని ఆగమాగం చేసిన్రు బిడ్డను పట్టించమని. అసలు నేనొన్చేది తెల్వదు వాళ్ళకి నేనెళ్ళేది తెల్వదు. నేనెట్లొచ్చిన్నంటే మొదట్ల శేషగిరిరావు అని కొత్తగూడెం బొగ్గుగనుల్ల పనిచేసే టాయనుండె. రహస్య జీవితం గడుపుతుండె. మాకు పరిచయమే, ఆయనొచ్చి గిట్ల గిట్ట డబ్బుతీస్కపోయి రావినారాయణరెడ్డి గారికియ్యాలె అన్జెప్పిండు. ఇంత పైసలెట్ల జెయ్యాల్నంటే ఎట్లన్న చెయ్యమంటడు. తర్వాత ఇంత సంచి గుట్టించి అందులో మడతలెంబడి నోట్లన్నీ కట్టి నడుముచుట్టు కట్టి పైన బిగ్గరగ లంగకట్టి దానిమీద చీరకట్టమని చెప్పిండు. మా అన్న కప్పుడిరవయ్యేళ్ళుంటయి. ఆయనొచ్చిండు నాతో. ఆయన పార్టీల లేడుగాని నాథయానికె రమ్మన్న, నాదగ్గర డబ్బున సంగతెవ్వరికి తెలియదు. ఏం పనున్నదో పార్టీ విషయాలినటానికి పోతున్నదో ఏమో అనుకున్నరు. మా తల్లిదండ్రులు కూడా ఏమనలే. విజయవాడ పోయేవరకల్ల సాయంత్రం ఏడయింది. పత్తపట్టుకోని ఫలానా ప్రజాశక్తి నగరెక్కడు న్నదని అడిగి రిక్షా తీసుకొని పోయిన. అక్కడ సీతాదేవిగారు నారాయణరెడ్డి గారి బార్య ఉన్నది. కూర్చోమనిచెప్పి మంచిగ మాట్లాడింది. నారాయణరెడ్డి గారి కోసం వచ్చిన అన్న, అన్నం పెట్టింది తిన్నం. నా దగ్గర పైసలున్న సంగతి ఆమెకి కూడా చెప్పలే. ఆట్లనేపడుకున్నం తెల్లవారిలేచి మొఖం కడిగిన తర్వాత రెడ్డిగారేరి నేను మాట్లాడాలె, నాకవసరమున్నది. నేనందుకే ఇంతదూరం నుంచి వచ్చిన అన్న. ‘ఆ… నువ్వింతంత లేవు గాని అవసరంగ మాట్లా డాల్నా’ అని నవ్వడమే. సరే స్నానం చేసి బట్టలు మార్చుకో అంది, స్నానం ఎక్కడ చెయ్యాలి. బట్టలేం మార్చాలె, బోకకపోతే లాభంలేదుగా! బట్టలు తేలేదన్న. ‘నాబట్టలిస్త’ కట్టుకో మంది. ‘ఇప్పుడెందుకులెండి’ అని నేను సరే బయలెల్లినం. అక్కడ పోయేటాల్లకి మీటింగ్‌లున్నరు. ఏందమ్మ ఎక్కణ్ణించొస్తున్న వేంసగతన్నడు, ఉత్తరం ఇచ్చి సంగతిచెప్పి అవలకిపోయి బట్టలు దీసి మొత్తం డబ్బు తీసికొచ్చి ఆయన చేతిలో పెట్టిన, ఇంతడ బ్బెట్ల పట్టుకొచ్చి నవంటడాయన ఎందుకు లెండి అదంత ఎట్లో తెచ్చిన అని నేను. నవ్విండాయన ఇగట్లచ్చిన నేను ఈపనిలోకి.

ఒకాయన రామారావుగారని డాక్టరుండె పెద్దపల్లిలో, ఆయన నా పేరు సుశీలని పెట్టిండు. నా పేరసలు అచ్చమ్మ పార్టీలో అచ్చమాంబని పెట్టిన్రు. అప్పుడామె ఉండె కదా డాక్టరు అచ్చమాంబని. అందుగురించే అట్లా పెట్టిన్రు. నాకిప్పటికీ అన్ని వస్తయి. ఇంజక్షను ఇవ్వటం, నరానికివ్వటం, కండరానికివ్వటం, చర్మానికివ్వటం అన్నీ. ఇంజక్షన్ల పేర్లే మర్చిపోయిన. ఇంగ్లీష్‌ రాదునాకు. ఏదో మామూలు తెలుగు, డాక్టరుగారు అన్నీ తెలుగులో రాస్తుండేది నాకు. ఫలానదానికి ఫలానిదని అన్నీ రాస్తుండేది. నా దిగ్గరింత పుస్తకముండె పైన ఇంగ్లీష్‌లో రాసి కింద తెలుగులో రాస్తుండె. అన్ని ఆదళాలల్లనే పోయినయి. ఎటుపోయి నయొ! అదున్నా బాగుండిపోవు ఇదొక సంసారం. ఇదొక సాగరం. ఇదే కార్ఖానా అయిపోయింది, ఇండ్ల పడిపోయిన. అప్పటి రోజులకిప్పటి రోజులకి చాలాతేడా ఉంది. అప్పుడేమున్నది! ‘ఏక్‌ నిరంజన్‌-దోసుఖీ ఉంటే ఉంటిమి పోతేపోతిమి’ అన్నట్టుండె, ఇప్పుడట్ల గాదుగా. పిల్లలై రిఇల్లాయె సంసారమాయ ”కొడుక్కికాలునొచ్చినా”, బిడ్డకు ఏల్నొచ్చినా బాధేనాయె. అప్పుడు ప్రాణమే పోయిందను కున్నా భయంలేకుండెగా – అప్పుడే రాత్రంటె ఆ రాత్రి బయలెల్లి పోతెనే ఉంటిమి. రెండేసిమైళ్ళు మూడేసిమైళ్ళు తెల్లందాక నడిచిపోవుడే. నేనైతే ఎప్పుడు పట్టుబడిగాలే. బయటకొచ్చిన తర్వాత నన్ను మానుకోట తాలూకా తీస్కపోఇ ఒక పెద్ద బహిరంగ సభపెట్టి అచ్చమ్మగారు మీరుకొద్ది సేపు మాట్లాడాలని చెప్పి అన్నారు కొత్తపల్లి గోపాలరావుగారు. ఎందుకంటే మరి పరిచయం కావాలెగా. పట్టుకుంటే ఎవరైన ఇప్పుడుపట్టుకోవాలి అని జెప్పి నన్ను బహిరంగ సభలో మాట్లాడించిన్రు నన్నెవరు పట్టుకోలేదు ఎవ్వరడగలేదు.

మోహనరావుగారిప్పటికీ రాజకీయా లల్లనే ఉన్నడు. ఇగ నేను ఎదిగే సంసారంల వడ్డ తర్వాత అండ్లనే చిక్కుపడిపోయిన. సంసారం గూడ అంత పెద్ద ఇదిగ లేకుండె. అన్నిపాయె. బోడిపాయె బెచ్చెపాయె అంత ఇబ్బందిగ ఉండె. అందరం రాజకీయాలల్ల ఉంటె సంసా రం ఏంగావాలె? వచ్చినంక రెండేళ్ళకు పెద్ద కొడుకు పుట్టిండు. పెద్ద మనిషయి అత్తవుండె. నేనింటిపట్టున్నే ఉండిపోయిన. తర్వాత తొమ్మిదేళ్ళకి బిడ్డ, తర్వాత మళ్ళీ కొడుకు చివరిది బిడ్డ. పక్షవాతం వచ్చి మా అత్త చచ్చిపోయింది. వ్యవసాయ పనులు కూడా నేనే చూసుకుంట. ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించే తీరికనే లేదు.

(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుంచి..)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.