– కుప్పిలి పద్మ
యీ 2014లో నిలబడి వెనక్కివెనక్కి చూసుకొంటే వలస అనేది యెంతటి పురాతనమైన పదమో అంతే నిత్యనూ తనమైన పదమని మనకి మరింత స్పష్టంగా అనిపిస్తుంటుంది. యీ ప్రపంచం వలసని యెప్పటికప్పుడు ఆయా సందర్భాలకి తగినట్టు నిర్వచించుకొంటూనే వుంది. యీ ప్రపంచమే వొక గ్లోబల్ విలేజ్ అయిపోయిన సందర్భంలో మనం యీ వలసని యెలా చూస్తున్నాం. యెలా సమీక్షించుకొంటున్నాం. వొక పల్లె నుంచి పట్టణానికి, వొక పట్టణం నుంచి నగరానికి, లేదా పల్లెలు, పట్టణాలు, నగరాల నుంచి వేరువేరు దేశాలకి వలస వెళ్లినప్పుడు మనం, మనం వెళ్లిన నగరం గురించి యేమనుకొంటున్నాం… ఆ నగరం తో మమేకమవుతున్నామా… ఆ నగరం మనలని తనలోకి యెలా హత్తుకొంటుంది… ఆ నగరం మనకి యెలా తోస్తుంది… యిలా మనం యెప్పుడైనా మనలోకి మనం, మనం వుంటున్న నగరం గురించి తొంగిచూ సుకొన్నామా…
అలా తొంగిచూసుకొనే వో అవసరం ఆసక్తి మనకి కలిగివుండకపోవచ్చు. వుండొచ్చు. కలిగినా యివన్ని పంచుకొనే వో చోటు లేదా సమూహం లేదా అవసరం మన ముందు వుండివుండకపోయి వుండొచ్చు. మనలానే మాటాడుకోవాలనుకొనే కొంత మంది కలిసి నగరం గురించి కలబోసుకొనే ప్రయత్నమొకటి హైదరాబాద్‌లో డిసెంబర్ 14, 15ల్లో దో దిన్ పేరిట హైదరాబాద్ అర్బన్ ల్యాబ్‌వాళ్లు చేసారు. నగరాన్ని ముచ్చటించుకోవాలనుకొనేవాళ్లు, అర్ధం చేసుకోవాలనుకునేవాళ్లు, మరింతగా యీ నగరంతో మమేకం కావాలనుకొనేవారు, నగరంలో యెప్పట్నుంచో వుంటు నగరం గురించి తెలిసినవాళ్లు యీ రెండురోజుల పండుగలో పాల్గొన్నారు. యెటు చూసినా వో కుతూహలం, వుత్సాహం.
మనం మన రోజువారి పనులు, వుద్యోగాలతో బిజిబిజిగా గడుపుతుంటాం. మనకి కాస్త సమయం దొరికితే సినిమాకో, షాపింగ్‌కో వెళతాం. యెవరినైనా కలవాలనుకొంటే మన బంధువుల యింటికో, స్నేహితులనో కలుస్తాం. మనకి మన నగరంలో వున్న అనేక ప్రాంతాల గురించి తెలిసుండదు. చూసి కూడా వుండం. నిజానికి నగరంలో యిరుగుపొరుగు వుండరని చాలామంది అంటుంటారు. అలా వుండకపోవటం నగర స్వభావమా. అసలు యెప్పుడు యిలానే వుండేదా. యిలాంటి తెలియనితనం యెప్పటినుంచి మొదలైంది. వ్యక్తులు లేదా సమూహపు చొరవ వలన యీ పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చా. మనం వో అడుగు ముందుకు వేసి నగరాన్ని అర్థం చేసుకొనే అంశాల గురించి ఆలోచించి నలుగురితో పంచుకోగలమా…
దో దిన్‌లో ఆ రోజు అనేక విషయాల మీద వివిధ వృత్తులు ప్రవృత్తులవారు, అన్ని వయస్సులవాళ్లు, వివిధ భాషలు మాట్లాడేవాళ్లు, అనేక ప్రాంతాల వాళ్లు కలిసి యెవరు యే ప్రాంతం నుంచి వచ్చారు… ఆ ప్రాంతపు చరిత్ర యేంటి… యిప్పుడు ఆ ప్రాంతంలో యేం జరుగుతుంది యిలా అనేక విషయాలని మాటాడుకొన్నారు. వొకప్పుడు హైదరాబాద్‌లో ప్రముఖంగా వెలిగిన ప్రాంతాలు యిప్పుడు వెనక్కి వున్నాయి. యెందుకని… కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలే హైదరాబాద్ అనుకొనే పరిస్థితి కనిపిస్తోంది అక్కడున్నవాళ్లకి. నగరాన్ని విస్తరించే సమయంలో అనేక ప్రాంతాల అభివృద్ధి పట్టించుకోనితనం కనిపిస్తోంది. సంతోషం, వ్యధ, ఘర్షణ, అస్తిత్వవేదన, ఆకాంక్షలు, భౌతిక మానసిక జీవితాలు యిలా యెంతో జీవితాన్ని కలబోసుకొన్న సందర్భమది.
యీ దో దిన్‌లో ఆర్కిటెక్ట్స్, ఫోటో గ్రాఫర్స్, కవులు, షార్ట్‌ఫిల్మ్ మేకర్స్, థియేటర్ గ్రూప్స్, చిత్రకారులు పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచం కావొచ్చు యింతకు ముందున్న ప్రపంచం కావచ్చు ఆ ప్రపంచాన్ని యెప్పటికప్పుడు తమదైన కళలో నిక్షిప్తం చేసే కళాకారులకి యిలాంటి సమూహాలతో తమ అనుభవాలని పంచుకోవటం సంతో షంగా వుంటుంది. అలానే తమ చూపుని మరింత పదునుపెట్టుకోడానికి యిటువంటి సమూహం తోడ్పడుతుంది కూడా. కళ యెప్పుడూ మనలని మెరుగైన కొత్త సమాజం వైపు చూడమని ప్రోత్సహిస్తూనే వుంటుంది.
యిటువంటి సమూహాలు మనం వొంటరివాళ్లం కాదు. మనమూ మన కుటుంబాలే కాదు. సమాజమంతా కలిసిమెలసి స్నేహంతో అనేక విషయాలని మాటాడుకోవచ్చు. మరింత అందమైన జీవనం కోసం మనమంతా మళ్లీమళ్లీ కలుసుకోవచ్చు. యెక్కడికక్కడ మనం నివసించే ప్రాంతాలలో మమేకమై సజీవ మైత్రీగాలులతో యెప్పటికప్పుడు కొత్త వుత్సాహంతో మరింత జ్ఞానకాంతులతో జీవనాన్ని వెలిగించుకోవచ్చు.