పనిలోనే నాకు మనశ్శాంతి

-వరూధిని

నా పేరు వరూధిని, నా వయస్సు 27 సంవత్సరాలు. నేనూ, మా ఆయన (38) హెచ్ఐవితో జీవిస్తున్నాము. నాకు ఇద్దరు పిల్లలు. పాపకు 4 సంవత్సరాలు, బాబుకు 6 సంవత్సరాలు.

అందరు ఆడవాళ్ళ మాదిరే నాకు పెళ్ళయితే నా భర్త నన్ను చాలా బాగా చూసుకోవాలని అనుకునేదాన్ని. మందు తాగకూడదు, నన్ను కొట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఇంటినుండి కట్నం తెమ్మని వేధించకుండా, ఇచ్చిన కట్నంతో సర్దుకుని బాధ్యతగా నడుచుకునే భర్తగా వుండాలి అనుకుని కలలు కనేదాన్ని. నన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి అనుకునేదాన్ని. నన్ను చూడడానికి 10 సంబంధాలు వచ్చాయి. కానీ కొంతమందికి నేను నచ్చక, మరి కొంతమంది మా అమ్మ వాళ్ళు ఇచ్చే కట్నం డబ్బు తక్కువ అని వెళ్ళిపోయారు. నేను 9 వ తరగతి వరకు చదువుకున్నాక మా ఇంట్లోవాళ్ళు చదువు ఆపేశారు. నాకు 21 సంవత్సరాలకు పెళ్ళయింది. 25 వేలు కట్నం, 8 సవరాల బంగారం ఇచ్చి మా అమ్మవాళ్ళు పెళ్ళి చేశారు. పెళ్ళి అయిన మరుసటిరోజున మా అన్నయ్య నాతో, వాడికి తాగడం, పేకాడడం ఇంకా ఇతర అలవాట్లు అన్నీ వున్నాయి అని అన్నాడు. అపుడు నేను దానికి మీరు ఇవన్నీ ఇపుడు కాదు పెళ్ళికి ముందే తెలుసుకుని వుంటే అప్పుడేదైనా చేసేవాళ్ళం, అపుడు పట్టించుకోకుండా ఇపుడు చెపితే ఏం లాభం అని, నా ఖర్మ ఎట్లా వుంటే అట్లా తెల్లవారుతుంది అని చెప్పాను. వారం తర్వాత మా అత్తవాళ్ళింటికి వెళ్ళి మల్ల వెంటనే మా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అక్కవాళ్ళు చెన్నైలో వున్నారు. అక్కడ ఒక నాలుగు రోజులు వుండి మళ్ళీ మా అత్త వాళ్ళింటికి వచ్చాం. మా ఆయన నన్ను వదిలేసి మూడు రోజుల దాకా రాలేదు. మా అత్తను అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్‌‌తో కలిసి బెంగుళూరు వెళ్ళాడు అని చెప్పింది. సరే వెళ్ళాడేమోలే అనుకుని నాలో నేను సర్దుకొన్న. మూడవరోజు మా అమ్మవాళ్ళు వచ్చి రెండవసారి ‘మరవలి’కి రావాలి కదా, ఇద్దరూ రండి అని పిలిచారు. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఆయన ఎక్కడికో పోయినాడు వచ్చినాక వస్తాము అని చెప్పాను. మా అమ్మ దానికి ఎందుకు అట్లా వున్నావు అని అడిగింది. ఆయన వచ్చి మూడురోజులు అయింది అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాను. సరేలే మీరు ఆ అబ్బాయి వచ్చినాక రండి అని చెప్పి వెళ్ళిపోయారు. నాలుగోరోజు తెల్లవారి 6 గంటలకు వచ్చినారు, అపుడు ఆయన దగ్గర వున్న చైను, వుంగరాలు ఏమీ లేవు. తరువాత ఆయనను ఏమిటి? వస్తువులన్నీ ఏమైనాయి అని అడిగితే మా అమ్మ దగ్గర ఇచ్చినాను అన్నాడు. వాళ్ళమ్మ నడిగితే నాకు ఈలేదు అని చెప్పింది. తరువాత ఒకరోజు మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్దామని కమ్మలకు ‘మాటీలు’ వేసుకుందాము అనుకుని చూస్తే అవి లేవు, వాటిని ఎప్పుడో కుదువ పెట్టేసి వున్నాడు. మళ్ళీ ఇంకొకరోజు అలాగే కమ్మ జుంకీలు విరిగిపోయాయని అలమారులో పెడితే రాత్రి 2 గంటలకు లేచి చూస్తే ఆయనే లేడు, తరువాత తెల్లవారి 7 గంటలకి ఫుల్లుగా తాగేసి వచ్చి మెట్లమీద పడి వున్నాడు. ఆరోజు రాత్రే నేను పెద్దవాళ్ళకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక నేను ‘సూసైడ్’ చేసుకోవాలి అనుకుని ప్రయత్నించాను. శబ్దంవిని మా అత్త పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ నన్నే తిట్టారు. మళ్ళా మావాళ్ళకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా చేసింది, మీరైనా మీ అమ్మాయికి బుద్ది చెప్పండి అని చెప్పింది. మా వాళ్ళు కూడా దీనికే భయపడిపోతే ఎట్లా, నువ్వు ఇంకెప్పుడూ ఇట్లాంటి పని చెయ్యద్దు అని నాకే బుద్ది చెప్పి వెళ్ళారు. నాకు పెళ్ళయి అప్పటికి 3 నెలలు అయింది. మా అమ్మ వాళ్ళు పెళ్ళి అపుడు 2 సవరాల (16 గ్రా) బంగారం తక్కువగా పెట్టారు. దాన్ని తీసుకుని రమ్మని రోజూ తాగేసి వచ్చి గొడవ పెట్టేవాడు. అట్లే ఒక సంవత్సరం రోజులు జరిగిపోయాయి. బాబు పుట్టినాడు. ఆరు నెలల తర్వాత మళ్ళీ గొడవలు ఎక్కువ అయినాయి. ఒకరోజు బాగా తాగేసి వచ్చి కొట్టి, ఎక్కువగా టార్చర్ చేసేసరికి నా వల్లకాక మా నాన్నకు ఫోన్ చేశాను. తరువాత మా అక్క, నాన్నవాళ్ళు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన మూడు రోజుల వరకు రాలేదు. కాని మళ్ళా నాలుగో రోజు వచ్చి నా బాబుని నాకు ఇచ్చేయి అని గొడవ పెట్టేవాడు, ఒక్కసారిగా నన్ను పట్టుకొని తోసివేశాడు. అపుడు మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చేసరికి గమ్ముని వుండిపోయినాడు. నా కొడుకుని మా అమ్మ చూడాలి అంటూ వుంది నాతో పంపించు అన్నాడు. అప్పుడు మా అమ్మ నీవు ఇప్పుడు ఫుల్‌గా తాగి వున్నావు, నీతో బిడ్డను ఇపుడు పంపించను అని చెప్పింది. వెంటనే వెళ్ళిపోయినాడు. మళ్ళా రెండు రోజుల తర్వాత మా వాళ్ళు ఎవరూ లేనిది చూసి వచ్చి నన్ను కొట్టాడు. అప్పుడు అక్కడ మా అక్క కొడుకు వెంటనే మా అంగడి దగ్గరకు వెళ్ళి మా అమ్మని, తమ్మున్ని పిలుచుకుని వచ్చాడు. అపుడు ఎందుకు బావా మా అక్కను కొట్టావు అని అడిగితే నా పెళ్ళాం నా ఇష్టం కొడతాను, ఏమన్నా చేస్తాను అన్నాడు. అందుకు మా తమ్ముడు ‘చెప్పు బావా మా అక్క ఏదైనా తప్పు చేస్తా వుందా, నేనే ముందు నరికేస్తాను’ అన్నాడు. అప్పుడు కూడా నా పెళ్ళాన్ని కొట్టుకునే హక్కు నాకు లేదా అన్నాడు. మా తమ్ముడు పెళ్ళానికి ఒక మూర పూలు కొనివ్వడానికి లేదుగానీ కొట్టడానికి మాత్రం ఎలా వస్తుంది అని అడిగినాడు. దాంతో చుట్టుపక్కల వున్న వాళ్ళంతా అందుకుని అరిచేకొద్దికి ఆటో తీసుకుని వెళ్ళిపోయాడు.

మళ్ళీ మద్దిస్తం చేసి ఒక నెల తరువాత మళ్ళీ అత్తవాళ్ళ ఇంటి దగ్గర వదిలినారు. మళ్ళా ఒక మూడు నెలల తర్వాత బంగారానికి ఇవ్వవలసిన డబ్బులు తెచ్చి ఇచ్చేశాను. దాన్ని కూడా తాగేసి, పేకాట ఆడేసి అంతా డబ్బు ఖర్చు పెట్టేశాడు. దాంతో డబ్బుల విషయంగాక ఏదో ఒక విషయం మీద తాగేసి రోజూ కొట్టేవాడు. తరువాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. 6వ నెలలో మెటర్నటీకి వెళ్ళాను. హెచ్ ఐ వి టెస్ట్ చేయాలని అన్నారు. సరే చేయించుకుంటే మంచిదే కదా అని టెస్టింగ్ కి బ్లడ్ ఇచ్చేసి వచ్చాను. మళ్ళీ ఒక నెల తరువాత రిజల్టుకి వెళ్ళినాను. అప్పుడు సారు నాకు హెచ్ఐవి వుంది అని చెప్పారు. మీ ఆయనను ఒకసారి తీసుకుని రండి అని అన్నారు. వారం తర్వాత మా ఆయనను తీసుకొని వెళ్ళినాను. ఈ టెస్ట్ అంటే రారని, నీతో హాస్పిటల్‌లో సారు మాట్లాడాలని అంటూ వున్నారు అని చెప్పి తీసుకొని వెళ్ళాను. హెచ్ఐవి టెస్ట్ ఆయనకి చేశారు. పాజిటివ్ (హెచ్ఐవి వుంది) అని చెప్పారు. సెక్స్‌లో వుండేటపుడు నిరోధ్ వేసుకోమని చెప్పారు. ఇది తెలిసినప్పటినుండి మరింతగా తాగడం, నిరోధ్ లేకుండా సెక్స్ కావాలనడం అన్నీ విరుద్ధంగా చేసేవాడు. ఏమాత్రం కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా (ఆలోచించకుండా) ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ వుండేవాడు. ఎపుడో ఒకసారి పనికి వెళ్ళినా డబ్బులు ఇంటికి ఇచ్చేవాడు కాదు, ఎపుడూ తాగడం, గొడవపడడం, డెలివరీ అయ్యేదాక కూడా సెక్స్‌లో పాల్గొనేవాడు. నేను నిరోధ్ వేసుకొమ్మని అడిగితే అవి వేసుకుంటే నాకు సుఖం వుండదు అనేవాడు.

(డెలివరీకి ముందు ఏదో మాత్ర ఇస్తారంట) డెలివరీకి హాస్పిటల్‌కి వెళ్ళాను. అపుడు అక్కడ రిపోర్టు చూపించి “మేడం డెలివరీకి ముందు ఏదో మాత్ర ఇస్తారంట కదా సార్ చెప్పారు” అని నర్స్ ని అడిగితే వాళ్ళు దానికి ఇపుడు మాత్రం నీ కడుపులో బిడ్డకు హెచ్ఐవి సోకకుండా వుంటుందా అని గట్టిగా అరిచి వెళ్ళి పడుకోపో అన్నారు. పోయి బెడ్ మీద పడుకున్నాను. మా అత్తను దగ్గరికి పిలిచి మళ్ళీ వాళ్ళని గట్టిగా అడుగు, కనీసం రాసివ్వమను, మనం ఆ మాత్ర బయట తెచ్చుకుందాం అన్నాను. మా అత్త వాళ్ళ దగ్గరికి పదిసార్లు తిరిగినాక రాసిచ్చారు. అత్తే బయట మాత్ర కొని తెచ్చి వేసింది. ఒక గంట తర్వాత డెలివరీ అయింది. బిడ్డ మొత్తం బయటికి వచ్చేదాక నన్ను ఏ డాక్టరు, నర్సు పట్టించుకోలేదు. తరువాత వచ్చి డెలివరీ చేసినట్లనిపించినారు. డెలివరి అయిన రెండో రోజు పాపకి డ్రాప్సు వేశారు. తరువాత ప్రతినెల పిల్లను డాక్టరు దగ్గరకు తీసుకువెళ్తూ పాపకు పోతపాలే పోసి పెంచాను.

మా ఆయన దొరికినకాడికి అప్పులు చేసి, లేక ఏదైనా వస్తువులు కుదువపెట్టేవాడు. అప్పులవాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు గొడవలు పెట్టేవారు. అంతకు ముందు టెలికం డిపార్టుమెంటులో టెంపరరీ వర్కర్‌గా పనిచేసేవాడు, తర్వాత మానేసినాడు. కానీ నేను ఆఫీసులో పనిచేస్తూనే వున్నాను. నాకు రావలసిన డబ్బులు వస్తాయి అని చెప్పి అందరి దగ్గరా అప్పులు చేసేవాడు. మా అత్త చాలా మంచిది. ఆమెను డబ్బుకోసం చాలా వేధించేవాడు. ఏమని అడిగితే ‘నేను ఇంకా ఎన్నో రోజులు బ్రతకను, నేను చనిపోవాలనే ఇట్లా చేస్తున్నాను’ అనేవాడు. 80,000/- రూపాయల వరకు అన్నీ అమ్మి అప్పులు చాలామందికి తీర్చాము. నేనేమయినా అడిగితే, నువ్వేమయినా మీ ఇంటిదగ్గరి నుండి తెస్తున్నావా అని కొట్టేవాడు. దానికి భయపడి నేను ఏ విషయం పట్టించుకునేదాన్ని కాదు. ఒకసారి ఆయనకు ఉన్నట్లుండి ముఖంపై ఒకవైపు మాత్రం బొబ్బలు, బొబ్బలుగా వచ్చింది. మేమంతా భయపడి మద్రాసుకు తీసుకువెళ్ళాం. అక్కడ కూడా మందు, సిగరెట్లు వాడద్దు, నిరోధ్ లేకుండా సెక్సులో పాల్గొనకూడదు అని చెప్పారు. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఈ విషయం అడిగితే వాళ్ళకి ఏమి పనిలేదు. వాళ్ళు అట్లే చెప్తారు అనేవాడు. మా అత్తవాళ్ళు “మేము ఎంతకాలం మీకు కష్టపడి పెట్టాలి. నీవైనా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా” అని అన్నారు. అంతకు ముందే నాకు ‘విన్స్’ తో పరిచయం వుండడంతో నేను వెళ్ళి ‘మీరా’ మేడంతో మాట్లాడి నా పరిస్థితి ఇది అని చెప్పాను. దానికి మేడం, ఇక్కడ ఆఫీసులో స్వీపరు పని ఖాళీగా వుంది, చేస్తావా అని అడిగారు. ఇప్పుడు ఆరు నెలలుగా నేను ‘విన్స్’లో పని చేస్తున్నాను. ఇప్పుడు నాకని ఖర్చు చేసుకోవడానికి ఒక రూపాయి చేతిలో వుంది. మా పిల్లల స్కూలు ఫీజులకొరకు ఒకరిపై ఆధారపడకుండా నేనే కట్టు కొంటున్నాను. కానీ ఇపుడు కూడా నాకు జీతం వస్తే మినిమం 100 రూపాయలు అయినా మా ఆయనకు ఇవ్వాలి. లేదంటే, నువ్వు పనికి పోవద్దు అని అంటాడు. ఆయన అడిగినపుడు డబ్బులివ్వకపోతే నీకు వేరేవాళ్ళతో సంబంధం వుంది, నువ్వు ‘లంజవు’ అంటాడు, కొడతాడు, రచ్చ చేస్తాడు. ఇంట్లో అందరితో గొడవ చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరికీ, ఆయన చేసే పనుల వల్ల అందరికి చాలా విరక్తి కలిగింది. ఎవరెట్లా పోయినా, ఏదేమైనా రోజుకు 20/- రూ||లు ఆయనకు ఇవ్వాల్సిందే. ఇంట్లో వున్నంతసేపూ సమస్యలే. ఆఫీసుకు ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వస్తాను. ఈ టైంలోనే మనశ్శాంతిగా వుంటాను. నా పిల్లలను చూసుకుంటూ, వాళ్ళకోసం మాత్రమే బ్రతుకుతున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.