బడుగు జీవుల వెతలు

– శీలా సుభద్రాదేవి

డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి కదా’ అంటారు. మరికొందరు ”గేయాలు రాస్తుంది” అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేనివాళ్ళు ”ఎవరామె ఏమిటి రాసింది? ”ఎప్పడూ పేరు విన్నట్లు లేదే?” అని కూడా అంటారు.

డి.సుజాతాదేవి 1970లోనే సాహిత్య రంగం లోకి అడుగుపెట్టి 3 కథా సంపుటాలు, 3 పాటల పుస్తకాలు, ఒక గేయకావ్యం, 3 నవలలు, వ్యాసాలపుస్తకం తోపాటు 2 పాటల కేసెట్లు కూడా వెలువరించారని చాలామందికి తెలియదు. వయోజన విద్యకోసం 10 పుస్తకాలు, ఎన్‌.బి.టి వాళ్ళ కోసం రాసినకొన్ని బాలసాహిత్యానువాదగ్రంధాలు వచ్చాయనీ తెలియదు. ”అందరం ఒకటే” అనే పాటలపుస్తకానికి 1985లో ఎన్‌.సి.ఇ. ఆర్‌.టి వారి పురస్కారం, ”సుజలాం సుఫలాం” అనే బాలల నవలకి 1989లో జాతీయ బహుమతీ లభించాయని ఎంతోమందికి తెలియదు. ”డా. కొక్కొరోకో” అనే బాలల లఘు చిత్రానికి ఆధారమైన కథా సహకారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది పురస్కారం అందుకొన్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఏడాది ప్రతిష్టాకర మైన కేంద్ర సాహిత్య ఎకాడమి బాలసాహిత్య పురస్కారం అందుకున్నారనే విషయం కొందరికైనా తెలిసేవుంటుందేమో మరి.

సాహిత్యంలో బహుముఖ ప్రవేశం వున్న డి.సుజాతాదేవి వ్యక్తిగా అనేకమందికి తెలిసినా ఆమె సాహిత్యం గూర్చి తెలియక పోవటానికి ప్రచార పటాటోపం లేకపోవటం ఒక కారణం ఐతే అంతర్ముఖీనంగా వుండే సున్నిత మనస్తత్వం. చొచ్చుకుపోయే స్వభా వం లేకపోవటం మరొక కారణం.

నవంబర్‌ 14 బాలల దినోత్సవం రోజున గోవాలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడెమి సమావేశంలో బాల సాహిత్యపురస్కారం అందుకున్న సుజాతాదేవికి అభినందన పురస్కారంగా ఆమె సాహిత్య పరిచయం చేయాల్సి వుంది.

ఆమె అమితంగా ప్రేమించే బాలసా హిత్యంలో ఆమె కృషి ప్రశంసనీయమైనదని ఆ కోవలో ఆమెకు వచ్చిన పురస్కారాలు తెలియజేస్తున్నాయి.

ఇప్పుడు పురస్కారం పొందిన పుస్తకం ”అటలో అరటిపండు” కథలు ఈనాడు ఆదివారం సంచికలో ధారావాహికం గా వచ్చినవి. ఇవి బాలలకే కాక తల్లులకూ, ఉపాధ్యా యులకు కూడా పిల్లలపట్ల ఎలా వ్యవహరించాలో పిల్లల ఆలోచనల్ని ఎలా వొడిసిపట్టుకొవాలో సున్నితంగా తెలియ జేస్తాయి, వివిధ సంధర్భాలలో పిల్లలలోని సంఘర్షణల్ని అర్ధం చెసుకొని వారిలో విచ క్షణాజ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని కల్పించ టం ఎలాగో ఈ రచనల్లో తెలియజేసారు.

అంతేకాకుండా క్రమశిక్షణ నేర్పే క్రమంలో పిల్లల్ని మంచిదారిలో నడిపించా లంటే పెద్దలుగా మనమేం చేయాలి అనే దృక్కోణంలో సంఘటనాత్మకంగా ”ఆటల్లో అరటిపండు” కథల్లో విశ్లేషించిన విధానం, కథ చెప్పటంలో సుజాతాదేవి మృదు స్వభావం, భావుకత అభివ్యక్తమౌతాయి.

డి.సుజాతాదేవి బాలసాహిత్యంలో ఎంత కృషి చేసారో, నవలా, కథారచనల్లోనూ అంతటికృషీ చేశారు. ఏవోగాలి కబుర్లతో రచనలు చేయటం కాకుండా సాహిత్య విలువలు, సామాజిక బాధ్యతా తెలిసినది కావటాన ఏ ప్రక్రియ చేపట్టినా నిబద్దతతో ప్రతిభావంతంగా రాయగల్గింది.

దీనికి నిదర్శనంగా 2005లో వచ్చిన ”చేపలు” కథల సంపుటి. ఈ పుస్తకానికి డి. సుజాతాదేవికి మాడభూషి స్మారక సాహిత్య పుర స్కారం వచ్చి ంది. 1970 -90ల మధ్య ప్రచురితమైన ఈమె కథలకు స్వీకరించిన పలు అంశాలు అప్పట్లో రచయిత్రులేకాక రచయితలు కూడా సాహిత్యంలోకి తీసుకు రాలేదు. వైవిధ్యభరితమైన సుజాతాదేవి కథలు నిస్సందేహంగా గొప్ప కథలనద గినవని మధురాంతకం రాజారాం, డి. రామలింగం వంటి పెద్దలు అభినందించారు.

చేపల బజార్లో చేపల్ని శుభ్రం చేసి ఇచ్చేందుకు కత్తిపీటల్ని ముందేసుకు కూర్చునే బడుగు జీవుల జీవిత చిత్రణ చేపలు కథ. అవిటిదైన కూతుర్ని కాటేసేం దుకు చూస్తున్న మృగాళ్ళ బారినుండి కాపాడి ఒక ఇంటిదాన్ని చేయాలని చూసేతల్లి తపన ఏ విధంగా ఛిద్రమైందో తెలిపే కథ ఇది.

సవరాలు కట్టి జీవించే వారి కథ ‘ఎటు చూస్తే అటు’. చిక్కుపడిన, గబ్బువాసనతో వున్న వెంట్రుకల ముద్దల్ని చిక్కు తీసి సవరాలు కట్టే పనిలోని సాధక బాధకాలు కళ్ళకు కట్టేలా చిత్రించటమే కాక ఆ నేపధ్యంలో గుండెలు పిండే కథ సాగుతుంది. పేదకన్నమ్మ తన తన పెంపుడు కూతురు దూరమైనా ఆమె ఆటపాటల్ని నిరంతరం కళ్ళముందుకు తెచ్చుకుని మురిసిపోయే దృశ్యం సుజాతాదేవి కథన చాతుర్యాన్ని పట్టి చూపుతుంది. ఆ పెంపుడు కూతురు పెద్దదై పెళ్ళై పిల్లల్తో సుఖంగా వుంటుంది కాని దుర్భరజీవితం సాగిస్తోన్న కన్నమ్మ దూరాన వున్న మనవరాలికి కానుక ఇవ్వాలని తనకు న్న కాస్తంత ఇంటిని పోగొట్టుకొని జీవచ్ఛవం కావటం కథ ముగించాక కూడా మనల్ని వెంటాడుతుంది.

మరోకథ ”ఇంతేలే”లో షాపుల ముందు వూడ్చే పనివారి జీవితం. కనకమ్మ కుతురు జబ్బుతో మంచం పట్టే సరికి చంటిపిల్లతో సహా ఆమెని పుట్టింట్లో విడిచిపెడ్తాడు అల్లుడు. అంతంత సంపాదనవున్న కనకమ్మ ఆ పరిస్థితిలో కూతురు మందులకోసం మనమరాల్ని, పసివాళ్ళని చంకనేసుకుని యాచించే ఆసిరమ్మకి రోజుకి 3 రూపాయల కోసం అద్దెకి ఇస్తుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలనే దుర్భుద్దితో అసిరమ్మ పసిదాన్ని దొమ్మరి వాళ్ళకి ఇస్తుంది. దొమ్మ రాటలో పిల్ల కిందపడి ప్రాణం విడుస్తుంది. దుర్భర దారిద్య్రం ఎంతటి హీనస్థితికి దిగజారుస్తుందో అద్దం పట్టి చూపే కథ ఇది.

‘అవినీతివృత్తం’లో చిక్కుకుని గింగిరాలు తిరిగే ఆర్ధికంగా వెసులుబాటులేని జీవితాల కథ ”వృత్తం”

రచయిత్రి తొలి కథగా చెప్పుకునే 1970లో ప్రచురితమైన ”మలుపు” హోటల్లో వెట్టిచాకిరి చేస్తున్న బాబ్జి ఎల్లప్పుడూ తనకొక ఇల్లూ పనిచేసి వచ్చే తనకోసం ఆ ఇంట్లో ఎదురుచూసే వ్యక్తిని కలకంటుంటాడు. ఆ కల బాబ్జీ జీవితంలో ఎంతగా అందరానిదో తెలియచేస్తుంది ఈ కథ.

1970ల నాటికి తెలుగు కథానికా ప్రపంచం చాలా వరకు ప్రేమ, అపార్ధాలూ, ఆటంకాలూ, పెళ్ళీ వీటీ మధ్యనే తిరిగేకాలం. అటువంటి సమయంలో సామాజిక స్పృహ గల కథ డి.సుజాతాదేవి కలం నుండి రావటం గుర్తించవలసిన అంశం.

అన్నా చెల్లెళ్ళ మధ్య బంధంలో ఆర్థికావసరాలు చొరబడినప్పుడు ఏ విధంగా మానవసంబంధాలు కరిగిపోతాయో దృశ్యమానం చేసిన కథ ”పొగమంచు”

చదువుకోవాల్సిన చురుకైన కుర్రాడు చీకటిలో చెత్తకుప్పల దగ్గర తగరపు మెరుపు కాగితాలు ఏరుకుని దీపావళి టపాసుల తయారీకి తండ్రికి అందించె క్రమం, ఆ పని అయ్యాక జీవన భృతికి మరో పనికి పోవటం ఇదంతా కథలో సమయాను కులంగా నడిపించటమే కాక, ఆ పిల్లాడు దొంగతం చేసాడని అనుమానించి వాడివె నకే ఇంటివరకు వచ్చిన పెద్దమనిషి ప్రవర్తనలోని డొల్లతనం బట్టబయలు చేసేలా కథనం పాఠకుడిని ఆకట్టుకొం టుంది.” జాలి సానుభూతి అనే భావాలకి చిరునామా లేదు. వున్నా అవి వేర్వేరు అర్థాలతో స్వప్రయోజనాలకు ముడిపెట్టబడి వుంటాయి.” అనే నిజాన్ని నిర్వచించి పాఠకుడి చెవుల్లో కూడా ”చిరునామా” కథ ద్వారా ప్రతిధ్వనింపచేసారు రచయిత్రి.

ఇలా చెప్పుకొంటూపోతే ఆమె ప్రతీకథ లోను ఒక ప్రత్యేకత ఎత్తి చూపించవచ్చు. 1970-90ల మధ్య వచ్చిన కథలకి కథాం శంలోను పాత్రచిత్రణలో, శైలీశిల్పాలలో, సభాషణల్లో ఎందులో తీసుకొన్నా ఆనాటి అభ్యుదయ కథకులకు తీసిపొని రీతిలో ప్రతీకథా వుండటమెకాకుండా అప్పటికి ఎవరూ ఎంచుకోని వూహించని అంశాలతో బలంగా తనకొక స్వంతముద్రని ప్రతిష్టించు కొంటూ రాసినవి సుజాతాదేవి కథలు.

సుజాతాదేవి నిబద్ధత గల రచయిత్రి కావటాన ఈమె కథ నేల విడచి సాము చేయకుండా సమాజాన్ని, సమాజం లోని మనుషుల్ని, ముఖ్యంగా ఆర్ధిక రేఖకి దిగువన వున్న బడుగు జీవుల వైవిధ్యభరిత జీవన వేదననీ, అతలాకుతలం చేస్తున్న ఆర్ధిక అవసరాల్ని అద్దంలో చూపే ప్రయత్నం చేస్తుంది. వారి జీవన విధానాన్నే కాక సంభా షనల్ని సంధర్భోచితంగా సజీవంగా ఒక ధారలా అలవోకగా మాండలీకంలో సాగిపోతాయి.

కథనంలో గాని, సంభాషణల్లో గానీ ఎక్కడా ఇతర భాషాపదాలు దొర్లకుండా అవసరమైన చోట స్వచ్ఛమైన శ్రామిక భాషే రాయటం సుజాతాదేవికి భాష మీదగల పట్టు, శ్రద్ధ స్పష్టమౌతుంది.

ఏ వాదాన్ని నినాదంలా ప్రచారప్రా యంగా చెప్పకుండానే స్త్రీ జీవితపు అస్తిత్వం, గ్రామీణ కుటుంబమూలాలు, మానవ సంబంధాల్ని చిద్రం చేస్తోన్న ఆర్ధిక అవస రాలు అంతర్లీనంగా కథ అంతటా పరచుకుంటాయి.

డి.సుజాతాదేవి రాసిన ప్రతి కథలోనూ ఆమె నిశితమైన పరిశీలనాశక్తీ, సమాజం పట్ల బాధ్యతా, సాహిత్యం పట్ల గల అంకిత భావం స్పష్టమౌతుంది. ఏదైతే అది కథగా మలచటం బహుశా ఆమెకు ఇష్టం వుండకపో వచ్చు. అందుకేనేమో సుజాతాదేవి విస్తృతం గా రచనలు చేయదు, అలా అని సాహిత్యానికి దూరం కాకుండా స్పందన కలిగినప్పుడు అడపాదడపా రాస్తూనే వున్నారు.

గేయం రాసినప్పుడు వెన్నెలసోనలా, బాల లకు కథ చెప్పినప్పుడు తేనెబిందువులా సాగే సుజాతాదేవి అక్షరం కథానికారచనకు వచ్చే సరికి పదునైన చాకులా దూసుకుపోతుంది.

సుజాతాదేవి కలం నుండి ఇంత బలమైన కథలు వెలుగు చూసినా వందేళ్ళ కథానికా సాహిత్యప్రస్థానంలో సాహిత్య విమర్శకులు ఎవరి దృష్టిలోనూ పడకపోవటం, ఏ సాహిత్య వ్యాసంలోనూ ఈమె కథల ప్రస్థావన సూచన ప్రాయంగానైనా లేకపోవటం ఆశ్చర్యమే!!

1990ల తర్వాత చాలా మంది కథకులు ముఖ్యంగా ఈ తరహా అంశాలతో రాసిన కథలు చర్చలలో వస్తూనే వున్నాయి. అనేకానేక సదస్సులలోనూ, సమావేశాల లోను ప్రసంగవ్యాసాలలోనూ, ప్రచురిత వ్యాసాలలోనూ ఈమె మాత్రం కనపడదు.

ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతిభ వున్నప్పుడు పురస్కారాలు వెతుకొం టూనే వస్తాయి అనేందుకు డి.సుజాతాదేవికి వచ్చిన పురస్కారాలే నిదర్శనం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.