26.11.2013వ తేదీ శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి రచించిన బాలల కథాసంపుటి ”తాతట మనవడు.కాం” ను ప్రముఖ కవి, సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా.ఎన్. గోపి ఆవిష్కరించి ప్రసంగిస్తూ ”బాలల సాహిత్యం రాయటం అంత సులభం కాదనీ, బాలల స్థాయికి ఎదిగి బాలసాహిత్యం రాయాలనీ, తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు బాలల కథలు చదివించే అలవాటు చేయాల”న్నారు. బాలలకోసం కథలు రాసిన రచయితలను గుర్తు చేశారు. అమ్మలాంటి మనసున్న వారే బాలసాహిత్యాన్ని రాయగలుగుతారని అన్నారు. తేలికైన పదజాలంతో పిల్లలకు బాగా అర్థమయ్యేరీతిలో చాలా చక్కటి కథలు రాసిన భవానీదేవి అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన డా. మక్తేవి భారతి మాట్లాడుతూ బాలల మనస్తత్వాలను లోతుగా అధ్యయనం చేసే కథలు రాయాలని అన్నారు.
రచయిత్రి భవానీదేవి మాట్లాడుతూ ఫీచర్ నిర్వహించటంలో నిబద్ధత ఉండాలంటూ ఈ కథలు రాయటంలో తన అనుభవాలు వివరించారు. డా. బి. ఉమాదేవి, దాసరి వెంకట రమణ కథలను సమీక్షించారు. నది ఎడిటర్ ఇన్ చార్జ్ జలదంకి ప్రభాకర్, విశాలాంధ్ర కార్యనిర్వాహక సంపాదకుడు శ్రీ మధుకర్, బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులు శ్రీ చొక్కాపు వెంకటరమణ, సాధన నరసింహాచార్య కార్యక్రమంలో పాల్గొన్నారు.