ఆంగ్ల మూలం : కిన్నరి జివాని
అనువాదం : ఆరి సీతారామయ్య
నా కవిత ఆదిమధ్యాంతాలులేని ఓ అనుభూతి
అమూర్త అస్పష్ట ఆకారాలుగా
రూపం దాల్చుతున్న రంగురంగుల గాజుముక్కల పోగు
చక్కటి వర్ణ చిత్రంగా మారాలనే తహతహ
ఏదోచెయ్యాలనే ఆరాటం
అనుభవాల గురించీ
అనుభూతుల గురించీ
విన్నవాటి గురించీ
కన్నవాటి గురించీ
చెప్పాలనే కోరిక
వాస్తుశాస్త్రం చదవాలని కోరిక
ఊళ్ళోనే ఏదో కాలేజీలో
ఏదో ఒక శాస్త్రం చదవమని అమ్మా నాన్నా
అబ్బాయినయితే అలా అనేవారా?
మంచి సంబంధాలు రావాలంటే
అమ్మాయిలు చదువుకోవాలి
అందుకే చదువు అన్నారు
కెరీర్ గురించి మాట్లాడ్డం మాత్రం నిషేధం
నాకిష్టం లేదన్న వాడితోనే పెళ్ళి చేశారు
చదువుకోనిస్తే తలకెక్కిందన్నారు
స్వేచ్ఛ ఇచ్చింది
కుటుంబ గౌరవం మంటగలపటానికి కాదన్నారు
అబ్బాయినయితే అలా అనేవారా?
నిరక్షరాస్యత అంటే ఏమిటి?
చదవటం రాయటం రాదనేనా?
వదులుకున్న అవకాశాల మాటో?
నవ వధువుగా అమెరికా చేరాను
కొద్ది రోజుల్లో హంతకురాలిగా జైల్లో పడ్డాను
సురక్షిత జీవితానికి దూరమైన మొదటి రోజుల్లో
ఇద్దరు పోలీసాఫీసర్లు ప్రశ్నిస్తుంటే
ఇంగ్లీషు సరిగ్గా రాక
చట్టం గురించి తెలియక
ఇండియాలో బియ్యస్సీ చదివినదాన్ని
నిరక్షరాస్యగా నిలబడ్డాను
నమ్మశక్యం కానిదేంటంటే
నాజీవితంలో మొదటిసారిగా
స్త్రీల గురించీ
స్త్రీల సమస్యల గురించీ
అధ్యయనం చేసే అవకాశం దొరికింది – జైల్లో!
కాలేజీల్లో చెప్పే ఇలాంటి చదువు
ఇన్నాళ్ళూ నాకు ఎండమావిగా మిగిలిన చదువు
ప్రాధమిక పాఠశాలలో ఉండాల్సిందికదా!
సరస్వతిని దైవంగా పూజించే దేశంలో
ఇందిరాగాంధీని ప్రధానిగా ఎన్నుకున్న దేశంలో
ఇప్పటికీ ఎంతోమంది స్త్రీలు నిరక్షరాస్యులే
సౌదీ అరేబియలో స్త్రీలను చదవనిస్తారట
కాని, ఏవో సేవారంగాల్లో తప్ప
ప్రొఫెషనల్ వృత్తులు వారికి నిషేధమట
ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా…
బాల్య వివాహాల
పసితనంలోనే మాతృత్వం
శిశుపోషణ
అంతులేని ఇంటిపని
ఇంతాచేస్తే మగబిడ్డనే కనమనే సమాజం
ఇంకా ఎన్నో మన బాధలు
ఒక దేశానికి పరిమితమైనవా?
ప్రపంచం అంతటా ఇవే సమస్యలు.
చదువు ఎంతోమంది స్త్రీలకు గొంతిచ్చింది
భావ ప్రకటన సుళువుచేసింది
మంచి ఆరోగ్యానికి
మంచి జీవితానికి
బాటవేసింది
శక్తివంతుల్ని చేసింది
కాని,
లింగ వివక్ష
అసమానత
ఇంకా ఎంతోమంది స్త్రీలను
నిరక్షరాస్యుల్ని చేసి
పగిలిపోయిన రంగుటద్దపు ముక్కల్లా
నిర్లక్ష్యంగా విసిరేస్తున్నాయి.
ఈ గాజు ముక్కలు
వర్ణచిత్రంగా మారేదెప్పుడ?
మి కవిత బాగుంది.అద్దంముక్కతొఅ పొల్చదం స్త్రి జివితపు లొతుల్ని ఆడవారి సమస్యల్ని చక్కగా చెప్పింది.