భూమిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సాహితీ యాత్రలు… ప్రతిసారీ ఓ కొత్తప్రాంతం, ఓ కొత్త అనుభవం, కొత్త కొత్త వ్యక్తులతో దిగ్విజయంగా సాగుతున్నాయి. పాపికొండలతో మొదలై, ఉత్తరాంధ్ర, తలకోన, నల్లమల అడవుల్లోంచి… ఈసారి ఆదిలాబాద్, నిజామాబాద్ అడవులు, జలపాతాలు, గోండుల స్థావరాలు కలియ తిరుగుతూ కొనసాగింది. 25 మందిమి… రచయిత్రులు, ఆప్తమితృలు కలిసి జనవరి 20న బయలుదేరి, 23 ఉదయం తిరిగి వచ్చాం. ఎన్నో అనుభవాలను, ఉద్విగ్నమైన అనుభూతులను మూటగట్టుకుని వచ్చాం. ఎవరి అనుభవాన్ని వాళ్ళు మార్చి నెల భూమికలో పంచుకుంటారు. ఈ యాత్ర వెను ప్రధాన సూత్రధారి నిజామాబాద్‌లో వుండే అమృతలత. రైటర్స్ ట్రిప్ వెయ్యండి… అందరూ రండి అని ఎప్పటినుండో ఆహ్వానిస్తున్నారు. నేను గత ఐదు సంవత్సరాలుగా ఆదిలాబాదు ట్రిప్ వెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఆదిలాబాదు గురించి ఏమీ తెలియకపోవడం వల్ల, ఎలా ప్లాన్ చెయ్యాలో అర్ధం కాక నేను సాహసం చెయ్యలేకపోయాను. ప్రస్తుతం అమృతలత ఆహ్వానం వుంది… ఆ ప్రాంతంలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమత ఉనికి, ఆ సంస్థ డైరక్టర్ ప్రశాంతి స్నేహం… ఈ ట్రిప్‌ని ప్లాన్ చేసేలా ఉత్సాహపరిచాయి. ఈ ట్రిప్ సక్సెస్ వెనక అమృత, ప్రశాంతి, గీతల కృషి ఎంతో వుంది. వారి సహకారం లేకపోతే ఈ ప్రయాణం జరిగేదే కాదంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. వాళ్ళు ముగ్గురూ నాకు ఆత్మీయులు కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు తెలపలేను. కానీ వారి పాత్రను ఖచ్చితంగా హైలైట్ చెయ్యాలి. 20వ తేదీన నాలుగు గంటలకి భూమిక ఆఫీసు నుండి 24 మంది మినీ బస్సులో (28 సీటర్) గోలగోలగా నిజామాబాద్ బయలుదేరాం. ఎప్పుడూ వచ్చే వాళ్ళకి తోడు ఈసారి కొత్తవారు కూడా వున్నారు. తొలిసారి ఇలాంటి యాత్రలకి వచ్చినవారున్నారు. నగరం పొలిమేరలు దాటేటప్పుటికి ఎవరి కబుర్లలో వాళ్ళు… నవ్వులు…. పాటలు …. చర్చలు. మధ్య మధ్యలో ఎక్కడున్నారు… ఎంత దూరమొచ్చారు అంటూ అమృత ఎంక్వయిరీలు… బస్సులోకి ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి 100 రూపాయిల ఫైన్ వెయ్యమని పురమాయింపు. నేనూ… ప్రశాంతి అయిదు నిమిషాలు ఆలస్యంగా ఎక్కాం. అనుకున్న టైముకి ముందొస్తే 500 రూపాయలు గెలుపు అంటూ ఊరింపు… సరదా సరదాగా సాగిన ప్రయాణం… ఎనిమిన్నరకి నిజామాబాద్ చేరాం. అమృత గారు వారి బృందం మమ్మల్ని ఆహ్వానించారు. వారి గాంగ్ కూడా మాతో చేరింది. అందరం కలిసి ఆవిడ కట్టించిన గుడిని, గెస్ట్‌హౌస్‌ని చూడ్డానికి వెళ్ళాం.
ఆసక్తి వున్న వారంతా గుడిలోకెళ్ళారు. ఆ తర్వాత ఆవిడ ఎంతో కళాత్మకంగా కట్టించిన గెస్ట్‌హౌస్‌కి వెళ్ళాం. విశాలమైన ఆవరణలో, పచ్చటి చెట్లు, కొండల మధ్య వీటిని నిర్మించారు. నిశ్శబ్దంగా, నిరామయంగా వున్న ఆ పరిసరాలు అందరినీ తన్మయపరిచాయి. నాకు ఆవిడ ఎంతో ఇష్టంగా కట్టించుకున్న గుడెశ, దానిపక్కనున్న పెద్ద విప్పచెట్టుని చూడాలని మనసు పీకుతున్నా… అప్పటికే ఆలస్యమైంది. జ్యేష్ఠ, పౌరులు నిద్రపోతారు. నా కోరిక నోరునొక్కి ‘లాలన’వేపు బయలుదేరాం. ప్రకృతి అందాలతో అలరారుతున్న చోట అమృత సోదరుడు ‘లాలన’ కట్టారు. చాలా మంది నిద్రపోతున్నారు. కొంత మంది మమ్మల్ని చూసి చాలా ఆలస్యమైంది అన్నారు. వారికి క్షమాపణలు చెప్పి… మళ్ళొకసారి అక్కడికి వెళ్ళాలని తీర్మానించుకుని… ఆర్మూరు… అమృత వాళ్ళింటికి బయలు దేరాం. ఎంతమందినైనా యిముడ్చుకోగల ఇల్లది… ఆవిడ హృదయం లాగానే… అందరం ఆ ఇంట్లో ఒదిగిపోయాం. రకరకాల వంటలతో విందుభోజనం… భుక్తాయాసం తీరకముందే గేమ్స్ ఆడదాం అంటూ నెల్లుట్ల రమాదేవి గారి హడావుడి. అర్ధరాత్రి దాకా ఆటలు, పాటలు, డాన్సులు, గెలిచిన వారికి బహుమతులు. ఉదయం ఆరింటికి ”పొచ్చర ప్రయాణం” అనగానే ఆటలాపి పడక లేసిన చోటికి చేరిపోయాం కానీ… మళ్ళీ కబుర్లు. ఎప్పుడో నిద్రపట్టింది కానీ… కాసేపటికే కోడికూసి లేపేసింది. మర్నాడు చాలా పెద్ద ప్రోగ్రామ్ వుంది. నిజామాబాద్, ఆదిలాబాద్‌ల మధ్య వున్న ప్రముఖ జలపాతాలు పొచ్చర, కుంతలకెళ్ళాలి. ఉదయమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడాలి. లంచ్‌కి మొండి గుట్ట వెళ్ళాలి. లంచ్ తర్వాత ట్రాక్టర్లలో గోండు గ్రామానికి వెళ్ళాలి. వారితో మాటామంతీ… వారితో కలిసి నృత్యాలు. సంతోషం, దుఃఖం కలగలిసిన రోజది. పొచ్చర జలపాతంలో పిల్లల్లా కేరింతలు కొట్టి, బుర్కరేగడి.. గోండుల గ్రామ సందర్శనం.. ట్రాక్టర్‌లో ఐదారు వాగులు, దాటి… గుట్టలు గాఢమైన అడవిలో చేసిన ప్రయాణం.. గోండుల జీవనదృశ్యాలు మనసును మెలిపెట్టాయి. ఆ ప్రయాణం తర్వాత… మళ్ళీ అడవిలో ప్రయాణించి ఉట్నూరు చేరడం, ఉట్నూరు ఆర్.డి.వో ఆతిధ్యం… మహిళాసమత వారి సహకారం… ఉదయం చలిలో బయలుదేరి, కెరీమెరి ఘాట్ మీదుగా ప్రయాణించి కొమరం భీమ్ విగ్రహ దర్శనం… ఆయనకు నివాళులర్పించి, గ్రామస్తులతో మాట్లాడి… తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో బస్సుటైర్ బరస్ట్ అవ్వడం.. 2 గంటల సేపు పొలాల్లో తిరుగుతూ చింత చెట్టు మీద దాడి చేసి చింతకాయల దండ తయారుచేసి ”చింతలు లేని సత్య” అంటూ నామెళ్ళో చింతకాయల దండేసి… నవ్విన నవ్వులు అడివంతా ప్రతిధ్వనించాయి. ఆ తర్వాత ప్రశాంతి ఆధ్వర్యంలో ఝరీ, మోడి, ఉషేగాఁవ్ గ్రామాల సందర్శన… ఆదివాసీల అపూర్వ ఆదరణ వారు కురిపించిన ప్రేమ. ఆలస్యంగా సమతా నిలయం వెళ్ళినా.. అమ్మమ్మా అంటూ పిల్లల కావలింతలు… వారితో ముచ్చట్లు… వేడి వేడి భోజనం తర్వాత ఈ రాత్రికి ఉండిపొండి అనే పిల్లల అభ్యర్ధనని సున్నితంగా తిరస్కరించి… అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణం.
ఓస్… ఇంతేనా… అని చప్పరించేసారా? జస్ట్ రూచి చూపించానంతే. మార్చి సంచికలో ఈ ట్రిప్ గురించి అద్భుతమైన అనుభవాలు ఆవిష్కారం కాబోతున్నాయి. ఈ సంపాదకీయంలో నేను రాసింది పిడికెడే… పిడికిలంత నా గుండె నిండా బోలెడన్ని అనుభవాలు, విషాదాలు, సంతోషాలు, సంబరాలు, కలగలిసిపోయి వున్నాయి. నన్ను అతలాకుతలం చేస్తూ వాకపల్లి వెళ్ళిన నాటి మానసిక స్థితికి నన్ను గురిచేసిన దృశ్యాల మాలికలు నాలోపల రీళ్ళల్లా సుళ్ళు తిరగుతున్నాయ్. రాసే వరకు ఊపిరాడనివ్వని ఆ అనుభవాలన్నీ మార్చినెల భూమికలో మీ కోసం… ఎదురుచూస్తారుగా…