డోరిస్‌ లెస్సింగ్

పి. సత్యవతి

అర్హులైన వారికి వారు ఆశించిన పురస్కారాలు వాటిని ఆనందించి, ఆస్వాదించే వయసులో రాకపోవడం, పోయేలోగా వచ్చింది పోనీలే అనుకోవడం- ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఏడాది నోబెల్‌ పురస్కార గ్రహీత డోరిస్‌ లెస్సింగుని అడగాలి.

ఆమె కొడుకుతో కలిసి వైద్యశాలకి వెళ్ళొచ్చేసరికే ఇంటి గుమ్మందగ్గర మెట్లమీద పత్రికా ప్రతినిధులు, టెలివిజన్‌ కెమేరాలు ఆమె కోసం సిద్ధంగా వున్నాయి. ఆమెది కాస్త స్థూలకాయం, వినికిడికూడా కాస్తతగ్గింది. వాళ్ళొచ్చిన సంగతి అర్ధంకాలేదు. వాళ్ళే చెప్పారు అభినందనలతో ”డోరిస్‌ గారూ మీకీ సంవత్సరం (2007) నోబెల్‌ పురస్కారం ఇచ్చారండీ” అని.
సంతోషంతో ఉరకలు పెట్టడానికీ విస్మయం చెందటానికీ ఆవిడకా పురస్కారం అతి చిన్న వయసులో ఏమీ రాలేదు. పైగా అనుకోకుండా వచ్చిందీ కాదు.
ఎనభై ఎనిమిదేళ్ళ డోరిస్‌ లెస్సింగు 1949లో తొలి నవల ”ద గ్రాస్‌ ఈజ్‌ సింగింగు” వ్రాసి, అప్పటి నుంచీ ఎన్నో నవలలు, సైన్స్‌ ఫిక్షన్‌తో సహా వ్రాసింది.
”నాకు పురస్కారాలన్నీ దాదాపు వచ్చాయి. నాకు నోబెల్‌ వస్తుందని 40 సంవత్సరాల నించీ ఊహాగానాలున్నాయి. చాలా సార్లు షార్ట్‌ లిస్ట్‌‌లో కొచ్చింది. అసలు నేను పోయేలోగా నాకు ఇస్తారా ఇవ్వరా అనుకునేదాన్ని. ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాక ఇప్పుడు రావడం కాస్త ఆశ్చర్యమే” అంది. ఆమె ఇంటిలోపల ఫోన్‌ మోగుతోంది.
”సరే, ఇప్పుడు నేను ఫోన్లు అందుకోవాలి. అభినందనలకి తగ్గట్టు సమాధానాలు వెతుక్కోవాలి. ఇహ ఇప్పటినించీ వాటిని ఉపయెగించాలి కదా.” అని ఆమె నెమ్మదిగా మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళింది. స్త్రీల అంతరంగాలను ధైర్యంగా ఆవిష్కరిస్త 1962లో డోరిస్‌ లెస్సింగు వ్రాసిన ”ద గోల్డెన్‌ నోట్‌బుక్‌” అనే నవల ఆమెను గొప్ప రచయిత్రిగా నిలబెట్టింది. ఆ నవలలో ప్రధానపాత్ర అన్నాఉల్ఫ్‌ స్వేచ్ఛగా బ్రతకడం కోసం పడిన తపన, స్త్రీ పురుష సంబంధాల పట్ల డోరిస్‌ అభిప్రాయలకు అద్దం పడుతుంది. భర్త, బిడ్డల కోసం, స్త్రీలు తమ జీవితాలను త్యాగం చేయ నవసరంలేదని చెప్పిన డోరిస్‌ 60వ దశకంలో వికసిస్తున్న స్త్రీవాద ఉద్యవనికి మార్గదర్శకురాలని చెప్పాలి. 20వ శతాబ్దంలో స్త్రీ పురుషుల ఆలోచనలెట్లా వుంటాయె చెప్పిన పుస్తకాలలో ఇది ఒకటి అని నోబెల్‌ పురస్కార కమిటీ పేర్కొంది.
స్త్రీలలో ఉండే కోపాన్నీ, ఉద్రేకాన్నీ గురించి వ్రాసినందువల్ల అప్పట్లో ఆమెను విమర్శించారు కొందరు. మొదట్లో ఆమెను స్త్రీవాద ఉద్యమ నాయిక అని అభివర్ణించినా, తరువాత ఆమె తను స్త్రీవాదిని కానని చెప్పేసింది. ఈ ప్రకటన చేసినందుకు ఆమెను బ్రిటిష్‌ అకడమీషియన్లు కొందరు తీవ్రంగా విమర్శించారు. డోరిస్‌ 1919లో ఇప్పటి ఇరాన్‌లో జన్మించింది. ఆమె తండ్రి బ్యాంక్‌ గుమాస్తా, తల్లి నర్స్‌. రోడీషియలో (ఇప్పటి జింబాబ్వే) వ్యవసాయం లాభదాయకం అని ఆశపడి అక్కడ వెయ్యెకరాల పొలంకొని వ్యవసాయం పెట్టి నష్టపోయడు ఆమె తండ్రి. హైస్కల్‌ చదువుకూడా పూర్తిచెయ్యని డోరిస్‌, విస్త్రృత పుస్తకపఠనం ద్వారానే జ్ఞానం పెంచుకో గలిగింది. బహుగ్రంథకర్త అవగలిగింది. తన 15వ ఏట ఇల్లువదిలి పెట్టి, సాలిస్‌ బరి(ఇప్పటి హరారె) వెళ్ళి స్వతంత్ర జీవనానికి నాంది పలికింది. అక్కడ టెలిఫోన్‌ ఆపరేటర్‌గా నర్స్‌గా పనిచేసింది. 19వ ఏట వివాహం చేసుకుని ఇద్దరు బిడ్డల తల్లి అయింది.వైవాహిక జీవితంలో ఊపిరాడక, ఒక నిర్బంధంలా అనిపించి కుటుంబాన్ని వదిలిపెట్టింది. తరవాత కొన్నేళ్ళకు గోట్‌ఫ్రయ్డ్‌ లెస్సింగుని పెళ్ళి చేసుకుంది. వాళ్ళకి ఒక కొడుకు. ఆఫ్రికన్‌ కమ్యూనిష్టు పార్టీలో వున్న ఆమె భర్త. లెస్సింగు 1956లో హంగేరీలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులలో, వర్క్సిస్టు సిద్ధాంతాన్ని వదిలిపెట్టినందుకు ఆమెను మళ్ళీ విమర్శించారు, బ్రిటన్‌ లో..తరువాత ఆమె లెస్సింగుకు విడాకులిచ్చి, కొడుకుతో లండన్‌లో స్థిరపడింది.
1949లో ఆమె వ్రాసిన మొదటి నవల ”ద గ్రాస్‌ ఇజ్‌ సింగింగు”లో ఒక శ్వేతజాతి మహిళకూ ఆమె నల్లజాతి సేవకునికీ మధ్య గల సంబంధాన్ని చిత్రించింది.
1962లో ”ద గోల్డెన్‌ నోట్‌బుక్‌” అమెరికాలో ప్రచురితమైనప్పుడు చాలా మందిని ఉత్తేజపరిచింది. గత 20 సంవత్స రాలుగా డోరిస్‌ రచనల్ని ప్రచురిస్తున్న హార్పర్‌కాలిన్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ జేన్‌ ఫ్రీడ్‌మన్‌ ”స్త్రీలకీ, సాహిత్యానికీ కూడా ఆమె తల్లి” అని ప్రశంసించింది.
”ద గుడ్‌ టెర్రరిస్ట్‌”, ”మార్తా క్వెస్ట్‌” అనే నవలలే కాక సైన్స్‌ ఫిక్షన్‌ కూడా ఆమె వ్రాసింది. ఆమె ఇప్పటి చివరి నవల, మొన్న జులైలో హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురించిన ”ద క్లెఫ్ట్‌”..ఆమె ఇటీవలి రచనలు ఆమెకు సూఫీ తత్వం మీదకల మక్కువకు అద్దం పడతాయి.
”ఇంతకాలానికి ఈ సంవత్సరం మీకీ పురస్కారం ఎందుకొచ్చిందంటారు” అని అడిగితే, ”ఏమో తెలీదు. నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. ఇంతకాలం నన్ను తిరస్క రిస్తూ వచ్చారు. చాలా కాలంగా” అంది డోరిస్‌. నోబెల్‌ కమిటీ మాత్రం ఆమెను మహాకావ్య రచయిత)గా అభివర్ణించింది.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

One Response to డోరిస్‌ లెస్సింగ్

  1. డోరిస్ లెస్సింగ్ పై ఇంతవరకూ తెలుగు అంతర్జాలంలో ఎవ్వరూ వ్రాయలేదే అన్న లోపాన్ని భర్తీచేసారు.
    డోరిస్ లెస్సింగ్ రాసిన కనోపస్ ఇన్ ఆర్గోస్:అర్కవ్స్ అనే ఐదు నవలల సంపుటినీ స్పేస్ ఫిక్షనంటారు. ఈ నవలలతో ఆవిడ స్పేస్ ఫిక్షన్ అనే కొత్త జాన్ర్ సృష్టించింది. ఈ సంపుటి, ప్రపంచ ప్రఖ్యాతి గడించింది. సైన్సు ఫిక్షనుకి స్పేస్ ఫిక్షనుకి తేడా ఉంది.
    ఇది కాకుండా, తాను రచయిత్రిగా ప్రఖ్యాతి గడించిన తర్వాత, తన రచనలు తన పేరు చూసి ప్రచురిస్తున్నారా, లేక రచనని చూసా అని తెలుసుకోడానికి లెస్సింగ్ జేన్ సోమర్స్ అనే కలం పేరుతో కొన్ని నవలలు ప్రచురించింది.
    ఇద్రిష్ షా అనే సూఫీ తాత్వికుడితో పరిచయం ఈమెని సూఫి మార్గం వైపు మళ్ళించాయి.
    ఇవి కాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్సురల్ రీసెర్చిలో ఇప్పటికీ లెస్సింగ్ క్రియాశీలక పాత్రని పోషిస్తున్నారు.

Leave a Reply to Nagaraju Pappu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.