శిలాలోలిత
ప్రియమైన ఇందిరా !
ఎలా ఉన్నావ్? నీకు ఉత్తరం రాసి చాలా రోజులైంది. ఏమనుకోకు. ఈ నగరం మమ్మల్ని మనుషుల్లా ఉంచడం లేదు. ఎందుకు పరుగెత్తుతున్నామో ఎటు పరిగెత్తుతున్నామో తెలీకుండానే ఒకటే పరుగు. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నాం.
హాయిగా నువ్వా పల్లె టూర్లో పచ్చటి పొలాల మధ్య, కమ్మని గాలితో, కిచకిచలాడే పిట్టల్తో ఎంత హాయిగా ఉన్నావో కదా! కరెంట్ పోయినా దిగుల్లేదు. వేపచెట్టూ, తాటా కుల ఇల్లూ, చల్లని గాలి నీ స్వంతం.
మొన్నామధ్యన అమృతలతా, రమా వాళ్ళతో కలిసి ‘క్వీన్’ అనే హిందీ సినిమా చూశాను. అద్భుతం అనుకో. చాలా అమాయకంగా, బిడియస్తురాల్లా, ఒద్దికగా ఉండే అమ్మాయి, హఠాత్తుగా ప్రేమ విఫలమై పెళ్ళాగిపోతే, జీవితం తలక్రిందులై పోయిందని బాధ పడ్తుంది. ఏడుస్తుంది. ఓడిపోయానను కుంటుంది. కానీ ఆ తర్వాత పడిలేచిన కెరటంలా జీవితంలో తాననుకున్నవన్నీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రతి పరిస్థితిని డీల్ చేసే విధానం, ఆమెలో పెరిగిన ఆత్మవిశ్వాసం చాలా గొప్పగా డైరెక్టర్ చిత్రించాడు. ఒక స్త్రీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో తన జీవితాన్ని తానే జయించిన రీతి నిజంగా బాగుంది. నువ్వు కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా అది. చిన్న చిన్న మైన్యూట్ విషయాల్ని కూడా వదిలిపెట్టకుండా, సంస్కృతి సంస్కారాల పేరిట కుటుంబాల్లో, తల్లిదండ్రుల్లో, ఉండే లోపాల్ని కూడా బాగా ఎక్స్‌పోజ్ చేశాడు. నేనెంత రాసినా ఆ సినిమా గురించి తక్కువే. నువ్వే చూడు. నీకే అర్థమవుతుందప్పుడు. సినిమా ఎంత అద్భుతంగా ఉందో, సినిమా చూస్తున్నంతసేపూ నరకమే అనుభవించాం. ‘టివోలీ’ సినిమా హాల్లో ముందు సీట్లో కూర్చోవాల్సి రావడంతో నిలువు మెడ వేసుకుని చూడాల్సి వచ్చింది. సినిమా అయ్యాక ఇక మెడలు కదిల్తే ఒట్టు. బిగుసుకుపోయాయి.
వచ్చేవారం నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. ఓ రెండు రోజులుంటే మళ్ళీ రీచార్జ్ అయి ఈ నగరానికి ఒచ్చేస్తాను. సరేనా! ఇంకా ఏమిటి చెప్పు? ఏం చదివావు ఈ మధ్యన? అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. మన చిన్నప్పటి క్లాస్‌మేట్ ధనలక్ష్మి గుర్తుందా నీకు? రెండు పొడుగటి జడల్తో ఫోజ్ కొట్టేది. ఒకసారి మీరిద్దరూ దెబ్బలాడుకున్నారు కూడా! ఆ ధనలక్ష్మి, ‘నాంపల్లి’ లో కనబడింది. ఎంత మారిపోయిందో తెలుసా, ముందు నేను వెంటనే గుర్తు పట్టలేదు. మన తోటిదే కదా! పెద్ద వయసున్న దానిలా మారిపోయింది! మా ఇంటికొచ్చాక ఆ రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం, వాళ్ళ అమ్మాయి జీవితాన్ని గురించీ, వాళ్ళాయన పొగరుబోతుతనాన్ని గురించీ, అల్లుడి దాష్టీకం గురించీ, అబ్బాయి స్వార్థాన్ని గురించీ చెప్పుకొచ్చింది. అన్నింటినీ ఎదుర్కొని తనూ, అమ్మాయి కలిసి స్వేచ్ఛగా జీవిస్తున్నామని చెప్పింది. పోరాడి పోరాడి అలిసిపోయిన శ్రమ ధనలక్ష్మి మొహంలో కన్పిస్తూనే వుంది. అయినా ఆ కళ్ళల్లో కాంతి, జీవితాన్ని గెల్చుకున్న తీరు, నన్నెంతో సంతోషానికి గురి చేశాయి. నేనొచ్చేటప్పుడు ధనలక్ష్మిని కూడా తీసుకొస్తాను. తను చదివిన సాహిత్యమే, తనకు చాలా సందర్భాల్లో ఓదార్పు నిచ్చిందంటోంది. ఒక సామాన్య గృహిణిలానే బతుకుతూ, తను కోల్పోయిన జీవితాన్ని తిరిగి సంపాదించుకోవడమే కాకుండా, మొగ్గలోనే వున్న కూతురి బతుకుని మళ్ళీ చిగురింపజేసిన ‘ధనలక్ష్మి’ నిజంగా మెచ్చుకోదగ్గది. ఇవన్నీ చెబ్తుండే నీక్కూడా తన్ని చూడాలని వుంది కదూ! తాటిముంజెలూ, తాటి అప్పాలు నాకోసం ఎదురుచూస్తున్నాయి కూడా కదా! పారిజాతపు చెట్టుకింద, నీతో ఎప్పుడెప్పుడు కబుర్లు చెబ్తామా అని నాక్కూడా అనిపిస్తోంది. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటా. అక్షరాల్లో కనిపించే నీ కోసం… చూస్తూ…. నీ ప్రియనేస్తం