జన్యుమార్పిడి పరీక్షలకు అనుమతులు : జీవావరణ కాలుష్యానికి రాచమార్గం అసాధారణ ప్రభుత్వ నిర్ణయం – – డా|| డి. నరసింహారెడ్డి

జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలకు ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ వీరప్ప మొయిలీ అనుమతివ్వడం వివాదాస్పదమయింది. దీనికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. 2002లో బిటి ప్రత్తి విత్తనాలకు అనుమతివ్వడం దగ్గరినుంచి మనదేశంలో వివాదం మొదలయ్యింది. అప్పటి అనుమతులు క్షేత్ర పరీక్షల ఫలితాల ఆధారంగా చేయలేదని, అసలు క్షేత్ర పరీక్షల సమాచారం, డేటా ప్రజల ముందు పెట్టకుండా, నేరుగా ఇవ్వడం అప్పట్లోనే ప్రశ్నించడం జరిగింది. బిటి ప్రత్తి విత్తనాల రైతులకు, వ్యాపారపరంగా అందుబాటులోకి వచ్చినాక, 12 ఏండ్ల అనుభవం చూస్తే, క్షేత్ర పరీక్షల మీద, క్షేత్ర పరీక్షా ఫలితాల మీద, ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని అనుమతులు ఇచ్చిన శాస్త్రీయత మీద అనుమానాలు వస్తున్నాయి. బిటి ప్రత్తిలో కాయను తొలిచే పురుగును చంపే విషం చొప్పించి, జన్యుమార్పిడి చేశామని, దానివలన పురుగుమందుల ఉపయోగం తగ్గి, రైతులకు ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటు దిగుబడి పెరుగుతుంది అని చెప్పి మాన్సాంటో కంపెనీ అనుమతులు తీసుకుంది. బిటి విషం తిని పురుగులు మొదట్లో చనిపోయినా, క్రమంగా వాటికి ఈ విషాన్ని తట్టుకునే శక్తి వచ్చిందని, ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. బిటి విషయం కూడా మాన్సాంటో కంపెనీ శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా కేవలం కాయలోనే కాకుండా ఆకులలో, కాండంలో, వేర్లలో చేరి మొత్తం ప్రత్తి మొక్కనే విషతుల్యం చేసి, ప్రత్తి మొక్క ఉత్పత్తి మీద తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిన సందర్భాలు అనేక ప్రాంతాలలో రైతులకు ఎదురయ్యింది. ఈ ఆకులుతిన్న గొర్రెలు, బర్రెలు చనిపోవడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధకశాఖ, బిటి ప్రత్తి ఆకులు హానికరం అని ప్రకటించారు కూడా. కొన్ని ప్రాంతాలలో కాయలోకి రాకుండా, ఇతర ప్రాంతాలలో విషం రావడం వల్ల పురుగుల బాధ, పురుగుమందుల బాధ, ఖర్చు రైతులకు తప్పలేదు. స్థూలంగా చెప్పాలంటే, బిటి ప్రత్తి విత్తనాల విషయంలో, పరిశోధన కేంద్రంలోకంటే, క్షేత్ర పరీక్ష సమయంలోకంటే, రైతులు స్వయంగా తమ సొంత పెట్టుబడితో, తెలుసుకున్న ఫలితాలు ఎక్కువ. అంటే, మాన్సాంటో కంపెనీ శాస్త్రవేత్తలకు ఖర్చు లేకుండా, లాభాలు పొంది, రైతుల మీద భారం వేసి, తమ పరిశోధన కొనసాగించడానికి ఒక మంగళ అవకాశం మన దేశ నియంత్రణ వ్యవస్థ కలిగించింది.

కంపెనీకి లాభాలు, రైతులకు ఖర్చు విషయానికి వస్తే, గత ఏడాది (2013-14), ప్రత్తి విత్తనాల మీద రైతులు పెట్టిన పెట్టుబడి కనీసంగా రూ.1,215 నుంచి గరిష్టంగా రూ.1,600 కోట్లు. ఇందులో కనీసం రూ.500 కోట్లు మాన్సాంటో కంపెనీకి నేరుగా మరియు రాయల్టీ ద్వారా చేరినాయి. బిటి ప్రత్తి విత్తనాలలో రెండవ తరం వచ్చినా కూడా మొదటి తరం పనిచేయడం లేదు అని స్వయంగా మాన్సాంటో కంపెనీ ప్రకటించిన తరువాత కూడా, మొదటితరం విత్తనాలు రైతులకు అమ్ముతుంటే, నియంత్రించే అధికార వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. పనిచేయని బిటి విత్తనాలు రైతులకు అమ్మడం ఎంతవరకు సబబు.

బిటి ప్రత్తి విత్తనాల మీద ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారతదేశంలోని వివిధ వాతావరణాలు, క్షేత్ర పరిస్థితులలో వైవిధ్యం ఉన్నాయి కనుక ఒకే రకం విత్తనం పనిచేయదు. అందుకని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ పెట్టుబడి లేని పరిశోధన ఫలితాలు కంపెనీలకు ఉపయోగం, రైతులకు నష్టం కలిగిస్తున్నాయి.

ఇప్పుడు దాదాపు 180 బిటి హైబ్రిడ్లు చెలామణిలో ఉన్నాయి. 2002లో అనుమతులు ఇచ్చినప్పుడు, ఒకటే రకం మీద క్షేత్ర పరీక్షా ఫలితాలు, ఇప్పుడున్న అన్ని హైబ్రిడ్లకు వర్తింపచేయటం మన నియంత్రణ వ్యవస్థలో ఉన్న లోపం. ఇప్పుడు మార్కెట్లో అమ్మబడుతున్న విత్తనాలకు, దాదాపు 15 ఏళ్ళ క్రితం జరిపిన పరీక్షలకు సంబంధం ఉన్న దాఖలాలు లేవు. రుజువులు లేవు, డేటా లేదు. ఆయా హైబ్రిడ్ల అనుమతి కూడా పర్యావరణ మంత్రిత్వ శాఖ కాకుండా, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో ఒక చిన్న కమిటి నిర్ణయించటం గమనార్హం. ఈ కమిటి కూడా అనుమతులు ఇచ్చే ముందు, రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సరిఅయిన సమాచారం ఇవ్వడం లేదని, వారి పర్యవేక్షక రిపోర్టు ఉంటే బాగుంటుంది అని తీర్మానించారు కూడా. ఒకదానిమీద పరిశోధన చేసి, అవే ఫలితాలు మిగతావాటికి వర్తింపచేసి, వ్యాపారం చేసుకుని, లాభాలు గడిస్తున్న ‘జన్యు మార్పిడి’ విత్తన పరిశ్రమ రైతాంగానికి చేస్తున్న తీవ్ర నష్టం. మన ప్రభుత్వం పట్టించుకోకుండా అనుమతులు ఇవ్వడం శోచనీయం.

ఇంకా అనేక విషయాలు, ప్రజలకు తెలియనివి, శాస్త్రవేత్తలు పట్టించుకోనివి, అధికారులు నిర్లక్ష్యం చేసిన నిబంధనలు, నిజాలు అనేకం ఉన్నాయి. ఫలితంగా కంపెనీలకు లాభాలు, రైతులకు కష్టాలు, పర్యావరణానికి ‘జన్యు’ కాలుష్యం.

ఇంత గందరగోళ పరిస్థితిలో, ఒకే జన్యు మార్పిడి విత్తనానికి సంబంధించి ఇన్ని రకాల సమస్యలు ఉంటే, ఇటీవలి ఉత్తర్వులలో 50 రకాల జన్యుమార్పిడి పంటలపైన క్షేత్ర పరీక్షలు జరుపుకోవటానికి అనుమతులు ఇవ్వడం రైతాంగ వ్యతిరేక చర్యగానే భావించవచ్చు. జీవభద్రత ముఖ్యమని, మన దేశంలో ‘జన్యు’ కాలుష్యాన్ని ఆపే, నియంత్రించే పద్ధతులు, నిబంధనలు రూపొందించలేదు కనుక, క్షేత్ర పరీక్షల అనుమతులు ఇవ్వడం మంచిది కాదు అని ‘హరిత విప్లవాన్ని’ నెత్తికి ఎత్తుకున్న స్వామినాథన్‌ లాంటి వ్యక్తి అనేక సందర్భాలలో చెప్పారు. ఒక వ్యాజ్యం సందర్భంలో సుప్రీంకోర్టు స్వయంగా నియమించిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలతో కూడిన సాంకేతిక కమిటి కూడా, జన్యు మార్పిడి విత్తనాల క్షేత్ర పరీక్షల సమయం ‘జన్యు’ కాలుష్యం జరగవచ్చని, ఒకసారి మన జీవవైవిధ్యం కలుషితం అయితే అనర్థాలు జరగవచ్చని, ప్రకృతి సహజ విత్తనాలు కలుషితం అయితే తిరిగి ‘సహజ’ స్థితికి తీసుకువచ్చే పరిస్థితి ఉండదని తమ నివేదికలో చెప్పారు. అందుకని, జీవభద్రత ముఖ్యమని, రాబోయే తరాల ఆహారం కలుషితం కాకుండా కాపాడుకోవడానికి, ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగే వరకు, జన్యు మార్పిడి పంట పరీక్షలు ‘ల్యాబ్‌’ వరకే పరిమితం చేయాలని, క్షేత్ర పరీక్షలకు అనుమతులు ఇవ్వవద్దని నివేదిక ఇచ్చారు.

వ్యవసాయ రంగం సంబంధిత పార్లమెంటు స్థాయి సంఘం దేశమంతట పర్యటించి, నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతుల అభిప్రాయాలు సేకరించిన తరువాత జన్యు మార్పిడి పంటల క్షేత్ర పరీక్షల విషయంలో కేంద్రప్రభుత్వాన్ని తొందరపడవద్దని, దేశ ప్రయోజనాల దృష్ట్యా అనుమతులు ఇవ్వవద్దని తమ నివేదికలో కోరడం జరిగింది. ఇటీవల స్థాయి సంఘ నివేదికలలో పూర్తి ఏకాభిప్రాయంతో అన్ని పార్టీల ప్రతినిధులు ఒకే అభిప్రాయం చెప్పింది ఈ విషయంలోనే. ఈ కమిటి సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులతో వరుస సమావేశాల ద్వారా క్షేత్ర పరీక్షల గురించిన నియంత్రణ మరియు పర్యవేక్షణ నియమాలు, పద్ధతులు, బాధ్యతల మీద సమాచారం సేకరించారు. వారికి ఇచ్చిన సమాచారం మేరకు క్షేత్ర పరీక్షల మీద ఉండాల్సిన నిరంతర ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ బాధ్యత ఏ సంస్థ మీద ఉంటుందో కూడా స్పష్టత లేదు. తగు సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యం ప్రభుత్వం వద్ద లేదు. చేయాలనే సంకల్పం కూడా లేదు. ఉదాహరణకు, కాగితాలలో కొన్ని క్షేత్ర పరీక్షలు రైతుల పొలాల్లో కాకుండా కంపెనీకి సంబంధించిన పొలంలోనే చేయాలి. కానీ కంపెనీలు కౌలుకు తీసుకుని రైతు భూములలో పరీక్షలు చేస్తున్న వైనం బయటపడినప్పుడు, కంపెనీల మీద చర్య లేదు. అన్ని రకాలుగా విచారణ చేసిన ఈ పార్లమెంటరీ కమిటి చివరకు ఏకగ్రీవంగా జన్యు మార్పిడి పరీక్షలు నిలిపివేయమని సిఫారసు చేసింది. వీరప్ప మొయిలీ ఈ సిఫారసు పట్టించుకోకుండా జన్యు మార్పిడి పరీక్షలకు అనుమతి ఇవ్వడం పైన, ఈ కమిటి గత నెల ఇచ్చిన నివేదికలో తీవ్ర అభ్యంతరం, ఆక్షేపణ తెలిపింది.

జన్యు మార్పిడి పంటల పరీక్షాకాలంలో ‘జన్యు’ కాలుష్యం జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్ని తీసుకున్నా సమస్యలు వస్తున్న నిజం గుర్తించిన అనేక దేశాలు జన్యు పరీక్షలను ఆపుతున్నాయి. ఐరోపా సమాజ సభ్యదేశాలలో 1997లో అత్యధికంగా 264 పరీక్షలకు అనుమతులు ఇవ్వగా, 2012లో 51కి పడిపోయాయి. అమెరికాలో కూడా గోధుమల మీద జన్యుమార్పిడి పరీక్షలు 9 సంవత్సరాల క్రితం గోధుమలను దిగుమతి చేసుకునే దేశాల తిరస్కరణకు భయపడి అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. అయినా, అనూహ్యంగా గత సంవత్సరం ఓరెగాన్‌ రాష్ట్రంలో దీని ‘జన్యుమార్పిడి గోధుమ’ ఆనవాళ్ళు ఒక రైతు పొలంలో బయటపడింది. మాన్సాంటో కంపెనీ వద్ద తమ రక్షణ చర్యలను దాటి ఎలా కాలుష్యం చేసిందో సమాచారం లేదు. ఈ వార్త రాగానే, జపాన్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే గోధుమల మీద నిషేధం విధించింది. జన్యు మార్పిడి క్షేత్ర పరీక్షల వల్ల జన్యు కాలుష్యం అవుతుందని, జీవ రక్షణ చర్యలు ఎన్ని తీసుకున్నా, దీన్ని ఆపగలిగే వ్యవస్థ లేదని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. మరి, మన దేశంలో ఏ రక్షణ లేని, పర్యవేక్షణ లేని, నియంత్రణ లేని, అవగాహన లేని పరిస్థితులలో జన్యు మార్పిడి పరీక్షలను అనుమతించడం ఆత్మహత్యా సదృశ్యమే.

జన్యు మార్పిడి పంట చుట్టూ కొంత భాగం బఫర్‌ పంట వేయడం వల్ల జన్యుకాలుష్యం అరికట్టే అవకాశం లేదని రుజువు అయ్యింది. ఎవ్వరూ రాకుండా పరీక్షలు చేసే పొలం చుట్టూ దడి కట్టితే సరిపోతుందని స్త్రజూజ్పుు ఇటీవలి ఉత్తర్వులలో పేర్కొనడం వారి సాంకేతిక నైపుణ్యాన్ని, మనదేశ జీవవరణం పట్ల అశ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇచ్చిన అనుమతులు మన ముఖ్య ఆహార పంటలకు సంబంధించినవి : వరి, మొక్కజొన్న, గోధుమలు. ప్రత్తి మీద ఇంకా పరిశోధనలు జరపటానికి కూడా అనుమతులు ఇచ్చారు. బియ్యం ఎగుమతుల మీద ఆ పరీక్షల ప్రభావం వల్ల, మన ఆర్థిక స్వావలంబన మీద దాడిగా కూడా చూడవచ్చు. ఇప్పటికే మనం వ్యవసాయ ఎగుమతి నుంచి దిగుమతుల దేశంగా పయనిస్తున్నాం. మన దేశంలోనే పండే పప్పులను ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం జన్యుమార్పిడి పరీక్షల వల్ల మన ఆహార భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అవసరం లేని, అక్కరకురాని, ఉపయోగపడని జన్యు మార్పిడి పంటలను చిట్టచివరి అంకంలో అనుమతించడం ద్వారా ఏఆజు ప్రభుత్వం ఇంకొక స్కామ్‌కు తెర లేపింది. అనుమతులు ఇచ్చిన క్రమం, పద్ధతి శాస్త్రీయంగా కాకుండా, వ్యాపార లబ్ది కొరకు, ఎన్నికలలో నిధుల సేకరణకు, వచ్చే ప్రభుత్వం మెడకు ఒక గుదిబండను తగిలించే కుట్రగా భావించవచ్చు. సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యం, పరిశోధనశాలలు ఉన్న ధనిక దేశాలనే భయపెడుతున్న జన్యు మార్పిడి క్షేత్ర పరీక్షలు, అవేవి లేని భారతదేశంలో, ఇష్టానుసారంగా పార్లమెంటుకు తెలియకుండా చేయడం వెనుక లాభాపేక్ష స్పష్టంగా కనపడుతుంది.

బిటి వంకాయ వద్దని దేశవ్యాప్తంగా పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్వహించిన సంప్రదింపుల సమావేశాలలో పాల్గొన్న ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు, ఇంకా ఇతర వర్గాలు ముక్తకంఠంతో చెప్పిన దరిమిలా, అప్పటి మంత్రి వీటిమీద మారటోరియం విధించిన సంగతి మనకు తెలిసిందే.

స్వతంత్ర శాస్త్రవేత్తలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు మరియు అనేకులు జన్యు మార్పిడి పంటలు అవసరం లేదని అనేకసార్లు చెప్పినా, కేవలం కొంతమంది అధికారులు, అతికొద్దిమంది రాజకీయ నాయకులు లాభాపేక్షతో, బహుళజాతి కంపెనీ వ్యాపార ప్రయోజనాల కొరకు, మనదేశ నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, మన వ్యవసాయాన్ని, రైతుల భవిష్యత్తును పణంగా పెడుతూ, దేశ జీవావరణం నాశనానికి ఒడిగడుతున్నారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో