వృద్ధాశ్రమము – రుక్మిణీ గోపాల

ాంతమ్మకు ఎనభై ఏళ్లు నిండాయి. వృద్ధాప్యంలోకి ప్రవేశించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆమె విధవరాలు. పదేళ్లపై నుంచి వైధవ్యాన్ని అనుభవించింది. ఎవరో ఎవరినో అడిగారట, ‘భార్యలకంటె భర్తలే ముందు చనిపోతున్నారు, కారణం ఏమిటని?’ అని భర్త కంటె భార్య తక్కువ వయసునులో ఉంటుంది, అందుచేత’ అని సమాధానం ఇచ్చారుట. ఈ సమాధానం సరియైనదా, కాదా అని చర్చించటం అనవసరం. ఈ తరంలో భార్యాభర్తల మధ్య వయసు తేడా చాలా తక్కువగా ఉంటోంది. కాని ఆ తరంలో చాలా వ్యత్యాస ముండేది. శాంతమ్మ ఆ తరం మనిషి.

శాంతమ్మకు ఒక్కడే కొడుకు. ఇద్దరాడ పిల్లలున్నారు, పెళ్లిళ్లు అయి వాళ్ల కాపరాలు వాళ్లు చేసుకుంటున్నారు. సాంప్రదాయ ప్రకారం భర్త పోయినప్పటినుంచి శాంతమ్మ కొడుకు దగ్గరే ఉంటోంది. కొడుకు, రామచంద్రానికి ఇద్దరు పిల్లలు, ఒక ఆడ, ఒక మగ. ఈ కాలాన్ని అనుసరించి అంతటితో అతడు సంతానానికి స్వస్తి చెప్పాడు. భార్యా, ఇద్దరు పిల్లలు, చీకూ చింతాలేని సంసారం. శాంతమ్మ వచ్చిన తరువాత ఆ కుటుంబంలో కొద్ది మార్పు వచ్చింది. వృద్ధులు, పసిపిల్లలు లేక చిన్నపిల్లలు ఉన్న కుటుంబంలో స్వేచ్ఛ కొంత కొరవడుతుంది. ఈ స్వేచ్ఛలేమిని పిల్లల విషయంలో సంతోషంగా ఇష్టపడి అమలు జరుపుకుంటారు. కాని పెద్దల విషయం వచ్చేసరికి తప్పదు కదా భగవంతుడా’ అన్నట్లు విసుగు, చిరాకులతో బరువును మోస్తున్నట్లు భరిస్తారు.

ఎనభై ఏళ్లు నిండినా శాంతమ్మకింకా కొద్దిగా జవసత్వాలు ఉన్నాయి. పూర్వకాలపు మనిషి అవటంవల్ల ఆమె అనారోగ్యాలపుట్ట కాదు. ఈ రోజుల్లో ఇంచుమించు ప్రతివారికి సర్వసాధారణమైన రక్తపోటు, చక్కెర వ్యాధి, ఇలాంటివి ఆమెకు లేవు. ఇతరుల సహాయం అక్కరలేకుండా ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. పాలు కాచుకుని తన కాఫీ తాను కలుపుకుని తాగుతుంది. అంతేకాదు, చిన్నచిన్న పనులు, కూరలు తరగటం, ఆకు కూరల్ని బాగుచేసి పెట్టటం, ఏవైనా సవరించటం, ఇలాంటి పనులు చేసే ఓపిక కూడా ఆమెకుంది.

మనిషి రెండు భాగాలుగా ఉంటాడు. ఆ రెండు భాగాలు, ఒకటి శరీరము, రెండవది మనసు. శరీరమెంత బలమైనదో మనసు కూడా అంత బలమైనదే, ఇంకా ఎక్కువ బలమైనదేమో కూడాను. శరీరానికి అవసరాలు ఎలా ఉంటాయో మనసుకు అలాగే అవసరా లుంటాయి. శరీరావసరాలు తీరకపోతే ఎలా బాధ కలుగు తుందో అలాగే మానసికావసరాలు తీరకపోయినా బాధ కలుగుతుంది.

శాంతమ్మ సమస్య ఏవిటంటే కాలాన్ని గడపటం. పొద్దుట లేచి కాఫీ తాగి, స్నానం చేసి కోడలు చేసిన టిఫిన్‌ ఏదో తినటంలో ఆమె పొద్దుటి కార్యక్రమం పూర్తిఅయిపోతుంది. దేవుడి దగ్గర దీపం వెలిగించి ఏ పండో నైవేద్యం పెట్టటం కూడా టిఫిను ముందే అయి పోతుంది. టిఫిను ముందో, వెనకో దేవునికి సంబంధించిన అష్టోత్తరాలు, శ్లోకాలు లాంటివి చదువుతూ కొంతకాలం గడుపుతుంది. అయినా మధ్యాహ్నం భోజనాలవేళదాకా చాలా సమయముంటుంది. శాంతమ్మను ఒకరకంగా ‘సంఘజీవి’ అని చెప్పాలి. మాటామంతీ లేకుండా ఒంటరిగా గడపటం ఆమెకు కొంచం బాధాకరంగా ఉంటుంది. కోడలు మాధవి వంటచేస్తుంటే వంటింట్లో ఏవో చిన్న చిన్న సాయాలు చేస్తూ, మాట్లాడుతూ కాలం గడపాలని ఆమె కోరిక. కాని కోడలు ఈ కాలపు మనిషి. పూర్వపు రోజుల్లో అయితే అత్తగారు కోడళ్లు కలిసి లేదా తోటికోడళ్లు కలిసి వంట మొదలగు పనులు చేసుకునేవారు. ఇప్పుడు వంట ఇంట్లో అధునాతనమైన అనేక సాధనాలు వచ్చాయి. గ్యాస్‌స్టవ్‌, మిక్సీ మొదలగు వాటితో ఇంకొకరి సహాయం లేకుండానే ఒక్కరే వంట మొదలగు పనులు చేసుకోగలుగుతున్నారు. అంతేకాదు ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ విలువ నిస్తున్నారు. పనీ అవొచ్చు, ఇంకేవైనా కావచ్చు, తమది అనుకున్న దానిలో ఇంకొకరి ప్రమేయాన్ని చాలామంది ఇష్టపడటం లేదు. సమిష్టి భావం చాలా తగ్గిపోయింది. తొందరగా వంట ముగించేసుకుని వచ్చి టి.వి. కార్యక్రమాలు చూడటమో, ఇరుగుపొరుగు వారితో కబుర్లు చెప్పుకోటమో, ఇలాంటి వాటికి ఇష్టపడుతున్నారు కాని ముసలివాళ్ల చాదస్తపు మాటలను వినేందుకు ఎవరు ఇష్టపడటం లేదు. శాంతమ్మకు కొంచం పరిశుభ్రత ఎక్కువ. ప్రతిపనిలోను పరిశుభ్రతను పాటించాలి గాని ఏదో అయిపోతే చాలన్నట్లు చేస్తే ఆమెకు నచ్చదు. ‘అలా చేస్తే కుటుంబంలో వాళ్ల ఆరోగ్యం పాడయిపోదు!’ ఈ విషయంలో శాంతమ్మకున్నంత చాదస్తం మాధవికి లేదు. ఏదో పని అయిపోయి అవతల పడితే చాలు అన్నట్లు చేస్తుంది.

ఇంట్లో పరిశుభ్రమైన నీటికోసం ‘ఎక్వాగార్డ్‌’ ఉంది. తాగేందుకు, వంటకు ఆ నీటినే ఉపయోగిస్తారు. ఓ పెద్ద పాత్రలోకి ఆ నీటిని పట్టుకుని ఈ రెండు పనులకు ఉపయోగిస్తారు. శాంతమ్మకు ఇది నచ్చలేదు. తాగేందుకుపయోగించే నీటిని మరొక పాత్రలో పట్టుకుని వేరుగా ఉంచుకోవాలని ఆమె అభిప్రాయం. ‘వంట చేసేటప్పుడు నీటిని తీసుకునే చెంబును అనేక రకాల చేతులతో ముట్టుకుంటాము, అంటే వంట చేసేటప్పుడు మన చేతులకు ఏదైనా అంటుకుని ఉండవచ్చు, చెంబును గట్టుమీద కింద పెడతాము, ఇంకా ఆ చెంబుకు ఏమైనా అంటుకుని ఉండొచ్చు ఆ చెంబును మళ్లీ నీళ్లలో ముంచినప్పుడు ఆ పదార్ధాలు నీళ్లలో ప్రవేశిస్తాయి. ఆ నీళ్లలో అలాంటి ‘నలకలను’ తాగేందుకు నీళ్లు తీసుకునేటప్పుడు ఆమె ఎన్నోసార్లు చూసింది. ఆ విషయం కోడలికి చెప్పి తాగే నీళ్లను వేరుగా పెట్టమంది. కోడలు ఏమీ మాట్లాడలేదు కాని ఆ పనిమాత్రం చెయ్యలేదు. ఏం చెయ్యలేక శాంతమ్మ మాట్లాడక ఊరుకుంది. ఆ నలకలు కనపడ్డప్పుడల్లా ఆమె మనసు బాధపడుతూనే ఉంది. ‘అలా కలుషితమైన నీటిని తాగితే ఆరోగ్యాలు పాడవవూ!’ కొద్ది రోజులైన తర్వాత ఇంక ఊరుకోలేక కొడుకుతో చెప్పింది, ప్రయోజనమేమైనా ఉంటుందేమోనని. రామచంద్రానికి భార్య అంటే అభిమానమెక్కువ. ఏ విషయంలోను ఆమె మనసును నొప్పించటం అతనికిష్టముండదు. ”దానిష్టమొచ్చినట్టు చేసుకోనియ్యి. నీకింకా ఎందుకే ఈ తాపత్రయం? ఎనభై ఏళ్లు నిండాయి, హాయిగా కృష్ణా, రామా అంటూ కూచోక.” అన్నాడు కొడుకు. ‘ఎంత వయసు వచ్చినా ఇంట్లో అనారోగ్యకరమైన పనులు జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలదు? ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని గురించే కదా తన తాపత్రయం!’ ఏం చెయ్యలేక ఊరుకున్నా ఈ విషయాన్ని గురించి శాంతమ్మ మనసు బాధపడుతూనే ఉంది. కొంతమందికి కొన్ని విషయాలు స్వంతంగా తోచకపోయినా ఇతరులు చెబితే గ్రహిస్తారు, దానిలో ఉన్న మంచిని తెలుసుకుంటారు. కాని మాధవి దగ్గర అలాంటి మంచిగుణం లేదు. ‘ఒకరు చెబితే మనం వినటం ఏవిటి? ఆ మాత్రం నాకు తెలియదా?’ అన్న అహంకారం ఉన్న మనిషి ఆమె. తన సులువు చూసుకుంటుంది గాని ‘అత్తగారు వయసుతో వచ్చిన అనుభవంతో చెపుతున్నారు. అలాగే చేద్దాం’ అన్న భావం ఆమెకు లేదు. ఇది లేకపోయినా అత్తగారు చెప్పిన దానిలోని మంచి చెడులను వివక్షించి తెలుసుకునే పరిజ్ఞానం కూడా ఆమెకు లేదు. దీనికి శాంతమ్మ చాలా బాధపడేది. ‘తాను మంచి చెప్తోందో, చెడు చెప్తోందో ఇది తెలుసుకునే జ్ఞానం కోడలికి లేదా?’ అనుకునేది.

ఇంట్లో బట్టలుతుక్కుందుకు ‘వాషింగ్‌ మిషన్‌’ ఉంది. మాధవికి ఓ చెడు అలవాటు ఉంది. ఎప్పుడు పొద్దుటిపూట మిషన్‌ వెయ్యదు. మధ్యాహ్నమో, సాయంత్రమో, లేక రాత్రో వేస్తుంది. శాంతమ్మకు ఇది నచ్చటం లేదు. బట్టలు ఎండలో, లేదా ఎండ వేడిమి ఉండగా ఆరాలని ఆమె అభిప్రాయం. అప్పుడే బట్టలు పరిశుభ్రంగా ఉంటాయని, క్రిములుంటే నశించిపోతాయని ఆమె నమ్మకం. పొద్దుట ఎనిమిది గంటలలోపే అందరి స్నానాలు అయిపోతాయి. వెంటనే, చెయ్యి ఖాళీ కాగానే మిషను వెయ్యవచ్చు కదా! కోడలు అలా ఎందుకు చెయ్యదో ఆమెకు అర్థం కాదు. ‘బట్టల్ని చేత్తో ఉతుక్కోవాలంటే బద్ధకం అనుకోవచ్చు. కాని కాస్త సబ్బుపొడి వేసి మిషను ఆన్‌ చెయ్యటంలో కష్టమేముంది?’ ఈ విషయాన్ని రెండు, మూడు సార్లు కోడలికి చెప్పి చూసింది. కాని ఫలితం లేకపోయింది. ఊరుకోలేక కొడుకుతో చెప్పింది. ”నీకెందుకే, ఇంకా ఈ పెత్తనం చెయ్యాలన్న కోరిక? దానికి వీలైనప్పుడు వేసుకుంటుంది. ఇంత వయసు వచ్చింది, ఇలాంటి విషయాలలో ఎందుకు కలగజేసుకుంటావు?” అన్నాడు కొడుకు. ‘వాషింగ్‌ మిషన్‌ను పొద్దుటపూట వేసి బట్టలు ఎండలో ఆరేసుకుంటే మంచిది’ అని చెప్పటం పెత్తనం కిందకు వస్తుందా? కారణం తాను వివరించినా వాడి బుర్రకెక్కలేదా?’ ఇంక మళ్లీ ఆ విషయం ఎత్తకుండా నోరుమూసుక్కూర్చుంది శాంతమ్మ. మంచినీళ్ళు, వాషింగ్‌ మిషను, అవే ఏవిటి, ఇంకా అనేక విషయాలు, ఆమె ‘మంచివి కావు’ అనుకున్నవి జరుగుతున్నాయి. ఆమె నిస్సహాయంగా చూస్తూ ఊరుకోటం మినహాయించి ఇంకేమీ చెయ్యలేకపోయింది.

శాంతమ్మ మనవలలో మనవరాలు, రజని పెద్దది. మనవడు, రఘు చిన్నవాడు. ఇద్దరికీ మధ్య ఐదేళ్ల తేడా ఉంది. మనవరాలితో ఏదో మాట్లాడాలని, ఆ పిల్లతో ఎక్కువ సమయం గడపాలని శాంతమ్మ కోరిక. అందులో కోడలితో మాట్లాడుతూ కూర్చునే అవకాశం లేనందువల్ల ఆ కోరిక ఆమెలో ఇంకా ఎక్కువయింది. ఇంట్లో ఇంకెవరితో మాట్లాడుతుంది? కొడుకు పొద్దుట వెడితే సాయంత్రం ఆలస్యంగా కాని ఇంటికి రాడు. పొద్దుటిపూట హడావిడి, తొందరగా తెమిలి ఆఫీసుకు వెళ్లిపోవాలి. ఆ టైములో అతనితో ఏంమాట్లాడుతుంది? ‘వాడికి ఇబ్బంది కదా!’ సాయంత్రం కొడుకు రాకకోసం ఆశగా ఎదురు చూస్తుంది, అప్పుడైనా కాసేపు మాట్లాడొచ్చని కొడుకు రాగానే జోళ్లు విడిచి బట్టలు మార్చుకుందుకు మేడమీదకు వెడతాడు. ఆ వెంటనే కోడలు ఏదైనా టిఫిన్‌ చేస్తే అది, లేదా ఏ బిస్కట్లలాంటివో తీసుకుని కాఫీతోపాటు పైకి వెడుతుంది. ఇంక భోజనం టైము దాకా ఇద్దరు కిందకు రారు. ఈ లోపుగా శాంతమ్మ తన భోజనం ముగించుకుంటుంది. ఆలస్యంగా తింటే అరగదని ఆమె భయం. కొడుకు కిందకు రాగానే టి.వి. పెట్టుకుని దానికెదురుగా కూర్చుంటాడు. భోజనం కూడా కంచం చేతితో పట్టుకుని అక్కడే తింటాడు. రాత్రి పడుకోటానికి వెళ్లేదాకా ఆ టి.వి. అలా నడుస్తూనే ఉంటుంది. శాంతమ్మ ఊరుకోలేక ఎప్పుడైనా ఏదైనా మాట్లాడదామని ప్రయత్నిస్తే ”టి.వి. చూస్తున్నాను కదమ్మా, ఇప్పుడే మాట్లాడాలా? తరవాత చెప్పొచ్చులే” అంటాడు. ‘ఇంకెప్పుడు మాట్లాడాలి’ అనుకుంటుంది మనసులో. పోనీ ఆ టి.వి. కార్యక్రమాలే చూసి కాలక్షేపం చేద్దామంటే వాళ్లెప్పుడు ఇంగ్లీషువో, హిందీవో పెట్టుకుంటారు. అవి ఆమెకు అర్థం కావు. అప్పుడప్పుడు ఆమెకు ‘వీళ్లకు తల్లి లేక అత్తగారు అన్న ఒక మనిషి ఇంట్లో ఉందన్న విషయం గుర్తుందా?’ అనిపిస్తుంది. ‘అన్నిటిలోకాకపోయినా, కొన్నిటిలోనైనా ఆమెను మనతో కలుపుకోవాలన్న ఊహ వీళ్లకు రాదా?’ అనిపించేది. ‘సాయంత్రం కాఫీ మేడమీద కాకుండా కిందే తాగితే తనకు వాళ్లతోపాటు కొంత కాలక్షేపం అవుతుంది గదా!’

మనవరాలు కాస్త ఎదిగింది. ఆ పిల్లతో కొంత కాలక్షేపం చేద్దామంటే రజనికి బామ్మ మాటంటేనే చిరాకు. ఏదైనా అడిగితే విసుగుగా, చిరాకుగా జవాబు చెప్పుతుంది, కాని అభిమానంగా మాట్లాడదు. అలాంటి పిల్లతో ఏంమాట్లాడుతుంది? శాంతమ్మకు మనవలంటే చాలా ముద్దు. వాళ్లను ఎప్పుడూ, ఏమీ అనదు. మరి రజనికి తనమీద ఈ చిరాకు ఎందుకో అర్థం కాదు. శాంతమ్మ అభిమానమంతురాలు. మనవరాలు ప్రదర్శించే చిరాకుకు ఆమె మనసు బాధపడి ఆ పిల్లకు కొంచం దూరంగా ఉండటమే మంచిదని నిశ్చయించుకుంది. మనవడు, రఘుకు బామ్మంటే చాలా ఇష్టం. అందుకే ఆమె మురిసిపోయేది. బాగా చిన్నవాడు అవటంవల్ల వాడికి బామ్మ చెప్పే రామాయణం, భారత, భాగవతాలలోని చిన్న చిన్న కథలు ఎంతో ఇష్టం. వాడికి బాగా ఇష్టమైన కథలను చెప్పిన వాటినే మళ్లీ మళ్లీ చెప్పించుకుని వింటాడు. అలా వాడితో సమయం గడపటం శాంతమ్మకు చాలా ఇష్టం. కాని మాధవి వాడిని ఆమె దగ్గర ఎక్కువసేపు ఉండనివ్వదు. ”సాయంత్రం పూట బైటకు పోయి ఆడుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది” అంటూ బైటకు పంపించేస్తుంది. ఆటల నుంచి రాగానే వాడు మళ్లీ బామ్మ దగ్గర చేరేవాడు. ఆటలకు వెళ్లే ముందు అసంపూర్ణంగా వదిలేసిన కథను పూర్తిగా వినాలని. ”ఇలా అస్తమానూ కథలు వింటూ కూర్చుంటే హోమ్‌ వర్క్‌ ఎప్పుడు చేస్తావు? అది తొందరగా పూర్తిచేసి అన్నం తిని తొందరగా పడుకోకపోతే పొద్దుట పెందలాడే లేవలేవు” అంటూ వాడిని అక్కడినుంచి తీసుకుపోయే ప్రయత్నం చేసేది మాధవి. వాడు తల్లిని బతిమాలి సగం విన్న ఆ కథను పూర్తిగా విని వెళ్లిపోయేవాడు. ‘అవును, కుర్రకుంక పెందరాళే పడుకోకపోతే పొద్దుట లేవలేడు. హోమ్‌ వర్క్‌ చెయ్యకపోతే బళ్లో మేష్టారు ఊరుకుంటారా?’ అని సరిపుచ్చుకునేది శాంతమ్మ. మనవడికి నీళ్లు పొయ్యాలని, తన చేతులతో అన్నం తినిపించాలని, పక్కలో పడుకోబెట్టుకోవాలని శాంతమ్మ కోరికలు. కాని మాధవికి ఇలాంటివి నచ్చవు. అందుచేత ఆమె కోరికలు ఎప్పుడు తీరలేదు. మరొకరితో కబుర్లు చెపుతూ, ఇంట్లోను, బయట కూడా గడపాలని శాంతమ్మ కోరిక ఎప్పుడూ తీరేది కాదు. సెలవు రోజు వస్తే ఆరోజన్నా కొడుకుతో కాసేపు మాట్లాడొచ్చు అనుకునేది. కాని ఆ రోజు అందరూ ఆలస్యంగా లేచేవారు. ”పిల్లలు బైట తినాలంటున్నారు” అంటూ ఏ హోటలుకో వెళ్లిపోయేవారు, లేదా స్నేహితులిళ్లకు వెళ్లిపోయేవారు. శాంతమ్మకు ఒంటరితనమే మిగిలేది. ‘ఆ స్నేహితులిళ్లకు తనను కూడా తీసుకువెళ్లవచ్చుగదా! వాళ్ల ఇళ్లలోనూ అత్తగారో, తల్లో, ఎవరో ఒకరు ఉంటారు గదా! వాళ్లతో తను కాసేపు కబుర్లు చెప్పుకునేది’ అనుకునేది.

పక్కింటివారి అమ్మాయి పెళ్లి అయింది. వాళ్లు శుభలేఖ ఇచ్చి పిలవటానికి వచ్చినప్పుడు శాంతమ్మతో మీరు కూడా తప్పకుండా రావాలి. పెద్దవారు, వచ్చి వధూవరులనాశీర్వదించాలి” అని ఆమెను కూడా పిలిచారు. పక్కింటి వాళ్లే కనక శాంతమ్మకు ఆ ఇంటి వారందరితో పరిచయముంది. అంతేకాదు, అప్పుడప్పుడు వారింటికి వచ్చిపోయే చుట్టాలతో కూడా పరిచయమయింది. పెళ్లికి వెళ్లి కాసేపు అందరితో సరదాగా గడపొచ్చు. పొద్దుట ముహూర్తం కనక పెళ్లి భోజనం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. పెళ్లి హాలు కూడా ఎక్కువ దూరం లేదుట. వాళ్లు ప్రత్యేకంగా నన్ను కూడా పిలిచారు కనక కొడుకు తనను తప్పకుండా పెళ్లికి తీసుకువెడతాడు’ అనుకుంది శాంతమ్మ.

పెళ్లి రోజు వచ్చింది. అందరూ పెందరాళే లేచి ముస్తాబవు తున్నారు. శాంతమ్మ ‘తను కూడా ఓ మంచి చీర కట్టుకుని తయారవుదామా’ అనుకుంది. ‘కాని వాళ్లేమీ చెప్పనిదే తనెలా తయారవుతుంది’ అందరు కలిసి బైటకు వెళ్లేటప్పుడు ”అమ్మా తలుపు జాగ్రత్తగా వేసుకో” అని చెప్పేసి వెళ్లిపోయారు. ఆమె మనసు చాలా బాధపడింది. ఎన్నాళ్లనుంచో ఈ పెళ్లికి వెళ్లాలని ఉబలాటపడింది. ఆ ఉబలాటం చచ్చిపోయి ఆ స్థానాన్ని ఉక్రోషం ఆవరించింది. ఆమె అభిమానవంతురాలు కనక పెళ్లికి నేను కూడా వస్తాను’ అని తనంతట తాను అనలేకపోయింది. మనసులో ఏడ్చుకుంటూ కోడలు చేసిపెట్టిన చారునీళ్లు పోసుకుని భోజనం చేసింది.

ఒకసారి ఉండబట్టలేక కొడుకును అడిగింది, ”ఏరా ఏది చెప్పబోయినా నీకెందుకీ తాపత్రయం అంటావు. ఈ ఇంటి విషయాలలో నేనెందులోను కలగజేసుకోకూడదా?” అంది కొంచం ఆవేశంగా”. అమ్మా నీ వయసెంత? ఎనభై దాటాయి. నీకెందుకింకా ఈ సంసార తాపత్రయం? వేదాంత గ్రంథాలు చదువుతావు. అందులో ఏం చెబుతున్నారు? సంసారంలో తామరాకు మీది నీటి బిందువులా ఉండాలనే కదా? ఆచరించనప్పుడు చదివి ఏం లాభం? పూర్వం కొంత వయసు వచ్చి బాధ్యతలు తీరిన తరువాత వాన ప్రస్థానానికి వెళ్లిపోయేవారని నీకు తెలుసు కదా? ఇప్పుడలా అడవుల్లోకి వెళ్లే అవకాశం లేదు గనక ఇళ్లల్లో ఉంటున్నారు. అసలు అందుకే ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు వచ్చాయేమో! నీకు వేళకు తిండి దొరుకుతోంది. ఈ వయసులో ఇంతకన్న ఇంకేమి కావాలి? అన్నింటిలో కలగజేసుకుని ఇంట్లో ఇంకా పెత్తనం చలాయించాలనుకుంటున్నావా?” అని అడిగాడు కొడుకు. ఈ మాటలకు శాంతమ్మ ఆశ్చర్యపోయింది. ‘ఏదైనా ఈ పని మంచిది కాదమ్మా అని చెబితే అది పెత్తనం చలాయించటమా? తానూ ఈ కుటుంబంలో ఓ సభ్యురాలేగా? పరాయిది కాదు కదా? కుటుంబ బాగోగులు కోరి ఏదైనా చెప్తే దానిని పెత్తనమంటారా?’ కొడుకు మెత్తని చెప్పుతో కొట్టినట్లు అన్నమాటలు ఆమె మనసుకు శూలాలులా తాకాయి.

ఏదైనా చెప్పటం సులభం, ఆచరించటం చాలా కష్టం. నిజమే, వేదాంతరీత్యా రాగద్వేషాలు ఉండకూడదు. మనవాళ్లను ‘మనవాళ్లు’ అని అనుకోకూడదు. ఇప్పుడు ఎవరి వ్యక్తిత్వం వారికి ముఖ్యం. కాని మరొకరితో సంబంధం ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అందుకే ఇన్ని వృద్ధాశ్రమాలు వెలిశాయేమో! ఇంట్లో ఉండి చూస్తూ, వింటూ ఏది జరిగినా కలగజేసుకోకుండా ఉండటం అసాధ్యమేమో! నడక వచ్చీరాని చిన్నపిల్లాడు మేడ మెట్లెక్కటానికి ప్రయత్నిస్తుంటే వాడిని వారించకుండా, వాడిని ఆ ప్రయత్నంనుంచి విరమింపజేసి ఇవతలకు తీసుకురాకుండా చూస్తూ ఉండగలమా? వేదాంత గ్రంథాలను గుర్తు తెచ్చుకుని ‘వాడు నా మనవడే అయినా వాడికి నాకు సంబంధం లేదు, వాడికి పడేయోగముంటే పడతాడు’ అని ఊరుకోగలమా? ఈ మనస్తత్వం అన్నిచోట్ల వర్తిస్తుంది కదా! దీనిని అర్థం చేసుకోక ‘పెత్తనం చలాయించటం’ కింద లెక్కకడితే ఎలా? ఆ పరిస్థితిలో ఉన్నవారికిగాని ఇది అర్థం కాదు. ఒకచోట ఉంటూ కుటుంబంలో ఏది జరిగినా పట్టించుకోకుండా ఉండటం మహాత్ములకుగాని, సామాన్యులకు సాధ్యం కాదేమో! ఈ లోకంలో సామాన్యులే ఎక్కువ. శాంతమ్మ అలాంటి సామాన్యురాలు.

శరీరాన్ని సంతృప్తి పరచేందుకు ఆహారాన్ని ఇస్తున్నారు. మరి, మనలో రెండవ భాగమైన మనసుకు తిండి ఏది? అది ఆకలికి ఆక్రోశిస్తోందే! ‘మనసును పట్టించుకోకూడదు’ అనుకుంటే ‘సైకాలజీ’ (మానసిక శాస్త్రము) ఉద్భవించకపోనేమో! ఒకచోట ఉంటూ ఏది పట్టించుకోకుండా ఉండగలగటం చాలా కష్టం కనుక పెద్దవాళ్లు వృద్ధాశ్రమాలకు వెళ్లటమే మంచిది. అయినా కుటుంబంలో ఉండి కూడా ఒంటరితనాన్నే అనుభవిస్తున్నప్పుడు ఈ ఇంటికి వృద్ధాశ్రమానికి ఎక్కువ తేడా లేదు. అది వృద్ధాశ్రమమైతే ఇది వృద్ధాశ్రయము అంతే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.