జయహో ‘పల్లె వెలుగు’ – రమాసుందరి బత్తుల

ఈ బస్సులతో నాకు ఎంత కాలం సాంగత్యం? పదహారేళ్ళ పైగా అవలా? ఇంట్లో వండిన ఘుమఘుమలను టిఫిన్‌ బాక్స్‌లో కుక్కుకొని, పది గంటల బస్సు పట్టుకొని… కిటికీ వార సీటు ఎక్కడ దొరికితే అక్కడికి శరీరాన్ని చేర్చి …. బిగుసుకొని పోయిన అద్దాల్నీ బలం కొద్దీ వెనక్కులాగి …. మురికి చువ్వలపై చేతులు మొదట సంశయంగా పెట్టి, తరవాత అలవాటు చేసేసి.. మొహం బయటకు పెట్టి గాలి ఒక్కసారి పీల్చితే.. ఆహా! ఏసి వొల్వో బస్సులు, లగ్జరీ కార్లు బలాదూర్‌.

పొద్దుటి నుండి బొంగరంలా తిరిగిన కాళ్ళకు విశ్రాంతి ఇచ్చేసి… ఆలోచనలకు కళ్ళాలు వదిలేసి కళ్ళు మూసుకొని ఉండగానే కండక్టర్‌ టిక్కు టిక్కు చప్పుళ్ళతోనూ, చిల్లర గలగలల తోనూ వస్తాడు. ముఖం కండలు ముడతలు గా మారి.. జారి… చాలా కాలం అయినా ఊరంతా తిరిగి ఎండు చేపలు అమ్ముకొనే ఎనభై ఏళ్ళ అవ్వను ”ఈ వొయిసులో నీకియ్యేమి బాధలు! మా ఇంటికి రా! ఓ ముద్ద ఏస్తా!” అంటూ డ్రైవర్‌ పిలుపుల్లో మానవత్వ గుభాళింపులు ఒకవైపు నుండి మనసు పుటాలకు తగులుతాయి. ”జరగండెహే అసంట! నేను ఒట్టి మనిషి నేనే!” (ఆమె తట్ట ఒట్టిదని అర్ధం) ”ఏడుందే ఈడ జాగా?” అంటూ మొదట్లో కొట్లాడుకొని … తరువాత ఒకరి భుజంపై ఒకరు పడుకొని సొంగలు కారేలా నోళ్ళు తెరుచుకొని నిద్రపోయే పూలమ్మల శ్రమ జీవన సౌందర్యాలు. ”పొద్దుటి బస్సు అందలేదు. ఆలస్యంగా వెళ్ళి ఈ రోజు మాటపడాలి. వెధవ ఇంటి పని. ఎంతకీ తెమలదు.”… పక్క సీటు టీచరు గారి అలవాటుగా బయటకు వినబడే స్వగతం. ”నిన్నియ్యలా, మొన్నియ్యలా. డబ్బులు కట్టకుండా ఒంగోల్లో పూలు ఎట్టా అమ్ముతావో చూస్తా.” అంటూ మునిసిపాలిటీ పన్నులు వసూలు చేసే సూపర్‌ వైజర్‌ పూలమ్మల మీద పెడుతున్న చేదు అరుపులు. రోజూ రెండు వందల మంది దాకా మహిళలు పూలు, ఆకు కూరలు ఎండు చేపలు మడనూరు ఈత ముక్కల నుండి తెచ్చుకొని ఒంగోల్లో అమ్ముకొంటారు. ఒంగోలు వీధుల్లో పది గంటల దాకా ఈ స్త్రీలే ఈగల్లాగా తిరుగుతూ కనబడతారు. పొద్దున నాలుగు గంటలకు మొదలయ్యే వారి బ్రతుకు పోరాటం ఈ పది గంటల బస్సులో విరామం పొంది మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని పూలు కట్టుకోవడంతో కొనసాగుతుంది.

అరుపుల్ని, కేకల్ని, రాజకీయాలని, భవిష్యత్తు మీద బెంగల్ని, ఖాళీ అయిన పూల తట్టల్ని, ఆ ఖాళీలను పూరిస్తూ వచ్చిన డబ్బుల్ని, చేతిలో పడ్డ డబ్బులతో ఏమేమి చేయాలో ప్రణాళికలు వేస్తున్న ఆలోచనలను మోసుకొంటూ… డ్రైవర్‌ చిద్విలాసాల మధ్య, కండక్టర్‌ చెణుకుల మధ్య బస్సు భారంగా, బద్దకంగా కదిలి ఒంగోలు దాటే వరకు ఎత్తిన ప్రతి చెయ్యికి మర్యాదనిస్తూ… ఆగుతూ పూల తోటల మడనూరు వైపు సాగేది.

అప్పుడా మధ్య ఆర్టిసీ ప్రవేటీకర ణను అడ్డుకొంటూ సమ్మె చేస్తూ రెండు నెలలు బస్సులు కంటికి కనబడకపోయే సరికి బెంగ పెట్టుకొని వెతుక్కొంటూ డిపోకి మేమంతా వెళ్ళామా… బులుగు టెంట్ల క్రింద ఉన్న మా డ్రైవర్లు, కండక్టర్లు మాసిన తెల్ల గడ్డాలతో .. ఎండకు కాటు తేలిన మొహాలతో మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించలేదూ! వద్దంటున్నా వినకుండా ఒన్‌ బై టూ టీలు తెప్పించలేదూ! నినాదా లతో హోరెత్తిన టెంట్‌లో ఉన్నట్లుండి ఒక డ్రైవర్‌ ఆర్టీసీ ప్రైవేటీకరిస్తే కిరోసిన్‌ పోసుకుని చచ్చిపోతానని డబ్బా ఎత్తితే ఎందుకో గుండె పిండేసిందబ్బా. దైనందిన జీవితానికి కలిగే ఆటంకంలాగానో, రోజూ దినపత్రికలో కనిపించే యాంత్రిక వార్త లాగానో ఆ సమ్మె అస్సలు అనిపించలేదు. మా కంటే ముందు ఆ టెంట్‌లో కూర్చొని వాళ్ళతో బాతాఖానీ వేస్తున్న పూలమ్మలను చూసిన తరువాత ప్రజలంతా కలిసి తవ్వుకొన్న ఊరబావి లాంటి ఆర్టీసీని పరుల పరం చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోకూడదనీ… ఆ అగ్నికి పుల్లో, పుడకో వేద్దామని అనిపించి ంది. సమ్మె సక్సస్‌ చేసుకొని నున్నటి గడ్డాలతో మళ్ళీ బస్సులెక్కిన డ్రైవర్లు, కండక్టర్లు క్యూబాను విముక్తి చేసిన చేగువేరాల లాగా అనిపించారు.

ఆరు సంవత్సరాల తరువాత ఇక్కడకి తిరిగి వస్తే ముసలైపోయిన పది గంటల ‘డొక్కు బస్సు’ షెడ్‌లో పడిపోయిం దనీ, ఆ సర్వీసు రద్దు అయ్యిందనీ తెలిసి బాధపడాలో, దాన్ని వానప్రస్థంకి సాగనంపి డ్రైవర్‌ సుబ్బారావు తాను మాత్రం రిటైర్‌ అయినా, స్కూల్‌ బస్‌ డ్రైవర్‌గా చేరి బతుకునీ డుస్తున్నాడని తెలిసి బాధపడాలో తెలియలేదు.

ప్రజల డబ్బుతో నున్నటి జెర్రిపో తుల్లాంటి రోడ్లను వేసి వాటి సర్వీసులను ప్రైవేటు పరం చేసి, గతుకుల పల్లె బాటలను ఆర్టీసీకి పట్టాభిషేకం చేసారు. గుంటల్లో క్లచ్చులు తొక్కీ తొక్కీ, పగిలిపోయిన రోడ్ల మీద బండ బ్రేకులను కొట్టీ కొట్టీ సాయం కాలానికి వళ్ళు పులిసిపోయి మూలన పడే సుబ్బారావులకు, కోటేశ్వరరావులకు ”స్టాండింగ్‌ ఒవేషన్‌” ఇవ్వాలనిపిస్తుంది. లక్షల బ్రతుకు పోరాటాలను పట్టణాలకు పల్లెలకు మధ్య మోస్తూ తిరుగుతున్న ”పల్లె వెలుగు” వస్తుంటే పక్కకు తొలిగి గౌరవ వందనం చేయాలనిపిస్తుంది.

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.