కె.సత్యవతి
ప్రతిరోజూ టీవీ9లో ప్రసారమవుతున్న స్త్రీల కార్యక్రమం ‘నవీన’ నూతన స్త్రీని ఆవిష్కరించిన అత్యంత నవీన కార్యక్రమం. ప్రధాన స్రవంతి ఎలక్ట్రానిక్ మీడియలో, ఆధునిక స్త్రీ రూపాన్ని రూపుకట్టించింది నవీన.
మామూలు మీడియ పట్టించుకోని అనేక స్త్రీల అంశాలను సీరియస్‌గా పట్టించుకొని చర్చకు పెట్టిన ఘనత నవీనకే దక్కుతుంది. హైదరాబాద్ రోడ్లు స్త్రీకు ఎంత భద్రమైనవి? అంట డేరింగు గా అర్ధరాత్రి కెమెరా లతో రోడ్ల మీద తిరిగిన శీతల్ వెర్జారియ నన్ను మొదటిసారి ఈ అంశం మీద మాట్లాడానికి స్టూడియెకు పిలిచినపుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. ప్రధాన స్రవంతి మీడియకు కావాలసింది మసాలాలు దట్టించిన సెన్సేషనల్ వార్తలు కానీ రాత్రి పూట ప్రయాణించే స్త్రీల సమస్యలు కాదు. కానీ ‘నవీన’ తీరు వేరు. నవీన మార్గం వేరు. నా వరకు నేనే ఎన్నో టాక్‌షోలలో మాట్లాడాను. నవీన చర్చకు పెట్టిన అంశాలు, ఫోకస్‌లో చూపిన స్త్రీల సమస్యలు వాస్తవమైనవి. స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనేవి.
మామూలుగా స్త్రీల పేజీలు కానీ స్త్రీల కార్యక్రమాలు కానీ సమాజంలో వాస్తవంగా జరుగుతున్న వాటికి అద్దం పట్టకుండా, మార్పు దిశగా అడుగు లేయకుండా స్త్రీలను భ్రమల్లో వుంచుతూ, యధాతధ స్థితి కొనసాగే తీరులోనే సాగుతాయి. పితృస్వామ్య భావజాలాన్ని కొనగోటితో కూడా తాకకకుండా, స్త్రీల కార్యక్రమాలనగానే కుట్లు, అల్లికలు, గృహాలంకరణలు, రిలేషన్‌షిప్‌లు లేకపోతే డాక్టర్లు, కౌన్సిలర్‌లు, సలహాలు మొదలైన అంశాలతో నింపడం జరుగుతుంది. ఆధునిక స్త్రీ ఆకాశంలో సగమై అవనిలో అన్నింటా తానై ఎదుగుతోంది. ఎదిగే క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. కొత్త కొత్త రంగాలు, కొత్త కొత్త సమస్యలు. ప్రపంచీకరణ విసిరిన పెనుసవాళ్లు, వీటన్నింటి గురించి చర్చించే వేదికలు కావాలి. పరిష్కారాలు సూచించే దిశగా ఆలోచనలు సాగాలి. అయితే అత్యంత విషాదకరమైన విషయమేమిటంటే ప్రధాన స్రవంతి మీడియ, అది ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ గానీ ఈ రోజు స్త్రీలెదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు తక్కువ. ప్రధాన స్రవంతి వీడియ మొత్తం బడా వ్యాపారుల చేతుల్లో, కనుసన్నల్లో చిక్కుకుని వుంది. స్త్రీల అంశాలు, అణగారిన వర్గాల, దళితుల, ఆదివాసీల అంశాలు లాభసాటి వ్యవహారాలు కావు. వ్యాపారులకు లాభాలు ముఖ్యం కదా! అందుకే ఆ వర్గాల ఆశలు, ఆశయలు, సంఘర్షణలు, బతుకు పోరుల ప్రధాన స్రవంతి మీడియకు ఆనవు. వాటి మీద వార్తా కధనాలుండవు. ప్రముఖంగా ప్రచురించే విశాల హృదయలుండవు. వారి ఆధ్వర్యం లోని ఛానళ్ళు ఫక్తు వ్యాపారం వాసనే స్తుంటాయి తప్ప మానవీయ కోణాలు కన్పించవు.
ఈ నేపధ్యంలోంచి చూసినపుడు టీవి9 ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘నవీన’ చాలా విలక్షణమైనది. భిన్నమైంది.టి.వీ9 ప్రధాన స్రవంతి మీడియ అయినప్పటికీ దాని సి.ఇ.వో. శ్రీ రవిప్రకాష్‌కి స్త్రీల అంశాలపట్ల ఒక స్పష్టమైన, భిన్నమైన ఆలోచనలున్నాయి. ఈ ఆలోచనలు ‘నవీన’లో ప్రతిబింబిస్తాయి. ఈ కార్య క్రమం ఇంత విలక్షణంగా రూపుదిద్దుకోవ డానికి అతని సహకారం, ఆమోదం ఉన్నాయి కాబట్టే షీతల్ తాననుకున్న విధంగానే ‘నవీన’ను కొనసాగించగలుగు తోంది. స్త్రీల కార్యక్రమాల మూస నమూనాను సమూలంగా బద్ధలు గొట్టిన ఘనత ‘నవీనా’కు దక్కుతుంది. స్త్రీల అంశాలను ఇంటి నాలుగ్గోడలనుంచి బయటకు దూకించి బజారులో నిలబెట్టిన క్రెడిట్ కూడా నవీనకే చెందుతుంది. వీరు చర్చకు పెట్టిన అంశాలను గమనిస్తే అది అర్ధమవుతుంది. అలాగే వీరు కాంపెయిన్ చేసిన అంశాలు – వివాహ సంబంధంలో అత్యాచారం (మేరిటల్ రేప్) రాత్రిపూట హైద్రాబాద్ రోడ్లు స్త్రీల కెంత భద్రమైనవి, గృహహింస, ఇంటిపని, పనిచేసే చోట లైంగిక వేధింపులు, విడాకులు, ఈవ్‌టీజింగు, పిల్లల హక్కులు, బాలకార్మికులు, నలుపే అందం, సంప్రదాయభిన్నమైన ప్రేమలు – ఇలా ఎన్నో అంశాలమీద కాంపెయిన్‌లు చేసారు. చర్చలు పెట్టారు. సమస్యల మూలాలను తాకే ప్రయత్నం చేసారు. ఈ రకమైన విప్లవాత్మకమైన మార్పులకి నాంది పలికిన నవీన సారధి షీతల్ వెర్జారియ. తల్లి భాష తెలుగు కాకపోయినా చక్కటి తెలుగు మాట్లాడుతుంది. తెర వెనుక సారధి షీతల్ అయితే తెరముందు అత్యంత ప్రతిభావంతంగా, రసవంతంగా, అర్ధ వంతంగా చర్చల్ని ఆవిష్కరించేది యంకర్ ఝాన్సీ. స్త్రీల అంశాలపట్ల స్పష్టమైన అవగాహనతో, మానవీయ కోణాలను అద్దుత చర్చల్ని నిర్వహించడం ఝాన్సీకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య అనుకుంటాను. ఆమె శరీరభాష, ఆహార్యం సీరియస్ చర్చలకు హుందాదనపు సొబగులను అద్దుతుంటాయి. కెమెరా కన్నుకు దొరకకుండా షీతల్ తన నిబద్ధతతో, కోట్లాది స్త్రీల వాస్తవ సమస్యలను కెమెరా ముందుకు తెస్తూంటుంది. వీరిరువురి సమన్వయం ఆత్యాధునిక దృష్టికోణం, విశాలత్వాన్ని నింపుకున్న ఆలోచనాధార ‘నవీన’ కార్యక్రవల నిండా పొంగుతంటుంది.
టీవీ 9, 2004లోనే ప్రారంభమైంది. ‘నవీన’ మాత్రం 2006లో మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినం రోజున మొదలైంది. స్త్రీల కార్యక్రవన్ని ఒక కొత్త పంథాలో నడిపించడానికి మహిళాదినం రోజున ఇది ప్రారంభమైంది. అచిరకాలంలోనే షీతల్ ఈ కార్యక్రమ సారధి అయ్యింది. ”చదువుకున్న, బయటకెళ్ళి పనిచేసే స్త్రీలను ఉద్ధేశించి కార్యక్రమాలు ప్రారంభించాలన్నదే మా ఆలోచన. నవీనకు నేను బాధ్యత వహించిన తర్వాత ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు’ అనే అంశం మీద మొదటి కార్యక్రమం చేద్దామనుకున్నాను. కానీ ‘పిల్లల్లో వొత్తిడి, తల్లిదండ్రుల బాధ్యత’ మీద చెయ్యల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కార్యక్రమాలు, కేంపయిన్‌లు నేననుకున్న విధంగానే చెయ్యగలిగాను…ఇప్పుడున్న స్త్రీల ప్రొగ్రాముల మూస నమూనాను బద్దలు గొట్టాలన్నదే నా ధ్యేయం. కొత్త స్త్రీని, ‘నవీన’లో ఆవిష్కరించాలన్నదే నా ఆలోచన. నా ఆలోచనలు ఆచరణ సాధ్యమయ్యయంటే అందుక్కారణం ఝన్సీ ఏంకరింగే.”అంటుంది షీతల్.
‘నవీన’ ప్రోగ్రామ్‌కి మంచి రెస్పాన్స్ వుంది. లెక్కలేనన్ని ఈ మెయిల్స్ వస్తుంటాయి. తీసుకున్న అంశాలను బట్టి తిట్టే మెయిల్స్ కూడా వస్తంటాయి. స్త్రీవాద కోణాన్ని ఆవిష్కరించే కార్య క్రవలను సహించలేని కొందరు తిట్లకి దిగిన సందర్బాలు వున్నాయి. ‘వివాహ సంబంధంలో అత్యాచారం’ అనే టాపిక్ చర్చకు పెట్టినపుడు ఎవరూ దానిని గురించి మాట్లాడాటానికి ఒప్పుకోలేదట.
స్త్రీలకు సంబంధించిన ప్రోగ్రాముల రూపకల్పనే కాక వారికి కావలసిన సహాయలు, సలహాలు, తోడ్పాటు కూడా అందిస్తుంది నవీన. స్త్రీలకు సహాయ లందించే సంస్థల వివరాలు, హెల్ప్‌లైన్‌ల టోల్ ఫ్రీ నెంబర్లు, నిపుణుల టెలిఫోన్ నెంబర్లు ప్రతి రోజు ఉచితంగా ప్రదర్శించడం ద్వారా, మాటల ద్వారానే కాక, చేతలద్వారా స్త్రీలకు అండగా నిలబడడం ‘నవీన’ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
”నవీన, నాలోని మానవీయ కోణాన్ని, స్త్రీవాద ధోరణిని ఆవిష్క రించింది. నవీన కోసం నా కమర్షియల్ ప్రోగ్రామ్‌ని చాలా వదులుకున్నాను. నవీన నాకిచ్చిన ఇమేజ్‌కి తగ్గ ప్రోగ్రామ్ నేను బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా తప్ప వేరేదీ చేయలేదు. వ్యక్తిగా నవీన నాలో చాలా మార్పు తెచ్చింది. స్ట్రాంగుగా, బోల్డ్‌గా అయ్యాను. చదివి, నమ్మి మాట్లాడు తున్నాను. కాబట్టి అది నా వ్యక్తిత్వం మీద ప్రభావం చూపింది. నా మీద గొప్ప ముద్ర వేసింది. నేను ఎదుర్కొన్న కేసు గురించి చెప్పాలి. ఒక రోజు నేను టీవీ9 ఆఫీసుకొస్తున్నాను. కారు దిగి వస్తుంటే అక్కడ నిలబడిన వాడొకడు ఏదో కామెంట్ చేసాడు. నేను ఏదో వాగాడులే ఇది మాములే అని వదిలిపెట్టలేదు. నవీన ఇచ్చిన సపోర్ట్‌తో వాడి మీద లోక్ అదాలత్‌లో కేసు పెట్టాను. ఈ ధైర్యం నవీన ఇచ్చిందే. షీతల్ నన్ను తనకు కావలసిన విధంగా మలుచుకుంది. తన ఆలోచనలకు అనుగుణంగానే మేము ఎన్నో కొత్త కొత్త అంశాలను ఎంచుకుని చర్చకు పెట్టాం. ‘నవీన’కి ఏంకరింగు చేయడం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. ఎంతో ఎదిగాను” అంటుంది ఝాన్సీ.
సీరియస్ చర్చల్ని నిర్వహించడమే కాక నవీన ద్వారా వ్యాస రచన పోటీని కూడా నిర్వహించారు. సెప్టెంబరు 2007లో గృహహింస నిరోధక చట్టం, జీవిత భాగస్వామి నుండి మీరేమీ ఆశిస్తున్నారు, ఈవ్‌టీజింగు, లైంగిక వేధింపులు అంశాల మీద పోటీ నిర్వ హించి విజేతలను నగరానికి ఆహ్వానించి సత్కరించారు. ఈ సంవత్సరం కూడా మార్చిలో ఈ కాంటెష్ట్ నిర్వహించా లనుకుంటున్నారు.
గత సెప్టెంబరు మూడు నుండి ‘నవీన’ కార్యక్రమ స్వరూపం మారిపోయింది. మొదటి పది నిముషాలు 360 డిగ్రీ, పబ్లిక్ పంచ్ (ఏదో ఒక అంశం మీద పబ్లిక్ పంచ్) చివరగా బాడి, మైండ్, సోల్. థర్డ్ ఐ అంటే మహిళలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం.ఇలా నవీన రూపు మారింది. అలాగే ఈ కార్యక్రమం రోజుకో అంశం మీద వుంటుంది. మంగళవారం- ఇన్స్ఫిరేషన్, బుధవారం- ఆర్ధిక స్వతంత్రత, గురు వారం-ఆత్మరక్షణ, శుక్రవారం-యువ విజేతలు, శనివారం-పరిశోధనాత్మక కథనాలు, ఆదివారం- పది నిమిషాలు పురుషుల కోసం (సూపర్‌మేన్) ప్రతి బింబం-స్త్రీల పుస్తకాలు సమీక్ష. ఇలా నవీన రోజుకో అంశం మీద రకరకాల కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది.
నవీనకు బోలెడంత ప్రతిస్పందన వస్తూటుంది. ఫోన్‌లద్వారా,ఈ మెయిల్స్ ద్వారా ఎన్నో సూచనలు, సలహాలు, అభినంనదనలు వస్తూంటాయి. తమ సమస్యలను చెప్పుకొంటారు. సలహాలను, పరిష్కారాలను అడుగు తుంటారు. మంచి స్పందన వుందని వాళ్ళకొచ్చే ఉత్తరాలే చెబుతుంటాయి.
ఈ రోజు నవీన స్త్రీల కార్యక్రమంల రూపు రేఖల్ని మార్చేసింది. స్త్రీ అంటే సున్నితమంట పింక్ కలర్‌ని ఆపాదించే మూసని చెల్లాచెదురు చేసింది. ‘నవీన’ అని ఈ కార్యక్రమానికి నామకరణం చేసింది టీవీ9 సి.ఇ.వో. రవిప్రకాష్. ”మేము, నవీనలో ఒక కొత్త స్త్రీని ఆవిష్కరించగలిగామంటే ఆ క్రెడిట్ రవి ప్రకాష్‌కి చెందుతుంది. అతని పూర్తి సహకారం, తోడ్పాటు లభించడంవల్లే మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించగలుగుతున్నాం” అంటుంది షీతల్. ఈ విజయం వెనుక టీవి9లో వున్న ఏకైక ఎడిటర్ సుజాతగారి అర్ధవంతమైన ఎడిటింగు, చక్కటి గ్రాఫిక్స్ అందించే వర్ధన్, కోఆర్డినేటర్ ప్రొడ్యసర్ శృతిల టీమ్‌వర్క్ ఎంతో వుంటుంది. అందరి సామూహిక కృషి పేరే ‘నవీన’.
”నేను టీవి9లో ఇంకా చాలా ప్రోగ్రాములు చేస్తాను. నిజానికి అవన్నీ నా తిండికోసం, నా జీవనం కోసం. నవీన మాత్రం నా మనసుకోసం. నా ఆత్మకోసం” అని చేప్పే షీతల్ సారధ్యంలో, ఝాన్సీ చైతన్యవంతమైన, సంస్కారయుతమైన, ఏంకరింగుతో ‘నవీన’ మరిన్ని కొత్త పుంతల్ని తొక్కుతుందని మెయిన్ స్ట్రీమ్ మీడియలో స్త్రీల అంశాలకి సముచిత స్థానం యివ్వడంతో పాటు ఆధునిక స్త్రీ అంతరంగ కథనాలను, సంక్షోభాలను, వాస్తవ జీవిత రూపురేఖల్ని ఆవిష్కరిస్తుందని ఆశిద్దాం. అంతేకాదు ఒక్క నగర స్త్రీలనేకాక గ్రామీణ స్త్రీని కూడా తెరమీదికి తెచ్చి వారి జీవన పోరాటాల్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుందాం.
‘నవీన’ మహిళ కాంటెస్ట్ 2007
నవీన మహిళ 2007 కాంటెస్ట్ మరోసారి మీ ముందుకు వచ్చింది.
సాహసం, హక్కుల కోసం పోరాటం, సాంఘిక దురాచారానికి వ్యతిరేకం. ఈ మూడు విభాగాల్లో దేనిలోనైనా కృషి చేస్తే మీ నామినేషన్ పంపండి. చిరునామా
నవీన
టీవీ9, పోస్ట్‌బాక్స్ నెం. 61,
రోడ్‌నెం. 3, బంజారాహిల్స్, హైద్రాబాద్ -34
నామినేషన్‌లు పంపాల్సిన ఆఖరు తేదీ ఫిబ్రవరి 10 , 2008 నవీన మహిళ మీరే కావచ్చు.
బాగుంది.
చెట్టు నొదిలెసి ఆకు గురి0చి మాటాడతారా సతయవతి గారు…ఎ0త మీరు అ0దులో ఎక్కువ కనిపిస్తె మాత్ర0. టీవీ9 బూతు అ0టె పొర్నొ, సాఫ్ట్ పొర్నొ చానెల అని చిన్న పిల్లలకు కూడా తెలుసు. మీకు టెలియద0టె ఆచ్ఛర్య0గా ఉ0ది. నవీన కమలమె. కానీ మిగిలి0ద0తా బురదె కద0డీ.