2001 జూలై 25న పార్లమెంట్ మెంబర్‌గా వున్న పూలన్ దేవిని హత్యచేసినపుడు ఏ మహిళా సంగాలు, విప్లవ సంగాలు, కుల సంగాలు ఎవరూ పెద్దగా స్పందించలేదు, ఖండించలేదు. కాని ‘అన్వేషి’ పూలన్‌దేవి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టింది. మా ఆఫీసుల మీటింగు పెడ్దామంటే ఆడవాల్లు మగవాల్లు ‘అమ్మో వద్దు’ అని కొందరు ఆ బందిపోటుకు మీటింగెందుకు బాబోయ్ మీరు కూడా అట్లనే అవుతరు’ అని దడుసుకున్నరు. సభ కాకున్నా ఆమె హత్యను ఖండిస్తూ సంతకాల సేకరణ అయినా చేద్దామంటే సంతకాలక్కూడా భయపడిండ్రు ‘వైట్ కాలర్స్’. వాల్ల భయాల్ని ఆడవాల్లక్కూడా నింపడం, ఆడవాల్లు కూడా విభేధించక మగవాల్లపాటే పాడి, అసలు పూలన్‌దేవి వ్యక్తిత్వం, పోరాడే స్ఫూర్తి, తిరుగుబాటును అందరం కొనసాగించక పోవడం వల్ల నష్టపోయింది మహిళలే. అగ్రకుల మగమీడియా పూలన్‌దేవిని ఒక హంతకిగా, బందిపోటుగా మహిళ కాదన్నట్టుగా మహిళా ప్రపంచం నుంచి వేరు చేసింది. అదే మిగతా సామాజిక ఉద్యమ రంగాలు కూడా కొనసాగించడం దారుణం. అట్లా 2001 నుంచి పక్కకు నెట్టేసిన పూలన్‌దేవి నిర్బయకేసప్పుడు చాలా మంది మిత్రులు మాట్లాడుకున్నారు.
వామ్మో యీ యెడ తెగని అత్యాచారా లేంటి ఆడపిల్లల మీద వీల్లు పూలన్‌లయితే యివితగ్గుతాయేమో! యీ అత్యాచారాలకు ప్రతి ఘటనగా, మెరుపు దాడిగా పూలన్‌దేవి చైతన్యాలు, తెగువలు మహిళలకు అందించాలి అనే చర్చలొచ్చినయి కొందరు మిత్రులతో, ‘అవును ఆర్ధిక సమానత్వాల కోసం స్క్వాడ్స్ తయారైనట్లు జెండర్ సమానత్వాల కోసం, ఆడ పిల్లల మీద, మహిళల మీద నిత్యం జరిగే అత్యాచారాలు, హింసల మీద స్క్వాడ్స్ ఎందుకు తయారు కాకూడదు’ అనే అభిప్రాయాలు కొంత బలాన్ని యిచ్చినాయి.
నిజానికి చరిత్రలో బలమైన మహిళలు, శక్తివంతమైన మహిళలు, యుద్దాలు చేసిన మహిళలు, సమాజం కోసం అనేక రకాల సేవలందించిన బహుజన మహిళలున్నా వారిని స్మరించడం, గుర్తించడం స్ఫూర్తి పొందడం, వారి చైతన్యాల్ని కొనసాగించడం జరగడం లేదు.
అట్లా విస్మరణకు గురైన శక్తివంతమైన మహిళల్ని యీ సమాజానికి దివిటీగా నిలుపుకుందామని ‘మట్టిపూలు’ రచయిత్రు లు అభిప్రాయపడి పూలన్‌దేవి జయంతిని జరిపాము. దానికి అన్ని సామాజిక కులాల మహిళల్ని ఆహ్వానించాము.
పూలన్‌దేవి ఉత్తర ప్రదేశ్ జలాల్‌జిల్లా గోడక్ పూర్వ గ్రామంలో పేద చదువురాని కింది కులం మహిళ. ఆమె చెప్పినట్లు ‘మాది కుక్క మీద వాలిన ఈగలాంటి బతుకు! పదకొండేండ్లకే ముప్పయేండ్లోడికి 2వ భార్యగా వెళ్లి, ఆ భర్త చేతిల బలవంతపు లైంగిక హింస బారిన బడింది. ఏ అన్యాయా న్ని సహించలేని తత్వం వల్ల, తిరుగుబాటు వల్ల తల్లి, తండ్రి, పెదనాయిన, అతని కొడుకు, భర్త వూరి పటేలు, పటేలు కొడుకు, బిడ్డలతో, పోలీసులు, ఠాకూర్లతో, బందిపోట్ల తో విపరీతంగా దెబ్బలు, హింసలు బడింది.
స్వంత బూమి కోసం పాలివాండ్లకు శత్రువైంది. కూలి చేసిన పైకం కోసం పటేలు కుటుంబానికి శత్రువైంది. పటేలు కొడుకులు పోలీసులు ఠాకూర్లు, బందిపోట్లచే అత్యాచారాలకు గురైన పూలన్‌దేవి లింగ కుల వివక్షలకు వ్యతిరేకంగా యుద్ధం జేసింది. ఎన్ని హింసలు, దెబ్బలు, అత్యాచా రాలన్నీ పూలన్‌దేవి పదిహేనేండ్ల పసి ప్రాయంలోనే జరిగినాయి.
‘నాకే యింత హింస, యిన్ని అఘాయి త్యా లు, అవమానాలు జరగడానికి కేవలం పేదరికం కాదు, తక్కువ కులంలో పుట్టినందు క్కూడా’ అంటది పూలన్‌దేవి. ఆమె మీద జరిగిన అత్యాచారాలు చర్చ గాలేదు గానీ, ఆమె బందిపోటయితే, ఆమె ప్రతీకారం (ఠాకూర్లపై వూచకోత) మాత్రం పెద్ద చర్చలో భారత అగ్రకుల మగ ప్రపంచాన్ని నిద్రబోనివ్వలే. దాని ఫలితమే 1983లో చంబల్‌రాణి, బందిపోటు రాణి సరెండర్ అయేట్లు చేశారు. పదకొండేండ్లు జైల్లో వుంచి 1994లో విడుదల చేసిండ్రు.
ఆమె జైల్లున్నపుడు కడుపు నొప్పంటే చాలా కుట్రగా ఆమె యూటిరస్‌నే తీసే సిండ్రట. పూలన్ దేవులు పుట్టగూడదని తీసేసినం అని డాక్టర్స్ చెప్పినా చర్య తీసుకునే వాళ్ళెవరు?
జైలు నించి విడుదలై 1996లో సమాజ్ వాదిపార్టీ టిక్కెట్ యిచ్చి పోటీ చేయిస్తే కాంగ్రెస్, బిజెపి యితర పార్టీ ఆడ మగ నాయకులు రాజకీయాల్లోకి బందిపోటా అని దేశవ్యాప్తంగా ఆందోళించినా పూలన్ ఎంపీగా గెలిచింది. అనేక సామాజిక సేవలందించింది. బహుజన మహిళలు విద్య ఉద్యోగాల్లో వుండాలనీ గ్రామాల్లో ఆడపిల్లల రక్షణ కోసం ప్రత్యేక సదుపాయాలేర్పాటు చేసింది. కానీ అగ్రకుల ఠాకూర్లు ఆమెను చంపేదాక నిద్రబోలే.అగ్రకుల మగ ప్రపంచం చంపినా ఆమె ప్రతి ఘటనా స్ఫూర్తి , చైతన్యాల కోసం పూలన్‌దేవిని మహిళలంతా బతికించుకోవాలె.