భూమిక ఆధ్యర్యంలో జరిగిన కథల పోటీ ఫలితాలు.

మొదటి బహుమతి – ‘రూపాయి చొక్కా’  ఎస్‌. శ్రీదేవి
రెండవ బహుమతి – ‘అమ్మాబయలెల్లినాదో’  తమ్మెర రాధిక
మూడవ బహుమతి – ‘మరకల్లో మెరుపులు’  పి.పుష్పాంజలి
మూడవ బహుమతి – ‘నాకంటూ ఒక జీవితం’  ఎం.హేమలత.
 

బహుమతుల వివరాలు నేరుగా విజేతలకు త్వరలో తెలియచేస్తాము.

కధలపోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పి.సత్యవతి, వి.ప్రతిమల అభిప్రాయాలు.
భూమిక కథల పోటికి ఈ సారి కూడా మంచి స్పందన లబించడం ఆనందం. ఇంకా ఆనందమేమిటంటే కొందరు రచయిత్రుల ఆలోచనా పరిధి విస్తృతం కావడం. కథనంలో సౌలభ్యం సాధించడం, అయితే అంతా ఆనందమే అనుకోవడానికి వీల్లేకుండా  కొంత నిరాశ కలిగించిన కథలు కూడా వున్నాయి.
సంసారంలో కష్టాలు, పురుషులు పెట్టే బాధలు, అవమానాలు, పిల్లల వల్ల కస్టాలు. ఇటువంటి చాలా సార్లు చదివేసిన కథలు ఎక్కువ వచ్చాయి. అందుకు కారణాలు స్పష్టమే. ఈ సమస్యలనించీ ఇంకా చాలా మంది స్త్రీలు బయటపడక నిత్యం మన కళ్ళముందుండి మనని వేదనకి గురిచెయ్యడం . ఈ సమస్యలతో పాటుగా నూతనంగా పుట్టుకొస్తున్న సమస్యలవైపు కూడా మనం దృష్టి పెట్టవలసిన అవసరం  వుంది కదా? అంతేకాక రచనలో ప్రవేశించినపుడు, మన కధనాన్ని, వస్తువైవిధ్యాన్ని మెరుగు పరచుకునే కృషి కూడా చెయ్యలి. చాలా కథల్లో ఈ ఛాయలు లేకపోవడం కొంత బాధనీ, నిరాశనీ కలిగిస్తుంది. మనకి తెలుసు, మంచి కధకులు మంచి అధ్యయన పరులు కూడా అని.

చుట్ట జీవితాన్ని, రాజకీయాలని, రాజకీయలు ప్రభావితం చేస్తున్న జీవితాన్ని, జీవితంలోకి ప్రవేశిస్తున్న రాజకీయాలని, ఎన్నింటినో మనం పరికించాలి. తద్వారా ఏర్పడిన మన ప్రాపంచిక తాత్విక ధృక్పధంతో విశ్లేషించాలి. ఇదంతా చెయ్యడానికి కొంచెం కష్టపడాలి. ఇంత చెయ్యడానికి స్త్రీ రచయితలకింకా వెసులుబాటు కుదరడం లేదనేది స్పష్టం. ఈ వెసులుబాటు సాధించుకోవడం మన కర్తవ్యంగా గుర్తించినప్పుడే రచయిత్రులనించి ఇంకా మంచి కథలొస్తాయి.
     
ఈ సారి వచ్చిన కధల్లో వస్తు వైవిధ్యంలో కాని, కధనంలోకాని ఉత్తమ కధ అని మేము భావించిన కథ ‘రూపాయిచొక్కా’. వేలాది మంది ఆదీవాసీలని నిర్వాసితులని చేస్తు కడుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంతిమంగా ఎవరికెంత లాభం చేకూరుస్తాయె కాని, నిర్మాణ దశలో అవి ఎందరి జీవితాలలో విధ్వంసం సృష్టిస్తాయె చెప్పిన కధ. ఇంతవరకు ఇలాంటి కధలు నిర్వాసితుల దృష్టికోణంనించీ వచ్చాయి. ఈ కథ ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకునే ఒక ఇంజనీర్‌ దృష్టిినించి చెప్పిన కథ. ప్రాజెక్టు నిర్మించే ప్రభుత్వానికీ, అందువల్ల నిర్వాసిితులయ్యే ప్రజలకి కాక మధ్యలో ఒక పని ముట్టులాంటి పాత్ర పోషించే ఈ ఆఫీసర్‌కి స్పందించే హృదయం, ఆలోచించే మనసవుంటే వత్రం అతనేం చెయ్యగలడు? అతని జీతాన్ని వదులకోలేడుకదా! అతని ఆర్ధిక సమస్యలు అతనివి. అతని జీవన సహచరికి ఒంటరితనంవల్ల మానసిక సమస్యలొస్తాయి. ప్రాజెక్టులు కట్టడం ప్రభుత్వానికి అవసరం. కాంట్రాక్టులు దక్కించుకోడం కంపెనీకి అవసరం, కంపెనీ బాగుండడం ఉద్యోగస్తులకి అవసరం ”ఇట్లా అవసరాలు సృష్టించడం పెట్టుబడికి అవసరం. ఈ కథ చదివాక అంతగా అవసరంలేని ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా ఎంత కోల్పోతున్నారో అర్ధం అవుతుంది.

ఇక ‘అమ్మా బయలెల్లినాదో” అనే కథ తెలంగాణా సాంస్కృతిక జీవనాన్ని కళ్ళకి కట్టించడమేకాక, తన తన బిడ్డల బ్రతుకు బాగు అటు అత్తింటి వాళ్ళు ఇటు పుట్టింటి వాళ్ళు కాక తనే చూసుకోవాలనే ఇంగితాన్ని అర్ధం చేసుకున్న యువతి కధ , కధనం బాగుంది.

 ఈ సారి వచ్చిన కధల్లో ఎక్కువ భాగం స్త్రీలు తమ అస్తిత్వం కోసం తపన పడినవి. అందులోను, తమ సాంసారిక బాధ్యతలు అయిపోయినాక  కూడా వారినించి ఇంకా సేవలు పొందాలనుకునే పిల్లలకి ఎదరు తిరిగి అప్పటికైనా తమ ఉనికిని నిలబబెట్టుకోవాలనుకున్న మహిళల గురించినవి. ”నాకంట ఒక జీవితం” అలాంటి కథ. ఈ కథలో ఆమె చివరకు ఏ ప్రలోభాలకూ లొంగక ఎటువంటి  ఏవెషనల్‌ బ్లాక్‌మెయిల్‌ ను లెక్క చెయ్యక తన మనసు చెప్పిన నిర్ణయం తీసుకుంటుంది.
 మరో కధ ‘మరకల్లో మెరుపులు” అదిమి పెట్టిన లైంగిక వాంఛలు వనవ సహజ గుణాలైన ప్రేమ సానుభతి వంటి వాటిని ఎట్లా దెబ్బ తీస్తాయె చెప్పిన కధ.
 చివరగా రచయిత్రులకి ఒక విన్నపం. చిరాగ్గా  ఫేస్‌ పెట్టి, హ్యాపీగా ఫీలయ్యి, కొంచెం కేర్‌ పెట్టి, ఇర్రేషనల్గా ఆలోచించి, ఇలాంటివి ఇంకా కొన్ని మాటలు వాడాల్సిన అవసరం వుందా? ఈ మణి ప్రవాళం (నిజానికి ”సంకర” అనొచ్చు కాని కాస్త చెవులకింపుగా వుండాలని మణి ప్రవాళం అన్నాను) తెలుగు భాష మరుగున పడిపోవడానికి కారణం కావటల్లేదా? సంతోషం, శ్రద్ధ, హేతువు, మొహం వంటి చిన్న మాటల్ని కూడా మనం మర్చిపోతున్నామా? టీవీయంకర్లు మనకి భాష నేర్పకూడదు. ”స్టావ్‌ మీదప్యాన్‌ పెట్టి, కొంచెం ఆయిల్‌ వేసి, తరువాత కట్‌ చేసిన వెజిటబుల్స్‌ వేసి అలాగ” ఈ మధ్యన  ఒకరు అన్నారు. ఆంధ్రదేశంలో తెలుగు చదవాలంటే ఇంగ్లీషు వచ్చి తీరాలని. రచయిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు.

పి. సత్యవతి
కథలపోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడమనేది ఒక గొప్ప అనుభతి… ఎలా వ్రాయలో తెలీకపోయినా, ఎట్లా వ్రాయకూడదో తెలిస్తే చాలు ఎవరయినా ఆ స్థానానికి అర్హులేమో.. వంట చేయడం రాకపోయినా రుచులలో లోపాలనెన్నగల్గిన చందాన….
 అదీ ‘భూమిక’ కథల పోటీ అంటే మొత్తం స్త్రీల కథలు.. స్త్రీల జీవితాల చుట్ట అల్లబడిన కథలు. ఈ మొత్తం కథలు ఒకేసారి, ఏకబిగిన చదవడం ఒక విషాదకరమైన అనుభతి… వారం రోజులపాటు నిద్ర పట్టక పోవడమే కాకుండా ఆ కథల్లోని స్త్రీ పాత్రలన్నీ రక్తమాంసాల్ని సంతరించుకుని నా చుట్టూ తిరుగుతున్నట్లు, వారి వారి జీవితాల్లోని చీకటి కోణాలనీ కష్టాలనీ నాతో పంచుకోవాలని స్పందిస్తున్నట్ల ఏవేవో కలలు… కలలో, నిజాలో తెలీనటువంటి మానసిక పరిస్థితి… బాగా దిగులొచ్చింది…

ఇక కథల ఎన్నిక విషయనికొస్తే వస్తుపరంగా అన్ని కథలు …లేదా ఎక్కువ భాగం కథలు ఉన్నతమైనవిగానే వున్నాయి. కొన్ని కథలు కొత్త వస్తువులని కూడా స్పృశించాయి. అయితే కథా నిర్మాణం పట్ల మన స్త్రీ రచయితలు ఎక్కువ శ్రద్ధ చూపడం లేదా? లేక వాళ్ళకున్న ఇరుకైన పరిస్థితులు (సమయభావం) మూలంగా కథా రపంపట్ల శ్రద్ధ  వహించలేకపోతున్నారా అన్నది సంశయత్మకం. ఏది ఏమయినా కథనం, శైలి, భాష,నిర్మాణంవంటి కథకు సంబంధించిన వ్యాకరణ సూత్రాల పట్ల కూడా స్త్రీ రచయితలు లోతైన అవగాహన కలిగి వుండాల్సిన అవసరం వుందని నాకన్పించింది..లబ్ధప్రతిష్టులయిన వారు కూడ తమను తాము అధిగమించాల్సిన అవసరముంది.

మొదటి బహుమతికి ఎన్నిక చేసిన ‘రూపాయి చొక్కా’ వస్తుపరంగానూ, నిర్మాణపరంగానూ, శీర్షికను ఎన్నుకోవడంలోనూ చాలా వరకూ ఎన్నదగిన కథ. ఆనకట్టల నిర్మాణం మూలంగా నిర్వాసితులవుతోన్న ఆదివాసీలమీద, విచ్ఛిన్నమై పోతోన్న ప్రకృతి సహజత్వాల మీద ఇదివరకే వచ్చిన చాలా కథలకు భిన్నంగా ఒక అధికారి దృష్టికోణం నుండి ఈ కథ చెప్పడం విశేషం. మరో కోణంలో  ఈ కథ ఒంటరితనంతో,నిరాశా నిస్పృహల్లోకి నెట్టబడుతోన్న స్త్రీల పరిస్థితిని కూడా ప్రస్తారిస్తుంది. ఈ కథా రచయిత్రి ‘శ్రీదేవి’కి అభినందనలు.

రెండో బహుమతికి ఎన్నికాబడిన ‘అమ్మబయలెల్లనాదే’ తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగల సంస్కృతిని చాలా చక్కగా వివరణకు తెస్త అంతర్లీనంగా ఒక ఆడపడుచు హృదయన్నీ, జీవితాన్నీ కూడా పాఠకుల ముందు పరిచిన కథ ఇది. నిర్మాణం పట్ల మరికొంత శ్రద్ధ వహించి వున్నట్టయితే బావుండేదన్పించింది.. మొత్తం మీద మంచి కథ వ్రాసిన రాధికకి హృదయపూర్వక అభినందనలు.
ఇకపోతే మూడో బహుమతి విషయం వచ్చేసరికి నాకూ, నాతోటి న్యాయనిర్ణేత పి. సత్యవతిగారికీ మధ్యన కొంత చర్చ నడిచింది. ఈ కథల్లో (పోటీ) ఒక గొప్ప సామ్యమేమిటంటే చాలా కథలు యభయ్యేళ్లు పైబడిన స్త్రీల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు సంబంధించినవి కావడం. ఇది నిజంగా ఒక గొప్ప పరిణామం. ఈ వస్తువుతో చాలా ధీవగా వ్రాయబడిన కథ ‘నాకంటూ ఒక జీవితం’. స్త్రీల లేదా ఒంటరి స్త్రీల లైంగిక స్వేచ్ఛ గురించి చాలా లోతుగా ప్రస్తావించబడిన కథ ‘మరకల్లో మెరుపులు’
ఈ రెండు కథల గురించీ కూడ చాలా లోతుగా మేమిద్దరమూ చర్చించి చివరకు ఆ రెండు కథలకూ మూడో బహుమతి నివ్వడం  న్యాయంగా వుంటుందన్న ఒక నిర్ణయనికొచ్చాం.. ఆ కథల రచయిత్రులిరువూ వరుసగా హేమలత, ఎ.పుష్పాంజలి…వారిరువరికీ కూడా అభినందనలు…వీళ్ళిద్దరి కలం నుండీ పాఠకులు మరిన్ని మంచి కథలను ఎదురు చూడొచ్చు.

కన్సొలేషన్‌ బహుమతుల జోలికి వెళ్ళలేదుగానీ మరి కొన్ని కథలను సాధారణ ప్రచురణకు తీసుకోవల్సిందిగా మేము సంపాదకుల వారిని కోరడం జరిగింది. అంటే ఇక మిగిలిన కథలన్నీ  అప్‌టుది వర్క్‌ కావని మా ఉద్దేశ్యం కాదు. వాటిని తిరగరాయగల్గితే  మంచి కథలు, గొప్ప కథలు కాగలవన్న ఉద్దేశంతో మాకున్న పరిమితుల దృష్ట్యా ఈ కథలను పక్కకి పెట్టడం జరిగింది.  ముఖ్యంగా నంబూరి పరిపూర్ణ గారి కథ ‘వీరపలాయనులు-ధీరసంకల్పులు’ వస్తువు నిజానికి యివ్వాల్టి పాఠకులకు చేరవలసిందే..  అయితే ఆ వస్తువు చిన్న కధలో యిమడగలిగేది కాదనీ రచయిత్రి కాన్వాస్‌ని విస్తృత పరుచుకుని మినీ నవల వ్రాయగలిగితే సమగ్రంగా వుంటుందనీ, మరిన్ని విశేషాలను పాఠకులకు చెప్పే అవకాశం వుంటుందనీ నాకన్పించింది.
 ఏది ఏమయినా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కూడ పేరు పేరునా నా ప్రత్యేక అభినంనదలు.. నాకీ అవకాశాన్నిచ్చిన ‘భూమిక సంపాదక వర్గాని’కి హృదయపూర్వక ధన్యవాదాలు.
.వి.ప్రతిమ

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో