నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

3.సంస్థానాల హస్తాంతీకరణ
భారతదేశంలో రాజులు తమ సంస్థానాలను ప్రభుత్వానికి అప్ప చెబుతున్నారు. కాని ఫరీద్‌కోట్‌ రాజా తన సంస్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. జవహర్‌ నెహ్రూగారిని ఫరీద్‌కోట్‌ రాజు తన కోటలోకి రానివ్వడం లేదన్న వార్త అంతటా వ్యాంచింది. చివరికి ఏమీ చేయలేక ఆయన ఇండియన్‌ గవర్నమెంటుకి తన సంస్థానాన్ని ఇచ్చేసాడు. ఆయన గన్‌ తీసుకుని కవాటాల దగ్గర  కూర్చున్నాడు. రాజమాత ఆయన్ని బతిమలాడింది. చివరికి ఆయన దిగివచ్చాడు. అదే సమయంలో నేను పటియాల కాలేజీలో  ఒక నాటకం వేసాను. అందులో ఒక రాజుకి వ్యతిరేకంగా ఒక దేశభక్తుడు జెండాని ఎగరేస్తాడు. ఈ నాటకం గురించి పటియాల దినపత్రికలో వచ్చింది. దీని మీద చర్చ జరిగింది. ఫరీద్‌కోట్‌ మాహారాజ్‌కి వ్యతింకంగా ఈ నాటకం వేసారని అందరు అనుకోవడం మొదలుపెట్టారు. నన్ను కంట్రోలు చేయడానికి మా నాన్న గారిపై ఒత్తిడి పెరిగింది. నా సోదరుడు సత్యవ్రత్‌ బేదీ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. మొత్తం పటియాల రాజ్యంలో అతడు ఒక్కడే ఎమ్‌.ఎ. చదివాడు. అతడి ఆర్టికల్స్‌లో రాజకీయాల గురించిన సరైన విశ్లేషణ ఉండేది. అందువలన అతడి దగ్గర నేతలు స్పీచ్‌లు రాయించుకునేవారు. డి.కె. బరువా పటియాలలో ఉండి కాంగ్రెస్‌ పార్టీ తరుపు నుండి పటియాల రాజ్యాన్ని ప్రభుత్వానికి ఇప్పించడానికి ప్రయత్నాలు చేసాడు. ఆయన నా సోదరుడు సత్యవ్రత్‌ బేదీకి స్నేహితుడు. బరువా మొట్టమొదట్లో కమ్యూనిస్ట్‌ పార్టీలో ఉండేవారు. ఇద్దరు గంటల తరబడి రాజకీయాల గురించి చర్చించేవారు. సర్దార్‌పటేల్‌, ఫరీద్‌ కోట రాజుకి మధ్య ఈ విషయంలో చర్చ జరిగేది. అకాలీ పార్టీ వాళ్ళు తమ గొప్పతనాన్ని చూపించాలని ప్రయత్నించేవారు. మా నాటకం ఆనాటి రాజకీయాలను ప్రతిబింబింప చేసింది. నా స్నేహితురాలు కుసుమ్‌ బాగా పొడుగ్గా ఉండేది. ఆమె దేశభక్తుడి వేషం వేసింది. నేను ప్రియురాలిగా వేషం వేసాను.

4.విభజన – అల్లర్లు
భారతదేశం హిందుస్తాన్‌ – పాకిస్తాన్‌గా విభజింపబడింది. అల్లర్లు మొదలయ్యాయి. అంతేకాదు అటునుండి ఇటు, ఇటునుండి అటు ప్రజల ప్రస్థానం మొదలయింది. మతం పేరు మీద బాహాటంగా హత్యలు, రక్తపాతాలు జరిగాయి. 1946లో పాకిస్తాన్‌ నుండి వచ్చిన శరణార్థుల చాలామంది ఆ మారణహోమంలో పాల్గొన్నారు. స్థానికుల సంఖ్య నామ మాత్రమే. పటియాలలో భుట్టో కుటుంబం ఒకటి ఉండేది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని, ఆ మొహల్లాలోని ముస్లిం కుటుంబాల వాళ్ళందరూ తమని తాము రక్షించుకోవడం కోసం అక్కడ శరణం తీసుకున్నారని ఆనోట ఈనోట వార్తలు రావడం మొదలుపెట్టాయి. పటియాల మహారాజు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెవుల పక్కనుండి ఒక గుండు దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఒక  హిందువు ప్లాన్‌ ప్రకారం కాల్చాడు. అంతే ఆ ఇంటిని టాంక్‌తో పడగొట్టారు. మిలిటరీ వాళ్ళు ఇక్కడి మహమ్మదీయులందరిని రాజ్‌పూర్‌ క్యాంపులోకి తీసుకువెళ్ళారు. సైన్యాన్ని అక్కడి నుండి తొలగించారు. అంతే ధర్మపురాలో నివసిస్తున్న వేశ్యల ఇండ్లపై పిడుగులు పడ్డాయి. శరణార్ధులు ఆ వేశ్యలను నగ్నంగా ఊరేగించారు. ఇందులో స్థానికులు లేరు. మా రెండో అన్నయ్య మహారాజా వారితో వెళ్ళిపోయాడు. అతడు మిలిటరీలో లెప్టినెంట్‌గా పనిచేసేవాడు. సైన్యం కలగజేసుకొని ఆడవాళ్ళందరిని క్యాంపుకు తరలించింది. అన్నయ్య ఇంటికి వచ్చాక అక్కడ జరిగిన విషయాలన్నింటిని మాకు చెబుతూ వుండేవాడు. నాకు  సయిదా గురించిన చింత ఎక్కువ అయింది. ఒక వేశ్య కొడుకైన మా ముస్లిం టీచర్‌ అహ్మద్‌ ఆ మొహల్లాకి కొంచెం దూరంలో నివసించేవాడు. ఆయన కోసం కూడా నేను బాధపడే దాన్ని. వాళ్ళు ఎట్లావున్నారో, ఏమైనారో అని ప్రతి క్షణం బాధ పడేదాన్ని. వాళ్ళు ఎక్కడ వున్నారో కనుక్కోమని నేను మా అన్నయ్యకు చెప్పాను కానీ అతని డ్యూటీ వేరే చోట పడ్డది. నేను నా స్నేహితురాలిని తీసుకుని మా టీచర్‌ హమీద్‌కి స్నేహితుడైన ఒక సర్దార్‌ దగ్గరికి వెళ్లాము. నా అన్నదమ్ములు ఇద్దరు హమీద్‌ కుటుంబానికి కత్తులు, కటారులతో రక్షణ ఇస్తూ క్యాంపులో చేర్పించారు. అక్కడి నుండి ప్రభుత్వం వారు వాళ్ళని రాజాపూర్‌కి పంపించారు. సయిదాను కుడా క్యాంపుకు పంపించారు. మేమిద్దరం పట్టణానికి వెళ్తున్నప్పుడు మా అడుగులు శవాల మీద పడేవి. మేము వణికిపోయేవాళ్లం. నేను అక్కడికి వెళ్ళడం మా ఇంట్లో వాళ్ళకు ఎంత మాత్రం ఇష్టంలేదు. ఇంటికి వచ్చాక నేను దెబ్బలు తిన్నాను. మా కోఠీ(బంగళా) బయట అరుగుమీద కూర్చుని నేను తరచుగా ‘భాపోం’ (శరణార్ధులు)లనూ, అప్పుడప్పుడు మిలిటరీ వాళ్లు స్త్రీలను తీసుకునిపోవడం చూస్తూ ఉండేదాన్ని. మాకోఠీ పక్కన రిసాలే పెరేడ్‌ గ్రౌండ్‌ ఉండేది. ఎదురుగుండా పట్టణం వైపు వెళ్లే సమాన ఊరి మట్టి రోడ్డు ఉండేది. పేరేడ్‌ గ్రౌండ్‌ మొదట్లో రోడ్డు పక్కన ఒక ధనవంతుల ఇల్లు ఉండేది. పెరేడ్‌ గ్రౌండ్‌కి కుడివైపున వెళ్ళేె దారిలో జనరల్‌ హరికా (స్వతంత్య్రం వచ్చాక ఆ రాజ్యానికి ప్రథమ ముఖ్యమంత్రి అయ్యారు.) బంగళా ఉండేది. ఆఫీసర్ల ఇళ్లల్లో దాసీల, ఉంపుడుగత్తెల సంఖ్య పెరిగింది. మా ఇంట్లో ప్రతి రోజు గొడవలేె. నేను ఈ ఆడవాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళాలని అనుకునేదాన్ని. కానీ మా ఇంటి వాళ్ళు బయటికి వెళ్ళకుండా నన్ను కట్టుదిట్టం చేసేవారు. కోపంతో నేను ఏడ్చేదాన్ని, పెడబొబ్బలు పెట్టేదాన్ని. మాదగ్గరికి పశ్చిమ పంజాబ్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌) నుండి ఎందరో స్నేహితులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చేసారు. కొయటాలోని మా ఇంటి యజమాని వాళ్ళ కుటుంబంతో సహా మా ఇంటికి వచ్చేసాడు. మా ఇంట్లో ఉండేవాడు.
ఆ రోజుల్లో డాక్టర్‌ సుశీల్‌ నాయర్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి గురుముఖ్‌ సింగ్‌ ముసాఫి¦ర్‌ ముస్లిం మహిళలను వెతకడానికి పాకిస్తాన్‌ టీమ్‌తో సహా వచ్చారు. ఈ మహిళలను మళ్లీ వెనక్కు తీసుకువెళ్ళాలని ఆయన ఉద్దేశ్యం. పటియాల మహారాణి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసింది. నేను వెళ్ళాను. నన్ను స్పీచ్‌ ఇమ్మన్నారు. నేను బాగా స్పీచ్‌ ఇస్తానని అందరికి తెలుసు. తక్కిన వక్తలందరూ అరిగిపోయిన రికార్డుల్లా ఆడ పిల్లలను వెతికి తెస్తామని వాగ్దానాలు చేసారు. ఆరోజుల్లో హరికా మహారాజు పటియాలకు ముఖ్యమంత్రి అయ్యారు. కింది ఆఫీసర్లు వాళ్ళ ఇళ్ళల్లో పనిచేయడానికి కొంతమంది ఆడపిల్లలను తీసుకువచ్చారు. కొంతమంది ఆడపిల్లలను సుబేదార్లకు, ఇనాందార్లకు బహుమతులుగా ఇచ్చారు. హరికా గారు కూడా మాట్లాడారు. ఆ రోజుల్లో పంజాబ్‌లో మగ పిల్లలకు పెళ్ళిళ్లు కావడం ఎంతో కష్టంగా ఉండేది. వాళ్ళందరికి ఒకరికి బదులు ఇద్దరు భార్యలు దొరికారు. మా ఇంట్లో నీళ్లు నింపే సర్వన్‌సింహ్‌కి కూడా ఒక అమ్మాయి చేతికి చిక్కింది. ఇంతకు ముందు ఏన్నో సార్లు భార్య కావాలనుకుని వాళ్ళ కోసం డబ్బును నీళ్లలా ఖర్చుచేసాడు. ఆ ఆడవాళ్ళు కొంత కాలం అయ్యేసరికి అతని దగ్గర ఉన్న డబ్బు దస్కం, ఆభూషణాలను తీసుకుని ఇంటి నుండి పారిపోయేవారు. పంజాబ్‌లో బ్రహ్మచారులైన యువకులకు, నడివయస్సులో ఉన్న పురుషులకు పెళ్ళిళ్ళు చేసి వారి దగ్గరి నుండి ధనం, దస్కం లూటీ చేసే ముఠాలు ఉండేవి. యిట్లా చేయడం ఒక రకంగా వ్యాపారం. ఇటువంటి ముఠాలు ఎన్నో ఉండేవి. వీళ్ళద్వారా పెళ్ళిళ్ళు జరిగేవి. కొన్నాళ్ళు కాగానే పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు వాళ్ళ భర్తల ఇళ్లలోని డబ్బులు గిన్నెలు గట్రా తీసుకుని పారిపోయేవారు. తరువాత మళ్లీ ఆ ముఠాలలో చేరిపోయేవారు. వీళ్ళందరూ బహూశ ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌ నుండి, బీహార్‌, బెంగాల్‌ల నుండి, పర్వత క్షేత్రాలు – ఇప్పటి హిమాచల్‌, ఉత్తరాంచల్‌ నుండి మోసపోయి వచ్చినవారే. తరువాత వీళ్లే ముఠాలలో పనిచేసేవారు. నేను ఇదంతా సహించ లేకపోయాను. నేను చెప్పాలని లేచాను. నా ఎదురుగుండా ప్రశ్న తలెత్తింది – టు బి ఆర్‌ నాట్‌ టు బి, నిజం చెప్పనా? అపాయాలను నెత్తి మీదకు తెచ్చుకోనా? గీతను దాటి నడవనా? లేకపోతే నాకెందుకని ఊరుకోనా?
” ఈ స్పీచ్‌లు ఇస్తున్న వాళ్ళు, ఆడపిల్లల అన్వేషణ చేస్తామని వాగ్దానాలు చేసే వీరందరు చెప్పేవన్నీ అబద్ధాలే. వీళ్ళ ఇళ్లలోనే ఒక్కొక్క చోట 5గురు, 10మంది దాకా ఆడపిల్లలు ఉన్నారు”. నేను స్టేజీ ఎ్కగానే చెప్పాను.
ఈ మాటలు చెప్పానో లేదో హాల్‌ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ సాధారణ ప్రజలు ఉంటేగా! దాదాపు అందరూ హంతకులే ఉన్నారు. నరసంహారంలో వాళ్ళ పాత్ర ఉంది. ఒకవేళ హంతకులు కానివారు ఎవరైనా ఉన్నా నన్ను శభాష్‌ అనే ధైర్యం వాళ్ళకు లేదు. మహారాణి ఆశ్యర్యంగా నా వంక చూస్తోంది. పెదనాన్నగారైన నిరంజన్‌ ఖోసలా  పటియాలకి లా మంత్రిగా ఉన్నారు. ఆయన భార్య అమర్‌ దేయీ, నాకు పెద్దమ్మ అవుతుంది. అమ్మమ్మ వరుస అవుతుంది. నన్ను కూర్చోపెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. మా నాన్నగారు భయపడుతూ హాలు బయటికి వెళ్లిపోయారు. మా అమ్మ స్టేజికి ముందరే కూర్చుంది. తన అలవాటు ప్రకారం తిడుతూనే ఉంది. ఆమె పళ్లు కొరుకుతూ ఇష్టం వచ్చినట్లు ఏం తిట్లు తిడుతుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ఇది నాకు అలవాటే. తరువాత రాణి మాట్లాడారు. సభ ముగిసింది.
నేను స్టేజీ నుండి దిగగానే బయటకి వచ్చాను. అక్కడ డా|| సుశీల నాయర్‌, ముఖ్యమంత్రి నిల్చుని ఉన్నారు. ‘మీరు నాతో మా ఇంటికి రండి. లేకపోతే మా వాళ్ళు నన్ను చచ్చేటట్లు తంతారు’ అని అన్నాను.
ఆయన మా నాన్న గారిని పిలిచి చెప్పారు – ”ఈ పిల్లను ఏమీ అనకండి. ఈ అమ్మాయి తొణుకు- బెణుకు లేకుండా సత్యం చెబుతుంది. మేము రేపు కలవడానికి మీ ఇంటికి వస్తాము”.
అమర్‌దేయీ – ‘రమణ ఎంతో ధైర్యవంతురాలు’ అని వాళ్ళ ఎదురుగా అన్నది. కానీ అమ్మతో ‘దీనిని కనిపెట్టి ఉండండి, ఇప్పటికే చేయి జారిపోయింది. కంట్రోల్‌లో ఉంచుకోండి’ అని అన్నది. ఆ రోజు నేను రెండు ముఖాల మనుషులను గుర్తించాను. అమర్‌దేయీ సుశీల నాయర్‌ దగ్గర ఒకలా ఉంటే అమ్మ దగ్గర మరోలా ఉంది. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు విధాలుగా ఎట్లా ప్రవర్తిస్తారు. ఒకరి దగ్గర ఒక మాట మరొకరి దగ్గర మరో మాట. ఈ విషయంలో నేను ఎంతో బాధ పడ్డాను. ఆ రోజు మాత్రం నాకు దెబ్బలు పడలేదు. ఆ ఇద్దరు నేతలు మరుసటి రోజున మా ఇంటికి వచ్చారు. ‘నీవు ఇప్పుడు చిన్న దానివి. ముందు చదువుకో. చదువంతా అయ్యాక ఇవన్నీ చెయ్యి’ అని నాతో అన్నారు.
వాళ్ళు వెళ్లగానే నాన్నగారికి జనరల్‌ హరికా దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ‘ఉద్యోగమన్నా మానేయి, లేకపోతే పిల్లనైనా కంట్రోల్‌లో పెట్టుకో’ అని ఆయన రాసారు.
నేను ఇంటర్‌ పరీక్ష ఇచ్చాను. అప్పుడు పంజాబ్‌ ఇంకా చీలిపోలేదు. నా రిజల్ట్‌ ఇంకా రాలేదు. తరువాత దేశ విభజన జరిగింది. పంజాబ్‌ కూడా చీలిపోయింది. పాత పంజాబీ యూనివర్సిటీి వాళ్ళు (సోలన్‌లో స్థాపింపబడ్డ) శరణార్ధుల క్యాంపులకు వెళ్లి మూడు నెలలు సమాజ సేవ చేస్తే డిగ్రి కానీ, సర్టిఫికెట్‌ కానీ ఇస్తామని నిర్ణయించారు. అప్పటికి ఇంకా రిజల్ట్‌ రాలేదు. తరువాత లాహోర్‌ నుండి సర్టిఫికెట్‌ వచ్చింది. సమాజ సేవ చేయడానికి అంబాల్‌లో ఉన్న మామయ్య ఇంటికి నన్ను పంపాలని నిర్ణయించారు. మా మామయ్య జమీందారు కొడుకు. 26 ఎకరాలకు యజమాని, బాగా చదువుకున్నాడు, ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. పూసాలోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో చదివాడు. శ్రీ వేద ప్రకాశ్‌ గుప్తా (తరువాత వీరే నా భర్త అయ్యారు) ఆయన ద్వారానే సహాయక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌గా నియుక్తులయ్యారు. నేను మామయ్య ఇంట్లో ఉన్నప్పుడు గాంధీ గారు నో అఖాలీ అల్లర్ల కారణంగా ఆమరణ నిరాహార దీక్షని మొదలుపెట్టారు. నేను కూడా ఇంట్లో నిరాహార దీక్షను మొదలు పెట్టాను. మా అత్తయ్య కొడుకు రాజేంద్రనంద, గాంధీ గారితో పాటు ఆశ్రమంలో ఉండేవారు. ప్రతాప్‌సింహ్‌ కైరో (పంజాబ్‌ ముఖ్యమంత్రి అయ్యారు) తో పాటు ఇంగ్లీష్‌ వాళ్ళ జైళ్లల్లో ఎన్నో యాతనలు సహించారు. రాజేంద్రనందా అంబాలా వచ్చారు. వారిద్దరికి  నా నిరాహారదీక్ష గురించి తెలిసింది. వాళ్ళిద్దరూ నన్ను మానేయమని ఎంతో నచ్చ చెప్పారు. ఆరోజే గాంధీగారు నిరాహార దీక్ష మానేసారని రేడియోలో చెప్పారు. నా నిరాహార దీక్షని వాళ్ళే విరమింప చేసారు. రాజేంద్రనందా గాంధీగారితో పాటు ఉర్దూ దళితకి సంపాదకుడిగా ఉండేవారు. స్వతంత్ర సంగ్రామం సమయంలో ఆయన జైలుకు వెళ్లారు. మా అత్తయ్య చనిపోయిన ప్పుడు కూడా ఇంగ్లీష్‌ వాళ్ళు తల్లిని చూడటానికి అనుమతిని ఇవ్వలేదు. రాజేంద్రగారు రచయిత, పాత్రికేయులు కూడా.
శరణార్ధుల క్యాంపులో ఎంతో ఉత్సాహంగా పనిచేసేదాన్ని. ఆ రోజుల్లో బలరాజ్‌ సహాని సోదరి ఇక్కడ కరపత్రాలు పంచుతూ ఉండేది. సమావేశాలను ఏర్పాటుచేస్తూ ఉండేది. సమాజవాదం వీళ్లందరి సిద్ధాంతం. కమ్యూనిస్ట్‌ పార్టీని బ్యాన్‌ చేసారు. మా పెద్దన్నయ్య సత్యవ్రత్‌ బేది కమ్యూనిస్ట్‌ పార్టీలో ఉండేవారు. ఆయన అండర్‌ గ్రౌండ్‌ నుండి పనిచేసేవారు. స్వంతత్య్రం వచ్చాక ఆయన రోహతక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ పదవిలో నియుక్తులయ్యారు. లాజ్‌ వదిన జోహరా సైగల్‌ గ్రూప్‌లో సమీనా పేరుతో నృత్యం చేసేది. శీలా భాటియాతో కలిసి ఇప్టాలో ఊరూరు వెళ్లి ధనాడ్యుల, వడ్డీ వ్యాపారస్తుల వ్యతిరేకంగా గీతాలు పాడేది. నాటకాలు వేసేది. విభజన అయ్యాక ఈ కార్యక్రమాలు మూత పడ్డాయి. కరపత్రాల పంపకం, చర్చలు మాత్రం జరుగుతూండేవి.

5.ప్రేమ – పెళ్ళి
జనవరి 30, 1948న గాంధీగారి హత్య జరిగింది. ఈ వార్త విని మేం అందరం ఏడవడం మొదలుపెట్టాము. ఒక ట్రక్‌లో మామయ్య కుటుంబం వాళ్ళు, వాళ్ళ కార్యాలయంలో పనిచేసే వాళ్ళందరు ఒక ట్రక్‌లో ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించారు. దారిలో మా మామయ్య ఆఫీసులో సహాయక ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసే వేదప్రకాశ్‌ గుప్తాతో నాకు పరిచయమైంది. వెనక్కి తిరిగి వచ్చాక మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాము. రాజకీయాల సందర్భంలోనే ఆయనతో నాకు పరిచయమైంది.
నిజానికి ఈ నా నిర్ణయం నా జీవితంలో ఎంతో మహత్వపూర్ణమైన సంఘటన. మా ఇద్దరి కులాలు వేరు. అందులోను ప్రేమ – పెళ్ళి. మాకుటుంబం వారి మర్యాదకు సంబంధించిన విషయం ఇది. మా ఇంటి ఆచారాలకు విరుద్ధంగా నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మామయ్య నన్ను ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా నిర్బంధించారు. అమ్మ వచ్చింది, నానా రభస అయింది. నన్ను కొట్టింది. అయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. నన్ను మళ్లీ పటియాలకు తీసుకువెళ్లారు. నిర్ణయాన్ని మార్చుకోమని రోజూ గొడవ చేసేవాళ్ళు, ఏన్నో సార్లు నన్ను కొట్టారు.
ఒక రోజు నాన్నగారు కోపంగా అన్నారు – ‘ఈ నిర్ణయం మార్చుకొని తీరాల్సిందే లేకపోతే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు విషం తీసుకుని చావాల్సిందే మీ అమ్మ అయినా సరే నువ్వైనా సరే’.
నేను వెంటనే జవాబు ఇచ్చాను – ‘అమ్మ, మీరు జీవితంలోని సుఖాలను చూసారు. ఆనందించారు. నేను ఇంకా జీవితాన్ని చుడాలి. అందుకు నేను చస్తే విషం తీసుకోను, అమ్మ తీసుకుంటుంది’.
నా ఈ మాటలు, ఇట్లా ఎదిరించడం ఎవరికి నచ్చలేదు. పరంపరా వాదులకు, ఆచారాల ఆచరణ ప్రియులకు ఎంత మాత్రం నచ్చలేదు. కఠోరంగా, అప్రియంగా హృదయ విహీనంగా అనిపించాయి. అందరూ ఏవేవో విశేషణాలు చేర్చి మరీ నన్ను తిడుతూ ఉండేవారు. అసలు నేను పట్టుబట్టి ఉండకపోతే నా జీవితం ఏమయ్యేదో ఏమో. నేను అనుకున్నది చేయలేకపోతే ఎంత బాధ పడేదాన్నో ఏమో. అసలు ఆ రోజుల్లో పరంపరకి, ఆచారాలకి వ్యతిరేకంగా నడవడమే నా లక్ష్యంగా మారింది. నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తిరుగుబాటు చేయాల్సిందే. నేను తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యాను.
ఇంట్లో వాళ్ళు ప్రశ్నలేవ నెత్తారు. ‘క్షత్రియుల ఇంటికి కోమట్ల బారాత్‌ ఎట్లా వస్తుంది’! ‘బారాత్‌ రాదు’ అని నేను అన్నాను. ప్రకాశ్‌ ఒంటరిగా మా అన్నయ్య సత్యవ్రత బేది (ఆ సమయంలో ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసారు. ఆ తరువాత ట్రిబ్యూనల్‌ ఉపసంపాదకులయ్యారు) ఇంటికి వచ్చారు. 1948 నవంబర్‌లో నన్ను పెళ్ళిచేసుకున్నారు. తాంబూలాలు పుచ్చుకోవడం లేదు, కట్న కానుకలు లేవు. టెంపరరీగా పనిచేస్తున్న డిప్యూటి కమీషనర్‌ కశ్యప్‌ మా సివిల్‌ మ్యారేజ్‌ చేసారు. మాది దండల మార్పిడి పెళ్ళి. ఎ.డి. అహూజా (తరువాత పంజాబ్‌ కమీషనర్‌ అయ్యారు) మాకు విట్‌నెస్‌ ఇచ్చారు. మా కుటుంబంలో ఇది మొదటి సివిల్‌ మ్యారేజ్‌. ఆడపిల్లల వైపు నుండి ఆచారాలకు వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటు. పురుషులలో మా తాతయ్య చిన్న తమ్ముడు కాంశీరామ్‌ లండన్‌కి చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడి నుండి ఇంగ్లీష్‌ లేడీని పెళ్ళి చేసుకుని తీసుకువచ్చాడు. అప్పుడు కుడా ఇంట్లో భూకంపాలు వచ్చాయి. కానీ ఆయన పట్టుదల చూసి అందరూ నోరు మూసుకున్నారు. కానీ కుటుంబంలో ఇది పురుషుడు చేసిన మొదటి తిరుగుబాటు. ఇంట్లో ఆడది, అందులోను ఇంటి ఆడబిడ్డ తిరుగుబాటు చేస్తే అంత త్వరగా ఎవరూ స్వీకరించరు. ఒకసారి నాన్నగారు విసిగిపోయి అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీ అమ్మ ఒప్పుకోకపోతే ఇద్దరు పారిపోండి. నేను వెతకను కూడా వెతకను. మీ అమ్మ అసలు ఏమీ చేయలేదు (మా నాన్న గారు నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు)
‘పెళ్ళి మీరే చేయాలి. నేను చస్తే వెళ్లిపోను. మీరు ఒప్పుకునేదాకా ఎదురుచూస్తాను’ అని నేను అన్నాను.
ఎదురు చూసినందుకు ఫలితమే దక్కింది. పెళ్ళి కార్డు నేను స్వయంగా అమ్మా నాన్నలకు పంపించాను. ఇద్దరు పెళ్ళికి వచ్చారు. తాతయ్య (మా అమ్మ నాన్నగారు) వచ్చారు. మామయ్య రాలేదు.
ఈ సంఘటనలన్నీ నా జీవిత ప్రారంభ దశలో జరిగినవి. కానీ తరువాత జరిగే సంఘటనలన్నీ ఈ సంఘటనల మీదే ఆధారపడి వున్నాయి. గృహిణినయ్యాను. ప్రకాశ్‌ని నేను నా ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నాను. అందుకే కష్ట సుఖాలన్నీ భరిస్తాను. ఏ కష్టం వచ్చినా నేను మాత్రం అమ్మానాన్నలకు చెప్పను అని నిర్ణయించుకు న్నాను. ప్రకాశ్‌ కుటుంబం వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా మా నాన్న గారి కుటుంబం కన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నారు. అందులోను వాళ్ళది కోమట్ల కులం. అన్ని ఆచారాలను పాటించేవారు. అంటరానితనం కూడా వుండేది. అయినా నేను నా పట్టుదల, నా సంకల్పంతో ఆ పరిస్థితులకు ఎదురీదుతూ అన్నింటిని కాలదన్నుతూ ముందడుగు వేసేదాన్ని. ఎప్పుడూ ఎవరిని దూషించలేదు. మా ఇంట్లో నేను పరదాలో వుండలేదు. అంటరానితనాన్ని సాగనివ్వలేదు. దీనికి వ్యతిరేకంగా నేను మా నాన్నగారి హాస్పిటల్‌లో పనిచేసే ఒక పాకీ ఆమెకు, క్రిస్టియన్‌ యువకుడికి వంటపని అప్పజెప్పాను. ఆ రోజుల్లో కిరస్తానీ వాళ్ళని, మహమ్మదీయులను మ్లేచ్ఛులు అని పిలిచేవారు. హిందువుల ఇళ్లకి వాళ్లని రానివ్వరు. అన్నం నీళ్లు ఇవ్వరు. వాళ్లని ముట్టుకుంటే మైలబడ్డట్లే.
నేను పెళ్లాయ్యాక కూడా చదువును సాగించాను. కవితలు రాసే దాన్ని, నాటాకాలు వేసేదాన్ని నృత్యం చేసేదాన్ని.
నేను బెలెరీనాని కావాలనుకున్నాను. నేను స్వయంగా రాసిన కథలు, కవితలపై బాలె, నృత్య నాటికలు రచించే దాన్ని. స్టేజి మీద చేసేదాన్ని. తరువాత నేను బంబయి(ఇప్పుడు ముంబయి)లో గోపీికృష్ణ దగ్గర కథక్‌ నేర్చుకున్నాను. గౌరీ అమ్మ శిష్యురాలి దగ్గర మద్రాసు (ఇప్పుడు చెన్నై)లో భరతనాట్యం నేర్చుకున్నాను. బాలే నర్తకి కావాలన్న నా కోరిక నెరవేరలేదు.

6. స్వతంత్ర స్త్రీగా ఎదగాలన్న సంకల్పం
ప్రకాష్‌ గవర్నమెంట్‌ ఆఫీసులో పనిచేసేవారు. పెళ్లి అయ్యాక వారు సహాయక ఎంప్లాయిమెంట్‌ ఆఫీసరు పదవిని వదిలిపెట్టి,  ఇంతకు ముందు పనిచేసిన కేంద్రీయ శ్రమ మంత్రాలయలో లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ పదవిని మళ్ళీ కొసాగించారు. తరువాత సహాయక లేబర్‌ ఆఫీసర్‌, క్షేత్రీయ లేబర్‌ ఆఫీసర్‌, తరువాత ఉపముఖ్య లేబర్‌ ఆఫీసర్‌గా పని చేసారు. వారు రిటైర్‌ అయ్యారు. లా కూడా చేశారు. రిటైర్‌ అయ్యాక ఆయన లేబర్‌ ప్రషాసనిక్‌ ట్రిబ్యూనల్‌ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల వైపు నుండి కేసులు తీసుకునేవారు.జలంధర్‌,అంబాలా, భుసావక్‌, అజ్మేర్‌, ఢిల్లీ, ముంబయి,మద్రాసులలో ప్రకాష్‌ పని చేశారు. తరువాత ఇద్దరం 1960లో ధన్‌బాద్‌కి వచ్చాము. ఇక్కడికి వచ్చాక రాజకీయాలలో పని చేయాలని నిర్ణయించుకున్నాను.మొదటి నుండి నేను స్త్రీలు తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని అనుకునేదాన్ని.ఈ ఉద్దేశ్యం తోనే ముందు నేను నిర్ణయం తీసుకున్న తరువాత ప్రకాష్‌కి చెప్పాను. నా దృష్టిలో స్త్రీ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందు భర్త అనుమతి తీసుకోవడం అంటే స్త్రీల హక్కులను కించపరచడమే. ఇద్దరు పరస్పరం ఒకరి అభిప్రాయసలను ఒకరు తెలుసుకోవాలి.మన ఆచారం ప్రకారం ఆడవాళ్ళ పుట్టిళ్ళకు వెళ్ళాలన్నా భర్తల అనుమతి తీసుకుంటారు. ఇక దూరదూరాలకి వెళ్ళాలంటే ససేమిరా కుదరదు.నేను ఈ ఆచారాన్ని నాజీవితంలో ఎన్నోసార్లు పాటించలేదు. అంతేకాదు నాకు ఒక గుర్తింపు రావాలి అనినేను అనుకునేదాన్ని, ఒకవేళ ఎవరైనా ఏ కార్యక్రమాలకైనా మావారి పేరున ఆహ్వానపత్రికలు పంపిస్తే నేను కేవలం ఆయన భార్యగా శ్రీమతి వి.పి.గుప్తాగా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేదాన్ని కాదు. స్పష్టంగా రాను అని చెప్పేదాన్ని. నన్ను అందరు నన్నుగా గుర్తించాలి అంతేకాని ప్రకాష్‌ భార్య కావడం వలనకాదు.నా మనస్సులో ఈ భావం లోతుగా పాతుకుపోయింది. ధన్‌బాద్‌లో ఉన్నప్పుడు ప్రకాష్‌కి కాన్‌పూర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది. పిల్లలని వదిలి ఒంటరిగా ఉండాలా, కాన్‌పూర్‌ వెళ్ళాలా అన్న ప్రశ్న తల ఎత్తింది. నేను ధన్‌బాద్‌లో సమాజ సేవకురాలిగా పనిచేసే దాన్ని. నాకు గుర్తింపు వచ్చింది. భారత్‌ సేవక్‌ సమాజ్‌ పేరున ఎన్నోసంస్థలు తెరువబడ్డాయి.అక్కడ నిమ్నవర్గం వాళ్ళ గృహిణులు, గ్రామీణ మహిళలు, పిల్లలు శిక్షణ తీసుకునేవాళ్ళు. ఐదు గ్రామాలలో ఇట్లాంటివి ఐదు సంస్థలను నడిపేవాళ్ళం ధన్‌బాద్‌లో సరిగ్గా ఎస్‌.పి. సాహెబ్‌ ఇంటి ఎదురుకుండా, లక్ష్మీ నారాయణ ట్రస్ట్‌ మహిళా కాలేజీ ఎదురుకుండా, గృహిణుల కోసం కుట్టు శిక్షణ కేంద్రాలతోపాటు మహిళా కోపరేటివ్‌ల కింద వాళ్ళకి కుట్టుపని ఇచ్చి పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్ళం. దాదాపు 150 మంది మహిళలు ఇంటి పనులు చేసుకుని పార్ట్‌టైమ్‌ సంపాయించుకునే వాళ్ళు. నేను ఈ సంస్థలని సెక్రెటరీని. నేను పిల్లల కోసం బాల్‌వాడీలను కూడా తెరిచాను. ముగ్గురు నల్గురు టీచర్లని కూడా పెట్టుకున్నాను. నేను కాన్‌పూర్‌ వెళ్ళాలంటే ఈ సంస్థలన్నింటిని మూసివేయాల్సి వస్తుంది. నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టమైన పని. నా చిన్నకుతూరు తరంగ్‌ వయస్సు మూడు నాలుగు సం||లు. నా ముందున్న ప్రశ్న ఒక్కటే సంస్థలను మూసివేయకూడదు ఎట్లా? నేను ధన్‌బాద్‌లో ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంటే సంస్థలను మూసివేయకూడదు. అన్న నిర్ణయం తీసుకున్నానన్నమాట. మా కుటుంబంతో కాన్‌పూర్‌ వెళ్ళడంకన్నా ఈ సంస్థల మీద ఆధారపడ్డ స్త్రీల బతుకుతెరువును పోగొట్టకూడదు, ఇదే ముఖ్యం. ఒక స్వతంత్ర స్త్రీగా అంటే స్వయంసిద్ధంగా బతకాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. నా ఉద్దేశ్యంలో ఎవరి కుటుంబం కోసం వాళ్ళు ఎటూ చేసుకుంటారు కాని పరాయి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయడమే మానవత్వం. నేను ధన్‌బాద్‌లో ఉండిపోయాను. అందరు ఈ నిర్ణయాన్ని ఏ మాత్రం సహృదయంతో స్వీకరించలేదు. పైగా ఇది క్రూరత్వమని, కుటుంబం పట్ల కర్తవ్యాన్ని విస్మరించడం అని నన్ను దూషించారు. నేను దీన్ని త్యాగంగానూ, కర్తవ్యంగానూ భావించాను. 1964 సం||లో ఇదంతా జరిగింది. ప్రకాష్‌కి ప్రమోషన్‌ వచ్చింది. కాన్‌పూర్‌ వెళ్ళాల్సి వచ్చింది. ఇద్దరు కూతుళ్ళను ఆయన తీసుకువెళ్ళారు. వాళ్ళని లక్నోలోని లా మార్డేనియర్‌ స్కూల్‌ హాస్టల్‌లో చేర్పించారు. కొడుకు ఉమింగ్‌ పావెల్‌ ధన్‌బాద్‌ డిన్‌వాడి పబ్లిక్‌ స్కూల్లో చదివేవాడు. కుంజ్‌పూరా కర్‌వాల్‌ సైనిక్‌ స్కూల్‌కి సెలెక్ట్‌ అయ్యాడు. వాడిని అక్కడ చేర్పించాము.                                            (ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

One Response to నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

  1. sreenivas says:

    మంచి కథనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.