(బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి. ఓ అసాధారణ స్త్రీమూర్తి. ఇది ఆమె జీవిత చరిత్ర. సంగీత సాహిత్య సామాజిక రంగాల్లో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనది. ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు. తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన విదుషీమణి.
ముద్దు పళని ‘రాధికా సాంత్వనము’ను ప్రచురించి వీరేశలింగం వంటి ఉద్ధండులను ఎదుర్కొన్నా, ముళ్లతుప్పల మధ్య అనాదరంగా పడి ఉన్న త్యాగరాజ సమాధిని చూసి చలించిపోయి తిరువయ్యారుకు కొత్తశోభను తీసుకువచ్చినా, దేవదాసీ హక్కులకోసం ధైర్యధిక్కారాలతో పోరాడినా అది నాగరత్నమ్మకే చెల్లింది.
స్త్రీవాదిగా నాగరత్నమ్మ జీవితం దేవదాసీల పట్ల మనకుండే అపోహలను పటాపంచలు చేస్తుంది. వారిని లైంగిక జీవులుగా, అనైతిక ప్రాణులుగా హీనంగా చూసే మన సమాజ ధోరణి ఎండగడుతూ… వారిని కూడా మనలో ఒకరిగా చూసే కొత్త చూపును మనకందిస్తుంది. ఈ మహత్తర వ్యక్తి జీవిత చరిత్రకు అంతటి ప్రాశస్త్యం ఉంది.)
ఒంటినిండా నగలతో, గుర్రబ్బండి మీద వచ్చిన నాగ రత్నమ్మ అందమైన రూపం తిరువయ్యారు నిద్రమత్తుని ఒక్కసారిగా వదిలించింది. నాగరాజ భాగవతార్ కూడా ఆమె పట్ల మంత్ర బద్ధుడై వున్నాడు. చుట్టూ వున్న వాళ్ళకి ఆమె గురించిన వివరాలు గుసగుసగా చెప్పాడు. గుర్రాలని వూడదీసి బండిని సుడి వేయగానే నాగరత్నమ్మ తన స్థూలకాయంతో అరుగు మీద నిదానంగా కాలు మోపి దిగింది. అక్కడే కూర్చుని రాముడు భాగవతార్ కోసం కబురు పెట్టింది. అతను వచ్చేలోపు ఆవిణ్ణి కావేరి ఒడ్డున మంగళవారపు రేవుకి తీసుకెళ్ళారు. దాని పక్కనే మహరాష్ట్ర శైలిలో కట్టిన అందమైన సత్రం వుంది. ఆమె ఆ ఊరు ఎప్పుడొచ్చినా అక్కడే బస చేసేది.
కాసేపట్లో రాముడు భాగవతార్ రాగానే తనని త్యాగరాజు సమాధి దగ్గరికి తీసుకు వెళ్ళమంది నాగరత్నమ్మ. సంగీతపరంగా త్యాగరాజుకీ, అతనికి ఎంత తేడానో ఆకారంలో ఆమెకీ బక్క చిక్కిన అతనికి అంతతేడా. ఆనాటి నుంచి అతను నాగరత్నమ్మకి కుడి భుజంలా మెలిగాడు. అతను లేమిలో వుండడం వల్ల దయామయి, ధనవంతురాలు నాగరత్నమ్మ అండ తనకి కొండంత ఆధారమవుతుందని అనుకున్నాడేమోమరి. ఇద్దరూ సమాధి దగ్గరికి నడిచారు. ”సమాధి చుట్టు అంతా పరమచీదరగా వుంది. అది చూసి నాకు చాలా బాధ కలిగింది…. ఇక మహానుభావుడి అస్థికలు అక్కడ పాతిపెట్టినట్టు రాసిన ఒకరాతిపలక మాత్రం వుందక్కడ” అని ఆమె రాసుకుంది. ”చుట్టూ ముళ్ళ కంపలూ, వెదురుపొదలూ, పాములు వుండడంతో పగలు కూడా అక్కడికి పోవడం కష్టం” అని కూడా ఆమె తర్వాత చెప్పింది.
సమాధిని ఆ స్థితిలో చూసినప్పుడు ఆమె పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘సమాధి బాగుకోసం తన జీవితాన్ని అంకితం చెయ్యడానికి ఆ వేదన ఒక ప్రేరణ అయింది. ఏదో ఒక దేవుడి సేవకి అంకితమవ్వడం, తర్వాత ఒక పోషకుడి ఆశ్రయం పొందడం దేవదాసీ వ్యవస్థలోని ప్రతి ఆడపిల్లకీ ఒక ఆనవాయితీ. తన బాల్యంలో పేదరికంలో మగ్గిన నాగరత్నమ్మకు ఏ గుడికయినా అంకితమయ్యిందో లేదో తెలియదు. కాని చాలా మంది పోషకులుండేవారు. కానీ యిప్పుడు తన 43వ ఏట ఇలవేలపు, దేవుడు, పోషకుడు ఒకరే అయ్యారు. అప్పటి నుంచీ తనని తాను త్యాగరాజ దాసిగా చెప్పుకుంది.
ఆమె ఆదర్శవాది మాత్రమే కాదు, ఆచరణశీలికూడాను. ఆస్థలంలో సరైన నిర్మాణం చేపట్టే ముందు దానికి సంబంధించిన పత్రాలు కూడా వుండాలని గ్రహించింది. నాగరత్నమ్మకి తంజావూరులోని చాలా మంది సంపన్నులతో సంబంధముంది. అందులో టి.ఏ. రామచంద్రరావు ఆమెకి సాయం చెయ్యడానికి ముందుకొచ్చాడు. అతను వాకబు చేస్తే, ఆ స్థలం సూర్వే వంశస్థుల అజమాయిషీలో వుందని తెలిసింది. వాళ్ళ కుటుంబీకుడు మన్నప్ప సాహెబ్ సూర్వే ఆ భూముల ధర్మకర్త. 1855 లో మహరాష్ట్రుల పాలన అంతమయ్యాక చాలా జమీందారీ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అదే స్థితిలో వున్న సూర్వే వారు ఆ భూములు అమ్మేందుకు సిద్ధంగా వున్నారు. కాని ధార్మిక వ్యవహారాలకి అమ్మ కూడదు. అందుకని రిజిష్టర్ చేయడానికి తాశిల్దారు ఒప్పుకోలేదు. అందుకోసం ఒక ఉపాయం దొరికింది. అంతే విలువగల భూమి మారకం చేయవచ్చు. నాగరత్నమ్మ తనకున్న ఖరీదైన సారవంతమైన భూమి యిచ్చేసి, చాలా ఖర్చు పెట్టి మరమ్మత్తు చెయ్యాల్సిన ఆ స్థలం కొనుక్కుంది. ఈ పనులన్నీ ఆవిడ అతివేగంగా పూర్తి చేసింది. ఆమె తిరుపయ్యారుకి వచ్చిన వారానికే ఈ లావాదేవీలన్నీ పూర్తి అయ్యాయి. 1921, ఆక్టోబర్ 27న సమాధి మీద ఆలయ నిర్మాణం మొదలయ్యింది.
రెండు కచ్చివర్గాల వారికీ నాగరత్నమ్మ చేస్తూన్న పనుల గురించి తెలిసినా, ఏమీపట్టించుకోలేదు. ఆమె గోవింద స్వామి పిళ్ళైని ముందు త్వరగా కలిస్తే బాగుంటుందని నాగరాజ భాగవతార్ కోరిక. అందుకని ఇద్దరూ తిరుచ్చి వెళ్ళారు. ఆ వైలిన్ విద్వాంసుడు ఆమెని ఆశీర్వదించడమే కాకుండా ఆమెకి కొద్దిరోజులు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. ఇద్దరికీ వీణధనమ్మాళ్ అంటే అభిమానం. వాళ్ళ మధ్య అనుబంధానికి అది కూడా ఒక కారణం. చిన్నకచ్చికి చెందిన శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌కి నాగరత్నమ్మ సమాధి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం నచ్చకపోయినా, ఆలయ నిర్మాణం గురించి ఆనందమే; కాని ఏమీ పట్టించుకోలేదు.
తర్వాత మద్రాసు చేరుకున్న నాగరత్నమ్మ రాముడు భాగవ తార్ వల్ల ఎప్పటి కప్పుడు ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుంటూ వుండేది. పని బాగా సాగుతూండడంతో చాలా సొమ్ము అవసరమ య్యేది. దాంతో అమె సంగీత కార్యక్రమాల వేపు చురుగ్గా కదిలింది. ఉధృతంగా కచేరీలు చేపట్టింది. వచ్చిన ప్రతిరూపాయీ ఆలయానికే ఖర్చుచేసింది. దాంతో పని ఆగకుండా సాగింది. గోవిందస్వామి పిళ్ళై, రాముడు భాగవతార్‌లతో కలిసి పర్యవేక్షణ చేసేది. తీరిక దొరికినప్పుుడల్లా తిరువయ్యారు వెళ్ళి నిర్మాణ వ్యవహారాలు పట్టించుకునేది. తిరిగి వెళ్తూన్న ప్రతిసారీ దాని అభివృద్ది గురించి మరింత వుత్సాహం, శక్తి పుంజుకునేది. ఇన్ని పనుల్లో మునిగికూడా తన సంరక్షణలో వున్న బన్నీబాయి దినదినాభివృద్ధిని గమనిస్తూనే వుండేది. 1924లో బన్నీబాయి మొదటి హరికథకి కూడా హాజరయ్యింది. మరో మంచి కళాకారిణి తయారయ్యింది.
ఈ సమయంలో చిన్న కచ్చి వాళ్ళకి అంతర్గతంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పనిపాటల తీరులో శూలమంగళం పెత్తనం ఎక్కువయ్యింది. ఇది నచ్చని కొందరు సంగీత విద్వాంసులు 1923లో విడిగా ఆరాధన నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. తమ సంస్థకి శ్రీ త్యాగరాజ పరబ్రహ్మ భక్తగాన సభ అని పేరు పెట్టుకున్నారు. చిన్న కచ్చి బృందం మొదలు పెట్టిన పచ్చయప్ప మొదలియార్ సత్రంలోనే వీళ్ళూ ఆరాధన చేశారు. కాని నిర్వాహణ లోపాల వల్ల జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇది తెలిసిన శూలమంగళం తమకి మూడో వర్గంతో ఏమీ సంబంధం లేదని పత్రికలకి ఉత్తరాలు రాశాడు. ఈ తేడాల వల్ల బాధపడి శూలమం గళం 1924లో తమ వర్గం ఆరాధన జరపకూడదని నిర్ణయించాడు. దాంతో చాలామంది దాతలు మూడో వర్గానికి విరాళాలు నిలిపేశారు. అందుకని 1924లో వాళ్ళు ఆరాధన చేసినా 350/- రూ||లు నష్టం వచ్చింది. అదంతా సభవాళ్ళే పెట్టుకున్నారు. ఇక వాళ్ళకు ఆసక్తి తగ్గిపోయి 1925లో చెయ్యవద్దనుకున్నారు. దాని కోసమే ఎదురు చూస్తున్న శూలమంగళం విజయగర్వంతో 1925 ఆరాధన ఏర్పాట్లు మొదలుపెట్టాడు. అందుకని పెద్ద ఎత్తున రంగం సిద్ధమయ్యింది.
1925లో తిరువయ్యారు వచ్చిన వాళ్ళు సమాధి చుట్టూతా వచ్చిన మార్పులు చూసి అవాక్కయ్యారు. కావేరి ఒడ్డున కొబ్బరి చెట్ల నీడన నడుస్తూ సమాధి చేరుకుంటున్నారు. ముళ్ళ కంచెల స్థానంలో చక్కటి ప్రహారీ గోడ వచ్చింది. పల్లంగా వుండే ఆ స్థలమ ంతా ఇసుకతో పూడ్చారు. గుండ్రటి గోపురంతో చతురస్రాకారపు గడి తయారయ్యింది. ముందు వైపు కటకటాల గేటుకి రాత్రిపూట తాళం వేస్తారు. నాగరత్నమ్మ కాపలాదారుని ఏర్పాటుచేసింది. గేటుదాటగానే, లోపల విఘ్నాలు రాకుండా కాచే భోగగణపతిగుడీ, తొందరగా పనులు పూర్తి అయేలా చేసే యోగ ఆంజనేయగుడి – చిన్నవి వుంటాయి. అక్కడ ఆలయ నిర్మాణం మొదలవుతూండగా ఈ గుళ్ళు కట్టించింది నాగరత్నమ్మ. త్యాగరాజ సమాధికి వెళ్ళే దారిలో మిగిలిన సన్యాసుల బృందావనాలు చిన్నవికూడా వున్నాయి. వాటిని అలాగే వుంచమని నాగరత్నమ్మ అన్నది. అందుకని సమాధికి వెళ్ళే నడవలో వుంటాయవి. గర్భగుడి కట్టేటప్పుడు ఇలాంటి చిన్న సమాధి ఒకటి లోపల వుంది. దాన్ని అలాగే వుంచేశారు.
త్యాగరాజు గర్భగుడి కూడా మార్చేసారు. మరో ప్రముఖ హరికథకురాలు పద్మాసినీబాయి ఇచ్చిన వెండిగిన్నెలు పూజకు వాడేవారు. ఇవన్నీమంచి విషయాలే కాని కొన్నిమార్పులు విమర్శకి గురి అయ్యాయి. బృందావనానికి కొన్ని రాతి పలకలు అంటించారు. పైన తులసి తీసేసి అక్కడ మూసేసారు. అలా మూయడం పంచమహాపాతకాల్లో ఒకటని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని తిరువయ్యారులో ఉన్న సనాతన వాదులు అభ్యంతరపెట్టారు. ఉమయాల్పురం సోదరుల పేర్లున్నరాతి పలక మాయమైంది. సన్యాసి రూపంలో నల్లరాతి విగ్రహాన్ని సమాధి ముందు పెట్టించింది. ఇది నాగరత్నమ్మ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. గర్భగుడిలో పెట్టించాల్సిన విగ్రహం గురించి ఆవిడ నెలల తరబడి ఆలోచించింది. ఆ బృందావనాన్ని అలాగే వదిలివేయడం ఆమెకు ఎందుకో మనస్కరించలేదు. చివరకి త్యాగరాజు విగ్రహం పెట్టడమే సరైన నిర్ణయం అనిపించింది. గోవిందస్వామి పిళ్లైతో ఈ సంగతి ప్రస్తావిస్తే తిరుచ్చిలోని ఒక శిల్పిని ఆమెకి పరిచయం చేసాడు. తనకి కలలో కన్పించిన త్యాగరాజు ఆకారాన్ని ఆమె అతనికి వర్ణిస్తే దాన్ని బట్టి విగ్రహం తయారైంది. కానీ ఈ విగ్రహం కొందరికి నచ్చలేదు. మరీ ముఖ్యంగా శూలమంగళం వైద్యనాధ భాగవాతార్ ఈ విగ్రహం కరుప్పణ్ణ స్వామిలాగా ఉందని ఎగతాళి చేసాడు. నల్లగా వుండటం వల్ల కావొచ్చు. కానీ అదంతా ఆవిడ సొంత ఆస్తి కావడంతో ఎవరేమన్నా ఆవిడ తన ఇష్ట ప్రకారం చేసింది. 1925, జనవరి 7న దేవాలయాన్ని శుద్ధిచేసి విగ్రహ ప్రతిష్ట చేసారు. చాలా మంది బ్రహ్మలు, సంపన్న దాతలు మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో స్త్రీలు హాజరయ్యారు. అన్ని దేవాలయాల్లో లాగానే ఇక్కడ కుడా రెండు పూటలూ పూజలు జరగాలని ఆమె నిర్ణయించింది. రాముడు భాగ వతార్‌ని పూజలు చేయమంది. త్యాగరాజు 108 పేర్లతో ఒక అష్టో త్తరాన్ని స్వయంగా తయారుచేసి రోజూ పూజతో పాటు చదవమంది.
కర్ణాటక సంగీత ప్రపంచం ఆనందంతో పొంగిపోయింది. ఆఖరికి ఆ మాహాత్ముడికి ఒక ఆలయం ఏర్పడింది. పండితుడు, ‘కీర్తనాచార్య’ సి.ఆర్. శ్రీనివాస్ అయ్యంగార్ నాగరత్నమ్మకి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం రాశారు. ”దక్షిణభారతంలో ఉన్న లక్షలాది సంగీత ప్రియులలో కల్లా నువ్వే అచ్చమైన శిష్యురాలివని నిరూపించుకున్నావు. నీకున్న అవకాశాలని సద్వినియోగపరచి త్యాగరాజు జ్ఞాపకార్ధం కట్టడం కట్టించావు.ఏ రాజుగానీ, భూస్వామిగానీ, గాయకుడుగానీ ఈ కీర్తిని దక్కించుకోలేదు. మా అందరి ధన్యవాదాలూ అందుకోండి” అంటూ తిరువయ్యారులో ఉన్న ప్రముఖ వకీలు సి.వి. రాజగోపాలాచారి కుడా అబ్బుర పడిన వారిలో ఉన్నారు. చిన్నకచ్చి వాళ్ళ కార్యమ్రాల్లో ఈయనది ప్రధాన పాత్ర. నాగరత్నమ్మ త్యాగానికి ముగ్ధుడై ఆమెకు భక్తుడయ్యాడు.
వచనంలోను, పద్యంలోను ఈమెను అభినందిస్తూ ఎన్నో రచనలు వచ్చాయి. హరినాగభూషణం, పారుపల్లి రామక్రిష్ణయ్య, కోన వెంకటరామశర్మ ఈమెని మెచ్చుకుంటూ తెలుగులో రాసారు. తిరుచ్చి నుంచి ‘హిందు’ పత్రికలో టి.ఎస్. గణేష్‌అయ్యర్ అనే ప్రభుత్వ ఫ్లీడర్ ”బెంగుళూరు నాగరత్నమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆవిడ ఔదార్యం, భక్తి వల్ల నదీతీరాన ఆలయం కట్టగలిగారు. అని రాశాడు. అంతేకాదు అక్కడ వున్న చిన్న చిన్న స్పర్ధల వల్ల అసలుకే మోసం రాగలదని భయపడుతూ, రెండు వర్గాల వాళ్ళూ ఐక్యంగా ఆరాధన చక్కగా సక్రమంగా జరిపి శాంతిని, కాంతిని, ఆనందాన్ని చేకూర్చమని ఆ వ్యాసంలో ప్రార్ధించాడు.
నాగరత్నమ్మకి ప్రీతి పాత్రమైన కోరికకూడా అదే. ఆనాటి ఉత్సవాలకి వారం రోజులు ముందుగానే ఇరువర్గాలనీ కలిసి వీలైనంత తొందరగా సమావేశానికి రమ్మని ఆహ్వానించింది. ఆరాధనకి ముందు రోజు నాగరత్నమ్మ వున్న సత్రంలో సమావేశం జరిగింది. గోవిందస్వామి పిళ్ళై, వైద్యనాథభాగవతార్ కూడా మిగిలినవారితో పాటు వచ్చారు. మామూలు వ్యవహారాలు మాట్లాడాక, అందరూ కలిసి జరిపే ఆరాధనలో పూజ ఎవరు చేయాలనే అసలు విషయం గురించి చర్చ వచ్చింది. సమాధికి అభిషేకం, పూజ రాముడు భాగవతార్ చెయ్యాలని గోవిందస్వామి పిళ్ళై అన్నాడు. నాగరత్నమ్మకు కూడా అదే నచ్చింది. కాని వైద్యనాథ భాగవతార్ అభిప్రాయంలో త్యాగరాజుని హింసించిన అన్న వంశం వాడి కన్నా, త్యాగరాజు శిష్యుడైనా, మరే సంగీత వారసుడు అయినా పూజ చేస్తే త్యాగరాజుకి ఆనందం కలుగుతుంది. అందుకని రాజగోపాల భాగవతార్ పూజ నిర్వహించాలని అతను గట్టిగా విజ్ఞప్తి చేశాడు. అతని మొండి వైఖరికి కోపమొచ్చిన గోవిందస్వామి పిళ్ళై సమావేశం నుంచి బయటికి వెళ్ళి పోయాడు. కాని వెళ్తూ వెళ్తూ, మర్నాడు చిన్న కచ్చి వాళ్ళ పూజ జరగనివ్వనని బెదిరించాడు. ఎప్పటిలాగానే వైద్యనాథ భాగవతార్ ప్రశాంతంగా ‘త్యాగరాజు కోరిక ప్రకారమే అంతా జరుగుతుంది’ అన్నాడు. కానీ అంతరంగంలో అతను చెయ్యవలసిన దాన్ని గురించి ఆలోచించాడు.
ఆ రాత్రే తన బృందంతో కలిసి తిరువయ్యారు సబ్‌మేజస్ట్రేట్ దగ్గరకి వెళ్ళాడు. మార్నాడు వాళ్ళపూజ నిర్విఘ్నంగా జరగడానికి ఆయన్ని అక్కడికి రమ్మన్నాడు. ఆయన వెంటనే గోవిందస్వామి పిళ్ళైని పిలిపించాడు. మార్నాడు చిన్న కచ్చివాళ్ళ పూజకి అడ్డం రానని అతనితో మాట తీసుకున్నాడు. తరవాత నారత్నమ్మ రాముడు భాగవతార్‌లని కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయాలడిగాడు. ఆ ఆస్తి తనది కాబట్టి సమాధి దగ్గరకి ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో నిర్ణయించే హక్కు తనదేనని దృఢంగా నాగరత్నమ్మ చెప్పింది. చిన్న కచ్చివాళ్ళు ఐక్యతకి అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళు రాకూడదని ఆమె అభిప్రాయం.
శూలమంగళం మంచి వక్త, అతను ఇదంతావిని, వేదాల నుంచి వుటంకిస్తూ సమాధుల దగ్గర పూజచేసే అధికారం అందరికీ వుందనీ, దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదనీ నచ్చచెప్పే ధోరణిలో చెప్పాడు. దానితో ఏకీభవిస్తూ అక్కడ ప్రశాంతత వుండాలంటే రెండు వర్గాల వారూ సమయపాలన పాటిస్తూ, ఆరాధన చెయ్యాలని సబ్ మేజస్ట్రేటు తీర్పు చెప్పాడు. పెరియ కచ్చివాళ్ళు ఉదయం ఆ నుంచీ 9 దాకా, చిన్న కచ్చివాళ్ళు 9 నుంచీ 12 దాకా ఆరాధన చెయ్యాలని చెప్పాడు. వాళ్ళు అంగీకరించారు. కానీ నాగరత్నమ్మకి లోలోపల అసంతృప్తి వుంది.
మర్నాడు పెరియ కచ్చివాళ్ళు తొమ్మిదింటికి పూజ ముగించుకుని వెళ్ళారు. చిన్న కచ్చివాళ్ళు ఇంకా రాలేదు. నాగరత్నమ్మ ఆదేశం మేరకి రాముడు భాగవతార్ తాళంవేసుకుని వెళ్ళిపోయాడు. చిన్న కచ్చివాళ్ళు వచ్చి తాళం చూసి రెచ్చిపోయారు. కాని వైద్యనాథ భాగవతార్ ఏమీ ఖంగారు పడకుండా సబ్ మేజస్ట్రేటుకి కబురు పెట్టాడు. అతను పోలీసు పటాలంతో వచ్చి తాళం పగలగొట్టమన్నాడు. ఇదంతా దూరం నుంచి చూస్తూన్న రాముడు భాగవతార్ పరుగెత్తుకుంటూ వచ్చి తాళం తీశాడు.
త్యాగరాజు సమాధి దగ్గరికి పోలీసులు రావడం అదే మొదటిసారీ, ఆఖరిసారి కూడానేమో. వాళ్ళు దగ్గరుండి చిన్నకచ్చి వాళ్ళ పూజ జరిపించారు.
గోవింద స్వామి పిళ్ళై, నాగరత్నమ్మల ప్రయత్నాల్ని అడ్డగించగలిగినందుకు వుత్సాహంగా చిన్నకచ్చివాళ్ళు ఆ సంవత్సరం పెద్ద ఎత్తున ఆరాధన జరిపారు. పల్లడం సంజీవరావు వేణుగానానికి ముచ్చటపడి స్థానికి భూస్వామి ఒకరు సుమారు మూడువేల రూపాయల విలువ వున్న నవరత్నహారం బహూకరించాడు. మంగుడి చిదంబర భాగవతార్ చెప్పిన ‘రామ పట్టాభిషేకం’ హరికథ వినడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. దాంతో ఒక చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిన్నకచ్చివాళ్ళ విజయోత్సాహం చూసి మండిపడ్డ మూడో వర్గం వాళ్ళు పెరియ కచ్చివాళ్ళ వంట మనిషికి (త్యాగరాజుకి సేవ చేసినందుకు) బంగారు పతకం బహూకరించి సన్మానించారు. ఆనాటికి ఆరాధన గురించి జనానికి బాగా తెలిసింది. అప్పుడప్పుడే పేరులోకి వస్తూన్న విద్వాంసులు తమ వాగ్గేయ కారుడి స్మృతి చిహ్నం దగ్గర పాడితే తమకి మంచి జరుగుతుందనే భావంతో వచ్చేవారు. చాలామంది గాయకులు వుండటంతో, సమయపాలన ఖచ్చితంగా పాటించమని రెండువర్గాల కళాకారులని కోరారు. ఎవరై నా పాటించకపోతే 1920లో నయనా పిళ్ళైకి జరిగినట్టు జరిగేది. సాయంకాలాలు ఒక సంగీత కచేరి, ఒక హరికథ మాత్రమే వుండేవి.
1926లో నాగరత్నమ్మ మరో ఎత్తు వేసింది. ఆరాధన సమయానికి తిరువయ్యారులో ఎ.వి.సుబ్బయ్య అనే సెకండ్‌క్లాస్ మేజస్ట్రేట్‌కి అర్జీ పెట్టుకుంది. రాముడు భాగవతార్ హక్కుల్ని గుర్తించిన వాళ్ళే అక్కడ పూజలు చెయ్యొచ్చునని దాని సారాంశం. వైద్యనాథ భాగవతార్, అరియకుడి మొదలైన వాళ్ళని రమ్మని వాంగ్మూల మివ్వడానికి 1926 జనవరి 3న మేజస్ట్రేట్ ఎదుట హాజరు కమ్మని సమన్లు జారీ అయ్యాయి. రాముడు భాగవతార్ మాత్రం నాగరత్నమ్మ తనని కాపాడడానికి వస్తుందేమోనని ఆఖరిదాకా కోర్టుకి వెళ్ళలా. కానీ ఆమె రాకపోవడం ఆశ్చర్యం. బహుశా తన కేసు వీగిపోతుందేమోనన్న శంకవున్నదేమో. అయిష్టంగానే రాముడు భాగవతార్ తల ఒగ్గాడు. ‘తన పక్షాన వున్న వారు’ వస్తారని ఎదురు చూసి ఇక రారనుకున్నాక రాజగోపాల్ భాగవతార్ చేసిన పూజ సరైనదేననీ, దానికి తన అభ్యంతరం ఏమిలేదని అన్నాడు. వాళ్ళు పూజ చేసుకోవడానికి తాను తలుపులు తెరిచే వుంచుతానని చెప్పాడు. అంతక్రితపు మేజస్ట్రేట్ చెప్పినట్టే పూజాసమయాన్ని ధృవీకరించి, ఆరాధన సమయంలో ఎలాంటి అల్లర్లు లేకుండా చూడమని పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరుని కోరాడు.
చిన్న కచ్చివాళ్ళ అనందానికి పట్టాపగ్గాల్లేవు. ఆ సంవత్సరం విరాళాలు చాలకపోతే అప్పుచేసి అయినా సరే ఆరాధన చాలా పెద్ద ఎత్తున చెయ్యాలని నిర్ణయించుకున్నారు. పుష్యమండపం చాలదని శ్రీనివాసరావు హైస్కూలు ఆవరణలో ఆరాధనకి నిర్ణయించారు. విరాళాలకోసం తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌లో వున్న 108 స్తంభాల హాల్లో కచేరీలు నిర్వహించారు. వైద్యనాథ భాగవతార్ కోరగానే నాటకసంస్థ యజమాని కన్నయ్య వుదారంగా విరాళం ఇచ్చాడు. ఇహ అప్పట్నించీ నాగరత్నమ్మ వల్ల చిన్నకచ్చి వాళ్ళకి ఏ ఆటంకమూ రాదని స్పష్టమయింది. కాని వాళ్ళ వర్గంలో వున్న నాగస్వర కళాకారుల దగ్గర్నుంచీ సమస్యలు ఎదురయ్యాయి. సమాధి దగ్గరికి వాళ్ళని రానివ్వక పోవడం కారణంగా వాళ్ళు తమకీ ప్రవేశం కల్పించాలని పేచీపెట్టారు. వైద్యనాథభాగవతార్ ఒప్పుకోలేదు. దానికి బెదరకుండా వైద్యనాథభాగవతార్ తనతో వుండే నాగస్వర విద్వాం సుల్ని తంజావూరు నుంచి పిలిపించి, పూజ నిర్విఘ్నంగా జరిపేశాడు.
పెరియకచ్చి, నాగరత్నమ్మ అప్పటిదాకా కలిసికట్టుగానే వున్నారు. కానీ కొద్ది రోజులకే, ఆరాధనలో స్త్రీలని పాల్గొననివ్వ కపోవడం గురించి ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. నాగరత్నమ్మ దృష్టిలో త్యాగారాజు అందరి పూజలూ అందుకోవలసిన మహాత్ముడు. 1925లో శూలమంగళం వైద్యనాథభాగవతార్ సబ్‌మేజస్ట్రేట్ ఎదుట తన వాంగ్మూలంలో త్యాగరాజు సమాధిని కాశీలోని విశ్వనాథుడి శివలింగంతో పోల్చాడు. అక్కడి లాగానే లింగ కుల ప్రసక్తి లేకుండా ఇక్కడ కూడా ఎవరైనా పూజ చెయ్యొచ్చు. అంటే స్త్రీలు కూడా త్యాగరాజు ఆరాధనలో పాల్గోవచ్చు. పెరియకచ్చివాళ్ళ ఆరాధనలో ఆమె ఈ హక్కుని వుపయోగించదలచుకుంది. పూజ ముగిశాక కళాకారులందరూ త్యాగరాజు కీర్తనలు పాడి శ్రద్ధాంజలి ఘటిస్తారు. వాళ్ళకి గోవిందస్వామి పిళ్ళై వైలిన్‌తోనూ, అజగనంబి పిళ్ళై మృదంగంతోను సహకరిస్తున్నారు. అందరూ పాడడం అయిపోయాక నాగరత్నమ్మ వచ్చి పాడడం మొదలెట్టింది. హఠాత్తుగా అంతటా నిశ్శబ్ధం అలముకుంది. ఇద్దరు పిళ్ళైలు తమ వాయిద్యాలు కింద పెట్టేశారు. స్త్రీ కళాకారుల్ని (అంటే దేవదాసీలని) ఆరాధనలో పాడనీయవద్దని నియమం పెట్టుకున్నామని గోవిందస్వామి ఆమెకు వివరించాడు. ఆమె కోపంతో మండిపడింది. ఇదంతా కావాలని చేసిన పన్నాగం అని అనుకుంది. అందుకని బాగా వాదించింది. అయినా అతను తన నిర్ణయం అదేనన్నాడు. తనకి ఆరాధ్యురాలైన వీణ ధనమ్మ వచ్చినా మారేదిలేదన్నాడు. ధనమ్మాళ్, సమాధిదగ్గర పూజలో పాల్గోవడానికో, పిళ్ళై ఇబ్బందులు గమనించడానికో, ఆఖరి రోజున వీణతో సహా వచ్చింది. ఆమెని చూసి పిళ్ళై ఖంగుతిన్నాడు. కాని తన నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. ఆమెకోసం మధ్యేమార్గంగా ఒక పరిష్కారం ఆలోచించాడు. ఏటా ఆరాధన ఆఖరిరోజున మేళతాళాలతో త్యాగరాజు చిత్రపటాన్ని రాత్రంతా వూరేగిస్తారు. మర్నాడు వేకువనే కల్యాణమహల్‌కి వచ్చి చేరతారు. ఆ సమయంలో ఆవిడ కచేరి ఏర్పాటు చేశాడు. సమాధికి కొంచెం దూరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక మీద వీణ వాయించడంతో ఆవిడకూడా తృప్తి చెందింది. అయితే నాగరత్నమ్మ కోసం మాత్రం అలా ఏ ఏర్పాటూ చేయించదలచుకోలేదు.
మొత్తం కార్యక్రమం స్త్రీలతోనే మొదలు పెట్టించాలనే ఆలోచనతో నాగరత్నమ్మ బయటికి వచ్చేసింది. లింగ వివక్ష విషయంలో ఆమెతో ఏకీభవించే పురుషుల్ని కూడా లుపుకునే వుద్దేశం ఆమెది. ఇదంతా విన్న చిన్నకచ్చి వాళ్ళు లోపల్లోపల నవ్వుకున్నారు. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఏమీ ఒరగదని పిళ్ళైకి చెప్పారేమో కూడాను!
1927 జనవరిలో ఒక వుదయం నాగరత్నమ్మ తిరువయ్యారు చేరుకుంది. అప్పటికే చిన్నకచ్చి వాళ్ళ ఆరాధనోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ పండుగ వాతవరణం నెలకొంది. పెరియ కచ్చివాళ్ళ ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.
నాగరత్నమ్మ వచ్చిన మర్నాడే, సమాధి అవతలగావున్న అరటితోట కొట్టేసి వేదిక ఏర్పాటుచేశారు. ఉత్సవ కార్యక్రమాల్ని స్త్రీలే నిర్వహిస్తున్న వైనం కరపత్రాల ద్వారా ప్రకటించింది. అందర్నీ సాదరంగా ఆహ్వానించింది. ఆరాధనకి రెండు రోజుల ముందే వూళ్ళో ఎడ్లబళ్ళ వాళ్ళకి కబురుపెట్టింది. మర్నాడు తిరువయ్యారు రాబోయే 40 మంది ఆడవాళ్ళని తీసుకురావాల్సి వుంటుందని పురమాయించింది.
ఒక్కసారిగా 40మంది దేవదాసీలు అక్కడ కళ్ళబడడంతో చేసేవాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికివారు ఏదో ఒక వంకతో మంగళవారం రేవు దగ్గరికి చేరి వాళ్ళను రెప్పవేయకుండా చూడసాగారు. మంగళవారం రేవు దగ్గరున్న సత్రంలో ఏడు పల్లకీలు వుంటాయి. ‘సప్తస్థాన ఉత్సవ’ సమయంలో వాటిని బయటికి తీస్తారు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ఆ ప్రదేశం ఈ స్త్రీల కిలకిలా రావాలతో మారుమోగింది. తిరువయ్యారులో వాళ్ళు అందరి దృష్టిని ఆకర్షిస్తూ తిరుగుతుంటే ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూన్నట్టు అనిపించింది.అందులో కొందరు చొరవగల వాళ్ళు కావేరిలో జలకాలాడారు. మధ్యాహ్నానికల్లా పంచనదీశ్వరాలయానికి వెళ్ళి పూజలు చేశారు. ఆ తర్వాత మాగన్నుగా కన్నుమూసి లేచి పాచికలాడారు. వాతావరణమంతా వుత్సాహభరితంగా వుంది. వేళాకోళాలూ, ఎకసక్కాలూ, వురుకులూ పరుగులతో వాతావరణ మంతా వుల్లాస భరితంగా తయారయింది. కొందరు పాటలు పాడారు. బయట నుంచుని వింటూన్న వాళ్ళకి ఈసారి త్యాగరాజు ఉత్సవాలు మునుపెన్నడూ లేనంత గొప్పగా జరుగుతాయనిపించింది.
సాయంత్రానికి అందరూ పక్కవాయిద్యగాళ్ళతో సహా త్యాగరాజు సమాధి దగ్గరికి చేరుకుని పూజ చేశారు. పెరియకచ్చి వాళ్ళ ఆరాధన ఉదయమే మెదలయ్యంది. కాని ఎవరూ ఎక్కువగా అక్కడికి పోలేదు. నాగరత్నమ్మ బృందం వాళ్ళకోసం వేసిన వేదిక దగ్గరికి చేరారు. ఆమె లాంఛనంగా చేసిన చిన్న ఉపన్యాసంతో ఆరాధన ఆరంభమయ్యింది. కళాకారులందర్నీ విడివిడిగా పరిచయంచేస్తూ చిన్నగా ప్రశంసిస్తూ మాట్లాడింది. నిజానికి వీళ్ళందరికీ నాయకురాలు వీణధనం. ఆవిడ స్ఫూర్తితో,దీవెనలతో నాగరత్నమ్మ ఇదంతా ఏర్పాటు చేసింది. ఆరోగ్యం బాగాలేక ఆవిడ రాలేకపోయిందిగాని ఆమె నలుగురు కూతుళ్ళూ కళ్ళు జిగేలుమనేలా అలంకరించుకుని మరీ వచ్చారు.
నాగరత్నమ్మ సంకల్పించిన ఆరాధన ఘనవిజయం సాధించింది. జనం విపరీతంగా వచ్చారు. అయితే అన్న సంతర్పణ చేయకుండా సొమ్ము ఆదాచేసింది. సరిగ్గా పెరియకచ్చివాళ్లు చేసిన 5 రోజుల్లోనే ఈవిడ ఆరాధన చేయడం వలన అన్నదానం పని తప్పింది. పెరియకచ్చివాళ్ళ సంతర్పణకి జనం విరగబడి వెళ్లారేగాని కచేరీలకి పోలేదు. నాగరత్నమ్మ కచేరీల మీద బాగా దృష్టి పెట్టింది. ఆమె సంరక్షణలో వున్న బన్నీబాయి కూడా వచ్చింది. భద్రాచల రామదాసు గురించి ఆమె చెప్పిన హరికథని అందరూ మెచ్చుకున్నారు. త్యాగరాజు రామదాసుని కొన్ని కీర్తనల్లో ప్రశంసించాడు. టి.ఎ. రామచంద్రరావు నాగరత్నమ్మ అభిమాని. అతను ఈ హరికథ విని బన్నీబాయిని బాగా మెచ్చుకున్నాడు.
గోవిందస్వామి పిళ్ళై, అయిన బృందం చేసేదేమీలేక నిరాశగా కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయారు. తాము నేర్చుకున్న సంగీతం వల్ల ఆ స్త్రీలు త్యాగరాజుకి అంజలి ఘటించడానికి అవకాశం చిక్కింది. నాగరత్నమ్మ, వాళ్ళకి దోవ చూపించింది. ఆమె అండతో వాళ్ళు ఏకమై విజయపతాకాన్ని ఎగురవేశారు.
ఆరాధన ఆఖరిరోజు రాత్రి జరిగిన సంఘటనతో వాళ్ళ ఐక్యత మరోసారి రుజువయ్యింది. నాగరత్నమ్మ నగల గురించి చాలా కథలు ప్రచారంలో వుండేవి. ఆరాత్రి అందరూ అలసిపోయి సత్రంలో నిద్రపోతుండగా ఒక దొంగ దూరాడు. ఒకామెకి మెలుకువ రావడంతో గట్టిగా అరిచింది. మిగిలిన వాళ్ళందరూ కేకలు పెట్టేసరికి దొంగ పారిపోయాడు. దొంగని తరిమి కొట్టడం ఆరాధనకీ, తమజాతికీ మంచిశకునమని వాళ్ళందరూ ఆనందించారు. మొత్తం మీద ఆ అయిదు రోజులూ ఆరాధన బాగా జరగడంతో దేవదాసీల ఆత్మ విశ్వాసం మరింతగా పెరిగింది. మర్నాడు ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నారు.
హెచ్.బి.టి. ప్రచురించిన శ్రీరాం.వి. రచించిన బెంగుళూరు నాగరత్నమ్మ – జీవిత చరిత్ర పుస్తకం సౌజన్యంతో..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags