ప్రియాతిప్రియమైన శాంతసుందరి గార్కి ,
నమస్తే ఎలావున్నారు? చాలా రోజులయింది మిమ్మల్ని చూసి. రావుగారెలా ఉన్నారు? జ్వరం పూర్తిగా తగ్గిందా? అమ్మెలా ఉన్నారు? రావాలని వుంది కానీ, రాలేక పోతున్నాను. మీ స్నేహ పూరితమైన చిరునవ్వు చూసి చాలా రోజులైంది. కరస్పర్శతోనే కొండంత ధైర్యాన్నీ, ప్రేమనీ ఇవ్వడం అలవాటు కదా మీకు.
మీ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలావుంది. మీ టైమ్ ప్లానింగ్ నాకిష్టం. చదువుకీ, అనువాదాలకీ మిగిలిన పనులకీి కాలాన్ని విభజించుకుని క్రమశిక్షణతో వుండే మీ తీరు స్ఫూర్తి నాకు. ఇప్పటి వరకు 66,67 పుస్తకాలను అనువాదం చేసుంటారు కదా! ఎంత ఆశ్చర్యమోనాకు నిబద్ధతతో ఒక్క మనిషి ఇన్ని పనులు చేయగలరా? అని. మీ అనువాద శైలిలో తీసుకునే స్వతంత్రత వల్ల అవి తెలుగు రచనలే అన్పించేంత సొబగుగా ఉంటాయి. నాకర్థమవుతూనే ఉంది. ఈ మాటలేవీ మీకు నచ్చట్లేదని ఆపేస్తున్నానిక.
గత నెల్లో అండమాన్ నికోబార్ దీవులకెళ్లాను. గీత మీకు తెలుసు కదా, తను ఇటీవలే డిప్యూటి కలెక్టర్ కూడా అయింది. గీతతో పాటు ఇంకొక 15మంది ఫ్రెండ్స్ కలిసి వారం రోజులపాటు వెళ్ళాం. నిజంగా ఇంకొక లోకానికి వెళ్ళి వచ్చినట్లే ఉంది. చుట్టూ నీరు, మధ్య మధ్యలో ద్వీపాలు. సృష్టి ఎంత అధ్భుతమైందో తెల్సింది. బాహ్య శరీరాన్ని మర్చిపోయి, మనస్సు కొత్తగా పుట్టినట్లయింది. పోర్ట్ బ్లెయిర్‌లో సెల్యులర్ జైలును చూసాక తట్టుకోలేకపోయాను. బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్య్రం కోసం పోరాడిన ఎందరెందరో వీరుల్ని సరుకుల్లా ఈ జైలుకు పంపారు. మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛను సాధించిపెట్టిన కల కదా ఇది అన్పించింది. లైట్ షోలో అప్పటి సంఘటనల్ని రికార్డు చేసిన ప్లే చూశాము. డేెవిడ్ (జైలు అధికారి) దురాగతాలు, వీరుల ఉరికొయ్యలు, బానిసలుగా వారిని మార్చిన వైనాలు ఎన్నెన్నో. స్త్రీలకు ప్రత్యేకమైన గదులుండేవట. ఒక మనిషి మరొ మనిషికి కనబడని పద్ధతిలో కట్టారు. చిన్నచిన్న గదులు, బలమైన గడియలు, క్రూరమైన శిక్షలు, నేనెంత రాసినా నా గుండె బరువు తీరదు. కానీ ఇప్పటి మన స్థితి, స్వార్ధపూరిత సమాజమూ గుర్తొచ్చి, ఆ వీరుల త్యాగానికి ఫలితమేది అన్పించింది. దీనికి దగ్గర్లో ఉన్న ‘రోజ్ ఐలాండ్’ నుంచి జైలు అధికారులు ఖైదీలను గమనించే విధంగా కట్టారట. కోరల్‌బీచ్, ఎలిఫెంటా బీచ్, కాలాపత్తర్ బీచ్, రాధా శ్యామ్ బీచ్ హాల్‌వాక్‌కి వెళ్ళాం. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క అద్భుతం కాలాపత్తర్ బీచ్‌లో అయితే ఇసుక ఎంత మెత్తగా వుందో సిమెంట్ కలర్‌లో ఉంది చిత్రంగా. కాలాపత్తర్ బీచ్‌లో అంతా నల్లనల్లని రాళ్లే. మంగ్రూస్ చెట్లు అద్భుతంగా ఉన్నాయి. అండమానంతా చాలావరకు తెలుగువాళ్ళే కన్పించారు. శ్రీకాకుళం, విజయనగరం వైజాగ్ నుంచి వచ్చిన వలస కూలీలే ఎక్కువ. నికోబార్‌లో ఐతే చాలా ప్రదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదట. ఆదిమానవ జీవితాన్ని గడిపేవాళ్ళూ, నరమాంస భక్షకులు ఇంకా ఉన్నారట కొన్ని చోట్ల. చుట్టూ సముద్రం, ఉప్పు కాబట్టి కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ వున్నాయి. కొబ్బరి బోండాల్లో 2 లీటర్లకు తక్కువ నీళ్ళు లేవు. కృష్ణశాస్త్రి వేసవి కాలంలో నీళ్ళు నింపుకోవడానికి బానంత పొట్ట ఉండాలి అన్నది గుర్తొచ్చి, కృష్ణశాస్త్రి గారు ఇక్కడికొస్తే కడుపంతా కొబ్బరి నీళ్ళ మయమవుతుంది కదా అన్పించింది. మొత్తం 256కి పైగా దీవులు ఉన్నాయి. మేము 5,6 మాత్రం చూడగలిగాం. సముద్రం దగ్గర నిశ్చలంగా గంటల తరబడి ఆగిపోయి అలాఉండి పోవాలని నాకెప్పట్నించో ఉన్న కోరిక. ఇన్నాళ్ళకు ప్రియనేస్తం గీత వల్ల ఆ కోరిక తీరింది. అలా చూస్తూ ఉండిపోయాను. నిత్యచలన శీలి సముద్రం, మనిషి జీవితం కూడా అలా నిరంతరం చలన శీలత్వంతో ఉండాలని చెబ్తోందా సముద్రం అన్పించింది. ఎన్నిరంగులో, ఏ రంగు నీటికి లేకున్నా అన్ని రంగుల్ని ధరించి అద్భుతమైన హొయలు పోయింది. నిజమైన ‘సీగ్రీన్’ ఎలా ఉంటుందో దగ్గరగా చూసాను. ఇంకో గమ్మత్తు చెప్పనా సైకిల్ కూడా రాని నేను స్కూటర్ డ్రైవింగ్ సముద్రంపై చేశాను. నేనేనా అని ఆశ్చర్యపోయాను కుడా. ఒక చోట బోట్‌లో వస్తుంటే భయంకరమైన వర్షం.(అసలు రోజూ వర్షమేననుకోండి) కిందంతా నీళ్ళు, మన శరీరమంతా వాన చినుకుల పలకరింపు నిజంగా మర్చిపోలేను. కోరల్స్ చూస్తుంటే మనకు తెలియని మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లే వుంది. ఎంత రాసినా తనివి తీరట్లేదు. సత్యా రాసిన ట్రావెలాగ్ చదివాక అండమాన్ ఎలాగైనా చూడాలన్న బలమైన వాంఛ ఇన్నాళ్ళకు తీరినందనుకోండి ఇంకా చాలా కబుర్లున్నాయి. ఈ సారి కల్సినప్పుడు మట్లాడుకుందాం…
మీ అభిమాని – శిలాలోలిత
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags