మేము తుష్టివారిగూడెం చేరుకొనేసరికి సాయంత్రం అయ్యింది. ఆరు గంటల ప్రయాణం అలసటనూ, ఆందోళననూ, ఆవేదననూ మాత్రమే మిగిల్చింది. గోదావరి ప్రయాణం పొడవునా చుట్టూ కొండలు, ఆవహించి ఉన్న అడవులు, అడవుల మధ్య నుండి కనిపిస్తున్న సన్నని గీతల లాంటి కాలి దార్లు,పచ్చని అడవి మధ్యన అక్కడక్కడ చెమక్కున మెరుస్తూన్న జన నివాసాలు,నది ఒంపులు తిరిగినప్పుడంతా దృశ్యం మారుతూ… కొండా కోనలు తమ అన్ని కోణాలను ప్రదర్శనకు పెట్టినట్లు… నన్నేదో ప్రశ్నిస్తున్నట్లు … మనసంతా చికాకు,కోపం, దుఃఖం.
ఆ గూడెంలో మొత్తం ముప్పై ఇళ్ళు కూడా లేవు. ఊరి చివరి గుడిశలకు తీసుకుని వెళ్ళారు. రెండు గుడిసల మధ్య మెత్తగా అలికినట్లున్న ఖాళీస్థలంలో మమ్మల్ని చూడగానే మంచాలు తెచ్చి వేసిందో అమ్మాయి. బాగా కిందకు దిగిన చూరు ఉన్న ఇంట్లోకి బయటకు తిరుగుతూ మాకు మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.
‘గోదాటి చెలమల నీళ్ళు’ మా ఆరోగ్యాల మీద మాకున్న అనుమానంతో సందేహపడుతుంటే చెప్పింది.
ఇంటి ముందు ఉన్న బోరింగ్‌లో నీళ్ళు కొట్టుకొని ఇంటి వెనక్కి వెళ్ళాము.చుట్టూ దడి. గిన్నెలు తోమి దడి కర్రలకు వేలాడ తీశారు. బాగా ఆరాకే లోపలికి తీసుకొని వెళతారు. తడి గిన్నెలు ఇంట్లో చెదలు పట్టిస్తాయని తెలుసు. ఆరోగ్యానికి, అవసరాలకు ఎక్కువ ఖర్చు పెట్టలేరు కాబట్టే ఆ జాగ్రత్త.
దడిని ఆనించి ఉన్న బండి చక్రం. చక్రం ఇరుసు మీద అరిగిపోయిన లైఫ్ బాయ్ సబ్బు. ఇంటి ముందు ఒకే ఒక పూలచెట్టు మాటల్లో,మనుషుల్లో, వస్తువుల విషయంలో అంతా క్లుప్తత.
ఇంటి ముందర నున్నటి తారురోడ్డు, సూర్యుడు గూటికి చేరే సమయం. భుజం మీద గుడ్డ, చేతుల్లో పనిముట్లతో మగాళ్ళు, ఆడాళ్ళు ఇళ్ళకు చేరుతున్నారు. అప్పటి దాకా మౌనంగా ఉన్న గూడెం సందడి చేయటం మొదలుపెట్టింది. రోడ్డు కవతల ఉన్న అటవీశాఖా భూమిని ”పోడు” చేసామని చెప్పారు. అడవిలో చెట్లను కొట్టారు. కానీ మధ్య మధ్యలో కొన్ని చెట్లను వదిలేశారు. ”ఇప్ప పూల చెట్లు అవి” చెప్పిందా అమ్మాయి. భూమితో నిత్యం సావాసం చేసే గిరిజనులకు భూమినుండి మొలచిన ప్రతి మొక్క విలువ తెలుసు. నాలుగు గింజలు పండించుకోవటానికి ఆ ఎత్తు పల్లాల్లోనే విత్తుతున్నారు. కొయ్య నాగలితోనే దున్నుతారు. భూమికి ఏమాత్రం నొప్పి తెలవని ఎగసాయం అది.
”కొద్దిగా టీ దొరుకుతాయా?” అడిగారు మాలో ఒకరు.
ఎవరు మాట్లాడలేదు. మేము ఇక టీ మీద ఆశలు వదులుకొని నులక మంచాల మీద నడుం వాల్చాము.
ఎవరో లేపుతున్నారు. చటుక్కున లేచి కూర్చున్నాను. ఇందాకటి అమ్మాయి టీ గ్లాస్ పట్టుకొని నిల్చోని ఉంది. సెల్ ఫోన్ వెదికి టైమ్ చూశాను. ఎనమిదయ్యింది.
”పాలు కోసం చానా దూరం పోవాలక్క. మా తమ్ముడు పక్కూరికి నడిచి వెళ్ళి తెచ్చాడు.”
పొద్దున్నే ఆ అమ్మాయి రోట్లో వేసి ఏదో రుబ్బుతోంది. దగ్గరకెళ్ళి చూశాను. నాన పెట్టిన బియ్యం. ఒక గంట రుబ్బి గిన్నె కెత్తింది. కాసేపటికి ఎక్కడ నుండో నల్ల మట్టి తెచ్చింది. పేడతో కలిపి నున్నగా అలికింది. మునివేళ్ళను పిండిలో ముంచి అందమైన ముగ్గు వేస్తుంది.
తదేకంగా చూస్తూ అడిగాను.
”ఈ ఇల్లు ఇక ముందు ఉండదు తెలుసా?” ప్రశ్నించాను.
మోకాళ్ళ మీద కూర్చుని జరుగుతూ డిజైన్ వేస్తున్న ఆ పిల్ల తల తిప్పి నావైపు చూస్తూ అడిగింది కదా!
”ఎవరూ ఏమి చేయలేరా అక్కా?”
ఏమి చెప్పను? కొన్నాళ్ళకు మీరు పోడు కొట్టుకున్న పొలం, నువ్వు పెంచుకున్న పూల చెట్టు, నీ కాళ్ళక్రింద భూమి అన్నీ కబళించే ‘మాయలేడి’ రాబోతుందని
మేము వచ్చేటపుడు మాతో పాటు పడవలో ప్రయాణించిన ఒక తెలివైన కళ్ళ యువతి మేము ఏ పని మీద వెళుతున్నామో తెలుసుకొని, ఆటో ఎక్కిన తరువాత అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.
”ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను. నాకు తలపోటు వచ్చింది. పోలవరం ప్రాజెక్టును మీకు ఆపగలరా?”
ఆపలేమా?
మేమొక్కొక్కళ్ళమే ఆపలేకపోవచ్చు. భారతదేశంలో మాలాంటి వేల వేల సంఘాలు … ఈ గడ్డ మీద పుట్టి .. భూమి నది ఏమిస్తే అది తిని.. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళగొట్టబడుతున్న మూడు లక్షల గిరిజనులు, ఈ గిరిజనులు ఇక ఉండరని తెలుసుకొని తల నొప్పి తెచ్చుకున్న ఆ తెలివైన కళ్ళ యువతి లాంటి వాళ్ళు.. ఇంకా ఈ కొండా కోనల్లో బతుకుతున్న జంతువులు, పక్షులు, పురుగులు, పాములు… అన్నీ కలిసి ఆపలేమా?
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
ఆపలేకపోతే అంత కంటే మరి విషాదం ఏదీ ఉండదు. బాగా అడిగారు, ధన్యవాదాలు.