నేను మొదటి సారిగా కలిసిన జానకీరాణి జానీ బామ్మ కాదు. నిజాం కాలేజీలో ఎం.ఏ చదువుకుంటూన్న మంటపాక జానకీరాణి. ఆంధ్రా యూనివర్సిటీ బంగారు పతక విజేత. కొంచెం పొట్టిగా తెల్లగా చలాకీగా అన్నింటా తానై తిరిగే యువతి.అప్పట్లో నిజామ్ కాలేజీ ఆడపిల్లలు కోఠీ విమెన్స్ కాలేజీ హాస్టల్లో వుండేవాళ్ళు. నేను కొన్నాళ్ళు అక్కడ వున్నప్పుడు బాగా పరిచయం. ఆమె అ0టే ఒక ఆరాథన.
”అబ్బో ఆవిడ భరతనాట్యం మణిపురి కూడా చేస్తుంది తెలుసా? పాటలెంత బాగా పాడుతుందో తెలుసా? మొన్నా మధ్య నిజాం కాలేజీలో జరిగిన మాక్ ”యూ.ఎన్.ఓ.”లో అదర గొట్టేసింది. ఆవిడే అందరికన్నా బాగా మాట్లాడింది.” అట్లా మేం కొంతమందిమి అండర్ గ్రాడ్యుయేట్లం, ఆవిడ మమ్మల్ని పలకరించిందే చాలనకునే వాళ్ళం. ఆవిడ ఆంధ్రాభ్యుదయ ఉత్సవాల్లో మణిపురి నృత్యం చేస్తోందంటే, మేం వెళ్ళి ఆవిడకొక గ్రామోఫోన్ తెచ్చిపెట్టాం. ఆ గ్రామోఫోన్ ఇచ్చిన అమ్మాయి ఇల్లు కాలేజీకి దగ్గర. కొంచెం పోజుకొట్టేది. బ్రతిమిలాడి తెచ్చాం. జానకీ రాణి, చిత్తరంజన్ గారితో కలిసి ”మరుమల్లెలలో మామయ్యా” అనే సినిమా పాట పాడితే భలే తప్పట్లు కొట్టాం. హాస్టల్లో వున్నప్పుడొకసారి ఆవిడకు బాగా జ్వరం వచ్చి, వారమో ఎంతో తగ్గలేదు. అప్పుడు తురగా కృష్ణమోహన్‌రావు గారు వచ్చి ఇంటికి తీసుకునిపోయేవారు. తరువాత ఎప్పుడో ఆయన్ని ఆవిడ పెళ్ళి చేసుకుంటుందని తెలియదు. ఆయన రేడియోలో పనిచేస్తారని తెలుసు, హస్య రచయితని తెలుసు. జ్వరం వచ్చినప్పుడు మేం రోజూ వెళ్ళి పలుకరించి ఏం కావాలని అడిగితే ”ఆ ప్లాస్క్‌లో కాఫీ ఉంది. తాగిపెడుదురూ” అనేది. వయసులోనూ, చదువులోనూ తేడా వున్నా మాతో చాలా సన్నిహితంగా వుండేది. సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడేది. ఒక పల్లెటూర్నించి మహానగరానికి వచ్చిన నాకు అట్లా మాట్లాడడానికి భయంగా ఉండేది. ఆరోజుల్లో ఆ వయస్సులో రచయితలంటే, చిత్రకారులంటే, గాయకులంటే ఎంత గౌరవమో! అందులో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళంటే మహా ”ఇది”. ఎందుకంటే నేను తెలుగు మీడియంలో చదివి వచ్చాను. కాలేజీలో అప్పుడు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండేది, చాలా కష్టపడి తెలుగురాని పిల్లలతో స్నేహం చేసి, వెక్కిరింపులు పడి ఆ భాషని లొంగదీశాం. జానకీరాణి గారేమో డిబేట్లల్లో ఏకధాటిగా మాట్లాడేవారు. ఇప్పటికీ నా మనసులో ఆవిడ ముద్ర ఆనాటిదే! ఎందుకంటే నేను కోఠీ మహిళా కళాశాల నుంచి బయటికొచ్చాక కొన్ని దశాబ్దాల దాకా ఒకర్నొకరం చూసుకోలేదు. ఈ లోగా ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. ఆమె రేడియో అక్కయ్యగా హైదరాబాద్ వాసులకు తెలిసినంతగా ఇక్కడ తెలియదు. రెండువేల సంవత్సరంలో అనుకుంటా తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఒక సెమినార్లో మళ్ళీ చూసుకున్నాం. ఆవిడని గుర్తుపట్టడం తేలికే నేను పలుకరిద్దాం అనుకుంటుండగానే ”ఏం సత్యవతీ!” అని ఆవిడే పలకరించింది నన్ను . అప్పుడు మళ్ళీ మా హాస్టల్ రోజులు గుర్తు చేసుకున్నాం. ఫ్లారెన్స్ ఎక్కడుందో తెలుసా? చంద్రమణి వరంగల్‌లో పనిచేస్తుంది కదా? ఏ ఒక్కటీ మర్చిపోలేదు.. అప్పుడు ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆ తరువాత మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఆవిడ గురించి భూమికలో వ్రాసినప్పుడు తరచు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడే నాకు ‘మా తాతయ్య చలం’ ”చేతకాని నటి” ఇచ్చారు. తను వేయబోయే కథల సంపుటి ఫైనల్ ఫ్రూఫ్ కూడా మెయిల్ చేశారు.
1950 దశకంలో ఆమె వ్రాసిన అనేక కథల్లో ఆనాటి యువతుల మనస్తత్వ చిత్రణ ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడప్పుడే ఆడపిల్లల చదువుకు కూడా ప్రాధాన్యత వస్తున్నది. కాలేజీకి వెళ్ళి చదువుకోవడం వాళ్ళకి కాస్త గర్వకారణంగా కూడా వుంది.
1956లో ఈమె వ్రాసిన ”గళంలో గరళం” కథలో సరళ అనే అమ్మాయి ఎస్.ఎస్.ఎల్.సి. లో మంచి మార్కులు తెచ్చుకుని ఇంటర్‌లో చేరింది. దానికి తగ్గట్టుగా వస్త్రధారణ చేసుకుని ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తోంది. అదే పెట్టెలో వున్న ఇద్దరు ఆడవాళ్ళు తనని పలకరించాలనీ అప్పుడు తను ఇంటర్ చదువుతున్నానని చెప్పాలనీ ఉవ్విళ్ళూరింది.. కానీ వాళ్ళిద్దరూ తమలో తాము ఏవో మాట్లాడుకుని సరళని అడక్కుండానే దిగిపోయారు. అప్పుడు సరళకి గట్టిగా అరచి చెప్పాలనిపించింది ”ఏమండోయ్ నేను పదహారేళ్ళకే ఇంటర్ చదువుతున్నాను. ఎస్.ఎస్.ఎల్.సి.లో మంచి మార్కులు తెచ్చుకున్నాను” అని.
ఆమె వ్రాసిన అనేక రేడియో నాటకాల్లో ”పవిత్ర” అనే నాటకం ప్రత్యేకమైనది. స్త్రీల పవిత్రత పైన సంఘంలో నిలిచిపోయిన భావాలు అబద్ధాలనీ,అత్యాచారాలు జరిగినంత మాత్రాన స్త్రీలు అ పవిత్రులై పోరనీ ఆసంబంధంలో పుట్టిన బిడ్డలు కూడా అపవిత్రులు కారనీ శాస్త్రాలలోని ఉదాహరణలతో సాగిన నాటకం. ఇది హిందీలో కూడా ప్రసారమైంది. అట్లాగే ఆమె వ్రాసిన ”జగన్మాత కథ, నా జీవితం నాకివ్వు” అనే కథ చాలా ప్రముఖమైనవి. ఆమె తాత్విక దృక్పథాన్ని తెలిపే కథలు.
మాతృత్వం పైనా, స్త్రీ పురుషుల మధ్య వుండవలసిన సున్నితమైన ప్రేమానుబంధాల మీదా ఆమెకు చాలా గౌరవం. ఆ ప్రేమ పూసల్లో దారంలా వుండాలనీ, ఒకరి మనసు ఒకరికి తెరిచిన పుస్తకంలా వుండాలని ఆంకాక్షిస్తారు.
జానాకీరాణిగారి కథల్లో ప్రధాన పాత్రలు ఎక్కువగా స్త్రీలే. మానవత్వం ఇంకా మిగిలే వుందని చాలా కథల్లో జానకీరాణి చెబుతారు. ఒక్క క్షణం మనసు చలించినా తిరిగి దాన్ని దారిలో పెట్టుకుని విలువలని కాపాడుకునే వ్యక్తులు ఆమె కథల్లో ఎక్కువ కనిపిస్తారు.
స్వాతంత్య్రానంతర తొలి తెలుగు కథా రచయిత్రులలో ప్రసిద్ధులైన జానకీరాణి గాయని, నర్తకి, వక్త కూడా.యాభైౖయ్యవ దశకంలోనే కథారచన ప్రారంభించిన మంటపాక జానకీరాణి, ప్రఖ్యాత రచయిత తురగా కృష్ణమోహనరావుని వివాహం చేసుకున్న తరువాత తురగా జానకీరాణి పేరుతో వ్రాయడం మొదలుపెట్టారు. ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత సోషల్ సైన్సెస్‌లో డిప్లొమా చేసి కొంతకాలం సోషల్ వెల్ఫేర్ బోర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేశాక, ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్‌గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా రిటైరయ్యారు. నలభై రేడియో నాటకాలు, రూపకాలు వ్రాసారు. నాలుగు జాతీయ బహుమతులు పొందారు. మూడు నవలలు, వాస్తవ గాథలు కొన్ని కాలమ్స్ వ్రాసారు, సర్పంచుల కోసం పంచాయితీరాజ్ శాఖకు పాఠాలు కూడా వ్రాసారు. నేషనల్ బుక్ ట్రస్ట్‌కి పిల్లల కథల పుస్తకాలు వ్రాసారు. సృజనాత్మక సాహిత్యమే కాక సాంఘిక సేవా కార్యక్రమాలపై చాలా కృషి చేశారు. యోజన పత్రికలో డ్వాక్రా గ్రూపులకోసం ప్రత్యేక అనుబంధానికి రూపకల్పన చేశారు.
జానకీరాణి గారికి వచ్చిన గృహలక్ష్మి, స్వర్ణకంకణం, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు, మాదిరెడ్డి సులోచన అవార్డు, బాలబంధు బిరుదు ఇవన్నీ కూడా ఆమె జీవన పోరాట విజయాలతో సమానం కావేమో!
ఆకస్మిక పరిణామాలను ధైర్యంగా ఎదుర్కుంటూనే, ఒక అద్భుతమైన వ్యక్తిగా అందరి మనస్సుల్లో రేడియో అక్కయ్యగా ఉత్తమ వ్యక్తిగా నిలిచిపోయిన జానకీరాణి గారికి భూమిక హృదయపూర్వక నివాళి.